కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

హానిచేసే స్నేహితుడు

హానిచేసే స్నేహితుడు

హానిచేసే స్నేహితుడు

మీరు యౌవనంలో ఉన్నప్పుడు మీకు ఒకస్నేహితుడుపరిచయమయ్యాడు. మీరు అందరిముందు పెద్ద మనిషిలా కనిపించడానికి, తోటివాళ్లతో కలిసిపోవడానికి అతను మీకు సహాయం చేశాడు. మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడల్లా,ఉపశమనంకోసం అతని వైపే చూశారు. చెప్పాలంటే, చాలా సందర్భాల్లో మీరు అతని మీద ఆధారపడ్డారు.

కానీ రోజులు గడుస్తుండగా, అతని నిజస్వరూపం మీకు తెలిసింది. అతను ఎప్పుడూ మీతోనే ఉంటాడు కాబట్టి, కొన్ని చోట్లకు మీరు వెళ్లలేరు. అందరిముందు మీరు పెద్ద మనిషిలా కనిపించడానికి అతను మీకు సహాయం చేసుండొచ్చేమో గానీ, దానికి మూల్యంగా అతనికి మీ ఆరోగ్యాన్ని చెల్లించాల్సి వచ్చింది. అంతకుమించి, అతను మీ జేబుకి చిల్లు పెట్టాడు.

ఈ మధ్య కాలంలో, మీరు అతనితో స్నేహాన్ని తెంచుకోవడానికి ప్రయత్నించారు కానీ, అతను మాత్రం మిమ్మల్ని వదల్లేదు. ఒకరకంగా చెప్పాలంటే, అతను మీ నెత్తిమీద కూర్చుని మీ మీద పెత్తనం చెలాయిస్తున్నాడు. అసలు అతన్ని కలవకపోయుంటే బాగుండేది అని మీరు అనుకుంటున్నారు.

పొగతాగే చాలామందికి సిగరెట్‌తో ఉన్న బంధం అలాంటిది. 50 ఏళ్ల పాటు సిగరెట్‌ తాగిన ఎర్లిన్‌ అనే ఆమె ఇలా గుర్తుచేసుకుంటుంది: “సిగరెట్‌ నాతో ఉంటే ఒక మనిషి నాకు తోడు ఉన్నట్టే, చెప్పాలంటే అంతకంటే ఎక్కువ. కొన్నిసార్లు ఇదే నా ఒక్కగానొక్క ఫ్రెండ్‌.” కానీ ఆ తర్వాత సిగరెట్‌ ఒక హానిచేసే స్నేహితుడని, చాలా ప్రమాదకరమని ఎర్లిన్‌ గుర్తించింది. ఈ ఆర్టికల్‌ మొదట్లో చెప్పిన మాటలు ఆమె గురించి చెప్పినట్టుగానే ఉన్నాయి, కాకపోతే ఒక తేడా ఉంది. అదేంటంటే, పొగతాగడం దేవునికి ఇష్టం ఉండదని, దేవుడిచ్చిన శరీరానికి అది హాని చేస్తుందని తెలుసుకున్నప్పుడు ఆమె ఆ అలవాటును మానేసింది.​—2 కొరింథీయులు 7:1.

ఫ్రాంక్‌ అనే అతను కూడా దేవుణ్ణి సంతోషపెట్టడం కోసం సిగరెట్‌ మానేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ తను మానేయాలనుకున్న ఒకట్రెండు రోజులకే, అంతకుముందు కాల్చి పారేసిన సిగరెట్‌ ముక్కల కోసం ఇల్లంతా వెదకడం మొదలుపెట్టాడు. ఫ్రాంక్‌ ఇలా అన్నాడు: “ఆ క్షణం నా మీద నాకే అసహ్యం వేసింది. ఛీ! నేను ఇంతగా దిగజారిపోయి, కాళ్లూచేతులతో పాకుతూ మట్టిలో సిగరెట్‌ ముక్కల కోసం వెతుకుతున్నానేంటి అనిపించింది. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ దాని జోలికి పోలేదు.”

పొగతాగే అలవాటును మానుకోవడం ఎందుకు కష్టం? పరిశోధకులు దానికి చాలా కారణాల్ని కనిపెట్టారు: (1) డ్రగ్స్‌ ఎలాగైతే వ్యసనంగా మారతాయో పొగాకు ఉత్పత్తులు కూడా వ్యసనంగా మారే అవకాశముంది. (2) సిగరెట్‌లో ఉన్న నికోటిన్‌ని పీల్చినప్పుడు అది కేవలం ఏడు సెకన్లలోనే మెదడుకు చేరగలదు. (3) ఒక వ్యక్తి తింటున్నప్పుడు, తాగుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇలా ఏ పని చేస్తున్నా సిగరెట్‌ తాగుతూ చేయడం వల్ల అది అతని జీవితంలో భాగమైపోతుంది.

అయినప్పటికీ, ఈ హానికరమైన వ్యసనం నుండి బయటపడడం సాధ్యమే అని ఎర్లిన్‌, ఫ్రాంక్‌ అనుభవాలు చూపిస్తున్నాయి. మీకు పొగతాగే అలవాటు ఉండి, దాన్ని మానుకోవాలి అనుకుంటుంటే, దీని తర్వాత వచ్చే ఆర్టికల్స్‌ని చదివి ఒక కొత్త జీవితాన్ని మొదలుపెట్టవచ్చు.