4
అనర్గళత
మీరు బిగ్గరగా చదివేటప్పుడు, కొన్ని పదాల దగ్గర తడబడతారా? మీరు ప్రేక్షకుల ఎదుట ప్రసంగమివ్వడానికి నిలబడినప్పుడు, సరైన మాటల కోసం తరచూ తడుముకుంటారా? అలాగైతే మీకు అనర్గళత అన్న సమస్య ఉండవచ్చు. అనర్గళంగా భావప్రకటన చేసే వ్యక్తి, పదాలూ ఆలోచనలూ సాఫీగా స్పష్టంగా సులభంగా వ్యక్తమయ్యేలా చదువుతాడు, మాట్లాడతాడు. అంటే ఆ వ్యక్తి ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడని గానీ వేగంగా మాట్లాడతాడని గానీ ఆలోచించకుండా మాట్లాడతాడని గానీ కాదు. ఆయన మాటలు సంతోషకరంగా ప్రేమపూర్వకంగా ఉంటాయి. దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో అనర్గళతకు ప్రత్యేక శ్రద్ధ చూపించబడుతుంది.
అనర్గళత లోపించడానికి వివిధ కారణాలు ఉండవచ్చు. ఈ క్రిందివాటిలో వేటినైనా మీరు ప్రత్యేకించి పరిగణలోకి తీసుకోవలసిన అవసరం ఉందా? (1) కొన్ని పదాలు తెలియకపోవడం, ఇతరులకు చదివి వినిపించేటప్పుడు సంకోచించడానికి కారణం కావచ్చు. (2) పఠనంలోనైనా ప్రసంగంలోనైనా మరీ ఎక్కువ చోట్ల చిన్న విరామాలు ఇవ్వడం వల్ల మధ్యమధ్యలో ఆగిపోతుండవచ్చు. (3) సరిగ్గా సిద్ధపడకపోవడం కూడా అనర్గళత లోపించడానికి దోహదపడవచ్చు. (4) ఒక గుంపు ఎదుట మాట్లాడేటప్పుడు అనర్గళత లోపించడానికి సామాన్యమైన ఒక కారణం, సమాచారాన్ని తర్కబద్ధమైన క్రమంలో పొందుపరుచుకోకపోవడమే. (5) ఒక వ్యక్తికి పదసంపద పరిమితంగా ఉండడం, ఆయన సరైన మాటల కోసం తడుముకుంటున్నప్పుడు సంకోచించడానికి కారణం కావచ్చు. (6) మరీ ఎక్కువ మాటలను నొక్కి చెబితే అనర్గళత దెబ్బ తినవచ్చు. (7) వ్యాకరణ నియమాలు సరిగ్గా తెలియకపోవడం కూడా సమస్యకు కారణం కావచ్చు.
మీకు అనర్గళత లోపిస్తే, రాజ్యమందిరంలో ఉన్న ప్రేక్షకులు అక్షరార్థంగా బయటికి వెళ్ళరు గానీ వారి మనస్సులు అటు ఇటు వెళ్ళే అవకాశముంది. ఫలితంగా మీరు చెబుతున్న భావాన్ని సరిగా అర్థం చేసుకోలేక, దాని నుండి ప్రయోజనం పొందలేకపోవచ్చు.
శక్తివంతంగా అనర్గళంగా ఉండవలసిన మాటలు, ప్రేక్షకులపై అధికారం చూపిస్తున్నట్లు పెత్తనం చెలాయిస్తున్నట్లు ఉండకుండా ఉండాలంటే వారిని కలతపరిచే విధంగా కూడా ఉండకుండా జాగ్రత్త పడాలి. సాంస్కృతిక నేపథ్యాలలోని తేడాల వల్ల మీరు మాట్లాడే విధానాన్ని పెద్దగా అరుస్తున్నట్టు 1 కొరిం. 2:3.
గానీ వేషధారణతో ఉన్నట్టు గానీ ప్రజలు దృష్టిస్తే, మీ ప్రసంగ ఉద్దేశమే నిరర్థకం కాగలదు. అపొస్తలుడైన పౌలు, అనుభవజ్ఞుడైన ప్రసంగీకుడే అయినప్పటికీ “బలహీనతతోను భయముతోను ఎంతో వణకుతోను” కొరింథీయులతో మాట్లాడాడు. ఆ విధంగా వాళ్ళు అనవసరంగా ఆయన గురించి ఆలోచించేందుకు కారణమివ్వకుండా మాట్లాడాడు.—మానుకోవలసిన అలవాట్లు. మాట్లాడేటప్పుడు మధ్య మధ్యలో “మరి . . . ఆ” అంటూ ఆగిపోవడం చాలామందికి అలవాటు. మరి కొంతమంది తరచూ “ఇప్పుడు” అనే మాటతో తమ ఆలోచనను వ్యక్తం చేయడం మొదలుపెడతారు. వారు ఏమి చెబుతున్నా “అంటే,” “అంతేకాకుండా” లేదా “మరొక విషయమేమిటంటే” అని మధ్యమధ్యలో అంటుంటారు. మీరు అలాంటి ఊత పదాలను ఎంత తరచుగా ఉపయోగిస్తున్నారో బహుశా మీకు తెలియకపోవచ్చు. మీరు ప్రసంగం అభ్యసిస్తుండగా మీరు ఏ మాటలను మళ్ళీ మళ్ళీ అంటున్నారో విని మీరు ఆ మాటలను పలికినప్పుడల్లా వాటిని పునరుచ్చరించమని ఎవరినైనా కోరండి. ఆ విధంగా కొన్నిసార్లు అభ్యసించండి. అప్పుడు మీకే ఆశ్చర్యమనిపించవచ్చు.
కొంతమంది ప్రజలు చదివిన వాటినే మళ్ళీ చదువుతుంటారు, చెప్పినవాటినే మళ్ళీ చెబుతుంటారు. అంటే వాళ్ళు ఒక వాక్యం మొదలుపెట్టి, తమకు తామే మధ్యలో ఆగిపోయి, అప్పటికే చెప్పిన దానిలో కనీసం కొంత భాగమైనా మళ్ళీ చెబుతారు.
మరికొంతమంది సరైన వేగంతో చదువుతారు, కానీ ఒక విషయం గురించి మాట్లాడడం మొదలుపెట్టి మధ్యలో మరొక విషయం వైపుకు మాట మార్చేస్తారు. మాటలు అనర్గళంగా వస్తున్నప్పటికీ అకస్మాత్తుగా విషయం మారిపోవడంతో అనర్గళత దెబ్బతింటుంది.
ఎలా మెరుగుపడవచ్చు? మీరు తరచూ సరైన మాట కోసం తడుముకుంటూ ఉండడమే మీకున్న సమస్యైతే, మీరు మీ పదసంపదను పెంచుకునేందుకు హృదయపూర్వకంగా కృషి చేయడం అవసరం. మీరు చదువుతున్న కావలికోటలో గానీ తేజరిల్లు!లో గానీ ఇతర ప్రచురణల్లో గానీ మీకు తెలియని పదాలను వ్రాసుకోండి. వాటి అర్థం కోసం నిఘంటువు చూడండి. ఆ పదాల్లో కొన్నింటిని మీ పదసంపదలోకి చేర్చుకోండి. మీకు నిఘంటువు అందుబాటులో లేకపోతే భాషను మంచిగా మాట్లాడేవారి సహాయాన్ని తీసుకోండి.
క్రమంగా బిగ్గరగా చదవడం అలవాటు చేసుకుంటే మీరు మెరుగుపడడానికి అది తోడ్పడుతుంది. క్లిష్టమైన పదాలను గుర్తించి వాటిని అనేకసార్లు బిగ్గరగా పలకండి.
అనర్గళంగా చదవాలంటే, ఒక వాక్యంలోని పదాలు ఒకదానితో ఒకటి ఎలా ముడిపడివున్నాయో అర్థం చేసుకోవడం అవసరం. రచయిత వెలిబుచ్చిన ఆలోచనను తెలియజేయాలంటే సాధారణంగా, పదాలను ఒక సముదాయంగా చదవడం అవసరం. ఆ పదాల సముదాయాలను ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. గుర్తు పెట్టుకోవడం సహాయకరంగా ఉండేటట్లయితే అలా చేయండి. పదాలను
సరైన విధంగా చదవడమే కాక, ఆలోచనలను స్పష్టంగా తెలియజేయడం కూడా మీ లక్ష్యమే. మీరు ఒక వాక్యాన్ని విశ్లేషించిన తర్వాత మరొక వాక్యాన్ని విశ్లేషించండి, ఆ విధంగా మీరు పేరా అంతా అధ్యయనం చేయండి. అక్కడ ఉన్న ఆలోచనల ధారతో సుపరిచితులవ్వండి. తర్వాత, బిగ్గరగా చదవడం అభ్యసించండి. మీరు తడబడకుండా విరామమివ్వకూడని చోట విరామమివ్వకుండా చదవగలిగే వరకు పేరాను మళ్ళీ మళ్ళీ చదవండి. ఆ తర్వాత మిగతా పేరాలను కూడా అలాగే చదవండి.తర్వాత, వేగం పెంచండి. ఒక వాక్యంలోని పదాలు ఒకదానితో ఒకటి ఎలా ముడిపడివున్నాయో గ్రహిస్తే, ఒకేసారి ఒకటికన్నా ఎక్కువ పదాలను చూడగలుగుతారు, తర్వాత ఏ పదం వస్తుందో ఊహించగలుగుతారు. ఇది మీరు సమర్థవంతంగా చదవడానికి ఎంతో తోడ్పడుతుంది.
క్రమంగా, అప్పటికప్పుడు చదవడం అలవాటు చేసుకుంటే, అది విలువైన శిక్షణగా ఉండగలదు. ఉదాహరణకు, దినవచనాన్నీ వ్యాఖ్యానాన్నీ ముందుగా సిద్ధపడకుండానే బిగ్గరగా చదవండి; క్రమంగా అలా చేయండి. మీ కళ్ళు ఒకసారి ఒక పదాన్ని మాత్రమే చూడక, మొత్తం భావాన్ని తెలియజేసే పదాల సముదాయాలను చూసేలా అలవాటు చేసుకోండి.
మీ సంభాషణ అనర్గళంగా సాగాలంటే, మాట్లాడే ముందు ఆలోచించడం అవసరం. దాన్ని మీ దైనందిన కార్యక్రమంలో అలవాటుగా చేసుకోండి. మీరు ఏ విషయాలను తెలియజేయాలనుకుంటున్నారో వాటిని ఏ వరుసలో చెప్పాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి; ఆ తర్వాత మాట్లాడడం మొదలుపెట్టండి. తొందరపడకండి. మధ్యలో ఆగకుండా మధ్యలో వేరే విషయాలను చెప్పకుండా ఒక్క విషయాన్నే పూర్తిగా వ్యక్తం చేయడానికి కృషి చేయండి. చిన్నవైన సరళమైన వాక్యాలను ఉపయోగించడం సహాయకరంగా ఉంటుందని మీరు గ్రహించవచ్చు.
మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో మీకు ఖచ్చితంగా తెలిస్తే మాటలు సహజంగా వస్తాయి. అప్పుడు మీరు ఉపయోగించే పదాలను ఎంపిక చేసుకోవలసిన అవసరం సాధారణంగా ఉండదు. వాస్తవానికి, ఇలా చెయ్యడం అలవాటయ్యేంత వరకు, చెప్పాలనుకున్న విషయం మీ మనస్సులో స్పష్టంగా ఉందా లేదా అన్నది నిర్ధారించుకుని, ఆ తర్వాత చెప్పవలసిన పదాల గురించి ఆలోచించడం మంచిది. మీరు అలా చేస్తే, మీరు చెప్పే మాటలపై కాక విషయాలపైనే మీ మనస్సును కేంద్రీకరిస్తే, మాటలు దాదాపుగా వాటంతటవే వస్తాయి. ఆ విషయాల గురించి మీరు నిజంగా ఎలా భావిస్తారో అలాగే వ్యక్తం చేయబడతాయి. విషయాల గురించి కాక, మాటల గురించి ఆలోచించనారంభించిన వెంటనే మీ మాటలు మధ్యమధ్యలో ఆగిపోతూ ఉండవచ్చు. కానీ మీరు అభ్యాసం ద్వారా అనర్గళతను పెంపొందించుకోవడంలో సఫలులవ్వగలరు. అనర్గళత, సమర్థవంతంగా మాట్లాడడానికీ చదవడానికీ ప్రాముఖ్యమైన ఒక లక్షణం.
తాను ఇశ్రాయేలు జనాంగం ఎదుటా ఐగుప్తులోని ఫరో ఎదుటా యెహోవాకు ప్రాతినిధ్యం వహించేందుకు నియమించబడినప్పుడు, తాను సమర్థుడు కాడని మోషే భావించాడు. ఎందుకు? ఆయన అనర్గళంగా మాట్లాడే వక్త కాదు; మాట్లాడడానికి సంబంధించి ఆయనకు ఏదో లోపం ఉండివుండవచ్చు. (నిర్గ. 4:10; 6:12) ఆయన సాకులు చెప్పాడు గానీ యెహోవా దేవుడు వాటిలో ఒక్కటీ అంగీకరించలేదు. యెహోవా అహరోనును మోషేకు ప్రతినిధిగా మాట్లాడేందుకు ఆయనతోపాటు పంపించాడు, కానీ యెహోవా మోషే మాట్లాడడానికి సహాయపడ్డాడు కూడా. మోషే, ఒక్కొక్క వ్యక్తి ఎదుటా చిన్న గుంపుల ఎదుటా మాత్రమే కాక, జనాంగమంతటి ఎదుటా అనేకసార్లు సమర్థవంతంగా మాట్లాడాడు. (ద్వితీ. 1:1-4; 5:1; 29:2; 31:1,2,30; 33:1) మీరు యెహోవాపై నమ్మకముంచుతూ మీ వంతు మీరు శాయశక్తులా ప్రయత్నిస్తే, మీరు కూడా మీ మాటల ద్వారా దేవుణ్ణి ఘనపరచవచ్చు.