కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు మీ జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకోవచ్చు

మీరు మీ జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకోవచ్చు

యెహోవా దేవుడు మానవ మెదడును జ్ఞాపకముంచుకోగల అద్భుతమైన సామర్థ్యముతో సృష్టించాడు. దాంట్లో ఒకసారి ఉంచిన అమూల్యమైనవాటిని తిరిగి తీసుకున్నా ఎంతకూ తరగని అక్షయ భాండాగారములా ఆయన దానిని రూపొందించాడు. మెదడు రూపకల్పన, మానవుడు సదాకాలము జీవించాలన్న దేవుని సంకల్పానికి తగినట్లుగా ఉంది.—కీర్త. 139:14; యోహా. 17:3.

అయితే, మీరు మీ మెదడులోకి తీసుకున్న అధిక సమాచారాన్ని మరిచిపోతున్నట్లుగా మీకు అనిపించవచ్చు. మీకు ఆ సమాచారం కావాలనుకున్నప్పుడు, అది మీ జ్ఞాపకాల పొరల్లో ఎక్కడా ఉన్నట్లు అనిపించదు. అలాంటప్పుడు, మీరు మీ జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకునేందుకు ఏమి చేయగలరు?

ఆసక్తిని పెంచుకోండి

జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకోవడానికి ప్రాముఖ్యమైన వాటిలో ఆసక్తి ఒకటి. మనం ప్రజల మీదా మన చుట్టూ జరుగుతున్నవాటి మీదా ఆసక్తిగలవారిగా ఉండడమూ గమనించేవారిగా ఉండడమూ అలవాటు చేసుకుంటే, మన మెదడు చైతన్యవంతమవుతుంది. అప్పుడు, శాశ్వత విలువ గల దేనినైనా మనం చదివినప్పుడు గానీ విన్నప్పుడు గానీ మనం అలాంటి ఆసక్తితో ప్రతిస్పందించడం మనకు సులభమవుతుంది.

వ్యక్తుల పేర్లను గుర్తుంచుకోవడం కష్టంగా ఉండడం అసాధారణమేమీ కాదు. అయితే, క్రైస్తవులుగా మనకు ప్రజలు ముఖ్యమని తెలుసు. ప్రజలు, అంటే తోటి క్రైస్తవులు, మనం ఎవరికి సాక్ష్యమిస్తామో వాళ్ళు, మనం దైనందిన జీవితావసరాల నిమిత్తం ఎవరితో వ్యవహరిస్తుంటామో వాళ్ళు. మనం నిజంగా గుర్తుంచుకోవలసిన వారి పేర్లను గుర్తుంచుకునేందుకు ఏమి సహాయపడగలదు? అపొస్తలుడైన పౌలు ఒక సంఘానికి పత్రిక వ్రాస్తూ, ఆ సంఘంలోని 26 మంది పేర్లను ఆ పత్రికలో పేర్కొన్నాడు. ఆయనకు వారి మీద ఉన్న ఆసక్తి, వారి పేర్లు ఆయనకు తెలిసివుండడం మాత్రమే గాక, ఆయన వారిలో చాలా మందిని గురించిన నిర్దిష్ట వివరాలను పేర్కొనడాన్ని బట్టి కూడా సూచించబడుతుంది. (రోమా. 16:3-16) ఆధునిక దిన యెహోవాసాక్షుల ప్రయాణ పైవిచారణకర్తలు కొందరు, ప్రతివారం ఒక సంఘం నుండి మరొక సంఘానికి వెళ్తున్నప్పటికీ పేర్లను చక్కగా గుర్తుంచుకుంటారు. వాళ్ళు అలా గుర్తుంచుకోవడానికి ఏమి సహాయపడుతుంది? వాళ్ళు ఎవరితోనైనా మొదటిసారిగా మాట్లాడుతున్నప్పుడు, మాటల్లో అనేకసార్లు వాళ్ళను వాళ్ళ పేరుతో సంబోధించడం అలవాటు చేసుకుంటారు. వాళ్ళు తమ మనోఫలకంపై ఆ వ్యక్తి పేరునూ ఆయన ముఖమునూ రెండింటినీ కలిపి గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంతేకాక, వారు క్షేత్ర పరిచర్యలోను భోజనం చేసే వేళలోను వివిధ వ్యక్తులతో సమయం గడుపుతారు. మీరు ఒక వ్యక్తిని కలుసుకున్నప్పుడు ఆ వ్యక్తి పేరు జ్ఞాపకముంచుకుంటారా? మొదటిగా, పేరు జ్ఞాపకముంచుకోవడానికి గల మంచి కారణాన్ని గ్రహించండి; ఆ తర్వాత పైన ఇవ్వబడిన సూచనల్లో కొన్నింటిని పాటించడానికి ప్రయత్నించండి.

మీరు చదువుతున్నవాటిని జ్ఞాపకముంచుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ విషయంలో మీరు మెరుగుపడడానికి మీకు ఏమి సహాయపడగలదు? ఆసక్తీ అవగాహనా రెండూ మీకు సహాయపడడంలో పాత్ర వహిస్తాయి. మీరు ఏకాగ్రతను నిలపాలంటే, మీరు చదువుతున్నదానిపై శ్రద్ధచూపవలసిన అవసరముంది. మీరు చదవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీ మనస్సు ఎక్కడికెక్కడికో వెళ్తున్నట్లయితే, మీరు ఆ సమాచారాన్ని జ్ఞాపకముంచుకోలేరు. మీరు ఒక సమాచారాన్ని చదువుతున్నప్పుడు మీకు అప్పటికే తెలిసినవాటితో గానీ మీకున్న పరిజ్ఞానముతో గానీ ముడిపెట్టుకుంటూ పోతే మీ అవగాహన పెరుగుతుంది. ‘నేను ఈ సమాచారాన్ని నా జీవితంలో ఎలా, ఎప్పుడు ఆచరణలో పెట్టగలను? ఇతరులకు సహాయపడేందుకు నేను దీనినెలా ఉపయోగించగలను?’ అని మిమ్మల్మి మీరు ప్రశ్నించుకోండి. మీరు ఒక్కొక్క పదాన్ని చదువుకుంటూ పోయే బదులు పదబంధాలను చదువుకుంటూ వెళ్ళడం ద్వారా కూడా మీ అవగాహన పెరుగుతుంది. మీరు మరింత సులభంగా అందులోని విషయాలను అర్థం చేసుకుంటారు, ప్రధాన తలంపులను గుర్తించగలుగుతారు, ఆ విధంగా మీరు వాటిని జ్ఞాపకముంచుకోవడం మరింత సులభమవుతుంది.

పునఃసమీక్షించేందుకు సమయం తీసుకోండి

పునఃసమీక్షించడం ప్రయోజనకరమని విద్యారంగ నిపుణులు నొక్కి చెబుతున్నారు. వెంటనే పునఃసమీక్షించడానికి ఒక నిమిషం వెచ్చిస్తే, సాధారణంగా జ్ఞాపకముంచుకోగల దానికన్నా రెట్టింపు సమాచారం జ్ఞాపకముంటుందని ఒక అధ్యయనంలో ఒక కాలేజీ ప్రొఫెసర్‌ అన్నారు. కాబట్టి మీరు చదవడం ముగించిన వెంటనే గానీ ఒక పెద్ద భాగం చదివిన వెంటనే గానీ దానిలోని ప్రధాన తలంపులను మీ మనస్సులో నాటుకునేందుకు వాటిని మీ మనస్సులో పునఃసమీక్షించుకోండి. మీరు క్రొత్త విషయాలేమైనా తెలుసుకుంటే వాటిని మీ సొంత మాటల్లో ఎలా వివరిస్తారో ఆలోచించండి. మీరు ఒక తలంపును గురించి చదివిన వెంటనే తిరిగి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మీరు ఆ విషయాన్ని ఎక్కువ కాలం జ్ఞాపకం ఉంచుకోగలుగుతారు.

తర్వాత, మీరు చదివిన సమాచారాన్ని, తర్వాతి కొన్ని రోజుల్లోపల వేరే ఎవరితోనైనా పంచుకునే అవకాశం కోసం చూడండి. మీరు దాన్ని మీ కుటుంబ సభ్యునితోనో సంఘంలోని ఒకరితోనో మీతో పనిచేస్తున్న వ్యక్తితోనో తోటి విద్యార్థితోనో పొరుగువారితోనో క్షేత్ర పరిచర్యలో మీరు కలిసిన వ్యక్తితోనో పంచుకోవచ్చు. కీలకమైన వాస్తవాలను మాత్రమే కాక, వాటికి సంబంధించిన లేఖనాధారిత తర్కాన్ని కూడా పంచుకోవడానికి ప్రయత్నించండి. మీరలా చేయడం, ప్రాముఖ్యమైన విషయాలు మీ జ్ఞాపకాల్లో స్థిరపడేందుకు సహాయం చేస్తూ మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది; అది ఇతరులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది.

ప్రాముఖ్యమైన విషయాలను ధ్యానించండి

మీరు చదివిన దానిని మరొకసారి పరిశీలించుకోవడమూ, ఇతరులకు చెప్పడమే కాక, మీరు నేర్చుకొంటున్న ప్రాముఖ్యమైన విషయాలను ధ్యానించడము ప్రయోజనకరమని మీరు గ్రహిస్తారు. బైబిలు రచయితలైన ఆసాపు, దావీదు అలాగే చేశారు. “యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్యకార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును” అని ఆసాపు అన్నాడు. (కీర్త. 77:11,12) అదేవిధంగా దావీదు కూడా, “రాత్రిజాములయందు నిన్ను ధ్యానించు”దును, “పూర్వదినములు జ్ఞాపకము చేసికొనుచున్నాను నీ క్రియలన్నియు ధ్యానించుచున్నాను” అని వ్రాశాడు. (కీర్త. 63:4; 143:5) మీరూ అలా ధ్యానిస్తారా?

ఆ విధంగా మీరు యెహోవా కార్యాలనూ ఆయన లక్షణాలనూ ఆయన చిత్తం గురించి వ్యక్తం చేయబడిన విషయాలనూ ధ్యానిస్తూ ఏకాగ్రతతో లోతుగా ఆలోచించడం, మీరు వాస్తవాలను కేవలం గుర్తుంచుకోవడానికి సహాయం చేయడం కంటే ఎక్కువే చేస్తుంది. మీరు ఆ విధంగా ఆలోచించడాన్ని అలవాటు చేసుకోవడం వల్ల, నిజంగా ప్రాముఖ్యమైన విషయాలు మీ హృదయంలో ముద్రించుకుపోతాయి. మీ అంతరంగ వ్యక్తిత్వం మలచబడుతుంది. మీ జ్ఞాపకాల పొరల్లో స్థిరపడిపోయిన విషయాలు మీ అంతరంగ తలంపులకు ప్రాతినిధ్యం వహిస్తాయి.—కీర్త. 119:16.

దేవుని ఆత్మ వహించే పాత్ర

మనం యెహోవా కార్యాలను గురించిన సత్యాన్నీ యేసుక్రీస్తు చెప్పిన మాటలనూ జ్ఞాపకముంచుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, మనకు సహాయం లభిస్తుంది. యేసు తన మరణానికి ముందటి రాత్రి, “నేను మీయొద్ద ఉండగానే యీ మాటలు మీతో చెప్పితిని. ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును” అని తన అనుచరులకు చెప్పాడు. (యోహా. 14:25,26) ఆయన అలా చెప్పినప్పుడు వారిలో మత్తయి, యోహాను కూడా ఉన్నారు. పరిశుద్ధాత్మ వారికి నిజంగా అలాంటి ఒక సహాయకంగా ఉందా? నిశ్చయంగా! దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత, మత్తయి యేసు జీవితం గురించిన వివరాలుగల మొదటి వృత్తాంతాన్ని వ్రాయడం పూర్తి చేశాడు. ఆ వృత్తాంతంలో కొండమీది ప్రసంగం, క్రీస్తు ప్రత్యక్షతను గురించిన ఈ లోక విధానాంతాన్ని గురించిన విపులమైన సూచన వంటి అమూల్యమైన జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. తమ ప్రభువైన యేసు మరణించిన అరవై ఐదు సంవత్సరాల తర్వాత అపొస్తలుడైన యోహాను సువార్తను వ్రాశాడు. యేసు తన ప్రాణం అర్పించడానికి ముందు అపొస్తలులతో గడిపిన రాత్రి చెప్పిన వివరాలతో సహా వ్రాశాడు. తాము, యేసుతోపాటు ఉన్నప్పుడు ఆయన చెప్పిన విషయాలూ చేసిన కార్యాలూ మత్తయి, యోహానుల జ్ఞాపకాల్లో స్పష్టంగా ఉన్నాయనడంలో సందేహం లేదు. అయితే, యెహోవా తన లిఖిత వాక్యంలో ఉండాలని కోరుకున్న ప్రాముఖ్యమైన వివరాలను వాళ్ళు మరిచిపోకుండా వ్రాసేలా చూడడంలో పరిశుద్ధాత్మ ప్రముఖ పాత్ర నిర్వహించింది.

దేవుణ్ణి నేడు సేవిస్తున్నవారికి కూడా పరిశుద్ధాత్మ సహాయకంగా పనిచేస్తోందా? అందులో సందేహం లేదు! నిజమే, మనం నేర్చుకోని విషయాలను పరిశుద్ధాత్మ మన మనస్సులో ఉంచదు, కానీ గతంలో మనం మన అధ్యయనంలో నేర్చుకొన్న ప్రాముఖ్యమైన విషయాలను తిరిగి జ్ఞాపకం చేసుకొనేందుకు అది తప్పక ఒక సహాయకంగా పనిచేస్తుంది. (లూకా 11:12,13; 1 యోహా. 5:14) నేర్చుకొన్న విషయాలను జ్ఞాపకం చేసుకోవలసిన అవసరం వస్తున్న కొలది, ‘పరిశుద్ధ ప్రవక్తలచేత పూర్వమందు పలకబడిన మాటలను, ప్రభువైన రక్షకుడు . . . మనకు ఇచ్చిన ఆజ్ఞను మనం జ్ఞాపకముచేసి’కొనేలా మన మనస్సులు, అంటే మన ఆలోచనా సామర్థ్యాలు చైతన్యవంతం చేయబడతాయి.—2పేతు. 3:1,2.

‘మరువకయుండుము’

‘మరువకయుండుము’ అని యెహోవా మళ్ళీ మళ్ళీ ఇశ్రాయేలును హెచ్చరించాడు. దానర్థం వాళ్ళు ప్రతి విషయాన్ని సంపూర్ణంగా గుర్తుంచుకోవాలని ఆయన ఆశించాడని కాదు. కానీ, వాళ్లు యెహోవా చేసిన కార్యాలను గురించిన జ్ఞాపకాలను వెనక్కి నెట్టివేస్తూ, వ్యక్తిగత లక్ష్యసాధనలో పడిపోకుండా ఉండవలసింది. యెహోవా దూత ఐగుప్తీయుల ప్రథమ సంతానాన్ని వధించినప్పుడు, అలాగే ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చి, మళ్ళీ కలిపి ఫరోనూ అతని సైన్యాన్నీ సముద్రంలో ముంచేసినప్పుడు తమను రక్షించిన జ్ఞాపకాలను సజీవంగా ఉంచుకోవలసింది. దేవుడు తన ధర్మశాస్త్రాన్ని తమకు సీనాయి కొండమీద ఇచ్చాడనీ, ఆయనే తమను అరణ్యం గుండా నడిపించాడనీ, వాగ్దాన దేశంలోకి నడిపించాడనీ ఇశ్రాయేలీయులు గుర్తు చేసుకోవలసింది. వాళ్ళు మరువకూడదన్నది, ఈ విషయాలను గురించిన జ్ఞాపకాలు వారి దైనందిన జీవితాలపై బలమైన ప్రభావాన్ని చూపాలన్న భావంలోనే.—ద్వితీ. 4:9,10; 8:10-18; నిర్గ. 12:24-27; కీర్త. 136:15.

మరిచిపోకుండా ఉండేందుకు మనం కూడా జాగ్రత్తపడాలి. మనం జీవిత ఒత్తిళ్ళను అధిగమిస్తుండగా, యెహోవా ఎటువంటి దేవుడో, మనకు శాశ్వతమైన పరిపూర్ణ జీవితం ఉండేందుకుగాను, మన పాపాల కోసం విమోచన క్రయధనాన్నిచ్చిన తన కుమారుడు అనే బహుమానం ద్వారా ఆయన కనబరిచిన ప్రేమ ఎటువంటిదో గుర్తు చేసుకొంటూ మనం యెహోవాను జ్ఞాపకముంచుకోవడం అవసరం. (కీర్త. 103:2,8; 106:7,13; యోహా. 3:16; రోమా. 6:23) బైబిలును క్రమంగా చదవడం, సంఘ కూటాల్లోను క్షేత్ర పరిచర్యలోను చురుగ్గా పాల్గొనడం మన మనస్సుల్లో ఈ అమూల్యమైన సత్యాలు సజీవంగా ఉండేలా చేస్తాయి.

నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు, అవి పెద్దవైనా చిన్నవైనా సరే, ప్రాముఖ్యమైన పై సత్యాలను జ్ఞాపకం చేసుకొని అవి మీ ఆలోచనలపై ప్రభావం చూపేందుకు అనుమతించండి. వాటిని మరవకండి. మార్గనిర్దేశం కోసం యెహోవావైపు చూడండి. విషయాలను శారీరక దృక్కోణం నుండి మాత్రమే చూడక, అపరిపూర్ణమైన హృదయ ప్రేరణను నమ్ముకోక, ‘నా నిర్ణయం, దేవుని వాక్యంలోని ఏ సలహాల చేత లేదా సూత్రాల చేత ప్రభావితమవ్వాలి?’ అని మీకై మీరే ప్రశ్నించుకోండి. (సామె. 3:5-7; 28:26) మీరెన్నడూ చదవని, వినని విషయాలను మీరు జ్ఞాపకం చేసుకోలేరు. అయితే, మీరు ఖచ్చితమైన పరిజ్ఞానములోనూ యెహోవా మీది ప్రేమలోనూ ఎదుగుతుండగా, మీ పరిజ్ఞాన భాండాగారం నుండి మీరు జ్ఞాపకం చేసుకోగల పరిధిని విస్తృతం చేసుకొనేందుకు దేవుని ఆత్మ మీకు సహాయపడగలదు. యెహోవా మీద మీకు పెరుగుతున్న ప్రేమ, మీరు మీ పరిజ్ఞానానికి తగినట్లు ప్రవర్తించేలా మిమ్మల్ని పురికొల్పుతుంది.