12
సంజ్ఞలు, ముఖ కవళికలు
కొన్ని సంస్కృతులకు చెందిన ప్రజలు ఇతర నేపథ్యాలకు చెందిన వారికన్నా స్వేచ్ఛగా సంజ్ఞలు చేస్తుంటారు. నిజానికి, ప్రతి ఒక్కరు మాట్లాడేటప్పుడు ముఖ కవళికలు మారుతుంటాయి, ఏదో ఒకవిధమైన సంజ్ఞలు కూడా చేస్తుంటారు. వ్యక్తిగత సంభాషణలోనూ బహిరంగ ప్రసంగంలోనూ ఇది నిజం.
యేసుకూ ఆయన తొలి శిష్యులకూ సంజ్ఞలు సహజంగానే వచ్చేవి. ఒక సందర్భంలో ఒక వ్యక్తి యేసుతో, నీ తల్లీ సహోదరులూ నీతో మాట్లాడాలనుకుంటున్నారని చెప్పాడు. అందుకు యేసు, “నా తల్లి యెవరు? నా సహోదరు లెవరు?” అని అన్నాడు. ఆయన “తన శిష్యులవైపు చెయ్యి చాపి—ఇదిగో నా తల్లియు నా సహోదరులును; పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు” అని అన్నాడని కూడా బైబిలు చెబుతోంది. (ఇటాలిక్కులు మావి.) (మత్త. 12:48-50) అపొస్తలులైన పేతురూ పౌలూ కూడా సంజ్ఞలు అప్పటికప్పుడు సహజంగా చేసేవారన్న విషయాన్ని బైబిలులోని ఇతర వచనాలతో పాటు అపొస్తలుల కార్యములు 12:17 వ వచనమూ 13:16వ వచనమూ తెలియజేస్తున్నాయి.
విషయాలూ భావాలూ స్వరం ద్వారా మాత్రమే కాక, సంజ్ఞల ద్వారా ముఖ కవళికల ద్వారా కూడా వ్యక్తం చేయబడతాయి. మాట్లాడే వ్యక్తి వాటి ద్వారా వ్యక్తం చేయకపోతే ఆయన ఉదాసీనంగా మాట్లాడుతున్నాడన్న అభిప్రాయం కలగవచ్చు. ఈ భావప్రకటనా మాధ్యమాలు భావానికి తగ్గట్లుగా ఉంటే ప్రసంగం మరెంతో సమర్థంగా ఉంటుంది. మీరు ఫోన్‌లో మాట్లాడేటప్పుడు కూడా సముచితమైన సంజ్ఞలు చేస్తే ఆయా భావాలకు తగినట్లు ముఖ కవళికలను మారిస్తే మీరు చెబుతున్న సందేశానికున్న ప్రాముఖ్యతా మీరు చెబుతున్న విషయాలను గురించి మీకు వ్యక్తిగతంగా కలుగుతున్న భావాలూ మీ స్వరంలో స్పష్టంగా వ్యక్తమవుతాయి. కాబట్టి, మీరు చదువుతున్నా పదేపదే నోట్సు చూడకుండా ప్రసంగిస్తున్నా మీ ప్రేక్షకులు మిమ్మల్ని చూస్తున్నా తమ సొంత బైబిళ్ళను చూస్తున్నా సంజ్ఞలూ ముఖ కవళికలూ విలువైనవే.
మీ సంజ్ఞలూ ముఖ కవళికలూ ఏదో పుస్తకం చూసి నేర్చుకున్నట్లుండకూడదు. మీరు ఎలా నవ్వాలి ఎలా కోప్పడాలి అన్నది అధ్యయనం చేయవలసిన అవసరం మీకెన్నడూ రాలేదు. సంజ్ఞలు మీ అంతరంగ భావాలను కూడా వ్యక్తం చేయాలి. మీ సంజ్ఞలు ఎంత సహజంగా వస్తే అంత మంచిది.
సంజ్ఞలు రెండు రకాలు: వర్ణనాత్మకమైనవి, నొక్కి చెప్పేవి. వర్ణనాత్మక సంజ్ఞలు, ఒక క్రియను లేదా పొడవును వెడల్పును మందాన్ని ఆకృతిని అలాగే ప్రాంతాన్ని తెలియజేస్తాయి. పాఠశాలలో మీరు సంజ్ఞలు చేయడానికి కృషి చేస్తున్నప్పుడు, కేవలం ఒకటి రెండు సంజ్ఞలతో తృప్తిపడకండి. మీ ప్రసంగమంతటిలో కూడా సహజమైన సంజ్ఞలను చేయడానికి ప్రయత్నించండి. అలా చేయడం మీకు కష్టంగా ఉన్నట్లయితే, దిశనూ దూరాన్నీ పరిమాణాన్నీ ప్రాంతాన్నీ గానీ సాపేక్షిక స్థానాలనూ స్థితులనూ గానీ చూపించే పదాలు మీ ప్రసంగంలో ఎప్పుడు వస్తాయో గ్రహించడానికి అప్రమత్తంగా ఉండడం ప్రయోజనకరంగా ఉండవచ్చు. అయితే చాలా సందర్భాల్లో, మీరు చేయవలసిందల్లా ప్రేక్షకులు ఏమనుకుంటారో అని ఆందోళన చెందక, దైనందిన జీవితంలో మీరు ఎలా మాట్లాడతారో ఎలా సంజ్ఞలు చేస్తారో అలా చేస్తూ మీ ప్రసంగంలో లీనమైపోవడమే. ఒక వ్యక్తి ప్రశాంతంగా ఉన్నప్పుడు సంజ్ఞలు సహజంగా వస్తాయి.
నొక్కితెలిపే సంజ్ఞలు భావానుభూతినీ నమ్మకాన్నీ వ్యక్తం చేస్తాయి. విషయాలను ప్రత్యేకంగా తెలియజేస్తాయి, వాటికి జీవం పోస్తాయి, వాటిని మరింత బలపరుస్తాయి. నొక్కి తెలిపే సంజ్ఞలు చాలా ప్రాముఖ్యం. అయితే, జాగ్రత్త! నొక్కి తెలిపే సంజ్ఞలు అలవాటుగా సులభంగా మారగలవు. మీరు ఒకే సంజ్ఞను మళ్ళీ మళ్ళీ చేస్తే అది ప్రసంగాన్ని మరింత సమర్థమైనదిగా చేసే బదులు దానివైపుకే ప్రేక్షకుల శ్రద్ధను మళ్ళించనారంభించవచ్చు. మీకు ఈ సమస్య ఉన్నట్లు మీ పాఠశాల పైవిచారణకర్త సూచించినట్లయితే కొన్నాళ్ళు వర్ణనాత్మక సంజ్ఞలు మాత్రమే చేయడానికి ప్రయత్నించండి. కొంతకాలం తర్వాత, నొక్కితెలిపే సంజ్ఞలు చేయడం మరొకసారి మొదలుపెట్టండి.
నొక్కి తెలిపే సంజ్ఞలను ఎంత మేరకు చెయ్యాలి ఎలాంటి సంజ్ఞలు సముచితమైనవి అన్నది నిర్ణయించుకునేందుకు, మీరు ఎవరితో మాట్లాడుతున్నారో ఆ వ్యక్తుల భావాలను పరిగణలోకి తీసుకోండి. ప్రేక్షకుల వైపు వేలెత్తి చూపితే అది వారికి ఇబ్బందిగా ఉండవచ్చు. కొన్ని సంస్కృతుల్లో మగవాళ్ళు ఆశ్చర్యాన్ని వెలిబుచ్చేందుకు నోటి మీద చెయ్యి పెట్టుకోవడం వంటి కొన్ని సంజ్ఞలను చేస్తే ఆడంగితనంగా దృష్టించబడుతుంది. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో స్త్రీలు స్వేచ్ఛగా చేతులతో సంజ్ఞలు చేయడం వినయరహితమైనదిగా ఎంచబడుతుంది. కాబట్టి అలాంటి ప్రాంతాల్లోని సహోదరీలు, ప్రత్యేకించి ముఖ కవళికల ద్వారా భావప్రకటన చేయవలసిన అవసరముంది. ప్రపంచంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఒక చిన్న గుంపు ఎదుట సంజ్ఞలు అతిగా చేస్తే హాస్యాస్పదంగా దృష్టించబడుతుంది.
మీరు అనుభవాన్ని సంపాదించుకొంటూ ప్రశాంతంగా మాట్లాడుతుండగా నొక్కిపలికేందుకు మీరు చేసే సంజ్ఞలు మీ అంతరంగ భావాలను సహజంగా వెల్లడి చేస్తాయి, మీ నమ్మకాన్నీ నిజాయితీనీ చూపిస్తాయి. అవి మీ మాటలను మరింత అర్థవంతంగా చేస్తాయి.
మీ ముఖ కవళికలు. మీరు నిజానికి ఎలా భావిస్తున్నారన్నదాన్ని, శరీరంలోని ఇతర భాగాల కన్నా తరచూ మీ ముఖమే ఎక్కువగా వ్యక్తం చేస్తుంది. అందులో మీ కళ్ళు, మీ నోటి ఆకృతి, మీరు తలను వంచే విధానం, ఇవన్నీ ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఒక్క మాట కూడా మాట్లాడకుండానే
ఉదాసీనతనూ అసహ్యాన్నీ అయోమయాన్నీ ఆశ్చర్యాన్నీ ఆనందాన్నీ మీ ముఖం వ్యక్తం చేయగలదు. మీ మాటలకు అలాంటి ముఖ కవళికలు తోడైనప్పుడు మీరు చెబుతున్న విషయం కళ్ళకు కట్టినట్లుగా ఉండి భావోద్వేగపరంగా సమర్థవంతంగా ఉంటుంది. సృష్టికర్త మీ ముఖంలో అనేక కండరాల సముదాయాన్నుంచాడు, అంటే మొత్తం 30 కన్నా ఎక్కువ కండరాలను ఉంచాడు. వీటిలో దాదాపు సగం, మీరు నవ్వేటప్పుడు పనిచేస్తాయి.మీరు వేదిక మీదున్నా క్షేత్ర పరిచర్యలో పాల్గొంటున్నా ఆహ్లాదకరమైనదీ ప్రజలకు ఆనందం కలుగజేసేదీ అయిన ఒక సందేశాన్ని ప్రజలతో పంచుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు, ఆ సందేశం ఆహ్లాదకరమైనదని ఆనందం కలుగజేసేదని ఆప్యాయతతో కూడిన మీ చిరునవ్వు ధృవీకరిస్తుంది. మరొకవైపు, మీ ముఖంలో ఎటువంటి భావమూ కనిపించకపోతే, అసలు మీరు హృదయపూర్వకంగా మాట్లాడుతున్నారా అన్న సందేహం తలెత్తవచ్చు.
అంతకన్నా ముఖ్యంగా మీకు వారి గురించి సద్భావమే ఉందని మీ ఒక్క చిరునవ్వు చెబుతుంది. అపరిచితులంటే ప్రజలకు భయం ఉన్న ఈ రోజుల్లో ప్రత్యేకించి చిరునవ్వు చాలా ముఖ్యం. మీ చిరునవ్వు ప్రజలు ప్రశాంతంగా ఉండేందుకూ మీరు చెప్పేది అంగీకరించడానికి ఇంకా ఎక్కువగా ఇష్టపడేందుకూ సహాయపడగలదు.