కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

49

దృఢమైన వాదనను వినిపించడం

దృఢమైన వాదనను వినిపించడం

మీరొక వ్యాఖ్యానం చేసిన తర్వాత, మీ శ్రోతలు “అది నిజమనడానికి కారణమేంటి? ఆయన చెప్పిన దాన్ని అంగీకరించాలనడానికి రుజువేమిటి?” అని ప్రశ్నించుకోవడం పూర్తిగా న్యాయమే. ఒక బోధకుడిగా మీరు అలాంటి ప్రశ్నలకు జవాబైనా ఇవ్వాలి లేదా వారు జవాబులు తెలుసుకోవడానికి వారికి సహాయమైనా చెయ్యాలి, అది మీ బాధ్యత. మీ వాదనకు ఆ విషయం ప్రాముఖ్యమైనదైతే, దాన్ని అంగీకరించడానికి మీరు గట్టి కారణాలు ఇచ్చేలా రూఢిపరచుకోండి. మీ మాటలు మరింత ఒప్పించేవిగా ఉండడానికి అది దోహదపడుతుంది.

అపొస్తలుడైన పౌలు ఒప్పించడమనే కళను ఉపయోగించాడు. గట్టి వాదనతో, సహేతుకమైన తర్కంతో, హృదయపూర్వక విన్నపంతో, ఆయన తానెవరితో మాట్లాడాడో వారి మనస్సుల్లో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించాడు. ఆయన మనకు మంచి మాదిరిని ఉంచాడు. (అపొ. 18:4; 19:8) కొందరు వాక్చాతుర్యంగల ప్రసంగీకులు మాత్రం ప్రజలను తప్పుదోవ పట్టించడానికి తమలోనున్న ఒప్పించే కళను ఉపయోగిస్తారు. (మత్త. 27:20; అపొ. 14:19; కొలొ. 2:4) వారు తప్పుడు ఊహపై ఆధారపడి ప్రారంభించవచ్చు, పక్షపాతంచూపే సమాచార మూలాలపై ఆధారపడవచ్చు, పసలేని వాదనలు చేయవచ్చు, తమ అభిప్రాయాన్ని విభేదించే వాస్తవాలను అలక్ష్యం చేస్తుండవచ్చు, లేదా తర్కానికన్నా భావోద్వేగాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తుండవచ్చు. అలాంటి పద్ధతులన్నింటికీ దూరంగా ఉండేలా మనం జాగ్రత్తపడాలి.

దేవుని వాక్యంపై దృఢంగా ఆధారపడివుండాలి. మనం ఏమి బోధించాలనుకుంటున్నామనేది మనంతట మనమే నిర్ణయించుకోకూడదు. మనం బైబిలు నుండి నేర్చుకున్న విషయాలను ఇతరులతో పంచుకోవడానికి కృషి చేస్తున్నాము. ఈ బోధనా పనిలో మనకు నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడి ప్రచురణలు ఎంతగానో సహాయం చేస్తాయి. ఈ ప్రచురణలు మనం లేఖనాలను జాగ్రత్తగా పరిశీలించాలని ప్రోత్సహిస్తాయి. ఫలితంగా మనం ఇతరులను బైబిలు వైపుకు నడిపిస్తాము, మనమే కరెక్ట్‌ అని నిరూపించే లక్ష్యంతో కాదు గానీ బైబిలు ఏమి చెబుతోందో స్వయంగా వారే తెలుసుకునేలా నమ్రతతో వారికి చూపించాలన్న తపనతోనే మనమలా నడిపిస్తాము. తన తండ్రికి చేసిన ప్రార్థనలో, “నీ వాక్యమే సత్యము” అని చెప్పిన యేసుక్రీస్తుతో మనం ఏకీభవిస్తాము. (యోహా. 17:17) భూమ్యాకాశముల సృష్టికర్తయైన యెహోవా దేవుడు తప్ప మరిగొప్ప అధికారం లేదు. మన వాదనల్లోని సత్తా అవి ఆయన వాక్యంపై ఆధారపడివున్నాయా లేదా అన్నదానిపై ఆధారపడివుంటుంది.

కొన్నిసార్లు మీరు బైబిలుతో పరిచయం లేని ప్రజలతో లేదా అది దేవుని వాక్యమని అంగీకరించని ప్రజలతో మాట్లాడుతుండవచ్చు. మీరు ఎప్పుడు ఎలా బైబిలు వచనాలను ప్రవేశపెట్టాలన్నది నిర్ణయించుకోవడంలో మంచి వివేచన ప్రదర్శించాల్సివుంటుంది. కానీ మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ అధికారిక మూలానికి వారి అవధానాన్ని ఆకర్షించడానికి కృషి చేయాలి.

మీరు చర్చిస్తున్న విషయానికి సంబంధించిన ఒక లేఖనాన్ని ఎత్తిచెబితే సరిపోతుందని, అది తిరస్కరించలేని వాదనను అందిస్తుందని మీరు నిర్ణయించుకోవాలా? అది సరిపోకపోవచ్చు. ఆ లేఖనం మీరు చెబుతున్నదానికి నిజంగానే మద్దతునిస్తుందని రుజువుచేయడానికి దాని సందర్భం వైపుకు వారి అవధానాన్ని మళ్ళించాల్సిన అవసరం ఉండవచ్చు. లేక మీరు ఒక లేఖనంలో కేవలం ఒక సూత్రాన్ని స్పష్టం చేయడానికి మాత్రమే ప్రయత్నిస్తుండవచ్చు. కానీ ఆ లేఖనం సందర్భం దాని గురించి చర్చించకపోతుండవచ్చు. అప్పుడు మరిన్ని ఎక్కువ రుజువులు అవసరం అవుతాయి. మీరు చెబుతున్నవి నిజంగానే లేఖనాలపై దృఢంగా ఆధారపడివున్నాయని మీ ప్రేక్షకులను సంతృప్తిపరచడానికి, ఆ విషయానికి సంబంధించిన మరితర లేఖనాలు మీరు ఉపయోగించాల్సిరావచ్చు.

ఒక లేఖనం రుజువుచేసే దానికన్నా మరీ ఎక్కువచేసి చెప్పకండి. దాన్ని జాగ్రత్తగా చదవండి. ఆ వచనం మీరు చర్చిస్తున్న విషయాన్ని మామూలుగా పేర్కొంటుండవచ్చు. అయినా మీ వాదన ఒప్పించేదిగా ఉండాలంటే మీ శ్రోతలు ఆ లేఖనంలో ఏ భాగం మీ వాదనను నిరూపిస్తోందో గ్రహించగలగాలి.

అదనపు రుజువుల మద్దతు. కొన్ని సందర్భాల్లో, లేఖనాల్లోని సహేతుకతను ప్రజలు అర్థంచేసుకోవడానికి బైబిలు కాకుండా ఒక నమ్మదగిన మూలం నుండి రుజువులను ఉపయోగించడం సహాయకరంగా ఉండవచ్చు.

ఉదాహరణకు, ఒక సృష్టికర్త ఉన్నాడనడానికి రుజువుగా దృశ్య విశ్వాన్ని చూపించవచ్చు. గురుత్వాకర్షణ శక్తి వంటి ప్రకృతి నియమాలను పేర్కొంటూ, అలాంటి నియమాలు ఉండడం ఆ నియమాలకు కర్త ఉన్నాడనే చూపిస్తున్నాయని మీరు తర్కించవచ్చు. మీ తర్కం దేవుని వాక్యంలో చెప్పబడినదానికి పొందికగా ఉంటేనే అది సరైనదిగా ఉంటుంది. (యోబు 38:31-33; కీర్త. 19:1; 104:24; రోమా. 1:20) బైబిలు చెబుతున్న విషయాలు, మనం గమనించగల వాస్తవాలతో పొందికగా ఉన్నాయని అలాంటి రుజువులు నిరూపిస్తాయి గనుక అవి సహాయకరంగా ఉంటాయి.

బైబిలు నిజంగానే దేవుని వాక్యమని గ్రహించేందుకు మీరెవరికైనా సహాయంచేయడానికి ప్రయత్నిస్తున్నారా? అది దేవుని వాక్యమని చెప్పే విద్వాంసుల మాటల్ని మీరు ఉల్లేఖించవచ్చు, కానీ అవే ఆ విషయాన్ని రుజువు చేస్తాయా? అలాంటి ఉల్లేఖనాలు ఆ విద్వాంసులను గౌరవించే ప్రజలకు మాత్రమే సహాయకరంగా ఉంటాయి. బైబిలు సత్యమని రుజువు చేయడానికి మీరు విజ్ఞానశాస్త్రాన్ని ఉపయోగించగలరా? అపరిపూర్ణులైన శాస్త్రజ్ఞుల అభిప్రాయాలే మీ అధికారిక మూలంగా ఉపయోగించాలనుకుంటే మీరు దృఢంగాలేని పునాదిపై భవంతి కడుతున్నారన్నమాటే. మరోవైపు, మీరు దేవుని వాక్యంతో ప్రారంభించి, ఆ తర్వాత బైబిలు ఖచ్చితత్వాన్ని నొక్కిచెప్పే విజ్ఞానశాస్త్రంలోని ఆవిష్కరణలు పేర్కొంటే మీ వాదనలకు దృఢమైన పునాది లభిస్తుంది.

మీరు రుజువు చేయాలని ప్రయత్నిస్తున్నదేదైనా సరే దానికి సరిపడేన్ని రుజువులు చూపించండి. ఎన్ని రుజువులు కావాలన్నది మీ ప్రేక్షకులపై ఆధారపడివుంటుంది. ఉదాహరణకు మీరు 2 తిమోతి 3:1-5 వచనాల్లో వర్ణించబడిన అంత్యదినముల గురించి చర్చిస్తున్నట్లైతే, ప్రజలు “అనురాగరహితులు”గా ఉన్నారని సూచించే బాగా తెలిసిన ఒక వార్తా నివేదికను మీ ప్రేక్షకులకు చూపించవచ్చు. అంత్యదినముల సూచనలోని ఈ అంశం ప్రస్తుతం నెరవేరుతోందని రుజువుచేయడానికి ఆ ఒక్క నివేదిక సరిపోతుండవచ్చు.

సామ్యం చూపించడం, అంటే ఏవైనా రెండు వేర్వేరు విషయాల్లో కొన్ని ప్రముఖమైన అంశాలు ఒకేలా ఉంటే వాటిని చూపించడం తరచు సహాయకరంగా ఉండగలదు. సామ్యం చూపించడం మాత్రమే రుజువులు అందించినట్లు కాదు; దాని విలువను బైబిలు చెప్పేదానితో పరీక్షించి చూడాల్సివుంటుంది. కానీ అలా సామ్యం చూపించడం అవతలి వ్యక్తి ఒకానొక తలంపు ఎంత సహేతుకమైనదో గ్రహించడానికి దోహదపడవచ్చు. ఉదాహరణకు, మీరు దేవుని రాజ్యం ఒక ప్రభుత్వం అని వివరించేటప్పుడు ఇలాంటి సామ్యాన్ని ఉపయోగించవచ్చు. మానవ ప్రభుత్వాల్లోలాగే దేవుని రాజ్యంలో పరిపాలకులు, ప్రజలు, శాసనాలు, న్యాయ వ్యవస్థ, విద్యా వ్యవస్థ ఉంటాయని మీరు వివరించవచ్చు.

బైబిలు సలహాలను అన్వయించుకోవడం ఎంత జ్ఞానయుక్తమో ప్రదర్శించేందుకు నిజజీవిత అనుభవాలను తరచుగా ఉపయోగించవచ్చు. మీరు చేసిన వ్యాఖ్యానాలకు మద్దతుగా వ్యక్తిగత అనుభవాలు కూడా చెప్పవచ్చు. ఉదాహరణకు బైబిలు చదవాల్సిన, అధ్యయనం చేయాల్సిన ప్రాముఖ్యాన్ని గురించి మీరు ఒక వ్యక్తికి వివరిస్తున్నట్లైతే, అలా చేయడం ద్వారా మీ జీవితం ఎలా మెరుగుపడిందో వివరించవచ్చు. తన సహోదరులను ప్రోత్సహించడానికి అపొస్తలుడైన పేతురు తను ప్రత్యక్షసాక్షిగా ఉన్న రూపాంతరం గురించి పేర్కొన్నాడు. (2 పేతు. 1:16-18) పౌలు కూడా తన స్వీయానుభవాలను పేర్కొన్నాడు. (2 కొరిం. 1:8-10; 12:7-9) అయితే ఒక్క మాట, మీవైపు అనుచితమైన అవధానాన్ని ఆకట్టుకోకుండా ఉండడానికిగాను వ్యక్తిగత అనుభవాలు తక్కువగా ఉపయోగించాలి.

ప్రజల నేపథ్యాలు ఆలోచనలు వేర్వేరుగా ఉంటాయి గనుక, ఒక వ్యక్తిని ఒప్పించిన సాక్ష్యాధారాలు మరో వ్యక్తికి సంతృప్తికరంగా ఉండకపోవచ్చు. కాబట్టి ఎలాంటి వాదనలు వినిపించాలో, వాటిని మీరెలా అందించాలో నిర్ణయించుకునేటప్పుడు మీ శ్రోతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోండి. సామెతలు 16:23 ఇలా చెబుతోంది: “జ్ఞానుని హృదయము వానినోటికి తెలివి కలిగించును, వాని పెదవులకు విద్య విస్తరింపజేయును [“అతడు చెప్పే మాటలు మంచివి, వినదగినవి,” ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌].”