25
సంక్షిప్త ప్రతిని ఉపయోగించడం
సంక్షిప్త ప్రతి ఆధారంగా మాట్లాడాలంటే చాలామంది కంగారుపడతారు. తాము చెప్పబోతున్న ప్రతీ మాటను కాగితం మీద వ్రాసుకుంటే లేదా కంఠస్థం చేసుకుంటే తప్ప ధైర్యంగా ఉండలేరు.
అయితే వాస్తవానికి మనమందరం ప్రతిరోజూ వ్రాతప్రతి లేకుండానే మాట్లాడతాం. మనం మన కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ వ్రాతప్రతి లేకుండానే మాట్లాడతాం. మనం క్షేత్ర పరిచర్యలో పాల్గొనేటప్పుడూ వ్రాతప్రతి లేకుండానే మాట్లాడతాం. మనం హృదయపూర్వకంగా ఏకాంతంలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడైనా ఒక గుంపు పక్షాన ప్రార్థన చేస్తున్నప్పుడైనా వ్రాతప్రతి లేకుండానే ప్రార్థిస్తాం.
మీరు ప్రసంగించేటప్పుడు, ఒక వ్రాతప్రతిని ఉపయోగించినా సంక్షిప్త ప్రతిని ఉపయోగించినా తేడా ఏమైనా ఉంటుందంటారా? సిద్ధపడిన వ్రాతప్రతి నుండి చదువుతున్నప్పుడు, తప్పులు దొర్లకుండా ఉన్నా చక్కగా ఎంపిక చేసుకున్న పదాలనే ఉపయోగించడం జరుగుతున్నా హృదయాలను చేరుకోవడంలో ఈ పద్ధతికి కొన్ని పరిమితులున్నాయి. మీరు మరీ ఎక్కువ వాక్యాలను చదువుతున్నప్పుడు మీరు చెప్పే వేగమూ మీ స్వరస్థాయీ మీ స్వరంలోని హెచ్చు తగ్గులూ మీరు సహజంగా సంభాషించే శైలికి భిన్నంగా ఉంటాయి. మీరు తమ గురించి నిజంగా ఆలోచిస్తున్నారని, మీ సమాచారాన్ని తమ పరిస్థితులకు తగినట్లు ఉపయోగిస్తున్నారని ప్రేక్షకులకు అనిపించినప్పుడు వారు ఎంత శ్రద్ధగా వింటారో, మీ దృష్టి ప్రేక్షకుల మీది కన్నా కాగితం మీదే ఉంటే అంత శ్రద్ధగా వినరు. ప్రసంగం నిజంగా పురికొల్పేదిగా ఉండాలంటే పదేపదే నోట్సు చూడకుండా ప్రసంగించడమే ఉత్తమం.
దైనందిన జీవితంలో మనకు సహాయపడేందుకు దైవపరిపాలనా పరిచర్య పాఠశాల రూపొందించబడింది. మనం మన స్నేహితులను కలిసినప్పుడు సంభాషణలో చక్కగా ఎంపిక చేసుకున్న పదాలను ఉపయోగించడం కోసం, ఒక కాగితం బయటికి తీసి దానిలో మనం ముందే వ్రాసిపెట్టుకున్న మన ఆలోచనలను చదవము. క్షేత్రసేవలో మనం ప్రజలతో మాట్లాడాలనుకుంటున్న విషయాలను మరచిపోతామేమో అన్న భయంతో వాటిని చదవడానికి వ్రాతప్రతిని వెంట తీసుకువెళ్ళము. అలాంటి పరిస్థితుల్లో సాక్ష్యమివ్వడం ఎలాగో పాఠశాలలో ప్రదర్శించేటప్పుడు సాధ్యమైనంత సహజంగా మాట్లాడడాన్ని అభ్యసించండి. మనస్సులోనే గానివ్వండి, లిఖితపూర్వకమైనదే గానివ్వండి సంక్షిప్త ప్రతిని మంచిగా తయారుచేసుకుంటే, మీరు చర్చించాలనుకుంటున్న ముఖ్యమైన ఆలోచనలను గుర్తుచేయడానికి సాధారణంగా అది సరిపోతుందని మీరు గ్రహిస్తారు. ఒక సంక్షిప్త ప్రతి ఆధారంగా మాట్లాడడానికీ ప్రసంగించడానికీ అవసరమైన నమ్మకాన్ని మీరు ఎలా పెంపొందించుకోవచ్చు?
మీరు చెప్పే విషయాలను క్రమబద్ధంగా పొందుపరుచుకోండి. మాట్లాడేటప్పుడు సంక్షిప్త ప్రతిని ఉపయోగించాలనుకుంటే మీరు చెప్పే విషయాలను క్రమబద్ధంగా పొందుపరుచుకోవడం అవసరం.
దానర్థం, మీరు ఉపయోగించాలనుకుంటున్న పదాలను ఎంపిక చేసుకోవాలని కాదు. మీరు మాట్లాడే ముందు ఆలోచించాలన్నదే దానర్థం.దైనందిన జీవితంలో అనాలోచితంగా ఠక్కున ఏదో ఒకటి మాట్లాడే వ్యక్తి, రాగల పర్యవసానాల గురించి ఆలోచించకుండా ఒక మాట అనేసి, తాను అలా అనకుండా ఉంటే బాగుండేది అని తర్వాత అనుకోవడం మనం చూస్తుంటాం. మరొక వ్యక్తి, ఒక లక్ష్యమంటూ లేకుండా ఒక విషయం తర్వాత మరొక విషయం అలా మాట్లాడుతూనే ఉంటుండవచ్చు. ఈ రెండు ధోరణులనూ అధిగమించవచ్చు, ఎలాగంటే మాట్లాడడం మొదలుపెట్టే ముందు ఒక క్షణం ఆగి, చెప్పాలనుకుంటున్న విషయాల సంక్షిప్త ప్రతిని మనస్సులో సరళంగా రూపొందించుకోవడం ద్వారా అధిగమించవచ్చు. మొదట మీ లక్ష్యాన్ని మనస్సులో స్థిరపరుచుకోండి, తర్వాత మీరు దాన్ని సాధించేందుకు అనుసరించవలసిన పద్ధతులను ఎంపిక చేసుకోండి, ఆ తర్వాత మాట్లాడడం మొదలుపెట్టండి.
మీరు క్షేత్రసేవ కోసం సిద్ధపడుతున్నారా? మీరు పరిచర్యకు తీసుకువెళ్ళే బ్యాగ్ సర్దుకోవడానికే కాక, మీ ఆలోచనలను క్రమబద్ధంగా పొందుపరుచుకోవడానికి కూడా సమయం తీసుకోండి. మన రాజ్య పరిచర్యలో సూచించబడిన అందింపుల్లో ఒక దానిని ఉపయోగించాలని మీరు నిర్ణయించుకుంటే, అందులోని ముఖ్యమైన విషయాలు మీ మనస్సులో స్పష్టంగా ఉండేందుకు దానిని అనేకసార్లు చదవండి. దాని సారాంశాన్ని ఒకటి రెండు చిన్న వాక్యాల్లో మీకు మీరే చెప్పుకొని చూడండి. మీ సొంత వ్యక్తిత్వానికీ మీ సేవాప్రాంతంలోని పరిస్థితులకూ తగిన పదాలను ఉపయోగించండి. చెప్పవలసిన విషయాల సంక్షిప్త ప్రతిని మనస్సులో రూపొందించుకోవడం సహాయకరంగా ఉంటుందని మీరు గ్రహిస్తారు. ఆ సంక్షిప్త ప్రతిలో ఏమేమి ఉండవచ్చు? (1) మీరు మీ సమాజంలో చాలామందిని కలతపరుస్తున్న ఒక విషయాన్ని ఉపోద్ఘాతంగా పేర్కొనవచ్చు. తన అభిప్రాయం చెప్పమని ఎదుటి వ్యక్తిని ప్రోత్సహించండి. (2) ఆ విషయం గురించి మీరు ఆయనకు చెప్పగల నిర్దిష్ట సమాచారాన్నీ దానితోపాటు ఉపశమనాన్ని తెస్తానని దేవుడు వాగ్దానం చేశాడని సూచించే ఒకటి రెండు లేఖనాలనూ కూడా మీ మనస్సులో ఉంచుకోండి. యెహోవా అలా ఉపశమనాన్ని తెచ్చేది తన రాజ్యం ద్వారానే, అంటే తన పరలోక ప్రభుత్వం ద్వారానే అని నొక్కిచెప్పేందుకు అవకాశముంటే నొక్కిచెప్పండి. (3) మీరు చర్చిస్తున్న విషయానికి సంబంధించి చర్య తీసుకోమని ఆ వ్యక్తిని ప్రోత్సహించండి. మీరు సాహిత్యాన్ని గానీ బైబిలు అధ్యయనాన్ని గానీ లేదా రెండింటినీ ప్రతిపాదించి, చర్చను కొనసాగించేందుకు నిర్దిష్టమైన ఏర్పాట్లను చేయవచ్చు.
సమాచారాన్ని ఈ విధంగా అందించడానికి బహుశా మీకు కావలసిందల్లా మీ మనస్సులో సంక్షిప్త ప్రతిని రూపొందించుకోవడమే కావచ్చు. మీరు మొదటిసారి సందర్శించే ముందు లిఖిత సంక్షిప్త ప్రతిని చూసుకోవాలనుకుంటే, ఆ సంక్షిప్త ప్రతిలో మీ ఉపోద్ఘాతానికి సంబంధించిన కొన్ని పదాలు, ఒకటో రెండో లేఖనాలు, మీరు ముగింపులో చేర్చాలనుకున్న విషయాలకు సంబంధించిన క్లుప్తమైన నోట్సు మాత్రమే ఉండాలి. అలాంటి సంక్షిప్త ప్రతిని తయారుచేసి దానిని ఉపయోగించడం వల్ల ఒక లక్ష్యం లేనట్లు మాట్లాడకుండా సులభంగా గుర్తుండే స్పష్టమైన సందేశాన్ని తెలియజేయగలుగుతాము.
1 పేతు. 3:15,16) సంక్షిప్త ప్రతిని మీ సమాధానానికి పునాదిగా ఉపయోగించండి.
మీ సేవాప్రాంతంలో ఏదైనా ప్రశ్న గానీ అభ్యంతరం గానీ తరచూ ఎదురవుతున్నట్లయితే, మీరు ఆ విషయం మీద పరిశోధన చేయడం సహాయకరంగా ఉంటుందని మీరు గ్రహించవచ్చు. సాధారణంగా, అలాంటప్పుడు మీకు కావలసిందల్లా రెండో మూడో ప్రాథమిక విషయాలు, వాటికి ఆధారాన్నిచ్చే లేఖనాలు. “బైబిలు చర్చనీయాంశములు” లేదా లేఖనముల నుండి తర్కించడం (ఆంగ్లం) పుస్తకంలో ముద్దక్షరాల ఉపశీర్షికలు మీరు సంక్షిప్త ప్రతిని తయారు చేసుకునేందుకు మీకు సరిగ్గా అవసరమైనవాటిని ఇవ్వవచ్చు. లేదా వేరే ఏదైనా సమాచారం నుండి మీకు మంచి ఉల్లేఖనము లభిస్తే దానిని కూడా మీరు చేర్చవచ్చు. క్లుప్తమైన లిఖిత సంక్షిప్త ప్రతిని తయారుచేసుకుని దానికి తోడు ఆ ఉల్లేఖనాన్ని కాపీ తీసుకోవడం గానీ నకలు వ్రాయడం గానీ చేసి లిఖిత సంక్షిప్త ప్రతికి జతచేసి, క్షేత్రసేవ కోసమైన ఉపకరణాలతో పాటు ఉంచుకోండి. ఒక గృహస్థుడు ఆ ప్రశ్నను గానీ అభ్యంతరాన్ని గానీ లేవదీసినప్పుడు, మీ నమ్మకాలకు గల కారణాన్ని తెలిపే అవకాశమిస్తే తప్పకుండా తెలియజేస్తానని ఆయనకు చెప్పండి. (మీరు మీ కుటుంబం తరఫున గానీ ఒక పుస్తక అధ్యయన గుంపు తరఫున గానీ సంఘం తరఫున గానీ ప్రార్థన చేయబోతున్నప్పుడు కూడా మీ ఆలోచనలను క్రమబద్ధంగా పొందుపరుచుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. లూకా 11:2-4 వచనాల ప్రకారం, అర్థవంతమైన ప్రార్థనకు సరళమైన సంక్షిప్త ప్రతిని యేసు తన శిష్యులకు తెలియజేశాడు. యెరూషలేములోని ఆలయ ప్రతిష్ఠ సమయంలో సొలొమోను చాలాసేపు ప్రార్థన చేశాడు. ఆయన ఆ విషయం గురించి ముందుగా ఆలోచించాడన్నది స్పష్టం. ఆయన ప్రార్థనలో మొదట యెహోవా గురించీ ఆయన దావీదుకు చేసిన వాగ్దానం గురించీ; ఆ తర్వాత ఆలయం గురించీ; ఆ తర్వాత నిర్దిష్టమైన పరిస్థితుల గురించీ జన సమూహాల గురించీ మాట్లాడాడు. (1 రాజు. 8:22-53) మనం ఈ ఉదాహరణల నుండి ప్రయోజనం పొందవచ్చు.
మీ ప్రసంగ సంక్షిప్త ప్రతిని సరళంగా ఉంచుకోండి. మీరు తయారు చేసుకున్న సంక్షిప్త ప్రతి, ప్రసంగం ఇచ్చేటప్పుడు ఉపయోగించేందుకేనా? మీ ప్రసంగ సంక్షిప్త ప్రతిలో ఎంత సమాచారాన్ని చేర్చాలి?
సంక్షిప్త ప్రతి ఉద్దేశం, మీరు ప్రసంగించేటప్పుడు విషయాలను గుర్తుచేసుకునేందుకు సహాయపడాలన్నదేనని గుర్తుంచుకోండి. ఉపోద్ఘాతంగా ఉపయోగించుకునేందుకు కొన్ని వాక్యాలను వ్రాసిపెట్టుకోవడం ప్రయోజనకరంగా ఉంటుందని మీరు అనుకోవచ్చు. అయితే ఆ తర్వాత పదాల మీద కాక విషయాల మీదే మనస్సు పెట్టండి. మీరు ఆ విషయాలను వాక్యాలుగా వ్రాయాలనుకుంటే, చిన్న చిన్న వాక్యాలను వ్రాసిపెట్టుకోవడం అభిలషణీయం. మీరు విపులీకరించాలనుకుంటున్న కొన్ని ముఖ్యాంశాలు మీరు తయారు చేసుకున్న సంక్షిప్త ప్రతిలో ప్రస్ఫుటంగా కనిపించాలి. అందుకు, మీరు ఆ అంశాలను పెద్ద అక్షరాల్లో వ్రాసుకొని అండర్‌లైన్ చేసుకోవచ్చు లేదా స్కెచ్‌పెన్‌తో మార్క్ చేసుకోవచ్చు. ప్రతి ముఖ్యాంశం క్రింద, ఆ అంశాన్ని విపులీకరించేటప్పుడు మీరు ఉపయోగించాలనుకుంటున్న విషయాల పట్టికను తయారు చేసుకోండి. మీరు చదవాలనుకుంటున్న లేఖనాలను నోట్ చేసుకోండి. సాధారణంగా లేఖనాలను బైబిలు నుండి చదవడమే ఉత్తమం. మీరు ఉపయోగించాలనుకుంటున్న ఉపమానాలను వ్రాసిపెట్టుకోండి. ఏదైనా మతేతర గ్రంథంలోని సముచితమైన ప్రాముఖ్యమైన ఉల్లేఖనాన్ని కూడా మీరు చేర్చుకోవచ్చు. తెలియజేయవలసిన నిర్దిష్ట వాస్తవాలను కూడా చేర్చుకునేంతగా మీ నోట్సును విస్తృతం చేసుకోండి. మీ సంక్షిప్త ప్రతి పొందికగా ఉంటే, దాన్ని ఉపయోగించుకోవడం మరింత సులభంగా ఉంటుంది.
కొంతమంది, ప్రసంగానికి ఆధారాన్నిచ్చే అంశాలను మాత్రమే సంక్షిప్త ప్రతిలో చేర్చుకుంటారు. ఒక సంక్షిప్త ప్రతిలో కొన్ని కీలక పదాలు, ప్రసంగీకుడు జ్ఞాపకంలో నుండి చేప్పే లేఖన భాగాలు, ఆయన చెప్పాలనుకున్న విషయాలను గుర్తుచేసుకోవడానికి సహాయపడే బొమ్మలు లేదా చిత్రాలు ఉండవచ్చు. ఒక ప్రసంగీకుడు సరళమైన ఈ నోట్సు సహాయంతో సమాచారాన్ని తర్కబద్ధమైన క్రమంలో, సంభాషణా శైలిలో సమర్పించగలడు. అదే ఈ పాఠం లక్ష్యం.
ఈ పుస్తకంలోని 39 నుండి 42 వరకున్న పేజీల్లో, “సంక్షిప్త ప్రతిని తయారు చేసుకోవడం” అనే చర్చను చూడవచ్చు. మీరు “సంక్షిప్త ప్రతిని ఉపయోగించడం” అనే ఈ అధ్యయనం మీద కృషి చేస్తున్నప్పుడు ఆ సమాచారాన్ని చదవడం చాలా సహాయకరంగా ఉంటుంది.
సంక్షిప్త ప్రతిని ఎలా ఉపయోగించాలి? అయితే ఇప్పుడు మీ లక్ష్యం, ప్రసంగ సంక్షిప్త ప్రతిని సిద్ధం చేసుకోవడం మాత్రమే కాదు. దాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి అన్నది కూడా మీ లక్ష్యం.
సంక్షిప్త ప్రతిని ఉపయోగించడంలో మొదటి మెట్టు ప్రసంగమివ్వడానికి సిద్ధపడడమే. ప్రసంగాంశాన్ని చూడండి, ప్రతి ముఖ్యాంశాన్ని చదవండి, ముఖ్యాంశాల్లోని ప్రతిదీ ప్రసంగాంశంతో ఎలా ముడిపడివుందో మీకు మీరే చెప్పుకోండి. ఒక్కో ముఖ్యాంశానికీ ఎంత సమయం వెచ్చించగలరో వ్రాసిపెట్టుకోండి. ఇప్పుడు వెనక్కు వెళ్ళి ముఖ్యాంశాల్లో మొదటిదాన్ని మళ్ళీ అధ్యయనం చేయండి. ఆ అంశాన్ని విపులీకరించేందుకు మీరు ఉపయోగించాలనుకుంటున్న వాదనలను, లేఖనాలను, ఉపమానాలను, ఉదాహరణలను మరొకసారి మననం చేసుకోండి. మీ ప్రసంగంలోని ఆ భాగం మీ మనస్సులో స్పష్టంగా ఉండే వరకు ఆ సమాచారాన్ని అనేక సార్లు చదవండి. మిగతా ముఖ్యాంశాల్లో ప్రతి ఒక్కదాని విషయంలోనూ అలాగే చేయండి. నిర్ణీత సమయానికల్లా ప్రసంగాన్ని పూర్తి చేసేందుకు, అవసరమైతే మీరు ఏ అంశాన్ని వదిలేయగలరో కూడా ఆలోచించుకోండి. ఆ తర్వాత ప్రసంగమంతటినీ మరొకసారి చూసుకోండి. పదాల మీద కాక, విషయాల మీదే దృష్టి కేంద్రీకరించండి. ప్రసంగాన్ని బట్టీపట్టకండి.
మీరు ప్రసంగమిచ్చేటప్పుడు, మీ ప్రేక్షకుల కళ్ళలోకి చూస్తూ మాట్లాడాలి. ఒక లేఖనాన్ని చదివిన తర్వాత, మీరు మళ్ళీ మీ నోట్సు చూడకుండా బైబిలు ఉపయోగించి దానిపై తర్కించగలగాలి. అదే విధంగా మీరు ఒక ఉపమానాన్ని ఉపయోగిస్తున్నట్లయితే మీరు మీ స్నేహితులకు ఎలా చెబుతారో అలా చెప్పాలే గానీ నోట్సు చదివి చెప్పకూడదు. అలా మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక్కో వాక్యం చెప్పడానికి నోట్సు చూడకూడదు. హృదయంలో నుండి మాట్లాడాలి అప్పుడే మీరు మీ శ్రోతల హృదయాలను చేరుకుంటారు.
మీరు సంక్షిప్త ప్రతి ఆధారంగా ప్రసంగించే కళపై పట్టు సాధించినప్పుడు, ప్రతిభావంతుడైన బహిరంగ ప్రసంగీకుడిగా తయారవ్వడానికి అవసరమైన ముఖ్యమైన మొదటి అడుగువేసినవారవుతారు.