కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

37

ముఖ్యాంశాలను ప్రత్యేకంగా గుర్తించబడేలా చెప్పడం

ముఖ్యాంశాలను ప్రత్యేకంగా గుర్తించబడేలా చెప్పడం

ప్రసంగంలో ముఖ్యాంశాలు అంటే ఏవి? అవి ప్రసంగం మధ్యలో కేవలం క్లుప్తంగా చెప్పుకుపోయే ఆసక్తికరమైన విషయాలు కావు. అవి మరింతగా విపులీకరించబడే ప్రాముఖ్యమైన విషయాలు. అవి మీరు మీ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఆవశ్యకమైన విషయాలు.

ముఖ్యాంశాలు ప్రత్యేకంగా గుర్తించబడేలా చేసేందుకు ఒక కీలకమేమిటంటే, సమాచారాన్ని జ్ఞానయుక్తంగా ఎంపిక చేసుకొని క్రమబద్ధంగా పొందుపరుచుకోవడమే. ఒక ప్రసంగం కోసం పరిశోధన చేసినప్పుడు ఉపయోగించగల దానికన్నా ఎక్కువ సమాచారం తరచూ లభిస్తుంటుంది. ఉపయోగించవలసిన సమాచారమేదో ఎలా నిర్ణయించుకోవచ్చు?

మొదటిగా, మీ ప్రేక్షకులను పరిగణలోకి తీసుకోండి. మీరు చెబుతున్న సమాచారం వాళ్ళకు బాగా తెలుసా, అసలు తెలియదా? ఆ విషయం గురించి బైబిలు చెప్పేదానితో వాళ్ళలో ఎక్కువ మంది ఏకీభవిస్తారా, లేక దానిని అనుమానించేందుకే మొగ్గుచూపుతారా? ఈ విషయం గురించి బైబిలు చెబుతున్నదాన్ని వాళ్ళు తమ దైనందిన జీవితంలో అన్వయించుకోవడానికి కృషి చేస్తున్నప్పుడు, ఎటువంటి సవాళ్ళను ఎదుర్కొంటున్నారు? రెండవదిగా, మీరు ఆలోచించి పెట్టుకున్న విషయంపై మీ శ్రోతలతో మాట్లాడడం ద్వారా మీరు సాధించాలనుకుంటున్న లక్ష్యమేమిటో మీ మనస్సులో స్పష్టంగా ఉండేలా చూసుకోండి. ఈ రెండు మార్గదర్శకాలను ఉపయోగిస్తూ సమాచారాన్ని మదింపు చేసుకొని, నిజంగా సముచితమైన సమాచారాన్ని మాత్రమే ఉంచుకోండి.

చర్చాంశమూ ముఖ్యాంశాలూ గల ఒక ఆధార సంక్షిప్త ప్రతి మీకివ్వబడితే మీరు దాని ఆధారంగానే ప్రసంగించాలి. అయితే ఒక్కొక్క ముఖ్యాంశాన్ని విపులీకరించేటప్పుడు పై విషయాలను మనస్సులో ఉంచుకుంటే మీరు అందించే సమాచారం విలువ చాలా పెరుగుతుంది. సంక్షిప్త ప్రతి ఇవ్వనప్పుడు ముఖ్యాంశాలను మీరే ఎంపిక చేసుకోవచ్చు.

మీ మనస్సులో ముఖ్యాంశాలు స్పష్టంగా ఉన్నప్పుడు, వాటి క్రింద వాటి వివరాలను క్రమబద్ధంగా పొందుపరుచుకుంటే ప్రసంగమివ్వడం మీకు మరింత సులభమవుతుంది. అదేవిధంగా, మీ ప్రేక్షకులు కూడా దాని నుండి ఇంకా ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది.

మీ సమాచారాన్ని క్రమబద్ధంగా పొందుపరుచుకునేందుకు వివిధ మార్గాలు. మీ ప్రసంగపు ముఖ్యభాగాన్ని క్రమబద్ధంగా పొందుపరుచుకోవడంలో వివిధ రకాల పద్ధతులను అనుసరించవచ్చు. మీరు వాటిని బాగా నేర్చుకొంటుండగా, మీ ప్రసంగ లక్ష్యాన్ని బట్టి అనేక పద్ధతులను సమర్థవంతంగా ఉపయోగించవచ్చని గ్రహిస్తారు.

వివిధ ఉపయోగాలు గల పద్ధతిలో చర్చాంశముల అనుసారమైన ఉప విభాగం ఉంది. (ప్రతి ముఖ్యాంశమూ అవసరమే, ఎందుకంటే అది సమాచారం గురించి మీ శ్రోతలకున్న అవగాహనను మరింత పెంచుతుంది, లేదా మీరు మీ ప్రసంగ లక్ష్యాన్ని చేరుకునేందుకు సహాయపడుతుంది.) మరొక పద్ధతి కాలక్రమానుసార పద్ధతి. (ఉదాహరణకు, జలప్రళయానికి ముందటి సంఘటనలను చెప్పిన తర్వాత, సా.శ. 70లో యెరూషలేము నాశనం చేయబడడానికి ముందు జరిగిన సంఘటనలను ఆ తర్వాత, మన కాలంలోని సంఘటనలను చెప్పవచ్చు.) మూడవ పద్ధతి కారణమూ ఫలితమూ క్రమంలో చెప్పే పద్ధతి. (క్రమం మార్చి, ఫలితమూ కారణమూ క్రమంలో కూడా చెప్పవచ్చు. ఉదాహరణకు ఫలితాన్ని అంటే, ప్రస్తుత పరిస్థితిని గురించి మాట్లాడడం మొదలుపెట్టి ఆ తర్వాత దానికి కారణాన్ని చెప్పవచ్చు.) నాలుగవ పద్ధతిలో వ్యతిరేక విషయాలను చెప్పడం ఉంది. (మంచినీ చెడునూ లేదా అనుకూలమైన దాన్నీ ప్రతికూలమైన దాన్నీ తేడా చూపిస్తూ చెప్పవచ్చు.) కొన్నిసార్లు ఒక ప్రసంగంలోనే ఒకటి కన్నా ఎక్కువ పద్ధతులను ఉపయోగించవచ్చు.

యూదుల మహాసభ ఎదుట స్తెఫనుపై అబద్ధారోపణ చేయబడినప్పుడు ఆయన శక్తివంతంగా ప్రసంగించాడు. అప్పుడాయన కాలక్రమానుసారమైన పద్ధతిని పాటించాడు. మీరు ఆ ప్రసంగాన్ని అపొస్తలుల కార్యములు 7:2-53 లో చదువుతున్నప్పుడు, ఎంపిక చేయబడిన అంశాలకు నిర్దిష్టమైన ఉద్దేశముందన్నది గమనించండి. తన శ్రోతలు కాదనలేని చరిత్రనే తాను చెప్పబోతున్నానని స్తెఫను మొదట స్పష్టం చేశాడు. యోసేపు తన సహోదరుల చేత తిరస్కరించబడినప్పటికీ విడుదల దయచేయడానికి దేవుడు ఆయనను ఉపయోగించాడని సూచించాడు. తర్వాత, దేవుడు ఉపయోగిస్తున్న మోషేకు యూదులు అవిధేయత చూపించారని ఆయన తెలియజేశాడు. యూదుల మునుపటి తరాల వారు చూపించిన స్ఫూర్తినే యేసుక్రీస్తు మరణానికి కారకులైనవారూ చూపించారని నొక్కిచెబుతూ తన ప్రసంగాన్ని ముగించాడు.

మరీ ఎక్కువ ముఖ్యాంశాలను కాదు. ఏ చర్చాంశాన్నైనా విపులీకరించడంలో అత్యవసరమైన అంశాలు కొన్ని మాత్రమే ఉంటాయి. చాలా వరకు, వాటిని ఒక చేతి వ్రేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. మీరు మాట్లాడేది 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా 30 నిమిషాలైనా ఇంకా ఎక్కువ సేపైనా సరే అది నిజం. మరీ ఎక్కువ అంశాలను ప్రత్యేకంగా గుర్తించబడేలా చేయాలని ప్రయత్నించకండి. మీ శ్రోతలు ప్రసంగంలోని భిన్నమైన కొన్ని విషయాలను మాత్రమే సహేతుకంగా గ్రహించగలుగుతారు. ప్రసంగం ఎంత సుదీర్ఘమైనదైతే కీలకాంశాలు అంత బలంగా, అంత నిర్దిష్టంగా తెలియజేయబడాలి.

మీరు ఎన్ని అంశాలను ఉపయోగిస్తున్నప్పటికీ ప్రతి అంశాన్ని తగినంత మేరకే విపులీకరించడానికి చూడండి. ఒక్కొక్క ముఖ్యాంశం గురించి ఆలోచించేందుకు కావలసినంత వ్యవధిని ప్రేక్షకులకు ఇవ్వండి, అప్పుడు అవి వాళ్ళ మనస్సుల మీద బలంగా ముద్రించుకుపోతాయి.

మీ ప్రసంగం సులభంగా అర్థమవుతుందన్న అభిప్రాయం వారికి కలగాలి. అది ఎల్లప్పుడూ ఎంత సమాచారం అందించబడుతుందన్న దానిపై ఆధారపడివుండదు. మీరు చెప్పే విషయాలు కేవలం కొన్ని ప్రధాన శీర్షికల క్రింద స్పష్టంగా వర్గీకరించబడితే, వాటిని ఒక్కొక్కటిగా విపులీకరిస్తే ఆ ప్రసంగాన్ని అర్థం చేసుకోవడం సులభమవుతుంది, మరిచిపోవడం కష్టమవుతుంది.

మీ ముఖ్యాంశాలను ప్రత్యేకంగా గుర్తించబడేలా చూడండి. మీరు మీ సమాచారాన్ని సరైన విధంగా క్రమబద్ధంగా పొందుపరుచుకుంటే, మీ ప్రసంగంలో ముఖ్యాంశాల ప్రాముఖ్యతను బలపరచడం కష్టమేమీ కాదు.

ఒక ముఖ్యాంశాన్ని ప్రత్యేకంగా గుర్తించేలా చేసేందుకు ప్రధాన మార్గం, ముఖ్య విషయం మీద మనస్సు నిలిపే విధంగా, దాన్ని విపులీకరించే విధంగా రుజువులనిచ్చే అంశాలనూ లేఖనాలనూ ఇతర సమాచారాన్నీ ఉపయోగించడమే. ద్వితీయ ప్రాముఖ్యతగల అంశాలు ముఖ్యాంశాన్ని స్పష్టం చేసి నిరూపించి విపులీకరించేవిగా ఉండాలి. సంబంధం లేని విషయాలు కేవలం ఆసక్తికరమైనంత మాత్రాన వాటిని చేర్చుకోకండి. మీరు ద్వితీయ ప్రాముఖ్యతగల అంశాలను విపులీకరిస్తుండగా, అవి బలపరిచే ముఖ్యాంశాలతో వాటికుండే సంబంధాన్ని స్పష్టంగా తెలియజేయండి. ఆ సంబంధాన్ని తెలుసుకునే బాధ్యతను ప్రేక్షకులకే వదిలేయకండి. మధ్యమధ్యలో, ముఖ్య విషయాన్ని వ్యక్తం చేసే కీలక పదాలను మళ్ళీ చెప్పడం ద్వారా, ముఖ్యాంశ సారాంశాన్ని మళ్ళీ చెప్పడం ద్వారా ఆ సంబంధాన్ని చూపించవచ్చు.

కొందరు ప్రసంగీకులు, ముఖ్యాంశాలను మొదటిది రెండవది అంటూ ఒక్కొక్కటీ పేర్కొంటూ ప్రత్యేకంగా తెలుపుతారు. ముఖ్యాంశాలను ప్రత్యేకంగా తెలియజేసేందుకు అది ఒక మార్గమే అయినా, సమాచారాన్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవడానికీ తర్కబద్ధంగా విపులీకరించడానికీ అది ప్రత్యామ్నాయం కాకూడదు.

మీరు బలపరిచే వాదనను తెలియజేసే ముందు ప్రారంభంలోనే ముఖ్యాంశాన్ని పేర్కొనాలని మీరు ఎంపిక చేసుకోవచ్చు. అలా పేర్కొనడం, చెప్పబోతున్న దాని విలువను గ్రహించేందుకు ప్రేక్షకులకు సహాయపడుతుంది, ముఖ్యాంశాన్ని నొక్కిచెబుతుంది కూడా. మీరు ఆ అంశాన్ని పూర్తిగా విపులీకరించిన తర్వాత, దాన్ని సంగ్రహంగా చెప్పడం ద్వారా మరింత బలపరచవచ్చు.

క్షేత్ర పరిచర్యలో. పైన చర్చించిన సూత్రాలు నియత ప్రసంగాలకు మాత్రమే కాక, మీరు క్షేత్ర పరిచర్యలో చేసే సంభాషణలకు కూడా వర్తిస్తాయి. వాటికి సిద్ధపడేటప్పుడు, ఆ ప్రాంతంలోని ప్రజల మనస్సుల్లో మెదులుతున్న ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితిని పరిగణలోకి తీసుకోండి. బైబిలు ఇచ్చే నిరీక్షణ ఆ పరిస్థితిని ఎలా పరిష్కరిస్తుందో తెలియజేయడానికి అవకాశమిచ్చే చర్చాంశాన్ని ఎంపిక చేసుకోండి. ఆ చర్చాంశాన్ని విపులీకరించేందుకు రెండు ముఖ్యాంశాలను ఎంపిక చేసుకోండి. ఆ అంశాలను బలపరచడానికి ఏ లేఖనాలను ఉపయోగించుకుంటారో నిర్ణయించుకోండి. ఆ తర్వాత, చర్చను ఎలా మొదలుపెట్టాలో ఆలోచించి పెట్టుకోండి. అలాంటి సిద్ధపాటు, సంభాషణలో అవసరమైన మార్పులు చేసుకోవడానికి వీలు కలిగిస్తుంది. గృహస్థులు గుర్తుంచుకునేలా ఏదైనా చెప్పడానికి కూడా మీకు దోహదపడుతుంది.