కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

8వ అధ్యాయం

పరిశుద్ధంగా ఉండే ప్రజల్ని దేవుడు ప్రేమిస్తాడు

పరిశుద్ధంగా ఉండే ప్రజల్ని దేవుడు ప్రేమిస్తాడు

‘పరిశుద్ధంగా ఉండేవారియెడల నీవు పరిశుద్ధంగా ఉంటావు.’—కీర్తన 18:26, NW.

1-3. (ఎ) ఒక తల్లి వాళ్ళబ్బాయిని శుభ్రంగా, చక్కగా ఎందుకు తయారుచేస్తుంది? (బి) తన ఆరాధకులు పరిశుద్ధంగా ఉండాలని యెహోవా ఎందుకు కోరుతున్నాడు? (సి) మనం ఎందుకు పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటాం?

 ఒక తల్లి వాళ్ల అబ్బాయిని బయటకు తీసుకువెళ్లడానికి తయారుచేస్తోంది. వాడికి శుభ్రంగా స్నానం చేయించి, చక్కగా ఉతికి ఇస్త్రీ చేసిన బట్టలు వేసింది. వాళ్ల బాబు ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రత ప్రాముఖ్యమని ఆమెకు తెలుసు. అంతేకాదు, వాడు నీటుగా కనబడితే తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుందని కూడా ఆమెకు తెలుసు.

2 అలాగే, మన పరలోక తండ్రియైన యెహోవా కూడా తన సేవకులు పరిశుద్ధంగా ఉండాలని ఆశిస్తున్నాడు. అందుకే ఆయన వాక్యంలో, ‘పరిశుద్ధంగా ఉండేవారియెడల నీవు పరిశుద్ధంగా ఉంటావు’ అని ఉంది. a (కీర్తన 18:26, NW) యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడు, పరిశుద్ధంగా ఉండడం మనకు మేలు చేస్తుందని ఆయనకు తెలుసు. ఆయన సాక్షులుగా ఉన్న మనం పరిశుద్ధంగా ఉంటూ తనకు మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాడు. నిజానికి మనం కనబడే తీరు, మంచి ప్రవర్తన యెహోవా దేవుని పవిత్ర నామాన్ని ఘనపరుస్తుందే తప్ప ఆయనకు చెడ్డ పేరు తీసుకురాదు.—యెహెజ్కేలు 36:22; 1 పేతురు 2:12 చదవండి.

3 పరిశుద్ధంగా ఉండే ప్రజల్ని దేవుడు ప్రేమిస్తాడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. మనం యెహోవాను ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయనకు మంచి పేరు తీసుకువచ్చేలా జీవించాలని కోరుకుంటాం. మనమాయన ప్రేమలో నిలిచివుండాలని కూడా కోరుకుంటాం. కాబట్టి మనం ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండడం అంటే ఏమిటి, ఎలా పరిశుద్ధంగా ఉండవచ్చు అనే విషయాలను పరిశీలిద్దాం. అప్పుడు మనం ఏయే విషయాల్లో మార్పులు చేసుకోవాలో తెలుసుకోగలుగుతాం.

మనం ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి?

4, 5. (ఎ) మనం పరిశుద్ధంగా ఉండడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటి? (బి) యెహోవా పరిశుద్ధుడు అనే విషయం సృష్టిలో ఎలా తెలుస్తోంది?

4 యెహోవా మనకు తన మాదిరి ద్వారా బోధిస్తాడు, అందుకే ఆయన వాక్యం “దేవునిపోలి నడుచుకొనుడి” అని మనల్ని ప్రోత్సహిస్తుంది. (ఎఫెసీయులు 5:1) మనమెందుకు పరిశుద్ధంగా ఉండాలనేదానికి ఒక ముఖ్య కారణమేమిటంటే, మనం ఆరాధించే యెహోవా అన్ని విషయాల్లో పరిశుద్ధుడు, పవిత్రుడు.—లేవీయకాండము 11:44, 45 చదవండి.

5 యెహోవాకున్న అనేక లక్షణాల్లాగే ఆయన పరిశుద్ధత కూడా సృష్టిలో కనిపిస్తుంది. (రోమీయులు 1:20) మానవులు నివసించడానికి భూమిని చేసి అది ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా తయారయ్యేలా రూపొందించాడు. ఉదాహరణకు, ఎప్పటికప్పుడు నీటిని, గాలిని శుభ్రం చేసే ప్రక్రియల్ని పర్యావరణంలో ఏర్పాటు చేశాడు. కొన్ని రకాల సూక్ష్మక్రిములు చెత్తను ఎరువుగా మారుస్తాయి. దీన్నిబట్టి చూస్తే ‘భూమిని సృష్టించిన’ దేవునికి పరిశుభ్రత ఎంత ప్రాముఖ్యమో తెలుస్తోంది. (యిర్మీయా 10:12) అందుకే మనమూ దానికి ప్రాముఖ్యతనివ్వాలి.

6, 7. యెహోవాను ఆరాధించేవారు పరిశుభ్రంగా ఉండాలనే విషయాన్ని మోషే ధర్మశాస్త్రం ఎలా నొక్కిచెప్పింది?

6 మరో కారణం చూద్దాం. సర్వోన్నత పరిపాలకుడైన యెహోవా తన ఆరాధకులు పరిశుద్ధంగా ఉండాలని కోరుతున్నాడు కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలి. ఇశ్రాయేలీయులకు యెహోవా ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం పరిశుభ్రంగా ఉండడానికి, ఆరాధనకు చాలా దగ్గరి సంబంధం ఉంది. ప్రాయశ్చిత్తార్థ దినమున ప్రధానయాజకుడు ఒకసారి కాదుగానీ రెండుసార్లు స్నానం చేయాలని ధర్మశాస్త్రం స్పష్టం చేసింది. (లేవీయకాండము 16:4, 23, 24) యెహోవాకు బలులు అర్పించేముందు యాజకులు చేతులు, కాళ్ళు కడుగుకోవాలి. (నిర్గమకాండము 30:17-21; 2 దినవృత్తాంతములు 4:6) ఇశ్రాయేలీయులను అపవిత్రుల్ని చేసే కనీసం 70 కారణాల్ని ధర్మశాస్త్రం పేర్కొంది. అలా అపవిత్రులైన వాళ్లు ఆరాధనలో పాల్గొనకూడదు, అలా పాల్గొంటే వాళ్లకు మరణశిక్ష పడేది. (లేవీయకాండము 15:31) పాపశుద్ధి కోసం వాళ్లు స్నానం చేయడం, బట్టలు ఉతుక్కోవడం వంటివి చేయకపోతే కూడా మరణశిక్ష విధించబడేది.—సంఖ్యాకాండము 19:17-20.

7 మనమిప్పుడు మోషే ధర్మశాస్త్రాన్ని పాటించకపోయినా కొన్ని విషయాల్లో దేవుని ఇష్టాయిష్టాలేంటో దానినుండి మనకు తెలుస్తుంది. దేవుని ఆరాధకులు పరిశుభ్రంగా ఉండాలనే విషయాన్ని అది నొక్కిచెప్పింది. యెహోవా మారలేదు. (మలాకీ 3:6) నేడు కూడా మన ఆరాధన ‘పవిత్రంగా నిష్కళంకంగా’ ఉంటేనే ఆయన దాన్ని అంగీకరిస్తాడు. (యాకోబు 1:27) కాబట్టి మనం తననెలా ఆరాధించాలని ఆయన చెబుతున్నాడో తెలుసుకోవాలి.

దేవుని ఎదుట పరిశుద్ధంగా ఉండడమంటే ఏమిటి?

8. మనం ఏయే విషయాల్లో పరిశుద్ధంగా ఉండాలని యెహోవా కోరుతున్నాడు?

8 బైబిలు ప్రకారం దేవుని ఎదుట పరిశుద్ధంగా ఉండడమంటే కేవలం శారీరక పరిశుభ్రత మాత్రమే కాదు, మన జీవితంలోని ప్రతీ విషయంలో పరిశుద్ధంగా ఉండాలని అర్థం. మనం ముఖ్యంగా నాలుగు విషయాల్లో అంటే ఆరాధన, నైతిక, మానసిక, శారీరక విషయాల్లో పవిత్రంగా ఉండాలి. వాటినిప్పుడు ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం.

9, 10. మన ఆరాధన పవిత్రంగా ఉండడమంటే అర్థమేమిటి? నిజ క్రైస్తవులు వేటికి దూరంగా ఉంటారు?

9 ఆరాధన పవిత్రంగా ఉండాలి. అంటే మనం సత్యారాధనను అబద్ధ ఆరాధనతో కలపకూడదు. ఇశ్రాయేలీయులు బబులోనును విడిచి యెరూషలేముకు తిరిగివస్తున్నప్పుడు దేవుడు వారికి, “అచ్చటనుండి వెళ్లుడి అపవిత్రమైన దేనిని ముట్టకుడి . . . మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి” అని చెప్పాడు. (యెషయా 52:11) వాళ్లు ముఖ్యంగా యెహోవా ఆరాధనను పునరుద్ధరించడానికే వస్తున్నారు. కాబట్టి వాళ్ల ఆరాధన పవిత్రంగా ఉండాలి. అంటే వాళ్లు దేవుణ్ణి అవమానపరిచే బబులోను మతాల్లోని బోధలకు, ఆచార వ్యవహారాలకు దూరంగా ఉండాలి.

10 నిజ క్రైస్తవులమైన మనం కూడా అబద్ధ ఆరాధనకు సంబంధించిన దేనిలోనూ పాలుపంచుకోకూడదు. (1 కొరింథీయులు 10:21 చదవండి.) అబద్ధ మతాల ప్రభావం తీవ్రంగా ఉంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా ప్రాంతాల్లో, ఆత్మ చావదు వంటి అబద్ధ బోధలతో వివిధ ఆచారాలు, మతకర్మలు ముడిపడివున్నాయి. (ప్రసంగి 9:5, 6, 10) అలాంటి మత నమ్మకాలతో చేసే ఆచారాలకు నిజ క్రైస్తవులు దూరంగా ఉంటారు. b ఇతరుల ఒత్తిడికి లొంగిపోయి బైబిలు చెప్పేదానికి విరుద్ధమైనవాటిని చేసి మనం మన ఆరాధనను అపవిత్రపరుచుకోము.—అపొస్తలుల కార్యములు 5:29.

11. నైతిక విషయాల్లో పవిత్రంగా ఉండడమంటే ఏమిటి? అలా ఎందుకు పవిత్రంగా ఉండాలి?

11 నైతిక విషయాల్లో పవిత్రంగా ఉండాలి. అంటే లైంగిక దుర్నీతికి సంబంధించిన వాటన్నిటికీ దూరంగా ఉండాలని అర్థం. (ఎఫెసీయులు 5:5 చదవండి.) మనం నైతిక విషయాల్లో పవిత్రంగా ఉండడం ప్రాముఖ్యం. తర్వాతి అధ్యాయంలో చూడబోతున్నట్లుగా, దేవుని ప్రేమలో నిలిచివుండాలంటే ‘జారత్వానికి దూరంగా పారిపోవాలి.’ పశ్చాత్తాపం చూపించని జారులు “దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.” (1 కొరింథీయులు 6:9, 10, 18) అలాంటి వాళ్ళు దేవునికి “అసహ్యులు.” వాళ్ళు నైతిక విషయాల్లో పవిత్రంగా ఉండకపోతే ‘రెండవ మరణానికి’ గురౌతారు.—ప్రకటన 21:8.

12, 13. ఆలోచనలకు, ప్రవర్తనకు సంబంధమేమిటి? మనమెలా మన ఆలోచనలను పవిత్రంగా ఉంచుకోవచ్చు?

12 ఆలోచనలు పవిత్రంగా ఉండాలి. ఆలోచనల్ని బట్టే ప్రవర్తన ఉంటుంది. మనం ఎప్పుడూ చెడు విషయాల గురించే ఆలోచిస్తే ఇప్పుడు కాకపోతే తర్వాతైనా చెడ్డ పనులు చేసే ప్రమాదం ఉంది. (మత్తయి 5:28; 15:18-20) కానీ మన ఆలోచనలు పవిత్రంగా ఉంటే మన ప్రవర్తన కూడా సరిగానే ఉంటుంది. (ఫిలిప్పీయులు 4:8 చదవండి.) మన ఆలోచనల్ని ఎలా పవిత్రంగా ఉంచుకోవాలి? దానికి ఒక మార్గం ఏమిటంటే మన ఆలోచనల్ని తప్పుదారి పట్టించే ఎలాంటి వినోదానికైనా దూరంగా ఉండాలి. c అంతేగాక దేవుని వాక్యాన్ని ప్రతీరోజు చదవడం వల్ల మన ఆలోచనల్ని పవిత్రంగా ఉంచుకోగలుగుతాం.—కీర్తన 19:8, 9.

13 దేవుని ప్రేమలో నిలిచివుండాలంటే మనం ఆరాధనాపరంగా, నైతిక, మానసిక విషయాల్లో పవిత్రంగా ఉండడం ప్రాముఖ్యం. వీటి గురించి ఈ పుస్తకంలోని ఇతర అధ్యాయాల్లో సవివరంగా చర్చించబడింది. ఇప్పుడు మనం శారీరక పరిశుభ్రత గురించి చూద్దాం.

మనమెలా శారీరక పరిశుభ్రతను పాటించవచ్చు?

14. పరిశుభ్రత వ్యక్తిగత విషయమా?

14 పరిశుభ్రత అంటే ఇంటిని, ఒంటిని శుభ్రంగా ఉంచుకోవడమని అర్థం. ఈ విషయంలో ఎవరి ఇష్టాయిష్టాలు వాళ్లవి, వేరేవాళ్లు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదనుకోవాలా? యెహోవా ఆరాధకులు అలా అనుకోరు. మనం ముందే చూసినట్లుగా మనం పరిశుభ్రంగా ఉంటామా లేదా అన్నది యెహోవాకు ప్రాముఖ్యం. ఎందుకంటే అలా పరిశుభ్రంగా ఉండడం మనకు ప్రయోజనకరమేకాక, ఆయనకు మంచి పేరు కూడా తెస్తుంది. ఈ అధ్యాయం ఆరంభంలో ప్రస్తావించబడిన పిల్లవాడి గురించి ఆలోచించండి. ఆ పిల్లవాడు ఎప్పుడూ మురికిగానే ఉంటే వాడి తల్లిదండ్రుల మీద మీకు మంచి అభిప్రాయం కలుగుతుందా? లేదు. అలాగే, మనం కనబడే తీరు వల్ల, మన జీవన శైలి వల్ల మన పరలోక తండ్రికి చెడ్డ పేరు రావాలని లేదా మనం ప్రకటించే సందేశాన్ని ప్రజలు అలక్ష్యం చేయాలని కోరుకోం. బైబిలు చెబుతున్నట్లుగా ‘మన పరిచర్య నిందింపబడకుండు నిమిత్తం ఏ విషయములోనైనా అభ్యంతరమేమీ కలుగజేయకుండా దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మనల్ని మనమే మెప్పించుకుంటాం.’ (2 కొరింథీయులు 6:3, 4, 8-10) అయితే మనం పరిశుభ్రతను ఎలా పాటించవచ్చు?

15, 16. శుభ్రత పాటించే విషయంలో ఏమి అలవాటు చేసుకోవాలి? మనం వేసుకొనే బట్టలు ఎలా ఉండాలి?

15 శారీరక శుభ్రత, కనబడే తీరు. దేశాలనుబట్టి సంస్కృతులు, జీవన పరిస్థితులు వివిధ రకాలుగా ఉన్నా, మనమూ మన పిల్లలూ శుభ్రంగా ఉండేందుకు సరిపడా నీళ్లు, సబ్బు అన్నిచోట్లా దొరుకుతాయి. ఆహారం వడ్డించేముందు, తినేముందు, పిల్లవాడిని కడిగి నాప్‌కిన్‌లు మార్చిన తర్వాత, మనం టాయ్‌లెట్‌కు వెళ్లివచ్చిన తర్వాత చేతుల్ని సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. అలా చేస్తే ప్రాణాంతక రోగాలు దరిచేరవు. హానికరమైన వైరస్‌లు, సూక్ష్మక్రిములు వ్యాపించి కలరా వంటి వ్యాధులు రావు. మరుగుదొడ్లు లేనిచోట్ల ప్రాచీన ఇశ్రాయేలీయులు చేసినట్లే మలాన్ని మట్టితో కప్పివేయాలి.—ద్వితీయోపదేశకాండము 23:12, 13.

16 బట్టల్ని కూడా ఎప్పటికప్పుడు ఉతుక్కుని, శుభ్రంగా ఉంచుకోవాలి. క్రైస్తవులు చాలా ఖరీదైన బట్టలు, స్టైలుగా ఉండే బట్టలు వేసుకోవాల్సిన అవసరం లేదు గానీ అవి మాన్యంగా, చక్కగా, శుభ్రంగా ఉండాలి. (1 తిమోతి 2:9, 10 చదవండి.) మనం ఏ దేశంలో ఉన్నా మనం కనబడే తీరు “మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించునట్లు” ఉండాలి.—తీతు 2:9, 10.

17. మన ఇల్లు, పరిసరాలు ఎందుకు శుచిగా, శుభ్రంగా ఉండాలి?

17 మన ఇల్లు, పరిసరాలు. మన ఇల్లు విలాసవంతంగా, ఆడంబరంగా లేకపోయినా మన పరిస్థితులకు తగ్గట్లు శుచిగా, శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే కూటాలకు, క్షేత్రసేవకు వెళ్ళడానికి మీరు ఉపయోగించే వాహనాన్ని సాధ్యమైనంత శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటిని, పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవడం మన దేవునికి ఘనత తెస్తుంది. ఎంతైనా మనం ప్రకటించేది యెహోవా పరిశుద్ధుడని, ‘భూమిని నశింపజేసేవారిని నాశనం చేస్తాడని,’ ఆయన తన రాజ్యం ద్వారా త్వరలోనే భూమిని పరదైసుగా మారుస్తాడనే కదా! (ప్రకటన 11:18; లూకా 23:43) కాబట్టి మన ఇల్లు, వస్తువులు శుభ్రంగా ఉంచుకుంటే రాబోయే నూతనలోకంలో జీవించడానికి అవసరమైన మంచి అలవాట్లను ఇప్పుడే అలవర్చుకుంటున్నామని చూపిస్తాం.

పరిశుభ్రత అంటే ఒంటిని, ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం అని అర్థం

18. రాజ్యమందిరం పట్ల మనమెలా గౌరవం చూపించవచ్చు?

18 మన ఆరాధనా స్థలం. మనకు యెహోవామీద ప్రేమ ఉంటే సత్యారాధనకు ముఖ్యస్థానమైన రాజ్యమందిరం పట్ల కూడా గౌరవం చూపిస్తాం. రాజ్యమందిరానికి వచ్చిన కొత్తవాళ్ళకు దానిమీద సదభిప్రాయం కలగాలనుకుంటాం. కాబట్టి అది ఆకట్టుకునేలా ఉండాలంటే క్రమం తప్పకుండా దాన్ని శుభ్రం చేస్తూ, తగిన మరమ్మతులు చేస్తూ ఉండాలి. దాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి శాయశక్తులా కృషిచేయాలి. మన సమయాన్ని వెచ్చించి ఆరాధనా స్థలాన్ని శుభ్రంచేయడం, ‘బాగుచేయడం’ మనకు లభించిన గొప్ప అవకాశంగా భావిస్తాం. (2 దినవృత్తాంతములు 34:10) సమావేశ హాళ్ళను కూడా మనం అంతే పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

దురలవాట్లకు దూరంగా ఉండాలి

19. పరిశుద్ధంగా ఉండాలంటే మనం వేటికి దూరంగా ఉండాలి? ఈ విషయంలో మనకు బైబిలు ఎలా సహాయం చేస్తుంది?

19 మనం పరిశుద్ధంగా ఉండాలంటే, పొగత్రాగడం, అధిక మద్యపానం, వ్యసనానికి గురిచేసే మాదక ద్రవ్యాల ఉపయోగం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని అర్థం. నేడు లోకంలో ఉన్న దురలవాట్లన్నీ బైబిల్లో పేరుపేరునా ప్రస్తావించబడకపోయినా, అలాంటి వాటిని యెహోవా ఎలా చూస్తాడో గ్రహించేందుకు తోడ్పడే సూత్రాలు దానిలో ఉన్నాయి. యెహోవా ఇష్టాయిష్టాల్ని అర్థంచేసుకున్న తర్వాత ఆయనమీద ప్రేమతో ఆయన ఆమోదించేదే చేయాలనుకుంటాం. మనమిప్పుడు బైబిల్లోని ఐదు సూత్రాలను పరిశీలిద్దాం.

20, 21. (ఎ) మనమెలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలని యెహోవా కోరుతున్నాడు? (బి) యెహోవా చెప్పింది చేయడానికి మనకు ఏ బలమైన కారణం ఉంది?

20 “ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసికొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసికొందము.” (2 కొరింథీయులు 7:1) మన శరీరాన్ని, ఆత్మను అంటే మన ఆలోచనలను కల్మషపర్చే ఎలాంటి అలవాట్లకైనా దూరంగా ఉండాలని యెహోవా కోరుతున్నాడు. కాబట్టి మన శరీరానికి, మనసుకు హాని కలిగించే ఎలాంటి వ్యసనాలకైనా దూరంగా ఉండాలి.

21 “సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా” చేసుకోవడానికి ఒక బలమైన కారణం ఉందని బైబిలు చెబుతోంది. 2 కొరింథీయులు 7:1⁠లో “మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక” అనే మాటల్ని గమనించండి. ఆ వాగ్దానాలు ఏమిటి? దాని ముందరి అధ్యాయం చివరి వచనాల్లో ఉన్నట్లుగా “నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును” అని యెహోవా వాగ్దానం చేశాడు. (2 కొరింథీయులు 6:17, 18) యెహోవా మిమ్మల్ని తన కుమారుడిగా, కుమార్తెగా ప్రేమించి, సంరక్షిస్తానని చేసిన వాగ్దానాన్ని ఒకసారి ఆలోచించండి. కానీ మీరు మీ ‘శరీరాన్ని, ఆత్మను’ కల్మషపర్చే అలవాట్లకు దూరంగా ఉంటేనే యెహోవా ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. యెహోవాతో అంత మంచి సంబంధాన్ని పాడుచేసేవాటిని అలవర్చుకోవడం ఎంత అవివేకం!

22-25. దురలవాట్లను మానుకోవడానికి బైబిల్లోని ఏ సూత్రాలు సహాయం చేస్తాయి?

22 “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను.” (మత్తయి 22:37) ఇది అన్ని ఆజ్ఞల్లోకెల్లా ముఖ్యమైనది అని యేసు చెప్పాడు. (మత్తయి 22:38) యెహోవాను మనం అలా ప్రేమించడం సరైనదే. మన పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణమనస్సుతో ఆయనను ప్రేమించాలంటే మన ఆయుష్షును తగ్గించే లేదా బుద్ధిని మందగింపజేసే అలవాట్లకు దూరంగా ఉండాలి.

23 [యెహోవా] అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు.” (అపొస్తలుల కార్యములు 17:24, 25) జీవం దేవుడిచ్చిన వరం. మనం ఆ జీవదాతను ప్రేమిస్తున్నాం కాబట్టి ఆ జీవాన్ని పవిత్రమైనదిగా చూడాలని కోరుకుంటాం. మనకు ఒకవేళ చెడు అలవాట్లుంటే జీవంపట్ల మనకు ఏమాత్రం గౌరవం లేదని చూపించినట్లవుతుంది కాబట్టి ఆరోగ్యాన్ని పాడుచేసే ఎలాంటి అలవాట్లనైనా మానుకోవాలి.—కీర్తన 36:9.

24 “నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెను.” (మత్తయి 22:39) చెడు అలవాట్లుంటే అవి ఉన్నవాళ్లకే కాదు తరచూ ఇతరులకు కూడా హాని జరుగుతుంది. ఉదాహరణకు, పొగ తాగేవారికేకాక ఆ పొగను పీల్చుకున్నవాళ్లకూ ఆరోగ్యం పాడవుతుంది. అలా వేరేవాళ్లకు హాని కలిగించే వ్యక్తి పొరుగువారిని ప్రేమించమని దేవుడిచ్చిన ఆజ్ఞను ఉల్లంఘిస్తాడు. అతను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని అన్నా అది అబద్ధమే అవుతుంది.—1 యోహాను 4:20, 21.

25 “అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెనని ... వారికి జ్ఞాపకము చేయుము.” (తీతు 3:1) చాలా దేశాల్లో కొన్నిరకాల మందుల్ని, మాదకద్రవ్యాల్ని దగ్గర ఉంచుకోవడం లేదా వాడడం చట్టవిరుద్ధం. నిజ క్రైస్తవులుగా మనం అలాంటివాటిని దగ్గర ఉంచుకోం లేదా వాడము.—రోమీయులు 13:1.

26. (ఎ) దేవుని ప్రేమలో నిలిచివుండాలంటే మనమేమి చేయాలి? (బి) దేవుని దృష్టిలో పరిశుద్ధంగా జీవించడం ఎందుకు ఉత్తమం?

26 దేవుని ప్రేమలో నిలిచివుండడానికి మనం కేవలం ఒకటీ రెండు విషయాల్లోనే కాదు అన్ని విషయాల్లోనూ పరిశుద్ధంగా ఉండాలి. దురలవాట్లను మానుకోవడం కష్టమే అయినా అసాధ్యమైతే కాదు. d యెహోవా ఏదైనా మన ప్రయోజనం కోసమే చెబుతాడు కాబట్టి, ఆయన చెప్పినట్లు జీవించడమే ఉత్తమం. (యెషయా 48:17 చదవండి.) అన్నిటికన్నా మిన్నగా, పరిశుద్ధంగా జీవిస్తే మనం ప్రేమించే దేవునికి మంచి పేరు తెస్తూ ఆయన ప్రేమలో నిలిచివుంటామనే సంతృప్తి మాటల్లో చెప్పలేనిది.

a పరిశుద్ధత లేదా శుద్ధత అని అనువదించిన మూలభాషా పదాలు కొన్నిసార్లు శారీరక పరిశుభ్రతను ఎక్కువసార్లు ప్రవర్తన, ఆరాధన పవిత్రంగా ఉండడాన్ని సూచిస్తున్నాయి.

b నిజ క్రైస్తవులు దూరంగా ఉండాల్సిన కొన్ని పండుగలు, ఆచారాల గురించిన సమాచారం కోసం ఈ పుస్తకంలోని 13వ అధ్యాయం చూడండి.

c మంచి వినోదాన్ని ఎలా ఎంచుకోవాలో తెలుసుకోవడానికి ఈ పుస్తకంలోని 6వ అధ్యాయాన్ని చూడండి.

e పేరు మార్చబడింది.