20
లేఖనాలకు సమర్థవంతమైన ఉపోద్ఘాతమివ్వడం
లేఖనాలు, మన సంఘ కూటాల్లో ఇవ్వబడే ఉపదేశానికి పునాది వేస్తాయి. క్షేత్ర పరిచర్యలో మనం చెప్పే ముఖ్య విషయాలకు ఆధారం కూడా బైబిలు వచనాలే. అయితే బైబిలు వచనాలు చర్చలకు ఎంతగా దోహదపడతాయన్నది, వాటికి ఎంత సమర్థవంతమైన ఉపోద్ఘాతాలివ్వబడుతున్నాయన్న దాని మీద కొంతవరకు ఆధారపడి ఉంటుంది.
కాబట్టి ఒక లేఖనాన్ని పేర్కొని మీతోపాటు దానిని చదవమని ఒకరిని ప్రోత్సహించడం కంటే ఎక్కువే చెయ్యాలి. ఒక లేఖనానికి ఉపోద్ఘాతమిచ్చేటప్పుడు, ఈ రెండు లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నించండి: (1) ఇంకా ఏమి చెప్పబోతున్నారా అని శ్రోతలు ఎదురుచూసేలా చేయండి (2) ఆ లేఖనాన్ని ఉపయోగించడానికి గల కారణం మీదే మాట్లాడండి. ఈ లక్ష్యాలను వివిధ పద్ధతుల్లో సాధించవచ్చు.
ఒక ప్రశ్న అడగండి. ఈ పద్ధతి, మీ శ్రోతలకు మీ ప్రశ్నకు జవాబు అప్పటికింకా స్పష్టం కానప్పుడు అత్యంత సమర్థవంతంగా ఉంటుంది. ప్రజలను ఆలోచింపజేసేలా ప్రశ్నను తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి. యేసు అలాగే చేశాడు. పరిసయ్యులు దేవాలయంలో యేసు దగ్గరకు వచ్చి, లేఖనాల గురించి ఆయనకున్న అవగాహనను బహిరంగంగా పరీక్షించినప్పుడు, ‘క్రీస్తునుగూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడు?’ అని ఆయన వారిని అడిగాడు. ‘ఆయన దావీదు కుమారుడు’ అని వాళ్ళు జవాబు చెప్పారు. అప్పుడు యేసు, కీర్తన 110:1 ఉటంకిస్తూ, “దావీదు ఆయనను ప్రభువని ఆత్మవలన ఏల చెప్పుచున్నాడు?” అని అడిగాడు. దానితో వాళ్ళ నోళ్ళు మూతబడ్డాయి. అయితే జనసమూహం యేసు మాట్లాడుతుండగా ఆహ్లాదంగా విన్నారు.—మత్త. 22:41-46.
క్షేత్ర పరిచర్యలో ఈ విధంగా ఉపోద్ఘాత ప్రశ్నలు అడిగి లేఖనాలను చెప్పవచ్చు: “మీకూ నాకూ సొంత పేర్లున్నాయి. దేవుడికి సొంతంగా ఒక పేరుందా? దీనికి జవాబును కీర్తన 83:18 లో మనం చూడవచ్చు.” “ఎప్పటికైనా సర్వమానవాళిని ఒకే ప్రభుత్వం పరిపాలిస్తుందంటారా? ఈ ప్రశ్నకు జవాబు కోసం దానియేలు 2:44 గమనించండి.” “నేడు మన కాలంలో ఉన్న పరిస్థితులను గురించి నిజానికి బైబిలు ఏమైనా చెబుతోందా? మీకు తెలిసిన పరిస్థితులను 2 తిమోతి 3:1-5 వచనాల్లో చెప్పబడిన పరిస్థితులతో పోల్చండి.” “బాధలూ మరణమూ ఏనాటికైనా అంతమవుతాయా? దీనికి బైబిలిస్తున్న జవాబు ప్రకటన 21:4,5 వచనాల్లో కనిపిస్తుంది.”
ఒక ప్రసంగంలో లేఖనాలకు ఉపోద్ఘాతంగా మీరు జాగ్రత్తగా అడిగే ప్రశ్నలు, తమకు తెలిసిన వాక్యాలనే క్రొత్త కోణంలో చూడడానికి ప్రేక్షకులను పురికొల్పగలవు. అయితే మీ ప్రశ్నలు అలా పురికొల్పుతాయా? మీరు అడిగే ప్రశ్నలు అలా పురికొల్పుతాయా లేదా అన్నది, అవి వారు నిజంగా
చింతిస్తున్న విషయాలతో సంబంధం గలవా సంబంధం లేనివా అన్నదాన్ని బట్టి ఉండవచ్చు. మీరు చెప్పే విషయం ప్రేక్షకులకు ఆసక్తికరమైనదే అయినప్పటికీ వాళ్ళు అనేకసార్లు విన్న వచనాలనే మీరు చదువుతున్నప్పుడు వాళ్ళ మనస్సులు అటూ ఇటూ వెళ్ళవచ్చు. అలా జరగకుండా ఉండేలా మీ అందింపును ఆకట్టుకునేదిగా చేసుకునేందుకు మీరు చెప్పబోయే సమాచారం గురించి బాగా ఆలోచించాలి.ఒక సమస్యను పేర్కొనండి. మీరు ఒక సమస్యను పేర్కొని పరిష్కారాన్ని తెలియజేసే లేఖనం వైపుకు వాళ్ళ మనస్సును నేరుగా మళ్ళించండి. మీ శ్రోతలు తాము పొందబోతున్న సమాచారం కన్నా ఎక్కువ సమాచారం కోసం ఎదురుచూసేలా చేయకండి. తరచూ ఒక లేఖనం కొంత పరిష్కారాన్ని మాత్రమే తెలుపుతుండవచ్చు. అయినప్పటికీ మీరు వచనాన్ని చదువుతున్నప్పుడు ప్రస్తుత పరిస్థితికి సంబంధించి అది ఎటువంటి మార్గదర్శనాన్ని ఇస్తుందో గమనించమని మీ ప్రేక్షకులను కోరవచ్చు.
అదేవిధంగా మీరు దైవిక నడవడిని గురించిన ఒక సూత్రాన్ని చెప్పి, దాన్ని పాటించడం ఎంత జ్ఞానయుక్తమో తెలియజేయడానికి బైబిలులోని ఒక వృత్తాంతాన్ని దృష్టాంతంగా ఉపయోగించండి. ఒక లేఖనంలో, చర్చించబడుతున్న విషయానికి సంబంధించి రెండు (లేదా బహుశా అంతకన్నా ఎక్కువ) నిర్దిష్ట అంశాలు ఉంటే, వాటిని ప్రత్యేకంగా గమనించమని కొందరు ప్రసంగీకులు ప్రేక్షకులను కోరతారు. ఒక సమస్యను అర్థం చేసుకోవడం నిర్దిష్ట ప్రేక్షకుల గుంపుకు కష్టంగా ఉంటున్నట్లనిపిస్తే, ఆ సమస్యకు దారితీయగల వివిధ పరిస్థితులను పేర్కొనడం ద్వారా వారి ఆలోచనా శక్తిని ప్రేరేపించి, ఆ తర్వాత, ఆ వచనమూ దాని అన్వయమూ జవాబివ్వడానికి అనుమతించండి.
బైబిలును ఆధికారిక గ్రంథంగా సూచించండి. మీరు చెప్పే విషయం మీద ఇప్పటికే మీరు ఆసక్తిని రేకెత్తించి దాని ఒక పార్శ్వానికి సంబంధించి ఒకటి గానీ అంతకన్నా ఎక్కువ గానీ అభిప్రాయాలను పేర్కొన్నట్లయితే, ఒక లేఖనానికి ఉపోద్ఘాతంగా “ఈ విషయం గురించి దేవుని వాక్యం ఏమి చెబుతుందో చూడండి” అని చెప్పవచ్చు. ఈ ఉపోద్ఘాతం, మీరు చదవబోతున్న సమాచారం ఆధికారికమైనదనడానికి కారణమేమిటో చూపిస్తుంది.
బైబిలులోని కొన్ని భాగాలను వ్రాయడానికి పేతురు, పౌలు, యోహాను, లూకా మొదలైన పురుషులను యెహోవా ఉపయోగించుకున్నాడు. అయితే వాళ్ళు కేవలం లేఖకులు మాత్రమే; గ్రంథకర్త యెహోవాయే. ప్రత్యేకించి పరిశుద్ధ లేఖనాల విద్యార్థులుకాని వారితో మాట్లాడేటప్పుడు, “పేతురు వ్రాశాడు” అని గానీ “పౌలు అన్నాడు” అని గానీ ఒక వచనానికి ఉపోద్ఘాతమిస్తే, ఆ వచనం దేవుని వాక్యమని తెలియజేసే ఉపోద్ఘాతమంత శక్తివంతంగా ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో, కొన్ని ప్రకటనలకు ఉపోద్ఘాతంగా, “యెహోవా మాట వినుడి” అని చెప్పమని యెహోవా యిర్మీయాకు ఉపదేశించడం గమనార్హం. (యిర్మీ. 7:2; 17:20; 19:3; 22:2) మనం లేఖనాలకు ఉపోద్ఘాతమిచ్చేటప్పుడు యెహోవా నామమును ఉపయోగించినా ఉపయోగించకపోయినా మనం మన చర్చను ముగించే ముందు బైబిలులో ఉన్నది ఆయన వాక్యమే అన్న విషయాన్ని సూచించడానికి కృషి చేయాలి.
సందర్భాన్ని పరిగణలోకి తీసుకోండి. ఒక లేఖనానికి ఉపోద్ఘాతంగా ఏమి చెప్పాలో నిర్ణయించుకునేటప్పుడు మీకు దాని సందర్భం తెలిసి ఉండాలి. కొన్నిసార్లు మీరు సందర్భాన్ని సూటిగా చెబుతారు; అయితే ఒక లేఖన సందర్భం మీరు చెప్పే విషయంపై ఇతర విధాలుగా కూడా ప్రభావం చూపవచ్చు. ఉదాహరణకు దైవభయంగల యోబు మాటలకూ ఆయనను ఓదార్చడానికని వచ్చిన అబద్ధికుల్లో ఒకరు చేసిన వ్యాఖ్యలకూ మీరు ఒకేవిధమైన ఉపోద్ఘాతమిస్తారా? అపొస్తలుల కార్యములు అనే పుస్తకాన్ని లూకా వ్రాశాడు, కానీ ఆయన ఉటంకిస్తున్నవారిలో యాకోబు, పేతురు, పౌలు, ఫిలిప్పు, స్తెఫను, దూతలు, అలాగే గమలీయేలు, క్రైస్తవేతర యూదులు కూడా ఉన్నారు. మీరు ఉటంకించే వచనాన్ని ఎవరికి ఆపాదిస్తారు? ఉదాహరణకు కీర్తనలన్నింటినీ దావీదే కూర్చలేదనీ సామెతల గ్రంథమంతటినీ సొలొమోనే వ్రాయలేదనీ గుర్తుంచుకోండి. బైబిలు లేఖకుడు సంబోధించినది ఎవరినో అక్కడ చర్చించబడిన విషయమేమిటో తెలుసుకోవడం వల్ల కూడా ప్రయోజనముంటుంది.
నేపథ్య సమాచారాన్ని ఉపయోగించండి. ఈ పద్ధతి ముఖ్యంగా బైబిలులోని ఆ వృత్తాంతం జరిగినప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడు మీరు చర్చిస్తున్న పరిస్థితులకు సాదృశ్యంగా ఉన్నాయని మీరు చూపించగలిగితే సమర్థవంతంగా ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో ప్రత్యేకించి ఒక వచనాన్ని అర్థం చేసుకునేందుకు నేపథ్య సమాచారం అవసరం. ఉదాహరణకు మీరు విమోచన క్రయధనం గురించిన ఒక ప్రసంగంలో హెబ్రీయులు 9:12,24 ఉపయోగించాల్సి ఉంటే, మీరు ఈ వచనాలను చదివే ముందు ఉపోద్ఘాతంగా ఈ వచనాలు సూచిస్తున్న గుడారపు అంతర్భాగము గురించి క్లుప్తంగా వివరించవచ్చు. ఆ గుడారపు అంతర్భాగము యేసు పరలోకానికి ఆరోహణమైనప్పుడు ప్రవేశించిన స్థలాన్ని చిత్రీకరిస్తుంది. అయితే మీరు ఏ వచనానికి ఉపోద్ఘాతమిస్తున్నారో ఆ లేఖనం కన్నా దాని నేపథ్య సమాచారం గురించే ఎక్కువగా చెప్పకుండా జాగ్రత్తపడండి.
మీరు లేఖనాలకు ఉపోద్ఘాతమిచ్చే విధానం మెరుగుపడేందుకు, అనుభవజ్ఞులైన ప్రసంగీకులు ఏమి చేస్తున్నారో విశ్లేషించండి. వాళ్ళు ఉపయోగించే వేర్వేరు పద్ధతులను గమనించండి. ఆ పద్ధతుల ప్రభావాన్ని విశ్లేషించండి. మీ సొంత ప్రసంగాలకు సిద్ధమవుతున్నప్పుడు కీలకమైన లేఖనాలను గుర్తించండి, ఒక్కో వచనం ఏ లక్ష్యాన్ని నెరవేర్చాలి అన్న దాని గురించి ప్రత్యేకంగా ఆలోచించండి. ఒక్కో వచనానికి చెప్పవలసిన ఉపోద్ఘాతం గురించి శ్రద్ధగా ఆలోచించి పెట్టుకోండి, అప్పుడు దాన్ని అత్యంత సమర్థవంతంగా చెప్పవచ్చు. మీరు అనుభవం సంపాదిస్తున్న కొద్దీ మీరు ఉపయోగించే వచనాలన్నింటికీ ఇదే పద్ధతిని ఉపయోగించండి. మీ అందింపు ఈ పార్శ్వంలో మెరుగుపడుతున్న కొద్దీ, మీరు మీ మనస్సును దేవుని వాక్యం మీద మరింత ఎక్కువగా నిలపగలుగుతారు.