కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని ప్రీతిపర్చే కుటుంబ జీవితం

దేవుని ప్రీతిపర్చే కుటుంబ జీవితం

పాఠం 8

దేవుని ప్రీతిపర్చే కుటుంబ జీవితం

కుటుంబంలో భర్త స్థానం ఏమిటి? (1)

భర్త తన భార్యతో ఎలా వ్యవహరించాలి? (2)

తండ్రికి ఏ బాధ్యతలున్నాయి? (3)

కుటుంబంలో భార్య స్థానం ఏమిటి? (4)

తలిదండ్రుల నుండి, పిల్లల నుండి దేవుడు ఏమి కోరుతున్నాడు? (5)

విడిపోవడం మరియు విడాకుల విషయంలో బైబిలు ఉద్దేశం ఏమిటి? (6, 7)

1. భర్త తన కుటుంబానికి శిరస్సని బైబిలు చెబుతుంది. (1 కొరింథీయులు 11:3) ఒక భర్తకు ఒకే భార్య ఉండాలి. వారు చట్టప్రకారం తగినవిధంగా వివాహితులై ఉండాలి.—1 తిమోతి 3:2; తీతు 3:1.

2. భర్త తనను తాను ప్రేమించుకుంటున్నట్లే తన భార్యను ప్రేమించాలి. యేసు తన శిష్యులతో వ్యవహరిస్తున్నట్లు అతడు ఆమెతో వ్యవహరించాలి. (ఎఫెసీయులు 5:25, 28, 29) భర్త ఎన్నడూ తన భార్యను కొట్టకూడదు లేక ఆమెను ఏవిధంగానూ వేధించకూడదు. బదులుగా, అతడామెను ఘనపర్చి, గౌరవించాలి.—కొలొస్సయులు 3:19; 1 పేతురు 3:7.

3. తండ్రి తన కుటుంబ సంరక్షణ కొరకు కష్టపడి పనిచేయాలి. అతడు తన భార్యా పిల్లల కొరకు ఆహారాన్ని, వస్త్రాలను, వసతిని ఏర్పాటు చేయాలి. తండ్రి తన కుటుంబ ఆత్మీయ అవసరతలను కూడా తీర్చాలి. (1 తిమోతి 5:8) దేవుని గురించి, ఆయన సంకల్పాల గురించి నేర్చుకొనేందుకు తన కుటుంబానికి సహాయం చేయడంలో అతడు నాయకత్వం వహిస్తాడు.—ద్వితీయోపదేశకాండము 6:4-9; ఎఫెసీయులు 6:4.

4. భార్య తన భర్తకు మంచి సహాయకారిగా ఉండాలి. (ఆదికాండము 2:18) తమ పిల్లలకు బోధించడంలోనూ తర్ఫీదునివ్వడంలోనూ ఆమె తన భర్తకు సహాయం చేయాలి. (సామెతలు 1:8) భార్య తన కుటుంబం ఎడల ప్రేమపూర్వక శ్రద్ధ కల్గివుండాలని యెహోవా కోరుతున్నాడు. (సామెతలు 31:10, 15, 26, 27; తీతు 2:4, 5) ఆమెకు తన భర్త ఎడల ప్రగాఢ గౌరవం ఉండాలి.—ఎఫెసీయులు 5:22, 23, 33.

5. పిల్లలు తమ తలిదండ్రులకు విధేయులై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. (ఎఫెసీయులు 6:1-3) తలిదండ్రులు తమ పిల్లలకు ఉపదేశించి, వారిని సరిదిద్దాలని ఆయన అపేక్షిస్తున్నాడు. తలిదండ్రులు తమ పిల్లల ఆత్మీయ మరియు మానసిక అవసరతల గురించి శ్రద్ధ వహిస్తూ, వారితో సమయం గడిపి, వారితో కలిసి బైబిలు పఠించాలి. (ద్వితీయోపదేశకాండము 11:18, 19; సామెతలు 22:6, 15) తలిదండ్రులు తమ పిల్లలను ఎన్నడూ కఠినంగా లేక క్రూరంగా శిక్షించకూడదు.—కొలొస్సయులు 3:21.

6. వివాహ దంపతులకు కలిసి ఉండే విషయంలో సమస్యలుంటే, వారు బైబిలు ఉపదేశాన్ని అన్వయించుకోవడానికి ప్రయత్నించాలి. ప్రేమ చూపేవారిగా, క్షమించేవారిగా ఉండాలని బైబిలు మనల్ని కోరుతుంది. (కొలొస్సయులు 3:12-14) చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి విడిపోవడమే ఒక మార్గమని దేవుని వాక్యం ప్రోత్సహించడంలేదు. కాని తన భర్త, (1) తన కుటుంబానికి మద్దతునివ్వడానికి మొండిగా నిరాకరిస్తే, (2) ఆమె ఆరోగ్యం మరియు జీవితం ప్రమాదంలో పడేంతగా అతడు హింసిస్తుంటే, లేక (3) అతని తీవ్రమైన వ్యతిరేకత మూలంగా యెహోవాను ఆరాధించడం ఆమెకు సాధ్యం కాకపోతే, భార్య అతడి నుండి విడిపోవడానికి నిర్ణయించుకోవచ్చు.—1 కొరింథీయులు 7:12, 13.

7. వివాహ దంపతులు ఒకరి ఎడల ఒకరు యథార్థంగా ఉండాలి. జారత్వం దేవునికి, తన జతకు వ్యతిరేకంగా చేసే పాపం. (హెబ్రీయులు 13:4) వివాహేతర లైంగిక సంబంధాలు మాత్రమే విడాకులు తీసుకుని మళ్లీ వివాహం చేసుకోవడానికి లేఖనాధార కారణము. (మత్తయి 19:6-9; రోమీయులు 7:2, 3) ప్రజలు లేఖనాధారం లేకుండా విడాకులు తీసుకుని మరొకరిని వివాహం చేసుకుంటే, యెహోవా అటువంటి క్రియను ద్వేషిస్తాడు.—మలాకీ 2:14-16.

[17వ పేజీలోని చిత్రం]

తలిదండ్రులు తమ పిల్లలకు ఉపదేశించి, వారిని సరిచేయాలన్నది దేవుని ఉద్దేశం

[17వ పేజీలోని చిత్రం]

ప్రేమగల తండ్రి తన కుటుంబపు వస్తుదాయిక మరియు ఆత్మీయ అవసరతలను తీరుస్తాడు