కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తిరుగుబాటు ఫలితమేమిటి?

తిరుగుబాటు ఫలితమేమిటి?

భాగం 7

తిరుగుబాటు ఫలితమేమిటి?

 1-3. యెహోవా చేసిందే సమంజసమని కాలం ఎలా నిరూపించింది?

 పరిపాలించేందుకు దేవునికున్న హక్కుకు సంబంధించిన వివాదాంశము దృష్ట్యా, ఈ శతాబ్దాలన్నింటిలో దేవుని నుండి స్వతంత్రమైన మానవ పాలన యొక్క ఫలితమేమిటి? మానవులు దేవునికంటె శ్రేష్ఠమైన పాలకులని నిరూపించుకున్నారా? మానవుడు మానవునికి చేసిన అమానుష క్రియల చరిత్రనుబట్టి మనం నిర్ణయించాలంటే, నిశ్చయంగా వారలా నిరూపించు కొనలేదనే చెప్పాలి.

2 మన ఆది తలిదండ్రులు దేవుని పాలనను తృణీకరించినప్పుడు, విపత్తు వెన్నంటింది. వారు తమకు, తమనుండి ఉద్భవించిన మానవ కుటుంబానికంతటికి బాధను తెచ్చారు, వారు తమను తప్ప వేరెవ్వరిని నిందించలేరు. దేవుని వాక్యమిట్లంటున్నది: “వారు తమ్మును చెరుపు కొనిరి; ఆయన పుత్రులు కారు, వారు కళంకులు.”—ద్వితీయోపదేశకాండము 32:5.

3 దేవుని ఏర్పాట్లనుండి వైదొలగితే, వారు కృషించి తుదకు మరణమౌతారని ఆదాము హవ్వలకు దేవుడిచ్చిన హెచ్చరిక యొక్క వాస్తవాన్ని చరిత్ర రుజువు చేసింది. (ఆదికాండము 2:17; 3:19) వారు దేవుని పాలననుండి వైదొలగారు, కాలగమనంలో వారు వృద్ధులై మరణించారు.

 4. మనమంతా అపరిపూర్ణులముగాను, రోగానికి, మరణానికి లోనయ్యేవారంగాను ఎందుకు జన్మించాము?

4 అటుపిమ్మట వారి సంతానమంతటికి ఏమి సంభవించిందో రోమీయులు 5:12 వివరిస్తుంది: “ఒక మనుష్యుని ద్వారా [మానవ కుటుంబ శిరస్సు, ఆదాము] పాపమును పాపము ద్వారా మరణమును ఏలాగు ప్రవేశించేనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.” కావున మన మొదటి తలిదండ్రులు దేవుని పర్యవేక్షణాధికారమునకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు వారు లోపభూయిష్టమైన పాపులయ్యారు. జన్యుశాస్త్ర నిబంధన కనుగుణంగా, తమకు సంభవించిన అపరిపూర్ణతనే వారు తమ సంతానమంతటికి అందించ గల్గారు. అందుకే మనమంతా లోపముతోనే, రోగము మరణమునకు లోనయ్యేవారముగా జన్మించాము.

 5, 6. నిజమైన శాంతి సౌభాగ్యాలను తెచ్చేందుకు మానవుడు చేసిన వ్యయప్రయాసలను గూర్చి చరిత్ర ఏమి తెల్పుతున్నది?

5 అనేక శతాబ్దాలు గతించాయి. సామ్రాజ్యాలు ఆవిర్భవించి అంతరించాయి. తమ ఆలోచనకు తట్టిన ప్రతివిధమైన ప్రభుత్వాన్ని ప్రయత్నించి చూశారు. అయినా, మానవ సమాజానికి అంతకంతకు భయంకరమైన సంఘటనలు సంభవించాయి. ఆరువేల సంవత్సరముల తరువాత, మానవులు భూవ్యాప్తంగా శాంతిసౌభాగ్యాలను, న్యాయాన్ని, స్థాపించే స్థాయికి ఎదిగి యుంటారని, ఈ పాటికి దయ, జాలి, సహకారమువంటి సహేతుక విలువలను వారు సాధించి యుంటారని ఒకడు తలంచవచ్చును.

6 అయితే, వాస్తవం అందుకు భిన్నంగా ఉంది, ఏవిధమైన మానవ ప్రభుత్వమూ అందరి కొరకు నిజమైన శాంతి సౌభాగ్యాలను ఎన్నడు తేలేకపోయింది. ఈ 20 వ శతాబ్దములోనే పథకం ప్రకారం జరిగిన సమూల నాశనకాలంలో లక్షలాది మంది హతులగుటను, యుద్ధాలలో 10 కోట్ల కంటె ఎక్కువమంది సంహరించబడడం మనం చూశాం. మన కాలంలో మతవిద్వేషము, రాజకీయ విభేదాల దృష్ట్యా లెక్కలేనంత మంది చిత్రహింసకు గురయ్యారు, హత్య గావించబడ్డారు, చెరసాలపాలయ్యారు.

నేటి పరిస్థితి

 7. నేటి మానవ సమాజ పరిస్థితిని ఎట్లు వర్ణించగలం?

7 అంతేగాక, నేటి మానవ సమాజ పరిస్థితినంతటిని గమనించండి. నేరం, దౌర్జన్యం పెచ్చుపెరిగిపోతున్నది. మాదకద్రవ్యాల దుర్వినియోగం దావానంలా వ్యాపిస్తున్నది. సుఖరోగాలు కలవరపరుస్తున్నవి. ఎయిడ్స్‌ అనే భయంకరమైన వ్యాధి లక్షలాది మందికి సోకింది. ఏ కొద్దిమందికో అనంత సౌభాగ్యాలుండగా, ప్రతి సంవత్సరం కోట్లాదిమంది ఆకలితో లేదా రోగాలతో చనిపోతున్నారు. మానవులు భూమిని కలుషితం చేసి కొల్లగొడుతున్నారు. ప్రతిచోట కుటుంబ జీవితం విచ్ఛిన్నమై, నైతిక విలువలు క్షీణిస్తున్నవి. నిజమే, ‘ఈ యుగసంబంధమైన దేవతయైన’ సాతాను యొక్క నీచమైన పాలనను నేటి జీవితము ప్రతిబింబిస్తున్నది. చెడిపోయిన, ఆప్యాయతానురాగాలు లేని ఈలోకానికి అతడు నాయకుడై యున్నాడు.—2 కొరింథీయులు 4:4.

 8. మానవుడు సాధించిన వాటిని మనం నిజమైన పురోభివృద్ధియని ఎందుకు పిలువలేము?

8 మానవులు తమ విజ్ఞానశాస్త్ర వస్తుసంబంధ పురోగతిలో తారాస్థాయికి చేరుకొనేందుకు తగిన సమయాన్ని దేవుడు అనుమతించాడు. విల్లంబుల స్థానంలో మెషిన్‌గన్‌లు, ట్యాంకులు, జెట్‌బాంబార్లు, పరమాణు ఆయుధాలు భర్తీ చేయడం నిజమైన పురోగతియేనా? మానవులు అంతరిక్షంలో ప్రయాణించ గల్గుతున్నారు గాని భూమి మీద శాంతియుత సహజీవనం చేయలేక పోతున్నారనేది ఒక అభివృద్ధియేనా? ప్రజలు రాత్రులందు లేదా కొన్ని ప్రాంతాలలో పగటి పూట సహితం వీధులందు నడవడానికి భయపడు తున్నారనేది అభివృద్ధియేనా?

కాలం ఏమి చూపింది

 9, 10. (ఎ) గత శతాబ్దాల కాలమంతా స్పష్టంగా చూపిందేమిటి? (బి) స్వేచ్ఛాచిత్తమును దేవుడెందుకు తీసివేయలేదు?

9 మానవులు దేవుని పాలననుండి వైదొలగి తమ స్వంత మార్గమును విజయవంతం చేసుకొనుట వారికి సాధ్యం కాదని అనుమతించబడిన శతాబ్దాల పరీక్షా కాలం నిరూపించింది. తాము తినకుండా, త్రాగకుండా, ఊపిరి పీల్చుకొనకుండా ఉండడం ఎలా అసాధ్యమో యిది కూడా వారికి అసాధ్యమే. సాక్ష్యాధారం తేటతెల్లమయింది: మనం ఆహారం, నీరు గాలిపై ఆధారపడి జీవించడానికి సృజించబడినట్లే మన సృష్టికర్త నడిపింపుపై ఆధారపడి జీవించుటకు రూపింపబడ్డాము.

10 దేవుడు దుష్టత్వాన్ని అనుమతించుట ద్వారా, స్వేచ్ఛాచిత్త దుర్వినియోగ చెడుఫలితాలను శాశ్వతంగా చూపించాడు. స్వేచ్ఛాచిత్తం ఎంత విలువైనదంటే దేవుడు దానిని మానవులనుండి తీసివేసే బదులు దానిని దుర్వినియోగ పర్చడమంటే ఏమిటో చూడమని వారిని అనుమతించాడు. దేవుని వాక్యం యీ సత్యాన్ని యిలా అన్నది: “తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశములో లేదు.” “ఒకడు మరియొకనిపై అధికారియై తనకు హానితెచ్చుకొనుట కలదు” అని అది చెప్పుట కూడా సత్యమే.—యిర్మీయా 10:23; ప్రసంగి 8:9.

11. ఏరకమైన మానవ పాలనయైనా బాధను తొలగించిందా?

11 మానవుడు బాధను అంతమొనర్చలేడని దేవుడు అనుమతించిన ఆరువేల సంవత్సరాల మానవ పాలన గట్టి సాక్ష్యాన్నిచ్చింది. ఏ కాలంలోను అతడు అలా చేయలేదు. దృష్టాంతమునకు, ఇశ్రాయేలీయుల రాజైన సొలొమోను కాలమందు తనకున్న జ్ఞానము, సంపద, అధికారముతో కూడా మానవపాలన వలన కలిగిన దైన్య స్థితిని అతడు సరిచేయలేక పోయాడు. (ప్రసంగి 4:1-3) ఆలాగే మన ప్రస్తుతకాల ప్రపంచ నాయకులు, అత్యాధునిక సాంకేతిక అభివృద్ధిని కల్గియుండి కూడ బాధను తొలగించలేకపోతున్నారు. అంతకన్నా అద్వాన్న విషయమేమంటే, దేవుని పాలననుండి వైదొలగిన మానవులు బాధను తొలగించేబదులు, దానిని అధికం చేస్తారనియే చరిత్ర చూపిస్తుంది.

దేవుని దీర్ఘకాలిక దృష్టి

12-14. దేవుడు బాధను అనుమతించిన కారణంగా ఎటువంటి దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్గాయి?

12 దేవుడు బాధను అనుమతించుట మనకు బాధాకరంగానే ఉంది. అయితే మున్ముందు కలుగబోయే సత్ఫలితాలను ఆయన ఎరిగినవాడై దీర్ఘకాలిక దృక్పథాన్ని కలిగి యుండెను. దేవునికున్న యీ దృక్పథం తన ప్రాణులకు కొద్ది సంవత్సరాలకు లేదా కొన్ని వేల సంవత్సరాలకు మాత్రమే ప్రయోజనకరము కాదు, గాని లక్షలాది సంవత్సరాలకు, అవును నిరంతరం ప్రయోజనకరంగా ఉండును.

13 భవిష్యత్తులో ఎప్పుడైనా ఎవరైనా స్వేచ్ఛాచిత్తాన్ని దుర్వినియోగపరచి, దేవుని వ్యవహార విధానమును ప్రశ్నిస్తే, అప్పుడు అతడు తన తలంపులను నిరూపించుకొన ప్రయత్నించేందుకు అతనికి సమయము అనుమతించనవసరము లేదు. దేవుడు తిరుగుబాటు దారులను వేలసంవత్సరాలు అనుమతించినందున, విశ్వములో ఎక్కడైనా అనంత కాలం అన్వయించగల చట్టబద్ధమైన దృష్టాంతాన్ని స్థిరపర్చాడు.

14 యెహోవా నేటివరకు దుష్టత్వమును, బాధను అనుమతించినందున, ఆయనతో పొందిక లేనిదేదైనా విజయమొంద జాలదనుట యిప్పటికే పూర్తిగా రుజువైంది. మానవులు లేదా ఆత్మీయ ప్రాణులు వేసే ఏ వ్యక్తిగత పథకమైనను శాశ్వత ప్రయోజనాలను తేలేదని అది స్పష్టం చేస్తుంది. కావున, దేవుడు తిరుగుబాటు దారులను వెంటనే నాశనము చేయుట సమర్థింపదగినదే. “భక్తిహీనులందరిని ఆయన నాశనము చేయును.”—కీర్తన 145:20; రోమీయులు 3:4.

[అధ్యయన ప్రశ్నలు]

[15 వ పేజీలోని చిత్రం]

మన ఆది తలిదండ్రులు దేవుని నుండి వేరైయుండుటకు ఎంచుకొని, తుదకు వారు వృద్ధులై మరణించారు

[16 వ పేజీలోని చిత్రాలు]

దేవుని నుండి వైదొలగిన మానవపాలన విపత్కరమైనదని రుజువాయెను

[చిత్రసౌజన్యం]

U.S. Coast Guard photo