29
స్వర నాణ్యత
మాటలకే కాక మాట్లాడిన తీరుకు కూడా ప్రజలు చాలా ప్రభావితులవుతారు. మీతో ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఆయన స్వరంలో ఆప్యాయత లేకుండా కఠినంగా ఉన్నప్పటికంటే ప్రశాంతత, ఆప్యాయత, స్నేహభావం, దయ ఉన్నప్పుడే మీరు వినడానికి ఎక్కువ ఇష్టపడతారన్నది నిజం కాదా?
అభిలషణీయమైన స్వర నాణ్యతను పెంచుకోవడమనేది స్వరావయవాల పనితీరుతో మాత్రమే ముడిపడి లేదు. అది వ్యక్తిత్వంతో కూడా ముడిపడివుండవచ్చు. ఒక వ్యక్తి బైబిలు సత్యాన్ని గురించిన పరిజ్ఞానంలోను దాన్ని అన్వయించుకోవడంలోను ప్రగతి సాధిస్తున్న కొద్దీ ఆయన మాట్లాడే విధానంలో వచ్చే మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. ప్రేమ, సంతోషం, దయాళుత్వము వంటి దైవిక గుణాలు ఆయన స్వరంలో ప్రతిబింబిస్తాయి. (గల. 5:22,23) ఆయనకు ఇతరుల గురించి నిజమైన చింత ఉన్నప్పుడు అది ఆయన స్వరంలో తెలుస్తుంది. ఆయనలో అస్తమానం ఫిర్యాదుచేసే వైఖరికి బదులు కృతజ్ఞతా భావం చోటుచేసుకుంటే ఆయన మాటలూ కంఠస్వర ధ్వనీ దానికి రుజువునిస్తాయి. (విలా. 3:39-42; 1 తిమో. 1:12,13; యూదా 16) ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్న భాష మీకు రానిదైనప్పటికీ ఒక వ్యక్తి గర్వంగా అసహనంగా విమర్శనాత్మకంగా పరుషంగా మాట్లాడుతున్నట్లయితే మరొక వ్యక్తి వినయంగా ఓపిగ్గా దయగా ప్రేమగా మాట్లాడుతున్నట్లయితే ఆ వ్యత్యాసాన్ని చెప్పడం మీకు కష్టమేమీ కాదు.
తమ స్వరపేటికను పాడుచేసిన అనారోగ్యం మూలంగా గానీ వారసత్వంగా వచ్చిన స్వరావయవాల నిర్మాణ లోపం వల్ల గానీ కొందరి స్వర నాణ్యత కోరదగినదిగా ఉండకపోవచ్చు. అలాంటి పరిస్థితులు ప్రస్తుత విధానంలో సరిచేయలేనంత తీవ్రంగా ఉండవచ్చు. అయినప్పటికీ సాధారణంగా స్వరావయవాలను సరిగ్గా ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటే అవి మెరుగుపడవచ్చు.
మొట్టమొదటిగా, ఒక్కొక్క వ్యక్తి స్వరానికి వేర్వేరు ప్రత్యేక లక్షణాలు ఉంటాయన్నది గుర్తించడం ప్రాముఖ్యం. మీరు మరొకరి స్వరాన్ని అనుకరిస్తూ మీ స్వరాన్ని మార్చుకోవాలన్నది మీ లక్ష్యం కాకూడదు. బదులుగా మీ స్వర సామర్థ్యాన్ని దానికున్న వివిధ లక్షణాలతో పెంపొందించుకోండి. మీరు అలా పెంపొందించుకోవడానికి మీకు ఏమి సహాయపడగలదు? ముఖ్యంగా ఆవశ్యకమైనవి రెండున్నాయి.
మీ ఊపిరిని సరైనవిధంగా నియంత్రించుకోండి. మీరు మీ స్వరాన్ని ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు రావాలంటే, మీ ఊపిరిని సరైన విధంగా నియంత్రించుకోవడంతో పాటు మీకు
సరిపడేంత గాలి సరఫరా కూడా కావాలి. ఇవి రెండూ లేకపోతే మీ స్వరం బలహీనంగా వినిపించవచ్చు, మీ సంభాషణ గానీ ప్రసంగం గానీ మధ్యమధ్యలో ఆగిపోతూ ఉండవచ్చు.ఊపిరితిత్తుల అతిపెద్ద భాగం ఉండేది ఛాతీ పైభాగంలో కాదు; భుజాల ఎముకల మూలంగా ఈ భాగం కేవలం పెద్దదిగా కనిపిస్తుందంతే. నిజానికి ఊపిరితిత్తులు, ఉదర వితానానికి పై భాగంలోనే ఎక్కువ వెడల్పుగా ఉంటాయి. ఉదర వితానం క్రింది ప్రక్కటెముకలతో కలిసివుండి ఛాతీనీ ఉదర కుహరాన్నీ వేరు చేస్తుంది.
మీరు ఊపిరి పీల్చుకునేటప్పుడు, మీ ఊపిరితిత్తుల పైభాగాన్ని మాత్రమే నింపుతున్నట్లయితే, మీరు వెంటనే అతి వేగంగా శ్వాస తీసుకోవడం మొదలుపెడతారు. మీ స్వరానికి బలం ఉండదు, మీరు చాలా త్వరగా అలసిపోతారు. సరైనవిధంగా ఊపిరి పీల్చుకునేందుకు మీరు నిటారుగా కూర్చోవడం లేదా నిలబడడం, మీ భుజాలను వెనక్కు పెట్టడం అవసరం. మీరు మాట్లాడేందుకు ఊపిరి పీల్చుకునేటప్పుడు మీ ఛాతీ పైభాగాన్ని మాత్రమే వ్యాకోచింపజేయకుండా ఉండేందుకు మీరు మనఃపూర్వకంగా ప్రయత్నించండి, మొదట మీ ఊపిరితిత్తుల క్రింది భాగాన్ని నింపండి. ఈ భాగం నిండినప్పుడు మీ ప్రక్కటెముకల పంజరం పార్శ్వాలు వ్యాకోచిస్తాయి. అదే సమయంలో ఉదర వితానం క్రిందికి కదిలి మీ ఉదరాన్నీ ప్రేగులనూ మృదువుగా నెట్టుతుంది, అప్పుడు మీ ఉదరం మీద ఉన్న బెల్టు గానీ మీరు ధరించిన వస్త్రం గానీ ఒత్తుకున్నట్లు అనిపిస్తుంది. కానీ నిజానికి ఊపిరితిత్తులు
అక్కడ లేవు; అవి ప్రక్కటెముకల పంజరంలోపలే ఉన్నాయి. మిమ్మల్ని మీరు పరీక్షించుకునేందుకు, మీ ప్రక్కటెముకల పంజరానికి క్రిందిభాగాన ఒక్కోవైపున ఒక్కో చేతిని పెట్టండి. ఇప్పుడు గాఢంగా ఊపిరి పీల్చుకోండి. మీరు సరైనవిధంగా ఊపిరి పీల్చుకుంటున్నట్లయితే కడుపును లోపలికి పెట్టడమూ భుజాలను పైకెత్తడమూ చేయరు. మీ ప్రక్కటెముకలు పైకీ బయటికీ కదులుతున్నట్లు మీకు తెలుస్తుంది.తర్వాత ఊపిరిని వదలడానికి ప్రయత్నించండి. మీరు పీల్చుకున్న గాలిని హడావిడిగా వదిలేసి వ్యర్థం చేయకండి. నెమ్మదిగా వదలండి. మీ గొంతును బిగబట్టి ఉంచడం ద్వారా దాన్ని నియంత్రించాలని ప్రయత్నించకండి. దాని మూలంగా స్వరం, మెడ పట్టేసినట్లు వినిపించడం గానీ
అసాధారణంగా ఉచ్ఛ స్థాయిలో వినిపించడం గానీ జరుగుతుంది. ఉదర కండరాల నుండీ అంతర్భాగ కండరాల (ప్రక్కటెముకల మధ్య) నుండీ వచ్చే ఒత్తిడి గాలిని బయటికి నెడుతుంది. అది ఎంత త్వరగా బయటికి నెట్టబడుతుందన్నది ఉదర వితానాన్ని బట్టి ఉంటుంది.ఒక క్రీడాకారుడు, పరుగుపందెంలో పాల్గొనేందుకు ఎలాగైతే శిక్షణ పొందుతాడో అలాగే ఒక ప్రసంగీకుడు, ఊపిరి పీల్చుకునే విధానాన్ని నియంత్రించుకోవడాన్ని అభ్యాసం ద్వారా నేర్చుకోగలుగుతాడు. నిటారుగా నిలబడి, భుజాలను వెనక్కుపెట్టి, ఊపిరితిత్తుల క్రింది భాగాన్ని గాలితో నింపి, ఆ తర్వాత ఒక్క శ్వాసలోనే మెల్లగా స్పష్టంగా ఎంత వరకు లెక్కబెట్టగలరో అంతవరకు అంకెలు లెక్కబెడుతూ క్రమక్రమంగా ఊపిరిని వదలండి. తర్వాత అదేవిధంగా ఊపిరి పీల్చుకుంటూ బిగ్గరగా చదవడం అభ్యసించండి.
బిగుసుకుపోయిన కండరాలను సడలించుకోండి. మంచి స్వర నాణ్యతకు ఆవశ్యకమైన మరొకటి—ప్రశాంతంగా ఉండడం! మీరు మాట్లాడేటప్పుడు కండరాలను సడలించుకోవడం నేర్చుకుంటే
ఎంతో మెరుగుపడగలుగుతారన్నది నిజంగా ఆశ్చర్యకరం. మనస్సును ప్రశాంతంగా, శరీరాన్ని విశ్రాంతిగా ఉంచుకోవాలి, ఎందుకంటే మానసిక ఒత్తిడి వల్ల కండరాలు బిగుసుకుపోతాయి.మీరు మీ శ్రోతల గురించి సరైన దృక్పథాన్ని ఏర్పరచుకోవడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోండి. మీ శ్రోతలు క్షేత్ర పరిచర్యలో కలిసిన ప్రజలైతే, మీరు కేవలం కొన్ని నెలలుగానే బైబిలును అధ్యయనం చేస్తున్నప్పటికీ యెహోవా సంకల్పం గురించి విలువైన విషయాలు మీకు తెలుసనీ మీరు వాటిని వారితో పంచుకోవచ్చనీ గుర్తుంచుకోండి. వాళ్ళు గ్రహించినా గ్రహించకపోయినా వారికి సహాయం అవసరం కనుకనే మీరు వారిని సందర్శిస్తున్నారు. మరొకవైపు మీరు రాజ్యమందిరంలో మాట్లాడుతున్నట్లయితే మీ ప్రేక్షకుల్లో దాదాపు అందరూ యెహోవా ప్రజలే. వాళ్ళు మీ స్నేహితులు, మీరు సఫలులవ్వాలని వాళ్ళు కోరుకుంటారు. ఎల్లప్పుడూ స్నేహశీలురైన, ప్రేమగల ప్రేక్షకులు మన ఎదుట ఉన్నట్లుగా ఈ భూమి మీద ఏ ప్రజలకూ లేరు.
మీరు మీ గొంతు కండరాల మీద శ్రద్ధ నిలుపుతూ ఉద్దేశపూర్వకంగా వాటిని సడలించుకోండి. మీ స్వర తంతువుల గుండా గాలి ప్రయాణించినప్పుడు అవి కంపిస్తాయన్నది జ్ఞాపకముంచుకోండి. గిటార్ తీగలనైనా వయొలిన్ తీగలనైనా బిగించినప్పుడు గానీ వదులు చేసినప్పుడు గానీ స్వరం ఏ విధంగా మారుతుందో గొంతుక కండరాలు బిగుసుకుపోయినప్పుడైనా వాటిని సడలించినప్పుడైనా స్వర స్థాయిలో మార్పులు కూడా అదేవిధంగా వస్తాయి. మీరు స్వర తంతువులను సడలించినప్పుడు స్వరం తగ్గుతుంది. గొంతు కండరాలను సడలించడం నాసికారంధ్రపు దారులు తెరుచుకొని ఉండడానికి కూడా సహాయపడుతుంది, మీ స్వర నాణ్యతపై ఖచ్చితంగా మంచి ప్రభావం చూపిస్తుంది.
మీ మోకాళ్ళను, చేతులను, భుజాలను, మెడను, మీ శరీరమంతటినీ విశ్రాంతిగా ఉంచుకోండి. అలా చేయడం, శబ్దాన్ని బయటికి రప్పించేలా మీ గొంతుకకు శక్తినిచ్చేందుకు అవసరమైన కంపనం శరీరంలో పుట్టేందుకు సహాయపడుతుంది. శరీరమంతా కూడా సౌండింగ్ బోర్డులా పని చేసినప్పుడు మాటలు బిగ్గరగా వినిపించేందుకు అవసరమైన కంపనం పుడుతుంది, కానీ బిగుసుకుపోయివుంటే అలా జరగకుండా ఆటంకం ఏర్పడుతుంది. కంఠ ధ్వని స్వరపేటికలో పుట్టి నాసికా కుహరాల్లోనే కాక, ఛాతీలోని ఎముకల నిర్మాణం మీదా పళ్ళ మీదా గొంతు పైభాగం మీదా కోటరాల మీదా ప్రతిధ్వనిస్తుంది. ఇవన్నీ శబ్దం గట్టిగా వినబడడానికి అవసరమైన కంపనానికి దోహదపడగలవు. మీరు గిటార్ సౌండ్‌బోర్డు మీద ఏదైనా బరువు ఉంచితే శబ్దం వినిపించదు; దానిలో నుండి శబ్దం సరిగ్గా వినిపించాలంటే అది కంపించేందుకు దాని మీద బరువేమీ ఉండకూడదు. అలాగే మన శరీరంలో కండరాలు గట్టిగా పట్టుకొనివున్న ఎముకల నిర్మాణం విషయం కూడా అంతే. కంపనాల ద్వారా మీరు మీ స్వరంలో భేదాన్ని తెస్తూ వివిధ రకాల భావాలను వ్యక్తం చేయగలుగుతారు. మీరు మీ గొంతుకకు శ్రమ కలిగించకుండానే మీ స్వరం పెద్ద సభలోనైనా శ్రోతలందరికీ వినిపిస్తుంది.