పాఠశాలలో విద్యార్థి నియామకాలకు సిద్ధపడడం
పాఠశాలలో మీకు ఇవ్వబడే ప్రతి నియామకమూ మీరు ప్రగతిని సాధించేందుకు అవకాశాన్నిస్తుంది. మీరు వాటిని శ్రద్ధగా హృదయపూర్వకంగా నిర్వహించండి, అప్పుడు మీ అభివృద్ధి మీకూ ఇతరులకు కూడా క్రమేణా స్పష్టంగా కనిపిస్తుంది. (1 తిమో. 4:15) మీరు మీ సామర్థ్యాలను సాధ్యమైనంత మేరకు పెంచుకునేందుకు ఈ పాఠశాల సహాయపడుతుంది.
సంఘం ఎదుట మాట్లాడాలంటే మీకు భయమేస్తుందా? మీరు కొంతకాలంగా ఈ పాఠశాలలో పాల్గొంటున్నప్పటికీ అది సహజమే. అయినప్పటికీ కొన్ని విషయాలు మీ భయాన్ని తగ్గించగలవు. మీరు ఇంట్లో ఉన్నప్పుడు తరచూ బిగ్గరగా చదవడం అలవాటు చేసుకోండి. సంఘ కూటాల్లో తరచూ వ్యాఖ్యానాలను ఇస్తుండండి, మీరు ప్రచారకుడో ప్రచారకురాలో అయితే, క్షేత్రసేవలో క్రమంగా పాల్గొనండి. అలా చేయడం వల్ల ఇతరుల ఎదుట మాట్లాడడంలో అనుభవం వస్తుంది. అంతేకాక, మీకివ్వబడిన విద్యార్థి నియామకాలకు చాలా ముందుగానే సిద్ధపడి, బిగ్గరగా అభ్యసించండి. మీరు మాట్లాడబోతున్నది స్నేహశీలురైన ప్రేక్షకుల ఎదుటేనని గుర్తుంచుకోండి. ఏ ప్రసంగాన్నైనా ఇచ్చే ముందు, యెహోవాకు ప్రార్థించండి. తనను అడిగే సేవకులకు ఆయన తన పరిశుద్ధాత్మను ఆనందంగా ఇస్తాడు.—లూకా 11:13; ఫిలి. 4:6,7.
వినయ మనస్సు కలిగివుండి, మీ నుండి మీరు అతిగా ఆశించకండి. ప్రసంగీకుడిగా అనుభవం సంపాదించేందుకు, ప్రతిభావంతుడైన బోధకుడిగా అయ్యేందుకు సమయం పడుతుంది. (మీకా 6:8) మీరు ఈ పాఠశాలలో క్రొత్తగా చేరినట్లయితే, ఇప్పటికిప్పుడే చక్కని ప్రసంగమిచ్చేయగలగాలని అనుకోవద్దు. బదులుగా, మీరు ప్రసంగాలు ఇచ్చేటప్పుడు ప్రసంగానికి సంబంధించి సలహా పత్రంలోని ఒక్కొక్క ప్రసంగ లక్షణంపై కృషి చేయండి. ఈ పుస్తకంలో ఆ లక్షణం గురించి చర్చిస్తున్న భాగాన్ని అధ్యయనం చేయండి. సాధ్యమైతే, అక్కడ సూచించబడిన అభ్యాసము(లు) చేయండి. అప్పుడు, మీరు సంఘంలో మీ నియామకాన్ని నిర్వహించే ముందు, ప్రసంగ లక్షణానికి సంబంధించిన విషయాల్లో అనుభవాన్ని పొందుతారు. తద్వారా ప్రగతిని సాధిస్తారు.
చదివే నియామకానికి ఎలా సిద్ధపడాలి?
బహిరంగంగా చదవడానికి సిద్ధపడడంలో, నియమించబడిన భాగంలోని పదాలను కేవలం చదవగలగడం కన్నా ఎక్కువే ఉంది. ఆ భాగం ఏమి చెబుతుందో స్పష్టంగా గ్రహించేందుకు కృషి చేయండి. మీకు ఒక నియామకం అందిన వెంటనే, దానికి సంబంధించిన సమాచారాన్ని స్పష్టంగా గ్రహించాలన్న లక్ష్యంతో చదవండి. ఒక్కొక్క వాక్యపు భావాన్నీ ప్రతి పేరాలోను విపులీకరించబడిన తలంపులనూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, అలాగైతే, మీరు సరైన విధంగానూ సరైన భావాలతోనూ ఆలోచనలను శ్రోతల మనస్సులకు చేరవేయగలుగుతారు. మీకు తెలియని పదాల సరైన ఉచ్చారణను భాష బాగా తెలిసినవారిని అడిగి తెలుసుకోండి. మీరు చదవవలసిన భాగంతో సుపరిచితులవ్వండి. పిల్లలు అలా సుపరిచితులయ్యేందుకు తల్లిదండ్రులు సహాయం చేయవలసిన అవసరం ఉండవచ్చు.
బైబిలులో కొంత భాగం గానీ కావలికోటలోని ఒక ఆర్టికల్‌లోని కొన్ని పేరాలు గానీ చదవడానికి మీరు నియమించబడ్డారా? మీ కోసం ఆ భాగం చదివి వినిపించమని మంచిగా చదివే వారినెవరినైనా అడగవచ్చు, వాళ్ళు చదువుతున్నప్పుడు సరైన ఉచ్చారణనూ పదబంధాలను కలిపి చదవడాన్నీ నొక్కి పలకడాన్నీ స్వరభేదాన్నీ గమనించండి. ఆ గుణాలను మీరు చదివేటప్పుడు కూడా అలవరుచుకోండి.
మీ పఠన నియామకం కోసం సిద్ధపడనారంభించినప్పుడు, మీకు నియమించబడిన ప్రసంగ లక్షణాన్ని చర్చించే పాఠాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయండి. సాధ్యమైతే, మీకు నియమించబడిన భాగాన్ని చదవడం అనేకసార్లు అభ్యసించిన తర్వాత ఆ పాఠాన్ని మరొకసారి పరిశీలించండి. అక్కడ ఇవ్వబడిన సలహాను సాధ్యమైనంత మేరకు అన్వయించుకోవడానికి కృషి చేయండి.
ఈ శిక్షణ, పరిచర్యలో మీకు ఎంతో తోడ్పడవచ్చు. మీరు క్షేత్ర సేవలో పాల్గొన్నప్పుడు, ఇతరులకు చదివి వినిపించే అనేక అవకాశాలు మీకుంటాయి. ప్రజల జీవితాలను మార్చివేయగల శక్తి దేవుని వాక్యానికి ఉంది కనుక, మీరు దాన్ని చక్కగా చదవడం ప్రాముఖ్యం. (హెబ్రీ. 4:12) ఒకటి రెండు నియామకాలను నిర్వర్తించగానే, సమర్థవంతంగా చదవడంలోని అంశాలన్నింటిపై పట్టు సాధించగలరని అనుకోకండి. అపొస్తలుడైన పౌలు, ‘బహిరంగంగా చదవడం పై శ్రద్ధ చూపిస్తూ ఉండు’ అని ఎన్నో సంవత్సరాల అనుభవమున్న ఒక క్రైస్తవ పెద్దకు వ్రాశాడు.—1 తిమో. 4:13, NW.
విషయం, సన్నివేశం ఉన్న ప్రసంగాన్ని సిద్ధపడడం
పాఠశాలలో మీకు ఇవ్వబడిన ఒక నియామకంలో, ఒక సన్నివేశాన్ని ఉపయోగించవలసి ఉంటే మీరు ఎలా సిద్ధపడాలి?
ముఖ్యంగా మూడు విషయాలు ఆలోచించవలసిన అవసరముంది: (1) మీకు నియమించబడిన విషయం, (2) మీ సన్నివేశం, మీరు సంభాషించే వ్యక్తి, (3) మీరు కృషి చేయడానికి సలహాపత్రంలో మీకు నియమించబడిన ప్రసంగ లక్షణం.
మీకు నియమించబడిన విషయానికి సంబంధించిన సమాచారాన్ని మీరు సేకరించుకోవడం అవసరం. అయితే మీరు సమాచార సేకరణలో పూర్తిగా నిమగ్నమయ్యే ముందు, మీ సన్నివేశాన్ని గురించీ అలాగే, మీరు ఎవరితో సంభాషించబోతున్నారో ఆ వ్యక్తి గురించీ బాగా ఆలోచించండి. ఎందుకంటే ఈ విషయాలకూ మీరెలాంటి సమాచారాన్ని చర్చిస్తారు, మీరు దాన్ని ఏ విధంగా అందిస్తారు అన్న వాటికీ సంబంధం ఉంటుంది. మీరు ఏ సన్నివేశాన్ని ఉపయోగిస్తారు? మీకు తెలిసిన వ్యక్తికి సువార్తను ఎలా అందిస్తారో చూపిస్తారా? లేక ఒక వ్యక్తిని మొదటిసారిగా కలిసినప్పుడు ఏమి జరగవచ్చన్నది చూపిస్తారా? ఆ వ్యక్తి మీ కన్నా వయస్సులో పెద్దవారా, చిన్నవారా? మీరు చర్చించాలనుకుంటున్న విషయాన్ని గురించి ఆ వ్యక్తికి ఎటువంటి దృక్పథముండవచ్చు? ఆ వ్యక్తికి ఆ విషయం గురించి అప్పటికే ఎంతమేరకు తెలిసివుండవచ్చు? మీ చర్చ ద్వారా సాధించాలనుకుంటున్న లక్ష్యమేమిటి? ఈ ప్రశ్నల జవాబులు ప్రాముఖ్యమైన మార్గనిర్దేశాలనిస్తాయి, మీరు వాటి ప్రకారం మీ నియామకానికి సిద్ధపడవచ్చు.
నియమించబడిన విషయానికి సంబంధించిన సమాచారాన్ని ఎక్కడ పొందవచ్చు? ఈ పుస్తకంలోని 33 నుండి 38 పేజీల్లో “పరిశోధన ఎలా చెయ్యాలి?” అన్న విషయం చర్చించబడింది. దాన్ని చదివి, మీకు అందుబాటులో ఉన్న పరిశోధనా ఉపకరణాలను ఉపయోగించండి. తరచూ, మీరు ఉపయోగించగల దానికన్నా ఎక్కువ సమాచారం చాలా తక్కువ సమయంలోనే దొరుకుతుంది. సమాచారం ఎంత విస్తృత పరిధిలో లభించగలదో తెలిసేంత వరకు చదవండి. అయితే, మీరలా చేస్తున్నప్పుడు, మీ నియామకానికి ఉపయోగించబోతున్న సన్నివేశాన్నీ అలాగే మీరు ఎవరితో ఆ నియామకం నిర్వహించబోతున్నారో వారినీ దృష్టిలో పెట్టుకోండి. ఉపయోగించదగిన అంశాలను గుర్తుపెట్టుకోండి.
మీరు సిద్ధం చేసుకున్న సమాచారాన్ని క్రమబద్ధంగా పొందుపరుచుకునే ముందు, ఆ వివరాల్లో నుండి తుది ఎంపికను చేసుకునే ముందు సలహాపత్రంలో మీకు నియమించబడిన ప్రసంగ లక్షణానికి సంబంధించిన సమాచారాన్ని చదవడానికి సమయం తీసుకోండి. ఆ సలహాను మీరు ఆచరణలో పెట్టాలన్నదే మీకు నియామకం ఇవ్వడానికి గల ఒక ముఖ్య కారణం.
నియమించబడిన సమయం ముగిసిన వెంటనే ఒక సూచన ఇవ్వబడుతుంది కనుక, అనుమతించబడిన సమయ పరిధిలోనే మీరు సమాచారాన్ని చర్చించడం ద్వారా ముగింపును కూడా ఇచ్చారన్న తృప్తి మీకు ఉంటుంది. అయితే, మన క్షేత్ర పరిచర్యలో, సమయం మాత్రమే అన్నివేళలా నిర్ణాయక విషయం కాదు. కాబట్టి మీరు ప్రసంగానికి సిద్ధపడేటప్పుడు ఎంత సమయం ఉంటుందో పరిగణలోకి తీసుకోవాలి కానీ, సమర్థవంతమైన బోధనకే ఎక్కువ ప్రాముఖ్యతనివ్వండి.
సన్నివేశాల గురించి ఒక మాట. 82వ పేజీలో ఉన్న సూచనలను పరిశీలించి, మీ పరిచర్యలో ఉపయోగించగలదీ మీకు నియమించబడిన సమాచారాన్ని వాస్తవికంగా ఉపయోగించడానికి అవకాశమిచ్చేదీ అయిన ఒక దానిని ఎంపిక చేసుకోండి. మీరు ఈ పాఠశాలలో కొంత కాలంగా పాల్గొంటున్నట్లయితే, పరిచర్య కోసం అదనపు నైపుణ్యాలను సంపాదించుకునేందుకూ వాటిని వృద్ధిచేసుకునేందుకూ దీనిని ఒక అవకాశంగా దృష్టించండి.
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పైవిచారణకర్త మీకు ఒక సన్నివేశాన్ని నియమిస్తే, దాన్ని ఒక సవాలుగా తీసుకోండి. సన్నివేశాల్లో ఎక్కువ శాతం సాక్ష్యమివ్వడానికి సంబంధించినవే. అందులో చెప్పబడిన పరిస్థితుల్లో మీరెన్నడూ సాక్ష్యమివ్వనట్లయితే, అలాంటి పరిస్థితుల్లో సాక్ష్యమిచ్చిన ప్రచారకులతో మాట్లాడి కొన్ని తలంపులను రూపొందించుకోండి. సాధ్యమైతే, మీకు నియమించబడిన విషయాన్ని, మీరు ఈ పాఠశాలలో ఉపయోగించబోయే సన్నివేశానికి పోలిన పరిస్థితుల్లో చర్చించడానికి ప్రయత్నించండి. అది మీకు లభిస్తున్న శిక్షణ యొక్క ప్రముఖ లక్ష్యాన్ని సాధించడానికి సహాయపడుతుంది.
ప్రసంగ రూపంలో సమాచారాన్ని అందించవలసి వచ్చినప్పుడు
మీరు మగవారైతే, సంఘంలో ఒక చిన్న ప్రసంగమిచ్చేందుకు నియమించబడవచ్చు. ఈ ప్రసంగాలకు సిద్ధపడేటప్పుడు మీరు పరిగణలోకి తీసుకోవలసిన ప్రాథమిక అంశాలు, ప్రదర్శనల రూపంలో ఉండే విద్యార్థిని నియామకాల కోసం పైన ఇవ్వబడిన అంశాలవంటివే. అయితే ముఖ్యమైన తేడాలు ఏమిటంటే, మీ ప్రేక్షకులూ మీరు సమాచారాన్ని అందించే విధానమూ.
మీరు సమర్పించబోతున్న సమాచారాన్ని ప్రేక్షకుల్లోని ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూర్చేలా సిద్ధం చేసుకోవడం కోరదగిన విషయం. హాజరయ్యే వారిలో దాదాపు అందరికీ ప్రాథమిక బైబిలు సత్యాలు తెలుసు. మీరు మాట్లాడడానికి నియమించబడిన విషయం వాళ్ళకు బాగా తెలిసినదే ఎఫె. 2:3) ఈ ప్రశ్నలకు సంతృప్తికరమైన జవాబులు కావాలంటే పరిశోధన అవసరం. బైబిలును ఉపయోగిస్తున్నప్పుడు, లేఖనాలను కేవలం చదవడం కన్నా ఎక్కువే చేయడానికి కృషి చేయండి. మీరు ఉపయోగించే లేఖనాలపై తర్కించండి, కొన్ని నిర్ధారణలకు రావడానికి అవి ఎలా ఆధారాన్నిస్తున్నాయో చూపించండి. (అపొ. 17:2,3) మరీ ఎక్కువ సమాచారాన్ని చర్చించాలని ప్రయత్నించకండి. గుర్తుంచుకోవడానికి సులభమయ్యే విధంగా మీ సమాచారాన్ని అందించండి.
అయ్యుండవచ్చు. ఆ విషయానికి సంబంధించి వారికి అప్పటికే ఏమి తెలిసివుండవచ్చన్నది పరిగణలోకి తీసుకోండి. మీరు అందించే సమాచారం ద్వారా వారికి ఏదో ఒక విధంగా ప్రయోజనం చేకూర్చడానికి కృషి చేయండి. ‘ఒక వ్యక్తిగా యెహోవా పట్ల నాకూ నా ప్రేక్షకులకూ ఉన్న కృతజ్ఞతను పెంచేందుకు నాకు నియమించబడిన ఈ విషయాన్ని ఎలా ఉపయోగించగలను? దేవుని చిత్తాన్ని గ్రహించేందుకు మాకు తోడ్పడే ఏ విషయం ఈ సమాచారంలో ఉంది? శరీర కోరికలచేత శాసించబడుతున్న ఈ లోకంలో, సహేతుకమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఈ సమాచారం మాకు ఎలా సహాయపడగలదు?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. (మీరు ప్రసంగాన్ని ఇచ్చే విధానంపై శ్రద్ధ చూపడం కూడా సిద్ధపాటులో భాగమై ఉండాలి. దీని ప్రాముఖ్యతను తక్కువగా ఎంచకండి. మీరు ప్రసంగాన్ని నిజంగానే ఇస్తున్నట్లు అభ్యాసం చేయండి. వివిధ ప్రసంగ లక్షణాలను గురించిన సలహాలను మీరు అధ్యయనం చేయడానికీ పాటించడానికీ చేసే కృషి, మీ ప్రగతికి ఎంతగానో దోహదపడుతుంది. మీరు క్రొత్త ప్రసంగీకుడైనప్పటికీ అనుభవజ్ఞుడే అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో, సమాచారానికి అనుగుణమైన భావాన్ని మీ స్వరంలో పలికిస్తూ ఆ సమాచారాన్ని అందించగలిగేలా చక్కగా సిద్ధపడండి. పాఠశాలలోని నియామకాన్ని నిర్వహిస్తున్న ప్రతిసారీ యెహోవా దేవుడిచ్చిన మాట్లాడే వరాన్ని ఆయనను ఘనపరిచేందుకు ఉపయోగించాలన్న మీ లక్ష్యాన్ని మనస్సులో ఉంచుకోండి.—కీర్త. 150:6.