14వ అధ్యాయం
అన్ని విషయాల్లో నిజాయితీగా ఉండండి
‘మేమన్ని విషయములలోను యోగ్యముగా [“నిజాయితీగా,” NW] ప్రవర్తింప గోరుచున్నాము.’ —హెబ్రీయులు 13:18.
1, 2. మనం నిజాయితీగా ఉండడానికి ప్రయత్నించినప్పుడు యెహోవా ఎందుకు సంతోషిస్తాడు? ఉదాహరణతో చెప్పండి.
ఒక స్త్రీ, వాళ్ల అబ్బాయి సామాన్లు కొనుక్కుని షాపులో నుండి బయటికి వచ్చారు. ఆ పిల్లవాడు షాపులో ఉన్నప్పుడు చేతిలోకి తీసుకున్న ఒక బొమ్మను పొరపాటున బయటకు తీసుకువచ్చేశాడు. అది గుర్తొచ్చి వాడు ఏడుపు ముఖంతో భయంగా వాళ్ల అమ్మకు ఆ విషయం చెప్పాడు. ఆమె ‘ఫర్వాలేదులే, తిరిగి ఇచ్చేయవచ్చు,’ అని చెప్పి, దాన్ని ఇవ్వడానికి మళ్లీ లోపలికి తీసుకెళ్లి వాడితో ‘సారీ’ చెప్పించింది. వాడి నిజాయితీని చూసి ఆమె ఎంతో మురిసిపోయింది. ఎందుకు?
2 పిల్లలు నిజాయితీగా ఉండడం నేర్చుకుంటున్నప్పుడు తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు. అలాగే, మనం నిజాయితీగా ఉండడానికి ప్రయత్నించినప్పుడు ‘సత్యదేవుడైన’ మన పరలోక తండ్రి కూడా సంతోషిస్తాడు. (కీర్తన 31:5) ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతున్నకొద్దీ మనం మరింత నిజాయితీగా ఉండడం చూసి ఆయన సంతోషిస్తాడు. మనం ఆయనను సంతోషపెట్టాలని, ఆయన ప్రేమలో నిలిచివుండాలని కోరుకుంటాం కాబట్టి అపొస్తలుడైన పౌలు చెప్పిన ఈ మాటల ప్రకారం జీవించాలనుకుంటాం: ‘మేమన్ని విషయములలోను నిజాయితీగా ప్రవర్తింప గోరుచున్నాం.’ (హెబ్రీయులు 13:18) నిజాయితీగా ఉండడం కొంచెం కష్టంగా అనిపించే నాలుగు రంగాల గురించి మనమిప్పుడు చర్చించుకుందాం. ఆ తర్వాత దానివల్ల వచ్చే ఆశీర్వాదాల గురించి చూద్దాం.
ఆత్మవంచన చేసుకోకుండా నిజాయితీగా ఉండండి
3-5. (ఎ) ఆత్మవంచన చేసుకోవడంలో ఎలాంటి ప్రమాదం ఉందని దేవుని వాక్యం హెచ్చరిస్తోంది? (బి) ఆత్మవంచన చేసుకోకుండా నిజాయితీగా ఉండడానికి మనకేది సహాయం చేస్తుంది?
3 ఆత్మవంచన చేసుకోకుండా నిజాయితీగా ఉండడం కొంచెం కష్టమే. మనం అపరిపూర్ణులం కాబట్టి మన మనసుల్ని మోసం చేసుకునే ప్రమాదం ఉంది. ఉదాహరణకు, లవొదికయలో ఉన్న క్రైస్తవులు తాము ధనవంతులమని ఆత్మవంచన చేసుకున్నారు. కానీ వాళ్లు నిజానికి ‘దరిద్రులు, గ్రుడ్డివారు, దిగంబరులై’ ఆధ్యాత్మికంగా హీనస్థితిలో ఉన్నారని యేసు చెప్పాడు. (ప్రకటన 3:17) వారలా ఆత్మవంచన చేసుకోవడం వల్ల మరింత ప్రమాదంలో పడ్డారు.
4 “ఎవడైనను నోటికి కళ్లెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తిగలవాడనని అనుకొనిన యెడల వాని భక్తి వ్యర్థమే” అని శిష్యుడైన యాకోబు చెప్పిన మాటల్ని కూడా గుర్తుచేసుకోండి. (యాకోబు 1:26) నోటిని అదుపులో పెట్టుకోకుండా యెహోవా మన ఆరాధనను అంగీకరిస్తాడనుకుంటే ఆత్మవంచన చేసుకున్నట్లే. యెహోవాకు మనం చేసే ఆరాధన కూడా వ్యర్థమే. అలా జరగకూడదంటే ఏమి చేయాలి?
5 పై మాటలు చెప్పడానికి ముందు యాకోబు దేవుని వాక్యాన్ని అద్దంతో పోల్చాడు. సంపూర్ణమైన దేవుని వాక్యాన్ని పరిశీలించి దానికి అనుగుణంగా జీవితంలో మార్పులు చేసుకొమ్మని సలహా ఇచ్చాడు. (యాకోబు 1:23-25 చదవండి.) స్వయం పరిశీలన చేసుకుని మన లోపాల్ని ఎలా సరిచేసుకోవాలో తెలుసుకోవడానికి బైబిలు మనకు సహాయం చేస్తుంది. (విలాపవాక్యములు 3:40; హగ్గయి 1:5) మనల్ని పరిశోధించి, మనలో లోపాల్ని గుర్తించడానికి, వాటిని సరిచేసుకోవడానికి సహాయం చేయమని యెహోవాకు ప్రార్థించవచ్చు. (కీర్తన 139:23, 24) మనల్ని మనం మోసగించుకోవడం ప్రమాదకరమైన బలహీనత. “కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును” అని సామెతలు 3:32 చెబుతోంది. కాబట్టి మనమూ దాన్ని అసహ్యించుకోవాలి. ఆయనలాగే ఆలోచించడానికి, ఆయన మనల్ని ఏ విధంగా పరిశోధిస్తాడో ఆ విధంగానే మనల్ని మనం పరిశోధించుకోవడానికి సహాయం చేస్తాడు. ‘మేమన్ని విషయములలోను నిజాయితీగా ప్రవర్తింప గోరుచున్నాము’ అని పౌలు చెప్పిన మాటల్ని గుర్తుచేసుకోండి. ప్రస్తుతం మనం పరిపూర్ణంగా ఉండలేం కానీ నిజాయితీగా ఉండాలని మనసారా కోరుకుంటాం.
కుటుంబంలో నిజాయితీగా ఉండండి
6. భార్యాభర్తలు ఎందుకు ఒకరిపట్ల ఒకరు నిజాయితీగా ఉండాలి? అలా ఉంటే ఎలాంటి ప్రమాదాలు రావు?
6 క్రైస్తవ కుటుంబం నిజాయితీకి నెలవుగా ఉండాలి. భార్యాభర్తలు దాపరికం లేకుండా మాట్లాడుకోవాలి. పరాయివాళ్లతో సరసంగా ప్రవర్తించడం, ఇంటర్నెట్‌లో ప్రేమాయణాలు నడపడం, అశ్లీల చిత్రాలను చూడడం వంటి అపవిత్రమైన, హానికర అలవాట్లకు క్రైస్తవుల జీవితాల్లో చోటుండకూడదు. కొంతమంది వివాహిత క్రైస్తవులు రహస్యంగా అలాంటి తప్పులు చేశారు. అది నమ్మకద్రోహంతో సమానం. విశ్వసనీయుడైన దావీదు రాజు ఏమన్నాడో చూడండి: “పనికిమాలినవారితో నేను సాంగత్యము చేయను వేషధారులతో పొందుచేయను.” (కీర్తన 26:4) మీరు వివాహితులైతే, వేషధారణతో మీ జతను మోసం చేసే పనులేవీ చేయకండి.
7, 8. నిజాయితీ ఎంత విలువైన గుణమో తెలుసుకోవడానికి పిల్లలకు బైబిల్లోని ఏ ఉదాహరణలు సహాయం చేస్తాయి?
7 పిల్లలకు నిజాయితీ గురించి నేర్పిస్తున్నప్పుడు బైబిలు ఉదాహరణలు చెప్పడం మంచిది. ఒక వస్తువును దొంగిలించి బొంకిన ఆకాను, పేరాశతో అబద్ధాలాడిన గేహజీ, డబ్బులు దొంగిలించి యేసును చంపించడానికి కుయుక్తితో మాట్లాడిన యూదా వంటివాళ్ల చెడు ఉదాహరణలు ఉన్నాయి.—యెహోషువ 6:17-19; 7:11-25; 2 రాజులు 5:14-16, 20-27; మత్తయి 26:14, 15; యోహాను 12:6.
8 మరోవైపు, తమ సంచుల్లో కనబడిన డబ్బు పొరపాటున ఎవరో పెట్టివుంటారనుకుని తిరిగి ఇచ్చేయమని కొడుకులకు చెప్పిన యాకోబు, జీవితాన్ని త్యాగం చేసి తండ్రి వాగ్దానాన్ని నెరవేర్చిన యెఫ్తా కుమార్తె, ప్రవచనాలను నెరవేర్చి తన స్నేహితులను కాపాడడానికి ధైర్యంగా దుష్టులకు తనను తాను అప్పగించుకున్న యేసు వంటివారి మంచి ఉదాహరణలు కూడా బైబిల్లో ఉన్నాయి. (ఆదికాండము 43:12; న్యాయాధిపతులు 11:30-40; యోహాను 18:3-11) పిల్లలు నిజాయితీని ప్రేమించి, అదెంత విలువైన గుణమో తెలుసుకునేలా సహాయం చేయడానికి దేవుని వాక్యంలో ఈ కొన్ని ఉదాహరణలే కాదు ఇంకా ఎన్నో అమూల్యమైన విషయాలు ఉన్నాయి.
9. (ఎ) పిల్లలకు నిజాయితీగా ఉండడం గురించి నేర్పిస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఏమి చేయకూడదు? (బి) దీని విషయంలో వారు మాదిరికరంగా ఉండడం ఎందుకు ప్రాముఖ్యం?
9 అదే సమయంలో, తల్లిదండ్రులపై ఒక బరువైన బాధ్యత ఉంది. “ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిలవద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా?” అని అపొస్తలుడైన పౌలు అడిగాడు. (రోమీయులు 2:21) కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు నిజాయితీగా ఉండమని చెప్తారు గానీ పాటించరు. కొన్నిసార్లు చిన్న చిన్న దొంగతనాలు చేసేసి, ‘ఓ అవా, వాటిని తీసుకెళ్లడానికే అక్కడ పెట్టారు’ అని అంటారు. అబద్ధాలు చెప్పేసి ‘అదేమీ పెద్ద అబద్ధం కాదు’ అని అంటారు. నిజానికి, చిన్నదైనా పెద్దదైనా దొంగతనం దొంగతనమే. కారణమేదైనా, అదెంత చిన్నదైనా అబద్ధం అబద్ధమే. a (లూకా 16:10 చదవండి.) ఒకవేళ తల్లిదండ్రులు అలా చేస్తే పిల్లలు ఇట్టే పసిగట్టి వాళ్ళు కూడా అలాగే తయారవుతారు. (ఎఫెసీయులు 6:4) అయితే తల్లిదండ్రులు నిజాయితీగా ఉండడం చూసినప్పుడు వాళ్ళు నిజాయితీ లేని ఈ లోకంలో యెహోవాను మహిమపర్చే వ్యక్తులుగా తయారవుతారు.—సామెతలు 22:6.
సంఘంలో నిజాయితీగా ఉండండి
10. తోటి క్రైస్తవులతో నిజాయితీగా మాట్లాడే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
10 తోటి క్రైస్తవులతో సహవసించినప్పుడు మనం మరింత నిజాయితీగా ఉండడం నేర్చుకుంటాం. 12వ అధ్యాయంలో మనం నేర్చుకున్నట్లుగా ఇతరులతో, ప్రత్యేకంగా మన సహోదరసహోదరీలతో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. ఒకరి గురించి మామూలుగా మాట్లాడుకునే మాటలే చాడీలకు, అబద్ధాలకు దారితీయవచ్చు. సరైన ఆధారాలు లేకుండా ఒక విషయాన్ని ఇతరులకు చెబితే అబద్ధాన్ని వ్యాప్తి చేసే ప్రమాదం ఉంది. కాబట్టి మాట్లాడే ముందు ఆలోచించడం మంచిది. (సామెతలు 10:19) అంతేగాక ఒక విషయం గురించి నిజం తెలిసినంత మాత్రాన దాన్ని ఇతరులకు చెప్పాల్సిన అవసరం లేదు. అది మనకు సంబంధించిన విషయం కాకపోవచ్చు, వాటి గురించి చెప్పడం అంత మంచిది కూడా కాకపోవచ్చు. (1 థెస్సలొనీకయులు 4:10, 11) కొంతమంది కఠినంగా మాట్లాడి దాన్ని నిజాయితీ అనుకుంటారు కానీ మనం ఎల్లప్పుడూ దయగా, మర్యాదపూర్వకంగా మాట్లాడాలి.—కొలొస్సయులు 4:6 చదవండి.
11, 12. (ఎ) ఘోరమైన తప్పుచేసిన వాళ్ళు మరిన్ని సమస్యల్ని ఎలా కొని తెచ్చుకుంటారు? (బి) ఘోరమైన పాపాల విషయంలో సాతాను ఎలాంటి అబద్ధాలను ప్రచారం చేస్తున్నాడు, అలాంటి హానికరమైన తర్కానికి మనమెలా దూరంగా ఉండవచ్చు? (సి) యెహోవా సంస్థలో మనమెలా నిజాయితీగా ఉండవచ్చు?
11 ముఖ్యంగా సంఘంలో నాయకత్వం వహించే వారితో నిజాయితీగా ఉండాలి. కొంతమంది ఘోరమైన తప్పుచేసి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి పెద్దలతో అబద్ధాలాడి మరిన్ని సమస్యలు కొని తెచ్చుకుంటారు. అలాంటి వాళ్ళు ఒకవైపు ఘోరమైన తప్పుచేస్తూనే యెహోవాను సేవిస్తున్నట్లు నటించే అవకాశం ఉంది. అలా చేస్తే వాళ్ళ జీవితమే పెద్ద అబద్ధం అయిపోతుంది. (కీర్తన 12:2) మరి కొంతమంది, పెద్దలకు జరిగినదాంట్లో సగమే చెప్పి అసలు విషయాన్ని దాచిపెడతారు. (అపొస్తలుల కార్యములు 5:1-11) సాతాను ప్రచారం చేసే అబద్ధాలను నమ్మడం వల్లే అలా మోసం చేసే ప్రవృత్తి పుడుతుంది.—188-189 పేజీల్లోని “ ఘోరమైన పాపాల విషయంలో సాతాను ప్రచారం చేసే అబద్ధాలు” అనే బాక్సు చూడండి.
12 యెహోవా సంస్థలో ఏదైనా ఫారమ్ నింపాల్సి వచ్చినప్పుడు కూడా మనం నిజాయితీగా ఉండాలి. ఉదాహరణకు క్షేత్రసేవ రిపోర్టుల్లో తప్పుడు వివరాలు ఇవ్వకుండా జాగ్రత్తపడాలి. అలాగే ఏదైనా ప్రత్యేక సేవకు సంబంధించిన ఫారమ్‌లలో మన ఆరోగ్యం, జీవితం తదితర విషయాల గురించి తప్పుడు వివరాలు నింపకూడదు.—సామెతలు 6:16-19 చదవండి.
13. తోటి విశ్వాసితో కలిసి వ్యాపారం చేస్తుంటే మనమెలా నిజాయితీగా ఉండవచ్చు?
13 వ్యాపార విషయాల్లో కూడా తోటి విశ్వాసులతో మనం నిజాయితీగా వ్యవహరించాలి. కొంతమంది క్రైస్తవులు తోటి సహోదరసహోదరీలతో కలిసి వ్యాపారం చేస్తారు. ఆరాధనకు సంబంధించిన విషయాల్లో అంటే రాజ్యమందిరంలో, పరిచర్యలో ఉన్నప్పుడు వ్యాపార విషయాల ప్రస్తావన రాకుండా చూసుకోండి. సహోదరుల్లో ఒకరు యజమాని మరొకరు ఉద్యోగి అయ్యుండవచ్చు. యజమానైతే తన క్రింద పనిచేసే సహోదరులకు కుదుర్చుకున్నంత జీతం సమయానికి ఇవ్వాలి, ప్రభుత్వ నియమాల ప్రకారం జీతంతోపాటు ఇచ్చే అదనపు భత్యాలు నిజాయితీగా ఇవ్వాలి. (1 తిమోతి 5:18; యాకోబు 5:1-4) ఉద్యోగులైతే జీతానికి తగినట్లుగా పనివేళల్లో పూర్తిగా పని చేయాలి. (2 థెస్సలొనీకయులు 3:10) సహోదరులం కాబట్టి మనల్ని ప్రత్యేకంగా చూడాలని, లేదా ఆయన మనకేదో అచ్చివున్నట్లు ఇతర ఉద్యోగులకు లేని సెలవులు, ఇతర ప్రయోజనాలు ఇవ్వాలని ఆశించకూడదు.—ఎఫెసీయులు 6:5-8.
14. క్రైస్తవులు వ్యాపార భాగస్వాములైతే ఏమి చేయడం జ్ఞానయుక్తం? ఎందుకు?
14 వ్యాపారంలో సహోదరులిద్దరూ భాగస్వాములైతే అప్పుడేమిటి? ఈ విషయంలో మనకు ఉపయోగపడే ఒక ప్రాముఖ్యమైన సూత్రాన్ని బైబిలు ఇస్తుంది: అన్నీ రాతపూర్వకంగా ఉండాలి. ఉదాహరణకు యిర్మీయా స్థలాన్ని కొన్నప్పుడు దస్తావేజులు రాయించాడు, నకలు ప్రతి తయారు చేయించి సాక్షుల సంతకాలు పెట్టించి దాన్ని భద్రపరిచాడు. (యిర్మీయా 32:9-12; ఆదికాండము 23:16-20 కూడా చూడండి.) తోటి విశ్వాసులతో కలిసి వ్యాపారం చేస్తున్నప్పుడు, అలా దస్తావేజులు రాయించుకోవడం సహోదరులమీద నమ్మకం లేదని చూపించదు. కానీ అలాచేస్తే భవిష్యత్తులో ఎలాంటి అపార్థాలు, గొడవలు, మనస్పర్థలు రావు. కలిసి వ్యాపారం చేసే సహోదరులు సంఘ శాంతి సమాధానాలు కాపాడడమే ప్రాముఖ్యమని గుర్తుంచుకోవాలి. b—1 కొరింథీయులు 6:1-8.
ఇతర విషయాల్లో నిజాయితీగా ఉండండి
15. వ్యాపారంలో మోసం చేస్తే యెహోవా ఎలా భావిస్తాడు? సాధారణంగా చాలామంది చేసే అలాంటి పనుల్ని క్రైస్తవులు ఎలా చూడాలి?
15 క్రైస్తవులు సంఘంలో మాత్రమే కాదు పౌలు చెప్పినట్లు ‘అన్ని విషయాల్లో నిజాయితీగా’ ప్రవర్తిస్తారు. (హెబ్రీయులు 13:18) ఏదైనా వ్యాపారం చేసేటప్పుడు మనం నిజాయితీగా ఉండాలని యెహోవా ఆశిస్తున్నాడు. తప్పుడు తూకం గురించి, సామెతల పుస్తకం కొన్ని చోట్ల చెబుతుంది. (సామెతలు 11:1; 20:10, 23) పూర్వం కొనే వస్తువుల్ని, వాటిని కొనడానికి ఉపయోగించే నాణాల్ని సాధారణంగా తూకం వేసేవాళ్ళు. అక్రమ వ్యాపారస్థులు రెండు రకాల తూకపు రాళ్ళను వాడేవారు. c అలాంటి పనులు యెహోవాకు అసహ్యం. దేవుని ప్రేమలో నిలిచివుండాలంటే అలాంటి మోసాలకు దూరంగా ఉండాలి.
16, 17. నేడు లోకంలో సాధారణంగా ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి? నిజ క్రైస్తవులు ఏమని తీర్మానించుకోవాలి?
16 సాతాను ఈ లోకాన్ని ఏలుతున్నాడు కాబట్టి లోకంలో ఇన్ని అక్రమాలు జరుగుతుంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మనకు కూడా అలా మోసం చేస్తే తప్పులేదులే అనిపించవచ్చు. ఉద్యోగం కోసం ఇచ్చే బయోడేటాలో ప్రజలు సాధారణంగా ఉన్నవి, లేనివి కలిపి రాస్తారు. వీసా, పాస్‌పోర్టు, పన్నులు, ఇన్సూరెన్సు కోసం లేదా ఇతరత్రా ఫారమ్‌లు నింపేటప్పుడు పుట్టిన తేదీ లాంటి వివరాలను తప్పుగా ఇస్తారు. చాలామంది విద్యార్థులు పరీక్షల్లో కాపీ కొడతారు. స్కూలు, కాలేజీ కోసం ఏదైనా ప్రాజెక్టు చేయాల్సివస్తే, వేరేవాళ్లు తయారుచేసుకున్న సమాచారాన్ని ఇంటర్నెట్‌లో నుండి తెచ్చి తామే దాన్ని తయారుచేశామని చెప్తారు. అక్రమ అధికారులతో ఏదైనా పని చేయించుకోవాల్సివస్తే ప్రజలు వారికి లంచాలిస్తారు. ఇంతమంది ‘స్వార్థప్రియులు, ధనాపేక్షులు, సజ్జనద్వేషులు’ ఉన్న ఈ లోకం ఇలా కాకపోతే ఎలా ఉంటుంది?—2 తిమోతి 3:1-5.
17 నిజ క్రైస్తవులు అలాంటి పనులేవీ చేయకూడదని తీర్మానించుకోవాలి. కానీ, అలా మోసం చేసి వర్ధిల్లే వాళ్లను చూస్తుంటే నిజాయితీగా ఉండడం కొంచెం కష్టం అనిపిస్తుంది. (కీర్తన 73:1-8) ‘అన్ని విషయాల్లో’ నిజాయితీగా ఉండే ప్రయత్నంలో క్రైస్తవులు కొన్నిసార్లు ఆర్థిక ఇక్కట్లను కూడా అనుభవిస్తారు. కానీ, అంత చేసి నిజాయితీగా ఉండడం వల్ల ఏదైనా ప్రయోజనం ఉందా? ఖచ్చితంగా ఉంది! అలా ఎందుకంటున్నాం? దానివల్ల వచ్చే ఆశీర్వాదాలేంటి?
నిజాయితీగా ఉండడం వల్ల వచ్చే ఆశీర్వాదాలు
18. నిజాయితీపరులనే మంచి పేరు సంపాదించుకోవడం ఎంతో ప్రయోజనకరమని ఎందుకు చెప్పవచ్చు?
18 మనం నిజాయితీపరులం, నమ్మదగినవారం అని పేరు సంపాదించుకోవడం కన్నా మంచి విషయం వేరే ఏదైనా ఉందా? (191వ పేజీలో ఉన్న ‘ నేను అన్ని విషయాల్లో నిజాయితీగా ఉంటున్నానా?’ అనే బాక్సు చూడండి.) సంతోషకరమైన విషయం ఏమిటంటే, సామర్థ్యం, ధనం, అందం, సామాజిక హోదా వంటివాటితో నిమిత్తం లేకుండా ఎవరైనా అలాంటి మంచి పేరు సంపాదించుకోవచ్చు. కానీ అది చాలా అరుదు. (మీకా 7:2) ఎందుకంటే చాలామందికి మంచి పేరు తెచ్చుకునే ఉద్దేశం లేదు. మీరు నిజాయితీగా ఉంటే కొంతమంది హేళన చేసినా ఇతరులు దాన్ని గుర్తించి మిమ్మల్ని నమ్ముతారు, గౌరవిస్తారు. నిజాయితీవల్ల చాలామంది యెహోవాసాక్షులు ఆర్థికంగా లాభం పొందారు. అంటే మోసం చేసే ఉద్యోగుల్ని తీసేసినప్పుడు వీళ్ల ఉద్యోగాలు పోలేదు, లేదా నిజాయితీపరులే కావాలని కోరి మరీ వీళ్లను ఉద్యోగాల్లో పెట్టుకున్నారు.
19. నిజాయితీగా జీవించడం మన మనస్సాక్షిపై, యెహోవాతో మనకున్న సంబంధంపై ఎలా ప్రభావం చూపిస్తుంది?
19 మీ విషయంలో అలా జరిగినా, జరగకపోయినా ఇంకా వేరే గొప్ప ఆశీర్వాదాలు లభిస్తాయి. పౌలు ఇలా అన్నాడు: ‘మంచి మనస్సాక్షి కలిగియున్నామని నమ్ముతున్నాము.’ కాబట్టి మీకు మంచి మనస్సాక్షి ఉంటుంది. (హెబ్రీయులు 13:18) అంతేకాదు, ప్రేమగల మన పరలోక తండ్రి నిజాయితీపరుల్ని ప్రేమిస్తాడు కాబట్టి మీరు మంచి పేరు తెచ్చుకుంటే ఆయన దాన్ని తప్పకుండా గమనిస్తాడు. (కీర్తన 15:1, 2; సామెతలు 22:1 చదవండి.) నిజాయితీగా ఉండడం దేవుని ప్రేమలో నిలిచివుండడానికి సహాయం చేస్తుంది. మనకు అంతకన్నా ఏం కావాలి! నిజాయితీకి సంబంధించిన ఈ విషయం గురించి తర్వాతి అధ్యాయంలో చూద్దాం: పని విషయంలో యెహోవా దృక్కోణం ఏమిటి?
a సంఘంలో ఇతరులకు హానిచేయాలనే ఉద్దేశంతో అలవాటుగా అబద్ధాలాడితే పెద్దలు ఆ వ్యక్తిపై న్యాయపరమైన చర్య తీసుకునే అవకాశం ఉంది.
c అప్పట్లో వాళ్ళు ఇతరుల నుండి కొనడానికి ఒక రకం రాళ్ళు, తమ దగ్గరున్నవి అమ్మడానికి మరో రకం రాళ్ళు ఉపయోగించేవారు. ఇతరుల్ని మోసగించడానికి త్రాసులో ఒక తక్కెడ బరువుది లేదా పొడవుది పెట్టేవాళ్ళు.