21
లేఖనాలను సరిగ్గా నొక్కిపలుకుతూ చదవడం
దేవుని సంకల్పాల గురించి మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు, అది ఒక వ్యక్తితో కానివ్వండి వేదిక మీదే కానివ్వండి మీ చర్చ దేవుని వాక్యంపై కేంద్రీకరించబడినదైవుండాలి. సాధారణంగా అలా కేంద్రీకరించడంలో బైబిలు నుండి లేఖనాలను చదవడం ఉంటుంది. అదీ సరిగ్గా చదవాలి.
సరిగ్గా నొక్కి పలకడంలో భావాలు ఉన్నాయి. లేఖనాలను భావోపేతంగా చదవాలి. కొన్ని ఉదాహరణలను పరిశీలించండి. మీరు కీర్తన 37:11 బిగ్గరగా చదివేటప్పుడు అక్కడ వాగ్దానం చేయబడిన క్షేమము కోసం మీరు సంతోషంగా ఎదురుచూస్తున్నారన్నది మీ స్వరంలో వ్యక్తం కావాలి. బాధలు, మరణము అంతమవ్వడానికి సంబంధించి మీరు ప్రకటన 21:4 చదివేటప్పుడు, ప్రవచించబడిన అద్భుతమైన ఉపశమనం గురించి మీకున్న హృదయపూర్వక మెప్పుదల మీ స్వరంలో వ్యక్తమవ్వాలి. పాపభరితమైన “మహా బబులోను” నుండి బయటికి రమ్మనే విజ్ఞప్తివున్న ప్రకటన 18:2,4,5 వచనాలను మీరు చదువుతున్నప్పుడు మీ స్వరంలో అత్యవసర భావం వ్యక్తమవ్వాలి. నిజమే, మనం వ్యక్తంచేసే భావాలు హృదయపూర్వకమైనవై ఉండాలి, కానీ అతిగా ఉండకూడదు. ఎంత భావోద్వేగం సముచితమన్నది, చదివే వచనాన్ని బట్టీ అది ఏ విధంగా ఉపయోగించబడుతుందన్న దాన్ని బట్టీ ఉంటుంది.
సరైన పదాలను నొక్కి పలకండి. ఒక నిర్దిష్ట వచనంపై మీరు చేసే వ్యాఖ్యానాలు ఆ వచనంలోని కేవలం ఒక భాగం గురించే అయితే, మీరు ఆ వచనాన్ని చదివేటప్పుడు ఆ భాగాన్ని ప్రత్యేకంగా నొక్కి పలకాలి. ఉదాహరణకు మీరు మత్తయి 6:33 వ వచనంలో ‘రాజ్యమును మొదట వెదకడం’ అంటే ఏమిటన్నది విశ్లేషించాలని ఉద్దేశిస్తే ఆ వచనాన్ని చదివేటప్పుడు మీరు “నీతి” అనే పదాన్ని గానీ “అప్పుడవన్నియు” అనే పదాన్ని గానీ ప్రత్యేకంగా నొక్కి పలకరు.
సేవా కూటంలోని ఒక ప్రసంగంలో మీరు మత్తయి 28:19 చదవాలని నిర్ణయించుకుంటుండవచ్చు. అప్పడు మీరు ఏ మాటలను నొక్కి పలకాలి? గృహ బైబిలు అధ్యయనాలను ప్రారంభించడంలో శ్రద్ధ చూపించమని ప్రోత్సహించాలనుకుంటే, “శిష్యులనుగా చేయుడి” అన్న మాటలను నొక్కి పలకండి. మరొకవైపు, వలసవచ్చిన ప్రజలకు బైబిలు సత్యాన్ని పంచుకోవలసిన క్రైస్తవ బాధ్యతను చర్చించాలని నిర్ణయించుకున్నా అవసరం ఎక్కువగా ఉన్నచోట సేవచేయాలని కొందరు ప్రచారకులను ప్రోత్సహించాలనుకున్నా, “సమస్త జనులను” అన్న మాటలను మీరు నొక్కిపలకవచ్చు.
తరచూ ఒక ప్రశ్నకు జవాబుగానో ఇతరులు వివాదాస్పదమైనదిగా దృష్టించే వాదనకు మద్దతుగానో ఒక లేఖనం చర్చించబడుతుంది. ఆ లేఖనంలో వ్యక్తం చేయబడిన ప్రతి ఆలోచనను
సమానంగా నొక్కి పలికితే మీరు చర్చిస్తున్న విషయానికీ ఆ లేఖనానికీ ఉన్న సంబంధాన్ని మీ ప్రేక్షకులు అర్థం చేసుకోలేకపోవచ్చు. విషయం మీకు స్పష్టంగా ఉండవచ్చు కానీ వారికి స్పష్టంగా ఉండకపోవచ్చు.ఉదాహరణకు దేవుని నామం ఉన్న బైబిలు నుండి కీర్తన 83:18 వ వచనాన్ని చదువుతున్నప్పుడు ‘మహోన్నతుడు’ అనే పదాన్నే నొక్కి పలికితే, దేవునికి వ్యక్తిగత నామము ఉందని స్పష్టంగా కనిపిస్తున్న వాస్తవాన్ని గృహస్థుడు గ్రహించలేకపోవచ్చు. కాబట్టి మీరు “యెహోవా” అన్న పేరును నొక్కి పలకాలి. అయితే ఆ లేఖనాన్నే యెహోవా సర్వాధిపత్యాన్ని చర్చిస్తున్నప్పుడు ఉపయోగిస్తే ‘మహోన్నతుడు’ అన్న పదాన్నే ముఖ్యంగా నొక్కి పలకాలి. అలాగే, విశ్వాసంతోపాటు క్రియలు ఉండవలసిన ప్రాముఖ్యతను చూపించడానికి యాకోబు 2:24 ఉపయోగిస్తున్నప్పుడు “క్రియల”కు బదులు “నీతిమంతుడని యెంచబడు”నన్న దాన్ని నొక్కి పలికితే, వింటున్న వ్యక్తి అసలు విషయాన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు.
సహాయకరమైన మరొక ఉదాహరణను రోమీయులు 15:7-13 వచనాల్లో చూడవచ్చు. ఈ వచనాలు అన్యులూ సహజ యూదులూ ఉన్న సంఘానికి అపొస్తలుడైన పౌలు వ్రాసిన ఉత్తరంలోనివి. ‘అన్యజనులు దేవుని కనికరమును గూర్చి ఆయనను మహిమపరచుటకు’ క్రీస్తు చేసిన పరిచర్య వల్ల సున్నతి పొందిన యూదులే కాక, సమస్త జనములూ ప్రయోజనం పొందుతారని అపొస్తలుడైన పౌలు ఈ వచనాల్లో వాదిస్తున్నాడు. ఆ తర్వాత, ఆయన అన్యజనులకు ఇవ్వబడిన ఆ అవకాశం వైపుకు మనస్సును మళ్ళిస్తూ నాలుగు లేఖనాలను ఉల్లేఖిస్తున్నాడు. పౌలు మనస్సులో ఉన్న విషయాన్ని నొక్కి తెలిపేందుకు మీరు ఆ ఉల్లేఖనాలను ఎలా చదవాలి? మీరు నొక్కి పలకవలసిన మాటలకు ఏదైనా గుర్తు పెట్టుకుంటున్నట్లయితే, 8, 9 వచనాల్లోని “అన్యజనులు,” “అన్యజనములలో,” 10వ వచనంలోని “అన్యజనులారా,” 11వ వచనంలోని “సమస్త అన్యజనులారా,” “సకల ప్రజలు” అన్న పదాలు, 12వ వచనంలో “అన్యజనుల” అనే పదాలకు గుర్తు పెట్టుకోవచ్చు. వాటిని నొక్కి పలుకుతూ రోమీయులు 15:7-13 వచనాలను చదవడానికి ప్రయత్నించండి. మీరు అలా చదువుతున్నప్పుడు, పౌలు వాదనా సరళి అంతా కూడా ఎంతో స్పష్టంగా, గ్రహించడానికి ఎంతో సులభంగా ఉంటుంది.
నొక్కి పలికే విధానాలు. నిర్దిష్ట ఆలోచనను తెలియజేస్తున్న, ప్రత్యేకంగా గుర్తించబడాలని మీరనుకుంటున్న పదాలను మీరు అనేక విధాల్లో నొక్కి పలకవచ్చు. మీరు ఉపయోగించాల్సిన పద్ధతి, ఆ లేఖనానికీ ప్రసంగ సన్నివేశానికీ తగినట్లుండాలి. అంశాన్ని బట్టీ ఉండాలి. కొన్ని సూచనలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
స్వరం ద్వారా నొక్కిపలకడం. ఈ పద్ధతిలో, నిర్దిష్ట ఆలోచనను తెలియజేసే పదాలను వాక్యంలోని మిగతా పదాలకన్నా ప్రత్యేకంగా వినిపించేలా స్వరంలో ఎటువంటి మార్పు చేయడమైనా ఉంది. స్వరం పెంచడం ద్వారా గానీ తగ్గించడం ద్వారా గానీ నొక్కిపలకవచ్చు. అనేక భాషల్లో స్వరస్థాయిని మార్చడం ద్వారా కూడా నొక్కి పలకడం జరుగుతుంటుంది. అయితే కొన్ని భాషల్లో
అలా చేస్తే భావం పూర్తిగా మారిపోవచ్చు. కీలకమైన మాటలను నెమ్మదిగా పలికినప్పుడు వాటి ప్రాధాన్యత పెరుగుతుంది. స్వరం ద్వారా నొక్కిచెప్పడం సాధ్యంకాని భాషల్లో కావలసిన ఫలితాల కోసం ఆ భాష మాట్లాడేవారు సాధారణంగా ఏమి చేస్తారో అలా చెయ్యాలి.కాస్సేపు ఆగడం. ఒక లేఖనంలోని కీలక భాగాన్ని చదివే ముందు గానీ తర్వాత గానీ చదివే ముందూ అలాగే చదివిన తర్వాత కూడా కాస్సేపు ఆగవచ్చు. మీరు ముఖ్యమైన విషయాన్ని చదివే ముందు కాస్సేపు ఆగడం వల్ల శ్రోతలకు ఉత్కంఠ కలుగుతుంది; చదివిన తర్వాత ఆగడం వల్ల విషయం వారి మనస్సులో బలంగా ముద్రించుకుపోతుంది. అయితే మరీ ఎక్కువసార్లు ఆగితే ఏదీ ప్రత్యేకంగా గుర్తించబడదు.
పునశ్చరణ. మీ అంతట మీరే మధ్యలో ఆగి ఒక పదాన్ని గానీ పదబంధాన్ని గానీ మళ్ళీ చదవడం ద్వారా నిర్దిష్టమైన విషయాన్ని నొక్కి చెప్పగలుగుతారు. తరచూ అభిలషణీయమైన పద్ధతి ఏమిటంటే, ఆ వచనాన్ని పూర్తిగా చదివి ఆ తర్వాత కీలకమైన మాటలను మళ్ళీ చదవడమే.
సంజ్ఞలు చేయడం. శరీర కదలికలు అలాగే ముఖ కవళికలు తరచూ ఒక పదానికి గానీ పదబంధానికి గానీ భావోద్వేగాలను జతచేస్తాయి.
కంఠధ్వని ద్వారా. కొన్ని భాషల్లో శ్రోతలు సరైన విధంగా గ్రహించగలిగేలా, ప్రత్యేకంగా గుర్తించగలిగేలా పదాల నిర్దిష్ట భావాలను కంఠస్వరంలో ధ్వనింపజేస్తూ చదవవచ్చు. ఈ విషయంలో కూడా వివేచన చూపించవలసిన అవసరముంది, ప్రత్యేకించి వ్యంగ్యాన్ని ధ్వనింపజేసేటప్పుడు ఇంకాస్త వివేచన చూపించాలి.
వచనాలను ఇతరులు చదివేటప్పుడు. ఒక గృహస్థుడు ఒక లేఖనాన్ని చదువుతున్నప్పుడు ఆయన నొక్కి పలకవలసిన అవసరం లేని వాటిని నొక్కి పలుకుతుండవచ్చు, లేదా అసలు వేటినీ నొక్కి పలకకపోవచ్చు. అప్పుడు మీరేమి చేయవచ్చు? వచనాల అన్వయాన్ని తెలపడం ద్వారా వాటి అర్థాన్ని స్పష్టం చేయడం మంచిది. అన్వయింపును వివరించిన తర్వాత ఆ వాక్యంలో ఆ నిర్దిష్ట ఆలోచనను తెలియజేస్తున్న పదాల మీదకు నేరుగా శ్రద్ధ మళ్ళించవచ్చు.