దేవుడెవరు?
పాఠం 2
దేవుడెవరు?
సత్యదేవుడెవరు, ఆయన పేరేమిటి? (1, 2)
ఆయనకు ఎలాంటి శరీరం ఉంది? (3)
ఆయన విశేష లక్షణాలేవి? (4)
మనం ఆయనకు చేసే ఆరాధనలో విగ్రహాలను, చిహ్నాలను ఉపయోగించాలా? (5)
దేవుని గురించి మనం నేర్చుకోగల రెండు మార్గాలేవి? (6)
1. ప్రజలు అనేకమైన వాటిని ఆరాధిస్తారు. కాని కేవలం ఒకే సత్యదేవుడున్నాడని బైబిలు మనకు చెబుతుంది. ఆయన పరలోకంలోను, భూమిపైనా ఉన్న సమస్తాన్ని సృష్టించాడు. ఆయన మనకు జీవాన్నిచ్చాడు గనుక, మనం ఆయనను మాత్రమే ఆరాధించాలి.—1 కొరింథీయులు 8:5, 6; ప్రకటన 4:11.
2. దేవునికి అనేక బిరుదులున్నాయిగాని కేవలం ఒకే పేరు ఉంది. ఆ పేరు యెహోవా. అనేక బైబిళ్లలో నుండి దేవుని పేరు తీసివేయబడి, దాని స్థానంలో ప్రభువు లేక దేవుడు అనే బిరుదులు ఉపయోగించబడ్డాయి. కాని బైబిలు వ్రాయబడినప్పుడు దానిలో యెహోవా అనే పేరు దాదాపు 7,000 సార్లు ఉంది!—నిర్గమకాండము 3:15; కీర్తన 83:18.
3. యెహోవాకు ఒక శరీరం ఉంది, కాని అది మనకున్నటువంటిది కాదు. “దేవుడు ఆత్మ” అని బైబిలు చెబుతుంది. (యోహాను 4:24) ఆత్మ అంటే మనకంటే ఎంతో ఉన్నత విధమైన జీవం గలది. ఏ మానవుడూ ఎన్నడూ దేవున్ని చూడలేదు. యెహోవా పరలోకంలో నివసిస్తాడు, కాని ఆయన అన్నీ చూడగలడు. (కీర్తన 11:4, 5; యోహాను 1:18) అయితే, పరిశుద్ధాత్మ అంటే ఏమిటి? అది దేవునిలా ఒక వ్యక్తికాదు. బదులుగా, అది దేవుని చురుకైన శక్తి.—కీర్తన 104:30.
4. బైబిలు మనకు యెహోవా వ్యక్తిత్వం గురించి తెల్పుతుంది. ప్రేమ, న్యాయము, జ్ఞానము, శక్తి ఆయన విశేషమైన లక్షణాలని అది చూపిస్తుంది. (ద్వితీయోపదేశకాండము 32:4; యోబు 12:13; యెషయా 40:26; 1 యోహాను 4:8) ఆయన దయ, కనికరం, క్షమ, ఉదారత మరియు సహనం గలవాడని కూడా బైబిలు మనకు తెలియజేస్తుంది. విధేయులైన పిల్లలవలె మనం ఆయనను అనుకరించడానికి ప్రయత్నించాలి.—ఎఫెసీయులు 5:1, 2.
5. మనం మన ఆరాధనలో విగ్రహాలకు, బొమ్మలకు, లేక చిహ్నాలకు మ్రొక్కడం లేక ప్రార్థించడం చేయాలా? అలా చేయకూడదు! (నిర్గమకాండము 20:4, 5) మనం ఆయనను మాత్రమే ఆరాధించాలని యెహోవా చెబుతున్నాడు. ఆయన తన మహిమను మరెవరితోనూ, మరిదేనితోను పంచుకోడు. మనకు సహాయం చేసే శక్తి విగ్రహాలకు లేదు.—కీర్తన 115:4-8; యెషయా 42:8.
6. మనం దేవున్ని ఇంకా బాగా ఎలా తెలుసుకోగలం? దీనికి ఒక మార్గం ఏమిటంటే ఆయన సృష్టించిన వాటిని గమనించి, అవి మనకు ఏమి చెబుతున్నాయనేదాని గురించి లోతుగా ఆలోచించడమే. దేవునికి గొప్ప శక్తి, జ్ఞానము ఉన్నాయని ఆయన చేసిన సృష్టి మనకు కనబరుస్తుంది. ఆయన చేసినవాటన్నిటిలో ఆయన ప్రేమను మనం చూస్తాము. (కీర్తన 19:1-6; రోమీయులు 1:20) మనం దేవుని గురించి తెలుసుకోగల మరో మార్గం ఏమిటంటే, బైబిలు పఠించడం. ఆయన దానిలో తాను ఎలాంటి దేవుడై ఉన్నాడనేదాని గురించి ఎక్కువగా తెలియజేస్తాడు. తన సంకల్పం గురించి, మనం ఏమి చేయాలని తాను కోరుతున్నాడనేదాని గురించి కూడా ఆయన మనకు చెబుతాడు.—ఆమోసు 3:7; 2 తిమోతి 3:16, 17.
[5వ పేజీలోని చిత్రం]
మనం సృష్టి నుండి మరియు బైబిలు నుండి దేవుని గురించి నేర్చుకుంటాము