కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అనుబంధం

రక్తంలోని సూక్ష్మభాగాలు, శస్త్ర చికిత్సా పద్ధతులు

రక్తంలోని సూక్ష్మభాగాలు, శస్త్ర చికిత్సా పద్ధతులు

రక్తంలోని సూక్ష్మభాగాలు. సాధారణంగా ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్‌లెట్స్‌ (థ్రాంబోసైట్స్‌), ప్లాస్మా అనే రక్తంలోని నాలుగు ప్రధాన భాగాల నుండి కొన్ని సూక్ష్మభాగాల్ని విడదీసి ఉపయోగిస్తారు. ఉదాహరణకు, ఎర్ర రక్తకణాల్లో హిమోగ్లోబిన్‌ అనే మాంసకృత్తు ఉంటుంది. మానవుల లేదా జంతువుల నుండి సేకరించబడిన హిమోగ్లోబిన్‌ నుండి తయారుచేసే కొన్ని మందులను తీవ్ర రక్తహీనత లేదా రక్తం బాగా కోల్పోయిన రోగులకు చికిత్స చేయడంలో ఉపయోగిస్తారు.

తొంభై శాతం నీరు ఉండే ప్లాస్మాలో ఎన్నో హార్మోన్లు, నిరింద్రియ లవణాలు, ఎంజైములు (ఫేనక ద్రవ్యాలు), పోషక పదార్థాలు, చక్కెర వంటి అనేక ఖనిజాలు ఉంటాయి. రక్తం గడ్డ కట్టడానికి తోడ్పడే పదార్థాలు, రోగ నిరోధక ప్రతిరక్షకాలు, ఆల్బుమిన్‌ వంటి మాంసకృత్తులు కూడా ప్లాస్మాలో ఉంటాయి. ఎవరికైనా ఏదైనా వ్యాధిసోకితే, ఆ రోగ నిరోధక శక్తివున్న వ్యక్తుల ప్లాస్మానుండి సేకరించిన గామా గ్లోబ్యులిన్‌ మాంసకృత్తులున్న ఇంజక్షన్లు తీసుకోమని వైద్యులు చెప్పవచ్చు. తెల్ల రక్తకణాల్లో ఇంటర్‌ఫిరాన్లు, ఇంటర్‌ల్యూకిన్లు అనే మాంసకృత్తులు ఉంటాయి, వీటిని కొన్నిరకాల విష జ్వరాలు, క్యాన్సర్ల చికిత్సలో ఉపయోగిస్తారు.

రక్తంలోని సూక్ష్మభాగాలను ఉపయోగించే చికిత్సలను క్రైస్తవులు అంగీకరించవచ్చా? దీని విషయంలో బైబిలు ఖచ్చితంగా ఏమీ చెప్పడం లేదు కాబట్టి, ప్రతీ ఒక్కరూ దేవుని ఎదుట తమ మనస్సాక్షినిబట్టి సొంతగా నిర్ణయించుకోవాలి. శరీరం నుండి బయటకు తీయబడిన రక్తాన్ని “భూమిమీద నీళ్లవలె పారబోయవలెను” అని ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రం చెబుతోంది కాబట్టి, కొందరు ఏ సూక్ష్మభాగాలనూ తీసుకోరు. (ద్వితీయోపదేశకాండము 12:22-24) మరితరులు, రక్తాన్ని లేదా దానిలోని ప్రధాన భాగాలను ఎక్కించుకోవడానికి తిరస్కరించినా, సూక్ష్మభాగాలతో చేసే చికిత్సను అంగీకరించవచ్చు. రక్తం నుండి సూక్ష్మభాగాల్ని విడదీసినప్పుడు ఇక అవి ఆ రక్తం తీసుకోబడిన ప్రాణి జీవాన్ని సూచించవని వారు నమ్మవచ్చు.

రక్తంలోని సూక్ష్మభాగాలను తీసుకోవాలో వద్దో నిర్ణయం తీసుకునేటప్పుడు, ఈ విషయాల గురించి ఆలోచించండి: ‘సూక్ష్మభాగాలన్నిటినీ తిరస్కరిస్తున్నానంటే, వ్యాధిని నయం చేయడానికి లేదా రక్తం గడ్డకట్టడానికి దోహదపడే సూక్ష్మభాగాలున్న కొన్ని మందుల్ని, చికిత్సల్ని కూడా కాదంటున్నానని నాకు తెలుసా? నేను సూక్ష్మభాగాల్ని ఎందుకు నిరాకరిస్తున్నానో లేదా ఎందుకు అంగీకరిస్తున్నానో వైద్యునికి వివరించగలనా?’

శస్త్రచికిత్సా పద్ధతులు. హిమోడైల్యూషన్‌, సెల్‌ సాల్వేజ్‌ అనేవి వాటిలో రెండు. హిమోడైల్యూషన్‌ అనే పద్ధతిలో, శస్త్రచికిత్స జరుగుతుండగా శరీరంలోని రక్తాన్ని ప్లాస్టిక్‌ బ్యాగులోకి మళ్లించి, రోగి శరీరంలోని రక్తాన్ని పల్చన చేసే ద్రావకాన్ని (వాల్యూమ్‌ ఎక్స్‌పాండర్స్‌) ఎక్కిస్తారు. శస్త్రచికిత్స ముగిసే సమయంలో ఆ బ్యాగులోని రక్తాన్ని తిరిగి ఆయన శరీరంలోకి ఎక్కిస్తారు. సెల్‌ సాల్వేజ్‌ విషయానికొస్తే, ఈ పద్ధతిలో శస్త్రచికిత్స జరుగుతున్న సమయంలో కోల్పోతున్న రక్తాన్ని ఒక పరికరంలోకి మళ్లించి, దాన్ని తిరిగి శరీరంలోకి ఎక్కిస్తారు. గాయం లేదా శరీరం నుండి కారుతున్న రక్తాన్ని శుభ్రపర్చి లేదా వడగట్టి శరీరంలోకి తిరిగి ఎక్కిస్తారు. ఈ పద్ధతుల్ని వివిధ రకాలుగా ఉపయోగించే అవకాశం ఉంది కాబట్టి, తనకు చికిత్సచేసే వైద్యుడు ఏ పద్ధతిని అనుసరిస్తాడో ఒక క్రైస్తవుడు ముందుగానే అడిగి తెలుసుకోవాలి.

ఈ చికిత్సా పద్ధతుల విషయంలో నిర్ణయం తీసుకునే ముందు ఈ ప్రశ్నలు వేసుకోండి: ‘నా రక్తంలో కొంతభాగం శరీరం బయటకు మళ్లించబడి, కొంతసేపటివరకు అది తిరిగి ఎక్కించబడకపోయినా ఆ రక్తమింకా నా శరీరంలో భాగమేననీ, దానిని “భూమిమీద నీళ్లవలె పారబోయవల[సిన]” అవసరం లేదని నా మనస్సాక్షి ఒప్పుకుంటుందా? (ద్వితీయోపదేశకాండము 12:23, 24) చికిత్సలో భాగంగా నా రక్తాన్ని కొంతతీసి దానికి మందులు చేర్చి తిరిగి నా శరీరంలోకి ఎక్కిస్తే నా బైబిలు శిక్షిత మనస్సాక్షి ఒప్పుకుంటుందా? నా రక్తాన్ని ఉపయోగించి చేసే చికిత్సా పద్ధతులన్నింటినీ కాదంటున్నానంటే, రక్తపరీక్షల్ని, హిమోడయాలిసిస్‌ను లేదా హార్ట్‌-లంగ్‌ బైపాస్‌ మెషీన్‌ను ఉపయోగించడానికి కూడా నేను అంగీకరించడంలేదనే విషయం నాకు తెలుసా?’

శస్త్రచికిత్స జరిగేటప్పుడు తన రక్తాన్ని ఏమిచేయాలనేది ఒక క్రైస్తవుడు సొంతగా నిర్ణయించుకోవాలి. కొంత రక్తాన్ని తీసి దానికి మందుచేర్చి తిరిగి శరీరంలోకి ఎక్కించడం వంటి కొన్ని చికిత్సా విధానాల విషయంలో, కొన్ని వైద్య పరీక్షల విషయంలో కూడా ఒక క్రైస్తవుడు సొంత నిర్ణయాలు తీసుకోవాలి.