యేసు క్రీస్తు ఎవరు?
పాఠం 3
యేసు క్రీస్తు ఎవరు?
దేవుని “ఆదిసంభూతుడై”న కుమారుడని యేసు ఎందుకు పిలువబడ్డాడు? (1)
ఆయన “వాక్యము” అని ఎందుకు పిలువబడ్డాడు? (1)
యేసు మనిషిగా భూమి మీదికి ఎందుకు వచ్చాడు? (2-4)
ఆయన అద్భుతాలు ఎందుకు చేశాడు? (5)
యేసు సమీప భవిష్యత్తులో ఏమి చేస్తాడు? (6)
1. యేసు భూమిపైకి రాకమునుపు పరలోకంలో ఆత్మ సంబంధమైన వ్యక్తిగా జీవించాడు. ఆయన దేవుని మొదటి సృష్టి, అందుకే ఆయన దేవుని ‘ఆదిసంభూతుడైన’ కుమారుడని పిలువబడ్డాడు. (కొలొస్సయులు 1:15; ప్రకటన 3:14) దేవుడు తానే స్వయంగా సృష్టించిన ఏకైక కుమారుడు యేసు. యెహోవా పరలోకంలోను, భూమిపైననూ ఇతర వాటన్నిటిని సృష్టించడానికి, యేసు మానవునిగా రాక పూర్వం ఆయనను తన “ప్రధాన శిల్పిగా” ఉపయోగించుకున్నాడు. (సామెతలు 8:22-31; కొలొస్సయులు 1:16, 17) దేవుడాయనను తన ముఖ్య ప్రతినిధిగా కూడా ఉపయోగించుకున్నాడు. అందుకే యేసు “వాక్యము” అని పిలువబడ్డాడు.—యోహాను 1:1-3; ప్రకటన 19:13.
2. తన కుమారుని జీవాన్ని మరియ గర్భంలోకి మార్చడం ద్వారా దేవుడు ఆయనను భూమిపైకి పంపించాడు. కాబట్టి యేసుకు మానవ తండ్రి లేడు. అందుకే ఆయన పాపాన్ని లేక అపరిపూర్ణతను వారసత్వంగా పొందలేదు. దేవుడు మూడు కారణాలను బట్టి యేసును భూమిపైకి పంపించాడు: (1) మనకు దేవుని గురించిన సత్యాన్ని నేర్పించడానికి (యోహాను 18:37), (2) మనం అనుసరించడానికి మనకు ఒక మాదిరినుంచుతూ పరిపూర్ణ యథార్థతను కల్గి ఉండడానికి (1 పేతురు 2:21) మరియు (3) మనల్ని పాప మరణాల నుండి విడిపించేందుకు తన జీవాన్ని బలి ఇవ్వడానికి. ఇది ఎందుకు అవసరమైంది?—మత్తయి 20:28.
3. మొదటి మానవుడైన ఆదాము దేవుని ఆజ్ఞను మీరడం ద్వారా, “పాపము” అని బైబిలు పిలిచే పనిచేశాడు. కాబట్టి దేవుడు ఆయనకు మరణ శిక్ష విధించాడు. (ఆదికాండము 3:17-19) ఆయన ఇక దేవుని కట్టడలకు తగినట్లు ఉండలేకపోయాడు, కాబట్టి ఆయన ఇక ఏమాత్రం పరిపూర్ణుడు కాదు. ఆయన క్రమేణ వృద్ధుడై మరణించాడు. ఆదాము పాపాన్ని తన పిల్లలందరికీ సంక్రమింపజేశాడు. అందుకే మనం కూడా వృద్ధులమై, రోగగ్రస్థులమై, మరణిస్తున్నాము. మానవజాతి ఎలా రక్షించబడగలదు?—రోమీయులు 3:23; 5:12.
4. ఆదాము వలెనే యేసు పరిపూర్ణ మానవుడైయుండెను. అయితే, యేసు ఆదాము వలె కాకుండా, అత్యంత గొప్ప పరీక్షా సమయంలో కూడా దేవుని ఎడల పరిపూర్ణమైన విధేయతను చూపాడు. అందుకే ఆదాము చేసిన పాపం కొరకు తన పరిపూర్ణ మానవ జీవాన్ని బలిగా అర్పించగలిగాడు. దీన్నే బైబిలు “విమోచన క్రయధనము” అని చెబుతుంది. తద్వారా ఆదాము పిల్లలు మరణ శిక్ష నుండి తప్పించబడగలరు. యేసునందు విశ్వాసముంచే వారందరూ తమ పాపాలకు క్షమాపణ మరియు నిత్యజీవం పొందగలరు.—1 తిమోతి 2:5, 6; యోహాను 3:16; రోమీయులు 5:18, 19.
5. భూమిపై ఉన్నప్పుడు యేసు రోగులను స్వస్థపర్చి, ఆకలిగొన్న వారికి ఆహారం పెట్టి, తుఫానులను నిమ్మళింపజేశాడు. ఆయన మృతులను సహితం లేపాడు. ఎందుకాయన అద్భుతాలు చేశాడు? (1) బాధ పడుతున్న ప్రజల ఎడల ఆయన జాలిపడి, వారికి సహాయం చేయాలనుకున్నాడు. (2) ఆయన చేసిన అద్భుతాలు ఆయన దేవుని కుమారుడని నిరూపించాయి. (3) ఆయన భూమి మీద రాజుగా పరిపాలించేటప్పుడు విధేయులైన మానవజాతి కొరకు ఆయనేమి చేస్తాడనేదాన్ని అవి చూపించాయి.—మత్తయి 14:14; మార్కు 2:10-12; యోహాను 5:28, 29.
6. యేసు మరణించి దేవునిచే ఆత్మసంబంధమైన వ్యక్తిగా పునరుత్థానం చేయబడి, పరలోకానికి తిరిగి వెళ్లాడు. (1 పేతురు 3:18) ఆ తర్వాత, దేవుడాయనను రాజుగా చేశాడు. త్వరలోనే యేసు ఈ భూమి మీద నుండి సమస్త దుష్టత్వాన్నీ, బాధను తీసివేస్తాడు.—కీర్తన 37:9-11; సామెతలు 2:21, 22.
[7వ పేజీలోని చిత్రం]
యేసు పరిచర్యలో బోధించడం, అద్భుతాలు చేయడం, మన కొరకు తన జీవాన్ని అర్పించడం కూడా చేరివున్నాయి