దేవుడు బాధనెందుకు అనుమతించెను
భాగం 6
దేవుడు బాధనెందుకు అనుమతించెను
1, 2. మన ఆది తలిదండ్రులు దేవుడు తమకిచ్చిన మంచి ప్రారంభాన్ని ఎలా పాడుచేశారు?
ఏ తప్పిదం జరిగింది? ఏదెనులోని పరదైసునందు మన ఆది తలిదండ్రులకు దేవుడనుగ్రహించిన శ్రేష్ఠమైన ప్రారంభాన్ని పాడుచేసిన సంఘటన ఏమిటి? పరదైసునందుండాల్సిన శాంతి, ఐక్యతలకు బదులుగా వేల సంవత్సరాలనుండి ఎందుకు దుష్టత్వం, బాధ నిలయమై యున్నవి?
2 కారణమేమంటే ఆదాము హవ్వలు తమ స్వేచ్ఛా చిత్తాన్ని దుర్వినియోగపర్చారు. దేవుని నుండి ఆయన శాసనాలనుండి వైదొలగి ప్రగతి సాధించుటకు తాము సృజించబడ లేదన్న వాస్తవాన్ని వారు విస్మరించారు. దేవుని నుండి స్వతంత్రులై యుండుటకు వారు నిశ్చయించుకున్నారు, అది వారి జీవితాలను మెరుగు పర్చునని తలంచారు. కావున వారు దైవ నిర్దేశిత స్వేచ్ఛాచిత్త హద్దులను మీరారు.—ఆదికాండము 3 వ అధ్యాయం.
విశ్వ సర్వాధిపత్య వివాదము
3-5. దేవుడు ఆదాము హవ్వను అప్పుడే నాశనం చేసి మరో సృష్టిని ఎందుకు చేయలేదు?
3 దేవుడు ఆదాముహవ్వలను నిర్మూలము చేసి మరల వేరొకమానవ జంటతో ఎందుకు ప్రారంభము చేయలేదు? ఎందుకంటే ఆయన విశ్వాధిపత్యము, అనగా పరాధీనము చేయదగని తనపాలనాహక్కు సవాలు చేయబడింది.
4 ప్రశ్నేమంటే, పాలించే హక్కు ఎవరికున్నది, ఎవరి పాలన సరియైనది? దేవుడు సమస్త ప్రాణులకు సృష్టికర్తయై, సర్వోన్నతుడైనందున వారిని పాలించే హక్కు ఆయనకున్నది. ఆయన సర్వజ్ఞానియైనందున, ఆయన పాలన సమస్త ప్రాణులకు శ్రేష్ఠమైనది. అయితే, దేవుని పాలన సవాలు చేయబడింది. ఆలాగే, తన సృష్టియైన మానవునిలో ఏదైన లోపముండెనా? మానవ యథార్థత అనే ప్రశ్న ఎలా ఇందులో యిమిడియుందో మనము తరువాత పరిశీలిస్తాం.
5 మానవుడు దేవుని నుండి వేరైనందున, మరో ప్రశ్న తలెత్తింది. దేవుని పాలనలేకుండా ఉంటే మానవులు బాగుగా జీవించగలరా? సృష్టికర్తకు దాని సమాధానము నిశ్చయంగా తెలుసు. కాని మానవులు సరియైన మార్గాన్ని, నిశ్చయంగా కనుగొనుటకు వారు కోరుకొనిన పూర్ణస్వాతంత్ర్యమును వారికిచ్చుటే. వారు స్వేచ్ఛాచిత్తముతో ఆ మార్గాన్ని ఎన్నుకొన్నారు, కావున దేవుడు దానిని అనుమతించాడు.
6, 7. దేవుడు మానవులకు పూర్తి స్వాతంత్ర్యాన్ని ఇంతకాలమెందుకు అనుమతించాడు?
6 మానవులు సంపూర్ణస్వేచ్ఛతో అనుభవపూర్వకంగా తెలుసుకొనేందుకు తగినంత సమయాన్ని అనుమతించుట ద్వారా, వారు దేవునిపాలనా లేక స్వయంపాలన క్రింద క్షేమంగా ఉండగలరా అనే విషయాన్ని దేవుడు శాశ్వతంగా పరిష్కరించును. అలా అనుమతించబడిన సమయం, మానవులు తమ రాజకీయ, పారిశ్రామిక, విజ్ఞానశాస్త్ర మరియు వైద్యరంగ కార్యసాధనలలో తారాస్థాయికి తాముచేరామని అనుకునే స్థితికి వచ్చునంతటి సమయమై ఉండాలి.
7 కావున తననుండి వేరైన మానవుని పాలన విజయవంతమగునా లేదా అనే సంశయమేమి లేకుండునట్లు నేటివరకు దేవుడు మానవునికి స్వేచ్ఛాపాలనను అనుమతించాడు. ఆ విధంగా, మానవుడు దయ మరియు క్రూరత్వము, ప్రేమ మరియు ద్వేషం, నీతి మరియు అవినీతి అనేవాటిమధ్య ఎంపిక చేసుకోగల్గాడు. అయితే తన ఎంపిక వలన కల్గిన పర్యవసానములను అనగా మంచితనము, సమాధానము లేదా దుష్టత్వము, బాధ అనేవాటినికూడ అతడు అనుభవించాల్సి వచ్చింది.
ఆత్మీయ ప్రాణుల తిరుగుబాటు
8, 9. (ఎ) ఆత్మీయ సామ్రాజ్యమందు తిరుగుబాటు ఎలా జరిగింది? (బి) ఆదాము హవ్వలనే కాక మరింకెవరిని కూడ తిరుగుబాటు చేయడానికి సాతాను పురికొల్పాడు?
8 పరిశీలించవలసిన మరో విషయం ఉంది. దేవుని పాలనకు ఎదురు తిరిగింది మన ఆది తలిదండ్రులు మాత్రమే కాదు. మరి ఆ కాలంలో యింకెవ్వరున్నారు? ఆత్మీయ ప్రాణులున్నారు. దేవుడు మానవులను సృజించక మునుపు, పరలోకమందు ఉన్నతప్రాణులైన అనేక మంది దేవదూతలను ఆయన సృజించెను. వారుకూడ స్వేచ్ఛాచిత్తముతో, దేవుని పాలనకు విధేయులైయుండాల్సిన ఆవశ్యకతతో సృజించబడ్డారు.—యోబు 38:7; కీర్తన 104:4; ప్రకటన 5:11.
9 ఆత్మీయ సామ్రాజ్యమందు మొదటిగా తిరుగుబాటు సంభవించెనని బైబిలు చూపుచున్నది. ఒక ఆత్మీయ ప్రాణి పూర్తి స్వేచ్ఛను కోరాడు. మానవులు తనను ఆరాధించవలెనని కూడ అతడు కోరాడు. (మత్తయి 4:8, 9) ఈ ఆత్మీయ తిరుగుబాటుదారుడు ఆదాము హవ్వలతో వారికి మేలైన దానిని దేవుడు దాచిపెడుతున్నాడని అభాండము వేసి వారు తిరుగుబాటు చేయుటకు ప్రోత్సహించాడు. (ఆదికాండము 3:1-5) కావున అతడు అపవాది (కొండెములాడువాడు) అనియు సాతాను (ఎదిరించువాడు) అనియు పిలువబడ్డాడు. పిదప అతడు యితర ఆత్మీయ ప్రాణులను తిరుగుబాటు చేయునట్లు వారిని ప్రేరేపించాడు. వారు దయ్యాలని పిలువబడ్డారు.—ద్వితీయోపదేశకాండము 32:17; ప్రకటన 12:9; 16:14.
10. మానవులు, ఆత్మీయ ప్రాణులు తిరుగుబాటు చేసినందున ఏమి జరిగింది?
10 మానవులు, దేవునిపై తిరుగుబాటు చేయుట మూలంగా, సాతాను అతని దయ్యాల ప్రభావం క్రిందికి వచ్చారు. అందుకే బైబిలు సాతానును, “అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసిన” “ఈ యుగ సంబంధమైన దేవత” అని పిలిచింది. యేసు కూడ సాతానును “ఈ లోకాధికారి” అని పిలిచాడు.—2 కొరింథీయులు 4:4; 1 యోహాను 5:19; యోహాను 12:31.
రెండు వివాదాంశాలు
11. మరి ఏయితర వివాదామును గూర్చి సాతాను దేవున్ని సవాలు చేశాడు?
11 దేవున్ని సవాలు చేసిన మరో వివాదాన్ని సాతాను లేవదీశాడు. దేవుడు మానవులను సృజించిన విధానములో లోపమున్నదని, వారిపై వత్తిడితెస్తే సరియైన దానిని చేయడానికి ఎవ్వరూ యిష్టపడరని అతడన్నాడు. (యోబు 2:1-5) ఈ విధంగా సాతాను మానవుల యథార్థతను సంశయించాడు.
12-14. సాతాను లేవనెత్తిన రెండు వివాదాంశములను గూర్చిన సత్యాన్ని కాలం ఎలా బయలుపరుస్తుంది?
12 అందుచేత, ఈ వివాదాంశముతోపాటు దేవుని సర్వోన్నత అధికారమును గూర్చిన వివాదాంశము కూడ ఎలా పరిష్కరించ బడనైయుండెనో వివేకవంతులైన ప్రాణులందరూ తెలుసుకొనేందుకు తగినంత సమయాన్ని దేవుడు అనుమతించాడు. (నిర్గమకాండము 9:16 పోల్చండి.) మానవుని చరిత్రానుభవం ఈ రెండు వివాదాంశముల సత్యాన్ని బయల్పరస్తుంది.
13 మొట్టమొదటిగా, దేవుని విశ్వాధిపత్యమును, పరిపాలనా హక్కును గూర్చి అనుమతించబడిన కాలము ఏమి తెలియపరుస్తుంది? దేవునికంటె మానవులే తమ్మును తాము బాగుగా పాలన చేసుకొనగలరా? దేవునినుండి వైదొలగిన మానవ పాలనా విధానమేదైనా యుద్ధం, నేరం, అన్యాయము నుండి స్వేచ్ఛననుగ్రహించి సంతోషదాయక లోకమును తేగలదా? వాటిలో ఏదైనా పేదరికాన్ని నిర్మూలించి అందరికి సౌభాగ్యాన్ని అందించగలదా? వాటిలో ఏదైనా రోగాన్ని వృద్ధాప్యాన్ని జయించగలదా? వాటన్నింటిని నెరవేర్చుటకు దేవుని పాలన రూపించబడింది.—ఆదికాండము 1:26-31.
14 రెండవ వివాదాంశము విషయములో, మానవుల సత్తాను గూర్చి ఆ సమయం ఏమి బయల్పరస్తుంది? దేవుడు మానవులను సృజించి పొరపాటు చేశాడా? పరీక్షించబడితే వారిలో ఎవరైనా సరియైన దానిని చేయగలరా? స్వతంత్రంగా ఉండే మానవ పాలనకు బదులు తమకు దేవుని పాలనే కావాలని ఎవరైనా చూపగలరా?
[అధ్యయన ప్రశ్నలు]
[13 వ పేజీలోని చిత్రం]
మానవులు తమ కార్య సాధనలలో తారాస్థాయికి చేరునంత సమయాన్ని దేవుడు అనుమతించాడు
[చిత్రసౌజన్యం]
Shuttle: Based on NASA photo