16
మనోనిబ్బరంతో ఉండడం
ఒక ప్రసంగీకుడు, ప్రత్యేకించి తరచూ ప్రసంగాలు ఇవ్వనివాడైతే ఆయన ప్రసంగమివ్వడానికి లేచి నిలబడేటప్పుడు కంగారుపడడం సాధారణమే. ఒక ప్రచారకుడు ఒక రోజు క్షేత్ర పరిచర్యలో మొదటి కొన్ని ఇండ్లను సమీపిస్తున్నప్పుడు కొంత కంగారుపడుతుండవచ్చు. యిర్మీయా ఒక ప్రవక్తగా నియమించబడినప్పుడు ‘నేను బాలుడనే; మాటలాడుటకు నాకు శక్తి చాలదు’ అన్నాడు. (యిర్మీ. 1:4-6) యెహోవా యిర్మీయాకు సహాయం చేశాడు, ఆయన మీకు కూడ సహాయం చేస్తాడు. కొంతకాలానికి మీరూ మనోనిబ్బరాన్ని పెంపొందించుకోవచ్చు.
మనస్సు నిశ్చలంగా ఉన్న వ్యక్తే మనోనిబ్బరం గల ప్రసంగీకుడు. ఆయన మనస్సు నిశ్చలంగా ఉందన్న విషయం ఆయన నిలబడే విధానంలోను ఆయన కదలికల్లోను స్పష్టమవుతుంది. ఆయన భంగిమ సహజంగా సందర్భానికి తగినవిధంగా ఉంటుంది. ఆయన చేతుల కదలికలు అర్థవంతంగా ఉంటాయి. ఆయన స్వరము భావాలను వ్యక్తం చేస్తుంది, నియంత్రణలో ఉంటుంది.
మనోనిబ్బరంతో ఉండే వ్యక్తిని గురించిన ఈ వర్ణన, నాకు తగదని మీకు అనిపించినప్పటికీ మీరు ఈ విషయంలో మెరుగుపడవచ్చు. ఎలా? ఒక ప్రసంగీకుడు ఎందుకు కంగారుపడతాడో ఆయనకు మనోనిబ్బరం ఎందుకు కొరవడుతుందో చూద్దాం. దానికి కారణం శారీరకమైనదే కావచ్చు.
మీకు ఒక సవాలు ఎదురైనప్పుడు దానితో సరిగ్గా వ్యవహరించాలనుకుంటున్నా అలా వ్యవహరించగలరన్న నమ్మకం మీకు లేదు, మీరు దాని గురించి వ్యాకులత చెందుతారు. ఫలితంగా మెదడు మరింత ఎడ్రినలిన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేయమని శరీరానికి సంకేతం పంపుతుంది. అలా ఉత్పత్తయ్యే ఎడ్రినలిన్ హార్మోన్ గుండె మరింత వేగంగా కొట్టుకునేందుకూ శ్వాస రేటు మారడానికీ విపరీతంగా చెమట పట్టడానికీ లేదా చేతులూ మోకాళ్ళూ వణికేందుకూ స్వరం వణకడానికీ కూడా కారణమవుతుంది. మీ శరీరం తన శక్తిని పెంచుకోవడం ద్వారా మీరు ప్రస్తుత పరిస్థితిలో సరిగ్గా వ్యవహరించడానికి మీకు సహాయపడాలని కృషి చేస్తుంది. అయితే అలా ఉత్పత్తైన శక్తిని నిర్మాణాత్మకమైన ఆలోచనలకూ ఉత్సాహభరితమైన ప్రసంగానికీ ఉపయోగించుకోవడమే ఒక సవాలు.
వ్యాకులతను ఎలా తగ్గించుకోవచ్చు. కొంత వ్యాకులత చెందడం సాధారణమేనని గుర్తుంచుకోండి. అయితే మీరు మనోనిబ్బరాన్ని కాపాడుకోవాలంటే వ్యాకులతను తగ్గించుకొని మీ పరిస్థితితో ప్రశాంతంగా, హుందాగా వ్యవహరించగలగడం అవసరం. మీరు దానిని ఎలా సాధించవచ్చు?
బాగా సిద్ధపడండి. మీ ప్రసంగ సిద్ధపాటుకు సమయాన్ని వెచ్చించండి. మీరు విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకున్నారా లేదా అన్నది నిర్ధారించుకోండి. మీ ప్రసంగంలో చర్చించవలసిన
విషయాలను మీరే ఎంపిక చేసుకోవలసివుంటే, మీ ప్రసంగ విషయాన్ని గురించి మీ ప్రేక్షకులకు ఇప్పటికే ఏమి తెలుసు, మీరు మీ ప్రసంగం ద్వారా నిర్వర్తించదలచుకుంటున్నది ఏమిటి అన్నవి పరిగణలోకి తీసుకోండి. అలా పరిగణలోకి తీసుకోవడం, అత్యంత ప్రయోజనకరమైన సమాచారాన్ని ఎంపికచేసుకోవడానికి మీకు సహాయపడుతుంది. అలా ఎంపికచేసుకోవడం కష్టంగా ఉన్నట్లు మొదట్లో మీకు అనిపిస్తే మీ సమస్యను అనుభవజ్ఞుడైన ఒక ప్రసంగీకుడితో చర్చించండి. మీరు సమాచారాన్ని ప్రయోజనకరంగా అందించగలిగేలా సమాచారాన్నీ ప్రేక్షకులనూ విశ్లేషించడానికి ఆయన మీకు సహాయపడగలడు. మీ ప్రేక్షకులకు ప్రయోజనం చేకూర్చగల సమాచారం మీ దగ్గరుందన్న నమ్మకం మీకున్నప్పుడు, సమాచారం మీ మనస్సులో స్పష్టంగా ఉన్నప్పుడు, దాన్ని పంచుకోవాలన్న మీ కోరిక మూలంగా, ప్రసంగం గురించి మీకున్న భయం తగ్గు ముఖం పట్టనారంభిస్తుంది.మీ ఉపోద్ఘాతానికి ప్రత్యేక శ్రద్ధనివ్వండి. మీరు ప్రసంగాన్ని ఎలా మొదలుపెట్టాలో తెలుసుకోండి. ఒకసారి మీ ప్రసంగం మొదలయ్యిందంటే, మీ కంగారు సద్దుమణిగే అవకాశం ఉంది.
ఈ ప్రాథమిక దశలే క్షేత్ర పరిచర్య కోసం సిద్ధపడేటప్పుడు కూడా వర్తిస్తాయి. మీరు చర్చించాలనుకుంటున్న విషయాన్ని మాత్రమే కాక మీరు సాక్ష్యమివ్వనున్న ప్రజలు ఎటువంటివారన్నది కూడా పరిగణలోకి తీసుకోండి. మీ ఉపోద్ఘాతం గురించి జాగ్రత్తగా ఆలోచించిపెట్టుకోండి. పరిణతిగల ప్రచారకుల అనుభవం నుండి ప్రయోజనం పొందండి.
మీరు ఒక గుంపు ఎదుట ప్రసంగిస్తున్నప్పుడు వ్రాతప్రతిని ఉపయోగిస్తే మరింత మనోనిబ్బరంతో ఉండగలరని మీకు అనిపించవచ్చు. కానీ నిజానికి, మీరు వ్రాతప్రతిని ఉపయోగిస్తే, ప్రసంగిస్తున్న ప్రతిసారీ మరింత కంగారుపడడానికి అది కారణం కావచ్చు. నిజమే, కొందరు ప్రసంగీకులు నోట్సును విస్తృతంగా ఉపయోగిస్తే, మరికొందరు చాలా తక్కువ నోట్సును ఉపయోగిస్తారు. మీ ఆలోచనలను మీ మీది నుండి ప్రస్తుతం చర్చిస్తున్న సమాచారం మీదికి మళ్ళించేదీ మీ వ్యాకులతను తగ్గించేదీ పేపరుమీద వ్రాసుకున్న మాటలు కాదు, మీ ప్రేక్షకుల కోసం మీరు సిద్ధపడిన సమాచారం నిజంగా ప్రయోజనకరమైనదని మీ హృదయంలో మీకున్న నమ్మకమే.
మీ ప్రసంగాన్ని బిగ్గరగా అభ్యసించండి. అలాంటి అభ్యాసం మీరు మీ ఆలోచనలను మాటల్లో పెట్టగలరన్న నమ్మకాన్ని ఇస్తుంది. మీరు అభ్యసిస్తున్న కొద్దీ విషయాలను జ్ఞాపకముంచుకునే విధానాలను అలవరుచుకుంటారు, ఆ విధానాల వల్ల మీరు జ్ఞాపకముంచుకున్న విషయాలు మీరు ప్రసంగించేటప్పుడు సులభంగా మీ మనస్సులో మెదులుతాయి. మీరు అభ్యసిస్తున్నప్పుడు నిజంగానే ప్రసంగమిస్తున్నట్లు ఊహించుకోండి. మీరు మీ ప్రేక్షకులను ఊహించుకోండి. ప్రసంగమిచ్చేటప్పుడు ఎలా చేస్తారో అలాగే ఒక బల్ల దగ్గర కూర్చోండి లేదా నిలబడండి.
సహాయం కోసం యెహోవాకు ప్రార్థించండి. అలాంటి ప్రార్థనకు ఆయన జవాబిస్తాడా? “ఆయననుబట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననునదియే.” (1 యోహా. 5:14) మీరు దేవుణ్ణి ఘనపరచాలనీ ఆయన వాక్యం నుండి ప్రజలు ప్రయోజనం పొందేలా వారికి సహాయపడాలనీ కోరుకుంటే ఆయన తప్పకుండా మీ ప్రార్థనకు జవాబిస్తాడు. ఆ నిశ్చయత, మీరు మీ నియామకాన్ని నిర్వర్తించేందుకు అవసరమైన మనోబలాన్ని పొందేందుకు ఎంతో దోహదపడగలదు. అంతేగాక, మీరు ఆత్మ ఫలాలను అంటే ప్రేమ, సంతోషం, సమాధానం, సాత్వికము, ఆశానిగ్రహము వంటి వాటిని అలవరుచుకుంటుండగా, వివిధ పరిస్థితుల్లో మనోనిబ్బరంతో వ్యవహరించడానికి అవసరమైన మనోవైఖరిని మీరు పెంపొందించుకుంటారు.—గల. 5:22-24.
అనుభవం సంపాదించుకోండి. మీరు క్షేత్రసేవలో ఎంత ఎక్కువగా భాగం వహిస్తే మీకు కంగారు అంత తక్కువగా ఉంటుంది. మీరు సంఘ కూటాల్లో ఎంత తరచుగా వ్యాఖ్యానిస్తే ఇతరుల ఎదుట మాట్లాడడం అంత సులభమవుతుంది. మీరు సంఘంలో ఇచ్చే ప్రసంగాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ మీరు ఒక్కో ప్రసంగానికి ముందు మీకు కలిగే వ్యాకులత తగ్గే అవకాశముంది. ప్రసంగించే అవకాశాలు మరిన్ని ఉండాలని మీరు ఇష్టపడతారా? అలాగైతే పాఠశాలలో ఇతరులు తమ నియామకాలను నిర్వహించలేనప్పుడు వారికి ప్రత్యామ్నాయంగా మీరు స్వచ్ఛందంగా ముందుకు వెళ్ళండి.
పైన చెప్పబడిన దశల ప్రకారం చేసిన తర్వాత మనస్సు నిశ్చలంగా లేదని ఖచ్చితంగా సూచించే లక్షణాలను పరిశీలించడం ప్రయోజనకరంగా ఉంటుందని మీరు గ్రహిస్తారు. ఆ లక్షణాలను గుర్తించి వాటితో వ్యవహరించడమెలాగో నేర్చుకోవడం, మీరు మనోనిబ్బరంతో మాట్లాడేందుకు సహాయపడుతుంది. ఆ లక్షణాలు శారీరకమైనవి గానీ స్వరానికి సంబంధించినవి గానీ కావచ్చు.
శారీరక లక్షణాలు. మీకు మనోనిబ్బరం ఉన్నా కొరవడినా, అది మీరు నిలబడే తీరులోను కదలికల్లోను చేతులు ఉపయోగించే విధానంలోను కనిపిస్తుంది. మొదట చేతుల విషయం గమనిద్దాం. చేతులు వెనక్కి కట్టుకొని ఉండడం, ఇరువైపులా చేతులను బిగపట్టి ఉంచడం, లేదా పోడియమ్‌ని గట్టిగా పట్టుకోవడం; తరచూ చేతులను జేబుల్లో పెట్టడం తీయడం, కోటు బటన్‌లను తీయడం పెట్టుకోవడం, ఊరికే చెంపలను, ముక్కును, కళ్ళజోడును ముట్టుకోవడం; వాచీని, పెన్సిల్‌ని, ఉంగరాన్ని లేదా నోట్సుని కదిలిస్తూ ఉండడం; సంజ్ఞలు ఆకస్మికంగా బలవంతాన చేసినట్లు గానీ అసంపూర్ణంగా గానీ ఉండడం—ఇవన్నీ మనోనిబ్బరం కొరవడడాన్ని చూపిస్తాయి.
ఆత్మవిశ్వాసపు కొరత, అస్తమానం పాదాలను ముందుకూ వెనక్కీ ఈడ్చుతుండడం ద్వారా శరీరాన్ని ఒకవైపు నుండి మరొకవైపుకు కదల్చడం ద్వారా మరీ బిగుసుకుపోయినట్లనిపించే భంగిమలో నిలబడడం ద్వారా తలనూ భుజాలనూ వంచడం ద్వారా తరచూ పెదవులను తడుపుకుంటుండడం ద్వారా, తరచూ మ్రింగుతున్నట్లు చేయడం ద్వారా, అలాగే వేగంగా పైపైకి ఊపిరి పీల్చుకుంటుండడం ద్వారా బయటపడుతుంది.
గుర్తుపెట్టుకొని ప్రయత్నిస్తే కంగారును సూచించే ఈ లక్షణాలను నియంత్రించుకోవచ్చు. ఒక్కొక్కసారి ఒక్కొక్కదాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి. సమస్యను పసిగట్టి దాన్ని నివారించుకునేందుకు మీరు ఏమి చెయ్యాలో ముందుగా ఆలోచించుకోండి. మీరు అలా ప్రయత్నిస్తే మీరు నిలబడే తీరు ద్వారా కదలికల ద్వారా మీ మనోనిబ్బరానికి రుజువునిస్తారు.
స్వర లక్షణాలు. మీరు కంగారుపడుతున్నారనే దానికి స్వరంలో కనిపించే లక్షణాల్లో, అసాధారణమైన విధంగా స్వరస్థాయి పెరగడం, స్వరం వణకడం ఉండవచ్చు. బహుశా మీరు
గొంతును తరచూ సరిచేసుకుంటుండవచ్చు లేదా మరీ వేగంగా మాట్లాడుతుండవచ్చు. స్వరాన్ని నియంత్రించుకునేందుకు బాగా కృషి చేయడం ద్వారా ఈ సమస్యలనూ అలవాట్లనూ అధిగమించవచ్చు.మీకు కంగారుగా ఉన్నట్లయితే వేదిక మీదికి వెళ్ళడానికి ముందు కొంచెం ఆగి గాఢంగా ఊపిరి పీల్చుకోండి. మీ శరీరమంతటినీ విశ్రాంతిగా ఉంచుకునేందుకు కృషి చేయండి. మీ కంగారు గురించి ఆలోచించే బదులు మీరు సిద్ధపడిన విషయాలు మీ ప్రేక్షకులతో ఎందుకు పంచుకోవాలనుకుంటున్నారన్న దానిపై మనస్సు నిలపండి. మీరు మాట్లాడడం మొదలుపెట్టే ముందు మీ ప్రేక్షకులను చూసేందుకు కొన్ని క్షణాలు తీసుకోండి, ముఖంలో స్నేహభావాన్ని వ్యక్తపరుస్తున్న వ్యక్తిని చూసి చిరునవ్వు చిందించండి. ఉపోద్ఘాతం చెప్పేటప్పుడు నెమ్మదిగా మాట్లాడండి, ఆ తర్వాత ప్రసంగంలో లీనమవ్వండి.
ఏమి ఎదురుచూడాలి? భయానుభూతులన్నీ ఒక్కసారే మటుమాయమవుతాయని ఎదురుచూడకండి. వేదిక మీద ప్రసంగించడంలో అనేక సంవత్సరాల అనుభవమున్న చాలామంది ప్రసంగీకులు కూడా ప్రేక్షకుల ఎదుట నిలబడే ముందు కంగారుపడతారు. కానీ వాళ్ళు తమ కంగారును నియంత్రించుకోవడం నేర్చుకున్నారు.
కంగారు బయటికి కనిపించకుండా నివారించుకునేందుకు హృదయపూర్వకంగా ప్రయత్నిస్తే మీ ప్రేక్షకులు మిమ్మల్ని మనోనిబ్బరంగల ప్రసంగీకుడిగా దృష్టిస్తారు. అప్పటికీ మీకు కంగారుపుడుతుండవచ్చు కానీ, వారికి దాని గురించి తెలియకపోవచ్చు.
కంగారు లక్షణాలు కనిపించడానికి కారణమయ్యే ఎడ్రినలిన్ హార్మోన్‌లు అధిక శక్తినిస్తాయన్న విషయం కూడా గుర్తుంచుకోండి. ఆ శక్తిని భావోపేతంగా మాట్లాడేందుకు ఉపయోగించండి.
వీటన్నింటినీ అభ్యసించేందుకు మీరు వేదిక మీదకు వెళ్ళేదాక వేచివుండవలసిన అవసరం లేదు. మనోనిబ్బరంతో ఉండడాన్నీ కంగారుని నిగ్రహించుకోవడాన్నీ మీ దైనందిన జీవితంలో భావోపేతంగా మాట్లాడడాన్నీ నేర్చుకోండి. వేదిక మీదున్నప్పుడూ అలాగే క్షేత్ర పరిచర్యలో ఉన్నప్పుడూ ఆత్మవిశ్వాసం అత్యంత ప్రాముఖ్యం. పైన చెప్పినట్లు నేర్చుకోవడం, అలా ఆత్మవిశ్వాసంతో ఉండేందుకు దోహదపడుతుంది.