5
సముచితమైన చోట కాస్సేపు ఆగడం
మాట్లాడేటప్పుడు సముచితమైన చోట ఆగడం ప్రాముఖ్యం. మీరు ప్రసంగిస్తున్నా ఒక వ్యక్తితో మాట్లాడుతున్నా ఇది నిజం. అలా ఆగకుండా చెప్పే ఆలోచనలు స్పష్టంగా ఉండకుండా, గబగబా ఏదో మాట్లాడినట్లు ఉంటుంది. సముచితమైన చోట ఆగడం వల్ల మీ ప్రసంగం స్పష్టంగా ఉంటుంది. మీరు చెప్పిన ముఖ్యమైన విషయాలు చాలాకాలం గుర్తుండిపోయేందుకు కూడా ఆగి చెప్పే పద్ధతిని ఉపయోగించవచ్చు.
మీరు ఎప్పుడు ఆగాలి, ఎంతసేపు ఆగాలి అన్నవి ఎలా నిర్ణయించుకోవచ్చు?
విరామ చిహ్నాలున్న చోట తగినంత సేపు ఆగండి. విరామ చిహ్నాలు లిఖిత భాషలో ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తాయి. అవి ఒక వాక్యం ముగింపును గానీ ఒక ప్రశ్న ముగింపును గానీ సూచించవచ్చు. కొన్ని భాషల్లో ఉల్లేఖనాలు ప్రత్యేకంగా గుర్తించబడేందుకు కూడా విరామ చిహ్నాలు ఉపయోగించబడతాయి. కొన్ని చిహ్నాలు ఒక వాక్యంలోని ఒక భాగానికి మిగతా భాగాలతో ఎటువంటి సంబంధముందో సూచిస్తాయి. ఒక వ్యక్తి తన కోసం చదువుకుంటున్నప్పుడు విరామ చిహ్నాలను చూడగలడు. అయితే ఆయన ఇతరుల ప్రయోజనార్థం గట్టిగా చదువుతున్నప్పుడు లిఖిత సమాచారంలో కనిపించే విరామ చిహ్నాలు సూచించే అర్థాన్ని ఆయన తన స్వరంలో వినిపించాలి. (మరిన్ని వివరాల కోసం, “తప్పులు లేకుండా చదవడం” అనే మొదటి అధ్యయనాన్ని చూడండి.) విరామ చిహ్నాలు సూచిస్తున్న విధంగా ఆగకుండా చదివితే, మీరు చదివేది అర్థం చేసుకోవడం ఇతరులకు కష్టం కావచ్చు, లేదా వాళ్ళు ఆ భాగాన్ని తప్పుగా కూడా అర్థం చేసుకోవచ్చు.
ఎక్కడెక్కడ ఆగడం సముచితమన్నది, విరామ చిహ్నాలను బట్టే కాకుండా, ఒక వాక్యంలో ఆలోచనలు తెలియజేయబడిన విధానంపై కూడా ఆధారపడి ఉంటుంది. “నేను ఉపయోగించే సంగీతపు నోట్లు ఇతర పియానో వాద్యగాళ్ళు ఉపయోగించే సంగీతపు నోట్లకన్నా మెరుగైనవేమీ కావు. కానీ ఆ సంగీతపు నోట్లు సూచించే విరామ చిహ్నాలను పాటించడంలోనే ఉంది కళానైపుణ్యం అంతా” అని ప్రఖ్యాతిగాంచిన ఒక సంగీతకారుడు ఒకసారి అన్నాడు. మాట్లాడే విషయంలో కూడా అంతే. సముచితమైన చోట ఆగడం వల్ల, మీరు సిద్ధపడిన సమాచారం మరింత రమ్యంగా అర్థవంతంగా ఉంటుంది.
బహిరంగంగా చదవడానికి సిద్ధపడేటప్పుడు, మీరు చదవబోయే ముద్రిత సమాచారంలో ఏవైనా గుర్తులు పెట్టుకోవడం సహాయకరంగా ఉండవచ్చు. క్షణంపాటు ఆగవలసిన చోట, బహుశా
సంకోచాన్ని వ్యక్తం చేయవలసిన చోట చిన్న నిలువు గీత గీసుకోండి. ఇంకొంచెం ఎక్కువ ఆగవలసిన చోట ప్రక్కప్రక్కనే రెండు నిలువు గీతలు గీసుకోండి. కొన్ని పదబంధాలు కష్టంగా ఉండి మీరు ఆగకూడని చోట ఆగుతున్నట్లయితే, మీకు కష్టమవుతున్న ఆ పదబంధంలోని పదాలన్నింటినీ కలుపుకొని చదివేలా పెన్సిలుతో ఏదైనా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఆ పదబంధాన్ని మొదటి నుండి చివరి వరకు చదవండి. అనుభవజ్ఞులైన చాలామంది ప్రసంగీకులు ఇలాగే చేస్తారు.దైనందిన సంభాషణల్లో సముచితమైన చోట ఆగి మాట్లాడడం ఒక సమస్య కాదు. ఎందుకంటే మీరు తెలియజేయాలనుకున్న విషయాలు మీకు తెలుసు. అయితే మీరు తెలియజేసే విషయానికి ఎక్కడెక్కడ ఆగాలన్నది పట్టించుకోకుండా ఒక క్రమం చొప్పున మధ్య మధ్య ఆగే అలవాటుంటే, మీ మాటలు శక్తివంతంగా గానీ స్పష్టంగా గానీ ఉండవు. ఈ విషయంలో మెరుగుపడేందుకు సహాయపడే సూచనలు “అనర్గళత” అనే 4వ అధ్యయనంలో ఇవ్వబడ్డాయి.
విషయం మారుతున్నప్పుడు కాస్సేపాగండి. ముఖ్యాంశం నుండి మరొక అంశానికి వెళ్తున్నప్పుడు మీ ప్రేక్షకులు ఆలోచించుకునేందుకు, మారుతున్న కోణానికి తగ్గట్లు వారు తమ దృక్కోణాన్ని మలుచుకునేందుకు, మారుతున్న కోణాన్ని గుర్తించేందుకు, తర్వాత అందించబోయే సమాచారాన్ని ఇంకా స్పష్టంగా గ్రహించేందుకు కాస్సేపు ఆగడం తోడ్పడగలదు. ఒక వీధి నుండి మరో వీధికి మలుపు తిరుగుతున్నప్పుడు నెమ్మదిగా వెళ్ళడం ఎంత ప్రాముఖ్యమో అలాగే మీరు ఒక తలంపు నుండి మరొక తలంపుకు వెళ్ళేటప్పుడు కాస్సేపు ఆగడం కూడా అంతే ప్రాముఖ్యం.
కొందరు ప్రసంగీకులు ఒక విషయం నుండి మరొక విషయానికి ఆగకుండా దూసుకు వెళ్ళడానికి ఒక కారణం, వాళ్ళు మరీ ఎక్కువ సమాచారాన్ని అందించాలని ప్రయత్నించడమే. మరికొందరి విషయానికొస్తే ఆగకుండా మాట్లాడే అలవాటు వారు దైనందిన జీవితంలో మాట్లాడే తీరుకు అద్దంపడుతుంది. బహుశా వాళ్ళ చుట్టూ ఉన్నవాళ్ళందరూ అదేవిధంగా మాట్లాడుతుండవచ్చు. కానీ దానివల్ల బోధన ఫలప్రదంగా ఉండదు. వినదగిన, గుర్తుంచుకోదగిన విషయమేమైనా చెప్పడానికి ఉంటే, ఆ విషయం స్పష్టంగా ప్రత్యేకంగా గుర్తించబడేలా కావలసినంత సమయం తీసుకోండి. మాటల్లో విషయాలను స్పష్టంగా తెలియజేయాలంటే సరైన చోట ఆగడం ముఖ్యమని గుర్తించండి.
మీరు సంక్షిప్త ప్రతినుండి ప్రసంగమివ్వబోతున్నట్లయితే, ముఖ్యాంశాలను చెప్పేటప్పుడు ఎక్కడెక్కడ ఆగాలో స్పష్టం చేసుకుంటూ మీ సమాచారాన్ని క్రమబద్ధంగా పొందుపరుచుకోవాలి. మీరు ఒక వ్రాతప్రతిని చదువుతున్నట్లయితే ముఖ్యమైన ఒక అంశం ముగిసి, మరొక అంశం మొదలయ్యే చోట ఏదైనా గుర్తు పెట్టుకోండి.
విరామ చిహ్నాలను బట్టి ఆగడం కన్నా విషయం మారినప్పుడు సాధారణంగా ఎక్కువసేపు ఆగవలసి ఉంటుంది, అయితే అలా ఆగడం ప్రసంగాన్ని మరీ పొడిగించేంత దీర్ఘంగా ఉండకూడదు. మరీ ఎక్కువసేపు ఆగితే, మీరు సరిగ్గా సిద్ధపడలేదనీ ఇంకేమి చెప్పాలో నిర్ణయించుకోవడానికి ప్రయత్నిస్తున్నారనీ ప్రేక్షకులకు అనిపిస్తుంది.
నొక్కి చెప్పేందుకు కాస్సేపాగి మాట్లాడండి. నొక్కి చెప్పేందుకు కాస్సేపాగి మాట్లాడే పద్ధతి ఆకస్మికంగా ఉంటుంది. ఎలాగంటే ఒక సాధారణ వాక్యాన్ని గానీ ప్రశ్నార్థక వాక్యాన్ని గానీ హెచ్చు స్వరంలో చెప్పే ముందు గానీ చెప్పిన తర్వాత గానీ అలా చెయ్యాల్సి ఉంటుంది. అలా ఆగి మాట్లాడినప్పుడు అంతకుముందు చెప్పబడిన దాని గురించి ఆలోచించుకునే అవకాశం ప్రేక్షకులకు ఉంటుంది లేదా ఇంకా ఏమి చెప్పబోతున్నారా అన్న ఉత్కంఠ వారిలో కలుగుతుంది. ఆలోచించుకునే అవకాశమిచ్చేందుకు ఆగి మాట్లాడడం ఉత్కంఠ కలిగించేందుకు ఆగి మాట్లాడడం రెండూ వేర్వేరు. ఏ పద్ధతిని ఉపయోగించుకోవడం సముచితమో మీరే నిర్ణయించుకోండి. అయితే నిజంగా ప్రాముఖ్యమైన వాక్యాలను నొక్కి చెప్పేందుకు మాత్రమే పైన చెప్పిన విధంగా ఆగి మాట్లాడాలని గుర్తుంచుకోండి. అన్ని వాక్యాలకూ అదేవిధంగా ఆగుతూ మాట్లాడితే ప్రాముఖ్యమైన వాక్యాలకు విలువ లేకుండా పోతుంది.
యేసు, నజరేతులోని సమాజమందిరములో లేఖనాలను బిగ్గరగా చదివేటప్పుడు సందర్భోచితంగా ఆగుతూ చదివాడు. మొదట, ఆయన యెషయా ప్రవక్త వ్రాసిన గ్రంథపు చుట్టలో తన నియామకాన్ని చదివాడు. అయితే దాన్ని అన్వయించే ముందు ఆయన దాన్ని చుట్టి, పరిచారకునికి తిరిగి ఇచ్చి కూర్చున్నాడు. అప్పుడు ఆ మందిరములో ఉన్న వారందరూ ఆయనవైపే చూస్తుండగా ఆయన, ‘నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది’ అని చెప్పాడు.—లూకా 4:16-21.
పరిస్థితులకు అనుగుణంగా ఆగుతూ మాట్లాడండి. మాట్లాడుతున్నప్పుడు మధ్యలో కలిగే అవాంతరాల వల్ల కూడా మీరు ఆగవలసి రావచ్చు. మీరు క్షేత్ర పరిచర్యలో కలిసిన గృహస్థుడితో సంభాషిస్తున్నప్పుడు, వాహనాల రాకపోకల వల్ల లేదా చిన్న పిల్లల ఏడుపు వల్ల మధ్యలో కాస్సేపు ఆగవలసిన అవసరం రావచ్చు. అయితే సమావేశ స్థలంలో ప్రసంగించేటప్పుడు శ్రద్ధ మళ్ళించే చప్పుడు మరీ తీవ్రంగా లేనప్పుడు మీరు ఆగకుండానే గొంతు పెంచి కొనసాగించవచ్చు. ఆ చప్పుడు మరీ పెద్దగా ఉండి కొంచెం ఎక్కువసేపు కొనసాగితే మాత్రం మీరు కాస్సేపు ఆగాలి. ఆ చప్పుడు వల్ల మీ ప్రేక్షకులు ఎలాగు వినలేరు. కాబట్టి మీ ప్రేక్షకులు మీరు చెప్పాలనుకుంటున్న మంచి విషయాల నుండి సంపూర్ణ ప్రయోజనం పొందేందుకు, వారికి సహాయపడాలన్న ఉద్దేశంతో తగినంత సేపు ఆగి మాట్లాడండి.
ప్రతిస్పందించడానికి వీలుగా కాస్సేపాగండి. ప్రేక్షకులు పాల్గొనే అవకాశం మీరిచ్చే ప్రసంగంలో లేకపోయినప్పటికీ పైకి వినబడేలా కాకపోయినా తమ మనస్సులో ప్రతిస్పందించేందుకు వారిని అనుమతించడం ప్రాముఖ్యం. మీ ప్రేక్షకులను ఆలోచింపజేసే ప్రశ్నలు వేసి, తగినంతసేపు ఆగకపోతే ఆ ప్రశ్నలకు అంతగా విలువ లేకుండా పోతుంది.
మీరు వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు మాత్రమే కాక, ఇతరులకు సాక్ష్యమిచ్చేటప్పుడు కూడా మధ్య మధ్యలో ఆగడం ప్రాముఖ్యం. కొంతమంది అసలెప్పుడూ మధ్య మధ్యలో ఆగనట్లు అనిపిస్తుంది. అలా ఆగకుండా మాట్లాడే అలవాటు మీకు కూడా ఉంటే ఈ ప్రసంగ లక్షణాన్ని అలవరుచుకునేందుకు హృదయపూర్వకంగా ప్రయత్నించండి. అప్పుడు మీ భావాలను ఇతరులకు వ్యక్తం చేసే విషయంలోను క్షేత్ర పరిచర్యలో సమర్థవంతంగా మాట్లాడే విషయంలోను మీరు మెరుగుపడతారు. కాస్సేపు ఆగడమంటే ఒక క్షణంపాటు మౌనంగా ఉండడం అని అర్థం. అలా మౌనం వహించడం
విరామాన్నిస్తుంది, విషయాన్ని నొక్కి చెబుతుంది, శ్రద్ధను ఆకర్షిస్తుంది, చెవులు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది అని చెప్పబడుతున్న విషయం నిజం.దైనందిన సంభాషణలో ఆలోచనలను ఒకరితోనొకరు పంచుకోవడం జరుగుతుంది. మీరు ఇతరులు చెప్పేది వింటూ వాళ్ళు చెప్పేదాని మీద ఆసక్తి చూపిస్తే, వాళ్ళు కూడా మీరు చెప్పేది వినడానికి ఇంకా ఎక్కువ మొగ్గు చూపుతారు. తమ భావాలను వ్యక్తంచేసే అవకాశాన్ని వారికిచ్చేందుకు తగినంత సేపు ఆగడం అవసరం.
మనం క్షేత్ర పరిచర్యలో సంభాషణా శైలిలో సాక్ష్యమిచ్చినప్పుడు మరింత సమర్థవంతంగా ఉంటుంది. పలకరింపులు అయ్యాక తాము చెప్పవలసిన విషయాన్ని సూచించిన తర్వాత ఒక ప్రశ్న వేయడం మంచిదని చాలామంది సాక్షులు తెలుసుకొన్నారు. వాళ్ళు ఎదుటి వ్యక్తి జవాబిచ్చే అవకాశమిస్తూ కాస్సేపు ఆగుతారు, అప్పుడు ఆయన చెప్పేది వింటారు. చర్చించేటప్పుడు, గృహస్థుడు వ్యాఖ్యానించేందుకు వాళ్ళు అనేక అవకాశాలను ఇవ్వవచ్చు. సాధారణంగా, చర్చించబడుతున్న విషయం గురించి ఎదుటి వ్యక్తికున్న అభిప్రాయాలు తెలిస్తే ఆయనకు ఇంకా ఎక్కువగా సహాయపడగలరని వాళ్ళకు తెలుసు.—సామె. 20:5.
ప్రశ్నలకు అందరూ అనుకూలంగా ప్రతిస్పందించరన్నది నిజమే. అయితే అది చివరికి తన వ్యతిరేకులకు సహితం మాట్లాడేందుకు అవకాశం లభించేలా తగినంతసేపు ఆగకుండా యేసును ఆటంకపరచలేదు. (మార్కు 3:1-5) అవతలి వ్యక్తికి మాట్లాడే అవకాశమిచ్చినప్పుడు ఆయన ఆలోచించేందుకు ప్రోత్సహించబడతాడు, ఫలితంగా ఆయన తన హృదయంలోని మాటను వెల్లడిచేయవచ్చు. దేవుని వాక్యంలోని ప్రాముఖ్యమైన విషయాల్లో ప్రజలు తప్పకుండా నిర్ణయాలు తీసుకోవాలి, కాబట్టి వాటిని వారికి తెలియజేసి, వారు హృదయపూర్వకంగా ప్రతిస్పందించేలా వారిని ప్రేరేపించాలన్నదే వాస్తవానికి మన పరిచర్య ఉద్దేశాల్లో ఒకటి.—హెబ్రీ. 4:12.
మన పరిచర్యలో సముచితమైన చోట ఆగడం నిజంగా ఒక కళే. అలా సమర్థవంతంగా ఆగుతూ మాట్లాడినప్పుడు విషయాలు మరింత స్పష్టంగా అర్థమవుతాయి, ఎక్కువకాలం గుర్తుండిపోతాయి.