కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

9వ అధ్యాయం

“జారత్వమునకు దూరముగా పారిపోవుడి”

“జారత్వమునకు దూరముగా పారిపోవుడి”

“భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపి వేయుడి.”—కొలొస్సయులు 3:5.

1, 2. యెహోవా ప్రజలకు హాని కలిగించడానికి బిలాము ఎలాంటి పన్నాగం పన్నాడు?

 ఒక వ్యక్తి చేపలు పట్టడానికి నది దగ్గరికి వెళ్లాడు. ఆయన ఒక రకం చేపనే పట్టుకోవాలనుకుని గాలానికి తగిన ఎరను తగిలించి నీటిలో వేశాడు. కొద్దిసేపటికి చేప గాలానికి చిక్కింది. ఆయన దాన్ని పైకి లాగి, సరైన ఎరనే వేశానని మనసులో అనుకున్నాడు.

2 పైన చెప్పినదాన్ని మనసులో ఉంచుకుని, సా.శ.పూ. 1473లో ఏమి జరిగిందో చూడండి. ఇశ్రాయేలీయులు వాగ్దానదేశపు సరిహద్దుల దగ్గర మోయాబు మైదానంలో ఉన్నారు. ఆ సమయంలో బిలాము అనే వ్యక్తి దేవుని ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ఒక ఎర వేశాడు. దేవుని ప్రవక్తనని చెప్పుకున్నా నిజానికి అతడు ఇశ్రాయేలీయులను శపించడానికి డబ్బుకు అమ్ముడుపోయిన దురాశాపరుడు. అయితే యెహోవా కలుగజేసుకోవడంతో బిలాము వారిని శపించే బదులు ఆశీర్వదించాడు. బాలాకు ఇస్తానన్న సొమ్మును ఎలాగైనా చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో బిలాము ఒక ఎత్తువేశాడు. ఇశ్రాయేలీయులతో ఘోరమైన పాపం చేయించగలిగితే దేవుడే వాళ్లను శిక్షిస్తాడని అనుకున్నాడు. ఆ కుయుక్తితోనే బిలాము అందమైన మోయాబు స్త్రీలను ఎరగా పెట్టాడు.—సంఖ్యాకాండము 22:1-7; 31:15, 16; ప్రకటన 2:14.

3. బిలాము వ్యూహం వల్ల ఎంత నష్టం జరిగింది?

3 ఈ వ్యూహం ఫలించిందా? ఒకరకంగా అవుననే చెప్పవచ్చు. వేలమంది ఇశ్రాయేలీయులు అతని గాలానికి చిక్కి ‘మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేశారు.’ సంతాన సాఫల్య దేవుడైన బయల్పెయోరునే కాదు మోయాబీయుల ఇతర దేవతలను కూడా ఆరాధించడం మొదలుపెట్టారు. ఫలితంగా వాగ్దానదేశంలోకి ఇక ప్రవేశిస్తారనగా 24,000 మంది ఇశ్రాయేలీయులు నాశనమయ్యారు. అదెంత విషాదకరం!—సంఖ్యాకాండము 25:1-9.

4. వేలాదిమంది ఇశ్రాయేలీయులు వ్యభిచారం అనే ఎరకు ఎందుకు చిక్కారు?

4 అంతటి ఘోరం ఎందుకు జరిగింది? ఎందుకంటే, తమను ఐగుప్తు నుండి విడిపించి, అరణ్యంలో పోషించి, వాగ్దానదేశం వరకు సురక్షితంగా తీసుకొచ్చిన యెహోవాకు దూరమై చాలామంది చెడుగా ఆలోచించడం మొదలుపెట్టారు. (హెబ్రీయులు 3:12) ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “వారివలె మనము వ్యభిచరింపక యుందము; వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక్కదినముననే యిరువది మూడువేలమంది కూలిరి.” a1 కొరింథీయులు 10:8.

5, 6. మోయాబు మైదానంలో ఇశ్రాయేలీయులు చేసిన పాపం గురించిన వృత్తాంతం నేడు మనకెందుకు ప్రాముఖ్యం?

5 గొప్ప వాగ్దానదేశంలోకి అంటే నూతనలోకంలోకి ప్రవేశించబోయే నేటి దేవుని ప్రజలకు సంఖ్యాకాండములోని వృత్తాంతంలో ఎన్నో ప్రాముఖ్యమైన పాఠాలు ఉన్నాయి. (1 కొరింథీయులు 10:11) ఉదాహరణకు, నేటి ప్రజలు పూర్వకాలంలోని మోయాబీయులకన్నా ఎక్కువే కామతప్తులైపోయారు. ఇశ్రాయేలీయుల్లాగే నేడు కూడా ప్రతీసంవత్సరం వేలాదిమంది క్రైస్తవులు లైంగిక దుర్నీతికి పాల్పడుతున్నారు. (2 కొరింథీయులు 2:11) ఆ కాలంలో మిద్యాను స్త్రీని పాళెంలోని తన గుడారంలోకి ధైర్యంగా తీసుకెళ్లిన జిమ్రీ, ఇతర ఇశ్రాయేలీయులపై చెడు ప్రభావం చూపించినట్లే, నేడు కూడా క్రైస్తవ సంఘంలోని కొంతమంది సంఘంపై చెడు ప్రభావం చూపిస్తున్నారు.—సంఖ్యాకాండము 25:6, 14; యూదా 4.

6 మోయాబు మైదానంలో ఇశ్రాయేలీయులున్న పరిస్థితిల్లోనే ప్రస్తుతం మీరూ ఉన్నారని మీకు తెలుసా? మీరు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న బహుమానం అంటే, త్వరలోనే అడుగుపెట్టబోయే నూతనలోకం మీ కళ్లముందు కనిపిస్తోందా? అలాగైతే, దేవుని ప్రేమలో నిలిచివుండడం కోసం ‘జారత్వానికి దూరంగా పారిపోవడానికి’ మీ శాయశక్తులా కృషి చేయండి.—1 కొరింథీయులు 6:18.

మోయాబు మైదానం

జారత్వం అంటే ఏమిటి?

7, 8. (ఎ) “జారత్వం” అంటే ఏమిటి? (బి) దానికి పాల్పడేవారు తాము విత్తినదాన్ని ఎలా కోస్తారు?

7 బైబిల్లో ‘జారత్వం’ (గ్రీకులో పోర్నియా) అనే పదం, లేఖన విరుద్ధమైన అక్రమ లైంగిక సంబంధాలను సూచిస్తుంది. వ్యభిచారం, వేశ్యావృత్తి, అవివాహితుల మధ్య లైంగిక సంబంధాలు, ముఖరతి, ఆసన సంభోగము, వివాహజత కాని వ్యక్తి మర్మాంగాలను స్పర్శిస్తూ ఉద్రేకపరిచి తృప్తి పొందడం వంటివి కూడా జారత్వమే అవుతుంది. అంతేకాదు, సలింగ సంయోగం, జంతు సంయోగం కూడా జారత్వమే. b

8 జారత్వం చేసేవారు క్రైస్తవ సంఘంలో కొనసాగలేరని, వారికి నిత్యజీవం దొరకదని బైబిలు నిక్కచ్చిగా చెబుతోంది. (1 కొరింథీయులు 6:9; ప్రకటన 22:15) అంతేకాదు, ప్రస్తుత జీవితంలో కూడా ఇతరులు వాళ్లను నమ్మరు, ఆత్మగౌరవాన్ని పోగొట్టుకుంటారు, మనస్సాక్షి వేధిస్తుంది, కుటుంబంలో సమస్యలొస్తాయి. అవాంఛిత గర్భధారణ, వ్యాధుల వంటి సమస్యలు రావడమేకాక చివరికి చనిపోవాల్సి రావచ్చు కూడా. (గలతీయులు 6:7, 8 చదవండి.) కోరికోరి అంతటి విషాదం కొనితెచ్చుకోవడం ఎందుకు? సాధారణంగా ఆ సమస్యలన్నింటికీ మూలం అశ్లీల చిత్రాలను చూడడమే. విచారకరంగా చాలామంది ఆ విషయాన్ని అర్థంచేసుకోకుండా ఆ ఎరకు చిక్కుతున్నారు.

అశ్లీల చిత్రాలను చూడడం లైంగిక దుర్నీతికి దారితీస్తుంది

9. కొందరు అనుకుంటున్నట్లు అశ్లీల చిత్రాలను చూడడంలో ఎలాంటి హాని లేదా? వివరించండి.

9 చాలా దేశాల్లోని వార్తాపత్రికల్లో, సంగీతంలో, టీవీలో అశ్లీలత చూపించబడుతోంది. ఇక ఇంటర్నెట్‌లోనైతే చెప్పనక్కర్లేదు. c కొందరు అనుకుంటున్నట్లు అశ్లీల చిత్రాలను చూడడంలో ఎలాంటి హాని లేదా? ఖచ్చితంగా ఉంది. అశ్లీల చిత్రాలు చూసేవారు హస్తప్రయోగానికి అలవాటుపడొచ్చు, తమ మనసుల్లో “తుచ్ఛమైన అభిలాషలకు” చోటిస్తూ కామతప్తులవ్వచ్చు. అంతేకాదు కుటుంబంలో తీవ్రమైన సమస్యలు తలెత్తి విడాకులు తీసుకునే పరిస్థితి రావచ్చు. d (రోమీయులు 1:24-27; ఎఫెసీయులు 4:19) ఒక పరిశోధకుడు విపరీతమైన లైంగిక వాంఛను క్యాన్సర్‌తో పోల్చాడు. “అది క్యాన్సర్‌లాగే పెరుగుతూ ఉంటుంది. అది మానదు, దాన్ని నయం చేయడం చాలా కష్టం” అని ఆయన అన్నాడు.

అందరికి కనిపించే దగ్గరే ఇంటర్నెట్‌ వాడడం తెలివైన పని

10. యాకోబు 1:14, 15 వచనాల్లోని సూత్రాన్ని మనం ఎలా అన్వయించుకోవచ్చు? ( 115వ పేజీలోని బాక్సును కూడా చూడండి.)

10 యాకోబు 1:14, 15 వచనాల్లో ఏముందో చూడండి: “ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడినవాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.” చెడు ఆలోచన రాగానే దాన్ని వెంటనే తీసేయండి. ఉదాహరణకు, అనుకోకుండా అశ్లీలమైనది ఏదైనా కనిపిస్తే వెంటనే తల తిప్పుకోండి లేదా కంప్యూటర్‌ ఆపు చేయండి లేదా టీవీ ఛానల్‌ మార్చండి. లైంగిక వాంఛ అధికమై మీరు పాపానికి ఒడిగట్టకముందే ఏమి చేసైనా దానిని తొలగించుకోండి.—మత్తయి 5:29, 30 చదవండి.

11. చెడు ఆలోచనలను తీసేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, మనకు యెహోవాపై నమ్మకం ఉందని ఎలా చూపించవచ్చు?

11 అందుకే, మన గురించి మనకన్నా బాగా తెలిసిన యెహోవా మనల్నిలా ప్రోత్సహిస్తున్నాడు: “భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపి వేయుడి.” (కొలొస్సయులు 3:5) అలా చేయడం కష్టమే. అయితే ప్రేమ, సహనంగల పరలోక తండ్రిని వేడుకుంటే ఆయన మనకు తప్పక సహాయం చేస్తాడని గుర్తుంచుకోండి. (కీర్తన 68:19) కాబట్టి, చెడు ఆలోచన వచ్చిన తక్షణమే ఆయనకు ప్రార్థించండి. ‘బలాధిక్యం’ కోసం ప్రార్థించి వేరే విషయాల గురించి ఆలోచించడానికి ప్రయత్నించండి.—2 కొరింథీయులు 4:7; 1 కొరింథీయులు 9:27; 118వ పేజీలోవున్న “ దురలవాటును నేనెలా మానుకోవచ్చు?” అనే బాక్సు చూడండి.

12. ‘హృదయం’ అంటే ఏమిటి, దాన్నెందుకు కాపాడుకోవాలి?

12 “నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము” అని జ్ఞానియైన సొలొమోను రాశాడు. (సామెతలు 4:23) మన ‘హృదయం’ అంటే మన అంతరంగం. దేవుడు దాన్నే చూస్తాడు. కాబట్టి, మనం పైకి ఎలా ఉన్నామనే దాన్నిబట్టి కాదుగానీ మన ‘హృదయం’ ఎలా ఉందనే దాన్నిబట్టే దేవుడు మనకు నిత్యజీవం ఇవ్వాలో వద్దో నిర్ణయిస్తాడు. అది చిన్న విషయంగానే కనిపించవచ్చు గానీ ప్రాణాలకే ముప్పు తీసుకొస్తుంది. తప్పుడు ఉద్దేశాలతో స్త్రీలవైపు చూడకూడదనుకొని యోబు తన కళ్లతో నిబంధన చేసుకున్నాడు. (యోబు 31:1) ఎంత చక్కని మాదిరి! అదే ఉద్దేశంతో కీర్తనకర్త ఇలా ప్రార్థించాడు: “వ్యర్థమైనవాటిని చూడకుండ నా కన్నులు త్రిప్పి వేయుము.”—కీర్తన 119:37.

దీనా సరైన స్నేహితుల్ని ఎంచుకోలేదు

13. దీనా ఎవరు, ఆమె స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో తెలివితక్కువగా ప్రవర్తించిందని ఎందుకు చెప్పవచ్చు?

13 మనం 3వ అధ్యాయంలో చూసినట్లుగా, స్నేహితులు మనపై మంచి ప్రభావం చూపించవచ్చు లేదా చెడు ప్రభావం చూపించవచ్చు. (సామెతలు 13:20; 1 కొరింథీయులు 15:33 చదవండి.) ఉదాహరణకు, పితరుడైన యాకోబు కుమార్తె దీనా విషయమే తీసుకోండి. తల్లిదండ్రులు ఆమెను చక్కగా పెంచినా, ఆమె తెలివితక్కువగా కనాను అమ్మాయిలతో స్నేహం చేసింది. మోయాబీయుల్లాగే కనానీయులు కూడా దుర్నీతిపరులే. (లేవీయకాండము 18:6-25) కుటుంబంలో ‘ఘనుడైన’ షెకెముతోసహా కనానీయులందరూ, దీనా కనానులోని ఇతర అమ్మాయిల్లాగే లైంగిక సంబంధాలు పెట్టుకోవడానికి ఒప్పుకుంటుంది అనుకున్నారు.—ఆదికాండము 34:18, 19.

14. దీనా చెడు స్నేహితులను ఎంచుకోవడం ఎలాంటి విషాదానికి దారితీసింది?

14 షెకెమును చూసినప్పుడు దీనా బహుశా అతనితో లైంగిక సంబంధాలు పెట్టుకోవాలని అనుకునివుండదు. అయితే, నచ్చిన అమ్మాయితో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం సహజమని కనానీయుల్లోని చాలామంది అనుకునేవారు. షెకెము కూడా అలాగే అనుకున్నాడు. అతను బలవంతంగా ఆమెతో ‘శయనించి’ ఆమెను ‘అవమానపర్చాడు.’ చివరి క్షణంలో దీనా ఎదిరించినా ఎలాంటి ప్రయోజనం ఉండేది కాదు. ఆ తర్వాత అతను ఆమెను ‘ప్రేమించాడు.’ కానీ అప్పటికే పరిస్థితి చేదాటిపోయింది. (ఆదికాండము 34:1-4 చదవండి.) అయితే, దీనాకు మాత్రమే నష్టం జరగలేదు. ఆమె చెడు స్నేహితులను ఎంచుకోవడంవల్ల కొన్ని ఘోరమైన సంఘటనలు జరిగి, చివరికి ఆమె కుటుంబమంతా అవమానానికి గురై నిందలపాలైంది.—ఆదికాండము 34:7, 25-31; గలతీయులు 6:7, 8.

15, 16. మనం నిజమైన జ్ఞానాన్ని ఎలా సంపాదించుకోవచ్చు? ( 124వ పేజీలోని బాక్సు చూడండి.)

15 దీనా విషయంలో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అయింది. అయితే, యెహోవాను ప్రేమించి ఆయనకు లోబడేవారు అలాంటి చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, వారు దేవుని మాటకు లోబడి ‘జ్ఞానుల సహవాసం చేస్తారు.’ (సామెతలు 13:20ఎ) అలా వారు “ప్రతి సన్మార్గమును” గ్రహించి అనవసరంగా సమస్యల్ని కొనితెచ్చుకోరు.—సామెతలు 2:6-9; కీర్తన 1:1-3.

16 దైవిక జ్ఞానం పొందాలనే కోరిక ఉండడమేకాక, దానికోసం క్రమంగా ప్రార్థిస్తూ, దేవుని వాక్యాన్ని, నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు ఇచ్చే సమాచారాన్ని క్రమంగా చదివే వారందరికీ అది లభిస్తుంది. (మత్తయి 24:45; యాకోబు 1:5) అలాగే, వినయం కూడా ప్రాముఖ్యం. అది ఉంటే మనం బైబిలు నుండి ఇవ్వబడే ఉపదేశాన్ని అంగీకరిస్తాం. (2 రాజులు 22:18, 19) ఉదాహరణకు, ఒక క్రైస్తవుడు తన హృదయం మోసకరమైనదని, ఘోరమైన వ్యాధికలదని ఒప్పుకోవచ్చు. (యిర్మీయా 17:9) అయితే, ఎప్పుడైనా ఆయనకు ప్రేమతో ఉపదేశం ఇవ్వబడితే దానిని ఆయన వినయంతో స్వీకరిస్తాడా?

17. కుటుంబంలో తలెత్తగల ఒక సన్నివేశం చెప్పండి, ఒక తండ్రి తన కూతురుతో ఎలా తర్కించవచ్చో వివరించండి.

17 ఈ సన్నివేశాన్ని ఊహించుకోండి. ఒక తండ్రి తన కూతుర్ని, ఒంటరిగా ఒక క్రైస్తవ యువకునితో కలిసి బయటికి వెళ్లొద్దు అన్నాడు. అప్పుడామె, “నామీద మీకు నమ్మకం లేదా? మేమేం తప్పు చేయం” అని అంటుంది. ఆమెకు యెహోవాపట్ల ప్రేమ ఉండవచ్చు, ఆమెకు మంచి ఆలోచనలే ఉండవచ్చు. కానీ, ఆమె ‘దైవిక జ్ఞానంతో ప్రవర్తిస్తోందా’? ‘జారత్వానికి దూరంగా’ ఉంటోందా? లేక ఆమె అవివేకంగా ‘తన మనస్సునే నమ్ముతుందా’? (సామెతలు 28:26) మంచిచెడులు ఆలోచించి సరైన నిర్ణయానికి రావడానికి వారికి ఇంకా ఏయే సూత్రాలు సహాయం చేస్తాయో మీరు ఆలోచించవచ్చు.—సామెతలు 22:3; మత్తయి 6:13; 26:41 చూడండి.

యోసేపు జారత్వానికి దూరంగా పారిపోయాడు

18, 19. యోసేపుకు ఎలాంటి శోధన ఎదురైంది? దాని విషయంలో ఆయనేమి చేశాడు?

18 దీనా తమ్ముడైన యోసేపు, దేవున్ని ప్రేమించి జారత్వానికి దూరంగా పారిపోయాడు. (ఆదికాండము 30:20-24) వాళ్ల అక్క అవివేకంగా ప్రవర్తించడం వల్ల వచ్చిన పర్యవసానాల్ని యోసేపు కళ్లారా చూశాడు. ఆయన ఆ విషయాల్ని గుర్తుంచుకుని, దేవుని ప్రేమలో నిలిచివుండాలని కోరుకున్నందువల్లే, ఎన్నో సంవత్సరాల తర్వాత ఐగుప్తులో బానిసగా ఉన్నప్పుడు తప్పు చేయకుండా ఉండగలిగాడు. అక్కడ ఆయన యజమాని భార్య “దినదినము” అతన్ని లొంగదీసుకోవడానికి ప్రయత్నించింది. యోసేపును వాళ్ల యజమాని బానిసగా కొనుక్కున్నాడు కాబట్టి తనకు ఇష్టం వచ్చినప్పుడు వెళ్లిపోయే స్వాతంత్ర్యం ఆయనకు లేదు. కాబట్టి ఆయన జ్ఞానంతో, ధైర్యంతో ప్రవర్తించాలి. అందుకే పోతీఫరు భార్య ఎన్నిసార్లు శోధించినా ఏ మాత్రం లొంగకపోగా ఆమె నుండి దూరంగా పారిపోయాడు.—ఆదికాండము 39:7-12 చదవండి.

19 ఒకసారి ఆలోచించండి. ఒకవేళ యోసేపు ఆమె గురించే ఆలోచిస్తూ ఊహాలోకాల్లో విహరించివుంటే దేవునికి యథార్థంగా ఉండగలిగేవాడా? లేదు. యోసేపు చెడుగా ఆలోచించే బదులు యెహోవాతో తనకున్న సంబంధం గురించి ఆలోచించి అదే ప్రాముఖ్యం అనుకున్నాడు. ఆ విషయం పోతీఫరు భార్యతో ఆయన అన్న ఈ మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది: “నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నా కప్పగింపక యుండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును?”—ఆదికాండము 39:8, 9.

20. యోసేపు విషయంలో యెహోవా పరిస్థితులను ఎలా మలుపుతిప్పాడు?

20 కుటుంబానికి దూరంగా ఉన్నా ఏ రోజూ పాపం చేయని యోసేపును చూసి యెహోవా ఎంత సంతోషించివుంటాడో ఊహించండి! (సామెతలు 27:11) ఆ తర్వాత, యోసేపు చెరనుండి విడుదలై ఐగుప్తులో ప్రధానాధికారిగా, ధాన్యాగార అధిపతిగా నియమించబడేలా యెహోవా పరిస్థితులను మలుపుతిప్పాడు. (ఆదికాండము 41:39-49) “యెహోవాను ప్రేమించువారలారా, చెడుతనమును అసహ్యించుకొనుడి తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు భక్తిహీనుల చేతిలోనుండి ఆయన వారిని విడిపించును” అని చెబుతున్న కీర్తన 97:10 వచనంలోని మాటలు ఎంత నిజమో కదా!

21. ఆఫ్రికాలోని ఒక యువ సహోదరుడు లైంగిక శోధనను ఎలా ధైర్యంగా ఎదిరించాడు?

21 అదే విధంగా నేడు కూడా, దేవుని సేవకుల్లోని చాలామంది ‘కీడును ద్వేషించి మేలును ప్రేమిస్తున్నామని’ చూపిస్తున్నారు. (ఆమోసు 5:15) ఆఫ్రికాలోని ఒక యువ సహోదరుడు తనకు ఎదురైన ఒక సంఘటన గురించి చెప్పాడు. లెక్కల పరీక్షలో సహాయం చేస్తే అతనితో సెక్స్‌లో పాల్గొంటానని ఒక అమ్మాయి చెప్పింది. “నేను దానికి అస్సలు ఒప్పుకోలేదు. దేవునికి యథార్థంగావుండి నా ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నాను, అది వెండి బంగారాలకన్నా ఎంతో విలువైనది” అని ఆ సహోదరుడు చెప్పాడు. నిజమే అలాంటి పాపం మనకు “అల్పకాల” సంతోషాన్నిచ్చినా ఆ తర్వాత జీవితంలో దుఃఖాన్నే మిగులుస్తుంది. (హెబ్రీయులు 11:24, 25) యెహోవాకు విధేయత చూపించడం వల్ల కలిగే సంతోషంతో పోలిస్తే ఆ క్షణికానందం ఎందుకూ పనికి రాదు.—సామెతలు 10:22.

కృపగల దేవుని సహాయాన్ని స్వీకరించండి

22, 23. (ఎ) ఒక క్రైస్తవుడు ఘోరమైన పాపం చేస్తే ఆయనకు క్షమాపణ ఉంటుందని ఎందుకు చెప్పవచ్చు? (బి) పాపం చేసిన వ్యక్తికి ఎలాంటి సహాయం ఉంది?

22 మనం అపరిపూర్ణులం కాబట్టి శరీర కోరికలను అణచుకొని దేవుని దృష్టిలో సరైనది చేయడం మనకు కష్టమవుతుంది. (రోమీయులు 7:21-25) యెహోవాకు “మనము మంటివారమని” తెలుసు. (కీర్తన 103:14) ఒక క్రైస్తవుడు ఏదైనా ఘోరమైన పాపం చేస్తే, ఆయనకు ఇక క్షమాపణ ఉండదా? ఉంటుంది. కానీ కొన్నిసార్లు తప్పుచేసిన ఆ వ్యక్తి దావీదులాగే విషాదకరమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే పరితాపంతో తమ పాపాల్ని ‘ఒప్పుకునేవారిని’ ‘క్షమించడానికి’ దేవుడు ఎల్లప్పుడూ ‘సిద్ధంగా’ ఉంటాడు.—కీర్తన 86:5; యాకోబు 5:16; సామెతలు 28:13 చదవండి.

23 అంతేకాక దేవుడు ప్రేమతో మనకు క్రైస్తవ సంఘంలో “మనుష్యులకు ఈవులను” అంటే పరిణతిగల, అర్హులైన కాపరులను అనుగ్రహించాడు. వాళ్ళు మనకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. (ఎఫెసీయులు 4:8, 12; యాకోబు 5:14, 15) పాపం చేసిన వ్యక్తి దేవునితో తన సంబంధాన్ని తిరిగి నెలకొల్పుకోవడానికి సహాయం చేయడమే వారి ముఖ్యోద్దేశం. అంటే, ఆ వ్యక్తి మళ్ళీ పాపం చేయకుండా ‘వివేకంగా’ ప్రవర్తించడానికి వారు సహాయం చేస్తారు.—సామెతలు 15:32.

‘బుద్ధి సంపాదించుకోండి’

24, 25. (ఎ) సామెతలు 7:6-23 వచనాల్లో వర్ణించబడిన యౌవనుడు “బుద్ధిలేని” వాడని ఎందుకు చెప్పవచ్చు? (బి) మనమెలా ‘బుద్ధి సంపాదించుకోవచ్చు?’

24 “బుద్ధిలేని” వాళ్ళ గురించి, ‘బుద్ధి సంపాదించుకునే’ వారి గురించి బైబిలు మాట్లాడుతోంది. (సామెతలు 7:7) “బుద్ధిలేని” వ్యక్తికి, దేవుని ఆలోచనా విధానం పూర్తిగా అర్థం కాదు, పైగా దేవుని సేవలో ఎక్కువ అనుభవం ఉండదు కాబట్టి వివేకంగా ప్రవర్తించలేకపోవచ్చు, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవచ్చు. అతడు, సామెతలు 7:6-23 వచనాల్లో వర్ణించబడిన యౌవనుడిలాగే ఘోరమైన పాపం చేసే ప్రమాదం ఉంది. అయితే “బుద్ధి సంపాదించుకొనువాడు” ప్రార్థనాపూర్వకంగా ప్రతిరోజూ బైబిలు చదువుతూ తన హృదయాన్ని పరీక్షించుకుంటాడు. అపరిపూర్ణుడైనా సాధ్యమైనంతవరకు ఆయన తన ఆలోచనల్ని, కోరికల్ని, భావోద్వేగాల్ని, లక్ష్యాల్ని దేవుడు ఇష్టపడేవిధంగా మలచుకుంటాడు. అలా చేస్తే ఆయన ‘ప్రాణానికి ఉపకారం’ జరుగుతుంది అంటే ఆశీర్వదించబడతాడు, ఆయనకు “మేలు” జరుగుతుంది.—సామెతలు 19:8.

25 ‘దేవుని ప్రమాణాలు సరైనవని నేను పూర్తిగా నమ్ముతున్నానా? వాటిని పాటిస్తే నేను సంతోషంగా ఉంటాననే నమ్మకం నాకుందా?’ అని ప్రశ్నించుకోండి. (కీర్తన 19:7-10; యెషయా 48:17, 18) మీకు కించిత్తు సందేహం ఉన్నా వెంటనే దాన్ని తీర్చుకోండి. దేవుని నియమాలను పాటించకపోతే వచ్చే పర్యవసానాల గురించి ఆలోచించండి. సత్యమైన, మాన్యమైన, న్యాయమైన, పవిత్రమైన, రమ్యమైన, ఖ్యాతిగల విషయాల గురించి ఆలోచిస్తూ, సత్య మార్గంలో నడుస్తూ ‘యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి.’ (కీర్తన 34:8; ఫిలిప్పీయులు 4:8, 9) వాటిని చేయడానికి మీరెంతగా ప్రయత్నిస్తే దేవునికి అంతగా దగ్గరై, ఆయన ప్రేమించేవాటిని ప్రేమిస్తూ, ఆయన ద్వేషించేవాటిని ద్వేషిస్తారు. పరిపూర్ణుడు కాకపోయినా యోసేపు చిన్నప్పటినుండి యెహోవా చెప్పినట్లే నడుచుకుంటూ ఆయనను సంతోషపెట్టాలనుకున్నాడు కాబట్టే ‘జారత్వానికి దూరంగా పారిపోయాడు.’ మీరూ అలాగే చేయాలని మా కోరిక.—యెషయా 64:8.

26. తర్వాతి అధ్యాయాల్లో ఏ ప్రాముఖ్యమైన విషయాన్ని పరిశీలిస్తాం?

26 భార్యాభర్తలు లైంగిక తృప్తి పొందడానికి, పిల్లల్ని కనడానికే దేవుడు మర్మాంగాలను సృష్టించాడు గానీ విచ్ఛలవిడిగా శరీరేచ్ఛలను తీర్చుకోవడానికి కాదు. (సామెతలు 5:18) దేవుని దృష్టిలో వివాహం ఎంత పవిత్రమైనదో తర్వాతి రెండు అధ్యాయాల్లో చూద్దాం.

a సంఖ్యాకాండములో, న్యాయాధిపతులు హతమార్చిన దాదాపు 1,000 మంది ‘అధిపతులతో’ సహా యెహోవా శిక్షించినవారి గురించి కూడా ప్రస్తావించబడిందని తెలుస్తోంది.—సంఖ్యాకాండము 25:4, 5.

b అపవిత్రత, దుష్కామ ప్రవర్తన అంటే ఏమిటో తెలుసుకోవడానికి యెహోవాసాక్షులు ప్రచురించిన కావలికోట జూలై 15, 2006లో “పాఠకుల ప్రశ్నలు” చూడండి.

c ఇక్కడ “అశ్లీలత” అనే మాట లైంగికంగా ఉద్రేకపర్చడానికి ఉద్దేశించిన చిత్రాలను, పుస్తకాలను, టెలిఫోను సంభాషణను సూచిస్తుంది. కామోద్రేకం కలిగించే ఫోటోలు, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది పాల్గొనే విపరీతమైన లైంగిక చర్యలను చూపించే చిత్రాల్లాంటివి ఏవైనా అశ్లీలత క్రిందికే వస్తాయి.

d హస్తప్రయోగం అనే అంశం గురించి అనుబంధంలోని 249-251 పేజీలు చూడండి.