కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

38

ఆసక్తిని రేకెత్తించే ఉపోద్ఘాతం

ఆసక్తిని రేకెత్తించే ఉపోద్ఘాతం

ఉపోద్ఘాతం ఏ ప్రసంగంలోనైనా ఒక ప్రముఖ భాగమే. మీరు శ్రోతల్లో నిజంగా ఆసక్తి రేకెత్తిస్తే, మీరు ఆ తర్వాత చెప్పేదాన్ని వినడానికి మరెక్కువ మొగ్గు చూపుతారు. క్షేత్ర పరిచర్యలో మీ ఉపోద్ఘాతం ఆసక్తిని రేకెత్తించలేకపోతే మీరు మీ అందింపును కొనసాగించలేకపోవచ్చు. మీరు రాజ్యమందిరంలో ప్రసంగిస్తున్నప్పుడు, మీ ప్రేక్షకులు రాజ్య మందిరంలో నుండి వెళ్ళిపోరు. కానీ మీరు వారి ఆసక్తిని నిలబెట్టకపోతే, వాళ్ళు వేరే విషయాల గురించి ఆలోచించడం మొదలుపెట్టవచ్చు.

మీ ఉపోద్ఘాతాన్ని తయారు చేసుకునేటప్పుడు మీ మనస్సులో ఈ లక్ష్యాలను ఉంచుకోండి: (1) మీ ప్రేక్షకుల శ్రద్ధను ఆకట్టుకోవాలి, (2) మీరు చర్చించే విషయమేమిటో స్పష్టం చెయ్యాలి, (3) ఆ విషయం మీ ప్రేక్షకులకు ఎందుకు ప్రాముఖ్యమైనదో చూపించాలి. కొన్ని సందర్భాల్లో ఈ మూడు లక్ష్యాలను దాదాపుగా ఒకేసారి సాధించవచ్చు. అయితే కొన్నిసార్లు వాటిలో ఒక్కొక్కదానికి విడివిడిగా శ్రద్ధనివ్వవచ్చు, అలాగే క్రమం మార్చవచ్చు.

మీ శ్రోతల శ్రద్ధను ఎలా ఆకట్టుకోవచ్చు? ప్రజలు ప్రసంగం వినడానికి సమకూడారన్నది వాస్తవమే. అంతమాత్రాన మీరు చెప్పే విషయానికి సంపూర్ణ అవధానాన్ని ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారని కాదు. ఎందుకు కాదు? ఎందుకంటే వాళ్ళ ధ్యాసను మళ్ళించే అనేక విషయాలు వాళ్ళ నిత్యజీవితంలో ఉన్నాయి. వాళ్ళు తమ ఇంట్లోని సమస్య మీద గానీ మరొకరి జీవిత సమస్య గురించి గానీ చింతిస్తుండవచ్చు. ఒక ప్రసంగీకుడిగా మీ ఎదుట ఉన్న సవాలు ఏమిటంటే, ప్రేక్షకుల శ్రద్ధను ఆకర్షించి నిలబెట్టడం. మీరు అలా చేయగలిగేందుకు పలు మార్గాలున్నాయి.

అత్యధిక ప్రసిద్ధిగాంచిన ప్రసంగాల్లో ఒకటి కొండమీది ప్రసంగం. అది ఎలా మొదలయ్యింది? లూకా వృత్తాంతం ప్రకారం, ‘బీదలైన మీరు ధన్యులు, . . . ఇప్పుడు ఆకలిగొనుచున్న మీరు ధన్యులు, . . . ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, . . . మనుష్యులు మిమ్మును ద్వేషించినప్పుడు మీరు ధన్యులు’ అని యేసు అన్నాడు. (లూకా 6:20-22) అది ఎందుకు ఆసక్తిని రేకెత్తించింది? ఎందుకంటే, తన శ్రోతలకు ఎదురైన గంభీరమైన సమస్యల్లో కొన్నింటిని యేసు కొన్ని మాటల్లో వ్యక్తం చేశాడు. ఆ తర్వాత, ఆ సమస్యల గురించి విపులంగా చర్చించే బదులు, అలాంటి సమస్యలున్నప్పటికీ వారు ధన్యులుగా అంటే సంతోషంగా ఉండగలరని తెలియజేశాడు, వాళ్ళు మరెక్కువగా వినాలని కోరుకునేలా తెలియజేశాడు.

ఆసక్తిని రేకెత్తించడానికి ప్రశ్నలను అడగవచ్చు, అయితే ఆ ప్రశ్నలు సముచితమైనవై ఉండాలి. శ్రోతలు ఇంతకు ముందు విన్నవాటి గురించే మీరు మాట్లాడబోతున్నారని మీ ప్రశ్నలు సూచిస్తే వాళ్ళ ఆసక్తి వెంటనే హరించుకుపోవచ్చు. మీ శ్రోతలను ఇబ్బందిపెట్టే ప్రశ్నలను గానీ వాళ్ళను అవమానపరిచే ప్రశ్నలను గానీ అడగకండి. ఆలోచించేలా వారిని పురికొల్పేటువంటి పదబంధాలతో ప్రశ్నలను తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒక్కొక్క ప్రశ్న అడిగిన తర్వాత స్వల్ప వ్యవధినివ్వండి, అప్పుడు మీ శ్రోతలు మనస్సులోనే సమాధానాన్ని తయారు చేసుకునే సమయం వారికి లభిస్తుంది. తాము మానసికంగా మీతో సంభాషిస్తున్న భావం వాళ్ళకు కలిగినప్పుడు మీ మాటలను ధ్యాసపెట్టి వింటారు.

నిజ జీవితానుభవాలను ఉపయోగించడం, శ్రద్ధనాకర్షించేందుకు మరొక మంచి మార్గం. కానీ ఒక కథను కేవలం చెప్పడం మాత్రమే చేస్తే, ఆ అనుభవం మీ ప్రేక్షకుల్లో ఒకరిని ఇబ్బందిపరిచేదైతే, మీ ఉద్దేశం నెరవేరకపోవచ్చు. మీరు చెప్పే కథ గుర్తున్నా దానిలో ఉన్న హితవు మరిచిపోతే మీరు మీ లక్ష్యాన్ని సాధించనట్టే. ఉపోద్ఘాతంలో ఒక అనుభవాన్ని ఉపయోగించినప్పుడు, అది మీ ప్రసంగపు ముఖ్యభాగంలోని ప్రాముఖ్యమైన పార్శ్వానికి పునాది వేయాలి. ఒక కథనానికి జీవం పోసేందుకు కొన్ని వివరాలు చెప్పడం అవసరమే అయినప్పటికీ, అనుభవాలను అనవసరంగా సుదీర్ఘంగా చెప్పుకుపోకుండా జాగ్రత్తపడాలి.

కొంతమంది ప్రసంగీకులు తాజా వార్తా నివేదికతోనో స్థానిక వార్తాపత్రికలోని ఉల్లేఖనంతోనో ఒక అధికార మూలం నుండి వచ్చిన వ్యాఖ్యతోనో మొదలుపెట్టవచ్చు. అవి కూడా ప్రసంగ విషయానికి నిజంగా తగినవైతే ప్రేక్షకులకు తగినవైతే సమర్థవంతంగా ఉండగలవు.

మీ ప్రసంగం ఒక గోష్ఠిలో భాగమైతే లేదా సేవా కూటంలో ఒక భాగమైతే సాధారణంగా విషయంతో సూటిగా సంబంధమున్న చిన్న ఉపోద్ఘాతమే ఉత్తమమైనది. మీరు బహిరంగ ప్రసంగమిస్తున్నట్లయితే, ఉపోద్ఘాత భాగానికి ఇవ్వబడిన దానికన్నా ఎక్కువ సమయం తీసుకోకుండా జాగ్రత్తపడండి. మీ ప్రేక్షకులకు అత్యంత విలువైన సమాచారాన్ని తెలియజేసేది మీ ప్రసంగ ముఖ్యభాగమే.

సంశయవాదుల ఎదుట గానీ శత్రుభావం కూడా ఉన్నవారి ఎదుట గానీ మాట్లాడాల్సిన పరిస్థితి మీకు ఎదురు కావచ్చు. మీరు వాళ్ళ అవధానాన్ని ఎలా ఆకట్టుకోవచ్చు? తొలి క్రైస్తవుల్లో ఒకరైన స్తెఫను, “ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని”నవాడని పేర్కొనబడ్డాడు, ఆయన యూదుల మహాసభ ఎదుటకు బలవంతంగా తీసుకువెళ్ళబడ్డాడు. ఆయన అక్కడ క్రైస్తవత్వాన్ని అనర్గళంగా శక్తివంతంగా సమర్థించాడు. ఆయన ఎలా మొదలుపెట్టాడు? ఆయన తానే గాక ఎదుటివాళ్ళు కూడా అంగీకరించే విషయాన్ని చెబుతూ ‘సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రాహాముకు మహిమగల దేవుడు ప్రత్యక్షమై’ అని అంటూ గౌరవపూర్వకంగా మొదలుపెట్టాడు. (అపొ. 6:3; 7:2) ఏథెన్సులోని అరేయొపగు కొండ మీద అపొస్తలుడైన పౌలు ఎంతో భిన్నమైన ప్రేక్షకులతో మాట్లాడేటప్పుడు, “ఏథెన్సువారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తిగలవారై యున్నట్టు నాకు కనబడుచున్నది” అంటూ వాళ్ళకు తగిన ఉపోద్ఘాతాన్నిచ్చాడు. (అపొ. 17:22) సమర్థమైన ఉపోద్ఘాతాల మూలంగా, రెండు సందర్భాల్లోని ప్రేక్షకులూ వినడానికి మరెక్కువ సుముఖతను చూపించారు.

మీరు క్షేత్రసేవలో ఉన్నప్పుడు, మీరు కూడా ప్రజల శ్రద్ధను ఆకట్టుకోవాలి. మీ సందర్శనం ముందుగా ఏర్పాటు చేసుకున్నది కాకపోతే గృహస్థుడు వేరే పనుల్లో నిమగ్నమై ఉండవచ్చు. ప్రపంచంలోని కొన్ని భూభాగాల్లో, తాము పిలవకుండా వచ్చినవారు విషయాన్ని త్వరగా చెప్పాలని గృహస్థులు చూస్తారు. మరితర ప్రాంతాల్లో, మీరు వాళ్ళను సందర్శించడానికి గల కారణాన్ని చెప్పే ముందు సాంప్రదాయక మర్యాదలు పాటించాల్సి ఉంటుంది.—లూకా 10:5.

చెప్పేదేదో త్వరగా చెప్పాలని ప్రజలు అశించే ప్రాంతంలోనైనా సరే, సాంప్రదాయక మర్యాదలు పాటించాల్సిన ప్రాంతంలోనైనా సరే, సంభాషణ జరగడానికి దారితీసే వాతావరణాన్ని సృష్టించేందుకు హృదయపూర్వకమైన స్నేహభావం సహాయపడగలదు. ఒక వ్యక్తి మనస్సులో ఉన్న విషయంతో నేరుగా ముడిపడివుండే దానితో మొదలుపెట్టడమే తరచూ ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు దేన్ని ఉపయోగించాలన్నది ఎలా నిర్ణయించుకోవచ్చు? మీరు ఒక వ్యక్తిని సమీపించినప్పుడు, ఆయన గానీ ఆమె గానీ ఏదైనా ఒక పనిలో నిమగ్నమై ఉన్నారా? బహుశా ఆ వ్యక్తి అప్పుడు సేద్యం చేస్తుంటుండవచ్చు, తన ఇంటి పరిసరాలను శుభ్రం చేస్తుంటుండవచ్చు, తన వాహనాన్ని మరమ్మతు చేసుకుంటుండవచ్చు, వంట చేస్తుంటుండవచ్చు, బట్టలు ఉతుకుతుంటుండవచ్చు, లేదా పిల్లల ఆలనా పాలనా చూసుకుంటుండవచ్చు. ఆయన ఒక వార్తాపత్రికను గానీ వీధిలో జరుగుతున్న ఏదైనా కార్యక్రమాన్ని గానీ చూస్తున్నాడా? ఆయన ఇంటి పరిసరాలు, ఆయనకు చేపలు పట్టడంలో, క్రీడల్లో, సంగీతంలో, ప్రయాణాల మీద, కంప్యూటర్‌ల మీద, లేక వేరే దేనిమీదైనా ప్రత్యేక ఆసక్తి ఉన్నట్లు చూపిస్తున్నాయా? తరచూ ప్రజలు ఇటీవల రేడియోలో విన్నదాని గురించి గానీ టీవీలో చూసిన దాని గురించి గానీ కలతచెందుతుంటారు. అలాంటి విషయాల్లో దేని గురించైనా ఒక ప్రశ్న అడగడం గానీ క్లుప్త వ్యాఖ్యానం చేయడం గానీ స్నేహభావంతో కూడిన సంభాషణకు దారితీయవచ్చు.

యేసు సుఖారుకు సమీపాన ఉన్న బావి దగ్గర ఒక సమరయ స్త్రీతో మాట్లాడిన సందర్భం, సాక్ష్యమివ్వడానికి సంభాషణనెలా మొదలుపెట్టవచ్చన్నదానికి మంచి ఉదాహరణగా ఉంది.—యోహా. 4:5-26.

ముఖ్యంగా మీ సంఘం మీ సేవాప్రాంతంలో తరచూ పనిచేస్తున్నట్లయితే, మీరు మీ ఉపోద్ఘాతాన్ని జాగ్రత్తగా సిద్ధం చేసుకోవడం అవసరం. అలా సిద్ధం చేసుకోకపోతే మీరు సాక్ష్యమివ్వలేకపోవచ్చు.

విషయమేమిటో తెలియజేయండి.క్రైస్తవ సంఘంలో, సంఘాధ్యక్షుడు గానీ ఆ కార్యక్రమంలో ముందు భాగాన్ని నిర్వహించిన మరొకరు గానీ సాధారణంగా మీ ప్రసంగ శీర్షికను ప్రకటించి, మీ పేరు చెబుతారు. అయినప్పటికీ మీ ఉపోద్ఘాత వ్యాఖ్యానాల్లో మీరు చర్చించే విషయాన్ని శ్రోతలకు గుర్తుచేయడం ప్రయోజనకరంగా ఉండగలదు. ప్రసంగాంశంలోని పదాలను ఉన్నవి ఉన్నట్లుగా చెప్పవచ్చు, అయితే ఖచ్చితంగా అలా చెప్పాలనేమీ లేదు. ఏది ఏమైనప్పటికీ ప్రసంగం ముందుకు కొనసాగుతున్న కొద్దీ చర్చాంశం క్రమానుగతంగా స్పష్టమవ్వాలి. ఎలాగైనా సరే ఉపోద్ఘాతంలో మీరు చెప్పే విషయం మీదే కేంద్రీకరిస్తూ మాట్లాడాలి.

యేసు ప్రకటించమని తన శిష్యులను పంపించేటప్పుడు వాళ్ళు అందజేయవలసిన సమాచారమేమిటన్నది స్పష్టంగా తెలియజేస్తూ, “వెళ్లుచు—పరలోకరాజ్యము సమీపించి యున్నదని ప్రకటించుడి” అని చెప్పాడు. (మత్త. 10:7) మన రోజుల గురించి యేసు, “ఈ రాజ్య సువార్త . . . ప్రకటింపబడును” అని అన్నాడు. (మత్త. 24:14) “వాక్యమును ప్రకటించుము” అని మనకు ప్రబోధించబడుతోంది. అంటే సాక్ష్యమిచ్చేటప్పుడు బైబిలు చెబుతున్నది కాకుండా వేరే ఏదీ చెప్పకూడదు. (2 తిమో. 4:2) అయితే బైబిలు తెరిచే ముందు గానీ రాజ్యం మీదకు శ్రద్ధ మళ్ళించే ముందు గానీ ప్రస్తుతం కలతపరుస్తున్న ఒక విషయాన్ని పేర్కొనడం తరచూ అవసరమవుతుంది. నేరం, నిరుద్యోగం, అన్యాయం, యుద్ధం, యౌవనస్థులకు సహాయం చేయడమెలా, రోగం, మరణం మొదలైన వాటి మీద మీరు వ్యాఖ్యానించవచ్చు. అయితే ప్రతికూలమైన విషయాల మీద ఎక్కువ సేపు మాట్లాడకండి; మీరు చెప్పే సందేశం నిర్మాణాత్మకమైనది. సంభాషణను దేవుని వాక్యం వైపుకూ రాజ్య నిరీక్షణ వైపుకూ మళ్ళించడానికి శాయశక్తులా ప్రయత్నించండి.

మీ శ్రోతలకు ఆ విషయం ఎందుకు ప్రాముఖ్యమో చూపించండి. మీరు సంఘంలో మాట్లాడుతున్నట్లయితే, సాధారణంగా శ్రోతలు మీరు చర్చిస్తున్న దాని మీద ఆసక్తి చూపుతారని సహేతుకంగానే నమ్మవచ్చు. తనకు పూర్తిగా వర్తించే ఒక విషయం గురించి తెలుసుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి ఎలా వింటాడో అలా వాళ్ళు వింటారా? తాము వింటున్నది తమ పరిస్థితికి తగినదని గుర్తించడం వల్లా దాని విషయంలో ఏమైనా చేయాలన్న కోరికను మీరు వారిలో కలిగిస్తున్నందువల్లా వాళ్ళు శ్రద్ధ పెట్టి వింటారా? మీరు మీ ప్రేక్షకుల గురించి అంటే వాళ్ళ పరిస్థితుల గురించీ వాళ్ళను కలతపరుస్తున్న విషయాల గురించీ వాళ్ళ దృక్పథాల గురించీ మీరు ప్రసంగాన్ని సిద్ధం చేసుకునేటప్పుడు శ్రద్ధగా ఆలోచిస్తేనే అది నెరవేరుతుంది. అలా ఆలోచిస్తే, దానిని సూచించే దేన్నైనా మీ ఉపోద్ఘాతంలో చేర్చండి.

మీరు వేదిక మీది నుండి మాట్లాడుతున్నా ఒక వ్యక్తికి సాక్ష్యమిస్తున్నా విషయం మీద శ్రద్ధనాకర్షించడానికి గల శ్రేష్ఠమైన మార్గాల్లో ఒకటి శ్రోతలను కలుపుకుంటూ మాట్లాడడమే. వాళ్ళ మనస్సుల్లో మెదులుతున్న వాళ్ళ సమస్యలూ అవసరాలూ ప్రశ్నలూ మీరు చర్చిస్తున్న విషయంతో ఎలా ముడిపడివున్నాయో తెలియజేయండి. మామూలు విషయాలను మాత్రమే కాక, విషయానికి సంబంధించిన నిర్దిష్ట పార్శ్వాలను కూడా మీరు చర్చిస్తున్నారన్నది స్పష్టం చేస్తే వాళ్ళు మరెక్కువ శ్రద్ధగా వింటారు. అందుకు మీరు బాగా సిద్ధపడి తీరాలి.

మీరు అందించే విధానం. మీరు మీ ఉపోద్ఘాతంలో ఏమి చెబుతారన్నదానికి ప్రథమ ప్రాముఖ్యత ఉంది. అయితే మీరు చెప్పే విధానం కూడా ఆసక్తిని రేకెత్తించగలదు. ఈ కారణం చేతనే, మీరు ఏమి చెప్పబోతున్నారన్నది మాత్రమే కాక ఎలా చెప్పబోతున్నారన్నది కూడా సిద్ధపడి తీరాలి.

మీరు మీ లక్ష్యాన్ని చేరుకునేందుకు సరైన పదాలను ఎంపిక చేసుకోవడం ప్రాముఖ్యం. మొదటి రెండు మూడు వాక్యాలను చాలా జాగ్రత్తగా తయారు చేసుకోవడం ప్రయోజనకరమని మీరు అనుకోవచ్చు. చిన్నవైన సరళమైన వాక్యాలే సాధారణంగా ఉత్తమం. ఒక సంఘంలో ప్రసంగమిచ్చేందుకు మీరు నోట్సు వ్రాసుకోవాలని అనుకోవచ్చు, లేదా మీ ప్రారంభ వాక్యాలు కావలసినంత శక్తివంతంగా ఉండేందుకు వాటిని కంఠస్థం చేసుకోవాలని మీరు నిర్ణయించుకోవచ్చు. తొందరపాటు లేకుండా సమర్థమైన ఉపోద్ఘాతమివ్వడం, మిగతా ప్రసంగానికి అవసరమైన మనోనిబ్బరాన్ని పొందడానికి మీకు సహాయపడగలదు.

ఎప్పుడు సిద్ధం చేసుకోవాలి. దీని గురించి వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయి. ప్రసంగ సిద్ధపాటు ఉపోద్ఘాతంతో మొదలవ్వాలని అనుభవజ్ఞులైన కొందరు ప్రసంగీకులు నమ్ముతారు. ప్రసంగపు ముఖ్యభాగాన్ని తయారు చేసుకోవడం పూర్తయ్యాక ఉపోద్ఘాతాన్ని తయారుచేసుకోవాలన్నది బహిరంగంగా ప్రసంగించడం గురించి అధ్యయనం చేసిన ఇతరుల అభిప్రాయం.

తగిన ఉపోద్ఘాతానికి అవసరమైన వివరాల కోసం ప్రయత్నించే ముందు, మీరు చర్చించే విషయమేమిటి, మీరు విపులీకరించాలనుకుంటున్న ముఖ్యాంశాలు ఏవి అన్నది మీరు తెలుసుకోవడం నిశ్చయంగా అవసరం. ప్రచురిత సంక్షిప్త ప్రతి ఆధారంగానే మీరు ప్రసంగానికి సిద్ధమవుతున్నట్లయితే అప్పుడు ఏమిటి? మీరు సంక్షిప్త ప్రతిని చదివిన తర్వాత, ఉపోద్ఘాతం గురించి మీకు ఏదైనా ఆలోచన తడితే, దాన్ని వెంటనే వ్రాసిపెట్టుకోవడంలో తప్పేమీ లేదు. మీ ఉపోద్ఘాతం సమర్థవంతంగా ఉండాలంటే, మీరు మీ ప్రేక్షకులనూ సంక్షిప్త ప్రతిలోని సమాచారాన్నీ పరిగణలోకి తీసుకోవాలి.