కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అపవాది ఎవరు?

అపవాది ఎవరు?

పాఠం 4

అపవాది ఎవరు?

అపవాదియగు సాతాను—అతడు ఎక్కడి నుండి వచ్చాడు? (1, 2)

సాతాను ప్రజలను ఎలా తప్పుదోవ పట్టిస్తున్నాడు? (3–7)

మీరెందుకు అపవాదిని ఎదిరించాలి? (7)

1. “అపవాది” అనే పదానికి, మరో వ్యక్తి గురించి పచ్చి అబద్ధాలు చెప్పేవాడని భావం. “సాతాను” అంటే శత్రువు లేక ఎదిరించువాడు అని అర్థం. ఇవి దేవుని ప్రధాన శత్రువుకు ఇవ్వబడిన పదాలు. మొదట్లో, అతడు పరిపూర్ణ దేవదూతగా ఉండి, దేవునితోపాటు పరలోకంలో ఉండేవాడు. అయితే, ఆ తర్వాత అతడు తన గురించి తానెక్కువగా తలంచుకొని, న్యాయంగా దేవునికే చెందవలసిన ఆరాధన తనకు కావాలని కోరుకున్నాడు.—మత్తయి 4:8-10.

2. ఈ దేవదూత, అంటే సాతాను ఒక పాము ద్వారా హవ్వతో మాట్లాడాడు. అతడు ఆమెకు అబద్ధాలు చెప్పడం ద్వారా ఆమె దేవునికి అవిధేయురాలయ్యేలా చేశాడు. అలా, దేవుని “సర్వోన్నతాధిపత్యాన్ని” లేక మహోన్నతునిగా ఆయన స్థానాన్ని సాతాను ధిక్కరించాడు. దేవుడు తగిన రీతిగాను తన ప్రజలకు ప్రయోజనకరంగాను పరిపాలిస్తాడా లేదా అని సాతాను ప్రశ్నించాడు. ఏ మానవుడైనా దేవుని ఎడల యథార్థంగా ఉండగలడా అనే సందేహాలను కూడా సాతాను వ్యక్తం చేశాడు. ఇలా చేయడం ద్వారా, సాతాను తనను తాను దేవునికి శత్రువుగా చేసుకున్నాడు. అందుకే అతడు అపవాదియగు సాతాను అని పిలువబడ్డాడు.—ఆదికాండము 3:1-5; యోబు 1:8-11; ప్రకటన 12:9.

3. తనను ఆరాధించేలా ప్రజలను మోసగించడానికి సాతాను ప్రయత్నిస్తున్నాడు. (2 కొరింథీయులు 11:3, 14) అతడు ప్రజలను తప్పుదోవ పట్టించే ఒక మార్గం, అబద్ధ మతం. ఒకవేళ ఒక మతం దేవుని గురించి అబద్ధాలు బోధిస్తే, అది తప్పకుండా సాతాను సంకల్పాన్ని నెరవేరుస్తుంది. (యోహాను 8:44) అబద్ధమతాల సభ్యులుగావున్న ప్రజలు తాము సత్యదేవున్నే ఆరాధిస్తున్నామని యథార్థంగా నమ్ముతుండవచ్చు. కాని నిజానికి వారు సాతాను సేవ చేస్తున్నారు. అతడు ‘ఈ ప్రపంచానికి దేవుడు.’—2 కొరింథీయులు 4:4.

4. సాతాను ప్రజలను తన అధికారం క్రిందకు తెచ్చుకొనే మరో మార్గం అభిచారం. తమను కాపాడడానికి, ఇతరులకు హాని చేయడానికి, భవిష్యత్తును చెప్పడానికి, లేక అద్భుతాలు చేయడానికి వాళ్లు దయ్యాలను పిలవవచ్చు. ఈ క్రియలన్నిటి వెనుకనున్న దుష్టశక్తి సాతానే. దేవున్ని ప్రీతిపర్చాలంటే, మనకు అభిచారంతో ఏ సంబంధమూ ఉండకూడదు.—ద్వితీయోపదేశకాండము 18:10-12; అపొస్తలుల కార్యములు 19:18, 19.

5. విపరీతమైన జాత్యహంకారం మరియు రాజకీయ సంస్థల ఆరాధన వంటివాటి ద్వారా కూడా సాతాను ప్రజలను తప్పుదోవ పట్టిస్తాడు. తమ దేశం లేక జాతి ఇతరుల వాటికంటే శ్రేష్ఠమైనదని కొందరు భావిస్తారు. కాని ఇది నిజంకాదు. (అపొస్తలుల కార్యములు 10:34, 35) మానవ సమస్యలను రాజకీయ సంస్థలు పరిష్కరించాలని మరితరులు ఆశిస్తారు. ఇలా చేయడం ద్వారా, వారు దేవుని రాజ్యాన్ని నిరాకరిస్తున్నారు. మన సమస్యలకు ఏకైక పరిష్కారం అదే.—దానియేలు 2:44.

6. సాతాను ప్రజలను తప్పుదోవ పట్టించే మరో మార్గం ఏమిటంటే, పాపపు కోరికలతో వారిని శోధించడం. పాపపు అలవాట్లను విడనాడాలని యెహోవా మనకు చెబుతున్నాడు, ఎందుకంటే అవి మనకు హానికరమైనవని ఆయనకు తెలుసు. (గలతీయులు 6:7, 8) అలాంటి క్రియలలో మీరు తమతో కలవాలని కొంతమంది ప్రజలు ఇష్టపడతారు. అయితే, మీరు ఈ పనులు చేయాలని నిజంగా కోరుకుంటున్నది సాతానేనని మరచిపోకండి.—1 కొరింథీయులు 6:9, 10; 15:33.

7. మీరు యెహోవాను విడిచిపెట్టేలా చేయడానికి సాతాను హింసను లేక వ్యతిరేకతను ఉపయోగించవచ్చు. మీరు బైబిలు పఠిస్తున్నందువల్ల మీకు ప్రియమైనవారు కొందరు ఎంతో కోపపడవచ్చు. ఇతరులు మిమ్మల్ని వెక్కిరించవచ్చు. కాని మీరు ఎవరికి మీ జీవితాన్ని రుణపడి ఉన్నారు? మీరు యెహోవా గురించి నేర్చుకోవడాన్ని నిలిపివేసేలా మిమ్మల్ని భయపెట్టాలని సాతాను కోరుకుంటున్నాడు. సాతాను విజయం సాధించే అవకాశమివ్వకండి! (మత్తయి 10:34-39; 1 పేతురు 5:8, 9) అపవాదిని ఎదిరించడం ద్వారా, మీరు యెహోవాను సంతోషపర్చి, ఆయన సర్వోన్నతాధిపత్యాన్ని ఉన్నతపరుస్తున్నారని చూపించగలరు.—సామెతలు 27:11.

[9వ పేజీలోని చిత్రం]

అబద్ధ మతం, అభిచారం, జాతీయతాభావం ప్రజలను తప్పుదోవ పట్టిస్తాయి

[9వ పేజీలోని చిత్రం]

యెహోవా గురించి నేర్చుకోవడంలో కొనసాగడం ద్వారా సాతానును ఎదిరించండి