కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

6

భావాన్ని సరిగ్గా నొక్కిచెప్పడం

భావాన్ని సరిగ్గా నొక్కిచెప్పడం

మీరు ప్రసంగిస్తున్నప్పుడు గానీ బిగ్గరగా చదువుతున్నప్పుడు గానీ ప్రతి పదాన్నీ సరిగ్గా ఉచ్చరించడమే కాక, విషయమేమిటో స్పష్టంగా అర్థమయ్యే విధంగా కీలకమైన పదాలనూ మాటలనూ పదబంధాలనూ నొక్కిపలకడం కూడా ముఖ్యం.

భావాన్ని సరిగ్గా నొక్కిచెప్పడంలో, కొన్ని పదాలను గానీ అనేక పదాలను గానీ మిగతా వాటికన్నా ఎక్కువ నొక్కిపలకడం కంటే ఎక్కువే ఉంది. సరైన పదాలను నొక్కిపలకాలి. నొక్కిపలకకూడని పదాలను నొక్కిపలికితే మీరు చెప్తున్నదాని భావం ప్రేక్షకులకు స్పష్టం కాకపోవచ్చు, దానివల్ల వారు తమ ఆలోచనలను వేరే విషయాల మీదికి మళ్ళనియ్యవచ్చు. సమాచారం పరిజ్ఞానాన్ని పెంచేదే అయినప్పటికీ భావాన్ని సరిగ్గా నొక్కిచెప్పకపోతే ప్రసంగం ప్రేక్షకులను అంతగా పురికొల్పలేదు.

భావాన్ని వివిధ పద్ధతుల్లో నొక్కిచెప్పవచ్చు, తరచూ ఒకటి కన్నా ఎక్కువ పద్ధతులను ఒకేసారి పాటించవచ్చు: స్వరాన్ని పెంచడం ద్వారా, భావోపేతంగా దృఢంగా వ్యక్తం చేయడం ద్వారా, నెమ్మదిగా సావధానంగా తెలియజేయడం ద్వారా, ఒక వాక్యానికి ముందు గానీ తర్వాత గానీ కాస్సేపు ఆగడం ద్వారా (లేదా ముందు, తర్వాత కూడా కాస్సేపు ఆగడం ద్వారా), సంజ్ఞల ద్వారా, ముఖ కవళికల ద్వారా నొక్కిచెప్పవచ్చు. కొన్ని భాషల్లో, స్వరాన్ని తగ్గించడం ద్వారా లేదా స్వరస్థాయిని పెంచడం ద్వారా కూడా నొక్కిచెప్పవచ్చు. నొక్కిచెప్పడానికి పాటించవలసిన అత్యంత సముచితమైన పద్ధతులేవో నిర్ణయించుకోవడానికి సమాచారాన్నీ పరిస్థితులనూ పరిగణలోకి తీసుకోండి.

నొక్కిచెప్పవలసిన విషయాలేవో నిర్ణయించుకునేటప్పుడు, మీరు ఈ క్రింది విషయాలను పరిగణలోకి తీసుకోండి. (1) ఏ వాక్యంలోనైనా సరే ఎక్కువ నొక్కిపలకవలసిన పదాలు ఏవి అన్నది, వాక్యంలోని మిగతా పదాలను బట్టే కాక, సందర్భాన్నిబట్టి కూడా నిర్ణయించబడుతుంది. (2) ఒక క్రొత్త విషయం చెప్పడం మొదలుపెడుతున్నప్పుడు అది స్పష్టమయ్యేలా నొక్కి చెప్పవచ్చు. క్రొత్త విషయం ముఖ్యాంశంతోనైనా మొదలు కావచ్చు, తర్క సరళి మారడం ద్వారానైనా మొదలు కావచ్చు. అది తర్క సరళి ముగింపును కూడా దృష్టికి తీసుకురావచ్చు. (3) ఒక ప్రసంగీకుడు, ఒక విషయాన్ని గురించి ఎలా భావిస్తున్నాడో స్పష్టం చేసేందుకు కూడా నొక్కిచెప్పవచ్చు. (4) ప్రసంగంలోని ముఖ్యాంశాలను ఉన్నతపరచడానికి కూడా నొక్కిచెప్పవచ్చు.

ఒక ప్రసంగీకుడైనా బహిరంగంగా చదివే వ్యక్తైనా పై విధాల్లో భావాన్ని నొక్కిచెప్పాలంటే, సమాచారాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి, తన శ్రోతలు దాన్ని గ్రహించాలని హృదయపూర్వకంగా కోరుకోవాలి. ఎజ్రా కాలంలో ఇవ్వబడిన నిర్దేశం గురించి, నెహెమ్యా 8:​8, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌ ఇలా చెబుతోంది. “ఆ లేవీయులు దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివారు. వాళ్లు జనానికి అర్థం వివరించి దాన్ని సులభం చేశారు. చదివినదాన్ని జనం తేలిగ్గా అర్థం చేసుకోగలిగేందుకు గాను వాళ్లు తాత్పర్యాలను వివరించి చెప్పారు.” చదివినదాని భావాన్ని శ్రోతలు అర్థం చేసుకొని, గుర్తుంచుకొని వాటిని అన్వయించుకునేందుకు వారికి సహాయపడవలసిన ప్రాముఖ్యతను అప్పట్లో దేవుని ధర్మశాస్త్రాన్ని చదివి వివరించినవారు గ్రహించారన్నది స్పష్టం.

సమస్యకు కారణమయ్యేదేమిటి? చాలామంది ప్రజలు, మామూలుగా రోజువారీ సంభాషణల్లో తమ భావాన్ని స్పష్టం చేయగలుగుతారు. కానీ వేరే ఎవరైనా వ్రాసిన సమాచారాన్ని చదివేటప్పుడు, నొక్కిపలకవలసిన పదాలు లేదా పదబంధాలు ఏవో నిర్ణయించాలంటే వాళ్ళకు అది ఒక సవాలుగా ఉండవచ్చు. దేనిని నొక్కిపలకాలో తెలియాలంటే, సమాచారాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడం ప్రాముఖ్యం. స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే లిఖిత సమాచారాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయవలసిన అవసరముంది. కాబట్టి, సంఘ కూటంలో ఏదైనా సమాచారాన్ని చదవమని మిమ్మల్ని కోరితే మీరు ఎంతో జాగ్రత్తగా సిద్ధపడాలి.

కొంతమంది, భావాన్ని స్పష్టంగా తెలియజేయకుండా మధ్యమధ్యలో పదాలను నొక్కిపలుకుతుంటారు. అలా నొక్కిపలకడం అర్థవంతమైనా కాకపోయినా సరే వాళ్ళు క్రమంగా మధ్యమధ్యలో అలా చేస్తుంటారు. మరికొందరు, కీలకమైన పదాలను నొక్కిపలికేటప్పుడు విభక్తి ప్రత్యయాలను సముచ్ఛయాలను అతిగా నొక్కిపలుకుతుంటారు. అలా నొక్కిపలకడం ఆలోచన స్పష్టమవ్వడానికి తోడ్పడనప్పుడు అది శ్రోతల ధ్యాసను మళ్ళించే అలవాటుగా సులభంగా మారుతుంది.

కొందరు ప్రసంగీకులు భావాన్ని స్పష్టంగా తెలియజేయాలన్న ప్రయత్నంలో పెద్ద స్వరంతో మాట్లాడతారు, ఒక ప్రసంగీకుడు అలా మాట్లాడినప్పుడు ఆయన తమను గద్దిస్తున్నాడని ప్రేక్షకులకు అనిపించవచ్చు. అవును అలా మాట్లాడడం వల్ల, శ్రేష్ఠమైన ఫలితాలు రావడం అరుదు. భావాన్ని స్పష్టంగా తెలియజేసిన విధానం సహజంగా లేకపోతే, ప్రసంగీకుడు ప్రేక్షకులను చులకన చేసి మాట్లాడుతున్నట్లనిపించవచ్చు. అలాకాకుండా ఆయన వారికి ప్రేమతో విజ్ఞప్తి చేయడమూ తాను చెబుతున్న విషయాలు లేఖనానుసారమైనవని సహేతుకమైనవని గ్రహించడానికి వారికి సహాయపడడమూ ఎంత మంచిది!

ఎలా మెరుగుపరుచుకోవచ్చు? భావాన్ని నొక్కిచెప్పే విషయంలో సమస్య ఉన్న వ్యక్తికి సాధారణంగా ఆ విషయం తెలియదు. వేరే ఎవరైనా వాళ్ళ సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకురావలసిన అవసరం ఉండవచ్చు. ఈ రంగంలో మీరు మెరుగుపడవలసిన అవసరముంటే, మీ పాఠశాల పైవిచారణకర్త మీకు సహాయపడతాడు. అలాగే మంచి ప్రసంగీకుడైన వేరే ఎవరి సహాయాన్నైనా నిస్సంకోచంగా అడగండి. మీరు చదువుతున్నప్పుడు గానీ మాట్లాడుతున్నప్పుడు గానీ శ్రద్ధగా విని, మీరు మెరుగుపడేందుకు సూచనలు ఇవ్వమని వారిని కోరండి.

నొక్కిచెప్పడాన్ని అభ్యసించడానికి ఆధారంగా మొదట్లో కావలికోటలోని ఒక ఆర్టికల్‌ను ఉపయోగించమని మీకు సలహా ఇస్తున్న వ్యక్తి మీకు సూచించవచ్చు. వినేవారు అర్థాన్ని సులభంగా గ్రహించగలిగేందుకు ఏ పదాలను లేదా ఏ పదబంధాలను నొక్కిపలకాలో నిర్ణయించుకునేందుకు ఒక్కో వాక్యాన్ని విశ్లేషించమని ఆయన మీకు నిస్సందేహంగా చెబుతాడు. ఇటాలిక్కులలో ఉన్న పదాలకు ప్రత్యేక శ్రద్ధ చూపించమని ఆయన మీకు గుర్తుచేస్తుండవచ్చు. ఒక వాక్యంలోని పదాలు ఒకదానితో ఒకటి ముడిపడివుంటాయని గుర్తుంచుకోండి. తరచూ కేవలం ఒక పదాన్ని కాక, పదాల సముదాయాన్ని నొక్కిపలకవలసి ఉంటుంది. కొన్ని భాషల్లో, భావాన్ని సరిగ్గా వ్యక్తం చేసేందుకు ఉచ్చారణ చిహ్నాలు సూచిస్తున్నవాటిని జాగ్రత్తగా పరిగణలోకి తీసుకోవాలని విద్యార్థులు ప్రోత్సహించబడుతుండవచ్చు.

దేనిని నొక్కిపలకాలన్నది నేర్చుకోవడంలో రెండవ మెట్టుగా, వాక్యానికి మించి చూస్తూ సందర్భం ఏమి చెబుతోందో పరిగణలోకి తీసుకోవాలని మీకు సలహా ఇస్తున్న వ్యక్తి మీకు ఉద్బోధించవచ్చు. ఏ ఆలోచనను కేంద్రంగా తీసుకొని పేరా మొత్తం విపులీకరించబడుతోంది? ఒక్కో వాక్యంలో మీరు దేన్ని నొక్కిపలకాలన్న దానిపై ఆ ఆలోచన ఎలా ప్రభావం చూపాలి? ఆ ఆర్టికల్‌ శీర్షికను, మీరు చూస్తున్న పేరా పైన ముద్దక్షరాల్లో ఉన్న ఉపశీర్షికను చూడండి. అవి, మీరు నొక్కిపలికేందుకు ఎంపిక చేసుకునే పదాల, పదబంధాల విషయంలో ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకోవలసినవే. కానీ, మరీ ఎక్కువ పదాలను బలంగా నొక్కిపలకకుండా జాగ్రత్తపడండి.

మీరు చదువుతున్నా పదే పదే నోట్సు చూడకుండా ప్రసంగిస్తున్నా తర్క సరళిని బట్టి మీరు నొక్కిపలకవలసిన పదాలను ఎంపికచేసుకోవాలని మీకు సలహా ఇస్తున్న వ్యక్తి మిమ్మల్ని ప్రోత్సహిస్తుండవచ్చు. నిర్దిష్ట తర్క సరళి ఎక్కడ ముగుస్తుందో, ప్రాముఖ్యమైన ఒక ఆలోచన ఎక్కడ ముగిసి మరొకటి మొదలవుతుందో మీకు తెలిసివుండాలి. మీ శ్రోతలు వాటిని గ్రహించగలిగేలా మీరు ప్రసంగిస్తే లేదా చదివితే వాళ్ళు దాన్ని మెచ్చుకుంటారు. మొట్టమొదటిగా, తర్వాత, చివరిగా, కాబట్టి, సహేతుకంగానే వంటి పదాలను ఉపయోగించడం ద్వారా వాళ్ళు వాటిని గ్రహించేలా చేయవచ్చు.

మీకు సలహా ఇస్తున్న వ్యక్తి మీ దృష్టికి తీసుకువచ్చే ఆలోచనలకు మీరు ప్రత్యేక భావాన్ని జోడించాలనుకోవచ్చు. అలా భావాన్ని జోడించేందుకు చాలా, సంపూర్ణంగా, ఏది ఏమైనప్పటికీ, ఊహించలేనిది, ప్రాముఖ్యమైనది, ఎల్లప్పుడూ వంటి పదాలను నొక్కిపలకవలసి ఉండవచ్చు. మీరు చెబుతున్న దాని గురించి శ్రోతలు ఎలా భావిస్తారన్నది మీరు నొక్కిచెప్పే దాన్ని బట్టి ఉంటుంది. దీని గురించి ఇంకా ఎక్కువగా “ఆప్యాయత, భావాలు” అనే 11వ అధ్యయనంలో చర్చించబడుతుంది.

మీరు, భావాన్ని నొక్కిచెప్పడంలో మెరుగుపడాలంటే మీ ప్రేక్షకులు గుర్తుంచుకోవాలని మీరు కోరుకుంటున్న ముఖ్యమైన విషయాలు మీ మనస్సులో స్పష్టంగా ఉండాలని కూడా మీరు ప్రోత్సహించబడతారు. దీని గురించి ఇంకా ఎక్కువగా, బహిరంగ పఠనాన్ని దృష్టిలో పెట్టుకొని “ప్రధాన తలంపులను నొక్కిచెప్పడం” అనే 7వ అధ్యయనంలోను, ప్రసంగాలివ్వడాన్ని దృష్టిలో పెట్టుకొని “ముఖ్యాంశాలను ప్రత్యేకంగా గుర్తించబడేలా చెప్పడం” అనే 37వ అధ్యయనంలోను చర్చించబడుతుంది.

మీరు క్షేత్రపరిచర్యలో మెరుగుపడాలని కృషి చేస్తుండగా మీరు లేఖనాలను ఎలా చదువుతున్నారన్న దానికి ప్రత్యేక శ్రద్ధనివ్వండి. ‘నేను ఈ వచనాలను ఎందుకు చదువుతున్నాను?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం అలవాటు చేసుకోండి. ఒక అధ్యాపకుడు, పదాలను సరైన విధంగా పలకడం మాత్రమే అన్నివేళలా సరిపోదు. పాఠ్యభాగాన్ని భావోపేతంగా చదివినా కూడా సరిపోకపోవచ్చు. మీరు ఎవరి ప్రశ్నకైనా జవాబిస్తున్నప్పుడు లేదా ఎవరికైనా ప్రాథమిక సత్యాన్ని బోధిస్తున్నప్పుడు చర్చిస్తున్నదాన్ని బలపరిచేలా లేఖనాల్లోని పదాలను గానీ పదబంధాలను గానీ నొక్కిపలకడం మంచిది. అలా పలకకపోతే, మీరు చదివి వినిపిస్తున్నది ఎవరికో వారు అసలు విషయాన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు.

భావాన్ని నొక్కిచెప్పాలంటే, నిర్దిష్ట పదాలను పదబంధాలను నొక్కిపలకాలి కాబట్టి, అనుభవంలేని ప్రసంగీకుడు ఆ పదాలను పదబంధాలను మరీ అతిగా నొక్కిపలికే అవకాశం ఉంది. అది ఎలా ఉంటుందంటే, సంగీతవాద్యాన్ని వాయించడం ఇప్పుడిప్పుడే నేర్చుకోవడం మొదలుపెట్టిన ఒక వ్యక్తి వాయించిన సంగీతపు నోట్లలా ఉంటుంది. అయితే, ఆ వ్యక్తి ప్రాక్టీస్‌ చేస్తున్న కొద్దీ అతను వాయించే “సంగీతపు నోట్లు,” భావాలను ఎంతో రమ్యంగా వెల్లడిచేసే “సంగీతం”లో భాగమవుతాయి.

మీరు ప్రాథమిక విషయాల్లో కొన్నింటిని నేర్చుకొన్న తర్వాత, అనుభవజ్ఞులైన ప్రసంగీకులను గమనించడం ద్వారా ప్రయోజనం పొందగల స్థాయిలో ఉంటారు. వివిధ స్థాయిల్లో నొక్కిచెప్పడం ద్వారా సాధించగల విషయాలేమిటో మీరు త్వరలో గ్రహిస్తారు. చెబుతున్నవాటి అర్థాన్ని స్పష్టం చేసేందుకు నొక్కిచెప్పగల వివిధ పద్ధతుల ఉపయోగానికున్న విలువను గ్రహిస్తారు. భావాన్ని సరిగ్గా స్పష్టం చేయడం అలవరుచుకుంటే, మీ పఠన సామర్థ్యమూ ప్రసంగ సామర్థ్యమూ గణనీయంగా పెరుగుతాయి.

భావాన్ని నొక్కిచెప్పడం అనే ఈ ప్రసంగ లక్షణాన్ని ఇప్పటికి ముగించేయాలనే ఉద్దేశంతో కొంత ప్రయత్నం చేసి, ఆ తర్వాత మానేయకండి. సమర్థవంతంగా మాట్లాడేందుకుగాను, భావాన్ని సరిగ్గా నొక్కిచెప్పడంలో పట్టు సాధించేవరకూ మీరు నొక్కిచెప్పే విధానం ఇతరులకు వినడానికి సహజంగా అనిపించేంతవరకూ కృషి చేస్తూనే ఉండండి.