6వ అధ్యాయం
మంచి వినోదాన్ని ఎలా ఎంచుకోవచ్చు?
“సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి.” —1 కొరింథీయులు 10:31.
1, 2. వినోదం విషయంలో మనమెలాంటి నిర్ణయం తీసుకోవాలి?
మీరొక రుచికరమైన పండు తినబోతున్నారనుకోండి, సరిగ్గా తినేముందు దానిలో కొంచెం కుళ్ళిపోయి ఉండడం మీరు చూశారు. మీరేం చేస్తారు? ఆ కుళ్ళిన భాగంతో పాటు పండును మీరు తినాలనుకోవచ్చు లేదా ఆ పండును పడేయాలనుకోవచ్చు లేదా ఆ కుళ్ళిన భాగాన్ని కోసేసి మిగతా పండును తినాలనుకోవచ్చు. ఈ మూడింటిలో మీరేది చేయాలనుకుంటారు?
2 ఒక రకంగా చెప్పాలంటే వినోదం ఆ పండులాంటిదే. ఇక్కడ వినోదం అంటే సరదా కోసం మీరు చూసేవి, ఆడేవి, చదివేవి, వినేవి ఏవైనా కావచ్చు. కొన్నిసార్లు మీరు సరదాగా ఇలాంటివేవైనా చేయాలనుకోవచ్చు, కానీ ఈ రోజుల్లో వినోదం ఆ కుళ్ళిన పండులాగే అనైతికంగా ఉందని మీకు అర్థమయ్యింది. ఇప్పుడు మీరేం చేస్తారు? కొందరు అలాంటివేవీ పట్టించుకోకుండా, లోకమందించే ఎలాంటి వినోదాన్నైనా ఆస్వాదిస్తారు. మరికొందరైతే చెడు ప్రభావం తమమీద పడకూడదని అసలు వినోదానికే దూరంగా ఉంటారు. ఇంకొంతమంది హానికరమైన వినోదానికి దూరంగా ఉంటూ, అప్పుడప్పుడు మంచి వినోదాన్ని ఆస్వాదిస్తారు. దేవుని ప్రేమలో నిలిచివుండాలంటే మీరెలాంటి నిర్ణయం తీసుకోవాలి?
3. ఇప్పుడు మనం ఏమి పరిశీలిస్తాం?
3 మనలో చాలామంది మూడవ రకం ప్రజలుగా ఉండాలనుకుంటాం. వినోదం అవసరమని మనకు తెలుసు కానీ మనం నైతికంగా సరైన వినోదాన్నే ఎంచుకోవాలనుకుంటాం. కాబట్టి ఏది మంచిదో, ఏది చెడ్డదో ఎలా నిర్ణయించుకోవాలో మనం పరిశీలించాలి. అయితే దానికన్నా ముందు మనం ఎంచుకునే వినోదం, యెహోవాకు మనం చేసే ఆరాధనపై ఎలా ప్రభావం చూపిస్తుందో చర్చిద్దాం.
“సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి”
4. దేవునికి చేసుకున్న సమర్పణను గుర్తుపెట్టుకుంటే వినోదం విషయంలో మనమెలాంటి నిర్ణయం తీసుకుంటాం?
4 “నేను ప్రతీ బాప్తిస్మ ప్రసంగానికి తప్పకుండా హాజరై అది నా బాప్తిస్మమే అన్నట్టు జాగ్రత్తగా వినేవాణ్ణి” అని 1946లో బాప్తిస్మం తీసుకున్న ఒక వృద్ధ సాక్షి కొంతకాలం క్రితం చెప్పాడు. ఆయన ఎందుకలా చేసేవాడు? దానికి జవాబిస్తూ, “దేవునికి సమర్పించుకున్నానని గుర్తుచేసుకోవడం నేను నమ్మకంగా ఉండడానికి ఎంతో సహాయపడింది” అని చెప్పాడు. మీరు ఖచ్చితంగా ఆయన మాటలతో ఏకీభవిస్తారు. జీవితాంతం యెహోవా సేవలోనే గడుపుతానని మీరు ఆయనకు చేసిన వాగ్దానాన్ని గుర్తుచేసుకుంటూ ఉంటే మీరు సహనంతో ముందుకు కొనసాగగలుగుతారు. (ప్రసంగి 5:4 చదవండి; హెబ్రీయులు 10:7) అంతేకాదు, క్రైస్తవ పరిచర్య, వినోదంతో సహా మీ జీవితంలోని అన్ని విషయాల్లోనూ దేవుని దృక్కోణం నుండి ఆలోచిస్తారు. తన కాలంలోని క్రైస్తవులకు రాస్తూ అపొస్తలుడైన పౌలు ఈ సత్యాన్నే నొక్కిచెప్పాడు, “మీరు భోజనముచేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమకొరకు చేయుడి.”—1 కొరింథీయులు 10:31.
5. రోమీయులు 12:1 లోని పరోక్ష హెచ్చరికను అర్థం చేసుకోవడానికి లేవీయకాండము 22:18-20 ఎలా సహాయం చేస్తుంది?
5 జీవితంలో మీరేమి చేసినా అది మీ ఆరాధనపై ప్రభావం చూపిస్తుంది. ఈ విషయం తోటి విశ్వాసుల మనసులో బలంగా నాటుకునేలా రోమీయులకు రాసిన పత్రికలో పౌలు లోతైన అర్థమున్న మాటల్ని ఉపయోగించాడు. ‘మీ వివేచనా జ్ఞానాన్ని ఉపయోగించి పరిశుద్ధమైన దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి.’ (రోమీయులు 12:1, NW) ఇక్కడ ‘శరీరం’ అనే మాట మీ మనసును, హృదయాన్ని, బలాన్ని సూచిస్తుంది. దేవుని సేవలో మీరు వీటిని ఉపయోగిస్తారు. (మార్కు 12:30) అలాంటి హృదయపూర్వక సేవ ఒక యాగం లేదా అర్పణ అని పౌలు చెబుతున్నాడు. ఆయన మాటల్లో పరోక్ష హెచ్చరిక ఉంది. మోషే ధర్మశాస్త్రం ప్రకారం అర్పణలో లోపం ఉంటే దేవుడు అంగీకరించేవాడు కాదు. (లేవీయకాండము 22:18-20) అదే విధంగా క్రైస్తవుల సేవ కల్మషంతో ఉంటే ఆ సేవను దేవుడు అంగీకరించడు. అదెలా కల్మషమయ్యే అవకాశముంది?
6, 7. క్రైస్తవులు తమ శరీరాన్ని ఎలా కల్మషం చేసుకునే అవకాశముంది? దాని పరిణామాలేమిటి?
6 “మీ అవయవములను . . . పాపమునకు అప్పగింపకుడి” అని రోములోని క్రైస్తవులను పౌలు హెచ్చరించాడు. అంతేకాక ‘శరీరక్రియలను చంపి’ వేయమని కూడా వారికి చెప్పాడు. (రోమీయులు 6:12-14; 8:13) ఆ ఉత్తరంలోనే ఆయన అంతకుముందు ‘శరీరక్రియలు’ కొన్నింటిని పేర్కొన్నాడు. ఉదాహరణకు పాపులైన మానవుల గురించి ఆయనిలా రాశాడు, “వారి నోటినిండ శపించుటయు పగయు ఉన్నవి.” “రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తుచున్నవి.” “వారి కన్నుల యెదుట దేవుని భయము లేదు.” (రోమీయులు 3:13-18) అలాంటి పాప ప్రవృత్తుల కోసం తన ‘అవయవాలను’ ఉపయోగిస్తే ఒక క్రైస్తవుడు తన శరీరాన్ని కల్మషం చేసుకుంటాడు. ఉదాహరణకు, క్రైస్తవులు ఉద్దేశపూర్వకంగా అశ్లీల చిత్రాలు, విపరీతమైన హింస లాంటివి చూస్తే తమ ‘కళ్ళను పాపమునకు అప్పగించి,’ తమ శరీరమంతటినీ కలుషితం చేసుకుంటారు. ఆ వ్యక్తి చేసే ఆరాధన పరిశుద్ధంగా ఉండదు, దానిని దేవుడు అస్సలు అంగీకరించడు. (ద్వితీయోపదేశకాండము 15:21; 1 పేతురు 1:14-16; 2 పేతురు 3:11) చెడు వినోదాన్ని ఎంపిక చేసుకుంటే ఎంత నష్టపోవాల్సి వస్తుందో కదా!
7 క్రైస్తవులు సరైన వినోదం ఎంపిక చేసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదురౌతాయనేది స్పష్టం. కాబట్టి మనం ఎంచుకునే వినోదం దేవునికి మనం చేసే ఆరాధనను మెరుగుపర్చుకోవడానికి సహాయం చేయాలే కానీ దాన్ని కల్మషపర్చకూడదు. ఏది మంచి వినోదమో ఏది కాదో తెలుసుకోవడం ఎలా? మనమిప్పుడు పరిశీలిద్దాం.
‘చెడును అసహ్యించుకొనుడి’
8, 9. (ఎ) వినోదంలో ఏ రెండు రకాలున్నాయని చెప్పుకోవచ్చు? (బి) ఎలాంటి వినోదానికి మనం దూరంగా ఉండాలి, ఎందుకు?
8 వినోదం రెండు రకాలని చెప్పుకోవచ్చు. ఒక రకం వినోదానికి క్రైస్తవులు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. మరో రకం వినోదం ఎలా ఉంటుందంటే కొంతమంది క్రైస్తవులు ఇష్టపడవచ్చు, కొంతమంది ఇష్టపడకపోవచ్చు. ఇప్పుడు మనం క్రైస్తవులు దూరంగా ఉండాల్సిన వినోదం గురించి చూద్దాం.
9 మొదటి అధ్యాయంలో చూసినట్లుగా కొన్ని సినిమాల్లో, టీవీ కార్యక్రమాల్లో, సంగీతం వంటి వాటిల్లో కొన్నిసార్లు బైబిలు ఖండించే దౌర్జన్యాన్ని, దయ్యాలసంబంధమైన వాటిని, అసభ్యమైనవాటిని, అనైతికతను చూపిస్తారు. అలాంటి దిగజారిన వినోదాన్ని అందించే వాటిలో, బైబిలు సూత్రాలను లేదా ఆజ్ఞలను ఉల్లంఘించే పనులు సరైనవే అన్నట్టు చూపిస్తారు. కాబట్టి అలాంటి వాటికి నిజక్రైస్తవులు దూరంగా ఉండాలి. (అపొస్తలుల కార్యములు 15:28, 29; 1 కొరింథీయులు 6:9, 10; ప్రకటన 21:8) అలాంటి చెడు వినోదానికి దూరంగా ఉండడంవల్ల మీరు ‘చెడును అసహ్యించుకుంటున్నారని,’ ‘కీడు చేయకుండా’ ఉండడానికి అనునిత్యం ప్రయత్నిస్తున్నారని యెహోవాకు చూపిస్తారు. అంతేగాక మీకు “నిష్కపటమైన విశ్వాసము” కూడా ఉంటుంది.—రోమీయులు 12:9; కీర్తన 34:14; 1 తిమోతి 1:5.
10. వినోదం విషయంలో ఎలా ఆలోచించడం హానికరం? ఎందుకు?
10 కానీ కొంతమంది లైంగిక దుర్నీతిని అతిగా చూపించే కార్యక్రమాలను చూడడంలో హానిలేదని అనుకుంటారు. మరి కొంతమంది, ‘సినిమాల్లో టీవీలో చూస్తే చూడవచ్చు గానీ అలా చేస్తానా ఏమిటి’ అంటారు. అలా ఆలోచిస్తే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొని, ప్రమాదంలో పడతారు. (యిర్మీయా 17:9 చదవండి.) యెహోవా ఖండించేవాటిని చూడడానికి ఇష్టపడితే మనం నిజంగా ‘చెడును అసహ్యించుకున్నట్టు’ అవుతుందా? అలాంటివాటిని పదేపదే వింటూ, చదువుతూ, చూస్తూ ఉంటే మనం మంచి చెడుల విచక్షణను కోల్పోతాం. (కీర్తన 119:70; 1 తిమోతి 4:1, 2) అంతేకాదు, మనకు తప్పుచేయాలనిపించవచ్చు, ఇతరులు తప్పు చేసినా మనకది తప్పులా అనిపించకపోవచ్చు.
11. వినోదాన్ని ఎంచుకునే విషయంలో కూడా గలతీయులు 6:7 లోని సూత్రం ఎలా వర్తిస్తుంది?
11 కొందరి విషయంలో నిజంగా అలాగే జరిగింది. కొందరు క్రైస్తవులు అలవాటుగా అలాంటి వినోద కార్యక్రమాలు చూసి లైంగిక దుర్నీతికి పాల్పడ్డారు. ఆ తర్వాతే వారు “మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును” అని తెలుసుకున్నారు. (గలతీయులు 6:7) అయితే మీరు అలాంటి విషాదకర పరిస్థితిని తప్పించుకోవచ్చు. మీరు జాగ్రత్తగా మీ మనసులో మంచి విషయాలను విత్తితే మంచి ఫలితాలనే పంట కోస్తారు.—77వ పేజీలో ఉన్న “ నేనెలాంటి వినోదాన్ని ఎంచుకోవాలి?” అనే బాక్సు చూడండి.
బైబిలు సూత్రాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోండి
12. (ఎ) వినోదం విషయంలో గలతీయులు 6:5 లో ఎలాంటి సూత్రం ఉంది? (బి) సొంతగా నిర్ణయాలు తీసుకునే విషయంలో మనకెలాంటి నడిపింపు ఉంది?
12 బైబిలు కొన్ని పనుల్ని ఇటు ఖండించడం లేదు అటు సమర్థించడం లేదు. అలాంటి పనులుండే వినోదమే రెండవ రకమైన వినోదం. దాని గురించి ఇప్పుడు చూద్దాం. దీని విషయంలో ప్రతీ క్రైస్తవుడు ఏది మంచిదో ఏది కాదో సొంతగా నిర్ణయించుకోవాలి. (గలతీయులు 6:5 చదవండి.) అయితే, ఈ విషయంలో మనకు నడిపింపు ఉంది. యెహోవా దేవుని ఆలోచనేమిటో తెలుసుకోవడానికి సహాయపడే ప్రాముఖ్యమైన సత్యాలు లేదా సూత్రాలు బైబిల్లో ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తే, వినోదంతో సహా ప్రతీ విషయంలోనూ మనం యెహోవా “చిత్తమేమిటో” గ్రహించగలుగుతాం.—ఎఫెసీయులు 5:17.
13. యెహోవాకు ఇష్టం లేని వినోదానికి దూరంగా ఉండేలా మనకేది సహాయం చేస్తుంది?
13 మంచి చెడులను అర్థంచేసుకునే విషయంలో క్రైస్తవుల అవగాహనా సామర్థ్యం వేర్వేరుగా ఉంటుంది. (ఫిలిప్పీయులు 1:9) అంతేకాదు, వినోదం విషయంలో ఎవరి ఇష్టాలు వారికి ఉంటాయని క్రైస్తవులకు తెలుసు. కాబట్టి క్రైస్తవులందరూ ఒకే విధమైన నిర్ణయాలు తీసుకుంటారని అనుకోలేం. మనం బైబిల్లోని సూత్రాల గురించి ఎంత ధ్యానిస్తే, యెహోవాకు ఇష్టంలేని వినోదానికి అంత దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తాం.—కీర్తన 119:11, 129; 1 పేతురు 2:16.
14. (ఎ) వినోదం ఎంచుకునే ముందు మనం ఏ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి? (బి) ఆధ్యాత్మిక విషయాలకు మొదటి స్థానమివ్వాలంటే మనమేమి చేయాలి?
14 వినోదాన్ని ఎంచుకునే ముందు, మనకెంత సమయం ఉందనే ప్రాముఖ్యమైన విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. మీరెంచుకునే వినోదాన్నిబట్టి మీ ఇష్టాయిష్టాలేమిటో తెలిస్తే, దానికోసం మీరెంత సమయం గడుపుతారనే దాన్నిబట్టి మీరు దేనికి ప్రాముఖ్యతనిస్తారో తెలుస్తుంది. అయితే, క్రైస్తవులకు ఆధ్యాత్మిక విషయాలే అత్యంత ప్రాముఖ్యం. (మత్తయి 6:33 చదవండి.) అలాంటి విషయాలకు మీ జీవితంలో మొదటి స్థానమివ్వాలంటే మీరేమి చేయాలి? దానికి జవాబిస్తూ, “మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి” అని అపొస్తలుడైన పౌలు చెప్పాడు. (ఎఫెసీయులు 5:15, 16) మీరు వినోదం కోసం కేవలం ఎంత సమయం వెచ్చించాలో ఖచ్చితంగా నిర్ణయించుకుంటే “శ్రేష్ఠమైన కార్యములను” అంటే యెహోవాకు దగ్గరయ్యేందుకు తోడ్పడే పనులు చేయడానికి తగినంత సమయం ఉంటుంది.—ఫిలిప్పీయులు 1:9, 10.
15. వినోదాన్ని ఎంచుకునే విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?
15 వినోదం ఎంచుకునే విషయంలో మనం జాగ్రత్తగా ఉండడమే మంచిది. ఎందుకు? మనం మళ్లీ ఒకసారి పండు ఉదాహరణనే తీసుకుందాం. మీరు పండులోని కుళ్లిన భాగంతోపాటు మరికొంత భాగాన్ని కూడా కోసేస్తారు. వినోదం విషయంలో కూడా అంతే. జ్ఞానవంతులైన క్రైస్తవులు బైబిలు సూత్రాల్ని ఉల్లంఘించే వినోదానికే కాక, దేవునితో తమ సంబంధాన్ని పాడుచేస్తుందనిపించే వినోదానికి కూడా దూరంగా ఉండాలి. (సామెతలు 4:25-27) దేవుని వాక్యంలోని సలహాలను జాగ్రత్తగా పాటిస్తే, మీరలాంటి వినోదానికి దూరంగా ఉండగలుగుతారు.
“పవిత్రమైన” విషయాలు ధ్యానించండి
16. (ఎ) నైతిక విషయాల్లో మనమూ యెహోవాలాగే ఆలోచిస్తామని ఎలా చూపించవచ్చు? (బి) జీవితాంతం బైబిలు సూత్రాలను పాటించాలంటే మీకు ఎలాంటి కోరిక ఉండాలి?
16 వినోదం ఎంచుకునే ముందు నిజక్రైస్తవులు యెహోవా ఆలోచనేమిటో తెలుసుకోవాలి. యెహోవా భావాలేమిటో, ఆయనెలాంటి ప్రమాణాలు ఏర్పరిచాడో బైబిలు తెలియజేస్తోంది. ఉదాహరణకు, యెహోవా అసహ్యించుకునే ‘కల్లలాడు నాలుక, నిరపరాధుల్ని చంపే చేతులు, దుర్యోచనలు యోచించే హృదయం, కీడు చేయడానికి త్వరపడి పరుగులెత్తే పాదాలు’ వంటివాటి గురించి సొలొమోను రాజు పేర్కొన్నాడు. (సామెతలు 6:16-19) యెహోవా ఆలోచనేమిటో అర్థమైంది కాబట్టి మీరిప్పుడు ఏమి చేయాలి? “యెహోవాను ప్రేమించువారలారా, చెడుతనమును అసహ్యించుకొనుడి” అని కీర్తనకర్త ప్రోత్సహించాడు. (కీర్తన 97:10) యెహోవా అసహ్యించుకునేది మీరూ అసహ్యించుకుంటున్నారో లేదో మీరు ఎంచుకునే వినోదాన్నిబట్టి తెలుస్తుంది. (గలతీయులు 5:19-21) అందరూ ఉన్నప్పుడు కాదుగానీ, మీరొక్కరే ఉన్నప్పుడు ఏమి చేస్తున్నారనే దాన్నిబట్టే మీరు నిజంగా ఎలాంటివారో తెలుస్తుంది. (కీర్తన 11:4; అపొస్తలుల కార్యములు 2:25) కాబట్టి నైతిక విషయాల్లో యెహోవా అభిప్రాయమేమిటో గుర్తుంచుకుని, మీరు అన్ని విషయాల్లో ఆయనకు ఇష్టమైన విధంగా నడుచుకోవాలని మనసారా కోరుకుంటే, మీరెల్లప్పుడూ బైబిలు సూత్రాల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటారు. జీవితాంతం అలాగే చేస్తారు.—2 కొరింథీయులు 3:18.
17. వినోదాన్ని ఎంచుకునేముందు ఏ ప్రశ్నలు వేసుకోవాలి?
17 యెహోవా ఆలోచనా విధానానికి అనుగుణంగా వినోదాన్ని ఎంచుకునేందుకు మీరింకా ఏమి చేయవచ్చు? నిర్ణయం తీసుకునేముందు ‘ఈ వినోదాన్ని ఎంచుకుంటే దేవునితో నా సంబంధం పాడవుతుందా?’ అని ప్రశ్నించుకోండి. ఉదాహరణకు, ఏదైనా సినిమా చూడాలనుకున్నప్పుడు ‘ఈ సినిమా నా మనస్సాక్షిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?’ అని ప్రశ్నించుకోండి. వినోదం విషయంలో ఎలాంటి సూత్రాలు అన్వయిస్తాయో ఇప్పుడు పరిశీలిద్దాం.
18, 19. (ఎ) ఫిలిప్పీయులు 4:8 లోని సూత్రం మనం ఎంచుకునే వినోదం మంచిదో కాదో తెలుసుకోవడానికి ఎలా సహాయం చేస్తుంది? (బి) మంచి వినోదాన్ని ఎంచుకునేందుకు ఇంకా ఏ సూత్రాలు సహాయం చేస్తాయి? (అధస్సూచి చూడండి.)
18 ఒక ప్రాముఖ్యమైన సూత్రం ఫిలిప్పీయులు 4:8 లో ఉంది, “ఏ యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటిమీద ధ్యానముంచుకొనుడి.” నిజానికి పౌలు ఇక్కడ దేవుణ్ణి సంతోషపర్చే విషయాలను ధ్యానించడం గురించి మాట్లాడుతున్నాడే తప్ప వినోదం గురించి కాదు. (కీర్తన 19:14) అయినప్పటికీ వినోదం విషయంలో పౌలు మాటల్లోని సూత్రాన్ని అన్వయించవచ్చు. ఎలా?
19 మీరిలా ప్రశ్నించుకోండి, ‘నేను ఎంచుకునే సినిమాలు, వీడియో గేములు, సంగీతం లాంటివి నా మనసులో “పవిత్రమైన” విషయాలను నింపుతున్నాయా?’ ఉదాహరణకు, ఒక సినిమా చూసిన తర్వాత మీకు ఎక్కువగా ఎలాంటి ఆలోచనలు వస్తాయి? మీ ఆలోచనలు మంచివి, స్వచ్ఛమైనవి అయితే మీరు ఎంచుకున్న వినోదం మంచిదే. కానీ అది చూసిన తర్వాత మీకు చెడు ఆలోచనలే వస్తుంటే అది చెడు వినోదమేకాక హానికరమైనది కూడా. (మత్తయి 12:33; మార్కు 7:20-23) ఎందుకు? ఎందుకంటే మీరు చెడు విషయాల గురించి ఆలోచిస్తే మీ మనసు స్థిమితంగా ఉండదు, బైబిలు సూత్రాల ప్రకారం శిక్షణ పొందిన మనస్సాక్షి పాడవుతుంది. పైగా దేవునితో మీ సంబంధం పాడయ్యే ప్రమాదం ఉంది. (ఎఫెసీయులు 5:5; 1 తిమోతి 1:5, 19) అలాంటి వినోదం మీకు హానిచేస్తుంది కాబట్టి దానికి దూరంగా ఉండండి. a (రోమీయులు 12:2) “వ్యర్థమైనవాటిని చూడకుండ నా కన్నులు త్రిప్పి వేయుము” అని యెహోవాను వేడుకున్న కీర్తనకర్తలా ఉండండి.—కీర్తన 119:37.
ఎదుటివారి మేలు గురించి ఆలోచించండి
20, 21. మంచి వినోదాన్ని ఎంచుకునే విషయంలో 1 కొరింథీయులు 10:23, 24 లోని సూత్రం ఎలా సహాయంచేస్తుంది?
20 వ్యక్తిగత విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించాల్సిన ఒక ప్రాముఖ్యమైన బైబిలు సూత్రాన్ని పౌలు పేర్కొన్నాడు. “అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు. ఎవడును తనకొరకే కాదు, ఎదుటి వానికొరకు మేలుచేయ చూచుకొనవలెను” అని ఆయన చెప్పాడు. (1 కొరింథీయులు 10:23, 24) ఆ సూత్రం ఆధారంగా మనం మంచి వినోదాన్ని ఎలా ఎంచుకోవచ్చు? మీరిలా ప్రశ్నించుకోండి: ‘నేను ఎంచుకునే వినోదాన్నిబట్టి ఇతరులు అభ్యంతరపడే అవకాశం ఉందా?’
21 ఫలానా వినోదం ఎంచుకునే “స్వాతంత్ర్యం” నాకు ఉందని మీరనుకోవచ్చు. అయితే తోటివిశ్వాసుల్లో కొందరి మనస్సాక్షికి అది అభ్యంతరకరంగా ఉందని తెలిసి మీరు అలాంటి వినోదానికి దూరంగా ఉండాలనుకోవచ్చు. ఎందుకంటే వారు అభ్యంతరపడి దేవునికి దూరమవడానికి కారణమై, పౌలు చెప్పినట్టుగా “సహోదరులకు విరోధముగా,” “క్రీస్తునకు విరోధముగా పాపము” చేయాలని మీరు కోరుకోరు. “అభ్యంతరము కలుగజేయకుడి” అనే హెచ్చరికను మీరు గుర్తుంచుకోవాలి. (1 కొరింథీయులు 8:12; 10:32) నేడు నిజ క్రైస్తవులకు వినోదాన్ని ఎంచుకునే “స్వాతంత్ర్యం” ఉన్నా సహోదరులకు “క్షేమాభివృద్ధి” కలుగజేయని వినోదానికి దూరంగా ఉంటూ పౌలు ఇచ్చిన మంచి సలహాను పాటిస్తారు.—రోమీయులు 14:1; 15:1.
22. వ్యక్తిగత విషయాల్లో అందరూ తమలాగే ఆలోచించాలని క్రైస్తవులు ఎందుకు పట్టుబట్టకూడదు?
22 ఎదుటివారి మేలు కోరే విషయంలో మరో అంశం కూడా మనం గుర్తుంచుకోవాలి. ఒక క్రైస్తవుడు తనకు సరిగ్గా అనిపించే వినోదాన్నే సంఘంలోని అందరూ తప్పనిసరిగా ఇష్టపడాలని పట్టుబట్టకూడదు. అలా చేస్తే, రహదారిపై వాహనం నడుపుతూ తాను వెళ్లే స్పీడులోనే మిగతా వాళ్లందరూ వెళ్లాలని పట్టుబట్టినట్టు ఉంటుంది. అది సబబు కాదు. సంఘంలో ఎవరైనా క్రైస్తవ సూత్రాలకు విరుద్ధంకాని వినోదాన్ని ఎంచుకున్నప్పుడు అది ఆయనకు ఇష్టం లేకపోయినా క్రైస్తవ ప్రేమతో వారి నిర్ణయాలను గౌరవించాలి. ఆ విధంగా ఆయన, తాను “సహనము”గల వ్యక్తినని అందరికీ చూపిస్తాడు.—ఫిలిప్పీయులు 4:5; ప్రసంగి 7:16.
23. మంచి వినోదాన్ని మీరెలా ఎంచుకోవచ్చు?
23 మంచి వినోదాన్ని ఎలా ఎంచుకోవచ్చో మనమిప్పుడు క్లుప్తంగా చూద్దాం. బైబిల్లో ఖండించబడిన అనైతిక, దిగజారిన విషయాలను అతిగా చూపించే ఎలాంటి వినోదానికైనా దూరంగా ఉండాలి. ఫలానా వినోదం గురించి బైబిలు స్పష్టంగా ఏమీ చెప్పకపోతే అందులోని సూత్రాలకు అనుగుణంగా వినోదాన్ని ఎంచుకోవాలి. మీ మనస్సాక్షికి సరిగా అనిపించని వినోదానికి దూరంగా ఉండాలి. ఇతరులకు, ముఖ్యంగా తోటి విశ్వాసులకు అభ్యంతరకరంగా అనిపించేదాన్ని ఎంచుకోకూడదు. మీరలా చేస్తూ దేవునికి ఘనత తీసుకురావాలని మీరు, మీ కుటుంబం దేవుని ప్రేమలో నిలిచివుండాలని మనసారా కోరుకుంటున్నాం.
a వినోదాన్ని ఎంచుకోవడానికి సహాయపడే మరికొన్ని సూత్రాలు సామెతలు 3:31; 13:20; ఎఫెసీయులు 5:3, 4; కొలొస్సయులు 3:5, 8, 20 వచనాల్లో ఉన్నాయి.