కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

36

చర్చాంశాన్ని విపులీకరించడం

చర్చాంశాన్ని విపులీకరించడం

అనుభవజ్ఞులైన ప్రసంగీకులకు ప్రసంగానికి ఒక అంశం ఉండడంలోని విలువ తెలుసు. వాళ్ళు ఒక ప్రసంగానికి సిద్ధపడుతున్నప్పుడు, నిర్దిష్ట సమాచారంపై దృష్టి కేంద్రీకరించి, దాని గురించి లోతుగా ఆలోచించేందుకు వారికది సహాయం చేస్తుంది. ఫలితంగా వాళ్ళు అనేక అంశాలను పైపైన చెప్పుకుపోయే బదులు, ఆ సమాచారాన్ని శ్రోతలకు మరింత ప్రయోజనకరమయ్యేలా విపులీకరిస్తారు. ఒక్కో ముఖ్యాంశం చర్చాంశానికి నేరుగా ముడిపడివుండి దాన్ని విపులీకరించడానికి సహాయపడుతున్నప్పుడు శ్రోతలు కూడా ఆ అంశాలను గుర్తుంచుకునేందుకూ వాటి ప్రాముఖ్యతను అర్థంచేసుకోవడానికీ అది దోహదపడుతుంది.

మీరు మాట్లాడవలసిన విషయమే మీ చర్చాంశం అని చెప్పవచ్చు, అయినప్పటికీ మీరు విషయాన్ని ఏ దృక్కోణంతో విపులీకరిస్తారో ఆ దృక్కోణాన్నే మీరు చర్చాంశంగా దృష్టించినప్పుడు మీ ప్రసంగాల నాణ్యత మెరుగుపడుతోందని మీరు గ్రహిస్తారు. రాజ్యం, బైబిలు, పునరుత్థానం అనేవి సాధారణ విషయాలు. ఈ విషయాల ఆధారంగా వైవిధ్యభరితమైన చర్చాంశాలను విపులీకరించవచ్చు. కొన్ని ఉదాహరణలు: “రాజ్యం నిజమైన ఒక ప్రభుత్వం,” “దేవుని రాజ్యం భూమిని పరదైసుగా చేస్తుంది,” “బైబిలు దైవప్రేరేపితం,” “బైబిలు మన కాలానికి ఆచరణాత్మకమైన మార్గదర్శి,” “పునరుత్థానం దుఃఖితులకు నిరీక్షణనిస్తుంది,” “హింసకు గురైనప్పుడు మనం స్థిరంగా ఉండడానికి పునరుత్థాన నిరీక్షణ మనకు సహాయపడుతుంది.” ఈ చర్చాంశాలన్నింటినీ పూర్తిగా భిన్నమైన పంథాల్లో విపులీకరించాలి.

యేసుక్రీస్తు తన భూ పరిచర్య కాలంలో చేసిన ప్రకటనా పని, బైబిలులోని ప్రముఖ చర్చాంశానికి పొందికగా, “పరలోకరాజ్యము సమీపించియున్నది” అన్న చర్చాంశాన్ని ప్రత్యేకంగా గుర్తించేలా చేసింది. (మత్త. 4:17) ఆ చర్చాంశం ఎలా విపులీకరించబడింది? నాలుగు సువార్తల్లో, 110 కన్నా ఎక్కువ సార్లు రాజ్యము గురించి పేర్కొనబడింది. అయితే యేసు “రాజ్యము” అన్న పదాన్ని మళ్ళీ మళ్ళీ ఉపయోగించడం కన్నా ఎక్కువే చేశాడు. వారి మధ్యవున్న తానే దేవుని కుమారుడననీ యెహోవా ఎవరికైతే రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడో ఆ మెస్సీయ తానేననీ ఆయన తన బోధనల ద్వారా తాను చేసిన అద్భుతాల ద్వారా స్పష్టం చేశాడు. ఇతరులు ఆ రాజ్యంలో భాగం వహించే మార్గం తన ద్వారా తెరవబడిందని కూడా యేసు చూపించాడు. ఆ ఆధిక్యత పొందే వ్యక్తి చూపించవలసిన గుణాలు ఏమిటో ఆయన తెలిపాడు. దేవుని రాజ్యం ప్రజల జీవితాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్నది ఆయన తన బోధనల ద్వారా తాను చేసిన శక్తివంతమైన కార్యాల ద్వారా స్పష్టం చేశాడు; తాను దేవుని ఆత్మ ద్వారా దయ్యాలను వెళ్ళగొట్టడం, తన శ్రోతల దగ్గరికి ‘దేవుని రాజ్యము వచ్చియున్నది’ అన్నదానికి రుజువుగా సూచించాడు. (లూకా 11:20) ఆ రాజ్యం గురించి సాక్ష్యమివ్వమనే యేసు తన అనుచరులకు ఆజ్ఞాపించింది.—మత్త. 10:7; 24:14.

సముచితమైన చర్చాంశాన్ని ఉపయోగించడం. ఒక చర్చాంశాన్ని బైబిలు విపులీకరిస్తున్నంత విస్తృతంగా మిమ్మల్ని విపులీకరించమని కోరడం లేదు, అంతమాత్రాన సముచితమైన చర్చాంశం ఉండడానికి తక్కువ ప్రాముఖ్యతేమీ లేదు.

చర్చాంశం ఎంపిక మీకే వదిలేయబడినట్లయితే, మొదట మీ అందింపు ఉద్దేశాన్ని పరిగణలోకి తీసుకోండి. సంక్షిప్త ప్రతిగా తయారయ్యే ముఖ్యాంశాలను ఎంపిక చేసుకునేటప్పుడు, అవి మీరు ఎంపిక చేసుకున్న చర్చాంశానికి నిజంగా మద్దతునిస్తున్నాయో లేవో నిశ్చయపరచుకోండి.

చర్చాంశం నియమించబడినట్లయితే, సమాచారం ఏ విధంగా విపులీకరించబడాలని ఆ చర్చాంశం సూచిస్తుందో జాగ్రత్తగా విశ్లేషించండి. అలాంటి చర్చాంశానికున్న విలువనూ శక్తినీ గ్రహించేందుకు కొంత ప్రయత్నం అవసరమవుతుండవచ్చు. మీకు నియమించబడిన చర్చాంశాన్ని విపులీకరించేందుకు సమాచారాన్ని ఎంపిక చేసుకుంటున్నట్లయితే, చర్చాంశంపై దృష్టి కేంద్రీకరించబడే విధంగా జాగ్రత్తగా ఎంపిక చేసుకోండి. మరొకవైపు సమాచారం మీకు ఇవ్వబడినా, దాన్ని చర్చాంశానికి పొందికగా ఉపయోగించడమెలాగో మీరు విశ్లేషించుకోవాలి. ఆ సమాచారం మీ ప్రేక్షకులకు ఎందుకు ముఖ్యమో మీరు దాన్ని అందించడంలో మీ లక్ష్యమేమిటో కూడా మీరు ఆలోచించుకోవాలి. మీ ప్రసంగంలో మీరు దేన్ని నొక్కిచెప్పాలో నిర్ణయించుకునేందుకు అది మీకు దోహదపడుతుంది.

చర్చాంశాన్ని ఎలా నొక్కి చెప్పాలి? చర్చాంశాన్ని సముచితమైన విధంగా నొక్కిచెప్పాలంటే మీరు సమాచారాన్ని ఎంపికచేసుకొని క్రమబద్ధంగా పొందుపరుచుకునేటప్పుడే పునాది వేసుకోవాలి. మీ చర్చాంశాన్ని బలపరిచే సమాచారాన్ని మాత్రమే ఉపయోగిస్తే మంచి సంక్షిప్త ప్రతిని తయారు చేసుకోవడంలో ఉన్న సూత్రాలను అనుసరిస్తే మీరు ఆ చర్చాంశాన్ని దాదాపుగా మీకు తెలియకుండానే నొక్కి చెప్పేస్తారు.

మళ్ళీ చెప్పడం, చర్చాంశానికి మరింత బలాన్నిచ్చేందుకు సహాయపడగలదు. పాశ్చాత్య శాస్త్రీయ సంగీతంలో ఒక రాగమే చర్చాంశం. ఆ రాగం, ఆ సంగీతంలో ఎంతగా పునరావృతమవుతూ ఉంటుందంటే, అది ఆ సంగీత రచన అంతటి ప్రత్యేకతగా గుర్తించబడుతుంది. అయితే అన్నిసార్లూ ఒకేవిధంగా పునరావృతం కాదు. కొన్నిసార్లు ఒకటో రెండో నొటేషన్స్‌ మాత్రమే పునరావృతమవుతాయి, అదే రాగం అప్పుడప్పుడు సూక్ష్మభేదంతో పునరావృతం కావచ్చు. అయినప్పటికీ ఆ రాగం ఏదో ఒకవిధంగా ఆ సంగీతరచన అంతటా పెనవేసుకుపోయేలా సంగీతాన్ని కూర్చే వ్యక్తి దాన్ని నైపుణ్యంతో కూర్చుతాడు. చర్చాంశం కూడా అదేవిధంగా ఉండాలి. చర్చాంశంలోని కీలక పదాలను మళ్ళీ మళ్ళీ చెప్పడం, సంగీత రచనలోని ఒక రాగం పునరావృతమవ్వడంలాంటిదే. చర్చాంశంలోని పదాల పర్యాయపదాలైనా వాటి సమానార్థక పదాలైనా చర్చాంశాన్ని వైవిధ్యభరితమైన విధంగా చెప్పడానికి సహాయపడతాయి. ఈ విధాల్లో మళ్ళీ మళ్ళీ చెప్పడం, మీ ప్రేక్షకులు చర్చాంశాన్ని ముఖ్యమైన విషయంగా గుర్తుంచుకునేలా చేస్తుంది.

ఈ సూత్రాలు వేదిక మీద నుండి ఇచ్చే ప్రసంగాలకు మాత్రమే కాక పరిచర్యలో చేసే చర్చలకు కూడా వర్తిస్తాయి. చిన్న సంభాషణల్లో, చర్చాంశం ప్రత్యేకంగా గుర్తించేటట్లుంటే అవి ఇంకా ఎక్కువ గుర్తుంటాయి. ఒక బైబిలు అధ్యయనంలో చర్చించబడుతున్న చర్చాంశం నొక్కి చెప్పబడితే ఇవ్వబడిన ఉపదేశం ఇంకా త్వరగా గుర్తుకువస్తుంది. తగిన చర్చాంశాలను ఎంపిక చేసుకొని విపులీకరించుకునేందుకు మీరు చేసే ప్రయత్నం, ఒక ప్రసంగీకుడిగా దేవుని వాక్యపు బోధకుడిగా మీ ప్రతిభను పెంచేందుకు ఎంతో తోడ్పడగలదు.