10
ఉత్సాహం
ఉత్సాహం, ఒక ప్రసంగానికి జీవం పోసేందుకు సహాయపడుతుంది. పరిజ్ఞానాన్ని పెంచే సమాచారం ప్రాముఖ్యమే. అయినప్పటికీ, దాన్ని చురుగ్గాను ఉత్సాహంగాను అందించే విధానమే ప్రేక్షకుల శ్రద్ధను నిలబెట్టడానికి సహాయపడుతుంది. మీ సాంస్కృతిక నేపథ్యమేదైనప్పటికీ మీ వ్యక్తిత్వం ఎలాంటిదైనప్పటికీ మీరు ఉత్సాహాన్ని అలవరుచుకోవచ్చు.
భావోపేతంగా మాట్లాడండి. యేసు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు, యెహోవాను ఆరాధించేవారు, “ఆత్మతోను సత్యముతోను” ఆరాధించాలని చెప్పాడు. (యోహా. 4:24) వాళ్ళ ఆరాధన, మెప్పుదలతో నిండిన హృదయాల చేత పురికొల్పబడాలి, దేవుని వాక్యంలోని సత్యానికి పొందికగా ఉండాలి. ఒక వ్యక్తికి అంత లోతైన మెప్పుదల ఉన్నప్పుడు, అది ఆయన మాట్లాడే విధానంలో ప్రతిబింబించబడుతుంది. యెహోవా చేసిన ప్రేమపూర్వక ఏర్పాట్ల గురించి ఇతరులతో మాట్లాడాలన్న ఆతురతతో ఆయన ఉంటాడు. ఆయన ముఖ కవళికలు, సంజ్ఞలు, స్వరము నిజానికి ఆయనెలా భావిస్తున్నాడన్న దాన్ని ప్రతిబింబిస్తాయి.
అయితే యెహోవాను ప్రేమిస్తున్న, తాను చెబుతున్నవాటిని నమ్ముతున్న ఒక ప్రసంగీకుడికి ప్రసంగమిచ్చేటప్పుడు ఉత్సాహం ఎందుకు కొరవడుతుంది? ఉత్సాహం ఉండాలంటే తాను చెప్పబోతున్నవాటిని సిద్ధం చేసుకోవడం మాత్రమే సరిపోదు. తాను చెబుతున్న విషయంలో ఆయన లీనమవ్వాలి, భావోద్వేగపరంగా లీనమవ్వాలి. ఉదాహరణకు ఆయన యేసుక్రీస్తు ఇచ్చిన విమోచన క్రయధన బలి గురించి ప్రసంగించడానికి నియమించబడ్డాడనుకోండి. ఆయన దాని గురించి ప్రసంగిస్తున్నప్పుడు, ఆయన మనస్సు దాని గురించిన వివరాలతో మాత్రమే కాక, అది తనకూ తన ప్రేక్షకులకూ చేకూర్చే ప్రయోజనాలను గురించిన మెప్పుదలతో నిండిపోవాలి. ఈ అద్భుతమైన ఏర్పాటును బట్టి యెహోవా దేవుడు అంటే, క్రీస్తుయేసు అంటే తనకు కలిగిన కృతజ్ఞతాభావాలను ఆయన గుర్తుచేసుకోవాలి. మానవులకు విమోచన క్రయధనం ఇచ్చిన జీవితపు గొప్ప నిరీక్షణ గురించి ఆయన ఆలోచించాలి. పునఃస్థాపించబడే భూపరదైసులో పరిపూర్ణ ఆరోగ్యంతో నిత్య సంతోషాన్ని అనుభవించవచ్చన్నదే ఆ నిరీక్షణ! ఆ విధంగా ఆయన తన హృదయాన్ని అందులో లీనం చేసుకోవాలి.
“యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దానిచొప్పున నడచుకొనుటకును, ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢనిశ్చయము చేసికొనెను” అని ఇశ్రాయేలులో ఒక శాస్త్రీ, బోధకుడూ అయిన ఎజ్రా గురించి బైబిలు చెబుతోంది. (ఎజ్రా 7:10) బైబిలు మూల పాఠంలోని మాటలను అక్షరార్థంగా అనువదిస్తే, “దృఢనిశ్చయము చేసికొనెను” అనే దానికి బదులు “ఆయన తన హృదయాన్ని సిద్ధం చేసుకున్నాడు” అని వస్తుంది. మనం కూడా ఎజ్రాలాగే చేస్తే, అంటే సమాచారాన్ని మాత్రమే కాక, మన హృదయాలను కూడా సిద్ధం చేసుకుంటే మనం హృదయంలో నుండి మాట్లాడతాం. మనం సత్యాన్ని హృదయపూర్వకంగా వ్యక్తం చేయడం, మనం ఎవరితో మాట్లాడుతున్నామో వారు సత్యంపై నిజమైన మక్కువను పెంచుకోవడానికి సహాయపడేందుకు ఎంతో ఉపకరించగలదు.
మీ ప్రేక్షకుల గురించి ఆలోచించండి. మీరు ఉత్సాహాన్ని చూపించడానికి ప్రాముఖ్యమైన మరొక కారకం, మీ ప్రేక్షకులు మీరు చెప్పాలనుకుంటున్న దాన్ని వినవలసిన అవసరముందన్న నమ్మకం మీకు ఉండడమే. మీరు సమాచారాన్ని అందించడానికి సిద్ధపడుతుండగా ప్రయోజనకరమైన సమాచారాన్ని సేకరించడమే కాక, మీరు ఎవరి ఎదుట మాట్లాడబోతున్నారో వారి ప్రయోజనార్థం ఆ సమాచారాన్ని ఉపయోగించడానికి మార్గదర్శనం ఇవ్వమని యెహోవాకు ప్రార్థించాలి. (కీర్త. 32:8; మత్త. 7:7,8) మీరు అందించబోతున్న సమాచారాన్ని మీ ప్రేక్షకులు వినవలసిన అవసరం ఎందుకుందో అది వాళ్ళకెలా ప్రయోజనం చేకూర్చగలదో వారు ఆ సమాచార విలువను గ్రహించేలా మీరు ఆ సమాచారాన్ని ఎలా అందించగలరో విశ్లేషించుకోండి.
మీకు ఎంతో ఉత్తేజాన్నిచ్చే సమాచారం లభించే వరకు కష్టపడండి. ఆ సమాచారం క్రొత్తదై ఉండాలనేమీ లేదు, కానీ మీరు ఆ విషయాన్ని క్రొత్త కోణంలో చర్చించవచ్చు. ప్రేక్షకులు యెహోవాతో తమకున్న సంబంధాన్ని బలపరుచుకునేందుకు, ఆయన చేసిన ఏర్పాట్లకు వారు కృతజ్ఞతాభావంతో ఉండేందుకు, ఈ పాత విధానంలో ఎదురయ్యే జీవిత ఒత్తిళ్ళను విజయవంతంగా అధిగమించేందుకు లేదా వారు తమ పరిచర్యలో ప్రతిభావంతులుగా ఉండేందుకు వారికి నిజంగా సహాయపడే సమాచారాన్ని మీరు సిద్ధం చేస్తే మీరు మీ ప్రసంగం విషయమై ఉత్సాహంగా ఉండడానికి మీకు అన్ని కారణాలూ ఉన్నాయి.
మీరు బహిరంగంగా చదవడానికి నియమించబడితే అప్పుడేమిటి? దాన్ని ఉత్సాహంగా చేయడానికి, పదాలను సరైన విధంగా ఉచ్చరించడం సరైన పద సముదాయాలుగా వర్గీకరించడం మాత్రమే సరిపోదు. సమాచారాన్ని అధ్యయనం చేయండి. మీరు బైబిలులోని ఒక భాగాన్ని చదువుతున్నట్లయితే దాని మీద కొంత పరిశోధన చెయ్యండి. దాని ప్రాథమిక భావం మీకు అర్థమయ్యిందో లేదో రూఢిపరుచుకోండి. అది మీకు మీ ప్రేక్షకులకు ప్రయోజనాన్ని ఎలా చేకూరుస్తుందో ఆలోచించండి. ఆ ప్రయోజనాన్ని మీ శ్రోతలకు తెలియజేయాలన్న కోరికతో చదవండి.
మీరు క్షేత్ర పరిచర్య కోసం సిద్ధపడుతున్నారా? మీరు చర్చించనున్న విషయాన్నీ ఉపయోగించాలనుకుంటున్న లేఖనాలనూ మరొకసారి చూసుకోండి. ప్రజల మనస్సుల్లో ఏముందో ఆలోచించండి. ప్రస్తుత వార్తలు ఏమిటి? వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి? వారిని కలతపెడుతున్న సమస్యలకు పరిష్కారాలు దేవుని వాక్యంలో ఉన్నాయని ప్రజలకు చూపించేంతగా మీరు సంసిద్ధులైనప్పుడు వారికి వాటిని చూపించాలన్న ఆతురతతో మీరుంటారు, సహజంగానే ఉత్సాహం వచ్చేస్తుంది.
చైతన్యవంతంగా చదువుతూ లేదా ప్రసంగిస్తూ ఉత్సాహాన్ని చూపించండి. చైతన్యవంతంగా చదివినప్పుడైనా ప్రసంగించినప్పుడైనా ఉత్సాహం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది మీ ముఖ కవళికల్లో కనిపించాలి. మీకు ఆత్మవిశ్వాసం బాగా ఉన్నట్లు తెలియాలి, కానీ అహంభావం ఉన్నట్లు కాదు.
సమతుల్యత అవసరం. కొందరు ప్రతిదానికీ ఉత్తేజం చెందుతుండవచ్చు. అలాంటి వాళ్ళకు, ఒక వ్యక్తి తనను తాను హెచ్చించుకున్నా అతిగా భావోద్వేగానికి గురైనా ప్రేక్షకులు సందేశాన్ని గురించి కాక ఆయన గురించి ఆలోచిస్తారన్న విషయాన్ని గుర్తించేందుకు సహాయపడవలసిన అవసరం ఉండవచ్చు. మరొకవైపు బిడియస్థులకైతే మరింతగా భావప్రకటన చేయడానికి ప్రోత్సాహం అవసరం.
ఉత్సాహం వ్యాపించే గుణం. మీరు ప్రేక్షకులను చూస్తూ ఉత్సాహంగా ప్రసంగిస్తున్నట్లయితే మీ ప్రేక్షకులకు కూడా ఉత్సాహం వస్తుంది. అపొల్లో ప్రసంగంలో చైతన్యాన్ని చూపించాడు, ఆయన అనర్గళంగా ప్రసంగించే వ్యక్తిగా వర్ణించబడ్డాడు. మీరు ఆత్మయందు తీవ్రతగలవారై ఉంటే మీరు చైతన్యంతో ఇస్తున్న ప్రసంగం, విన్నదాని ప్రకారం ప్రవర్తించేలా శ్రోతలను కదిలిస్తుంది.—అపొ. 18:24,25; రోమా. 12:11.
సమాచారానికి తగిన ఉత్సాహం. మీ ప్రసంగమంతటా అమితోత్సాహాన్ని చూపించకుండా జాగ్రత్తపడండి. అలా అమితోత్సాహాన్ని చూపించారంటే మీ ప్రేక్షకులు ఉక్కిరిబిక్కిరి అవుతారు. అప్పుడు, చర్చించిన దాని ప్రకారం ప్రవర్తించాలని మీరు ఇచ్చే ఉద్బోధ అలక్ష్యం చేయబడుతుంది. ఈ వాస్తవం, మీ ప్రసంగంలో వైవిధ్యముండేలా సమాచారాన్ని సిద్ధపడవలసిన అవసరాన్ని నొక్కి చెబుతుంది. మీరు మాట్లాడే విధానం ఉదాసీనతను ప్రతిబింబించేదిగా మారకుండా ప్రయత్నించండి. మీరు సమాచారాన్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటే మీకు దానిపై ఎంతో ఆసక్తి ఉంటుంది. కానీ కొన్ని అంశాలకు మిగతా అంశాలకన్నా ఎక్కువ ఉత్సాహం చూపవలసిన అవసరం సహజంగానే ఉంటుంది, వాటిని ప్రసంగంలో నేర్పుగా చేర్చాలి.
ప్రత్యేకించి ముఖ్యాంశాలను ఉత్సాహంగా తెలియజేయాలి. మీ ప్రసంగంలో, విశిష్టమైన ఉత్కృష్టమైన అంశాలు ఉండేలా ప్రసంగాన్ని తయారు చేసుకోవాలి. అవి మీ ప్రసంగంలోని ఉన్నతాంశాలు కనుక, సాధారణంగా అవి మీ ప్రేక్షకులను ప్రేరేపించేందుకు ఉద్దేశించబడివుంటాయి. మీరు మీ ప్రేక్షకులను ఒప్పించిన తర్వాత, వాటిని అన్వయించుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలను వారికి చూపించడమూ వారిని పురికొల్పడమూ అవసరం. మీ శ్రోతల హృదయాలను చేరుకునేందుకు మీ ఉత్సాహం మీకు సహాయపడుతుంది. ప్రసంగంలో చైతన్యాన్ని బలవంతంగా తెచ్చిపెట్టుకున్నట్లు ఉండకూడదు. చైతన్యం చూపించడానికి ఒక కారణముండాలి, మీ సమాచారమే ఆ కారణాన్నిస్తుంది.