కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

14

సహజత్వం

సహజత్వం

మీరు చెప్పాలనుకున్న విషయాలను సహజంగా తెలపడం మీరు ఇతరుల నమ్మకాన్ని సంపాదించుకునేందుకు సహాయపడుతుంది. ఎవరైనా ముసుగు తొడుక్కొని మీతో మాట్లాడితే, ఆయన చెప్పిన విషయాలను మీరు నమ్ముతారా? ఆ వ్యక్తి తొడుక్కున్న ముసుగు అతని సొంత ముఖంకన్నా అందంగా ఉన్నంత మాత్రాన అది తొడుక్కొని చెప్పిన మాటల మీద ఎక్కువ నమ్మకం కలుగుతుందా? అలా నమ్మకం కలిగే అవకాశం లేదు. కాబట్టి, మీరు మీది కాని వ్యక్తిత్వాన్ని చూపించడానికి ప్రయత్నించే బదులు, సహజంగా ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడండి.

సహజంగా మాట్లాడడమంటే నిర్లక్ష్యంగా మాట్లాడడమని అనుకోకూడదు. వ్యాకరణ దోషంతోనూ ఉచ్చారణ దోషంతోనూ అస్పష్టంగానూ మాట్లాడడం సముచితం కాదు. మీ మాటల్లో అమర్యాదకరమైన భాష కూడా ఉండకుండా జాగ్రత్తపడాలి. మనం మన మాటల్లోను పద్ధతుల్లోను రెండింటిలోనూ ఎల్లప్పుడూ సముచితమైన హుందాతనాన్ని చూపించాలనుకుంటాం. అలా సహజత్వం ఉట్టిపడేలా మాట్లాడేవారు, మరీ నియతంగా గానీ ఇతరులను ముగ్ధులను చెయ్యాలన్న అమితమైన ఆసక్తితో గానీ వ్యవహరించరు.

 క్షేత్ర పరిచర్యలో. సాక్ష్యమివ్వాలన్న ఉద్దేశంతో మీరు ఒక ఇంటిని సమీపిస్తున్నప్పుడు గానీ బహిరంగ స్థలంలో ఎవరినైనా సమీపిస్తున్నప్పుడు గానీ మీకు భయమేస్తోందా? మనలో చాలామందికి భయమేస్తుంది, కాని కొందరు మిగతావాళ్ళ కంటే చాలా ఎక్కువ భయపడతారు. మానసిక ఒత్తిడి వల్ల స్వరం అసహజంగా మారవచ్చు లేదా వణకవచ్చు. లేదా చేతులు గానీ తలగానీ అసహజంగా కదలడం ద్వారా కూడా భయం బహిర్గతం కావచ్చు.

ఒక ప్రచారకుడు అనేక కారణాల వల్ల ఈ సమస్యను ఎదుర్కొంటుండవచ్చు. బహుశా ఆయన ప్రేక్షకులు తన గురించి ఏమనుకుంటారోనని ఆలోచిస్తుండవచ్చు, లేదా సమాచారాన్ని విజయవంతంగా అందించగలనా లేదా అని ఆలోచిస్తుండవచ్చు. ఇవేవీ అసాధారణం కాదు. అయితే ఇలాంటివాటి గురించే ఎక్కువగా ఆలోచించినప్పుడు సమస్యలు తలెత్తుతాయి. పరిచర్యలో పాల్గొనే ముందు మీకు భయమేస్తే, ఏమి చేయడం సహాయకరంగా ఉండవచ్చు? జాగ్రత్తగా సిద్ధపడడం, పట్టుదలతో యెహోవాకు ప్రార్థించడం. (అపొ. 4:29,30) పరదైసులో పరిపూర్ణమైన ఆరోగ్యాన్నీ నిత్య జీవాన్నీ అనుభవించేందుకు ప్రజలను ఆహ్వానించడంలో యెహోవా చూపిస్తున్న గొప్ప కరుణను గురించి ఆలోచించండి. మీరు ఎవరికైతే సహాయం చేయాలనుకుంటున్నారో వారి గురించీ వారు సువార్త వినవలసిన అవసరం గురించీ ఆలోచించండి.

ప్రజలకు స్వేచ్ఛా చిత్తముంది గనుక వారు సందేశాన్ని అంగీకరించడమైనా చేయగలరు తిరస్కరించడమైనా చేయగలరని కూడా గుర్తుంచుకోండి. ప్రాచీన ఇశ్రాయేలులో యేసు సాక్ష్యమిచ్చినప్పుడు కూడా అలాగే జరిగింది. మీ నియామకం ప్రకటించడం మాత్రమే. (మత్త. 24:14) ప్రజలు మిమ్మల్ని మాట్లాడనివ్వకపోయినప్పటికీ మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళడమే ఒక సాక్ష్యాన్నిస్తుంది. యెహోవా తన చిత్తాన్ని నెరవేర్చేందుకు మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి మీరు అనుమతించారు గనుక మీరు సఫలులవుతారు. మీకు మాట్లాడే అవకాశం వచ్చిన సందర్భాల్లో మీ మాటలు ఎలా ఉంటాయి? మీరు ఇతరుల అవసరాల మీద మీ ఆలోచనలను కేంద్రీకరించడం నేర్చుకుంటే మీ మాటలు ఆకట్టుకునేవిగాను సహజంగాను ఉంటాయి.

ప్రతిరోజూ మీ మాటా ప్రవర్తనా ఎలా ఉంటాయో సాక్ష్యమిచ్చేటప్పుడు కూడా అలాగే ఉంటే మీ శ్రోతలకు వినడానికి ఇబ్బంది ఉండదు. మీరు వారితో పంచుకోవాలనుకునే లేఖనాధార విషయాలను వాళ్ళు మరింత ఇష్టపూర్వకంగా అంగీకరిస్తారు. వారికి నియత ప్రసంగమివ్వకుండా, వారితో సంభాషించండి. స్నేహభావంతో ఉండండి. వారి మీద ఆసక్తి చూపించండి, వారి వ్యాఖ్యానాలను సంతోషంగా వినండి. అపరిచితులతో మాట్లాడేటప్పుడు గౌరవం చూపించేందుకు నిర్దిష్ట భాష లేదా స్థానిక సంస్కృతి ప్రకారం ప్రత్యేక పద్ధతులున్న ప్రాంతాల్లో మీరు వాటిని ఆచరించాలనుకుంటారు. అయితే మీరు ప్రశాంతమైన చిరునవ్వుతో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండవచ్చు.

వేదిక మీద. సాధారణంగా మీరు ఒక గుంపుతో మాట్లాడేటప్పుడు సమాచారాన్ని సహజమైన సంభాషణా శైలిలో అందించడమే ఉత్తమం. నిజమే, ప్రేక్షకుల గుంపు పెద్దగా ఉన్నప్పుడు మీరు మరింత బిగ్గరగా మాట్లాడడం అవసరం. అలాగని మీరు మీ ప్రసంగాన్ని కంఠస్థం చేసుకోవాలని ప్రయత్నిస్తే లేదా మీరు మరీ వివరంగా నోట్సు వ్రాసుకుంటే నిర్దిష్ట పదాల గురించి మీరు అతిగా ఆందోళన చెందే ప్రమాదముంది. సరైన పదాలు ప్రాముఖ్యమే కానీ వాటికి అతిగా ప్రాముఖ్యతనిస్తే మీ ప్రసంగం బిగబట్టి ఇచ్చినట్లుంటుంది, మరీ నియతంగానూ ఉంటుంది. సహజత్వాన్ని కోల్పోతుంది. కాబట్టి మీరు చెప్పాల్సిన విషయాల గురించి ముందుగానే జాగ్రత్తగా ఆలోచించుకోవాలి, అయితే ఖచ్చితమైన పదాలపై కాకుండా, విషయాలపైనే ఎక్కువ అవధానాన్ని నిలపండి.

ఒక కూటమిలో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినా అలాగే చేయాలి. బాగా సిద్ధపడండి, కానీ మీ జవాబులను చదవడం గానీ కంఠస్థం చేసి చెప్పడం గానీ చేయకండి. సహజమైన స్వరభేదంతో వ్యాఖ్యానాలు ఇవ్వండి, అప్పుడు అవి ఆనందకరంగా సహజంగా ఉంటాయి.

కోరదగిన ప్రసంగ లక్షణాలను సహితం అమితంగా చూపిస్తే అది ప్రేక్షకులకు అసహజంగా అనిపించవచ్చు. ఉదాహరణకు, మీరు స్పష్టంగా మాట్లాడాలి, పదాలను సరిగ్గా ఉచ్చరించాలి, కానీ మీ ప్రసంగం బిగుసుకుపోయి ఇచ్చినట్లుగా గానీ కృత్రిమంగా గానీ ఉండేంత నిర్దిష్టంగా ఉచ్చరించకండి. నొక్కి తెలిపే సంజ్ఞలు గానీ వర్ణనాత్మక సంజ్ఞలు గానీ చక్కగా చేసినప్పుడు అవి ప్రసంగానికి ఊపిరి పోస్తాయి. కానీ సంజ్ఞలను, బిగుసుకుపోయినట్లు అతి కష్టం మీద చేసినా అతిశయంగా చేసినా శ్రోతల ధ్యాస మీరు చెబుతున్న దాని మీది నుండి ప్రక్కకు మళ్ళుతుంది. స్వరం సముచితంగా పెంచండి, కానీ మరీ బిగ్గరగా ఉండకుండా చూసుకోండి. మీ ప్రసంగంలో అప్పుడప్పుడు ఉత్సాహం చూపించడం మంచిది, కానీ అమితోత్సాహం చూపకుండా కూడా జాగ్రత్తపడాలి. ప్రేక్షకులను మీ గురించి ఆలోచింపజేయకుండా మీ ప్రేక్షకులకు ఇబ్బంది అనిపించకుండా ఉండే విధంగా స్వరభేదాన్నీ ఉత్సాహాన్నీ భావాలనూ కనబరచండి.

కొంతమంది ప్రసంగమివ్వనప్పుడు కూడా సహజంగానే ఒక పద్ధతిలో తమ భావాలను వ్యక్తం చేస్తారు. ఇతరులు మరీ వ్యావహారికంగా మాట్లాడతారు. ప్రతిరోజూ మంచిగా మాట్లాడడమూ క్రైస్తవ హుందాతనంతో ప్రవర్తించడమూ ప్రాముఖ్యం. అలా చేస్తే మీరు వేదిక మీద ఉన్నప్పుడు మరింత తేలికగా ఆకర్షణీయంగా సహజంగా మాట్లాడగలుగుతారు, ప్రవర్తించగలుగుతారు.

బహిరంగంగా చదువుతున్నప్పుడు. బహిరంగంగా చదవడం సహజంగా ఉండాలంటే అందుకు కృషి చెయ్యాలి. అందుకు, మీరు చదవనున్న సమాచారంలోని ముఖ్యమైన విషయాలను గుర్తించి, అవి ఎలా విపులీకరించబడ్డాయో పరిశీలించండి. వాటిని మనస్సులో స్పష్టంగా ఉంచుకోండి; లేకపోతే మీరు పదాలను అలా చదువుకుంటూ పోవడమే జరుగుతుంది. మీకు తెలియని పదాల ఉచ్చారణను ఎవరినైనా అడిగి తెలుసుకోండి. సరైన స్వరస్థాయిలో తగినంత బిగ్గరగా చదివేందుకూ, ఆలోచనలను స్పష్టంగా వ్యక్తం చేయగలిగేలా పద సముదాయాలను వర్గీకరించి చదివేందుకూ బిగ్గరగా చదువుతూ అభ్యసించండి. మీరు తడబడకుండా చదవగలిగేంత వరకు మళ్ళీ మళ్ళీ అభ్యసించండి. సమాచారంతో బాగా సుపరిచితులవ్వండి. అలాగైతే మీరు పెద్దగా చదివినప్పుడు, అది ఉత్సాహభరితమైన సంభాషణలా ఉంటుంది. సహజత్వం అంటే అదే మరి.

అవును, మనం బహిరంగంగా చదివే భాగం ఎక్కువగా బైబిలు ఆధారిత ప్రచురణల నుండే తీసుకోబడుతుంది. మనం దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలోని పఠన నియామకాలను నిర్వర్తించడం మాత్రమే కాక, క్షేత్ర పరిచర్యలోనూ వేదిక మీద ప్రసంగాలిస్తున్నప్పుడూ లేఖనాలను చదువుతాము. కావలికోట అధ్యయనంలోను, సంఘ పుస్తక అధ్యయనంలోను చర్చించబడే సమాచారాన్ని చదవడానికి సహోదరులు నియమించబడతారు. యోగ్యులైన కొందరు సహోదరులు సమావేశ ప్రేక్షకుల ఎదుట వ్రాతప్రతులను చదివే నియామకాలను పొందుతారు. మీరు చదువుతున్నది బైబిలే కానివ్వండి, ఇతర సమాచారమే కానివ్వండి, ఉల్లేఖనాలనూ ఉల్లేఖన చిహ్నాలున్న భాగాలనూ చదివేటప్పుడు ఆ సమాచారానికి జీవం పోసేలా చదవాలి. అనేక పాత్రధారుల మాటలు ఉల్లేఖించబడినట్లయితే ఒక్కో పాత్రధారి మాటలను చదివేటప్పుడు మీ స్వరం కొంచెం మార్చి చదవండి. అయితే జాగ్రత్త: మరీ నాటక పక్కీలో చదవకండి, సహజంగా చదువుతూ మీరు చదివేదానికి జీవం పోయండి.

సహజంగా చదవడం సంభాషణా శైలిలో ఉంటుంది. కృత్రిమంగా అనిపించదు కానీ నమ్మకం ప్రతిఫలిస్తుంది.