9
స్వరభేదం
మీరు భావాన్ని నొక్కి చెప్పడం, మీరు చెబుతున్నదాన్ని అర్థం చేసుకునేందుకు ప్రేక్షకులకు సహాయపడుతుంది. మీరు మీ స్వరంలోనూ వేగంలోనూ స్వరస్థాయిలోనూ వైవిధ్యాన్ని చూపించినప్పుడు, మీ ప్రసంగం మరింత ఆనందించదగినదిగా మారగలదు. అంతకంటే ముఖ్యంగా, మీరలా చూపించే వైవిధ్యం, మీరు చెబుతున్న విషయం గురించి మీరెలా భావిస్తున్నారన్నది మీ ప్రేక్షకులకు చెప్పవచ్చు. మీరందించే సమాచారాన్ని గురించి మీకున్న దృక్పథం, వాళ్ళు ఎలా భావిస్తారన్న దానిపై ప్రభావం చూపగలదు. మీరు వేదిక మీద మాట్లాడుతున్నా క్షేత్ర పరిచర్యలో ఒక వ్యక్తితో మాట్లాడుతున్నా ఈ ప్రభావం ఉంటుంది.
మానవుల స్వరం ఎన్నో వైవిధ్యాలను చూపగల సామర్థ్యమున్న అద్భుతమైన ఉపకరణము. దాన్ని సరిగా ఉపయోగిస్తే అది ప్రసంగానికి జీవం పోయగలదు, హృదయాలను స్పృశించగలదు, భావోద్వేగాలను రేకెత్తించగలదు, చర్య తీసుకొనేలా ప్రేరేపించగలదు. అయితే, మీ స్వరాన్నీ వేగాన్నీ ఎక్కడ పెంచాలి ఎక్కడ తగ్గించాలి, మీ స్వరస్థాయిని ఎక్కడ మార్చాలి అన్నదానికి మీ నోట్సులో ఏదైనా గుర్తుపెట్టుకున్నంత మాత్రాన స్వరభేదం సాధ్యం కాదు. అలా గుర్తుపెట్టుకున్నదాన్ని బట్టి స్వరభేదం చూపిస్తే కృత్రిమంగా అనిపిస్తుంది. మీ ప్రసంగానికి జీవం పోసి వైవిధ్యాన్నిచ్చే బదులు, వినడానికి మీ ప్రేక్షకులు ఇబ్బందిపడేలా చేయగలదు. సముచితమైన స్వరభేదం హృదయంలో నుండి పుడుతుంది.
స్వరంలో జ్ఞానయుక్తంగా భేదాన్ని చూపించినప్పుడు, చర్చించబడుతున్న విషయ ఉద్దేశాన్ని గ్రహించేందుకు అది ప్రేక్షకులకు సహాయపడుతుంది, వాళ్ళు ప్రసంగీకుడి గురించి అనవసరంగా ఆలోచించరు.
స్వరం పెంచడమో తగ్గించడమో చేయండి. మీ స్వరంలో మార్పు చూపించడానికి ఒక మార్గం, మీ స్వరం పెంచడమో తగ్గించడమో చేయడమే. అయితే, యాంత్రికంగా మధ్యమధ్యలో స్వరం పెంచడం తగ్గించడం ఒక అలవాటుగా మారకూడదు. అలా చేస్తే మీ మాటల భావం మారవచ్చు. మీరు మరీ తరచుగా స్వరం పెంచినా వినడానికి ఆహ్లాదకరంగా ఉండదు.
మీ స్వరం, మీ సమాచారానికి తగిన విధంగా ఉండాలి. ప్రకటన 14:6,7 లేదా ప్రకటన 18:4 లో ఉన్నటువంటి అత్యవసరంగా నెరవేర్చవలసిన ఆజ్ఞను చదువుతున్నప్పుడు గానీ నిర్గమకాండము 14:13,14 లో వ్రాయబడినటువంటి బలమైన నమ్మకాన్ని వ్యక్తం చేసే పదాలను చదువుతున్నప్పుడు గానీ మీ స్వరాన్ని తగినంతగా పెంచడం మంచిది. అదేవిధంగా, బైబిలులో యిర్మీయా 25:27-38 లో ఉన్నటువంటి బలమైన అధిక్షేపణను చదువుతున్నప్పుడు, అవసరాన్ని బట్టి మీ స్వరాన్ని పెంచడమో తగ్గించడమో చేస్తే కొన్ని మాటలు మిగతా మాటలకన్నా ప్రత్యేకంగా కనిపిస్తాయి.
మీ లక్ష్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోండి. మీ ప్రేక్షకులు చర్య తీసుకునేలా వారిని ప్రేరేపించాలనుకుంటున్నారా? మీరు సమర్పిస్తున్న సమాచారంలోని ముఖ్యాంశాలు ప్రత్యేకంగా గుర్తించబడేలా చెప్పాలనుకుంటున్నారా? వివేచనతో స్వరం పెంచడం ఈ లక్ష్యాలను చేరుకునేందుకు సహాయపడుతుంది. అయితే, మీరు ఊరికే స్వరం పెంచుతూ ఉంటే, మీ ప్రసంగ ఉద్దేశమే దెబ్బతినవచ్చు. అదెలా? మీరు చెప్పే విషయాలకు అవసరమైంది స్వరం పెంచడం కాదుగానీ ఆప్యాయత భావాలే కావచ్చు. దీని గురించి 11వ అధ్యయనంలో మనం చర్చిస్తాము.
వివేచనతో స్వరాన్ని కొంచెం తగ్గించడం, ఇంకేమి చెప్పబోతున్నారా అన్న ఉత్కంఠను శ్రోతల్లో కలిగించగలదు. అయితే, ఆ తర్వాత వెంటనే స్వరస్థాయిని చాలా పెంచడం అవసరం. వ్యాకులతను గానీ భయాన్ని గానీ తెలియజేసేందుకు స్వరం తగ్గించి, తీవ్రతను పెంచవచ్చు. ఒక విషయాన్ని మిగతావాటితో పోల్చితే దానికి రెండవ స్థానమే ఉందని చూపించడానికి కూడా స్వరం తగ్గించవచ్చు. మీ స్వరం ఎల్లప్పుడూ చిన్నగా ఉండడం, మీరు చెబుతున్న విషయం గురించి మీకే నిశ్చయత లేదని గానీ నమ్మకం లేదని గానీ నిజమైన ఆసక్తి లేదని గానీ తెలియజేయవచ్చు. చాలా మృదువైన స్వరాలను ఎంతో వివేచనతో ఉపయోగించడం అవసరమన్నది స్పష్టం.
వేగాన్ని మార్చుకోండి. దైనందిన సంభాషణల్లో, మనం మన ఆలోచనలను వ్యక్తం చేసేటప్పుడు, మాటలు హృదయంలో నుండి వస్తాయి. మనం ఉత్సాహంగా ఉన్నప్పుడు వేగంగా మాట్లాడుతుంటాము. మనం చెప్పినది చెప్పినట్లు ఇతరులు గుర్తుంచుకోవాలని కోరుకున్నప్పుడు, మనం చాలా నెమ్మదిగా మాట్లాడతాము.
అయితే, బహిరంగ వేదిక మీదకి క్రొత్తగా వచ్చే ప్రసంగీకుల్లో చాలా కొద్దిమంది మాత్రమే తమ వేగాన్ని మార్చుకుంటారు. ఎందుకు? తాము చెప్పాలనుకుంటున్న పదాల మీదే వాళ్ళు తమ మనస్సును ఎక్కువ కేంద్రీకరిస్తారు. కాబట్టి వాళ్ళు ఆ మాటలనన్నింటినీ వ్రాసిపెట్టుకుంటుండవచ్చు. వాళ్ళు ఇచ్చేది వ్రాతప్రతి ప్రసంగం కాకపోయినా మాటలను దాదాపు కంఠస్థం చేసుకుంటుండవచ్చు. కాబట్టి వాళ్ళు ప్రతిదాన్నీ ఒకే వేగంలో చెబుతారు. ప్రసంగ సంక్షిప్త ప్రతి నుండి ప్రసంగించడాన్ని నేర్చుకోవడం, ప్రతిదాన్నీ ఒకే వేగంలో చెప్పే బలహీనతను సరిదిద్దుకోవడానికి సహాయపడుతుంది.
అకస్మాత్తుగా వేగం పెంచకుండా జాగ్రత్తపడండి. అలా పెంచితే, అది నెమ్మదిగా నడుస్తున్న పిల్లి, కుక్కను చూసినప్పుడు అకస్మాత్తుగా శరవేగంతో పరుగెత్తే సన్నివేశాన్ని ఒకరికి గుర్తుకు చేయవచ్చు. మీ మాటల స్పష్టత దెబ్బతినేంత వేగంగా ఎన్నడూ మాట్లాడకండి.
మీ వేగంలో వైవిధ్యముండాలని, ఒక క్రమం చొప్పున మధ్యమధ్యలో వేగం పెంచడం గానీ తగ్గించడం గానీ చేయకండి. ఆ విధంగా చేస్తే, మీరు తెలియజేస్తున్న సమాచారం విలువ పెరిగే
బదులు, శ్రోతల అవధానం దాని నుండి ప్రక్కకు మళ్ళవచ్చు. మీరు చెబుతున్న విషయాలకూ మీరు వ్యక్తం చేయాలనుకుంటున్న భావోద్వేగాలకూ మీ లక్ష్యానికీ తగినట్లుగా వేగాన్ని పెంచడం గానీ తగ్గించడం గానీ చేయాలి. మీరు మామూలు వేగంలోనే ప్రసంగించండి. ఉత్తేజాన్ని వ్యక్తం చేసేందుకు, నిత్య జీవితంలో ఎంత వేగంగా మాట్లాడతారో అదే వేగంతో మాట్లాడండి. అంత ప్రాధాన్యతలేని విషయాలను చెప్పేటప్పుడైనా అంత ప్రాముఖ్యమైన వివరాలు లేని సంఘటనలు చెప్పేటప్పుడైనా వేగంగా చెప్పడం సముచితం. అలా చెప్పడం వల్ల ప్రసంగం వైవిధ్యభరితంగా ఉంటుంది, మరీ గంభీరంగా ఉండదు. మరొకవైపు, మరింత ప్రాముఖ్యమైన వాదనలనూ ముఖ్యమైన విషయాలనూ గమనించదగ్గ విషయాలనూ చెప్పేటప్పుడు సాధారణంగా ఇంకొంచెం నెమ్మదిగా చెప్పాలి.స్వరస్థాయిని మార్చండి. ఎవరైనా ఒక సంగీతవాద్యాన్ని దాదాపు ఒక గంటసేపు వాయిస్తున్నారనుకోండి. ఆ గంటసేపూ, ఆయన ఒక్క సంగీత నోటునే మొదట బిగ్గరగా తర్వాత మృదువుగా కొన్నిసార్లు వేగంగా మరి కొన్నిసార్లు నెమ్మదిగా వాయిస్తున్నాడనుకోండి. సంగీతధ్వనిని పెంచడం తగ్గించడం చేస్తున్నప్పటికీ వేగాన్ని మారుస్తున్నప్పటికీ స్వరస్థాయిలో మార్పులేకపోతే, ఆ “సంగీతం” అంత ఆకర్షణీయంగా ఉండదు. అదేవిధంగా స్వరస్థాయిలో వైవిధ్యం లేకపోతే మన స్వరం కూడా వినడానికి ఆహ్లాదకరంగా ఉండదు.
స్వరస్థాయిలోని మార్పులు అన్ని భాషల్లోనూ ఒకేవిధమైన ప్రభావాన్ని చూపించవని తెలుసుకోవాలి. స్వర మార్పులపై ఆధారపడే చైనీస్ వంటి భాషల్లో స్వరస్థాయి మారితే పదం అర్థమే మారిపోతుంది. అయినప్పటికీ అలాంటి భాషల్లో కూడా మౌఖికంగా చెప్పే మాటలను మరింత వైవిధ్యభరితంగా చేయడానికి ఒక వ్యక్తి చేయగలిగేవి చాలా ఉన్నాయి. ఆయన వివిధ స్వరాలను వాటికి గల నిర్దిష్ట స్థాయిల్లో పలుకుతూనే తన కంఠ స్వరాన్ని కనిష్ఠస్థాయి మొదలుకొని గరిష్ఠస్థాయి వరకు ఏ స్థాయిలోనైనా సరే ఉపయోగించగల సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి కృషి చేయగలడు. అప్పుడు ఆయన హెచ్చుస్థాయి స్వరాలను మరింత హెచ్చించడమూ తగ్గుస్థాయి స్వరాలను మరింత తగ్గించడమూ చేయగలడు.
స్వరాన్ని బట్టి అర్థం మారని భాషల్లో కూడా, స్వరస్థాయిని మార్చడం ద్వారా వేర్వేరు తలంపులను తెలియజేయవచ్చు. ఉదాహరణకు, స్వరస్థాయిని కొద్దిగా పెంచడంతోపాటు స్వరాన్ని కూడా పెంచడం ద్వారా భావాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. స్వరస్థాయిని మార్చడం ద్వారా పరిమాణాన్నైనా దూరాన్నైనా సూచించవచ్చు. ఒక వాక్యం చివరిలో స్వరస్థాయీ స్వరమూ పెరగడం, ఒక ప్రశ్నవేయబడిందని సూచించవచ్చు. కొన్ని భాషల్లో ప్రశ్నను సూచించడానికి స్వరస్థాయినీ ధ్వనినీ తగ్గించవలసి రావచ్చు.
పులకింతనూ ఉత్సాహాన్నీ వ్యక్తం చేసేటప్పుడు స్వరస్థాయిని పెంచవచ్చు. (స్వరాన్ని బట్టి అర్థం మారే భాషలో వివిధ రకాల స్వరాలు అవసరమవుతుండవచ్చు.) విచారాన్నీ వ్యాకులతనూ వ్యక్తం చేయడానికి స్వరస్థాయిని తగ్గించవలసివుండవచ్చు. (స్వరాలను బట్టి అర్థం మారే భాషల్లోనైతే, ఇంకాస్త చిన్న స్వరాలు అవసరం కావచ్చు.) ఈ భావోద్వేగాలను వ్యక్తం చేయడం, హృదయాలను స్పృశించేందుకు ప్రసంగీకుడికి సహాయపడుతుంది. మీరు వాటిని వ్యక్తం చేయాలనుకున్నప్పుడు మాటలను ఊరికే పలకకండి. మీకు కూడా అవే భావోద్వేగాలు కలుగుతున్నాయన్నది మీ స్వరంలో వ్యక్తంకానివ్వండి.
పునాది వేయడం. అయితే స్వరభేదం దేనితో మొదలవుతుంది? మీ ప్రసంగానికి సమాచారాన్ని ఎంపిక చేసుకోవడంతో మొదలవ్వాలి. మీ ప్రసంగంలో కేవలం తర్కమో ఉద్బోధనో మాత్రమే ఉంటే మీ ప్రసంగం వైవిధ్యభరితంగా ఉండే అవకాశం ఏ మాత్రం ఉండదు. కాబట్టి, మీరు తయారు చేసుకున్న సంక్షిప్త ప్రతిని విశ్లేషించుకోండి; ఆసక్తికరమైన, ఉపదేశాత్మకమైన ప్రసంగాన్నిచ్చేందుకు కావలసిన అంశాలన్నీ ఉండేలా చూసుకోండి.
ఉదాహరణకు, మీరు ప్రసంగిస్తున్నప్పుడు మధ్యలో సాగదీస్తున్నట్లనిపించి, మరింత వైవిధ్యం అవసరమని మీకనిపించిందనుకోండి. అప్పుడేమి చేస్తారు? మీరు సమాచారాన్ని అందించే విధానాన్ని మార్చండి. ఎలా? ఒక మార్గం ఏమిటంటే, మీరు ఊరికే మాట్లాడే బదులు బైబిలు తెరచి, ప్రేక్షకులను కూడా తెరవమని ఆహ్వానించి ఒక లేఖనాన్ని చదవడం. లేదా ఒక సాధారణ వాక్యాన్ని ప్రశ్నగా మార్చి, నొక్కిచెప్పేందుకు కాస్సేపు ఆగడం. సరళమైన ఒక ఉపమానాన్ని చేర్చడం. ఇవీ అనుభవజ్ఞులైన ప్రసంగీకులు ఉపయోగించే పద్ధతులు. మీకు ఎంత అనుభవం ఉన్నప్పటికీ మీరు సమాచారాన్ని సిద్ధపడుతున్నప్పుడు ఇవే పద్ధతులను ఉపయోగించవచ్చు.
స్వరభేదం ఒక ప్రసంగానికి వైవిధ్యాన్నిస్తుందని చెప్పవచ్చు. తగిన చోట, తగిన మేరకు స్వరభేదము చూపిస్తే, మీ సమాచారం సంపూర్ణ విలక్షణాలు గలదై, మీ ప్రేక్షకులకు ఆనందదాయకంగా ఉంటుంది.