కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

11

ఆప్యాయత, భావాలు

ఆప్యాయత, భావాలు

భావోద్వేగం, మానవ జీవితంలో ప్రాథమిక భాగము. ఒక వ్యక్తి తన భావోద్వేగాలను వ్యక్తం చేసినప్పుడు, ఆయన హృదయంలో ఉన్న విషయం, ఆయన అంతరంగ వ్యక్తిత్వం, పరిస్థితులను ప్రజలను గురించి ఆయన ఎలా భావిస్తాడన్న విషయం వెల్లడవుతుంది. చాలామంది తమ జీవితాల్లో ఎదురైన చేదు అనుభవాల మూలంగా, కొంతమంది తమ సంస్కృతి ప్రభావం మూలంగా తమ భావోద్వేగాలను బయటపడనివ్వరు. అంతరంగ వ్యక్తిత్వంలో భాగంగా మంచి గుణాలను అలవరుచుకొమ్మని, ఆ తర్వాత అంతరంగంలో ఉన్న దాన్ని సముచితమైన విధంగా వ్యక్తం చేయమని యెహోవా మనలను ప్రోత్సహిస్తున్నాడు.—రోమా. 12:10; 1 థెస్స. 2:7,8.

మనం మాట్లాడేటప్పుడు ఉపయోగించే మాటలు మన భావోద్వేగాలను సరిగ్గా తెలియజేస్తుండవచ్చు. అయితే, మన మాటలు తగిన భావాలతో వ్యక్తం చేయబడకపోతే, మనం చెబుతున్న దాన్ని హృదయపూర్వకంగా చెబుతున్నామా లేదా అని వినేవాళ్ళకు సందేహం రావచ్చు. మరొకవైపు, మాటలు సముచితమైన భావాలతో వ్యక్తం చేయబడినప్పుడు అవి రమ్యతనూ సంపూర్ణ విలువనూ సంతరించుకొని వినేవారి హృదయాలను స్పర్శించవచ్చు.

ఆప్యాయతను వ్యక్తం చేయడం. ఆప్యాయతతో కూడిన భావాలు, తరచూ ప్రజల గురించిన ఆలోచనలతో ముడిపడివుంటాయి. కాబట్టి మనం యెహోవా దేవుని కీర్తించదగిన గుణాల గురించి మాట్లాడేటప్పుడు ఆయన మంచితనం గురించి మన మెప్పుదలను వ్యక్తం చేసేటప్పుడు మన స్వరంలో ఆప్యాయతా కృతజ్ఞతా వ్యక్తం కావాలి. (యెష. 63:7-9) తోటి మానవులతో మాట్లాడేటప్పుడు మనం మాట్లాడే విధానం హృదయానందకరమైన ఆప్యాయతను చూపించేదిగా కూడా ఉండాలి.

ఒక కుష్ఠురోగి, యేసు దగ్గరికి వచ్చి స్వస్థత చేకూర్చమని వేడుకుంటాడు. ‘నాకిష్టమే; నువ్వు శుద్ధుడవు కమ్ము’ అని యేసు ఆయనతో చెప్పినప్పుడు యేసు కంఠస్వరం ఎలా ఉండి ఉంటుందో ఊహించండి. (మార్కు 1:40,41) 12 సంవత్సరాలుగా రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఒక స్త్రీ, వెనుక నుండి యేసు దగ్గరికి నెమ్మదిగా వచ్చి, ఆయన పైవస్త్రపు అంచును తాకడాన్ని కూడా మనస్సులో చిత్రించుకోండి. యేసు తనను గమనించాడని గ్రహించిన ఆ స్త్రీ వణుకుతూ ఆయన ముందుకు వచ్చి ఆయన పాదాల దగ్గర పడి, తాను ఆయన వస్త్రమును ఎందుకు ముట్టుకుందో ఎలా స్వస్థతపొందిందో అందరి ఎదుట వెల్లడిచేస్తుంది. అప్పుడు, ‘కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము’ అని యేసు చెప్పిన తీరును గురించి ఆలోచించండి. (లూకా 8:42బి-48) పై సందర్భాల్లో యేసు చూపించిన ఆప్యాయతా సానుభూతీ మన హృదయాలను నేటికీ స్పర్శిస్తాయి.

యేసులాగే మనకు కూడా ప్రజల మీద సానుభూతి ఉన్నప్పుడు, వాళ్ళకు సహాయం చేయాలని మనం నిజంగా కోరుకున్నప్పుడు, వాళ్ళతో మనం మాట్లాడే విధానంలో అది కనిపిస్తుంది. అలా వ్యక్తం చేయబడిన ఆప్యాయత హృదయపూర్వకమైనదే కానీ అది అతిగా ఉండదు. మనం చూపే ఆప్యాయత ప్రజలు ఎలా ప్రతిస్పందిస్తారన్నదానిపై చాలా గొప్ప ప్రభావం చూపించగలదు. మనం క్షేత్ర పరిచర్యలో చెప్పే విషయాలు చాలా మట్టుకు, మనం ఆప్యాయతను వ్యక్తం చేయగల అవకాశాన్నిస్తాయి, ముఖ్యంగా మనం తర్కిస్తున్నప్పుడు ప్రోత్సహిస్తున్నప్పుడు ఉద్బోధిస్తున్నప్పుడు సానుభూతి చూపేటప్పుడు అలాంటి అవకాశం ఉంటుంది.

ఇతరుల మీద మీకు ఆప్యాయత ఉంటే దాన్ని మీ ముఖంలో కనబడనివ్వండి. మీరు ఆప్యాయతను కనబరిచినప్పుడు, వ్యక్తులు చలికాలంలో రాత్రివేళ చలి మంటకు దగ్గరైనట్లు వినేవాళ్ళు మీకు దగ్గరవుతారు. మీ ముఖంలో ఆప్యాయత కనిపించకపోతే మీకు నిజంగానే తమపై శ్రద్ధ ఉందన్న నమ్మకం మీ ప్రేక్షకులకు కలగకపోవచ్చు. అయితే ఆప్యాయతను మీరు ఒక మేలి ముసుగులా ధరించలేరు, అది హృదయంలో ఉండాల్సిందే.

ఆప్యాయత మీ స్వరంలో కూడా వ్యక్తం కావాలి. మీ స్వరం కఠినంగా బొంగురుగా ఉంటే మీ మాటల్లో ఆప్యాయతను వ్యక్తం చేయడం కష్టం కావచ్చు. కానీ మీరు గుర్తుపెట్టుకుని ప్రయత్నిస్తూ ఉంటే కొన్నాళ్ళకు మీరు దాన్ని వ్యక్తం చేయగలుగుతారు. పదాలను పూర్తిగా ఉచ్చరించకుండా గబగబా పలికేస్తే మీ మాటల్లో ఎటువంటి భావాలు లేకుండా పోతాయన్నది ఒక బండ గుర్తుగా గుర్తుంచుకోవడం మీకు సహాయకరంగా ఉండవచ్చు. పదాల్లోని మృదువైన శబ్దాలను సాగదీయడం నేర్చుకోండి. అలా సాగదీయడం మీ మాటల్లో ఆప్యాయత కనబడడానికి సహాయపడుతుంది.

అయితే మీ ఆసక్తి దేనిపై కేంద్రీకరించబడి ఉందన్నదే అంతకన్నా ముఖ్యమైన విషయం. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో వారి మీదే మీ తలంపులు నిజంగా కేంద్రీకరించబడితే వారికి ప్రయోజనం చేకూర్చగల సమాచారాన్ని తెలియజేయాలని మీరు హృదయపూర్వకంగా కోరుకుంటే ఆ భావం, మీరు మాట్లాడే విధానంలో ప్రతిబింబిస్తుంది.

చైతన్యవంతంగా ఇచ్చే ప్రసంగం పురికొల్పునిస్తుంది, అయితే వాత్సల్యపూరిత భావం కూడా అవసరము. మనస్సును ఒప్పించడం మాత్రమే ఎల్లప్పుడూ సరిపోదు; హృదయాన్ని కూడా కదిలించాలి.

ఇతర భావాలను వ్యక్తం చేయడం. వ్యాకులత, భయం, నిరాశా నిస్పృహల వంటి భావోద్వేగాలను బాధలో ఉన్న వ్యక్తి వ్యక్తం చేయవచ్చు. మిగతా భావోద్వేగాలన్నింటి కన్నా ఆనందమే మన జీవితాల్లో ప్రస్ఫుటంగా కనబడాలి, ఇతరులతో మాట్లాడేటప్పుడు దాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేయాలి. మరొకవైపు, కొన్ని భావోద్వేగాలను నిగ్రహించుకోవలసిన అవసరముంది. వాటికీ క్రైస్తవ వ్యక్తిత్వానికీ పొత్తు కుదరదు. (ఎఫె. 4:31,32; ఫిలి. 4:4) మనం ఎంపిక చేసుకునే మాటల ద్వారా, మనం మన స్వరంలో ధ్వనింపజేసే భావం ద్వారా మనం ఎంత దృఢంగా మాట్లాడతామన్న దాని ద్వారా ముఖ కవళికలద్వారా మన సంజ్ఞల ద్వారా అన్ని విధాలైన భావోద్వేగాలనూ వ్యక్తం చేయవచ్చు.

బైబిలు, అన్ని స్థాయిల్లోని మానవ భావోద్వేగాలనూ నివేదిస్తుంది. కొన్నిసార్లు భావోద్వేగాలను కేవలం పేర్కొంటుంది. మరి కొన్నిసార్లు భావోద్వేగాలను వెల్లడిచేసే సంఘటనలను చెబుతుంది, వ్యాఖ్యలను ఉల్లేఖిస్తుంది. మీరు అలాంటి సమాచారాన్ని బిగ్గరగా చదువుతున్నప్పుడు ఆ భావోద్వేగాలు మీ స్వరంలో ధ్వనిస్తే, అది మీపైనా వింటున్నవాళ్ళపైనా గొప్ప ప్రభావం చూపగలదు. ఆ విధంగా ధ్వనించాలంటే మీరు ఎవరి గురించి చదువుతున్నారో వారి స్థానంలో మిమ్మల్ని మీరు ఊహించుకోవాలి. అయితే ఒక ప్రసంగం రంగస్థల ప్రదర్శనలాంటిది కాదు కాబట్టి మరీ అతిశయంగా చదవకుండా జాగ్రత్తపడండి. మీరు చదువుతున్న భాగాలు వినేవారి మనస్సుల్లో సజీవంగా చిత్రించబడేలా చదవండి.

సమాచారానికి తగినట్లుగా ఉండాలి. ఉత్సాహంలాగే మీ మాటల్లో మీరు వ్యక్తం చేసే ఆప్యాయత, ఇతర భావోద్వేగాలు కూడా మీరు ఏమి చెబుతున్నారన్న దానిపైనే ఎక్కువగా ఆధారపడివుంటాయి.

మత్తయి 11:28-30 తెరచి, అక్కడ ఏముందో గమనించండి. తర్వాత, శాస్త్రులను పరిసయ్యులను యేసు గద్దించడం గురించి మత్తయి 23వ అధ్యాయంలో వ్రాయబడిన దానిని చదవండి. తీవ్రమైన గద్దింపు మాటలను ఆయన నిస్తేజంగా ప్రాణంలేని విధంగా వ్యక్తం చేయడాన్ని మనం ఊహించలేము.

ఆదికాండము 44వ అధ్యాయంలో, యూదా తన తమ్ముడైన బెన్యామీను కోసం వేడుకోవడం వంటి వృత్తాంతాలకు ఏ విధమైన భావాన్ని వ్యక్తం చేయడం అవసరమని మీరు అనుకుంటున్నారు? 13వ వచనంలో వ్యక్తం చేయబడిన భావోద్వేగాన్నీ, తమకు కలిగిన దుస్థితికి గల కారణాన్ని గురించి ఆయనెలా భావించాడన్న దానికి 16వ వచనంలో ఇవ్వబడిన సూచననూ ఆదికాండము 45:1 లో యోసేపు ఎలా ప్రతిస్పందించాడన్న దాన్నీ గమనించండి.

కాబట్టి మనం చదువుతున్నా మాట్లాడుతున్నా సమర్థవంతంగా ఉండాలంటే పదాల గురించీ తలంపుల గురించీ మాత్రమే కాక, వాటితోపాటు వ్యక్తం చేయాల్సిన భావాల గురించి కూడా ఆలోచించాలి.