కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుడున్నాడని మనమెలా తెలుసుకోగలము

దేవుడున్నాడని మనమెలా తెలుసుకోగలము

భాగం 3

దేవుడున్నాడని మనమెలా తెలుసుకోగలము

 1, 2. దేవుడున్నాడా లేదా అనేది నిశ్చయపర్చుకొనుటకు ఏ సూత్రం మనకు సహాయపడును?

 దేవుడున్నాడో లేదో నిర్థారించే ఒకానొక మార్గం, స్థిరమైన ఈ సూత్రాన్ని అన్వయించుటే: తయారీకి తయారుచేసేవాడు కావాలి. తయారు చేయబడిన వస్తువు ఎంత సంక్లిష్టంగా ఉం  దాని నిర్మాణకుడు అంతటి సమర్థుడైయుంటాడు.

2 ఉదాహరణకు, నీ గృహాన్ని పరికించి చూడుము. గోడలు, నేల, పైకప్పులకు ఎలా నిర్మాణకుడు అవసరమో ఆలాగే బల్లలు, కుర్చీలు, డెస్క్‌లు, కుండలు, పాత్రలు, గిన్నెలు, మరితర వంట పాత్రలన్నింటికి తయారు చేసేవాడు కావాల్సిందే. సామాన్యమైన వస్తువులకే వాటిని తయారు చేసేవాడు అవసరమైతే, సంక్లిష్టమైన వాటికి అంతకన్నా తెలివైన నిర్మాణకుడు అవసరమని చెప్పుట సహేతుకము కాదా?

సంభ్రమాశ్చర్యంగొల్పే మన విశ్వం

 3, 4. దేవుడున్నాడని తెలుసుకొనుటకు విశ్వము మనకెలా సహాయపడుతుంది?

3 ఓ గడియారానికి దాన్ని తయారు చేసేవాడుండాలి. మరి సూర్యుడు, దాని చుట్టూ అనేక శతాబ్దాలనుండి కడుచక్కగా తిరుగుతున్న మరింత సంక్లిష్టమగు మన అనంత సూర్యకుటుంబం సంగతేమి? మనము నివసిస్తున్న సంభ్రమాశ్చర్యంగొల్పే నక్షత్ర వీధి అనగా పదివేలకోట్ల కంటే ఎక్కువ నక్షత్రాలున్న పాలపుంత విషయమేమి? రాత్రివేళ నీవెప్పుడైనా పాలపుంతను పరికించి చూశావా? చూసి ముగ్ధుడవయ్యావా? మన పాలపుంతవంటి లెక్క లేనన్ని నక్షత్రవీధులుగల వింతైన విశ్వాన్ని గూర్చి ఆలోచించు! ఆకాశమందలి ఈ గ్రహాలు అనేకానేక శతాబ్దములనుండి తమ కదలికలో ఎంత ఆధారపడదగినవిగా ఉన్నవంటే అవి ఒక చక్కని గడియారముతో పోల్చబడ్డాయి.

4 అతి సామాన్యమైన గడియారానికే, దానిని తయారుచేసే వాడు అవసరమైతే, అనంతమైన మరింత క్లిష్టమగు సంభ్రమాశ్చర్యము గొల్పే విశ్వానికి నిశ్చయంగా ఒక రూపకల్పన చేసేవాడు, నిర్మాణకుడు అవసరం. అందుకే బైబిలు మనలను ‘కన్నులు పైకెత్తిచూడుమని’ ఆహ్వానించి యిలా అడుగుతున్నది: “వీటిని ఎవడు సృజించెను?” దీనికి సమాధానమేమంటే: “వీటిలెక్కచొప్పున వీటి సమూహములను బయలు దేరజేసి వీటన్నింటికిని పేరులు పెట్టి పిలుచువాడే [దేవుడే] గదా. తన అధిక శక్తిచేతను తనకు కలిగియున్న బలాతిశయము చేతను ఆయన యొక్కటియైనను విడిచిపెట్టడు.” (యెషయా 40:26) కావున, ఈ విశ్వము దాని ఉనికిని బట్టి ఒక అదృశ్యుడైన, నియంత్రణ చేయు, వివేకమైన శక్తి—దేవుడేనని చాటి చెబుతుంది.

భూమి సాటిలేని విధంగా రూపించబడింది

 5-7. భూమిని గూర్చిన ఏ వాస్తవాలు దానికొక నిర్మాణకుడున్నాడని చూపిస్తున్నవి?

5 భూమిని గూర్చి శాస్త్రజ్ఞులు ఎంతగా అధ్యయనం చేస్తుంటే, అది మానవుల నివాసము కొరకు సాటిలేని విధంగా రూపించబడిందని వారు అంతగా తెలుసుకుంటున్నారు. అది సూర్యునినుండి తగినంత వెలుతురు, వేడిని పొందేటంతటి సరైన దూరంలోనే ఉన్నది. భూమిమీద అనేక ప్రాంతాల్లో ఋతువులు సంభవించునట్లు అది సంవత్సరానికొకసారి సూర్యుని చుట్టు తిరుగుతూవుంటుంది. వెలుతురు, చీకటి వెన్నంటి వచ్చేందుకు భూమికూడ తన అక్షమందు ప్రతి 24 గంటలకు పరిభ్రమిస్తుంది. మనం పీల్చుకొనడానికి, అంతరిక్షం నుండి వస్తున్న హానికరమగు ధార్మికత నుండి కాపాడబడడానికి అనువైనరీతిలో దాని వాతావరణమందు వాయువులు తగుపాళ్లలో మిళితమైయున్నవి. ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి అవసరమగు శ్రేష్ఠమైన నీరు, సారవంతమైన నేలనుకూడ అది కలిగియున్నది.

6 అలాంటి కారకములన్నింటిని, మరియితరములను కల్గియుండకుండ పనిచేయాలంటే జీవించటం అసంభవం. అదంతా ఒక హఠాత్పపరిణామమా? సైన్స్‌ న్యూస్‌ యిట్లంటున్నది: “అట్టి నిర్దిష్టమైన, చక్కని పరిస్థితులు ఏ లక్ష్యం లేకుండా ఉద్భవించవని అనిపిస్తున్నది.” అవి అలా ఉద్భవించజాలవు. మహోత్కృష్టమైన నిర్మాణకునిచే సంకల్పసహిత నిర్మాణము వాటికున్నది.

7 నీవు ఒక చక్కని యింటిలోనికి వెళ్లి, అది సమృద్ధిగా ఆహారంతో నింపబడి, వెచ్చదనము, ఎయిర్‌ కండిషన్‌ విధానమును అద్భుతంగా కలిగియుండి, నీటి సరఫరా పంపులతో చక్కగా అమర్చబడివుంటే చూచి నీవేమనుకుంటావు? అవన్నీ వాటంతటవే వచ్చాయని అనుకుంటావా? లేక, ఒక తెలివైన వ్యక్తి దానిని రూపించాడని, ఎంతో శ్రద్ధతో దానిని తయారు చేసాడని నీవు నిశ్చయంగా అనుకుంటావు. ఈ భూమి కూడ దాని నివాసులకు అవసరమైన వాటిని పొందుపర్చేందుకు మరి ఏ గృహముకంటెను అద్భుతంగా, సౌకర్యార్థంగా రూపించబడి తయారు చేయబడింది.

 8. మన యెడల దేవుడు ప్రేమగల శ్రద్ధ కల్గియున్నాడనే దానికి నిదర్శనంగా భూమిని గూర్చి యింకేమేమి విషయాలున్నవి?

8 జీవితానికి ఉల్లాసాన్ని చేకూర్చే యితర అనేకమైన వాటిని గూర్చి కూడా ఆలోచించుము. మానవులు ఆనందించగల మనోహరమైన సువాసనలతోకూడిన అందమైన రంగులుగల వివిధరకముల పుష్పాలను చూడండి. అటుతరువాత ఎంతోరుచికరమైన ఆహారపదార్థములున్నాయి. అడవులు, పర్వతాలు, సరస్సులు మరి యితర సృష్టియంతా చూడముచ్చటగా ఉన్నది. జీవితములో మన ఆనందాన్ని యినుమడింపజేసే అందమైన సూర్యాస్తమయాల సంగేతేమి? జంతుజాలాల్లో హాస్యము కల్గించేవాటి కుప్పిగంతులు, కుక్క, పిల్లి, మరితర జంతువుల కూనలు అల్లారుముద్దుగా ఉన్నందున మనం ఉల్లసించుటలేదా? కావున, జీవాన్ని పోషించడానికి అంతగా అవసరములేని అనేక ఉల్లాసవంతమగు వింతలను భూమి మనకందిస్తున్నది. మానవులను దృష్టియందుంచుకొని మనం కేవలం జీవించడమే కాకుండ, ఉల్షాసవంతంగా జీవితాన్ని అనుభవించే లక్ష్యముతోనే యీ భూమిచేయబడిందని యివన్నీ చూపిస్తున్నవి.

 9. భూమిని ఎవరు సృజించారు, ఆయన దానినెందుకు చేశాడు?

9 కావున, యెహోవా దేవుని గూర్చి బైబిలు రచయిత చెప్పినట్లుగా వీటన్నింటిని యిచ్చిన వానిని గుర్తించుటయే సహేతుకమైన ముగింపు: “భూమ్యాకాశములను కలుగజేసినది నీవే.” ఎందుకొరకు చేశాడు? దేవుని గూర్చి ఆ రచయితే వర్ణిస్తూ యిలా జవాబిస్తున్నాడు, ‘‘ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిరపరచెను. నిరాకారముగా నుండునట్లు ఆయన దాని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దానిసృజించెను.”—యెషయా 37:16; 45:18.

అద్భుత జీవకణం

10, 11. జీవకణం ఎందుకంతటి ఆశ్చర్యకరమైనది?

10 జీవరాసుల సంగతేమిటి? వాటికి సృష్టికర్త అక్కర్లేదా? దృష్టాంతమునకు, జీవకణము యొక్క కొన్ని అద్భుతమగు లక్షణాలను పరిశీలించండి. అణుజీవ శాస్త్రజ్ఞుడు మీఖాయేల్‌ డెంటన్‌ తన పుస్తకమైన ఇవొల్యూషన్‌: ఎ థియరీ ఇన్‌ క్రైసిస్‌లో యిలా చెప్పుచున్నాడు: “నేడు భూమిమీద జీవిస్తున్న వాటన్నిటిలోకెల్లా అతిసూక్ష్మమైన బాక్టీరియా కణాలు చెప్పనలవికానంత సంక్లిష్టమైనవి, . . . దానిలో ప్రతిది సంక్లిష్టమైన అణువులతో కూడిన యంత్రముయొక్క వేవేల విశేషనిర్మిత తుంపరుల వాస్తవిక సూక్ష్మాతి సూక్ష్మకర్మాగారం . . . ఇది నిర్జీవసృష్టిలో సాటిలేనిదై, మానవుడు నిర్మించిన ఎటువంటి యంత్రంకంటెను మరెంతో చిక్కైనది.”

11 ప్రతికణమందలి జన్యుసంకేతాన్ని గూర్చి అతడిలా అంటున్నాడు: “సమాచారాన్ని నిలువచేసే విషయంలో మన మెరిగియున్న డి.ఎన్‌.ఎ యొక్క సామర్థ్యం అపారమైనది; ఒక అవయవాన్ని నిర్దేశించడానికి అవసరమయ్యే సమాచారమంతటిని ఉంచగల ప్రావీణ్యత గల్గి ఒక గ్రాములో కొన్నివేల లక్షలవంతుకన్నా తక్కువ తూగేంతటి సంక్లిష్టమైనది. . . . దానికి తోడు జీవము యొక్క ఈ అణుయాంత్రిక విధానము చేయగల్గే నమ్మకమైన, సంక్లిష్టమైన పని ఎంతగొప్పదంటే, మన అత్యాధునికమైన [ఉత్పత్తులు] వాటికంటే గజిబిజిగా ఉంటాయి. వాటిముందు మనం తలవంచ వలసిందే.”

12. జీవకణం యొక్క మూలమును గూర్చి ఒక విజ్ఞాన శాస్త్రజ్ఞుడేమన్నాడు?

12 డెంటన్‌ యింకా యిట్లంటున్నాడు: “మనమెరిగిన అతి సూక్ష్మమైన కణము యొక్క చిక్కుముడి ఎంత గొప్పదంటే, అంతటి దివ్యమైన పదార్థము ఏదో స్వభావవిరుద్ధమైన, ఏమాత్రం నిరూపించజాలని సంఘటన మూలంగా అకస్మాత్తుగా వచ్చిందనే దానిని అంగీకరించడం అసాధ్యం.” దానిని రూపకల్పన చేసినవాడు, ఓ నిర్మాణకుడు ఉండి తీరాలి.

ఆశ్చర్యకరమైన మన మెదడు

13, 14. మెదడు జీవకణం కంటే ఎందుకు ఆశ్చర్యకరమైనది?

13 ఈ శాస్త్రజ్ఞుడు ఆ తరువాత ఏమన్నాడంటే: “సంక్లిష్టమైన వాటి విషయములో సస్తనజాతుల మెదడు పనితీరుతో పోల్చితే జీవకణం దానిముందు శూన్యం. మానవుని మెదడులో దాదాపు వెయ్యికోట్ల నాడీకణములున్నాయి. ప్రతి నాడీకణము మధ్య సంబంధము కలిపే పీచువంటి నాళములు పదివేలనుండి ఒక లక్షవరకు అమర్చబడి ఉంటాయి, వీటితోనే అది మెదడులోనున్న యితర నాడీకణములతో సంబంధము కలిగి ఉంటుంది. వాటన్నిటిని కలుపుకుంటే మానవుని మెదడులో కనెక్షన్లి సంఖ్య పదికోట్ల కోట్లకు చేరుకుంటుంది.”

14 డెంటన్‌ యింకా యిలా అన్నాడు: “మెదడు అంతర్గత కనెక్షన్లలో కేవలం నూరోవంతు నిర్దిష్టంగా సంస్థీకరించబడితే, భూమిమీదనున్న యావత్‌ సమాచార నెట్‌వర్క్‌ కన్నా అది అనేక నిర్దిష్ట విశేష కనెక్షన్లను కల్గివుంటుంది.” పిమ్మట అతడిలా అడుగుతున్నాడు: “అట్టి సిస్టమ్‌లను ఏదైనా ఓ సామూహిక పద్ధతి ఎన్నడైనా సమకూర్చగలిగెనా?” నిశ్చయంగా దానికి సమాధానము లేదనే చెప్పాలి. మెదడు శ్రద్ధగల్గిన ఒక నిర్మాణకుని, సృష్టికర్తను నిశ్చయంగా కల్గియుండి ఉండవచ్చును.

15. మెదడును గూర్చి యితరులేమని వ్యాఖ్యానించారు?

15 మానవ మెదడు అత్యాధునికమైన కంప్యూటర్లను సహితం పురాతనమైనవిగా జేస్తున్నది. విజ్ఞానశాస్త్ర రచయిత మోర్టన్‌ హంట్‌ యిలా అన్నాడు: “మన చురుకైన జ్ఞాపకశక్తులు అతిపెద్ద సమకాలిక పరిశోధనా కంప్యూటరు నిలువచేయగల్గేంత సమాచారంకన్నా కొన్ని కోట్ల రెట్లు నిలువచేయ గలవు.” అందుకే, మెదడు శాస్త్రచికిత్సా నిపుణుడు డా. రాబర్ట్‌ జె. వైట్‌ యిలా అన్నాడు: “మానవుని అవగాహనా శక్తికతీతమైనదేమంటే మెదడు మనస్సుకుగల సంబంధమును నమ్మశక్యముకాని రీతిగా నిర్మించి దాని విస్తరణకు బాధ్యుడైన అత్యున్నత తెలివితేటలుగలవాడు ఉన్నాడని ఒప్పుకొనుట తప్ప నాకు వేరే గత్యంతరం లేదు . . . దీనకంతటికి ఒక బుద్ధికుశలతగల ప్రారంభమున్నదని, దానిని ఎవరోఒకరు సంభవింపజేశారని నేను నమ్మవలసిందే.” దాని యెడల శ్రద్ధవహించిన వాడుకూడా ఉండియుండాలి.

అసమాన్యమైన రక్త విధానం

16-18. (ఎ) రక్తవిధానం ఏయే విధాలుగా సాటిలేనిదై యున్నది? (బి) మనమే ముగింపుకు రావాలి?

16 పోషకపదార్థాలను, ప్రాణవాయువును సరఫరా చేసి అంటు రోగాలనుండి కాపాడే అసమాన్య రక్తవిధానాన్ని గూర్చి కూడ తలంచండి. ఈ విధానంలో ప్రధాన భాగమైన ఎర్ర రక్తకణాలను గూర్చి ఏబిసీస్‌ ఆఫ్‌ ది హూమన్‌ బాడీ అనే పుస్తకమిట్లంటున్నది: “ఒక్క రక్తపుచుక్క 25 కోట్లకంటె ఎక్కువ వేర్వేరు రక్తకణాలను కల్గియుంటుంది . . . అట్టివాటిని శరీరం బహుశ 25 లక్షల కోట్లు కలిగి యుంటుంది, ఒకవేళ వాటిని వెదజల్లితే నాలుగు టెన్నీస్‌ కోర్టులను ఆవరించడానికి సరిపోతాయి. . . . ప్రతి సెకనుకు 30 లక్షల క్రొత్తకణాలచొప్పున భర్తీ చేయబడుతుంటాయి.”

17 రక్తవిధానంలో మరొక అసమాన్య భాగమైన తెల్లరక్త కణాలను గూర్చి అదేపుస్తకము మనకిలా తెల్పుచున్నది: “ఎర్ర రక్తకణాలు ఒకేరకమైనవై యుండగా, తెల్లరక్తకణాలు విభిన్న రీతులలో ఉంటాయి, ప్రతిఒక్క రకము శరీరమందలి పోరాటములలో వివిధ రీతులుగా పోరాడుతూవుంటాయి. దృష్టాంతానికి, వాటిలో ఒక రకం మృతకణాలను నాశనం చేస్తాయి. ఇతర రకాలు అంటురోగాలను ఎదిరించి ప్రతిరక్షకాలై, పరమూలకాలను నిర్వీర్యం చేస్తాయి లేదా బాక్టీరియాను తిని జీర్ణించుకుంటాయి.”

18 ఎంతటి విస్మయం గొలుపు అత్యున్నత సంస్థీకరణ! అంత చక్కగా అమర్చబడి, నిశితంగా కాపాడబడుచున్న దేనికైనా ఒక వివేకవంతుడైన, శ్రద్ధగల వ్యవస్థాపకుడు—దేవుడు ఉండి తీరాల్సిందే.

ఇతర అద్భుతాలు

19. మానవనిర్మిత ఉపకరణములతో పోలిస్తే కన్ను ఏవిధంగా ఉన్నది?

19 మానవ శరీరంలో యితర అనేక అద్భుతాలున్నవి. ఒకటేమంటే కన్ను. అది ఏ కెమేరా కూడా అనుకరించజాలనంత అద్భుతంగా నిర్మించబడింది. రోదసి యాత్రికుడు రాబర్ట్‌ జాస్త్రో యిలా అన్నాడు: “కన్ను రూపింపబడినట్టుగానే కన్పిస్తున్నది; టెలిస్కోపు నిర్మాణకుడెవ్వరూ అంతకన్నా మెరుగైన దానిని చేయజాలడు.” పాపులర్‌ ఫోటోగ్రఫీ అనే సాహిత్యం యిలా వివరిస్తున్నది: “మానవ నేత్రాలు ఒక ఫిల్మ్‌ చూచేదానికన్నా సవిస్తరమైన గొప్ప పరిధిని చూస్తాయి. అవి మూడు దృక్కోణాలలో మహాగొప్ప విస్తృత పరిధిలో, రూపమును చెరపక, తదేకంగా చూస్తుంటాయి . . . కెమేరాను మానవ నేత్రంతో పోల్చుట మంచి సారూప్యంకాదు. మానవ నేత్రం కృత్రిమ తెలివి తేటలతో, సమాచార ముద్రిత సామర్థ్యాలతో, వేగంతో, మానవ నిర్మిత ఏ కంప్యూటర్‌ లేదా కెమేరా నిర్వహించ జాలనంతటి పద్ధతులను కల్గిన అసాధారణ, అత్యాధునిక, మహాద్భుతమైన సూపర్‌కంప్యూటర్‌.”

20. మానవ శరీరమును గూర్చిన మరికొన్ని ఆశ్చర్యకారణములేవి?

20 శరీర అవయవాలన్నీ మన ప్రయత్నమేమి లేకుండా సహకరించడాన్ని కూడ ఆలోచించండి. ఉదాహరణకు, మనము మన కడుపులోనికి వివిధ రకాలైన ఆహారాన్ని, పానీయాన్ని పంపిస్తుంటాము. అయినా శరీరం వాటిని జీర్ణింపజేసుకొని శక్తినుత్పత్తి చేస్తుంది. వాహనపు ఆయిల్‌ట్యాంక్‌లో అలాంటి మిశ్రమంవేసి అదెంత వరకు వెళ్తుందో చూడండి! పిమ్మట, కేవలం తొమ్మిది నెలలలో—తలిదండ్రుల ప్రతిరూపమైన—ముద్దులొలికే శిశువును పుట్టించే జననాద్భుతం ఉంది. ఓ శిశువు కొన్ని సంవత్సరాల ప్రాయంలోనే వివిధ భాషల్లో ఎలా మాట్లాడాలో నేర్చుకునే సామర్థ్యం మాటేమిటి?

21. శరీర ఆశ్చర్యాలను గూర్చి పరిశీలించేటప్పుడు సహేతుకమైన వ్యక్తి ఏమంటాడు?

21 అవును, మానవ శరీరమందలి అనేక ఆశ్చర్యకరమగు, సంక్లిష్ట సృష్టము మనలో సంభ్రమాశ్చర్యమును నింపుచున్నవి. ఏ యింజనీరు కూడ వాటిని నకలు చేయలేడు. అవన్నీ కేవలం గ్రుడ్డి ఆకస్మిక సంభవ కార్యములేనా? నిశ్చయంగా కాదు. బదులుగా, మానవ శరీరం ఆశ్చర్యస్థితిగతులను పరిశీలించునపుడు సహేతుకమైన వ్యక్తి కీర్తనల రచయిత వలెచెప్పును: “[దేవా] నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ కార్యములు ఆశ్చర్యకరములు.”—కీర్తన 139:14.

సర్వోత్కృష్టమైన నిర్మాణకుడు

22, 23. (ఎ) సృష్టికర్త ఉనికిని మనమెందుకు అంగీకరించాలి? (బి) దేవుని గూర్చి బైబిలు సహేతుకంగా ఏమంటున్నది?

22 బైబిలు యిట్లంటున్నది: “ప్రతి యిల్లు ఎవరో ఒకని చేత నిర్మించబడును; అయితే ఉనికిలోనున్న సమస్తాన్ని దేవుడే నిర్మించాడు.” (హెబ్రీయులకు 3:4 ది జెరూసలేమ్‌ బైబిల్‌) కావున ఏ గృహానికైనా, అది ఎంత సామన్యమైనదైనా, దానికొక నిర్మాణకుడు కావలిసివస్తే, భూమి మీదనున్న వివిధరకాల జీవరాసులతోపాటు మరెంతో సంక్లిష్టమైన విశ్వానికి కూడ ఒక నిర్మాణకుడు ఉండి తీరాలి. విమానములు, దూరదర్శిని, కంప్యూటరు వంటి పరికరములను కనిపెట్టిన మానవుని ఉనికిని మనం అంగీకరిస్తున్నందున, అట్టి వాటిని తయారు చేయుటకు మానవులకు మెదడునిచ్చిన వాని ఉనికిని కూడ మనం అంగీకరించవలదా?

23 బైబిలు అలాచేస్తూ, ఆయనను యిలా పిలుస్తున్నది: “ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దానిమీదనున్న జనులకు ప్రాణమును, . . . ఇచ్చుచున్న దేవుడైన యెహోవా.” (యెషయా 42:5) బైబిలు సహేతుకంగా యిట్లంటున్నది: “ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృజింతివి; నీ చిత్తమును బట్టి అవియుండెను, దానిని బట్టియే సృజింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవు.”—ప్రకటన 4:11.

24. దేవుడున్నాడని మనమెలా తెలుసుకోగలం?

24 అవును, ఆయన సృజించిన కార్యములను బట్టి దేవుడు ఉన్నాడని మనం తెలుసుకోగలం. “ఆయన [దేవుడు] అదృశ్య లక్షణములు . . . జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడును.”—రోమీయులు 1:20.

25, 26. ఏదైనా దుర్వినియోగ పర్చబడితే దాని నిర్మాణకుడు లేడని ఎందుకు చెప్పజాలము?

25 చేయబడిన వస్తువు దేనినైనా దుర్వినియోగంచేస్తే దానిని రూపించిన వాడు లేడని దాని భావంకాదు. ఒక విమానాన్ని ప్రయాణీకులను చేరవేయుటవంటి శాంతియుత సంకల్పాలకు ఉపయోగించవచ్చును. అయితే బాంబుదాడి వంటి నాశనకరమైన దానిగా కూడా దానిని వాడవచ్చును. చావులకు కారణమైన రీతిగా అది వాడబడినందున దానిని నిర్మించినవాడు లేడని దాని భావంకాదు.

26 ఆలాగే, మానవులు తరచు చెడ్డవారిగా మారినంత మాత్రమున వారి నిర్మాణకుడైన దేవుడు లేడని దాని భావంకాదు. కావున బైబిలు సరిగానే యిట్లంటున్నది: “అయ్యో! మీరెంత మూర్ఖులు? కుమ్మరికి మంటికిని భేదములేదని యెంచదగునా? చేసిన వస్తువు దాని చేసినవాని గూర్చి: ‘ఇతడు నన్ను చేయలేదనవచ్చునా’? రూపింపబడిన వస్తువు రూపించబడిన వాని గూర్చి: ‘ఇతనికి బుద్ధిలేదన వచ్చునా’?”—యెషయా 29:16.

27. బాధనుగూర్చిన మన ప్రశ్నలకు దేవుడు సమాధానమిచ్చునని మనమెందుకు అపేక్షించగలం?

27 సృష్టికర్త తాను చేసిన ఆశ్చర్యకరమైన పెక్కు కార్యముల కలయిక ద్వారా తన జ్ఞానాన్ని ప్రదర్శించాడు. జీవించుటకు తగిన రీతిలో ఈ భూమిని తయారు చేసి మన శరీరములను మనస్సులను అద్భుతరీతిలో సృజించి, మన మనుభవించుటకు అనేక మంచి కార్యములు చేసినందున ఆయన మన విషయమై నిజంగా శ్రద్ధకలిగియున్నాడని చూపాడు. దేవుడెందుకు బాధను అనుమతించాడు? ఆయన దాని విషయమై ఏమి చేస్తాడు? అనే ప్రశ్నలకు సమాధానములను ఇచ్చుట ద్వారా ఆయన అట్టి జ్ఞానాన్ని శ్రద్ధను నిశ్చయంగా చూపించును.

[అధ్యయన ప్రశ్నలు]

[5 వ పేజీలోని చిత్రాలు]

సంరక్షించే వాతావరణం గల్గిన భూమి, శ్రద్ధగల దేవునిచే మనకొరకు రూపించబడిన సాటిలేని గృహం

[6 వ పేజీలోని చిత్రాలు]

మనం జీవాన్ని అనుభవించగల్గే విధంగా ప్రేమపూర్వక శ్రద్ధతో భూమి తయారు చేయబడింది

[7 వ పేజీలోని చిత్రాలు]

‘ఒక మెదడులో భూమి మీదనున్న యావత్‌ సమాచార నెట్‌వర్క్‌కున్న వాటికంటె ఎక్కువ కనెక్షన్లు ఉన్నాయి.’—అణుజీవ శాస్త్రజ్ఞుడు

[8 వ పేజీలోని చిత్రాలు]

“కన్ను రూపింపబడినట్టుగానే కన్పిస్తున్నది; టెలిస్కోపు నిర్మాణకుడెవరూ అంతకాన్నా మెరుగైన దానిని చేయజాలరు.”—రోదసియాత్రికుడు