కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

2

పదాలను స్పష్టంగా పలకడం

పదాలను స్పష్టంగా పలకడం

మీరు సమర్థవంతంగా భావాలను వ్యక్తం చేయాలంటే స్పష్టంగా మాట్లాడడం తప్పనిసరి. మీరు చెప్పాలనుకున్న విషయం ఆసక్తికరమైనది కావచ్చు, ప్రాముఖ్యమైనది కూడా కావచ్చు, కానీ మీరు చెప్పే మాటలు సులభంగా అర్థమయ్యే విధంగా లేకపోతే మీ మాటల భావం సరిగా అర్థంకాక, చాలా మట్టుకు ప్రయోజనం లేకుండా పోతుంది.

అసలు అర్థం కాని ప్రసంగం ప్రజలను పురికొల్పదు. ఒక వ్యక్తి స్వరం బలంగా ఉన్నప్పటికీ అది సులభంగా వినబడేదైనప్పటికీ ఆయన గబగబా చెప్పుకుపోతే ఆయన చెప్పిన మాటలు ఇతరులను క్రియాశీలురయ్యేలా కదిలించవు. ఆయన మాటలు శ్రోతలకు అర్థం కాని భాషలో మాట్లాడినట్లుంటాయి. (యిర్మీ. 5:15) “బూర స్పష్టముకాని ధ్వని ఇచ్చునప్పుడు యుద్ధమునకెవడు సిద్ధపడును? ఆలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనేగాని పలికినది ఏలాగు తెలియును? మీరు గాలితో మాటలాడు చున్నట్టుందురు” అని బైబిలు మనకు గుర్తుచేస్తోంది.—1 కొరిం. 14:8,9.

మాటలను అస్పష్టం చేసేదేమిటి? నోరు సరిగ్గా తెరవకపోవడమే అస్పష్టతకు కారణం కావచ్చు. దవడ కండరాలు బిగబట్టినట్లుండడం వల్ల పెదవులు అరుదుగా కదులుతుండడం వల్ల మాటలు తగ్గుస్వరంలో రావచ్చు, అంత స్పష్టంగా ఉండకపోవచ్చు.

మరీ వేగంగా మాట్లాడడం వల్ల కూడా అర్థం చేసుకోవడం కష్టం కావచ్చు. అది, ఒక క్యాసెట్‌ని మామూలు స్పీడు కన్నా ఎక్కువ స్పీడుతో వినిపించినట్లు ఉంటుంది. మాటలు వినపడినా ఎక్కువ ప్రయోజనం ఉండదు.

కొందరి స్వర అవయవాల నిర్మాణంలోని లోపమే వారి మాటలు అస్పష్టంగా ఉండడానికి కారణం కావచ్చు. అయితే ఇలాంటి సమస్యను అధిగమించవలసినవారు కూడా ఈ అధ్యయనంలో ఇవ్వబడిన సూచనలను పాటించడానికి బాగా కృషి చేయడం ద్వారా మెరుగుపడవచ్చు.

అయితే తరచూ మాటలు అస్పష్టంగా ఉండడానికి కారణం మధ్యలో ఎక్కడా ఆగకుండా గబగబా చెప్పుకుపోవడమే కావచ్చు. అలా చెప్పిన మాటలను అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. పదాంశాలనో ప్రాముఖ్యమైన అక్షరాలనో వదిలిపెట్టడం లేదా పదాల్లోని చివరి అక్షరాలను మ్రింగివేయడం కూడా సమస్యకు కారణం కావచ్చు. ఒక వ్యక్తి, ఒక్కో పదానికున్న సంబంధాన్ని పట్టించుకోకుండా అన్నింటినీ కలగలిపి గబగబా చదివేస్తే ఆయన శ్రోతలు కొన్ని తలంపులను, పదబంధాలను గ్రహించగలిగినా మిగతా వాటిని ఊహించుకోవలసి వస్తుంది. ఎవరైనా పదాలను స్పష్టంగా పలకకపోతే వారి బోధ అంత ప్రభావితంగా ఉండదు.

స్పష్టంగా మాట్లాడడమెలా? మాటలను స్పష్టంగా పలకడానికి గల కీలక మార్గాల్లో ఒకటి, మీ భాషలోని పదాల నిర్మాణాన్ని అర్థం చేసుకోవడమే. దాదాపు అన్ని భాషల్లోనూ పదాలు పదభాగాలతో నిర్మించబడతాయి. ఒక పదభాగంలో ఒక అక్షరం గానీ ఒకటికన్నా ఎక్కువ అక్షరాలు గానీ ఉంటాయి. మీరు అలాంటి భాష మాట్లాడేటప్పుడు ఒక్కో పదభాగాన్ని ఉచ్చరిస్తారు, కాకపోతే అన్ని పదభాగాలను ఒకే స్థాయిలో నొక్కి పలకరు. మీరు స్పష్టంగా మాట్లాడడంలో మెరుగుపడాలంటే, ప్రతి పదభాగాన్ని నెమ్మదిగా స్పష్టంగా పలకడానికి శాయశక్తులా ప్రయత్నించండి. మొదట్లో ఒక్కొక్క పదభాగాన్నీ అవసరానికి మించి నొక్కిపలుకుతున్నట్లు అనిపించవచ్చు, కానీ మీరు అభ్యసిస్తున్న కొద్దీ అనర్గళంగా మాట్లాడడం నెమ్మదిగా మొదలుపెడతారు. మీరు అనర్గళంగా మాట్లాడేందుకు, కొన్ని పదాలను కలిపి పలుకుతారనడంలో సందేహం లేదు. అయితే ఏవైనా పదాలను కలిపి చదివితే భావం అస్పష్టమయ్యే ప్రమాదముంటే అలాంటి పదాలను కలిపి పలకకుండా జాగ్రత్తపడాలి.

ఒక హెచ్చరికా మాట: మీరు పదాలను స్పష్టంగా పలకడం అలవాటు చేసుకునేందుకు, మరీ నిర్దుష్టంగా మాట్లాడడాన్నీ చదవడాన్నీ అభ్యసించవచ్చు. కానీ, అలా మరీ నిర్దుష్టంగా నొక్కిపలకడమనేది మీరు మాట్లాడే విధానంగా మారకుండా జాగ్రత్తపడండి. అలా మారితే మీ మాటలు కృత్రిమంగాను, అసహజంగాను ఉంటాయి.

మీ మాటలు తగ్గుస్వరంలో ఉండి, అంత స్పష్టంగా లేకపోతే మీ తలను పైకి ఎత్తి మీ గడ్డాన్ని మీ ఛాతీకి దూరంగా ఉంచడం నేర్చుకోండి. బైబిలు చదువుతున్నప్పుడు దాన్ని ఎత్తిపట్టుకోండి, అప్పుడు మీరు మీ దృష్టిని ప్రేక్షకుల నుండి మీ బైబిలు వైపుకు సారించేందుకు కొంచెం క్రిందకు చూస్తే సరిపోతుంది. అప్పుడు మీ మాటలు నిరాటంకంగా వచ్చేందుకు వీలవుతుంది.

కండరాల బిగువును సడలించుకోవడాన్ని నేర్చుకోవడం ద్వారా కూడా మాట్లాడే విధానాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ముఖ కండరాల్లో బిగువు లేదా శ్వాసను నియంత్రించే కండరాల్లో బిగువు, మాట్లాడే ప్రక్రియపై ప్రతికూల ప్రభావాన్ని చూపగలవన్నది తెలిసిన విషయమే. మీ మెదడుకు, స్వర అవయవాలకు, శ్వాస నియంత్రణకు మధ్య సాఫీగా సహజంగా జరగవలసిన సమన్వయానికి కండరాల బిగువు ఆటంకమవుతుంది.

మెదడు నుండి వచ్చే ఆదేశాలకు దవడ కండరాలు వెంటనే ప్రతిస్పందించాలంటే వాటిని సడలించడం అవసరం. పెదవులను బిగబట్టకుండా వదులుగా ఉంచాలి. నోట్లోను గొంతులోను పుట్టే అనేక శబ్దాలు నోటి వెలుపలికి రావడానికి వీలుగా పెదవులు వెంటవెంటనే సంకోచించేందుకూ వ్యాకోచించేందుకూ సిద్ధంగా ఉండాలి. దవడలనూ పెదవులనూ బిగబట్టి ఉంచితే నోరు సరిగ్గా తెరుచుకోదు, అప్పుడు శబ్దం పళ్ళ మధ్య నుండి రావలసి వస్తుంది. పర్యవసానంగా మాటలు ముద్దముద్దగాను అస్పష్టంగాను అర్థం కాకుండాను ఉంటాయి. దవడలను పెదవులను బిగబట్టకుండా వదులుగా ఉంచడమంటే నిర్లక్ష్యంగా మాట్లాడడం అలవాటు చేసుకొమ్మని కాదు. మాటలు స్పష్టంగా ఉండేలా వాటి శబ్దాలు గొంతులో పుట్టే విధంగా మరీ బిగబట్టకుండా మరీ వదులుగా ఉంచకుండా సమతుల్యంగా ఉంచాలి.

మీరు మీ పరిస్థితిని విశ్లేషించుకుంటే గట్టిగా చదవడం సహాయకరంగా ఉంటుందని గ్రహించవచ్చు. అద్భుతమైన మీ స్వర అవయవాలను మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారో జాగ్రత్తగా పరీక్షించుకోండి. మాటల శబ్దం నిరాటంకంగా బయటికి వచ్చేందుకు మీరు మీ నోటిని సరిపడేంత తెరుస్తున్నారా? అత్యధికంగా పనిచేస్తున్నవాటిలో మీ నాలుక ఒకటైనప్పటికీ, కేవలం అది మాత్రమే స్వర అవయవం కాదని మీరు గుర్తుంచుకోవాలి. మెడ దవడలు, పెదవులు, ముఖ కండరాలు గొంతు కండరాలు ఇవన్నీ కూడా మాట్లాడడంలో పాత్ర వహిస్తాయి. మీరు మాట్లాడుతున్నప్పుడు, మీ ముఖంలో ఎటువంటి కదలికలు లేకుండా మాట్లాడుతున్నట్లు ఉందా? అలాగైతే మీ మాటలు అస్పష్టంగా ఉండే అవకాశం చాలా ఉంది.

టేప్‌ రికార్డర్‌ మీకు అందుబాటులో ఉంటే, మీరు పరిచర్యలో ఉన్నప్పుడు ఎవరైనా ఒకరితో సహజంగా ఎలా మాట్లాడతారో అలా మాట్లాడుతూ మీ స్వరాన్ని రికార్డు చేసుకోండి. మీరు సంభాషిస్తున్నట్టు మాట్లాడడాన్ని కొన్ని నిమిషాలు రికార్డు చేసుకోండి. మీకు ఏ పదాల శబ్దాలను స్పష్టంగా పలకడం కష్టమవుతోందో గుర్తించేందుకు అలా రికార్డు చేసిన దానిని వినడం సహాయకరంగా ఉండగలదు. ఎక్కడెక్కడ గబగబా చెప్పుకుపోతున్నారో ఎక్కడెక్కడ తగ్గుస్వరంలోను అస్పష్టంగాను చెబుతున్నారో ఎక్కడెక్కడ పదాలను పూర్తిగా పలకడంలేదో గమనించి అలా జరగడానికి గల కారణమేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. సాధారణంగా పైన చెప్పిన సలహాలను పాటించడానికి ప్రయత్నించడం ద్వారా ఈ బలహీనతలను పరిష్కరించుకోవచ్చు.

మాట్లాడడానికి సంబంధించిన ఏదైనా లోపంతో మీరు బాధపడుతున్నారా? మీరు మీ నోటిని మునుపటికన్నా ఎక్కువగా తెరవడానికి అభ్యసించండి, పదాలను ఇంకా జాగ్రత్తగా స్పష్టంగా ఉచ్చరించడానికి ప్రయత్నించండి. మీరు గాలి పీల్చుకునేటప్పుడు, ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకొని నెమ్మదిగా మాట్లాడండి. ఈ విధంగా చేయడం, మాట్లాడడానికి సంబంధించిన లోపాలు గల అనేకులు మునుపటి కన్నా స్పష్టంగా మాట్లాడేలా చేసింది. మీ సమస్య పూర్తిగా పరిష్కరించబడకపోయినప్పటికీ నిరాశచెందకండి. యెహోవా, ఇశ్రాయేలు ప్రజలకూ ఐగుప్తువాడైన ఫరోకూ ప్రాముఖ్యమైన సందేశాన్ని తెలియజేయడానికి మోషేనే ఎంపిక చేసుకున్నాడని గుర్తుంచుకోండి. మోషేకు ఏదో ఒకవిధమైన మాట మాంద్యము ఉండివుండవచ్చు. (నిర్గ. 4:10-12) మీరు సుముఖత చూపిస్తే యెహోవా మిమ్మల్ని కూడా ఉపయోగించుకుంటాడు, మీరు పరిచర్యలో సఫలులయ్యేలా ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.