32
నిశ్చయతతో చెప్పడం
ఒక వ్యక్తి నిశ్చయతతో మాట్లాడుతున్నప్పుడు తాను చెబుతున్న దాన్ని ఆయన గట్టిగా నమ్ముతున్నాడని ఇతరులు గ్రహిస్తారు. అలాంటి నిశ్చయత అపొస్తలుడైన పౌలు పరిచర్యలో స్పష్టంగా కనిపించింది. “మా సువార్త, మాటతో మాత్రముగాక . . . సంపూర్ణ నిశ్చయతతోను మీయొద్దకు వచ్చియున్న[ది]” అని ఆయన థెస్సలొనీకలోని విశ్వాసులకు వ్రాశాడు. (1 థెస్స. 1:4,5) ఆ నిశ్చయత ఆయన మాట తీరులోనూ ఆయన జీవన విధానంలోనూ స్పష్టంగా కనిపించింది. మనం ఇతరులకు బైబిలు సత్యాలను తెలియజేసే విధానంలో కూడా ఆ సంపూర్ణ నిశ్చయత స్పష్టంగా కనిపించాలి.
నిశ్చయతను వ్యక్తం చేయడమంటే తన సొంత అభిప్రాయాలనే అంటిపెట్టుకొని ఉండడమో తగిన రుజువులు లేకపోయినప్పటికీ కొన్ని విషయాలను గట్టిగా నమ్మడమో తన గురించి తాను అతిశయంగా భావించడమో కాదు. నిశ్చయతను కనబరిచే వ్యక్తి దేవుని వాక్యం చెబుతున్న విషయాలను గురించి మాట్లాడుతున్నప్పుడు దృఢమైన విశ్వాసాన్ని వ్యక్తపరిచే విధంగా మాట్లాడతాడు.—హెబ్రీ. 11:1.
నిశ్చయతను వ్యక్తం చేసే సందర్భాలు. మీరు క్షేత్రసేవ చేసేటప్పుడు నిశ్చయతతో మాట్లాడడం ముఖ్యం. తరచూ ప్రజలు మీరు చెప్పే సందేశాన్ని ఎంతగా విశ్లేషిస్తారో మీ మాట తీరును కూడా అంతే విశ్లేషిస్తారు. మీరు చెబుతున్న విషయం గురించి అసలు మీరు ఎలా భావిస్తున్నారో వాళ్ళు గ్రహిస్తారు. మీ దగ్గర పంచుకోవడానికి ఎంతో విలువైన సమాచారం ఉందన్న విషయాన్ని, కేవలం మీ మాటల కన్నా శక్తివంతంగా మీ నిశ్చయతే తెలియజేయగలదు.
మీరు తోటివిశ్వాసుల సభలో మాట్లాడేటప్పుడు కూడా నిశ్చయతను వ్యక్తం చేయడం అవసరం. అపొస్తలుడైన పేతురు ప్రేరేపితుడై తన మొదటి లేఖను వ్రాసింది ‘ప్రోత్సహించాలి, ఇది దేవుని యథార్థమగు అనుగ్రహమని సాక్ష్యమివ్వాలి’ అన్న ఉద్దేశంతోనే. ‘మీరు దృఢముగ నిలిచి ఉండండి’ అని కూడా ఆయన ఆ లేఖలో వ్రాశాడు. (1 పేతు. 5:12, పవిత్ర గ్రంథము, క్యాతలిక్ అనువాదము) అపొస్తలుడైన పౌలు రోములోని సంఘానికి వ్రాస్తూ వ్యక్తం చేసిన నిశ్చయత వల్ల వారికి ప్రయోజనం కలిగింది. “మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవియైనను రాబోవునవియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తుయేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను” అని ఆయన వ్రాశాడు. (రోమా. 8:38,39) ఇతరులకు బోధించవలసిన అవసరం గురించి ఒప్పించే విధంగా కూడా ఆయన వ్రాశాడు. బోధనా పనిలో ఆయన చూపించిన ఆసక్తి, ఆ పని ఎంతో ప్రాముఖ్యమైనదని తాను స్వయంగా నమ్ముతున్నాడన్నదానికి స్పష్టమైన రుజువునిచ్చింది. (అపొ. 20:18-21; రోమా. 10:9,13-15) నేడు క్రైస్తవ పెద్దలు కూడా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అలాంటి నిశ్చయతను వ్యక్తపరచాలి.
తల్లిదండ్రులు అధ్యయన వేళల్లోనూ మిగతా సమయాల్లోనూ తమ పిల్లలతో ఆధ్యాత్మిక విషయాలను చర్చించేటప్పుడు తమ నిశ్చయతను వ్యక్తం చేస్తూ మాట్లాడాలి. అలా వ్యక్తం చేయాలంటే, తల్లిదండ్రులు తమ సొంత హృదయాల్లో దేవుని మీదా ఆయన మార్గాల మీదా ప్రేమను అలవరుచుకోవాలి. అప్పుడు వాళ్ళు తమ పిల్లలతో హృదయపూర్వకమైన నిశ్చయతతో మాట్లాడగలుగుతారు. “హృదయము నిండియుండు దానినిబట్టి యొకని నోరు మాటలాడును” కదా. (లూకా 6:45; ద్వితీ. 6:5-7) అలాంటి నిశ్చయత “నిష్కపటమైన విశ్వాసము”తో ఉంటూ మంచి మాదిరినుంచేందుకు కూడా తల్లిదండ్రులను ప్రేరేపిస్తుంది.—2 తిమో. 1:3-5.
ముఖ్యంగా మీ విశ్వాసం ప్రశ్నించబడినప్పుడు, మీరు నిశ్చయతను వ్యక్తం చేయడం చాలా ముఖ్యం. మీరు ఒకానొక పండుగ చేసుకోనందుకు మీ తోటి విద్యార్థి గానీ ఒక ఉపాధ్యాయుడు గానీ మీతోపాటు కలిసి పనిచేస్తున్న వ్యక్తి గానీ ఆశ్చర్యాన్ని వెలిబుచ్చవచ్చు. నిశ్చయతతో కూడిన తర్కబద్ధమైన జవాబు, మీ బైబిలు ఆధారిత దృఢ నిర్ణయానికి ఆయన గౌరవమిచ్చేందుకు సహాయపడవచ్చు. తప్పుడు నడవడికి పాల్పడేందుకు, అంటే నిజాయితీ లేకుండా ప్రవర్తించడానికీ మాదకద్రవ్యాల అలవాటుకూ లేదా అనైతిక లైంగిక సంబంధాలు పెట్టుకోవడానికీ మిమ్మల్ని ప్రలోభపెట్టాలని ఎవరైనా ప్రయత్నిస్తే అప్పుడెలా? మీరు అలాంటి పని ససేమిరా చేయరనీ మిమ్మల్ని ఒప్పించేందుకు చేసే ప్రయత్నాలేవీ కూడా మీరు మీ మనస్సు మార్చుకునేలా చేయలేవనీ స్పష్టం చేయడం ముఖ్యం. అలా స్పష్టం చేయాలంటే, మీరు వాళ్ళ ప్రతిపాదనను తిరస్కరించేటప్పుడు నిశ్చయతతో మాట్లాడాలి. పోతీఫరు భార్య తనతో అనైతిక సంబంధం పెట్టుకోవడానికి తన ముందుకు వస్తుంటే అందుకు నిరాకరిస్తూ “నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందు[ను?]” అని యోసేపు దృఢంగా అన్నాడు. ఆమె పట్టువదలనప్పుడు ఆయన ఆ ఇంటి నుండి పారిపోయాడు.—ఆది. 39:9,12.
నిశ్చయత ఎలా వెల్లడవుతుంది? మీరు ఉపయోగించే పదాలు మీ నిశ్చయతను తెలియజేయడానికి ఎంతో తోడ్పడగలవు. అనేక సందర్భాల్లో యేసు ప్రాముఖ్యమైన వ్యాఖ్యలను చేసేటప్పుడు, “నిశ్చయముగా చెప్పుచున్నాను” అని అన్నాడు. (యోహా. 3:3,5,11; 5:20,24,25) “రూఢిగా నమ్ముచున్నాను,” “నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను,” “నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు” అని పౌలు అన్న మాటల్లో ఆయన నిశ్చయత ప్రతిబింబిస్తోంది. (రోమా. 8:38,39; 14:14; 1 తిమో. 2:7) యెహోవా తన వాక్యపు నెరవేర్పు గురించి చెబుతూ, “అది తప్పక జరుగును” వంటి నొక్కిచెప్పే వ్యాఖ్యలు చేయడానికి కొన్నిసార్లు తన ప్రవక్తలను ప్రేరేపించాడు. (హబ. 2:3) మీరు ఈ ప్రవచనాలను సూచిస్తున్నప్పుడు అటువంటి మాటలను ఉపయోగించవచ్చు. మీరు మీమీద కాక యెహోవా మీద నమ్మకముంచితే ఇతరులతో గౌరవపూర్వకంగా మాట్లాడితే అలాంటి నిశ్చయతను ప్రతిబింబించే మాటలు మీకు బలమైన విశ్వాసముందని రుజువునిస్తాయి.
మీ మాటల్లో నిజాయితీ ధ్వనించడం ద్వారా మీ మాటల తీవ్రత ద్వారా కూడా నిశ్చయతను వ్యక్తం చేయవచ్చు. మీ ముఖ కవళికలూ మీ సంజ్ఞలూ మీ శరీర కదలికల్లోని భావాలూ ఇవన్నీ కూడా నిశ్చయతను వ్యక్తం చేయడానికి తోడ్పడవచ్చు, కాకపోతే అందరి ముఖ కవళికలూ సంజ్ఞలూ భావాలను వ్యక్తం చేసే కదలికలూ ఒకేలా ఉండకపోవచ్చు. మీరు బిడియస్థులైనా సహజంగా మృదుభాషియైనా కూడా మీరు చెబుతున్నది సత్యమనీ ఇతరులు దాన్ని వినవలసిన అవసరముందనీ మీకు పూర్తిగా నమ్మకం ఉన్నప్పుడు మీ నిశ్చయత స్పష్టంగా కనిపిస్తుంది.
నిజమే, మనం వ్యక్తం చేసే నిశ్చయత హృదయపూర్వకమైనదై ఉండాలి. మనం హృదయపూర్వకంగా మాట్లాడడం లేదనీ కేవలం అలా నటిస్తున్నామనీ ప్రజలు గ్రహిస్తే మనం చెప్పే సందేశంలో బలమేమీ లేదన్న నిర్ధారణకు వాళ్ళు వచ్చే అవకాశముంది. కాబట్టి అన్నింటికంటే ముఖ్యంగా, సహజంగా ఉండండి. మీ శ్రోతలు ఎంతమంది ఉన్నారు అన్నదాన్ని బట్టి మీరు మామూలు కన్నా బిగ్గరగా గానీ ఉత్సాహంగా గానీ మాట్లాడడం అవసరం కావచ్చు. అయితే మీరు చెప్పాలనుకుంటున్న విషయాన్ని హృదయపూర్వకంగా సహజంగా చెప్పాలన్నదే మీ లక్ష్యమై ఉండాలి.
నిశ్చయతను వ్యక్తం చేసేందుకు సహాయకాలు. మీ నిశ్చయతలో మీరు చెప్పే సమాచారంపై మీకున్న భావాలు కూడా మిళితమై ఉన్నాయి గనుక మంచి సిద్ధపాటు చాలా ముఖ్యం. ఒక ప్రచురణ నుండి సమాచారాన్ని కాపీ చేసుకొని దాన్ని అప్పజెప్పేస్తే సరిపోదు. సమాచారాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకొని దాన్ని మీ సొంత మాటల్లో చెప్పగలగాలి. అది సత్యము, మీరు చెప్పబోతున్న విషయం మీ శ్రోతలకు ఎంతో విలువైనది అన్న సంపూర్ణ నిశ్చయత మీకుండాలి. అంటే మీరు మీ అందింపును తయారు చేసుకునేటప్పుడే మీరు వాళ్ల పరిస్థితుల గురించీ అలాగే మీరు చెప్పబోతున్న విషయం గురించీ వాళ్ళకు ఇప్పటికే ఏమి తెలుసు లేదా వాళ్ళు దాని గురించి ఎలా భావిస్తుండవచ్చు అన్నవి పరిగణలోకి తీసుకోవాలి.
మనం అనర్గళంగా మాట్లాడినప్పుడు ఇతరులు మన నిశ్చయతను ఇంకా సులభంగా గ్రహిస్తారు. కాబట్టి మంచి సమాచారాన్ని సిద్ధం చేసుకోవడమే కాకుండా, మీరు దాన్ని చక్కగా అందించడానికి కృషి చేయండి. హృదయపూర్వకంగా చెప్పవలసిన అవసరత ఎక్కువవున్న సమాచారపు భాగాలకు ప్రత్యేక శ్రద్ధనివ్వండి, అలాగైతే మీరు వాటిని పదేపదే నోట్సు చూడకుండా ప్రసంగించగలుగుతారు. మీ ప్రయత్నాలను ఆశీర్వదించమని యెహోవాకు ప్రార్థించాలని కూడా గుర్తుంచుకోండి. ఈ విధంగా మీరు చెప్పే సందేశపు సత్యత్వాన్ని గురించీ ప్రాముఖ్యత గురించీ మీ నిశ్చయతను ప్రతిబింబించేలా మాట్లాడడానికి “మన దేవునియందు ధైర్యము తెచ్చు”కుంటారు.—1 థెస్స. 2:2.