‘‘అంత్యదినములలో’’ మనమున్నామని మనకెలాతెలుసు
భాగం 9
‘‘అంత్యదినములలో’’ మనమున్నామని మనకెలాతెలుసు
1, 2. మనము అంత్యదినాల్లో ఉన్నామో లేదో మనమెలా తెలుసుకోగలం?
దేవుని రాజ్యం ఈ మానవపాలనా విధానంపై చర్యగైకొనే సమయంలో మనం జీవిస్తున్నామని మనమెలా నిశ్చయంగా నమ్మగలం? సమస్త దుష్టత్వమును మరియు బాధను దేవుడు అంతమొనర్చే కాలానికి మనం బహుసమీపంగా ఉన్నామని మనకెలా తెలుసు?
2 యేసుక్రీస్తు శిష్యులు వీటన్నిటిని తెలిసికొన గోరారు. ‘‘ఈ యుగసమాప్తికి’’ ఆయన రాజ్యధికారముతో ప్రత్యక్షమగుటకు, ‘‘సూచన’’ ఏమని వారాయనను అడిగారు. (మత్తయి 24:3) మానవజాతి ‘‘అంత్యకాలములో” ఈ విధానము యొక్క ‘‘అంత్యదినములలో” ప్రవేశించెనని చూపేందుకు ప్రపంచాన్ని కుదిపివేసే సంఘటనలు, పరిస్థితుల వివరాలతో యేసు ప్రత్యుత్తరమిచ్చాడు. (దానియేలు 11:40; 2 తిమోతి 3:1) అట్టి వివిధ సంఘటనలుగల సూచనను మనమీ శతాబ్దంలో చూడలేదా? అవును, మనం చూశాం, అనేకం చూశాము!
ప్రపంచ యుద్ధాలు
3, 4. ఈ శతాబ్దమందలి యుద్ధాలు యేసు ప్రవచనానికి ఎలా సరిపోయాయి?
3 ‘జనము మీదికి జనము రాజ్యము మీదికి రాజ్యము లేచును’ అని యేసు ప్రవచించాడు. (మత్తయి 24:7) మునుపు జరిగిన ఎటువంటి యుద్ధమునకైనను భిన్నంగా ఉండి, దేశాలను రాజ్యాలను కదలించిన యుద్ధంలో ప్రపంచము 1914 నందు మునిగిపోయింది. ఆ వాస్తవాన్ని గుర్తించి అప్పటి చరిత్రకారులు దానిని గొప్ప యుద్ధమని పిలిచారు. చరిత్రలోనే అది ఆ రకం యుద్ధాలలో మొదటి యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధం. అంతకు మునుపు జరిగిన ఏ యుద్ధం కంటెను మించినదై, దాదాపు 2,00,00,000 మంది సైనికులు, పౌరులు ఆ యుద్ధంలో తమ ప్రాణాలను కోల్పోయారు.
4 మొదటి ప్రపంచ యుద్ధం అంత్య దినముల ప్రారంభానికి గుర్తైయున్నది. ఇది మరియితర సంఘటనలు “వేదనలకు ప్రారంభమని” యేసు చెప్పాడు. (మత్తయి 24:8) అది నిజమని రుజువైంది, ఎందుకంటె రెండవ ప్రపంచ యుద్ధంలో దాదాపు 5,00,00,000 మంది సైనికులు, పౌరులు తమ ప్రాణాలను కోల్పోయినందున అది మరీ ప్రాణాంతకమైంది. ఈ 20 వ శతాబ్దంలో, 10,00,00,000 కంటె ఎక్కువ మంది ప్రజలు యుద్ధాల మూలంగా చంపబడ్డారు, దానికి ముందు 400 సంవత్సరాలన్నింటిలో చంపబడిన వారి సంఖ్యకు పోల్చితే ఇది నాలుగు రెట్లు అధికం! మానవ పాలనపై ఎంతపెద్ద దోషారోపణ!
ఇతర సాక్ష్యాధారాలు
5-7. మనము అంత్యదినాల్లో ఉన్నామనుటకు మరికొన్ని సాక్ష్యాధారాలేమిటి?
5 అంత్యదినములలో జరిగే యితర సంఘటనలను యేసు వివరించాడు: “అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్లును [అంటురోగాలు] కరవులును తటస్థించును.” (లూకా 21:11) అట్టి విపత్తుల మూలంగా కలవరం ఎక్కువైనందున 1914 నుండి జరుగుతున్న సంఘటనలకది చక్కగా సరిపోతుంది.
6 పెద్దపెద్ద భూకంపాలు తరచు సంభవిస్తూ, అనేకుల ప్రాణాలను బలిగొంటున్నవి. మొదటి ప్రపంచ యుద్ధానంతరం వచ్చిన స్పానిష్ ఇన్‌ఫ్లూయెంజా ఒక్కటే షుమారు 2,00,00,000 మంది ప్రాణాలను బలిగొన్నది—ఆ సంఖ్య 3,00,00,000 లేదా అంతకన్నా ఎక్కువే ఉంటుందని కొందరి అంచనా. ఎయిడ్స్ లక్షలాదిమంది ప్రాణాలను తీస్తుంది. గుండె జబ్బులు, క్యాన్సర్ మరి యితర రోగాల మూలంగా ప్రతి సంవత్సరం లక్షలాదిమంది చనిపోతున్నారు. ఇంకా అనేక లక్షల మంది ఆకలితో అలమటిస్తూ చనిపోతున్నారు. నిస్సందేహంగా, ‘ప్రకటన గ్రంథమందలి గుర్రపు రౌతులు’ యుద్ధం, కరవు, వ్యాధులైన తెగుళ్లతో మానవ కుటుంబమందలి అసంఖ్యాకులను 1914 నుండి హతమార్చుచున్నవి.—ప్రకటన 6:3-8.
7 ప్రస్తుతము అన్నిదేశాలలో కన్పిస్తున్న నేరము అధికమౌతుందని కూడా యేసు ప్రవచించాడు. ఆయనిట్లన్నాడు: “అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును.”—మత్తయి 24:12.
8. మన కాలానికి 2 తిమోతి 3 వ అధ్యాయమందలి ప్రవచనము ఎలా సరిపడుతున్నది?
8 అటు తర్వాత, నేడు ప్రపంచమంతటా ప్రస్ఫుటమగుచున్న నైతిక పతనాన్ని గూర్చి బైబిలు ప్రవచించింది: “అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఏలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తలిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటె సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు, పైకిభక్తిగల వారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు . . . దుర్జనులును వంచకులును . . . అంతకంతకు చెడిపోవుదురు.” (2 తిమోతి 3:1-13) అదంతా నిజమని మనకళ్లముందే నిరూపించబడింది.
మరో కారకము
9. భూమి మీద అంత్యదినాలు ప్రారంభమైన సమయాన పరలోకంలో ఏమి సంభవించింది?
9 ఈ శతాబ్దమందు బాధ యింత విస్తారంగా వృద్ధిచెందుటకు బాధ్యత వహించు మరో కారకమున్నది. అంత్యదినములు 1914 లో ప్రారంభమైన నాడే మానవజాతిని మరింత గొప్పవిపత్తులో పడవేసిన మరొకటి సంభవించింది. బైబిలులో ఆఖరి పుస్తకమందున్న ప్రవచనము వివరిస్తున్నట్లుగా, ఆ సమయాన “పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును [పరలోక అధికారమందున్న క్రీస్తు] అతని దూతలును ఆ ఘటసర్పముతో [సాతాను] యుద్ధము చేయవలెనని యుండగా, ఆ ఘటసర్పమును దాని దూతలును [దయ్యములు] యుద్ధము చేసిరి గాని గెలువ లేకపోయిరి గనుక పరలోకమందు వారికిక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు, అపవాదియనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘటసర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను; దాని దూతలు దానితో కూడ పడద్రోయబడిరి.—ప్రకటన 12:7-9.
10, 11. సాతాను అతని దయ్యములు భూమిపైకి పడద్రోయబడినప్పుడు మానవజాతిపై ఎటువంటి ప్రభావం పడింది?
10 మానవ కుటుంబానికి సంభవించిన పర్యవసానములేమిటి? ఆ ప్రవచనం యింకా యిలా పేర్కొంటున్నది: “భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చియున్నాడు.” అవును, ఈ విధానం దాని అంతానికి సమీపిస్తున్నదని సాతానుకు తెలుసు, అందుకే తాను, తనలోకం నిర్మూలము చేయబడక ముందు మానవులను దేవునికి వ్యతిరేకంగా త్రిప్పడానికి తానుచేయగల్గినదంతా చేస్తున్నాడు. (ప్రకటన 12:12; 20:1-3) ఈ ఆత్మీయ ప్రాణులు తమ స్వేచ్ఛాచిత్తాన్ని దుర్వినియోగ పర్చుకొనినందున ఎంత దిగజారారు! వారి ప్రభావం క్రింద, ముఖ్యంగా 1914 నుండి భూమిమీద ఎంత భయంకరమైన పరిస్థితులు నెలకొనియున్నవి!
11 మన కాలమును గూర్చి యేసు యిలా ప్రవచించడంలో ఆశ్చర్యంలేదు: “భూమి మీద . . . ఘోషవలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును . . . లోకము మీదికి రాబోవుచున్నవాటి విషయమై భయము కలిగి, మనుష్యులు ఎదురుచూచుచు ధైర్యము చెడికూలుదురు.”—లూకా 21:25, 26.
మానవుల, దయ్యముల పాలనకు అంతం సమీపమయ్యింది
12. ఈ విధానాంతానికి ముందు నెరవేరుటకు మిగిలియున్న ప్రవచనాలలో చివరిదేమిటి?
12 దేవుడు ఈ ప్రస్తుత విధానమును అంతం చేయకముందు నెరవేరవలసిన బైబిలు ప్రవచనాలు యింకెన్ని మిగిలియున్నవి? చాలా కొద్దిగానే ఉన్నాయి! నెరవేరవలసిన చివరి ప్రవచనం 1 థెస్సలొనీకయులు 5:3 లో ఉన్నది, అదిలా అంటున్నది: “శాంతి భద్రలను గూర్చి వారు మాట్లాడుతుండగా అకస్మాత్తుగా వారికి నాశనము వచ్చును.” (ది న్యూ ఇంగ్లీష్ బైబిల్) “వారు మాట్లాడుతుండగనే” ఈ విధానాంతము వచ్చునని యిది చూపుతున్నది. లోకం దీనిని ఎదురు చూడనందున, శాంతి భద్రత కొరకు తాము నిరీక్షించిన దానిపై మానవుల అవధానమున్నపుడే వారనుకోని సమయాన నాశనం తటస్థించును.
13, 14. ఎటువంటి శ్రమలకాలాన్ని యేసు ప్రవచించాడు, అదెలా ముగుస్తుంది?
13 సాతాను ప్రభావం క్రింద ఈ లోకానికున్న సమయం గతించి పోతున్నది. శ్రమల కాలంలో అది త్వరలో అంతమొందును, దానిని గూర్చి యేసు యిలా చెప్పాడు: “లోకారంభము నుండి ఇప్పటివరకును అట్టి శ్రమకలుగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు.”—మత్తయి 24:21.
14 “మహాశ్రమల” తారాస్థాయి, అర్మగిద్దోను అనే దేవుని యుద్ధమే. దేవుడు “ఈ రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయునని” ప్రవక్తయైన దానియేలుచే పలుకబడిన సమయమిదే. దేవుని నుండి వేరైన ప్రస్తుతమానవ పాలనలకు అంతమని దీని భావం. పరలోకం నుండి నిర్వహించబడు ఆయన రాజ్యపాలన మానవ వ్యవహారములన్నింటి పూర్తి నిర్వహణను హస్తగతం చేసుకొనును. పాలించే అధికారము ఇంకెప్పుడు ‘మరొకరికి’ విడువబడదని దానియేలు ప్రవచించాడు.—దానియేలు 2:44; ప్రకటన 16:14-16.
15. సాతాను అతని దయ్యముల ప్రభావానికి ఏమి సంభవించును?
15 ఆ సమయాన సాతాను, దయ్యముల ప్రభావమంతా పోతుంది. “ఇక జనములను మోసపరచ కుండునట్లు” ఆ తిరుగుబాటు చేసిన ఆత్మీయ ప్రాణులందరు తొలగించబడతారు. (ప్రకటన 12:9; 20:1-3) మరణదండన విధించబడినవారై తమ నాశనము కొరకు వేచియుంటారు. పతనంచేసే అట్టి ప్రభావము నుండి మానవులు స్వతంత్రులగుట ఎంతటి ఉపశమనం!
ఎవరు తప్పించుకుంటారు? ఎవరు తప్పించుకోరు?
16-18. ఈ విధానాంతమును ఎవరు తప్పించుకుంటారు, ఎవరు తప్పించుకోలేరు?
16 ఈ లోకంపై దేవుని తీర్పులు అమలు పర్చబడేప్పుడు ఎవరు తప్పించుకుంటారు? ఎవరు తప్పించుకోరు? దేవుని పాలనను ఎవరు అపేక్షిస్తారో వారు కాపాడబడి తప్పించుకుంటారని బైబిలు చూపుతున్నది. ఎవరైతే దేవుని పాలనను అపేక్షించరో వారు కాపాడబడరు గాని సాతాను లోకంతోపాటు నాశనమౌతారు.
17 సామెతలు 2:21, 22 యిట్లంటున్నది: “యథార్థవంతులు [దేవుని పాలనకు లోబడువారు] దేశమందు నివసించుదురు. లోపములేని వారు దానిలో నిలిచియుందురు. భక్తిహీనులు [దేవుని పాలనకు లోబడనొల్లని వారు] దేశములో నుండకుండ నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దానిలోనుండి పెరికి వేయబడుదురు.”
18 కీర్తన 37:10, 11 కూడ యిట్లంటుంది: “ఇక కొంత కాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు . . . దీనులు భూమిని స్వతంత్రించు కొందురు. బహు క్షేమముకలిగి సుఖించెదరు.” మరియు 29 వ వచనం యిలా అంటున్నది: “నీతిమంతులు భూమిని స్వతంత్రించు కొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.”
19. మనము ఏ సలహాను హృదయంలోనికి తీసుకోవాలి?
19 కీర్తన 37:34 నందలి సలహాను మన హృదయంలోనికి తీసుకోవాలి. అదిలా చెబుతున్నది: “యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము. ఆయన మార్గము ననుసరించుము. భూమిని స్వతంత్రించు కొనునట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు.” మరి 37, 38 వచనాలు యిలా అంటున్నవి: “నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడుము సమాధానపరచు వారి సంతతి నిలుచును గాని ఒకడైనను నిలువకుండ అపరాధులు నశించుదురు. భక్తిహీనుల సంతతి నిర్మూలమగును.”
20. ఇవి జీవించదగు పులకించే కాలములని మనమెందుకు చెప్పవచ్చును?
20 దేవుడు నిజంగా శ్రద్ధకల్గియున్నాడని సమస్త దుష్టత్వాన్ని బాధను ఆయన అంతమొనర్చునని తెలుసుకొనుట ఎంత ఓదార్పుకరం, అవును, ఎంత ప్రేరణగా ఉన్నది! అట్టి అద్భుత ప్రవచనాల నెరవేర్పు అనతికాలంలో జరుగునని గుర్తెరుగుట ఎంత పులకింతగానున్నది!
[అధ్యయన ప్రశ్నలు]
[20 వ పేజీలోని చిత్రం]
అంత్యదినముల “సూచనకు” సంబంధించిన సంఘటనలను బైబిలు ప్రవచించింది
[22 వ పేజీలోని చిత్రం]
త్వరలో అర్మగిద్దోను నందు దేవుని పాలనకు లోబడనివారు నాశనమౌతారు. లోబడేవారు నీతియుక్తమైన నూతనలోకము లోనికి తప్పించుకొంటారు