కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని సేవకులు పరిశుభ్రంగా ఉండాలి

దేవుని సేవకులు పరిశుభ్రంగా ఉండాలి

పాఠం 9

దేవుని సేవకులు పరిశుభ్రంగా ఉండాలి

మనం ప్రతి విధముగాను ఎందుకు పరిశుభ్రంగా ఉండాలి? (1)

ఆత్మీయ పరిశుభ్రత, (2) నైతిక పరిశుభ్రత, (3) మానసిక పరిశుభ్రత (4)

శారీరక పరిశుభ్రత అంటే ఏమిటి? (5)

ఎటువంటి అపవిత్రమైన సంభాషణను మనం విసర్జించాలి? (6)

1. యెహోవా దేవుడు పరిశుభ్రమైనవాడు, పరిశుద్ధుడు. ఆయన తన ఆరాధికులు ఆత్మీయంగా, నైతికంగా, మానసికంగా, మరియు శారీరకంగా పరిశుభ్రంగా ఉండాలని అపేక్షిస్తాడు. (1 పేతురు 1:16) దేవుని దృష్టిలో పరిశుభ్రంగా ఉండాలంటే ఎంతో ప్రయాసపడవలసి ఉంటుంది. మనం అపవిత్రమైన లోకంలో జీవిస్తున్నాము. తప్పు చేయాలనే మన స్వంత దృక్పథాలతో కూడా మనం పోరాడాలి. కాని మన ప్రయత్నాన్ని విరమించుకోకూడదు.

2. ఆత్మీయ పరిశుభ్రత: మనం యెహోవా సేవచేయాలనుకుంటే, మనం అబద్ధమతం యొక్క ఏ బోధలను లేక ఆచారాలను అంటిపెట్టుకొని ఉండలేము. మనం అబద్ధమతంలో నుండి బయటికి రావాలి, దానికి ఏవిధంగానూ మద్దతునివ్వకూడదు. (2 కొరింథీయులు 6:14-18; ప్రకటన 18:4) మనం ఒకసారి దేవుని గూర్చిన సత్యాన్ని నేర్చుకున్న తర్వాత, అబద్ధాన్ని బోధించే ప్రజల వల్ల తప్పుదోవ పట్టకుండా మనం జాగ్రత్త పడాలి.—2 యోహాను 10, 11.

3. నైతిక పరిశుభ్రత: తన ఆరాధికులు అన్ని వేళలా నిజ క్రైస్తవులుగా ఉండాలని యెహోవా కోరుతున్నాడు. (1 పేతురు 2:12) మనం చేసేవన్నీ, చివరికి రహస్యంగా చేసేవి కూడా ఆయన చూస్తాడు. (హెబ్రీయులు 4:13) మనం లైంగిక దుర్నీతిని, ఈ లోకంలోని ఇతర చెడు అలవాట్లను విసర్జించాలి.—1 కొరింథీయులు 6:9-11.

4. మానసిక పరిశుభ్రత: మనం మన మనస్సులను పరిశుభ్రమైన, స్వచ్ఛమైన తలంపులతో నింపుకుంటే, మన ప్రవర్తన కూడా పరిశుభ్రంగా ఉంటుంది. (ఫిలిప్పీయులు 4:8) కాని మనం అపరిశుభ్రమైన విషయాల గురించి ఆలోచిస్తుంటే, అది దుష్కార్యాలకు నడిపిస్తుంది. (మత్తయి 15:18-20) మన మనస్సులను కలుషితం చేసే వినోదాలను మనం విసర్జించాలి. దేవుని వాక్యాన్ని పఠించడం ద్వారా మనం మన మనస్సులను పరిశుభ్రమైన తలంపులతో నింపుకోవచ్చు.

5. శారీరక పరిశుభ్రత: క్రైస్తవులు దేవునికి ప్రాతినిధ్యం వహిస్తారు గనుక, వాళ్లు తమ శరీరాలను, వస్త్రాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మనం మరుగు దొడ్డిని ఉపయోగించుకున్న తర్వాత మన చేతుల్ని కడుగుకోవాలి, భోజనం చేయడానికి ముందూ లేక ఆహారాన్ని ముట్టుకునే ముందూ మనం చేతుల్ని కడుగుకోవాలి. మీకు సరైన మరుగు దొడ్డి సౌకర్యం లేకపోతే, మలమూత్ర విసర్జనలను మట్టితో కప్పివేయాలి. (ద్వితీయోపదేశకాండము 23:12, 13) శారీరకంగా పరిశుభ్రంగా ఉండడం మంచి ఆరోగ్యానికి దోహదపడుతుంది. ఒక క్రైస్తవుని గృహం ఇంటాబయటా శుచిగా శుభ్రంగా ఉండాలి. అది సమాజంలో ఒక మంచి మాదిరిగా ఉండాలి.

6. పవిత్ర సంభాషణ: దేవుని సేవకులు ఎల్లప్పుడూ సత్యం మాట్లాడాలి. అబద్ధికులు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. (ఎఫెసీయులు 4:25; ప్రకటన 21:8) క్రైస్తవులు దుర్భాషను ఉపయోగించరు. వాళ్లు అశ్లీల హాస్యోక్తులు లేక అశుద్ధమైన కథలు వినరు లేక చెప్పరు. వారి పవిత్రమైన సంభాషణను బట్టి, పనిస్థలంలోగాని పాఠశాల వద్దగాని, ఇరుగుపొరుగున గాని వారు భిన్నంగా ఉంటారు.—ఎఫెసీయులు 4:29, 31; 5:3.

[19వ పేజీలోని చిత్రం]

దేవుని సేవకులు అన్ని విషయాల్లో పరిశుభ్రంగా ఉండాలి