కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని రాజ్యమంటే ఏమిటి?

దేవుని రాజ్యమంటే ఏమిటి?

పాఠం 6

దేవుని రాజ్యమంటే ఏమిటి?

దేవుని రాజ్యం ఎక్కడ నెలకొల్పబడింది? (1) దాని రాజు ఎవరు? (2)

రాజుతోపాటు ఇతరులు పరిపాలనలో భాగం వహిస్తారా? ఆలాగైతే, ఎంతమంది? (3)

మనం అంత్యదినాల్లో జీవిస్తున్నామని ఏది చూపిస్తుంది? (4)

భవిష్యత్తులో దేవుని రాజ్యం మానవజాతి కొరకు ఏమి చేస్తుంది? (5-7)

1. యేసు భూమిపైనున్నప్పుడు, దేవుని రాజ్యం కొరకు ప్రార్థించుమని ఆయన తన అనుచరులకు నేర్పించాడు. రాజ్యం అంటే రాజు నడిపించే ప్రభుత్వం. దేవుని రాజ్యం ఒక ప్రత్యేకమైన ప్రభుత్వం. అది పరలోకంలో స్థాపించబడింది, అది ఈ భూమిని పరిపాలిస్తుంది. అది దేవుని నామాన్ని పరిశుద్ధపరుస్తుంది, లేక పవిత్రపరుస్తుంది. అది దేవుని చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లుగానే భూమియందు నెరవేరేలా చేస్తుంది.—మత్తయి 6:9, 10.

2. తన రాజ్యానికి యేసు రాజవుతాడని దేవుడు వాగ్దానం చేశాడు. (లూకా 1:30-33) యేసు భూమిపైనున్నప్పుడు, తాను దయగల, న్యాయవంతమైన, పరిపూర్ణ పరిపాలకునిగా ఉంటానని నిరూపించుకున్నాడు. ఆయన పరలోకానికి తిరిగి వెళ్లినప్పుడు, వెంటనే దేవుని రాజ్యానికి రాజుగా నియమించబడలేదు. (హెబ్రీయులు 10:12, 13) యెహోవా 1914 లో, యేసుకు తాను వాగ్దానం చేసిన అధికారాన్ని ఇచ్చాడు. అప్పటి నుండి యేసు, పరలోకంలో యెహోవా నియమిత రాజుగా పరిపాలిస్తున్నాడు.—దానియేలు 7:13, 14.

3. పరలోకానికి వెళ్లడానికి యెహోవా భూమి మీద నుండి విశ్వాసులైన కొంతమంది స్త్రీపురుషులను కూడా ఎన్నుకున్నాడు. వారు యేసుతోపాటు మానవజాతిపై రాజులుగా, న్యాయాధిపతులుగా, యాజకులుగా పరిపాలిస్తారు. (లూకా 22:28-30; ప్రకటన 5:9, 10) తన రాజ్యంలో ఉండే ఈ సహపరిపాలకులను యేసు “చిన్న మందా” అని పిలిచాడు. వారి సంఖ్య 1,44,000.—లూకా 12:32; ప్రకటన 14:1-3.

4. యేసు రాజైన వెంటనే, సాతానును అతని దుష్టదూతలను పరలోకంలో నుండి భూపరిధిలోకి పడద్రోశాడు. అందుకే 1914 నుండి ఇక్కడ భూమిపై పరిస్థితులు ఎంతో చెడుగా మారాయి. (ప్రకటన 12:9, 12) యుద్ధాలు, కరవులు, తెగుళ్లు, పెరుగుతున్న అవినీతి—ఇవన్నీ యేసు పరిపాలిస్తున్నాడని, ఈ విధానాంతం దాని అంత్యదినాల్లో ఉందని తెలిపే “సూచన”లోని భాగమే.—మత్తయి 24:3, 7, 8, 12; లూకా 21:10, 11; 2 తిమోతి 3:1-5.

5. గొర్రెల కాపరి మేకల్లోనుండి గొర్రెలను వేరుపరచినట్లు, యేసు త్వరలోనే ప్రజలను వేరుపరచి వారికి తీర్పుతీరుస్తాడు. ఆయన యథార్థ ప్రజలుగా తమను తాము నిరూపించుకొనేవారు “గొఱ్ఱెలు.” వారు భూమిపై నిత్యజీవం పొందుతారు. దేవుని రాజ్యాన్ని నిరాకరించిన వారు ‘మేకలు.’ (మత్తయి 25:31-34, 46) సమీప భవిష్యత్తులో, మేకలవంటి వారినందరినీ యేసు నాశనం చేస్తాడు. (2 థెస్సలొనీకయులు 1:6-9) మీరు యేసు ‘గొఱ్ఱెలలో’ ఒకరై ఉండాలని ఇష్టపడితే, మీరు రాజ్యవర్తమానాన్ని విని, నేర్చుకొనేదానికి అనుగుణంగా ప్రవర్తించాలి.—మత్తయి 24:14.

6. ఇప్పుడు భూమి అనేక దేశాలుగా విభజించబడింది. ప్రతి దానికి దాని స్వంత ప్రభుత్వం ఉంది. ఈ దేశాలు తరచూ ఒకదానితో ఒకటి పోరాడుతుంటాయి. కాని దేవుని రాజ్యం మానవ ప్రభుత్వాలన్నిటినీ తీసివేస్తుంది. అది యావత్‌ భూమిపైన ఏకైక ప్రభుత్వంగా పరిపాలిస్తుంది. (దానియేలు 2:44) అప్పుడిక యుద్ధం, నేరం, హింస ఎంతమాత్రం ఉండవు. ప్రజలందరూ శాంతి, ఐక్యతలతో కలిసి జీవిస్తారు.—మీకా 4:3, 4.

7. యేసు వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో, నమ్మకస్థులైన మానవులు పరిపూర్ణులౌతారు, భూమంతా పరదైసుగా మారుతుంది. వెయ్యేండ్ల అంతానికి, దేవుడు తనను చేయమని అడిగిన పనులన్నీ యేసు చేస్తాడు. అప్పుడు ఆయన రాజ్యాన్ని తిరిగి తన తండ్రికి అప్పగిస్తాడు. (1 కొరింథీయులు 15:24) దేవుని రాజ్యం ఏమి చేస్తుందో మీరు మీ స్నేహితులకు, ప్రియమైనవారికి ఎందుకు చెప్పకూడదు?

[13వ పేజీలోని చిత్రం]

యేసు పరిపాలన క్రింద, ద్వేషం లేక పక్షపాతం ఇక ఉండదు