కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

52

ప్రభావితం చేసే ఉద్బోధ

ప్రభావితం చేసే ఉద్బోధ

క్రైస్తవ పెద్దలు “హితబోధవిషయమై జనులను హెచ్చరించుటకు [“ఉద్బోధించడానికి,” NW]” సమర్థులై ఉండాలి. (తీతు 1:9) కొన్నిసార్లు చాలా కష్టతరమైన పరిస్థితుల్లో వారలా చేయాల్సివస్తుంది. లేఖనాధారిత నిర్దేశకాలకు అనుగుణంగా వారు సలహా ఇవ్వడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి, పెద్దలు ఈ సలహాను పాటిస్తారు: ‘హెచ్చరించుటయందు [“ఉద్బోధించడంలో,” NW] జాగ్రత్తగా ఉండుము.’ (1 తిమో. 4:13) ఇక్కడ మన చర్చ ప్రాథమికంగా పెద్దల కోసం లేదా ఆ ఆధిక్యతను చేరుకోవడానికి ముందుకు వస్తున్నవారి కోసమే అయినా, తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉద్బోధించాల్సిన సమయాలు లేదా బైబిలు అధ్యయనాలు చేస్తున్నవారు తమ బైబిలు విద్యార్థులను ఉద్బోధించాల్సిన సమయాలు కూడా ఉంటాయి. అలాంటి సందర్భాల్లో ఇక్కడ ఇవ్వబడుతున్న నిర్దేశకాల వంటివే వర్తిస్తాయి.

అది అవసరమయ్యే పరిస్థితులు. ఉద్బోధ ఎప్పుడు అవసరమవుతుందో నిర్ణయించుకోవడానికి, బైబిలులో నమోదు చేయబడిన ఉద్బోధ ఏ సందర్భాల్లో ఇవ్వబడిందో పరిశీలిస్తే సహాయకరంగా ఉంటుంది. అపొస్తలుడైన పేతురు, దేవుని మందకు కాపరులుగా పెద్దలకు ఉన్న బాధ్యతను గురించి జాగ్రత్తవహించమని పెద్దలకు ఉద్బోధించాడు. (1 పేతు. 5:1, 2) యౌవనపురుషులు “స్వస్థబుద్ధిగలవారై” ఉండేలా ఉద్బోధించమని పౌలు తీతుకు సలహా ఇచ్చాడు. (తీతు 2:6) పౌలు తన తోటి క్రైస్తవులు “ఏకభావముతో మాట్లాడవలె”ననీ, సహోదరుల మధ్య విభేదాలు సృష్టించేవారికి దూరంగా ఉండాలనీ ప్రేరేపించాడు. (1 కొరిం. 1:10; రోమా. 16:17; ఫిలి. 4:2) థెస్సలొనీకలోని సంఘ సభ్యులను వారు చేస్తున్న మంచి పనుల నిమిత్తం పౌలు మెచ్చుకున్నప్పటికీ, వారు పొందిన ఉపదేశాన్ని మరింత సంపూర్ణంగా అన్వయించుకొమ్మని ఉద్బోధించాడు. (1 థెస్స. 4:1, 10) పేతురు ‘శరీరాశలను విసర్జించమని’ తోటి క్రైస్తవులను బతిమాలుకొన్నాడు. (1 పేతు. 2:11) కామాతురత్వానికి పాల్పడే దైవభక్తిలేని వ్యక్తుల ప్రభావం వారిమీద పడే అవకాశం ఉన్న దృష్ట్యా, తన సహోదరులు ‘బోధ నిమిత్తము పోరాడవలెనని’ యూదా ఉద్బోధించాడు. (యూదా 3, 4) పాపము యొక్క భ్రమచేత తమలో ఎవరూ కఠినపరచబడకుండా క్రైస్తవులందరు ఒకరినొకరు ఉద్బోధించుకోవాలని పురికొల్పబడ్డారు. (హెబ్రీ. 3:13-15) క్రీస్తుపై ఇంకా విశ్వాసం ఉంచని యూదులను పేతురు, “మూర్ఖులగు ఈ తరమువారికి వేరై రక్షణపొందు[డి]” అని ఉద్బోధించాడు.—అపొ. 2:40.

పైన వర్ణించబడినటువంటి పరిస్థితుల్లో గట్టి ఉద్బోధను అందించడానికి ఎలాంటి లక్షణాలు అవసరం? ఉద్బోధించే వ్యక్తి తన విజ్ఞప్తి అణచివేతగా లేక కఠినంగా ధ్వనించకుండా అత్యవసర పిలుపుగా ధ్వనించేలా ఎలా చేయగలడు?

“ప్రేమనుబట్టి.” మనం “ప్రేమనుబట్టి” ఉద్బోధించకపోతే అది తీవ్రంగా మాట్లాడుతున్నట్లు ధ్వనించవచ్చు. (ఫిలే. 8, 9) నిజమే, సత్వర చర్య గైకొనడం అవసరమైనప్పుడు, ప్రసంగీకుడి ప్రసంగం ఆ పరిస్థితిలోని అత్యవసరతను వ్యక్తం చేయాలి. మరీ మృదువుగా మాట్లాడడం ఏదో క్షమాపణ కోరుతున్నట్లుగా ధ్వనిస్తుంది. అదే సమయంలో, విజ్ఞప్తి హృదయపూర్వకంగాను, ప్రగాఢమైన భావాలను వ్యక్తం చేసేదిగాను ఉండాలి. ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తే ప్రేక్షకులను ప్రేరేపించే అవకాశం ఎక్కువ ఉంటుంది. తన పక్షాన, తన సహవాసుల పక్షాన మాట్లాడేటప్పుడు పౌలు థెస్సలొనీకయులకు ఇలా చెప్పాడు: ‘మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు, [“ఉద్బోధిస్తూ,” NW] . . . తండ్రి తన బిడ్డలయెడల నడుచుకొనురీతిగా మీలో ప్రతివానియెడల మేము నడుచుకొంటిమని మీకు తెలియును.’ (1 థెస్స. 2:11) ఆ క్రైస్తవ పైవిచారణకర్తలు తమ సహోదరులకు ప్రేమతో విజ్ఞప్తి చేశారు. మీ వ్యక్తీకరణలు మీ శ్రోతలపట్ల మీకున్న నిజమైన చింత మూలంగా ఉద్భవించనివ్వండి.

ఔచిత్యంతో ఉండండి. కార్యోన్ముఖులవమని ప్రేరేపించడానికి మీరు ప్రయత్నిస్తున్న వారిని దూరం చేసుకోకండి. అదే సమయంలో, మీ ప్రేక్షకులకు “దేవుని సంకల్పమంతయు” చెప్పకుండా ఉండవద్దు. (అపొ. 20:27) సలహా పట్ల కృతజ్ఞతా భావం కలవారికి, మీరు దయాపూర్వకంగా సరైనది చేయమని ఉద్బోధించినంత మాత్రాన వారు అభ్యంతరపడరు లేదా మిమ్మల్ని ప్రేమించడం మానేయరు.—కీర్త. 141:5.

తరచూ ఉద్బోధకు ముందు, ఏదైనా నిర్దిష్ట విషయంలో వారిని నిజాయితీగా మెచ్చుకోవడం మంచిది. మీ సహోదరులు చేస్తున్న మంచి పనుల గురించి—యెహోవా ఎంతో ఆనందించే పనుల గురించి ఆలోచించండి: తమ పనిలో వారు ప్రదర్శించే విశ్వాసం, గట్టి కృషి చేసేలా వారిని కదిలించే ప్రేమ, శ్రమలతో కూడిన పరిస్థితులు ఎదుర్కొంటున్నా వారు చూపించే సహనం వంటివాటి గురించి ఆలోచించండి. (1 థెస్స. 1:2-8; 2 థెస్స. 1:3-5) ఇది మీరు మీ సహోదరులను విలువైనవారిగా ఎంచుతున్నారని, వారిని అర్థం చేసుకుంటున్నారని వారు భావించేలా చేస్తుంది, తత్ఫలితంగా ఆ తర్వాత వినబడే విజ్ఞప్తులకు ప్రతిస్పందించేలా వారి మనస్సు సిద్ధపడుతుంది.

“సంపూర్ణమైన దీర్ఘశాంతముతో.” “సంపూర్ణమైన దీర్ఘశాంతముతో” ఉద్బోధించాలి. (2 తిమో. 4:2, NW) అంటే ఏమిటి? దీర్ఘశాంతము అంటే అన్యాయం జరిగినా, కోపాన్ని తెప్పించినా ఓర్పుగా సహించడం. దీర్ఘశాంతముతో ఉండే వ్యక్తి ఎల్లప్పుడూ తన శ్రోతలు తను చెప్పేది అన్వయించుకుంటారన్న ఆశతో ఉంటాడు. ఈ స్ఫూర్తితో ఉద్బోధించడం, మీరు మీ శ్రోతలను తక్కువచేసి మాట్లాడుతున్నారని వారు తలంచకుండా ఆపుతుంది. మీ సహోదర సహోదరీలు యథాశక్తి యెహోవాను సేవించాలని కోరుకుంటున్నారన్న మీ నమ్మకం, సరైనది చేయాలన్న వారి కోరికను పురికొల్పుతుంది.—హెబ్రీ. 6:9.

‘హితబోధ ద్వారా.’ ఒక పెద్ద, ఎలా ‘హితబోధవిషయమై జనులను హెచ్చరించగలడు [“ఉద్బోధించగలడు,” NW]’? “ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడు”గా ఉండడం ద్వారానే. (తీతు 1:9) మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి బదులుగా మీ విజ్ఞప్తులకు దేవుని వాక్యమే శక్తినివ్వాలి. మీరు ఏమి చెప్పాలో వివేచించడానికి బైబిలు మీకు సహాయపడనివ్వండి. ప్రస్తుతం పరిశీలిస్తున్న విషయం గురించి బైబిలు చెబుతున్న దాన్ని అన్వయించుకోవడంలోని ప్రయోజనాలను పేర్కొనండి. దేవుని వాక్యానికి అనుగుణంగా మారకపోవడానికి ఇప్పుడూ భవిష్యత్తులోనూ రాగల పరిణామాలు ఏమిటో మనస్సులో స్పష్టంగా ఉంచుకొని, సముచితమైన చర్య తీసుకోవాల్సిన అవసరాన్ని గురించి మీ ప్రేక్షకులను ఒప్పించడానికి వాటిని ఉపయోగించండి.

ఏమి చేయాలో, ఎలా చేయాలో మీ ప్రేక్షకులకు స్పష్టంగా వివరించేలా రూఢిపరచుకోండి. మీ తర్కం లేఖనాల్లో స్థిరంగా నాటుకొని ఉందని స్పష్టం చేయండి. ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో లేఖనాలు కొంచెం స్వేచ్ఛను అనుమతిస్తుంటే ఆ స్వేచ్ఛ విస్తృతి ఎంతో సంక్షిప్తంగా చెప్పండి. తర్వాత మీరు చెప్పే ముగింపులో, చర్య తీసుకోవాలన్న మీ శ్రోతల తీర్మానాన్ని బలపరచడానికి చివరిగా మరొకసారి విజ్ఞప్తిచేయండి.

“మాట్లాడే స్వేచ్ఛ”తో. ఇతరులను ప్రభావితం చేసేలా ఉద్బోధించాలంటే “విశ్వాసమందు మాట్లాడే స్వేచ్ఛ” ఉండాలి. (1 తిమోతి 3:13, NW) ఒక వ్యక్తి స్వేచ్ఛగా మాట్లాడడానికి ఏది దోహదపడుతుంది? ఆయన ఏ “సత్కార్యముల విషయమై మాదిరిగా” ఉన్నాడో ఆ సత్కార్యముల గురించే తన సహోదరులకు ఉద్బోధిస్తున్నాడన్న వాస్తవం. (తీతు 2:6, 7; 1 పేతు. 5:3) అలా జరిగినప్పుడు, చర్య తీసుకొమ్మని ఉద్బోధించబడేవారు, తమను ఉద్బోధించే వ్యక్తే చేయని పనులు తాము చేస్తామని ఆయన ఎదురుచూడడంలేదని గ్రహిస్తారు. ఆయన క్రీస్తును అనుకరించడానికి కృషి చేస్తున్నట్లే తాము కూడా ఆయన విశ్వాసాన్ని అనుకరించగలమని వారు గ్రహిస్తారు.—1 కొరిం. 11:1; ఫిలి. 3:17.

దేవుని వాక్యంపై ఆధారపడి, ప్రేమ భావంతో ఉద్బోధిస్తే అది ఎంతో మేలును చేకూర్చగలదు. అలా ఉద్బోధించే బాధ్యత ఉన్నవారు చక్కని రీతిలో ఉద్బోధించడానికి గట్టిగా కృషిచేయాలి.—రోమా. 12:8.