12వ అధ్యాయం
ప్రోత్సాహకరంగా మాట్లాడండి
“క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీ నోట రానియ్యకుడి.” —ఎఫెసీయులు 4:29.
1-3. (ఎ) యెహోవా మనకిచ్చిన ఒక బహుమతి ఏమిటి? (బి) దాన్నెలా దుర్వినియోగం చేసే అవకాశం ఉంది? (సి) దేవుని ప్రేమలో నిలిచివుండాలంటే మాట్లాడే సామర్థ్యాన్ని ఎలా ఉపయోగించాలి?
ఒక తండ్రి, వాళ్ళ అబ్బాయికి ఒక మోటారు బైకు బహుమతిగా ఇచ్చాడనుకుందాం. కానీ, ఆ అబ్బాయి దాన్ని ఇష్టమొచ్చినట్లు నడిపిస్తూ యాక్సిడెంట్లు చేస్తున్నాడు. అప్పుడు ఆ తండ్రికి ఎలా ఉంటుంది? ఆయన ఖచ్చితంగా బాధపడతాడు.
2 “శ్రేష్ఠమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతి వరమును” అనుగ్రహించే యెహోవా, మనకు చక్కగా మాట్లాడే సామర్థ్యాన్ని బహుమతిగా ఇచ్చాడు. (యాకోబు 1:17) భూమ్మీదున్న ప్రాణుల్లో కేవలం మనిషికి మాత్రమే ఈ సామర్థ్యం ఉంది, అందుకే మనం మన ఆలోచనల్ని, భావాల్ని ఇతరులకు చెప్పగలుగుతున్నాం. అయితే బైకును ఇష్టమొచ్చినట్లు నడిపే ప్రమాదమున్నట్లే, ఈ సామర్థ్యాన్ని కూడా దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది. మనం ఇతరులను బాధపెట్టేలా, వారి స్వాభిమానం దెబ్బతినేలా మాట్లాడితే యెహోవాకు ఎంత బాధ కలుగుతుందో ఆలోచించండి!
3 మనం దేవుని ప్రేమలో నిలిచివుండాలంటే, ఆయనిచ్చిన ఈ సామర్థ్యాన్ని ఆయన చెప్పినట్లుగా ఉపయోగించాలి. మనం ఎలా మాట్లాడితే యెహోవా ఇష్టపడతాడో బైబిల్లో స్పష్టంగా తెలియజేశాడు. అదిలా చెబుతోంది: “వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీ నోట రానియ్యకుడి.” (ఎఫెసీయులు 4:29) మనమెందుకు ఆలోచించి మాట్లాడాలి? ఎలా మాట్లాడకూడదు? ఇతరులకు ‘క్షేమాభివృద్ధి’ కలుగజేసేలా ఎలా మాట్లాడాలి? ఈ విషయాలను మనమిప్పుడు పరిశీలిద్దాం.
మనమెందుకు ఆలోచించి మాట్లాడాలి?
4, 5. మాటలకున్న శక్తి గురించి బైబిలు ఏమి చెబుతుంది?
4 మనమెందుకు మాట్లాడేముందు ఆలోచించాలి? ఒక ప్రాముఖ్యమైన కారణం ఏమిటంటే, మన మాటలకు మంచి లేదా చెడు చేసే శక్తి ఉంది. “సాత్వికమైన నాలుక జీవవృక్షము దానిలో కుటిలత యుండినయెడల ఆత్మకు భంగము కలుగును” అని సామెతలు 15:4 చెబుతోంది. వడలిపోతున్న చెట్టుకు నీరు జీవం పోసినట్లే సాత్వికమైన మాటలు, వినేవారి మనసును ఉత్తేజపరుస్తాయి. అదే కుటిలమైన మాటలు మనసును కృంగదీస్తాయి. నిజమే, మన మాటలు ఇతరులకు మంచైనా లేదా హానైనా చేస్తాయి.—సామెతలు 18:21.
5 మాటలకున్న శక్తిని వివరిస్తూ మరో సామెత ఇలా చెబుతోంది: “కత్తిపోటువంటి మాటలు పలుకువారు కలరు.” (సామెతలు 12:18) అనాలోచితంగా మాట్లాడడం వల్ల ఎదుటివారి మనసు గాయపడుతుంది, సంబంధాలు పాడవుతాయి. గతంలో ఎవరైనా మిమ్మల్ని అంతగా నొప్పించేలా మాట్లాడారా? మరోవైపున, అదే సామెతలోవున్న రెండవ భాగం ఏమి చెబుతుందో చూడండి. “జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము.” దైవిక జ్ఞానంతో సరిగ్గా ఆలోచించి మాట్లాడేవారి మాటలు ఓదార్పునిస్తాయి, సంబంధాలను మెరుగుపరుస్తాయి. ఎవరైనా మిమ్మల్ని అలా ఓదారుస్తూ మాట్లాడారా? (సామెతలు 16:24 చదవండి.) మన మాటలకు అంత శక్తి ఉంది కాబట్టి, మనం ఇతరులను గాయపర్చకుండా వారిని ఓదార్చే విధంగానే మాట్లాడాలని కోరుకుంటాం.
ప్రశాంతమైన మాటలు సేదదీర్పునిస్తాయి
6. నోటిని అదుపులో ఉంచుకోవడం ఎందుకు కష్టం?
6 మనం మాట్లాడే ముందు ఆలోచించడానికిగల రెండో కారణం, మనలోని పాపం, అపరిపూర్ణత. వాటివల్లే కొన్నిసార్లు మనమెంత ప్రయత్నించినా నోటిని అదుపులో ఉంచుకోలేం. సాధారణంగా మనం మన హృదయంలో ఉన్నదే మాట్లాడతాం, కానీ “హృదయాలోచన . . . చెడ్డది.” (ఆదికాండము 8:21; లూకా 6:45) అందుకే, నోటిని అదుపులో ఉంచుకోవడం కష్టం. (యాకోబు 3:2-4 చదవండి.) అయినా మనం, సాధ్యమైనంతవరకు ఆలోచించి మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అలలకు ఎదురీదడానికి ఒక వ్యక్తి ఎంత ప్రయాసపడతాడో మనం కూడా ఆలోచించి మాట్లాడడానికి అంత ప్రయాసపడాలి.
7, 8. మన మాటలనుబట్టి యెహోవా ఎంత తీవ్రంగా ప్రతిస్పందిస్తాడు?
7 మనం ఆలోచించి మాట్లాడడానికిగల మూడో కారణం ఏమిటంటే, మనం ఎలా మాట్లాడతామనే దాన్నిబట్టి యెహోవా మనకు తీర్పుతీరుస్తాడు. మన మాటలవల్ల ఇతరులతోనేకాదు యెహోవాతో కూడా మన సంబంధం పాడయ్యే ప్రమాదం ఉంది. అందుకే యాకోబు ఇలా చెబుతోంది: “ఎవడైనను నోటికి కళ్లెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తిగలవాడనని అనుకొనిన యెడల వాని భక్తి వ్యర్థమే.” మనం ముందటి అధ్యాయంలో చూసినట్లుగా, దేవుడు మన ఆరాధనను అంగీకరించాలంటే మన మాట్లాడే తీరు సరిగా ఉండాలి. మనం నోటికి కళ్లెం పెట్టుకోకుండా ఇతరుల్ని నొప్పించేలా, వాళ్లకు హాని చేసేలా మాట్లాడుతూ ఉంటే భక్తితో మనం ఏమి చేసినా దేవుడు దాన్ని వ్యర్థంగా పరిగణిస్తాడు. కాబట్టి మనం దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలి.— 1:26యాకోబు 3:8-10.
8 దేవుడిచ్చిన సామర్థ్యాన్ని దుర్వినియోగం చేయకుండా మనమెందుకు ఆలోచించి మాట్లాడాలో చూశాం. ఇతరులను ప్రోత్సహించేలా మాట్లాడడం ఎలాగో తెలుసుకునేముందు నిజ క్రైస్తవులు ఎలా మాట్లాడకూడదో చూద్దాం.
ఇతరులకు హాని కలిగించేలా మాట్లాడకండి
9, 10. (ఎ) నేటి లోకంలో ఎలా మాట్లాడడం సర్వసాధారణం అయిపోయింది? (బి) మనం ఎందుకు అసభ్యకరంగా మాట్లాడకూడదు? (అధస్సూచి కూడా చూడండి.)
9 అసభ్యకరంగా మాట్లాడకండి. శాపనార్థాలు, బూతులు వంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడడం నేటి లోకంలో సర్వసాధారణం. చాలామంది కోపంగా ఉన్నప్పుడు బూతులు మాట్లాడతారు లేదా ఇతరులను నవ్వించడానికి అసభ్యకరంగా, ద్వంద్వార్థాలుండే మాటలు మాట్లాడతారు. అయితే, అది చిన్నవిషయమేమీ కాదు. దాదాపు 2,000 సంవత్సరాల క్రితం, దేవుని ప్రేరణతో అపొస్తలుడైన పౌలు కొలొస్సయుల సంఘానికి రాసిన పత్రికలో “బూతులు” మాట్లాడకూడదని రాశాడు. (కొలొస్సయులు 3:8) పౌలు ఎఫెసీయుల సంఘానికి రాసినప్పుడు, ‘సరసోక్తుల్ని’ మాట్లాడకూడదని అలాంటి వాటి ‘పేరైనా ఎత్తకూడదని’ చెప్పాడు.—ఎఫెసీయులు 5:3, 4.
10 అసభ్యకరంగా మాట్లాడడం యెహోవాకు అసహ్యం, ఆయనను ప్రేమించేవారూ దాన్ని అసహ్యించుకుంటారు. కాబట్టి, యెహోవాపట్ల మనకు ప్రేమవుంటే మనం అలా మాట్లాడం. ‘శరీర కార్యాలను’ ప్రస్తావించినప్పుడు, పౌలు వాటిలో ‘అపవిత్రత’ కూడా ఒకటని చెప్పాడు. అసభ్యకరమైన మాటలు ‘అపవిత్రత’ కిందికే వస్తాయి. (గలతీయులు 5:19-21) అయితే, ఇది చాలా గంభీరమైన విషయం. ఒకవేళ అలా అసభ్యకరంగా, అనైతికమైన విషయాల గురించి మాట్లాడే వ్యక్తి, ఎన్నిసార్లు హెచ్చరించినా మార్పులు చేసుకోకపోతే అతణ్ణి సంఘం నుండి బహిష్కరిస్తారు. a
11, 12. (ఎ) ఇతరుల గురించి మాట్లాడుకోవడం ఎప్పుడు తప్పు? (బి) యెహోవా ఆరాధకులు ఎందుకు కొండెములు చెప్పకూడదు?
11 ఇతరుల గురించి చెడుగా మాట్లాడకండి, కొండెములు చెప్పకండి. ప్రజలు తరచూ ఇతరుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకోవడం తప్పా? ఒకవేళ ఇతరుల గురించి మంచి విషయాలు అంటే కొత్తగా ఎవరు బాప్తిస్మం తీసుకున్నారు, ఎవరికి ప్రోత్సాహం అవసరం వంటివాటి గురించి మాట్లాడుకుంటే తప్పులేదు. మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు ఒకరి బాగోగుల పట్ల ఒకరు శ్రద్ధ కలిగివుండి, తోటి విశ్వాసుల గురించి మాట్లాడుకునేవారు. (ఎఫెసీయులు 6:21, 22; కొలొస్సయులు 4:8, 9) అయితే, లేనివి ఉన్నట్లుగా చెబుతూ ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుకోవడం తప్పు. అంతకంటే హానికరమైన విషయం ఏమిటంటే, అది కొండెములు చెప్పే స్వభావానికి దారితీస్తుంది. కొండెములు చెప్పడం అంటే, ‘అపనిందలు వేసి అవమానించడం, చాడీలు చెప్పడం’ అని అర్థం. ఉదాహరణకు పరిసయ్యులు యేసుకు చెడ్డపేరు తేవాలని ఆయనపై అభాండాలు వేశారు. (మత్తయి 9:32-34; 12:22-24) అలాంటి స్వభావం తరచూ గొడవలకు దారితీస్తుంది.—సామెతలు 26:20.
12 మనకు బహుమతిగా ఇచ్చిన మాట్లాడే సామర్థ్యాన్ని ఇతరులను కించపర్చేలా లేదా బేధాలు ఏర్పడేలా ఉపయోగిస్తే యెహోవా అస్సలు ఇష్టపడడు. “అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు” యెహోవాకు అసహ్యుడు. (సామెతలు 6:16-19) “కొండెములు చెప్పువాడు” అని అనువదించబడిన డయాబోలోస్ అనే గ్రీకు పదం సాతానుకు ఒక పేరుగా కూడా ఉపయోగించబడింది. అతడు దేవునిమీద కొండెములు చెప్పే “అపవాది.” (ప్రకటన 12:9, 10) కాబట్టి మనం అపవాదిగా మారేలా మాట్లాడకుండా ఉందాం. ‘కక్షలు, భేదాలు’ కలిగించే చాడీలకు సంఘంలో తావుండకూడదు. (గలతీయులు 5:19-21) కాబట్టి ఇతరుల గురించి మీరు విన్నది వేరేవాళ్లకు చెప్పే ముందు మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోండి: ‘ఆ విషయం నిజమేనా? దీన్ని నేను వేరేవాళ్లకు మళ్ళీ చెప్పడం సరైనదేనా? దీన్ని ఇతరులకు చెప్పడం అసలు అవసరమా?’—1 థెస్సలొనీకయులు 4:10, 11 చదవండి.
13, 14. (ఎ) దూషణకరంగా మాట్లాడడం ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? (బి) తిట్టుబోతులు ఎలాంటి ప్రమాదాల్ని కొనితెచ్చుకుంటారు?
13 దూషించకండి. మనం ముందు చూసినట్లుగా మాటలకు చెడు చేసే శక్తి ఉంది. అపరిపూర్ణత కారణంగా మనం కొన్నిసార్లు నోరుజారి తర్వాత బాధపడుతుంటాం. అయితే క్రైస్తవులు ఇంట్లో గానీ, సంఘంలో గానీ ఎలా మాట్లాడకూడదో బైబిలు స్పష్టంగా చెబుతుంది. “సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి” అని పౌలు చెప్పాడు. (ఎఫెసీయులు 4:31) తిట్టడం, శాపనార్థాలు పెట్టడం, ఎగతాళి చేయడం వంటివి ఇతరుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి వారిని కృంగదీస్తాయి. ముఖ్యంగా, పిల్లల లేతమనసులు అలాంటి మాటలకు గాయపడతాయి.—కొలొస్సయులు 3:21.
14 ఇతరుల్ని తిట్టడాన్ని బైబిలు ఖండిస్తోంది. మాటలతో అవమానించే, దూషించే తిట్టుబోతు ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటాడు. ఎందుకంటే, దాన్ని మానడానికి అతనికి ఎంత సహాయం చేసినా అతను మారకపోతే అతడు సంఘం నుండి బహిష్కరించబడతాడు. అంతేకాదు, అతడు నూతనలోకంలో జీవించే సదవకాశాన్ని కోల్పోవచ్చు. (1 కొరింథీయులు 5:11-13; 6:9, 10) కాబట్టి, మనం అసభ్యకరంగా, ఇతరుల్ని గాయపర్చేలా మాట్లాడడం, అపవాదులు వేయడం వంటివి అలవాటు చేసుకుంటే దేవుని ప్రేమలో నిలిచివుండలేం. అలాంటి మాటలు ఇతరులకు హాని చేస్తాయి.
“క్షేమాభివృద్ధికరమైన” మాటలు
15. మనం ఇతరులతో ‘క్షేమాభివృద్ధికరంగా’ ఎలా మాట్లాడవచ్చు?
15 మాట్లాడే వరాన్ని దేవుడు చెప్పినట్లుగా ఉపయోగించాలి. అదెలాగో ఇప్పుడు చూద్దాం. “క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే పలుకుడి” అని దేవుని వాక్యం చెప్పిన విషయాన్ని గుర్తుచేసుకోండి. (ఎఫెసీయులు 4:29) మనం క్షేమాభివృద్ధికరంగా అంటే ఇతరులను ప్రోత్సహించే, బలపరిచే విధంగా మాట్లాడితే యెహోవా సంతోషిస్తాడు. దానికి మనం మాట్లాడే ముందు ఆలోచించాలి. ఫలానా విధంగానే మాట్లాడాలి అని బైబిల్లో నియమాలేమీ లేవు, ఫలానా విధంగా మాట్లాడితేనే అది “హితవాక్యము” లేదా మంచిది అని అది చెప్పడమూ లేదు. (తీతు 2:7, 8) ఇతరులకు “క్షేమాభివృద్ధికరమైన” విధంగా మాట్లాడాలంటే మనం ముఖ్యంగా మూడు విషయాలు గుర్తుంచుకోవాలి. మన మాటలు (1) ఇతరులకు మంచి చేయాలి, (2) అవి నిజాలై ఉండాలి, (3) దయతో కూడినవై ఉండాలి. ఈ విషయాలు మనసులో పెట్టుకుని ఇతరుల్ని ప్రోత్సహించే విధంగా మాట్లాడడం గురించి కొన్ని విషయాలు చూద్దాం.—160వ పేజీలో ఉన్న “ నా మాటలు ప్రోత్సాహకరంగా ఉన్నాయా?” అనే బాక్సు చూడండి.
16, 17. (ఎ) మనం ఇతరులను ఎందుకు మెచ్చుకోవాలి? (బి) సంఘంలో, కుటుంబంలో మనం ఎవరెవర్ని మెచ్చుకోవచ్చు?
16 మనస్ఫూర్తిగా మెచ్చుకోండి. ఇతరుల్ని మెచ్చుకోవడం ఎంత ప్రాముఖ్యమో యెహోవాకు, యేసుకు తెలుసు. (మత్తయి 3:17; 25:19-23; యోహాను 1:47) క్రైస్తవులముగా మనం కూడా ఇతరుల్ని మనస్ఫూర్తిగా మెచ్చుకోవాలి. ఎందుకు? “సమయోచితమైన మాట యెంత మనోహరము!” అని సామెతలు 15:23 చెబుతోంది. ఈ ప్రశ్నలు వేసుకోండి: ‘ఎవరైనా నన్ను మనస్ఫూర్తిగా మెచ్చుకున్నప్పుడు నాకెలా అనిపిస్తుంది? నాకు సంతోషంగా, ఉత్తేజకరంగా ఉండదా?’ ఎవరైనా మిమ్మల్ని మెచ్చుకుంటే వాళ్లు మీరు చేసింది గమనించారని, మీపై వాళ్లకు శ్రద్ధ ఉందని, మీరు చేసిన ప్రయత్నం వృథా కాలేదని తెలుస్తుంది. దాంతో మీలో నూతనోత్సాహం నిండి మరింత చక్కగా పనిచేయడానికి ప్రయత్నిస్తారు. ఇతరులు మిమ్మల్ని మెచ్చుకుంటే మీకు సంతోషంగా ఉంటుంది. మరి అలాంటప్పుడు మీరు కూడా ఇతరుల్ని మెచ్చుకోవడానికి ప్రయత్నించవద్దా?—మత్తయి 7:12 చదవండి.
17 ఇతరుల్లో మంచిని చూడడం నేర్చుకోండి, వాళ్లను మెచ్చుకోండి. మీ సంఘంలో ఎవరైనా ప్రసంగం చక్కగా ఇచ్చి ఉండవచ్చు, యౌవనస్థుల్లో ఎవరైనా దేవుని సేవలో మంచి లక్ష్యాలను పెట్టుకుని వాటిని చేరుకోవడానికి కృషి చేస్తుండవచ్చు, లేదా వృద్ధాప్య సమస్యలున్నా నమ్మకంగా కూటాలకు హాజరవుతున్నవారు ఉండవచ్చు. అలాంటి వారిని మీరు మనస్ఫూర్తిగా మెచ్చుకుంటే వారెంతో సంతోషించి దేవుని సేవలో కొనసాగడానికి మరింత కృషిచేస్తారు. కుటుంబంలో కూడా భార్యాభర్తలు ఒకరినొకరు మనస్ఫూర్తిగా మెచ్చుకోవాలి, ‘థ్యాంక్స్’ చెప్పుకోవాలి. (సామెతలు 31:10, 28) పిల్లలు చేసే పనులను తల్లిదండ్రులు గుర్తించి వారిని మెచ్చుకుంటే వాళ్లు వికసిస్తారు. మొక్క ఏపుగా పెరగాలంటే సూర్యరశ్మి, నీళ్లు ఎంత అవసరమో అలాగే పిల్లల ఎదుగుదలకు మెచ్చుకోవడం అంతే అవసరం. తల్లిదండ్రులారా, అవసరమైనప్పుడల్లా మీ పిల్లల మంచి లక్షణాలను, వారు చేసే ప్రయత్నాలను మెచ్చుకోండి. అలా చేస్తే మీ పిల్లల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరిగి వాళ్లు సరైనది చేయడానికి మరింత కృషి చేస్తారు.
18, 19. (ఎ) తోటి విశ్వాసులను ప్రోత్సహించడానికి, ఓదార్చడానికి మనమెందుకు సాధ్యమైనంత కృషి చేయాలి? (బి) వారిని మనమెలా ప్రోత్సహించవచ్చు?
18 ప్రోత్సాహకరంగా, ఓదార్పుకరంగా మాట్లాడండి. ‘వినయంగలవారిపట్ల,’ ‘నలిగినవారిపట్ల’ యెహోవాకు ఎంతో శ్రద్ధ ఉంది. (యెషయా 57:15) ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలని, ‘ధైర్యం చెడినవారిని ధైర్యపరచాలని’ ఆయన వాక్యం చెబుతోంది. (1 థెస్సలొనీకయులు 5:11, 14) బాధలో ఉన్న మన తోటి విశ్వాసులను ప్రోత్సహించడానికి, ఓదార్చడానికి మనం చేసే ప్రయత్నాలను యెహోవా గమనిస్తాడు, వాటినిబట్టి సంతోషిస్తాడు.
19 నిరుత్సాహపడిన లేదా కృంగిపోయిన మన తోటి విశ్వాసిని ప్రోత్సహించడానికి మనం ఏ విధంగా మాట్లాడాలి? సమస్యను మీరే పరిష్కరించాలని అనుకోకండి. చాలా సందర్భాల్లో, వారిని ప్రోత్సహించడానికి ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం ఉండకపోవచ్చు. వారిపట్ల మీకు ప్రేమ, శ్రద్ధ ఉన్నాయని చెప్పండి. ‘చిన్న ప్రార్థన చేసుకుందామా’ అని అడగండి. దేవుడు, ఇతరులు వారిని ఎంతగా ప్రేమిస్తున్నారో అర్థం చేసుకునేలా సహాయం చేయమని మీ ప్రార్థనలో యెహోవాను అర్థించండి. (యాకోబు 5:14, 15) సంఘంలో వారెంత అవసరమో, వారికి ఎంత విలువ ఉందో చెప్పండి. (1 కొరింథీయులు 12:12-26) యెహోవాకు వారిపట్ల శ్రద్ధ ఉందని చూపించే ప్రోత్సాహకరమైన బైబిలు లేఖనాన్ని చదవండి. (కీర్తన 34:18; మత్తయి 10:29-31) మీరు నిరుత్సాహపడిన వారితో ‘దయగా మాట్లాడడానికి’ తగినంత సమయం తీసుకోండి. వారితో మనస్ఫూర్తిగా మాట్లాడినప్పుడు, వారిపై మనకు ప్రేమ ఉందని వారు అర్థం చేసుకుంటారు.—సామెతలు 12:25 చదవండి.
20, 21. ఉపదేశం ప్రభావవంతంగా ఉండాలంటే ఏమి చేయాలి?
20 ప్రభావవంతంగా ఉపదేశమివ్వండి. మనం అపరిపూర్ణులం కాబట్టి మనకు అప్పుడప్పుడు ఉపదేశం అవసరం. అందుకే, “నీవు ముందుకు జ్ఞానివగుటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము” అని బైబిలు ప్రోత్సహిస్తోంది. (సామెతలు 19:20) కేవలం సంఘ పెద్దలే ఉపదేశం ఇవ్వరు, తల్లిదండ్రులు పిల్లలకు ఉపదేశమిస్తారు. (ఎఫెసీయులు 6:4) పరిణతిగల సహోదరీలు అవసరమైతే యౌవన స్త్రీలకు ఉపదేశమిస్తారు. (తీతు 2:3-5) అయితే, మనకు ప్రేమవుంటే అవతలి వ్యక్తి నొచ్చుకోకుండా ఉపదేశమిస్తాం. మన ఉపదేశం ప్రభావవంతంగా ఉండాలంటే ఏమి చేయాలి? దీనికి మూడు విషయాలు సహాయం చేస్తాయి. (1) ఉపదేశం ఇస్తున్న వ్యక్తి వైఖరి, ఉద్దేశం సరైనవై ఉండాలి. (2) బైబిలు ఆధారంగా ఉపదేశమివ్వాలి. (3) సరైన పద్ధతిలో ఇవ్వాలి.
21 ఉపదేశం ఎంత ప్రభావవంతంగా ఉంటుందనేది ముఖ్యంగా దాన్నిచ్చే వ్యక్తి చేతుల్లో ఉంటుంది. మీరిలా ప్రశ్నించుకోండి: ‘ఉపదేశం ఏ విధంగా ఇస్తే నాకు అంగీకరించడం సులభంగా ఉంటుంది?’ మీకు ఉపదేశమిస్తున్న వ్యక్తికి మీమీద ఎలాంటి కసి లేదని, ఎలాంటి చెడు ఉద్దేశాలు లేవని, మీపట్ల శ్రద్ధ ఉందని తెలిస్తే మీరు దాన్ని ఇష్టపూర్వకంగా అంగీకరిస్తారు. కాబట్టి ఇతరులకు ఉపదేశం ఇస్తున్నప్పుడు మీ వైఖరి కూడా అలాగే ఉండాలి. అయితే, ఉపదేశం ప్రభావవంతంగా ఉండాలంటే దాన్ని దేవుని వాక్యం ఆధారంగా ఇవ్వాలి. (2 తిమోతి 3:16) మనం మాట్లాడుతున్నప్పుడు లేఖనాలను చూపించినా, చూపించకపోయినా మన ఉపదేశం బైబిలుపై ఆధారపడి ఉండాలి. కాబట్టి, పెద్దలు ఉపదేశం ఇస్తున్నప్పుడు వ్యక్తిగత అభిప్రాయాలను ఇతరులపై రుద్దరు లేదా లేఖనాలను వక్రీకరించి తమ సొంత అభిప్రాయాలు సమర్థించుకోరు. అంతేకాదు, ఉపదేశం సరైన పద్ధతిలో ఇచ్చినప్పుడు అది మరింత ప్రభావవంతంగా ఉంటుంది. దయగల మాటలతో ఉపదేశమిస్తే, వినే వ్యక్తి దాన్ని ఇష్టపూర్వకంగా స్వీకరిస్తాడు, ఆయన ఆత్మగౌరవమూ దెబ్బతినదు.—కొలొస్సయులు 4:6.
22. దేవుడు బహుమతిగా ఇచ్చిన మాట్లాడే సామర్థ్యాన్ని మీరెలా ఉపయోగించాలని అనుకుంటున్నారు?
22 అవును, మాట్లాడే సామర్థ్యం దేవుడిచ్చిన విలువైన బహుమతి. యెహోవాను ప్రేమిస్తే మనం ఆ సామర్థ్యాన్ని దుర్వినియోగం చేయకుండా చక్కగా ఉపయోగిస్తాం. మన మాటలకు ఇతరులను ప్రోత్సహించే లేదా హానిచేసే శక్తి ఉందన్న విషయం మనమెప్పుడూ మరచిపోకూడదు. అంతేకాదు, మనకు ఈ బహుమతినిచ్చిన యెహోవా చెప్పినట్టుగా అంటే మాట్లాడే సామర్థ్యాన్ని ఇతరులకు “క్షేమాభివృద్ధికరమైన” విధంగా ఉపయోగించడానికి కృషి చేద్దాం. అప్పుడు మన మాటలు ఇతరులను ప్రోత్సహించి ఉత్తేజపరచడమేకాక, మనం దేవుని ప్రేమలో నిలిచివుండేందుకు సహాయం చేస్తాయి.
a బైబిల్లో ఉపయోగించబడిన “అపవిత్రత” అనే పదం చాలా రకాల పాపాలను సూచిస్తుంది. ఒక వ్యక్తి ఏ పాపం చేసినా న్యాయపరమైన చర్య తీసుకోబడదు గానీ ఒకవేళ ఆ వ్యక్తి పశ్చాత్తాపపడకుండా అపవిత్రత కిందికి వచ్చే ఘోరమైన పాపాలు చేస్తూ ఉంటే అతడు సంఘం నుండి బహిష్కరించబడవచ్చు.—2 కొరింథీయులు 12:21; ఎఫెసీయులు 4:19; కావలికోట జూలై 15, 2006 సంచికలోని “పాఠకుల ప్రశ్నలు” చూడండి.