కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

19

బైబిలు ఉపయోగాన్ని ప్రోత్సహించడం

బైబిలు ఉపయోగాన్ని ప్రోత్సహించడం

ప్రతి ఒక్కరి మనస్సును దేవుని వాక్యమైన బైబిలు వైపుకు మళ్ళించాలన్నదే మన కోరిక. పవిత్రమైన ఆ గ్రంథమే మనం ప్రకటించే సందేశానికి ఆధారం. ప్రజలు బైబిలు మీద నమ్మకాన్ని పెంపొందించుకోవలసిన అవసరం ఉంది. కాబట్టి మనం చెబుతున్నది మన సొంత మాటలు కావనీ అవి దేవుని నుండి వచ్చినవనీ ప్రజలు గ్రహించాలనుకుంటాం.

క్షేత్ర పరిచర్యలో. క్షేత్రసేవ కోసం సిద్ధపడుతున్నప్పుడల్లా వినడానికి సుముఖత చూపేవారితో చర్చించడానికి ఒకటి గానీ అంత కన్నా ఎక్కువ లేఖనాలను గానీ ఎంపిక చేసుకోండి. మీరు బైబిలు సాహిత్యాలను పంపిణీ చేయడానికి ఇంకా క్లుప్తమైన ప్రతిపాదన గురించి ఆలోచించుకుంటున్నప్పుడు కూడా, బైబిలు నుండి సముచితమైన లేఖనాన్ని చదవడం తరచూ ప్రయోజనకరంగా ఉంటుంది. గొఱ్ఱెల్లాంటి ప్రజలకు నడిపింపునిచ్చేందుకు స్వయంగా మనం చెప్పే వాటికన్నా బైబిలుకే ఎక్కువ శక్తి ఉంది. నిజానికి బైబిలు నుండి చదవడం సాధ్యం కానప్పుడు మీరు బైబిలును ఉటంకించి చెప్పాలని ఎంపిక చేసుకోవచ్చు. మొదటి శతాబ్దంలో, గ్రంథపు చుట్టల రూపంలో ఉండే పవిత్ర గ్రంథాల ప్రతులు విస్తృతంగా లభ్యమయ్యేవి కావు. అయినప్పటికీ యేసు, ఆయన అపొస్తలులు లేఖనాలను విస్తృతంగా ఉటంకించేవారు. మనం కూడా లేఖనాలను కంఠస్థం చేసుకొని, మన పరిచర్యలో సముచితమైనప్పుడు ఉపయోగించడానికి కృషి చెయ్యాలి. కొన్నిసార్లు వాటిని కేవలం ఉటంకించండి.

మీరు బైబిలు నుండి చదవగలిగినప్పుడు గృహస్థుడు కూడా చూడగలిగేలా బైబిలును పట్టుకోండి. గృహస్థుడు తన సొంత బైబిలులో చూస్తే తాను చదివే దానికి ఆయన నుండి వచ్చే ప్రతిస్పందన ఇంకా ఎక్కువ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.

అయితే, కొందరు బైబిలు అనువాదకులు దేవుని వాక్యాన్ని స్వేచ్ఛానువాదం చేశారన్న విషయం గుర్తుంచుకోండి. ఆ బైబిళ్ళు అన్ని విషయాల్లోను మూల భాషల్లో ఉన్న బైబిళ్ళతో పొందికగా ఉండకపోవచ్చు. అనేక ఆధునిక అనువాదాలు దేవుని వ్యక్తిగత నామమును తీసివేశాయి, మృతుల పరిస్థితిని గురించి బైబిలు మూల భాషలోని పాఠ్యభాగం చెబుతున్న దానిని అస్పష్టం చేశాయి, భూమి విషయంలో దేవుని సంకల్పం గురించి బైబిలు చెబుతున్నదాన్ని మరుగుచేశాయి. ఈ అనువాదాల్లో జరిగిన మార్పులను ఒక వ్యక్తికి చూపించేందుకు, కీలక వచనాలను వివిధ బైబిళ్ళతో గానీ అదే భాషలో ముందు చేయబడిన అనువాదాలతో గానీ మీరు పోల్చి చూపించవలసిన అవసరం ఉండవచ్చు. అనేక విషయాలు వివరించడానికి తరచూ ఉపయోగించబడే వచనాల్లోని కీలకమైన మాటలు వివిధ అనువాదాల్లో ఎలా అనువదించబడ్డాయో లేఖనముల నుండి తర్కించడం (ఆంగ్లం) అనే పుస్తకం పోల్చి చూపిస్తుంది. సత్యాన్ని ప్రేమించేవారెవరైనా సరే వాస్తవాల గురించిన పరిజ్ఞానానికి ఎంతో కృతజ్ఞులై ఉంటారు.

సంఘ కూటాల్లో. సంఘ కూటాల్లో అందరినీ తమ తమ బైబిళ్ళను ఉపయోగించమని ప్రోత్సహించాలి. అలా ప్రోత్సహించడం వల్ల అనేక విధాల్లో మేలు చేకూరుతుంది. చర్చించబడుతున్నదానిపై ప్రేక్షకులు తమ మనస్సు నిలిపేందుకు అది సహాయపడుతుంది. ప్రసంగీకుడు మౌఖికంగా ఇస్తున్న ఉపదేశాన్ని, వారు తమ బైబిళ్ళలో చూసినప్పుడు మరింత సమర్థవంతంగా ఉంటుంది. నిజానికి మన నమ్మకాలకు బైబిలే ఆధారమన్న విషయం క్రొత్తగా ఆసక్తి చూపించే వారి మనస్సులపై ముద్రించుకుపోతుంది.

ప్రేక్షకుల్లో ఉన్న వారందరూ తమ సొంత బైబిళ్ళలోని లేఖన భాగాలను నిజంగా చూస్తున్నారా లేదా అన్నది చాలామట్టుకు మీరిచ్చే ప్రోత్సాహం మీదే ఆధారపడి ఉంటుంది. బైబిలు తెరవమని వారిని నేరుగా ఆహ్వానించడం ఉత్తమమైన పద్ధతుల్లో ఒకటి.

బైబిలు తెరవమని ప్రేక్షకులను ఆహ్వానించి, నొక్కిచెప్పవలసిన వచనాలను ఎంపిక చేసుకునే బాధ్యత ప్రసంగీకునిగా మీకే వదిలేయబడుతుంది. మీరు ముఖ్యమైన విషయాలను విపులీకరించేందుకు మీకు సహాయపడే లేఖనాలను చదవడమే ఉత్తమం. తర్వాత సమయం లభించేదాన్ని బట్టి మీ వాదనను బలపరిచే మరికొన్ని లేఖనాలను ఉపయోగించండి.

సాధారణంగా వచనాన్ని కేవలం ఉటంకించడమో, ఒక లేఖనాన్ని చూడమని ప్రేక్షకులను ఆహ్వానించడమో మాత్రమే సరిపోదన్నదీ నిజమే. మీరు మొదట చెప్పిన వచనాన్ని తెరిచేందుకు కూడా మీ ప్రేక్షకులకు సమయమివ్వకుండా మీరు అది చదివేసి మరో వచనానికి వెళ్ళిపోతే వాళ్ళు కొద్దిసేపటికే నిరుత్సాహపడిపోయి మీతో పాటు బైబిలు చూసే ప్రయత్నాన్ని విరమించుకుంటారు. మీరు గమనించేవారై ఉండండి. ప్రేక్షకుల్లో ఎక్కువ మంది వచనాన్ని తెరచిపెట్టుకున్న తర్వాతే చదవండి.

ముందుగా ఆలోచించండి. మీరు లేఖనాన్ని చదవడానికి కావలసినంత ముందుగా పుస్తకం పేరు, అధ్యాయం, వచనం స్పష్టంగా పేర్కొనండి. అలాగైతే, ప్రేక్షకులు వచనాన్ని తెరిచేంతవరకు వేచి ఉండడం వల్ల సమయం అంతగా వృధా కాదు. ప్రేక్షకులు లేఖనాలను చూడడానికి వ్యవధినిస్తే, మీరు తక్కువ సమాచారమే అందించగలిగినా తగిన ప్రయోజనాలు లభిస్తాయి.