కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

40

చెబుతున్న వివరాలు ఖచ్చితమైనవిగా ఉండడం

చెబుతున్న వివరాలు ఖచ్చితమైనవిగా ఉండడం

ఒక క్రైస్తవుడు వాస్తవం కాని వివరాలను ఎందుకు చెబుతుండవచ్చు? ఆయన తాను విన్నది ఎంత వరకు వాస్తవమన్నది పరిశీలించడానికి సమయం తీసుకోకుండా అలా చెప్పేస్తుండవచ్చు. లేదా మూల సమాచారాన్ని తప్పుగా చదివానన్నది తాను గ్రహించక, ఒక విషయాన్ని మరీ పెంచి చెబుతుండవచ్చు. మనం చిన్న విషయాలనైనా సరే ఖచ్చితమైనదే చెప్పడానికి శ్రద్ధ చూపించినప్పుడు, మనం చెప్పే సందేశంలోని మరింత ప్రాముఖ్యమైన పార్శ్వాలు కూడా సత్యమే అయ్యుంటాయనీ తాము నమ్మవచ్చనీ మన శ్రోతలు గ్రహిస్తారు.

క్షేత్ర పరిచర్యలో. చాలామంది తాము ఇంకా ఎంతో నేర్చుకోవలసి ఉందని గ్రహించి, క్షేత్ర పరిచర్యను మొదలుపెట్టడానికి భయపడతారు. అయినప్పటికీ, తమకు సత్యం గురించిన ప్రాథమిక పరిజ్ఞానం మాత్రమే ఉన్నా తాము సమర్థవంతంగా సాక్ష్యమివ్వగలమని వాళ్ళు వెంటనే తెలుసుకొంటారు. అదెలా? సిద్ధపాటే దానికి కీలకం.

క్షేత్రసేవకు బయలుదేరడానికి ముందు మీరు చర్చించాలనుకుంటున్న విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని ఉండండి. మీ శ్రోతలు అడగగల ప్రశ్నలను ముందుగానే ఊహించుకోవడానికి ప్రయత్నించండి. సంతృప్తికరమైన బైబిలు ఆధారిత జవాబుల కోసం వెదకండి. ప్రశాంతమైన మనస్సుతో ఖచ్చితమైన జవాబులనిచ్చేందుకు అది మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. మీరు ఒక బైబిలు అధ్యయనాన్ని నిర్వహించబోతున్నారా? అధ్యయన సమాచారాన్ని మరొకసారి చూసుకోండి. ముద్రిత ప్రశ్నల జవాబులకు లేఖనాధారాన్ని మీరు తప్పక అర్థం చేసుకొని ఉండాలి.

ఒక గృహస్థుడు కానీ మీతోపాటు పనిచేస్తున్న వ్యక్తి కానీ మీరు జవాబు చెప్పడానికి సిద్ధంగా లేని ఒక ప్రశ్న అడిగితే ఎలా? దానికి సంబంధించిన వివరాలు మీకు ఖచ్చితంగా తెలియకపోతే, ఏదో ఊహించి చెబుదామని మీలో కలిగే బలమైన కోరికను ఎదిరించండి. “నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తర మిచ్చుటకు ప్రయత్నించును.” (సామె. 15:28) లేఖనముల నుండి తర్కించడం (ఆంగ్లం) లేదా “బైబిలు చర్చనీయాంశాలు” మీ భాషలో లభ్యమైతే వాటి నుండి మీరు సహాయం పొందవచ్చు. మీ దగ్గర ఈ రెండింటిలో ఏ ఒక్కటి కూడా లేకపోతే, మీరు పరిశోధన చేసి మళ్ళీ వచ్చి చెబుతానని చెప్పండి. ప్రశ్న అడిగిన వ్యక్తి నిజంగా తెలుసుకోవాలన్న కోరికతోనే అడిగినట్లయితే ఖచ్చితమైన జవాబు కోసం వేచివుండడానికి ఆయనకు అభ్యంతరమేమీ ఉండదు. వాస్తవానికి, మీ వినయాన్ని బట్టి ఆయనకు ఇంకా మంచి అభిప్రాయమే కలగవచ్చు.

అనుభవజ్ఞులైన ప్రచారకులతో క్షేత్ర పరిచర్య చేయడం, మీరు సత్యవాక్యమును సరిగా ఉపదేశించడంలో మీకున్న నైపుణ్యాన్ని పెంచుకునేందుకు మీకు సహాయపడగలదు. వాళ్ళు ఏ లేఖనాలను ఉపయోగిస్తున్నారో వాటి ఆధారంగా ఎలా తర్కిస్తున్నారో గమనించండి. వాళ్ళు ఇచ్చే సూచనలనైనా దిద్దుబాటునైనా వినయంగా స్వీకరించండి. ఆసక్తిగల శిష్యుడైన అపొల్లో ఇతరులు చేసిన సహాయం నుండి ప్రయోజనం పొందాడు. లూకా ఆయనను, ‘విద్వాంసుడు [“అనర్గళంగా మాట్లాడేవాడు” NW] లేఖనములయందు ప్రవీణుడు’ “ఆత్మయందు తీవ్రపడి[న]”వాడు, ‘యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి, బోధించుచు, సమాజమందిరములో ధైర్యముగా మాటలాడ నారంభించినవాడు’ అని చెప్పాడు. అయినప్పటికీ ఆయన అవగాహనలో ఏదో లోపించింది. ప్రిస్కిల్ల, అకుల అది గ్రహించినప్పుడు వారు “అతని చేర్చుకొని దేవునిమార్గము మరి పూర్తిగా [“ఇంకా సరిగ్గా,” NW] అతనికి విశదపరచిరి.”—అపొ. 18:24-28.

“నమ్మదగిన బోధను గట్టిగా చేపట్ట[డి].” ‘సత్యమునకు స్తంభముగా ఆధారముగా’ సంఘానికున్న పాత్రకు మనం ఎంతో ఎక్కువ విలువ ఇస్తున్నామన్నది కూటాల్లో మనం అందించే సమాచారం ప్రతిబింబించాలి. (1 తిమో. 3:15) సత్యాన్ని సమర్థించేందుకు, మనం ప్రసంగాల్లో ఉపయోగించాలనుకుంటున్న లేఖనాల భావాన్ని అర్థంచేసుకోవడం ముఖ్యం. ఆ లేఖనాల సందర్భాన్నీ ఉద్దేశాన్నీ పరిగణలోకి తీసుకోండి.

సంఘ కూటంలో మీరు చెప్పిన విషయాన్నే మళ్ళీ ఎవరైనా చెప్పవచ్చు. నిజమే, “అనేక విషయములలో మనమందరము తప్పిపోవుచున్నాము.” (యాకో. 3:2) కానీ తప్పులు లేకుండా మాట్లాడేందుకు దోహదపడే అలవాట్లను పెంపొందించుకోవడం ద్వారా మీరు ప్రయోజనం పొందుతారు. దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో చేరిన చాలామంది సహోదరులు, చివరికి పెద్దలవుతారు. అలాంటి బాధ్యత అప్పగించబడినవారి నుండి “ఎక్కువ” ఆశించబడుతుంది. (లూకా 12:48) ఒక పెద్ద, తప్పు సలహా ఇచ్చినందువల్ల సంఘ సభ్యులకు గంభీరమైన సమస్యలు వస్తే, ఆ పెద్ద దేవుని అప్రీతికి గురి కాగలడు. (మత్త. 12:36,37) ఒక పెద్దగా యోగ్యతగల సహోదరుడికి, “ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడు” అన్న పేరు ఉండాలి.—తీతు 1:9.

మీ వాదనలు లేఖనాధారమైన సత్యమంతటిలో కనిపిస్తున్న “ఆరోగ్యకరమైన పదాల నమూనా”కు పొందికగా ఉండేలా చూసుకోండి. (2 తిమో. 1:13, NW) దాని గురించి మీరు భయపడకూడదు. బహుశా మీరు బైబిలు మొత్తం చదవడం ఇంకా పూర్తిచేయాల్సివుండవచ్చు. పూర్తిచేయడానికి కృషి చేస్తూనే ఉండండి. అయితే ఈ లోగా, మీరు మీ బోధలో ఉపయోగించాలనుకుంటున్న సమాచారాన్ని విశ్లేషించేందుకు మీకు సహాయపడగల క్రింది సూచనలను గమనించండి.

మొదటిగా, ‘ఈ సమాచారం నేను బైబిలు నుండి ఇప్పటికే నేర్చుకున్నదానికి పొందికగా ఉందా? ఇది నా శ్రోతలను యెహోవాకు దగ్గరగా చేస్తుందా, లేక ఈ లోక జ్ఞానం చేత నడిపించబడేలా వారిని ప్రోత్సహిస్తూ, దాని గురించి గొప్పగా చెబుతోందా?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. “నీ వాక్యమే సత్యము” అని యేసు అన్నాడు. (యోహా. 17:17; ద్వితీ. 13:1-5; 1 కొరిం. 1:19-21) తర్వాత, నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు ఇచ్చిన అధ్యయన ఉపకరణాలను సద్వినియోగం చేసుకోండి. మీరలా చేయడం, లేఖనాలను సరిగ్గా అర్థం చేసుకోవడానికే కాక, సమతుల్యంగా సహేతుకంగా వాటిని అన్వయించుకునేందుకు కూడా మీకు సహాయపడతాయి. మీ ప్రసంగాలకు “ఆరోగ్యకరమైన పదాల నమూనా”ను ఆధారంగా చేసుకుంటే, లేఖనాలను వివరిస్తూ అన్వయించేటప్పుడు యెహోవా ఉపయోగించే మాధ్యమంపై ఆధారపడితే, మీరు చెప్పే వివరాలు ఖచ్చితమైనవిగా ఉంటాయి.

సమాచారం ఖచ్చితమైనదేనా అన్నది పరిశీలించడం. మీరు కొన్ని విషయాలను సోదాహరణంగా చెబుతున్నప్పుడు, అన్వయిస్తున్నప్పుడు ఇటీవలి సంఘటనలనూ ఉల్లేఖనాలనూ అనుభవాలనూ చేర్చడం సహాయకరంగా ఉండగలదు. అవి ఖచ్చితమైనవేనా అన్నది మీరు ఎలా రూఢిపరుచుకోవచ్చు? అలాంటివాటిని నమ్మదగిన మూలాల నుండి తీసుకోవడమే ఒక మార్గం. అది తాజా సమాచారమేనా అన్నది చూసుకోవాలని గుర్తుంచుకోండి. గణాంకాలు పాతబడిపోతాయి; విజ్ఞానశాస్త్రం క్రొత్త క్రొత్త విషయాలను అతివేగంగా కనిపెడుతోంది; చరిత్ర గురించిన ప్రాచీన భాషలను గురించిన అవగాహనలో మానవుడు ఎదుగుతున్న కొద్దీ ముందటి పరిజ్ఞానం ఆధారంగా చేరుకున్న నిర్ధారణలను మార్చుకోవడం అవసరం. మీరు వార్తాపత్రికలోని టీవీ, రేడియో, ఎలక్ట్రానిక్‌ మెయిల్‌ లేదా ఇంటర్‌నెట్‌లోని సమాచారాన్ని ఉపయోగించుకోవాలని అనుకుంటున్నట్లయితే మరెక్కువ జాగ్రత్తలు తీసుకోండి. “జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకియైనవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును” అని సామెతలు 14:15 ఉపదేశిస్తోంది. ‘ఈ సమాచార మూలానికి నమ్మదగినదన్న పేరుందా? ఈ సమాచారాన్ని మరితర విధాలుగా రూఢిపరుచుకోవచ్చా?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒక విషయం సత్యమో కాదో అన్న సందేహం మీకు కలిగితే, దాన్ని వదిలిపెట్టండి.

సమాచార మూలాలు నమ్మదగినవేనా అన్నది పరిశీలించడమే కాక, మీరు ఆ సమాచారాన్ని ఎలా ఉపయోగించుకోవాలనుకుంటున్నారో కూడా జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఒక మూలం నుండి మీరు తీసుకున్న ప్రశ్నలను గణాంకాలను మీరు ఏ ఉపయోగం కోసం వాటిని వాడుతున్నారో ఆ ఉపయోగం, మూలంలోని సందర్భంతో పొంతన కలిగివుండేలా చూడండి. మీరు మీ భావాలను శక్తివంతంగా వ్యక్తం చేసే ప్రయత్నంలో, “కొంతమంది” అన్నది “అధిక సంఖ్యాకులు” అని గానీ “చాలామంది” అన్నది “ప్రతి ఒక్కరు” అని గానీ “కొన్నిసార్లు” అన్నది “ఎల్లవేళలా” అని గానీ మార్చేయకుండా జాగ్రత్తపడండి. అంకెలు, విస్తృతి, గంభీరమైన విషయాలున్న నివేదికలను ఉన్నదానికన్నా పెంచి చెప్పినా, అతిశయంగా చెప్పినా అవి నమ్మదగినవేనా అన్న అనుమానం తలెత్తుతుంది.

మీరు ఎల్లప్పుడూ ఖచ్చితమైనవే చెబితే మీరు సత్యాన్ని గౌరవించే వ్యక్తిగా తెలియబడతారు. అది ఒక గుంపుగా యెహోవాసాక్షులను గురించి సదభిప్రాయం కలిగిస్తుంది. అంతకంటే ముఖ్యంగా, ‘సత్యదేవుడైన యెహోవాను’ ఘనపరుస్తుంది.—కీర్త. 31:5.