కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సహాయం తీసుకోండి

సహాయం తీసుకోండి

సహాయం తీసుకోండి

“ఒంటరివాడి మీద ఎవరైనా పైచేయి సాధించగలరు; కానీ ఇద్దరుంటే, ఇద్దరు కలిసి వాణ్ణి ఎదిరించగలరు.”​—ప్రసంగి 4:12.

మనం వేరేవాళ్ల సహాయం తీసుకున్నప్పుడు, ఒక శత్రువు మీద విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ శత్రువు ఎవరైనా కావచ్చు లేక ఏదైనా కావచ్చు. కాబట్టి, మీరు పొగతాగే అలవాటు మీద విజయం సాధించాలి అనుకుంటే మీ కుటుంబ సభ్యుల, స్నేహితుల, లేదా మీకు నిజంగా ఓపిగ్గా సహాయం చేసేవాళ్ల వైపు చూడడం తెలివైన పని.

అంతకుముందు పొగతాగే అలవాటు ఉండి, దాన్ని మానుకున్నవాళ్ల సహాయం తీసుకోవడం గురించి కూడా మీరు ఆలోచించవచ్చు. ఎందుకంటే, వాళ్లయితే మీ పరిస్థితిని అర్థం చేసుకోగలరు అలాగే మీకు సహాయం చేయగలరు. డెన్మార్క్‌లో ఉంటున్న టోర్బెన్‌ అనే క్రైస్తవుడు ఇలా అంటున్నాడు: “వేరేవాళ్లు నాకు చేసిన సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను.” ఇండియాలో ఉంటున్న అబ్రహామ్‌ ఇలా అంటున్నాడు: “నా కుటుంబ సభ్యులు, తోటి క్రైస్తవులు చూపించిన నిజమైన ప్రేమ, నేను ఈ అలవాటును మానుకోవడానికి సహాయం చేసింది.” కానీ కొన్నిసార్లు కుటుంబ సభ్యుల, స్నేహితుల సహాయం ఒక్కటే సరిపోదు.

భగ్వాండాస్‌ అనే ఆయన ఇలా అంటున్నాడు: “నాకు 27 ఏళ్లుగా పొగతాగే అలవాటు ఉంది. కానీ, చెడు అలవాట్ల గురించి బైబిలు ఏం చెప్తుందో తెలుసుకున్న తర్వాత నేను దాన్ని మానేయాలి అనుకున్నాను. నేను సిగరెట్లు కాల్చడం కొంచెంకొంచెం తగ్గించుకుంటూ వచ్చాను, నా ఫ్రెండ్స్‌ని మార్చేశాను, కౌన్సెలింగ్‌ సెంటర్‌కు కూడా వెళ్లాను. కానీ ఏదీ పనిచేయలేదు. చివరికి, ఒకరోజు రాత్రి నేను మనసువిప్పి యెహోవా దేవునికి ప్రార్థిస్తూ, ఈ అలవాటు నుండి బయటపడడానికి సహాయం చేయమని వేడుకున్నాను. అలా, మొత్తానికి నేను దానిమీద విజయం సాధించాను!”

పొగతాగడం మానేయడానికి సహాయం చేసే ఇంకో ముఖ్యమైన విషయం, మీకు ఎదురవ్వగల ఆటంకాలకు ముందే సిద్ధపడి ఉండడం. ఏంటా ఆటంకాలు? తర్వాతి ఆర్టికల్‌ వివరిస్తుంది.

[బాక్సు]

సిగరెట్లు మానడానికి మందులు వాడవచ్చా?

సిగరెట్లు మాన్పించడానికి మార్కెట్లో నికోటిన్‌ ప్యాచ్‌ లాంటి మందులు చాలా వచ్చాయి. అదంతా కోట్ల రూపాయల బిజినెస్‌. అయితే, ఆ మందులు వాడాలో లేదో నిర్ణయించుకునే ముందు ఈ ప్రశ్నల్ని పరిశీలించండి:

వాటివల్ల వచ్చే ప్రయోజనాలేంటి? సిగరెట్లు మానేసిన తర్వాత వచ్చే శారీరక ఇబ్బందుల్ని (withdrawal symptoms) తగ్గించడానికి ఈ మందులు ఉపయోగపడతాయని చాలామంది అంటుంటారు. కానీ, ఇవి ఎంతబాగా పని చేస్తాయనేది మాత్రం ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది.

వాటికి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏంటి? కొన్ని మందులకు పెద్దపెద్ద సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉన్నాయి. ఉదాహరణకు, కడుపులో వికారంగా ఉండడం, కృంగుదల, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు రావడం వంటివి. అయితే గుర్తుంచుకోండి, ఈ నికోటిన్‌ థెరపీల వల్ల నికోటిన్‌నే మళ్లీ ఇంకో రూపంలో ఇస్తున్నట్లు అవుతుంది, పైగా దానివల్ల వచ్చే సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉంటాయి. నిజం చెప్పాలంటే, ఆ వ్యక్తి ఇంకా నికోటిన్‌కు బానిసగానే ఉన్నట్టు.

ఏవైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయా? ఒక సర్వేలో, విజయవంతంగా పొగతాగే అలవాటును మానుకున్న 88 శాతం మంది, తాము ఏ మందులూ వాడకుండానే ఉన్నపళంగా పొగతాగే అలవాటును మానుకోగలిగామని చెప్పారు.