కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

33

ఔచిత్యంతోనే అయినా దృఢంగా మాట్లాడడం

ఔచిత్యంతోనే అయినా దృఢంగా మాట్లాడడం

ఔచిత్యం అంటే ఇతరులను అనవసరంగా నొప్పించకుండా వాళ్ళతో వ్యవహరించే సామర్థ్యం. అందులో విషయాలను ఎలా చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి అన్నవి తెలుసుకోవడం కూడా ఉంది. సరైనది చెప్పకుండా రాజీపడాలని గానీ వాస్తవాలను వక్రీకరించాలని గానీ దానర్థం కాదు. ఔచిత్యమూ మనుష్య భయమూ ఒకటి కాదు.—సామె. 29:25.

ఔచిత్యంతో ఉండడానికి ఆత్మ ఫలాలు ఎంతో శ్రేష్ఠమైన పునాదిని వేస్తాయి. కాబట్టి ప్రేమ చేత పురికొల్పబడిన వ్యక్తి ఇతరులకు చిరాకు కలిగించాలని అనుకోడు; ఆయన వారికి సహాయం చేయాలని కోరుకుంటాడు. దయతో సాత్వికముతో ఉండే వ్యక్తి మృదువుగా వ్యవహరిస్తాడు. సమాధానంగా ఉండే వ్యక్తి ఇతరులతో మంచి సంబంధాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తాడు. దీర్ఘశాంతం గల వ్యక్తి ప్రజలు కఠినంగా ప్రవర్తించినప్పుడు కూడా శాంతంగా ఉంటాడు.—గల. 5:22-24.

అయితే బైబిలు సందేశాన్ని ఏ విధంగా అందించినప్పటికీ కొంతమంది ప్రజలు కోపం తెచ్చుకుంటారు. తొలి శతాబ్దపు యూదుల్లో చాలామంది హృదయం దుష్టత్వముతో కూడినదైనందువల్ల, యేసుక్రీస్తు వారికి “అడ్డురాయియు అడ్డుబండయు ఆయెను.” (1 పేతు. 2:7,8) యేసు తాను చేస్తున్న రాజ్య ప్రకటనా పని గురించి చెబుతూ “నేను భూమిమీద అగ్ని వేయ వచ్చితిని” అన్నాడు. (లూకా 12:49) యెహోవా రాజ్య సందేశం ఇప్పటికీ మానవులకు వివాద విషయంగానే ఉంది. ఈ సందేశంలో మానవులు తమ సృష్టికర్త సర్వాధిపత్యాన్ని గుర్తించవలసిన అవసరం ఉందన్న సందేశం ఉంది. దేవుని రాజ్యం త్వరలోనే ప్రస్తుత దుష్ట విధానాన్ని తీసివేస్తుందన్న సందేశానికి చాలామంది చిరాకుపడతారు. అయినప్పటికీ మనం దేవునికి విధేయత చూపిస్తూ నిరంతరం ప్రకటిస్తూనే ఉంటాము. అయితే అలా చేసేటప్పుడు “శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి” అన్న బైబిలు సలహాను మనస్సులో ఉంచుకుంటాం.—రోమా. 12:18.

సాక్ష్యమిచ్చేటప్పుడు ఔచిత్యంతో ఉండడం. అనేక సందర్భాల్లో ఇతరులతో మనం మన విశ్వాసాన్ని గురించి మాట్లాడుతుంటాం. నిశ్చయంగా మనం క్షేత్ర పరిచర్యలో దాని గురించి మాట్లాడుతుంటాం. అయితే మనం బంధువులతో ఉన్నప్పుడూ సహోద్యోగులతో ఉన్నప్పుడూ తోటి విద్యార్థులతో ఉన్నప్పుడూ కూడా దాని గురించి మాట్లాడగల సముచితమైన అవకాశాల కోసం ప్రయత్నిస్తాం. ఈ సందర్భాలన్నింటిలోనూ ఔచిత్యం అవసరం.

మనం ఇతరులకు రాజ్య సందేశాన్ని అందించే విధానం, మనం ఏదో ఉపన్యాసమిస్తున్నట్లు అనిపిస్తే వాళ్ళకు కోపం రావచ్చు. వాళ్ళు సహాయం కోసం అడగనప్పుడూ దాని అవసరం ఉన్నట్లు బహుశా భావించనప్పుడూ వాళ్ళు సరిదిద్దుకోవలసిన అవసరముందన్న సూచన ఏమైనా ఇస్తే వాళ్ళకు కోపం రావచ్చు. వారికి తప్పుడు అభిప్రాయం కలగకుండా మనమెలా జాగ్రత్తపడవచ్చు? స్నేహపూర్వకంగా సంభాషించే కళను నేర్చుకోవడం మనకు సహాయపడగలదు.

ఎదుటి వ్యక్తికి ఆసక్తి కలిగించే విషయాన్ని చెప్పడం ద్వారా సంభాషణను మొదలుపెట్టడానికి కృషి చేయండి. ఆ వ్యక్తి మీ బంధువో లేక మీతో పనిచేస్తున్న వ్యక్తో లేక తోటివిద్యార్థో అయితే ఆయన అభిరుచులేమిటో మీకు ఇప్పటికే తెలిసి ఉండవచ్చు. మీరు ఒక వ్యక్తిని ముందెప్పుడూ కలవకపోయినప్పటికీ మీరు వార్తలో విన్న విషయాన్ని గానీ వార్తాపత్రికలో చదివిన విషయాన్ని గానీ చెప్పవచ్చు. సాధారణంగా అలాంటి విషయాలు అనేకుల మనస్సుల్లో ఉన్నదాన్ని ప్రతిబింబిస్తాయి. మీరు ఇంటింటి పరిచర్య చేస్తున్నప్పుడు, గమనించేవారై ఉండండి. గృహాలంకరణ, ఇంటి పరిసరాల్లో ఉన్న ఆటవస్తువులు, మతసంబంధ వస్తువులు, ఆ ఇంటివాళ్ళ కారు మీద అంటించబడివున్న స్టిక్కర్‌లు వాళ్ళ అభిరుచులను గురించిన మరిన్ని సూచనలు ఇస్తుండవచ్చు. ఆ ఇంటి యజమాని తలుపు దగ్గరికి వచ్చి, ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నప్పుడు జాగ్రత్తగా వినండి. ఆయన చెప్పే మాటలు ఆయన అభిప్రాయాల గురించీ దృక్కోణం గురించీ మీరు అనుకున్నది నిజమేనని రూఢిపరచడమైనా చేయవచ్చు, సరికాదనైనా చూపించవచ్చు, మీరు వారికి సాక్ష్యమిచ్చేందుకు మీరు పరిగణలోకి తీసుకోవలసిన విషయాలకు సంబంధించి మరిన్ని సూచనలైనా ఇవ్వవచ్చు.

సంభాషణ అలా కొనసాగుతుండగా, ఆ విషయంతో సంబంధమున్న అంశాలను బైబిలు నుండీ బైబిలు ఆధారిత సాహిత్యం నుండీ చూపించండి. కానీ సంభాషణలో మీదే పైచేయిగా ఉండకుండా చూసుకోండి. (ప్రసం. 3:1,7) చర్చలో భాగం వహించడానికి ఆ గృహస్థుడు ఇష్టపడుతున్నట్లయితే చర్చలో ఆయనను కూడా కలుపుకోండి. ఆయన దృక్కోణాల మీదా అభిప్రాయాల మీదా ఆసక్తి చూపించండి. అవి మీరు ఔచిత్యంతో ఉండేందుకు అవసరమైన సూచనలు ఇవ్వవచ్చు.

మీరు ఏమైనా చెప్పే ముందు, మీ మాటలు విన్నప్పుడు ఎదుటి వ్యక్తికి ఎలా అనిపిస్తుందో ఆలోచించుకోండి. “వివేకముకొలది [“వివేచన కొలది,” NW]” మాట్లాడడాన్ని సామెతలు 12:8 ప్రశంసిస్తోంది. ఇక్కడ వివేచన అని అనువదించబడిన హీబ్రూ మాటకు అంతర్దృష్టిని ఉపయోగించడం, సూక్ష్మబుద్ధిని ఉపయోగించడం వంటి భావనలతో సంబంధముంది. కాబట్టి వివేచించడంలో జ్ఞానయుక్తంగా ప్రవర్తించేందుకు ఒక విషయం గురించి క్షుణ్ణంగా ఆలోచించి కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం ఉంది. సామెతలు అదే అధ్యాయం 18వ వచనం, “కత్తిపోటువంటి మాటలు పలుక”కూడదని హెచ్చరిస్తోంది. కోపం తెప్పించకుండానే బైబిలు సత్యపు ఔన్నత్యాన్ని తెలియజేయవచ్చు.

మీరు మాటలను ఎంపిక చేసుకునేటప్పుడు వివేచించడం, అనవసరమైన అడ్డుగోడ లేసే పరిస్థితిని నివారించుకునేందుకు మీకు సహాయపడవచ్చు. “బైబిలు” అన్న మాటే మానసికంగా ఒక అడ్డుగోడను కడుతున్నట్లయితే, “పరిశుద్ధ లేఖనాలు” అని గానీ “ఇప్పుడు 2,000 కన్నా ఎక్కువ భాషల్లో ప్రచురించబడుతున్న ఒక పుస్తకం” అని గానీ మీరు చెప్పవచ్చు. మీరు బైబిలు అని పేర్కొంటున్నట్లయితే, బైబిలు గురించి ఆ వ్యక్తికున్న అభిప్రాయం ఏమిటో అడిగి ఆయన చేసిన వ్యాఖ్యానాలను సంభాషణ కొనసాగుతుండగా పరిగణలోకి తీసుకోండి.

ఔచిత్యంతో ఉండడంలో మీరు విషయాలను చెప్పడానికి సరైన సమయమేదో నిర్ణయించుకోవడం కూడా ఉంది. (సామె. 25:11) ఎదుటి వ్యక్తి చెబుతున్న అన్ని విషయాలతోను మీరు ఏకీభవించకపోవచ్చు, కానీ ఆయన చెప్పే లేఖన విరుద్ధమైన ప్రతి దృక్కోణాన్ని గురించీ వాదించనవసరం లేదు. గృహస్థుడికి అన్ని విషయాలను ఒకేసారి చెప్పాలని ప్రయత్నించకండి. “నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని యిప్పుడు మీరు వాటిని సహింపలేరు” అని యేసు తన శిష్యులకు చెప్పాడు.—యోహా. 16:12.

మీరు ఎవరితో మాట్లాడుతున్నారో వారిని వీలైనప్పుడల్లా ప్రశంసించండి. గృహస్థుడు వాదించే తరహా అయినప్పటికీ ఆయనకు ఒక అభిప్రాయమంటూ ఉన్నందుకు మీరు ఆయనను మెచ్చుకోవచ్చు. ఏథెన్సులోని అరేయొపగు వద్ద తత్త్వజ్ఞానులతో మాట్లాడేటప్పుడు అపొస్తలుడైన పౌలు అలాగే చేశాడు. తత్త్వజ్ఞానులు “అతనితో వాదించిరి.” వారికి కోపం తెప్పించకుండానే విషయాన్ని ఆయన ఎలా సూచించగలిగాడు? వాళ్ళు తమ దేవతల కోసం చేయించుకున్న అనేక బలిపీఠాలను ముందు గమనించాడు. ఆ ఏథెన్సువారు విగ్రహారాధన చేస్తున్నందుకు ఆయన వారిని గద్దించే బదులు, మత సంబంధంగా వారికున్న బలమైన భావాలను ఔచిత్యంతో మెచ్చుకున్నాడు. “మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తి గలవారై యున్నట్టు నాకు కనబడుచున్నది” అని ఆయన అన్నాడు. ఆయన అలా మాట్లాడడం వల్ల సత్య దేవుని గురించిన సందేశాన్ని వాళ్ళకు అందించే అవకాశం ఆయనకు లభించింది. దాని ఫలితంగా కొంతమంది విశ్వాసులయ్యారు.—అపొ. 17:18,22,34.

ఒక వ్యక్తి అభ్యంతరాలు చెప్పినప్పుడు అతిగా ప్రతిస్పందించకండి. శాంతంగా ఉండండి. ఆ అభ్యంతరాలను ఆ వ్యక్తి ఆలోచనా విధానం గురించి మంచి అవగాహనను పొందే అవకాశాలుగా దృష్టించండి. ఆయన తన దృక్కోణాలను వ్యక్తం చేసినందుకు మీరు ఆయనకు కృతజ్ఞతలు చెప్పవచ్చు. అకస్మాత్తుగా ఆయన మీతో, “నాకంటూ ఒక మతముంది” అని అంటే ఏమి చేస్తారు? “మీకు మత విశ్వాసము మొదటి నుండీ ఉందాండీ?” అని మీరు ఆయనను ఔచిత్యంతో అడగవచ్చు. ఆయన ప్రతిస్పందించిన తర్వాత, “సమస్త మానవజాతి ఏనాటికైనా ఒకే మతంలో ఏకమవుతుందని మీరనుకుంటున్నారా?” అని కూడా అడగండి. అలా అడగడం సంభాషణను కొనసాగించే అవకాశమిస్తుండవచ్చు.

మన గురించి మనకు సరైన దృక్పథముండడం మనం ఔచిత్యంతో ఉండేందుకు మనకు సహాయపడగలదు. యెహోవా మార్గాలు సరైనవి, ఆయన వాక్యము సత్యమైనది అని మనకున్న నిశ్చయత బలమైనది. ఈ విషయాల గురించి మనం నిశ్చయతతో మాట్లాడతాం. అయితే స్వనీతిమంతులుగా భావించడానికి మనకు ఏ కారణమూ లేదు. (ప్రసం. 7:15,16) మనం సత్యాన్ని తెలుసుకున్నందుకూ యెహోవా ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నందుకూ కృతజ్ఞతా భావంతో ఉన్నాం. అయితే మనకు యెహోవా ఆమోదమున్నది, ఆయన అపాత్ర కృప వలన, క్రీస్తు మీద మనకున్న విశ్వాసము వలన మాత్రమే కానీ మన సొంత నీతి వలన కాదని మనకు తెలుసు. (ఎఫె. 2:8,9) మనం ‘విశ్వాసముగలవారమై యున్నామో లేదో మనల్ని మనమే శోధించుకొని చూసుకోవడము; మనల్ని మనమే పరీక్షించుకోవడము’ అవసరమని మనం గుర్తిస్తాము. (2 కొరిం. 13:5) కాబట్టి దేవుడు కోరుతున్నట్లు ఉండవలసిన అవసరత గురించి మనం ప్రజలతో మాట్లాడేటప్పుడు, బైబిలు ఉపదేశాన్ని మనకు కూడా వినయంగా అన్వయించుకుంటాం. మన తోటివాళ్ళకు తీర్పు తీర్చే అధికారం మనకు లేదు. యెహోవా “తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి యున్నాడు,” మన క్రియలకు మనం జవాబు చెప్పవలసినది ఆయన న్యాయపీఠము ఎదుటనే.—యోహా. 5:23; 2 కొరిం. 5:10.

కుటుంబంతోను తోటి క్రైస్తవులతోను. మనం ఔచిత్యాన్ని ఉపయోగించడమన్నది కేవలం క్షేత్ర పరిచర్యకే పరిమితం కాకూడదు. ఔచిత్యం అనేది దేవుని ఆత్మ ఫలం వెల్లడయ్యే ఒక విధానం కాబట్టి, మనం ఇంట్లో కుటుంబ సభ్యులతో వ్యవహరించేటప్పుడు కూడా ఔచిత్యం చూపించాలి. ఇతరుల భావాలను పట్టించుకునేలా ప్రేమ మనలను పురికొల్పుతుంది. ఎస్తేరు రాణి భర్త యెహోవా ఆరాధకుడు కాడు, కానీ ఆమె ఆయనకు గౌరవం చూపించింది, యెహోవా సేవకులకు సంబంధించిన ఒక విషయాన్ని తెలిపేటప్పుడు ఎంతో వివేచనను కనబరిచింది. (ఎస్తేరు 3-8 అధ్యాయాలు) కొన్ని సందర్భాల్లో, సాక్షేతర కుటుంబ సభ్యులతో వ్యవహరించేటప్పుడు ఔచిత్యంతో ఉండాలంటే, మన నమ్మకాలను వివరించడం కన్నా మన ప్రవర్తనే వారికి సత్యాన్ని సిఫారసు చేసేదిగా ఉండడం అవసరం కావచ్చు.—1 పేతు. 3:1,2.

అదే విధంగా మనకు సంఘ సభ్యులు బాగా తెలిసినంత మాత్రాన వాళ్ళతో కరుకుగా గానీ నిర్దయగా గానీ వ్యవహరించవచ్చని కాదు. వాళ్ళు పరిణతిచెందినవారు కనుక, వాళ్ళు దాన్ని సహించగలగాలి అని మనం తర్కించుకోకూడదు. “సరేలే, నా నైజమే అంత” అని అంటూ మనలను మనం సమర్థించుకోకూడదు. మన భావాలను వ్యక్తం చేసే విధానం ఇతరుల మనస్సును నొప్పించే విధంగా వాళ్ళకు కోపం తెప్పించే విధంగా ఉందని మనం గ్రహిస్తే, మనం మన పద్ధతిని మార్చుకోవాలని దృఢంగా నిశ్చయించుకోవాలి. మనకు ఒకరిమీద ఒకరికున్న “మిక్కటమైన ప్రేమ” ‘విశ్వాసగృహమునకు చేరినవారికి మేలు’ చేసేలా మనలను కదిలించాలి.—1పేతు. 4:8,15; గల. 6:10.

ప్రేక్షకులతో మాట్లాడేటప్పుడు. వేదిక మీద నుండి మాట్లాడే వాళ్ళు కూడా ఔచిత్యంతో ఉండాలి. ప్రేక్షకుల్లో వివిధ నేపథ్యాల నుండీ వేర్వేరు పరిస్థితుల నుండీ వచ్చినవారుంటారు. వాళ్ళు ఆధ్యాత్మిక ఎదుగుదలలో వివిధ దశల్లో ఉంటారు. కొందరైతే రాజ్య మందిరానికి మొదటిసారిగా వచ్చివుంటారు. మరికొందరు ఎంతో మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉండవచ్చు, కానీ దాని గురించి ప్రసంగీకుడికి తెలియకపోవచ్చు. ప్రసంగీకుడు తన ప్రేక్షకుల మనస్సు నొప్పించకుండా ఉండేందుకు ఆయనకు ఏది సహాయపడగలదు?

అపొస్తలుడైన పౌలు తీతుకు వ్రాసిన సలహాకు అనుగుణంగా, ‘ఎవ్వరిని గూర్చి కాని చెడుగా మాటలాడక, స్నేహపూర్వకముగా [“సహేతుకంగా,” NW] ఉండి, అందరితో మంచిగా ప్రవర్తించుచుండవలె’నన్నదే మీ లక్ష్యంగా చేసుకోండి. (తీతు 3:1, పవిత్ర గ్రంథము, క్యాతలిక్‌ అనువాదము) వేరే జాతికి, భాషకు, లేదా దేశానికి చెందిన ప్రజలను కించపరిచే పదాలను ఉపయోగించడంలో ఈ లోకాన్ని అనుకరించకుండా జాగ్రత్తపడండి. (ప్రక. 7:9,10) దేవుడు ఆవశ్యకమని చెప్పేవాటిని నిస్సంకోచంగా చర్చించండి, వాటిని అన్వయించుకోవడంలోని జ్ఞానాన్ని స్పష్టం చేయండి. అయితే ఇప్పటికీ యెహోవా మార్గంలో సంపూర్ణంగా నడవని వారి గురించి అమర్యాదకరమైన మాటలు పలకకుండా ఉండండి. బదులుగా దేవుని చిత్తాన్ని గ్రహించమనీ ఆయనను ప్రీతిపరిచేవి చేయమనీ అందరినీ ప్రోత్సహించండి. సలహా ఇచ్చేటప్పుడు ఆప్యాయతతో హృదయపూర్వకమైన ప్రశంసతో మృదువైన పదాలతో ఇవ్వండి. మీరు మాట్లాడే విధానంలోనూ మీ కంఠ ధ్వనిలోనూ మనకందరికీ ఒకరి మీద ఒకరికి ఉండవలసిన సహోదర అనురాగాన్ని వ్యక్తం చేయండి.—1 థెస్స. 4:1-12; 1 పేతు. 3:8.