కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

7వ అధ్యాయం

దేవునిలాగే మీరూ ప్రాణాన్ని విలువైనదిగా ఎంచుతారా?

దేవునిలాగే మీరూ ప్రాణాన్ని విలువైనదిగా ఎంచుతారా?

“నీయొద్ద జీవపు ఊట కలదు.” —కీర్తన 36:9.

1, 2. (ఎ) దేవుడు మనకు ఏ అమూల్యమైన బహుమానాన్ని ఇచ్చాడు? (బి) బైబిలు సూత్రాలు మనకెలా సహాయపడతాయో అర్థం చేసుకోవడం నేడు ఎందుకు ప్రాముఖ్యం?

 మన పరలోక తండ్రి మనకు ఒక అమూల్యమైన బహుమానాన్ని ఇచ్చాడు. అదేమిటంటే ఆయన గుణాల్ని చూపించగలుగుతూ, తెలివిగా ఆలోచించగల సామర్థ్యమే. (ఆదికాండము 1:27) ఆ సామర్థ్యంవల్లే బైబిలు సూత్రాలు మనకెలా సహాయపడతాయో అర్థం చేసుకోగలుగుతున్నాం. ఆ సూత్రాల్ని మన జీవితాల్లో పాటిస్తే మనం యెహోవాను ప్రేమించే పరిణతిగల ప్రజలుగా తయారవుతాం. అంతేకాక మనం, “అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి” ఉంటాం.—హెబ్రీయులు 5:14.

2 బైబిలు సూత్రాలు మనకెలా సహాయపడతాయో అర్థం చేసుకోవడం నేడు చాలా ప్రాముఖ్యం ఎందుకంటే లోకం ఇప్పుడు మరింత క్లిష్టంగా తయారైంది. జీవితానికి సంబంధించిన అన్ని విషయాల్లో నిర్దిష్ట నియమాలు విధించడం అసాధ్యం. ఉదాహరణకు వైద్యరంగాన్ని తీసుకుంటే, రక్తం నుండి తయారు చేసిన ఎలాంటి ఉత్పత్తులు వాడాలి, రక్తం విషయంలో ఎలాంటి చికిత్సా పద్ధతులు ఎంచుకోవాలి అనే విషయంలో ఇది సరి, ఇది తప్పు అని చెప్పడానికి లేదు. యెహోవాకు లోబడాలని అనుకునే వారందరికీ రక్తం విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే ఈ విషయానికి సంబంధించిన బైబిలు సూత్రాలను అర్థం చేసుకుంటే మన మనస్సాక్షిని బాధించకుండా దేవుని ప్రేమలో నిలిచివుండే విధంగా మనం మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం. (సామెతలు 2:6-11) అలాంటి కొన్ని సూత్రాలను మనమిప్పుడు చూద్దాం.

ప్రాణం, రక్తం పవిత్రమైనవి

3, 4. (ఎ) రక్తం పవిత్రమైనదని లేఖనాల్లో మొదటిసారి ఎక్కడ ప్రస్తావించబడింది? (బి) అది పవిత్రమైనదని ఏ లేఖన సూత్రాన్ని బట్టి చెప్పవచ్చు?

3 కయీను హేబెలును చంపిన వెంటనే ప్రాణం, రక్తం ఎంత పవిత్రమైనవో, ఆ రెంటికీ మధ్య సంబంధం ఏమిటో యెహోవా వివరించాడు. దేవుడు కయీనుతో, “నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలోనుండి నాకు మొరపెట్టుచున్నది” అని చెప్పాడు. (ఆదికాండము 4:10) యెహోవా దృష్టిలో హేబెలు రక్తం, క్రూరంగా చంపబడిన ఆయన ప్రాణానికి సమానం. కాబట్టి హేబెలు రక్తం న్యాయం కోసం దేవునికి మొరపెట్టుకుంది.—హెబ్రీయులు 12:24.

4 నోవహు కాలంలో జలప్రళయం ముగిసిన తర్వాత, మాంసం తినవచ్చు కానీ రక్తం తినకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు. “మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు; రక్తమే దాని ప్రాణము. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును” అని దేవుడు చెప్పాడు. (ఆదికాండము 9:4, 5) నోవహు సంతతిగావున్న మనందరికీ ఆ ఆజ్ఞ వర్తిస్తుంది. ఆ ఆజ్ఞవల్ల రెండు విషయాలు మనకు తెలుస్తాయి. మొదటిది, రక్తం ప్రాణంతో సమానమని దేవుడు అంతకుముందు కయీనుతో పరోక్షంగా అన్న మాటలను అది ధృవీకరించింది. రెండవది, ప్రాణానికి రక్తానికి ఉన్న పవిత్రతను గౌరవించని వాళ్లకు జీవదాత అయిన యెహోవా తీర్పుతీరుస్తాడు.—కీర్తన 36:9.

5, 6. రక్తం విలువైనదనీ, పవిత్రమైనదనీ మోషే ధర్మశాస్త్రంలో ఎలా నొక్కిచెప్పబడింది? ( 90వ పేజీలోని బాక్సు కూడా చూడండి.)

5 ప్రాముఖ్యమైన ఆ రెండు విషయాలూ మోషే ధర్మశాస్త్రంలో కనిపిస్తాయి. లేవీయకాండము 17:10, 11 లో ఇలా ఉంది: “ఒకడు దేని రక్తమును తినినను రక్తము తినువానికి నేను విముఖుడనై జనులలోనుండి వాని కొట్టివేయుదును. రక్తము దేహమునకు ప్రాణము. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠముమీద పోయుటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమునుబట్టి ప్రాయశ్చిత్తము చేయును.” a—88వ పేజీలో ఉన్న “ రక్తం ప్రాయశ్చిత్తం కలుగజేస్తుంది” అనే బాక్సు చూడండి.

6 వధించబడిన పశువు రక్తాన్ని బలిపీఠం మీద పోయాలి, లేకపోతే దాన్ని నేలమీద పారబోయాలని దేవుడు ఆదేశించాడు. అలా చేస్తే ప్రాణాన్ని సూచనార్థకంగా జీవదాతకు తిరిగి ఇచ్చినట్లు అవుతుంది. (ద్వితీయోపదేశకాండము 12:16) ఇశ్రాయేలీయులు మాంసం తినాలనుకుంటే రక్తం లేశమాత్రమైనా లేకుండా దాన్ని కడగాలనేమీ చెప్పలేదు. ఒక జంతువును సరిగ్గా వధించి, రక్తమంతా పోయిన తర్వాత వారు దాని మాంసం తినవచ్చు. అలా రక్తం ఒలికించి జీవదాతకు గౌరవాన్ని చూపించారు కాబట్టి మనస్సాక్షికి ఎలాంటి అభ్యంతరం లేకుండా వారు ఆ మాంసాన్ని తినవచ్చు.

7. రక్తం పవిత్రమైనదని దావీదు ఎలా చూపించాడు?

7 దేవునికి ‘ఇష్టుడైన’ దావీదు, రక్తం విషయంలో దేవుడు అసలు ఆ ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడో అర్థం చేసుకున్నాడు. (అపొస్తలుల కార్యములు 13:22) ఒక సందర్భంలో ఆయనకు బాగా దాహం వేసినప్పుడు ఆయన అనుచరుల్లో ముగ్గురు ప్రాణాలకు తెగించి శత్రు స్థావరం గుండా వెళ్లి బావిలోని నీరు తీసుకువచ్చారు. అప్పుడు దావీదు, “నేను దీనిని తాగలేను! నా కొరకు తమ ప్రాణాలను లెక్కచేయకుండా వెళ్లిన వారి రక్తం తాగినట్లుగావుంటుంది” అని అన్నాడు. అందుకే ఆయన దాహంగా ఉన్నా ఆ నీళ్లను “యెహోవా ముందు పారబోశాడు.”—2 సమూయేలు 23:15-17, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

8, 9. క్రైస్తవ సంఘం స్థాపించబడిన తర్వాత రక్తం, ప్రాణం విషయంలో యెహోవా అభిప్రాయం మారిందా? వివరించండి.

8 నోవహుకు రక్తం తినకూడదని ఆజ్ఞ ఇచ్చిన 900 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో యెహోవా అదే నియమాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ 1,500 సంవత్సరాలకు క్రైస్తవ సంఘంలోని పరిపాలక సభతో యెహోవా ఇలా రాయించాడు: “విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటె ఎక్కువైన యే భారమును మీ మీద మోపకూడదని, పరిశుద్ధాత్మకును మాకును తోచెను.”—అపొస్తలుల కార్యములు 15:28, 29.

9 మొదటి శతాబ్దపు పరిపాలక సభలోని వారు రక్తం పవిత్రమైనదని, దాన్ని దుర్వినియోగం చేయడం విగ్రహారాధన, వ్యభిచారం చేయడంతో సమానమని అర్థంచేసుకున్నారు. నేడు నిజ క్రైస్తవులు కూడా వారితో ఏకీభవిస్తారు. అంతేకాక, ప్రతీ విషయంలో నియమాలు ఉండాలి అనుకోకుండా బైబిల్లోని సూత్రాలను ఎలా అన్వయించుకోవాలో ఆలోచిస్తారు కాబట్టి, రక్తం విషయంలో యెహోవాను సంతోషపరిచే నిర్ణయాలు తీసుకోగలుగుతారు.

రక్తాన్ని చికిత్స కోసం ఉపయోగించవచ్చా?

రక్తంలోని సూక్ష్మభాగాలు తీసుకోవాలా వద్దా అనే నా నిర్ణయాన్ని నేను డాక్టరుకు ఎలా వివరించాలి?

10, 11. (ఎ) రక్తం, రక్తంలోని ప్రధాన భాగాలు ఎక్కించుకునే విషయంలో యెహోవాసాక్షుల అభిప్రాయమేమిటి? (బి) రక్తానికి సంబంధించిన ఏ విషయాల్లో క్రైస్తవులకు వేర్వేరు అభిప్రాయాలు ఉండవచ్చు?

10 ‘రక్తాన్ని విసర్జించడంలో’ రక్తం ఎక్కించుకోకుండా, రక్త దానం చేయకుండా, సొంత రక్తాన్ని నిల్వచేయకుండా ఉండడం అనే విషయాలు ఇమిడివున్నాయని యెహోవాసాక్షులు గ్రహించారు. దేవుని ఆజ్ఞను ఉల్లంఘించకూడదనే ఉద్దేశంతో వారు రక్తంలోని నాలుగు ప్రధాన భాగాలను అంటే ఎర్ర రక్తకణాలను, తెల్ల రక్తకణాలను, ప్లేట్‌లెట్స్‌ను (థ్రాంబోసైట్స్‌), ప్లాస్మాను అంగీకరించరు.

11 నేడు ఈ నాల్గింటిలో ప్రతీదాని నుండి సూక్ష్మభాగాలను విడదీసి ఎన్నో విధాలుగా ఉపయోగిస్తున్నారు. మరి క్రైస్తవులు వాటిని అంగీకరించవచ్చా? ఆ సూక్ష్మభాగాలు కూడా “రక్తంతో” సమానమేనా? ఈ విషయంలో మాత్రం ప్రతీ ఒక్కరూ సొంత నిర్ణయం తీసుకోవాలి. ఒక వ్యక్తి రక్తాన్ని బయటకు తీసి నిల్వచేయకుండా దాన్ని ఉపయోగించి చేసే హిమోడయాలసిస్‌, హిమోడైల్యూషన్‌, సెల్‌ సాల్వేజ్‌ లాంటి చికిత్సా పద్ధతుల విషయంలోనూ ఎవరికి వారే నిర్ణయం తీసుకోవాలి.—అనుబంధంలోని 246-249 పేజీల్లో ఉన్న సమాచారాన్ని చూడండి.

12. (ఎ) మనస్సాక్షినిబట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఫర్వాలేదులే అని ఎందుకు అనుకోకూడదు? (బి) అలాంటి నిర్ణయాలు తీసుకునేముందు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు?

12 మనం వ్యక్తిగతంగా ఏ నిర్ణయం తీసుకుంటామనేది యెహోవా పట్టించుకుంటాడా? పట్టించుకుంటాడు. ఎందుకంటే మనమేమి ఆలోచిస్తాం, ఏ ఉద్దేశంతో పనులు చేస్తామనేది యెహోవా గమనిస్తాడు. (సామెతలు 17:3; 24:12 చదవండి.) కాబట్టి ఫలానా మందులు తీసుకునేముందు లేదా ఫలానా చికిత్సా పద్ధతిని ఎంచుకునే ముందు ప్రార్థనాపూర్వకంగా వాటి గురించి పరిశోధన చేసి, బైబిలు సూత్రాలకు అనుగుణంగా శిక్షణ పొందిన మన మనస్సాక్షి చెప్పేది వినాలి. (రోమీయులు 14:2, 22, 23) మన అభిప్రాయాలను ఇతరులమీద రుద్దాలని ప్రయత్నించకూడదు. లేదా, “నా పరిస్థితుల్లో మీరుంటే ఏమి చేస్తారు?” అని ఎవరినీ అడగకూడదు. ఇలాంటి విషయాల్లో ప్రతీ క్రైస్తవుడూ ‘తన బరువు తానే భరించుకోవాలి.’ bగలతీయులు 6:5; రోమీయులు 14:11, 12; 93వ పేజీలో ఉన్న “ నేను రక్తాన్ని పవిత్రంగా ఎంచుతున్నానా?” అనే బాక్సు చూడండి.

యెహోవా ఆజ్ఞల్లో ప్రేమ కనిపిస్తుంది

13. యెహోవా ఇచ్చిన ఆజ్ఞలు, సూత్రాలనుబట్టి ఆయనెలాంటి వాడని తెలుస్తుంది? ఒక ఉదాహరణ చెప్పండి.

13 బైబిల్లో ఉన్న నియమాలను, సూత్రాలను చూస్తే యెహోవా మంచి శాసనకర్తే కాదు, తన పిల్లల సంక్షేమాన్ని కోరే ప్రేమగల తండ్రి అని కూడా అర్థమౌతుంది. (కీర్తన 19:7-11) ‘రక్తాన్ని విసర్జించండి’ అనే ఆజ్ఞ నిజానికి ఆరోగ్య సూత్రంగా ఇవ్వబడకపోయినా అది మనల్ని రక్త మార్పిడుల కారణంగా వచ్చే వ్యాధుల బారినుండి కాపాడుతుంది. (అపొస్తలుల కార్యములు 15:20) నిజానికి వైద్య రంగంలో పనిచేసే చాలామంది రక్తరహిత చికిత్సను, ఆధునిక వైద్యంలో “అత్యుత్తమ వైద్య విధానం” అని అంటున్నారు. వైద్య రంగంలో జరుగుతున్న అలాంటి అభివృద్ధిని చూసినప్పుడు నిజ క్రైస్తవులకు యెహోవాకున్న అపార జ్ఞానం, తండ్రిలాంటి ప్రేమ గుర్తొస్తాయి.—యెషయా 55:9 చదవండి; యోహాను 14:21, 23.

14, 15. (ఎ) దేవుడు తన ప్రజలకిచ్చిన ఏ ఆజ్ఞల్లో ప్రేమ కనబడుతుంది? (బి) ఆ భద్రతా నియమాల వెనకున్న సూత్రాలను మనమెలా పాటించవచ్చు?

14 పూర్వం దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఇచ్చిన అనేక ఆజ్ఞల్లో ఆయనకు వాళ్ల సంక్షేమంపట్ల ఉన్న శ్రద్ధ, ప్రేమ కనిపిస్తాయి. ఒక ఉదాహరణ చూద్దాం. ఇశ్రాయేలీయులు మిద్దెలపై ఎన్నో పనులు చేసేవారు కాబట్టి వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు ప్రమాదాలు జరగకుండా మిద్దె చుట్టూ పిట్టగోడ కట్టించాలని ఆయన ఆజ్ఞాపించాడు. (ద్వితీయోపదేశకాండము 22:8; 1 సమూయేలు 9:25, 26; నెహెమ్యా 8:16; అపొస్తలుల కార్యములు 10:9) పొడిచే ఎద్దులను కట్టి ఉంచాలని కూడా ఆజ్ఞాపించాడు. (నిర్గమకాండము 21:28, 29) ఆ ఆజ్ఞల్ని నిర్లక్ష్యం చేసేవాళ్లు ఇతరుల సంక్షేమంపట్ల ఏమాత్రం శ్రద్ధ లేదని చూపించి, తమమీదికి రక్తాపరాధం తెచ్చుకునేవాళ్లు.

15 ఈ నియమాల వెనకున్న సూత్రాలను మీరెలా పాటించవచ్చు? మీ వాహనం, వాహనం నడిపే తీరు, పెంపుడు జంతువులు, ఇల్లు, ఉద్యోగ స్థలం, మీరు ఎంచుకునే వినోదం గురించి ఆలోచించండి. కొన్ని దేశాల్లో, అనవసర సాహసాలు చేయడంవల్ల సంభవించిన దుర్ఘటనల్లోనే చాలామంది యౌవనులు చనిపోతున్నారు. అయితే, దేవుని ప్రేమలో నిలిచివుండాలని కోరుకునే యౌవనులకు జీవితం విలువ తెలుసు కాబట్టి థ్రిల్‌ కోసం వాళ్లు అలాంటి సాహసాలకు ఒడిగట్టరు. వాళ్లు మూర్ఖంగా ‘మాకేం కాదులే’ అనుకోరు. బదులుగా వాళ్లు, హానికలిగించే వాటికి దూరంగా ఉంటూ యౌవనకాలాన్ని ఆనందంగా గడుపుతారు.—ప్రసంగి 11:9, 10.

16. గర్భస్రావం విషయంలో బైబిల్లోని ఏ సూత్రం అన్వయిస్తుంది? (అధస్సూచి కూడా చూడండి.)

16 ఇంకా పుట్టని శిశువుల ప్రాణం కూడా దేవుని దృష్టిలో విలువైనదే. పూర్వం ఇశ్రాయేలులో, ఎవరైనా గర్భిణీ స్త్రీకి హాని చేసినందువల్ల ఆమె గానీ ఆమె గర్భంలోని శిశువు గానీ మరణిస్తే ఆ వ్యక్తిని దేవుడు నరహంతకునిగా పరిగణించేవాడు. అతడు “ప్రాణమునకు ప్రాణము” చెల్లించాల్సివచ్చేది. c (నిర్గమకాండము 21:22-25) మరి, ప్రతీ సంవత్సరం చాలామంది స్త్రీలు స్వార్థంతో తమ లైంగికానందం కోసం గర్భస్రావం చేయించుకుని లెక్కలేనన్ని ప్రాణాలను బలిగొంటుంటే యెహోవా ఎంత బాధపడతాడో మీరు ఊహించగలరా?

17. దేవుని ఆజ్ఞలు తెలియకముందు గర్భస్రావం చేయించుకున్న స్త్రీని మీరెలా ఓదార్చవచ్చు?

17 ఒకవేళ ఎవరైనా బైబిలు సత్యాన్ని తెలుసుకోకముందు గర్భస్రావం చేయించుకుంటే అప్పుడేమిటి? దేవుడు ఆమెను క్షమిస్తాడా? ఆమె నిజంగా పశ్చాత్తాపం చూపిస్తే యేసు రక్తం ఆధారంగా యెహోవా ఆమె పాపాన్ని తప్పకుండా క్షమిస్తాడు. (కీర్తన 103:8-14; ఎఫెసీయులు 1:7) అందుకే క్రీస్తు కూడా ఇలా అన్నాడు, “మారుమనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదు.”—లూకా 5:32.

హాని తలపెట్టకండి

18. రక్తపాతానికి కారణమయ్యే ద్వేషం గురించి బైబిలు ఏమి చెబుతోంది?

18 ఇతరులకు హాని చేయడం మాట అటుంచితే, రక్తపాతానికి కారణమయ్యే ద్వేషాన్ని సహితం మనసులోంచి తీసేయాలని యెహోవా కోరుతున్నాడు. “తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు” అని అపొస్తలుడైన యోహాను చెప్పాడు. (1 యోహాను 3:15) అలాంటి వ్యక్తి తన సహోదరుణ్ణి ద్వేషించడమేకాదు అతని చావును కోరుకుంటాడు. ఆ ద్వేషం అలాగే కొనసాగితే అతను ఏదో ఒకరోజు, ఆ సహోదరుడు దేవుడు శిక్షించాల్సినంత ఘోరమైన పాపాలు చేశాడని చాడీలు చెబుతూ, నిందలు మోపే అవకాశముంది. (లేవీయకాండము 19:16; ద్వితీయోపదేశకాండము 19:18-21; మత్తయి 5:22) కాబట్టి మన మనసులో ఇతరులపై ఏ మాత్రం ద్వేషమున్నా దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయాలి.—యాకోబు 1:14, 15; 4:1-3.

19. దేవుని సూత్రాలను పాటించే వ్యక్తి కీర్తన 11:5, ఫిలిప్పీయులు 4:8, 9 వచనాలను ఎలా అర్థం చేసుకుంటాడు?

19 యెహోవాలాగే ప్రాణానికి విలువనిస్తూ, ఆయన ప్రేమలో నిలిచివుండాలని కోరుకునేవారు ఎలాంటి దౌర్జన్యం చేయరు. ‘బలాత్కారాసక్తులు యెహోవాకు అసహ్యులు’ అని కీర్తన 11:5 చెబుతోంది. ఆ వచనం దేవుని ఇష్టాయిష్టాల గురించి మాత్రమే కాదుగానీ జీవితంలో పాటించాల్సిన సూత్రాన్ని వివరిస్తోంది. అందువల్ల దేవుని ప్రేమించేవారు, దౌర్జన్యాన్ని పురికొల్పే ఎలాంటి వినోదానికైనా దూరంగా ఉంటారు. అంతేగాక యెహోవా “సమాధానకర్తయగు దేవుడు” అని గుర్తుంచుకొని, ఆయన సేవకులు కూడా తమ మనసులను హృదయాలను సమాధానకరమైన వాటితో అంటే రమ్యమైన, యోగ్యమైన, మెచ్చుకోదగిన విషయాలతో నింపుకోవాలి.—ఫిలిప్పీయులు 4:8, 9 చదవండి.

రక్తాపరాధ సంస్థల్లో భాగస్థులుగా ఉండకండి

20-22. లోక వ్యవహారాల విషయంలో క్రైస్తవులు ఎలా ఉంటారు? ఎందుకు?

20 దేవుని దృష్టిలో సాతాను లోకమంతా రక్తాపరాధంతో నిండివుంది. బైబిల్లో క్రూరమైన జంతువుగా చిత్రీకరించబడిన రాజకీయ సంస్థలు యెహోవా సేవకులతో సహా లక్షలాదిమందిని పొట్టనబెట్టుకున్నాయి. (దానియేలు 8:3, 4, 20-22; ప్రకటన 13:1, 2, 7, 8) ఈ క్రూరమైన రాజకీయశక్తులతో చేతులు కలిపిన వ్యాపార, వైజ్ఞానిక సంస్థలు అతి భయంకరమైన ఆయుధాలు తయారుచేసి లాభాలు గడించాయి. కాబట్టి “లోకమంతయు దుష్టుని యందున్నది” అనే మాటలు ఎంత నిజమో కదా!—1 యోహాను 5:19.

21 యేసు అనుచరులు ‘లోకసంబంధులుగా’ ఉండరు అంటే రాజకీయాల్లో, యుద్ధాల్లో పాల్గొనరు, వాటికి సంబంధించిన సంస్థల్లో పనిచేయరు కాబట్టి వ్యక్తిగతంగా వారిపైకి రక్తాపరాధం రాదు. ఆ రక్తాపరాధ సంస్థల దోషమూ వాళ్లకు వర్తించదు. d (యోహాను 15:19; 17:16) ఎవరైనా తమను హింసించినప్పుడు క్రీస్తులాగే వాళ్లు కూడా శాంతంగా వ్యవహరిస్తారు. తమ శత్రువులనైనా ప్రేమిస్తూ వాళ్లకోసం ప్రార్థిస్తారు.—మత్తయి 5:44; రోమీయులు 12:17-21.

22 మరి ప్రాముఖ్యంగా నిజ క్రైస్తవులు, ఘోర రక్తాపరాధియైన మహాబబులోనులో” అంటే యెహోవాను వ్యతిరేకించే మతాల్లో భాగంగా ఉండకూడదు. “ప్రవక్తలయొక్కయు, పరిశుద్ధులయొక్కయు, భూమిమీద వధింపబడిన వారందరియొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడెను” కాబట్టి దేవుని వాక్యం “దానిని విడిచి రండి” అని మనకు చెబుతోంది.—ప్రకటన 17:6; 18:2, 4, 24.

23. మహాబబులోనును విడిచి రావడం అంటే ఏమిటి?

23 మహాబబులోనును విడిచిరావడం అంటే యెహోవాను వ్యతిరేకించే ప్రపంచ మతాలను విడిచిపెట్టడం మాత్రమే సరిపోదు. ఆ మతాలు సమర్థిస్తున్న లేదా ప్రోత్సహిస్తున్న దుష్టకార్యాలను అంటే అనైతికంగా ప్రవర్తించడం, రాజకీయాల్లో పాల్గొనడం, సుఖభోగాల కోసం వెంపర్లాడడం వంటివాటిని అసహ్యించుకోవాలి. (కీర్తన 97:10 చదవండి; ప్రకటన 18:7, 9, 11-17) అలాంటి పనులవల్ల ఎంత తరచుగా రక్తపాతం జరుగుతుందో అందరికీ తెలిసిందే!

24, 25. (ఎ) దేని ఆధారంగా దేవుడు రక్తాపరాధియైన వ్యక్తిని కనికరిస్తాడు? (బి) పూర్వం దేవుడు చేసిన ఏ ఏర్పాటును ఇది మనకు గుర్తుచేస్తుంది?

24 సత్యారాధనను అంగీకరించడానికి ముందు మనలో ప్రతీ ఒక్కరం ఏదోకవిధంగా సాతాను లోకానికి మద్దతిచ్చి కొంతమేర రక్తాపరాధులం అయ్యాం. అయితే మనమిప్పుడు మన ప్రవర్తనను మార్చుకొని క్రీస్తు విమోచనా క్రయధన బలిని విశ్వసించి, దేవునికి మన జీవితాన్ని సమర్పించుకున్నాం కాబట్టే దేవుడు మనలను కనికరించి, తనకు దూరం కాకుండా సంరక్షిస్తున్నాడు. (అపొస్తలుల కార్యములు 3:19, 20) అలా తన ప్రజల్ని సంరక్షించేందుకు దేవుడు పూర్వం ఆశ్రయపురాలను ఏర్పాటు చేశాడు.—సంఖ్యాకాండము 35:11-15; ద్వితీయోపదేశకాండము 21:1-9.

25 అవి ఎందుకు ఏర్పాటు చేయబడ్డాయి? ఒక ఇశ్రాయేలీయుడు పొరపాటున ఎవరినైనా చంపేస్తే ఆయన ఆశ్రయపురాల్లో ఒకదానికి పారిపోవాలి. న్యాయాధిపతులు తీర్పు చెప్పిన తర్వాత ఆ వ్యక్తి, ప్రధాన యాజకుడు చనిపోయేంతవరకు ఆశ్రయపురంలోనే ఉండాలి. తర్వాత ఆయన ఎక్కడికైనా వెళ్లి జీవించవచ్చు. దేవుడెంత దయామయుడో, ప్రాణానికి ఆయనెంత విలువిస్తాడో చెప్పడానికి ఆ ఆశ్రయపురాలు ఎంత మంచి ఏర్పాటు! నేడు కూడా మనల్ని సంరక్షించేందుకు దేవుడు క్రీస్తు విమోచనా క్రయధన బలి ఆధారంగా అలాంటి ఏర్పాటే చేశాడు. ఒకవేళ మనం పొరపాటున ప్రాణాన్ని, రక్తాన్ని పవిత్రంగా చూడాలనే దేవుని ఆజ్ఞను ఉల్లంఘిస్తే మరణ శిక్ష రాకుండా ఆ ఏర్పాటు మనల్ని సంరక్షిస్తుంది. ఈ ఏర్పాటును మీరు విలువైనదిగా ఎంచుతున్నారా? అలా ఎంచుతున్నారని మీరెలా చూపించవచ్చు? త్వరలోనే “మహా శ్రమ” కలుగబోతోంది కాబట్టి ఆశ్రయపురాలకు సూచనగా ఉన్న ఈ ఏర్పాటు నుండి ప్రయోజనం పొందేందుకు ఇతరులకు కూడా సహాయం చేయడం ద్వారా మీరలా చూపించవచ్చు.—మత్తయి 24:20; 2 కొరింథీయులు 6:1, 2.

రాజ్య సందేశాన్ని ప్రకటించడం ద్వారా ప్రాణం విలువైనదని చూపించండి

26-28. నేడు మన పరిస్థితి ఎలా ప్రవక్తయైన యెహెజ్కేలు పరిస్థితిలాగే ఉంది? మనం దేవుని ప్రేమలో ఎలా నిలిచివుండవచ్చు?

26 మన కాలంలోని దేవుని ప్రజల పరిస్థితి కూడా ప్రాచీనకాల ప్రవక్తయైన యెహెజ్కేలు పరిస్థితిలాగే ఉంది. తన హెచ్చరికలను ఇశ్రాయేలీయులకు ప్రకటించే పనిని యెహోవా ఆయనకు అప్పగించాడు. “నీవు నా నోటిమాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను” అని దేవుడు చెప్పాడు. ఒకవేళ యెహెజ్కేలు అలా హెచ్చరించకపోతే యెరూషలేము నాశనం చేయబడినప్పుడు మరణించినవారి రక్తాపరాధం ఆయనపై ఉంటుందని కూడా చెప్పాడు. (యెహెజ్కేలు 33:7-9) కానీ యెహెజ్కేలు విధేయత చూపించాడు కాబట్టి ఆయనపై ఎలాంటి రక్తాపరాధం లేదు.

27 త్వరలోనే సాతాను ప్రపంచమంతా నాశనమవుతుంది. కాబట్టి యెహోవాసాక్షులు రాజ్యసందేశంతోపాటు దేవుని “ప్రతిదండన దినమును” ప్రకటించడాన్ని తమ బాధ్యతగా భావించి, ఆ అవకాశం దొరికినందుకు సంతోషిస్తారు. (యెషయా 61:2; మత్తయి 24:14) ఈ ప్రాముఖ్యమైన పనిలో మీరు పూర్తిగా భాగం వహిస్తున్నారా? అపొస్తలుడైన పౌలు ప్రకటనా పనిని ప్రాముఖ్యమైనదిగా ఎంచాడు కాబట్టే, ఆయనిలా చెప్పగలిగాడు: ‘ఎవరి నాశనము విషయమైనను నేను దోషినికాను. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండ నేనేమియు దాచుకొనలేదు.’ (అపొస్తలుల కార్యములు 20:26, 27) మనం అనుకరించడానికి ఎంత మంచి మాదిరో కదా!

28 తండ్రియైన యెహోవా ప్రేమలో నిలిచివుండాలంటే ఆయనలాగే ప్రాణాన్ని, రక్తాన్ని విలువైనదిగా ఎంచడం మాత్రమే సరిపోదు. ఆయన దృష్టిలో పరిశుభ్రంగా, పరిశుద్ధంగా ఉండాలి. ఈ విషయాన్ని తర్వాతి అధ్యాయంలో చూద్దాం.

a “రక్తము దేహమునకు ప్రాణము” అని దేవుడు చెప్పిన మాటల గురించి సైంటిఫిక్‌ జర్నల్‌ అనే పత్రిక ఇలా వ్యాఖ్యానించింది: “ఇక్కడ రక్తం ప్రాణంతో పోల్చబడినా, అది అక్షరాలా నిజం. ప్రాణానికి అన్ని రకాల రక్తకణాలు చాలా అవసరం.”

c ఆ లేఖనంలో ఉపయోగించబడిన హెబ్రీ పదాలు, “స్త్రీకి మాత్రమే హాని జరగడం గురించి మాట్లాడడం లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు” అని బైబిలు నిఘంటుకారులు అంటున్నారు. అంతేకాదు, గర్భస్థ శిశువుకు ఇన్ని నెలలు ఉంటేనే యెహోవా తీర్పు తీరుస్తాడు అని కూడా ఆ లేఖనం చెప్పడంలేదు.

e అనుబంధంలో 246-247 పేజీల్లోని సమాచారం చూడండి.