కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

34

క్షేమాభివృద్ధికరంగా, అనుకూలంగా మాట్లాడడం

క్షేమాభివృద్ధికరంగా, అనుకూలంగా మాట్లాడడం

ప్రకటించమని మనకు ఆదేశించబడిన సందేశం సువార్త. “సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను” అని యేసు అన్నాడు. (మార్కు 13:10) “దేవుని రాజ్యసువార్త”కు ప్రాధాన్యతనివ్వడంలో యేసే స్వయంగా మాదిరి ఉంచాడు. (లూకా 4:43) అపొస్తలులు ప్రకటించింది కూడా “దేవుని సువార్త” “క్రీస్తు సువార్త” అనే వర్ణించబడింది. (1 థెస్స. 2:2; 2 కొరిం. 2:12) అలాంటి సందేశం క్షేమాభివృద్ధికరమైనది, అనుకూలమైనది.

‘ఆకాశ మధ్యమున ఎగురుతున్న దూత’ ప్రకటిస్తున్న “నిత్యసువార్త”కు అనుగుణంగా మనం ప్రజలకు “దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి” అని ఉద్బోధిస్తాం. (ప్రక. 14:6,7) అన్నిచోట్లా ఉన్న ప్రజలకు మనం సత్య దేవుని గురించీ ఆయన పేరు గురించీ ఆశ్చర్యకరమైన ఆయన గుణాల గురించీ అద్భుతమైన ఆయన కార్యాల గురించీ ప్రేమపూర్వకమైన ఆయన సంకల్పం గురించీ మనం ఆయనకు లెక్క అప్పజెప్పవలసివున్నామన్న విషయం గురించీ ఆయన మన నుండి ఏమి కోరుతున్నాడన్న దాని గురించీ చెబుతాం. యెహోవా దేవుడు తనను అగౌరవపరుస్తూ ఇతరుల జీవితాలను పాడుచేసే దుష్టులను నశింపజేస్తాడన్న వాస్తవం కూడా ఆ సువార్తలో భాగమే. అయితే మనం ఎవరికైతే ప్రకటిస్తామో ఆ వ్యక్తులకు తీర్పుతీర్చే బాధ్యత మనకు అప్పగించబడలేదు. సాధ్యమైనంత ఎక్కువ మంది బైబిలు సందేశానికి అనుకూలంగా ప్రతిస్పందించాలి, అది వారికి నిజంగా మంచి వార్తగా ఉండాలి అన్నదే మన హృదయపూర్వక కోరిక.—సామె. 2:20-22; యోహా. 5:22,23.

ప్రతికూల సమాచారాన్ని పరిమితంగా వాడండి. నిజమే జీవితానికి ప్రతికూల పార్శ్వాలున్నాయి. మనం వాటిని నిర్లక్ష్యం చేయము. మీరు సంభాషణను మొదలుపెట్టేందుకు, మీ సేవాప్రాంతంలో ఉన్న వారి మనస్సుల్లో మెదులుతున్న సమస్యను పేర్కొని, దాన్ని క్లుప్తంగా చర్చించవచ్చు. కానీ వాటి గురించి ఎక్కువ సేపు చర్చించడం వల్ల పెద్ద ప్రయోజనమేమీ ఉండదు. ప్రజలు కలతపరిచే వార్తలను నిత్యం వింటూనే ఉన్నారు కాబట్టి, విషాదకరమైన విషయాల గురించి మాట్లాడితే వారు తమ తలుపులను మూసుకోవడం గానీ వినిపించుకోకపోవడం గానీ చేయవచ్చు. మీ సంభాషణ ఆరంభంలోనే దేవుని వాక్యంలో ఉన్న సేదదీర్చే సత్యాల వైపుకు వాళ్ళ అవధానాన్ని మళ్ళించేందుకు కృషి చేయండి. (ప్రక. 22:17) అలా చేస్తే, ఆ వ్యక్తి సంభాషణను కొనసాగించడానికి ఇష్టపడకపోయినా ఆయన తర్వాత ఆలోచించుకునేందుకు క్షేమాభివృద్ధికరమైన కొంత సమాచారాన్ని ఆయనకు తెలియజేసినవారవుతారు. అలా చేయడంవల్ల ఆయన మరొక సందర్భంలో మరింత ఇష్టపూర్వకంగా వినవచ్చు.

అదేవిధంగా ప్రసంగమివ్వడానికి మీరు ఆహ్వానించబడితే, ప్రతికూలమైన సమాచారం బోలెడంత అందుబాటులో ఉంది కదా అని దానితో మీరు మీ ప్రేక్షకులను ముంచెత్తకండి. మానవ పరిపాలకుల వైఫల్యం గురించీ నేరం దౌర్జన్యం నివేదికల గురించీ విభ్రాంతికరమైన రీతిలో అనైతికత ప్రాబల్యం గురించీ ప్రసంగీకుడు ఎక్కువ సేపు మాట్లాడితే ఫలితం నిరుత్సాహం కలిగించేదిగా ఉండగలదు. ఆ విషయ ప్రతికూల పార్శ్వాలను చెప్పడం వల్ల ఉపయోగకరమైన ఉద్దేశమేమైనా నెరవేరేటట్లయితే మాత్రమే వాటిని చెప్పండి. అటువంటి పరిమితమైన సమాచారం, ఆ ప్రసంగం సమయోచితమైనదని నొక్కి చెప్పవచ్చు. అది ఒక పరిస్థితికి దారితీసే విషయాలను కూడా గుర్తించేలా చేస్తుండవచ్చు, కనుక బైబిలులో చెప్పబడిన పరిష్కారం ఆచరణాత్మకమైనదని చూపించేందుకు దాన్ని ఉపయోగించవచ్చు. సాధ్యమైతే సమస్యల గురించి పేర్కొని వాటి గురించి ఎక్కువ సేపు మాట్లాడకుండా ఉండండి.

ఒక ప్రసంగంలో ప్రతికూల సమాచారం అంతటినీ తీసివేయడం సాధారణంగా సాధ్యమూ కాదు, కోరదగినదీ కాదు. మొత్తమ్మీద సత్ప్రభావం చూపేలా మంచి విషయాలను చెడు విషయాలను రెండింటినీ చర్చించడమే సవాలుదాయకం. అలా సత్ప్రభావం చూపించేలా చర్చించాలంటే దేన్ని చేర్చాలి, దేన్ని వదిలిపెట్టాలి, ఎక్కడ నొక్కి చెప్పాలి అన్న వాటి గురించి మీరు ఒక నిర్ణయానికి రావాలి. కొండ మీద యేసు ఇచ్చిన ప్రసంగంలో, శాస్త్రులు పరిసయ్యులు అవలంబించిన స్వప్రయోజన మార్గాలను వదిలిపెట్టమని తన శ్రోతలకు ఉద్బోధించి, ఆ మార్గాలేవో స్పష్టం చేసేందుకు ఆయన కొన్ని ఉదాహరణలను చెప్పాడు. (మత్త. 6:1,2,5,16) అయితే ఆ మత నాయకుల ప్రతికూల మాదిరుల గురించే ఎక్కువ సేపు మాట్లాడే బదులు, దేవుని సత్య మార్గాలను అర్థం చేసుకొని ఆ మార్గాల్లో జీవించాలని యేసు నొక్కి చెప్పాడు. (మత్త. 6:3,4, 6-15, 17-34) అందుకు చాలా మంచి ఫలితం లభించింది.

మీ స్వరం అనుకూలంగా ధ్వనించాలి. క్రైస్తవ కార్యకలాపపు ఒక పార్శ్వం గురించి మీరు సంఘంలో ప్రసంగించేందుకు నియమించబడితే, విమర్శిస్తూ మాట్లాడే బదులు నిర్మాణాత్మకంగా మాట్లాడడానికి ప్రయత్నించండి. ఏమి చేయాలని మీరు ఇతరులను ప్రోత్సహిస్తారో అది మీరు చేస్తున్నారో లేదో చూసుకోండి. (రోమా. 2:21,22; హెబ్రీ. 13:7) చిరాకును కాదు ప్రేమనే మీ మాటలకు ప్రేరకం కానివ్వండి. (2 కొరిం. 2:4) మీ తోటి విశ్వాసులు యెహోవాను ప్రీతిపరచాలనుకుంటున్నారన్న నమ్మకం మీకుంటే ఆ నమ్మకం మీ మాటల్లో ప్రతిబింబిస్తుంది, అది ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అపొస్తలుడైన పౌలు అలాంటి నమ్మకాన్ని ఎలా వ్యక్తం చేశాడన్నది 1 థెస్సలొనీకయులు 4:1-12 లోను; 2 థెస్సలొనీకయులు 3:4,5 లోను; ఫిలేమోను 4-6,8-14,21 లోను గమనించండి.

అవివేక ప్రవర్తనకు పాల్పడకుండా జాగ్రత్తపడమని కొన్నిసార్లు పెద్దలు హెచ్చరించడం అవసరం. అయితే “సాత్వికమైన మనస్సుతో” తమ సహోదరులతో వ్యవహరించేందుకు వినయం వారికి దోహదపడుతుంది. (గల. 6:1) వాళ్ళు చెప్పే విధానం సంఘంలోని వారి మీద గౌరవముందని చూపించాలి. (1 పేతు. 5:2,3) ఈ విషయాన్ని ప్రత్యేకంగా గుర్తించాలని బైబిలు యువకులకు ఉపదేశిస్తోంది. (1 తిమో. 4:12; 5:1,2; 1 పేతు. 5:5) ఖండించడమూ క్రమశిక్షణనివ్వడమూ తప్పులను సరిదిద్దడమూ అవసరమైనప్పుడు, బైబిలు చెబుతున్నదాని ఆధారంగా చెయ్యాలి. (2 తిమో. 3:16,17) తనకు బలమైన భావాలున్న ఒక విషయాన్ని బలపరిచేందుకని ప్రసంగీకుడు లేఖనాల అన్వయం కుదరకపోయినా ఎలాగైనా అన్వయించాలని చూడడం గానీ వక్రీకరించడం గానీ చెయ్యకూడదు. సరిదిద్దే ఉపదేశం ఇవ్వడం అవసరమైనప్పుడు కూడా తప్పిదాల్లో ఇరుక్కునే పరిస్థితిని ఎలా నివారించుకోవచ్చు, సమస్యలను ఎలా పరిష్కరించుకోవచ్చు, ఇబ్బందులను ఎలా అధిగమించవచ్చు, తప్పుడు జీవన విధానాన్ని ఎలా సరిదిద్దుకోవచ్చు, యెహోవా కోరిన విషయాలు మనల్నెలా కాపాడతాయి అనే వాటిని నొక్కిచెబుతున్నట్లయితే ప్రసంగం అనుకూలంగానే ధ్వనించగలదు.—కీర్త. 119:1,9-16.

మీరు ప్రసంగానికి సిద్ధపడుతున్నప్పుడు ఒక్కొక్క ముఖ్యాంశాన్ని ఎలా ముగిస్తారు, మొత్తం ప్రసంగాన్ని ఎలా ముగిస్తారు అన్నవాటి గురించి ప్రత్యేకంగా ఆలోచించండి. తరచూ చివర్లో చెప్పిందే చిరకాలం గుర్తుంటుంది. మరి మీ మాటలు అనుకూలంగానే ఉంటాయా?

తోటి విశ్వాసులతో సంభాషించేటప్పుడు. యెహోవా సేవకులు క్రైస్తవ కూటాల్లో సహవసించే అవకాశాలను ఎంతో విలువైనవిగా ఎంచుతారు. అవి ఆధ్యాత్మిక సేదదీర్పునిచ్చే సమయాలు. మనం మన ఆరాధనా స్థలాల్లో సమకూడినప్పుడు, “పరస్పరం ప్రోత్సాహపరచు”కొంటూ ఉండాలన్న విషయాన్ని మనస్సులో పెట్టుకోవాలని బైబిలు మనకు ఉద్బోధిస్తోంది. (హెబ్రీ. 10:24, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) అలా ఒకరినొకరు ప్రోత్సహించుకోవడమన్నది కూటాల్లో ప్రసంగాల ద్వారా వ్యాఖ్యానాల ద్వారా మాత్రమే కాక కూటాల ముందూ తర్వాతా మాట్లాడుకోవడం ద్వారా కూడా జరుగుతుంది.

మనం దైనందిన జీవితానికి సంబంధించిన విషయాలను గురించి మాట్లాడుకోవడం సాధారణమే అయినప్పటికీ ఆధ్యాత్మిక విషయాలను చర్చించడం ద్వారా ఎక్కువ ప్రోత్సాహం లభిస్తుంది. పవిత్ర సేవలో మనకు కలిగిన అనుభవాలు వాటి క్రిందికే వస్తాయి. ఒకరి మీద ఒకరు ఆరోగ్యకరమైన ఆసక్తిని చూపించడం కూడా క్షేమాభివృద్ధికరంగా ఉంటుంది.

మన చుట్టూ ఉన్న లోకపు ప్రభావాన్ని బట్టి జాగ్రత్తగా ఉండాలి. పౌలు ఎఫెసులోని క్రైస్తవులకు “మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను” అని వ్రాశాడు. (ఎఫె. 4:25) అబద్ధమాడడం మాని సత్యమునే మాట్లాడడంలో లోకం ప్రశంసించే విషయాల గురించీ అది ఆరాధించే వ్యక్తుల గురించీ గొప్పగా మాట్లాడకపోవడం కూడా ఉంది. అదేవిధంగా యేసు, “ధనమోసము [“ధనానికున్న మోసపూరిత శక్తి” NW]” గురించి హెచ్చరించాడు. (మత్త. 13:22) మనం ఒకరితోనొకరం మాట్లాడుకునేటప్పుడు, వస్తు సంపదలు బాగా ఉండడాన్ని గొప్ప విషయంగా మాట్లాడడం ద్వారా ధనానికున్న మోసపూరిత శక్తికి ప్రోద్బలమివ్వకుండా జాగ్రత్తపడాలి.—1తిమో. 6:9,10.

క్షేమాభివృద్ధికరంగా ఉండవలసిన అవసరం గురించి ఉపదేశిస్తూ ఒక సహోదరుడు “విశ్వాసము విషయమై బలహీనుడై”నందువల్ల, అంటే క్రైస్తవ స్వాతంత్ర్య విస్తృతిని ఆయన గ్రహించనందువల్ల కొన్నింటికి దూరంగా ఉంటుండవచ్చు. దాని గురించి ఆయనకు తీర్పుతీర్చడమో ఆయనను చిన్నబుచ్చడమో చేయవద్దని అపొస్తలుడైన పౌలు బోధిస్తున్నాడు. నిజానికి మన సంభాషణ ఇతరుల క్షేమాభివృద్ధికి తోడ్పడాలంటే మనం వాళ్ళ నేపథ్యాన్నీ వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎంత మేరకు ఎదిగారన్న దాన్నీ తప్పక పరిగణలోకి తీసుకోవాలి. ‘సహోదరునికి [లేదా సహోదరీకి] అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయడం’ ఎంత విచారకరమైన విషయం!—రోమా. 14:1-4,13,19.

గంభీరమైన వ్యక్తిగత సమస్యలతో పోరాడేవారు, ఉదాహరణకు ఎంతోకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నవారు క్షేమాభివృద్ధికరమైన సంభాషణను ఆనందంగా వింటారు. అలాంటి వ్యక్తి కూటాలకు హాజరు కావడానికి ఎంతో ప్రయత్నిస్తుండవచ్చు. ఆయన పరిస్థితి తెలిసినవారు, “ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది?” అని అడగవచ్చు. వాళ్ళకు తన మీదున్న శ్రద్ధను ఆయన తప్పకుండా మెచ్చుకుంటాడు. అయితే తన ఆరోగ్య పరిస్థితి ఎంతో ప్రోత్సాహాన్నిచ్చే చర్చనీయాంశంగా ఆయనకు అనిపించకపోవచ్చు. ప్రశంసాపూర్వకమైన మాటలే ఆయన హృదయానికి ఎక్కువ ఆనందాన్నిస్తుండవచ్చు. ఆయనకు యెహోవా మీద నిత్యముండే ప్రేమకూ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆయన చూపించే సహనానికీ రుజువులను మీరు చూస్తున్నారా? ఆయన వ్యాఖ్యానిస్తున్నప్పుడు మీరు ఎంతో ప్రోత్సాహాన్ని పొందుతున్నట్లు మీకు అనిపిస్తోందా? ఆయన పరిమితుల గురించి మాట్లాడే బదులు, ఆయన బలాల గురించీ సంఘంలో ఆయన తోడ్పడుతున్న విధం గురించీ మాట్లాడడమే ఆయనకు మరింత క్షేమాభివృద్ధికరంగా ఉండవచ్చా?—1థెస్స. 5:11.

మన సంభాషణ క్షేమాభివృద్ధికరంగా ఉండాలంటే, మనం చర్చిస్తున్న విషయంలో యెహోవా దృక్కోణమేమిటన్నది పరిగణలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రాచీన ఇశ్రాయేలులో, యెహోవా ప్రతినిధులకు వ్యతిరేకంగా మాట్లాడినవారూ మన్నా గురించి ఫిర్యాదులు చేసినవారూ దేవుని ఆగ్రహానికి గురయ్యారు. (సంఖ్యా. 12:1-16; 21:5,6) మనం వాళ్ళ ఉదాహరణల నుండి ప్రయోజనం పొందామన్న దానికి రుజువును మనం పెద్దలకు గౌరవమిచ్చినప్పుడు, నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడి తరగతి ద్వారా అందించబడుతున్న ఆధ్యాత్మిక ఆహారం పట్లున్న కృతజ్ఞతను కనబరచినప్పుడు ఇస్తాము.—1 తిమో. 5:17.

మనం మన క్రైస్తవ సహోదరులతో ఉన్నప్పుడు మాట్లాడడానికి ప్రయోజనకరమైన విషయాలను తెలుసుకోవడం ఒక సమస్యేమీ కాదు. అయినప్పటికీ ఎవరి మాటలైనా మరీ విమర్శించే ధోరణిలో ఉంటే, సంభాషణను క్షేమాభివృద్ధికరమైన దిశలోకి మళ్ళించేందుకు మీరే చొరవ తీసుకోండి.

మనం ఇతరులకు సాక్ష్యమిస్తున్నా వేదిక మీది నుండి మాట్లాడుతున్నా లేదా తోటి విశ్వాసులతో మాట్లాడుతున్నా “వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే” మన హృదయంలో నుండి వచ్చేలా వివేచనను చూపించుదాం.—ఎఫె. 4:29.