కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

5వ అధ్యాయం

లోకసంబంధులుగా ఉండకూడదంటే అర్థమేమిటి?

లోకసంబంధులుగా ఉండకూడదంటే అర్థమేమిటి?

“మీరు లోకసంబంధులు కారు.” —యోహాను 15:19.

1. యేసు చనిపోవడానికి ముందు రాత్రి ఏ విషయం ప్రాముఖ్యమని చెప్పాడు?

 యేసు చనిపోవడానికి ముందు రాత్రి తన శిష్యుల సంక్షేమం గురించి ఎంతో ఆలోచించాడు. దాని గురించే తన తండ్రికి ప్రార్థిస్తూ, “నీవు లోకములో నుండి వారిని తీసికొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు” అన్నాడు. (యోహాను 17:15, 16) అలా హృదయపూర్వకంగా చేసిన ప్రార్థనలో శిష్యులపట్ల తనకెంతో ప్రేమ ఉందని చూపించాడు. అంతేగాక, ఆయన అంతకుముందు కొందరితో “మీరు లోకసంబంధులు కారు” అని చెప్పిన మాటలకు ఎంత ప్రాముఖ్యతవుందో కూడా చూపించాడు. (యోహాను 15:19) యేసు, తన శిష్యులు ఈ లోకానికి దూరంగా ఉండాలని ఆశించాడు.

2. యేసు ప్రస్తావించిన “లోకం” అంటే ఏమిటి?

2 యేసు ప్రస్తావించిన “లోకం” అంటే దేవునికి దూరమై, సాతాను అధీనంలోవున్న లోకంలో, సాతానులాగే స్వార్థంతో, గర్వంతో జీవిస్తున్న మనుష్యులు అని అర్థం. (యోహాను 14:30; ఎఫెసీయులు 2:2; 1 యోహాను 5:19) ఈ ‘లోకంతో స్నేహం’ చేస్తే మనం ‘దేవునికి శత్రువులమౌతాం.’ (యాకోబు 4:4) అలాంటప్పుడు, దేవుని ప్రేమలో నిలిచివుండాలని కోరుకునేవాళ్లు ఈ లోకంలో ఉంటూనే, లోకసంబంధులు కాకుండా ఎలా ఉండవచ్చు? మనమీ అధ్యాయంలో ఐదు విధాల గురించి చూద్దాం: (1) క్రీస్తు పరిపాలించే దేవుని రాజ్యానికి మద్దతిస్తూ లోక రాజకీయాల్లో జోక్యం చేసుకోకూడదు. (2) లోకస్థుల్లా ఆలోచించకూడదు. (3) దుస్తులు, కనబడే తీరు గౌరవప్రదంగా ఉండాలి. (4) ప్రాముఖ్యమైనవాటికి మొదటి స్థానమివ్వాలి. (5) ఆధ్యాత్మిక సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి.

దేవుని రాజ్యానికి మద్దతిస్తూ రాజకీయాల్లో జోక్యం చేసుకోకూడదు

3. (ఎ) యేసు రాజకీయాల్లో ఎందుకు పాల్గొనలేదు? (బి) అభిషిక్తులైన యేసు అనుచరులు రాయబారులని ఎందుకు చెప్పవచ్చు? (అధస్సూచి చూడండి.)

3 యేసు భూమ్మీద ఉన్నప్పుడు రాజకీయాల్లో పాల్గొనకుండా భవిష్యత్తులో తాను రాజుగా ఉండే దేవుని రాజ్యం గురించి ప్రకటించడానికే ప్రాముఖ్యతనిచ్చాడు. (దానియేలు 7:13, 14; లూకా 4:43; 17:20, 21) అందుకే ఆయన, రోమా అధిపతియైన పొంతి పిలాతు ముందు “నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు” అని చెప్పగలిగాడు. (యోహాను 18:36) శిష్యులు క్రీస్తుకు నమ్మకంగా ఉంటూ ఆయనలాగే రాజ్యం గురించి ఇతరులకు చెబుతూ, దానికి మద్దతు ఇస్తారు. (మత్తయి 24:14) అందుకే అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు, “దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై—దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము.” a2 కొరింథీయులు 5:20.

4. నిజ క్రైస్తవులందరూ దేవుని రాజ్యానికి నమ్మకంగా ఉన్నామని ఎలా చూపించారు? ( 60వ పేజీలోని బాక్సు చూడండి.)

4 రాయబారులు సాధారణంగా తమ దేశం తరఫున వెళ్లి వేరే దేశంలో పని చేస్తారు అయినా ఆ దేశ రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోరు. అయితే, వాళ్లు తమ దేశ ప్రగతి కోసం పాటుపడతారు. అలాగే అభిషిక్త అనుచరుల “పౌరస్థితి పరలోకమునందున్నది” కాబట్టి వాళ్ళు కూడా ఈ లోక రాజకీయాల్లో పాల్గొనకుండా దేవుని రాజ్యం కొరకే పాటుపడతారు. (ఫిలిప్పీయులు 3:20) వాళ్లు ఉత్సాహంగా ఆ రాజ్యం గురించి ప్రకటిస్తూ క్రీస్తుకు చెందిన ‘వేరే గొఱ్ఱెలకు’ ‘దేవునితో సమాధానపడడానికి’ సహాయం చేస్తున్నారు. (యోహాను 10:16; మత్తయి 25:31-40) ఈ వేరే గొర్రెలు కూడా అభిషిక్త క్రైస్తవులకు చేదోడువాదోడుగా ఉంటూ రాజ్యాన్ని ప్రకటిస్తున్నారు. అంతా కలిసి ఒక మందగా మెస్సీయ రాజ్యం గురించి ప్రకటిస్తూ లోక రాజకీయ వ్యవహారాల్లో ఏమాత్రం జోక్యం చేసుకోరు.—యెషయా 2:2-4 చదవండి.

5. (ఎ) పూర్వం దేవుని ప్రజలకూ, ఇప్పుడున్న క్రైస్తవులకూ తేడా ఏమిటి? (బి) క్రైస్తవుల ప్రవర్తన ఎలా ఉండాలి?

5 నిజ క్రైస్తవులు రాజకీయాల్లో జోక్యం చేసుకోనిది క్రీస్తుకు నమ్మకంగా ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే కాదు. పూర్వం దేవుని ప్రజలందరూ ఒకే దేశంలో నివసించేవారు కానీ ఇప్పుడు మనం వేర్వేరు దేశాల్లో నివసిస్తూ ఐక్యంగా ఉంటున్నాం. (మత్తయి 28:19) కాబట్టి, రాజకీయ పార్టీలకు మద్దతిస్తే మనం దేవుని రాజ్యం గురించి మంచి మనస్సాక్షితో ప్రకటించలేము అంతేగాక మన క్రైస్తవ ఐక్యత దెబ్బతింటుంది. (1 కొరింథీయులు 1:10) సహోదరులను ప్రేమించమని మనం ఆజ్ఞాపించబడ్డాం. అదే మనం రాజకీయాల్లో పాల్గొంటే యుద్ధ సమయంలో మన సహోదరులకు వ్యతిరేకంగా పోరాడాల్సివస్తుంది. (యోహాను 13:34, 35; 1 యోహాను 3:10-12) అందుకే, యేసు తన శిష్యులతో కత్తి పట్టుకోవద్దు అని చెప్పాడు. చివరికి తమ శత్రువులను ప్రేమించమని కూడా చెప్పాడు.—మత్తయి 5:44; 26:52; 61 వ పేజీలో ఉన్న “ నేను రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటున్నానా?” అనే బాక్సు చూడండి.

6. దేవునికి సమర్పించుకున్న మీరు కైసరు విషయంలో ఎలా ప్రవర్తించాలి?

6 నిజ క్రైస్తవులముగా మనం దేవునికి మన జీవితాన్ని సమర్పించుకున్నాం. ఏ మనిషికో, ఏ సంస్థకో, ఏ దేశానికో కాదు. ‘మీరు మీ సొత్తు కారు, విలువపెట్టి కొనబడ్డారు’ అని 1 కొరింథీయులు 6:19, 20 చెబుతోంది. కాబట్టి ‘కైసరుకు’ లేదా ప్రభుత్వాలకు ఇవ్వాల్సిన గౌరవాన్నిస్తూ, పన్నులు చెల్లిస్తూ, తగిన విషయాల్లో లోబడుతూనే యేసు అనుచరులు ‘దేవునివి దేవునికి చెల్లిస్తారు.’ (మార్కు 12:17; రోమీయులు 13:1-7) అంటే వారు దేవుణ్ణే ఆరాధిస్తూ, మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ, నమ్మకంగా లోబడతారు. అవసరమైతే ఆయన కోసం తమ ప్రాణాల్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటారు.—లూకా 4:8; 10:27; అపొస్తలుల కార్యములు 5:29; రోమీయులు 14:8 చదవండి.

“లౌకికాత్మను” ఎదిరించండి

7, 8. “లౌకికాత్మ” అంటే ఏమిటి, అవిధేయులు ఎలాంటి లక్షణాలు వృద్ధిచేసుకునేలా అది ‘ప్రేరేపిస్తుంది’?

7 లోకానికి దూరంగా ఉండే రెండో విధమేమిటంటే క్రైస్తవులు లౌకికాత్మను ఎదిరించాలి అంటే ఈ లోకస్థుల్లా ఆలోచించకూడదు. “మనము లౌకికాత్మను కాక దేవుని యొద్దనుండి వచ్చు ఆత్మను పొందియున్నాము” అని పౌలు రాశాడు. (1 కొరింథీయులు 2:12) ఎఫెసీయుల పత్రికలో మళ్ళీ ఆయనే, “వాయుమండల సంబంధమైన అధిపతిని [‘అధికారానికి,’ NW], అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, [మీరు] యీ ప్రపంచ ధర్మముచొప్పున మునుపు నడుచుకొంటిరి” అని రాశాడు.—ఎఫెసీయులు 2:2, 3.

8 లోకసంబంధ ‘వాయువు’ లేదా లౌకికాత్మ అంటే లోకస్థుల ఆలోచనా విధానం. వాళ్ళ ప్రభావం వల్ల కొన్నిసార్లు దేవునికి అవిధేయులయ్యే లేక ‘శరీరాశకు నేత్రాశకు’ లొంగిపోయే ప్రమాదం ఉంది. (1 యోహాను 2:16; 1 తిమోతి 6:9, 10) మన చూట్టూ ఉన్న లోకస్థుల స్వభావం ప్రతిక్షణం మనపై ప్రభావం చూపిస్తుంది. వారిలా ఆలోచించడం మొదలుపెడితే అపరిపూర్ణ మానవులమైన మనం మోసపోతాం, శరీర కోరికల ప్రకారమే ప్రవర్తించాలనుకుంటాం. కాబట్టే లోకస్థుల ఆలోచనా విధానానికి మనపై ‘అధికారం’ ఉందని ఆ లేఖనం చెబుతోంది. అంతేకాదు, అవిధేయులు క్రమేణా స్వార్థం, గర్వం, అత్యాశ, అనైతికత, ధిక్కార స్వభావం లాంటి చెడు లక్షణాలను అలవాటు చేసుకునేలా లౌకికాత్మ ‘ప్రేరేపిస్తుంది.’ b ఒక్కమాటలో చెప్పాలంటే, లౌకికాత్మ మనుషుల హృదయాల్లో మెల్లమెల్లగా సాతాను లక్షణాలు వృద్ధయ్యేలా చేస్తుంది.—యోహాను 8:44; అపొస్తలుల కార్యములు 13:10; 1 యోహాను 3:8, 10.

9. లోకస్థుల ఆలోచనా విధానం మీ మనసును, హృదయాన్ని ఎలా ప్రభావితం చేయవచ్చు?

9 లోకస్థుల ఆలోచనా విధానం మీ మనసును, హృదయాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందా? జాగ్రత్తగా ఉండకపోతే అలా జరుగుతుంది. (సామెతలు 4:23 చదవండి.) లోకస్థుల ఆలోచనా విధానం చాపకింద నీరులా మిమ్మల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఉదాహరణకు, మీ స్నేహితులు మంచివాళ్ళైనా వాళ్ళు యెహోవాను ప్రేమించనివాళ్ళైతే వాళ్ళ ప్రభావం మీపై పడుతుంది. (సామెతలు 13:20; 1 కొరింథీయులు 15:33) చెడ్డ పుస్తకాలు, అశ్లీల లేదా మతభ్రష్ట వెబ్‌సైట్లు, హానికరమైన వినోదం, విపరీతమైన పోటీతత్వం ఉండే క్రీడలే కాక సాతాను, అతని వ్యవస్థకు సంబంధించిన ఆలోచనా విధానం గల ఎవరైనా, ఏదైనా మిమ్మల్ని తప్పుదారి పట్టించవచ్చు.

10. ఈ లోక ఆలోచనా విధానాన్ని ఎలా ఎదిరించవచ్చు?

10 ఇంతటి ప్రమాదకరమైన లోక ప్రభావాన్ని ఎదిరిస్తూ మనమెలా దేవుని ప్రేమలో నిలిచివుండవచ్చు? యెహోవా చేసిన ఏర్పాట్లనుండి పూర్తి ప్రయోజనం పొందుతూ, పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వమని నిత్యం ప్రార్థిస్తూ ఉంటేనే అది సాధ్యమౌతుంది. ఎందుకంటే యెహోవా దేవుడు, అపవాదికన్నా అతని అధీనంలోవున్న ఈ దుష్ట లోకంకన్నా ఎంతో శక్తిమంతుడు. (యాకోబు 4:7) అందుకే యెహోవాకు ప్రార్థిస్తూ ఆయనకు దగ్గరగా ఉండడం ఎంత ప్రాముఖ్యమో కదా!

దుస్తులు, కనబడే తీరు గౌరవప్రదంగా ఉండాలి

11. లోకస్థుల్లా ఆలోచించేవాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారు?

11 ఒక వ్యక్తిలో లోక స్వభావముంటే, దాన్ని వేసుకునే బట్టల్లో, తయారయ్యే విధానంలో, పరిశుభ్రత పాటించడంలో చూపిస్తాడు. అనేకదేశాల్లో ప్రజలు ఎంత అసభ్యంగా బట్టలు వేసుకుంటున్నారంటే ఒక టీవీ వ్యాఖ్యాత మాట్లాడుతూ, మామూలు ఆడపిల్లలే ఇలా తయారైతే కొంతకాలానికి వస్త్రధారణలో వేశ్యలకు వీళ్ళకు తేడా ఉండదు అన్నాడు. పట్టుమని పన్నెండు ఏళ్ళైనా రాని అమ్మాయిలు కూడా ‘ఒళ్ళు ఎక్కువగా కనిపించే బట్టలు వేసుకుంటున్నారని’ ఒక వార్తాపత్రిక పేర్కొంది. కొందరైతే సిగ్గులేకుండా, అసభ్యంగా, ధిక్కార స్వభావాన్ని చూపించేలా బట్టలు వేసుకుంటున్నారు.

12, 13. మనం వేసుకొనే బట్టలు, కనబడే తీరు విషయంలో ఏ సూత్రాలు గుర్తుంచుకోవాలి?

12 యెహోవా సేవకులముగా మనం చక్కగా అంటే, శుభ్రంగా, మర్యాదపూర్వకంగా, సందర్భానికి తగినట్టుగా తయారవ్వాలనుకుంటాం. “దైవభక్తిగలవారమని” చెప్పుకునే స్త్రీపురుషులముగా మనం “సత్క్రియలు” చేయాలి. అంతేకాదు, అన్ని సమయాల్లోనూ మన వస్త్రధారణ ‘అణకువను, స్వస్థబుద్ధిని’ చూపించేలా ఉండాలి. ప్రజలు మనల్ని మెచ్చుకోవాలని కాదుగానీ ‘దేవుని ప్రేమలో నిలిచివుండాలి’ అనే ముఖ్య ఉద్దేశంతోనే మనమలా చేస్తాం. (1 తిమోతి 2:9, 10; యూదా 20, 21) ‘దేవుని దృష్టికి మిగుల విలువైన’ ‘అంతరంగ స్వభావమే’ మనకు అలంకారంగా ఉండాలని కోరుకోవాలి.—1 పేతురు 3:3, 4.

13 మనం వేసుకొనే బట్టలు, మనం కనబడే తీరును బట్టి ఇతరులు సత్యారాధనవైపు ఆకర్షితులయ్యే అవకాశముందని కూడా మనం మర్చిపోకూడదు. ఆడంబరాలకు పోకుండా మనకు దైవభక్తి ఉందని, ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తున్నామని చూపించే విధంగా తయారవ్వాలి. కాబట్టి మనకు ఇష్టం వచ్చినట్టు ఉండాలని కాదుగానీ ఇతరులకు అభ్యంతరకరంగా ఉంటుందా అని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా మనం యెహోవా దేవునికి, ఆయన ప్రజలకు గౌరవం తీసుకువస్తూ ఆయన పరిచారకులముగా ‘సమస్తం ఆయన మహిమ కోసం’ చేయాలి.—1 కొరింథీయులు 4:9; 10:31; 2 కొరింథీయులు 7:1; 1 పేతురు 2:12.

నేను వేసుకునే బట్టలు యెహోవాకు గౌరవాన్ని తీసుకువస్తాయా?

14. శుభ్రత, వస్త్రధారణ విషయంలో మనమెలాంటి ప్రశ్నలు వేసుకోవాలి?

14 మరి ముఖ్యంగా మనం ప్రకటనా పనికి లేదా క్రైస్తవ కూటాలకు వెళ్తున్నప్పుడు శుభ్రంగా, చక్కగా తయారవ్వాలి. ‘నేను వేసుకునే బట్టలు, నా శరీరం శుభ్రంగా లేకపోవడం ఇతరులకు అభ్యంతరం కలిగిస్తుందా? నాతో కలివిడిగా ఉండడానికి ఇబ్బందిపడుతున్నారా? సంఘంలో బాధ్యతలు ఇవ్వకపోయినా ఫర్వాలేదు గానీ నేను మాత్రం నాకు నచ్చినట్టే ఉంటాను అనుకుంటున్నానా?’ అని ప్రశ్నించుకోవాలి.—సామెతలు 28:14; ఫిలిప్పీయులు 4:5; 1 పేతురు 5:6.

15. బట్టలు, కనబడే తీరు, శరీర శుభ్రత విషయాల్లో బైబిల్లో నియమాల పట్టిక ఎందుకు లేదు?

15 బట్టలు, కనబడే తీరు, శరీర శుభ్రత వంటి విషయాల్లో క్రైస్తవుల కోసం బైబిల్లో నియమాల పట్టిక అంటూ ఏదీలేదు. మనం ఎలాంటి స్వేచ్ఛా లేకుండా, ఏమీ ఆలోచించకుండా ఆయన చెప్పిందే చేయాలని యెహోవా అడగడం లేదు. బదులుగా బైబిల్లో ఉన్న సూత్రాల గురించి జాగ్రత్తగా ఆలోచించి, “అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు” కలిగివుండాలని ఆయన కోరుతున్నాడు. (హెబ్రీయులు 5:14) అంతకన్నా ముఖ్యంగా ఆయనమీద ప్రేమతో, ఇతరులమీద ప్రేమతో నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నాడు. (మార్కు 12:30, 31 చదవండి.) కాబట్టి పైన పేర్కొన్న విషయాలన్నీ మనసులో ఉంచుకొని ఎవరికీ అభ్యంతరం కలిగించకుండానే రకరకాల బట్టలు వేసుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడైనా వివిధ రంగుల్లో, వివిధ రకాల బట్టలతో సంతోషంగా సమకూడే యెహోవాసాక్షుల్ని చూస్తే ఆ విషయం మీకే తెలుస్తుంది.

“కన్ను తేటగా” ఉంచుకోండి

16. (ఎ) యేసు బోధకు భిన్నంగా లోకస్థుల ఆలోచన ఎలావుంది? (బి) మనం ఏ ప్రశ్నలు వేసుకోవాలి?

16 ఆనందంగా ఉండాలంటే దానికి డబ్బు, వస్తుసామగ్రి ప్రాముఖ్యమని లోకంలో చాలామంది అనుకుంటూ లక్షలాదిమంది ఇతరులకు అదే చెప్పి మోసగిస్తుంటారు. కానీ “ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు” అని యేసు చెప్పాడు. (లూకా 12:15) అంటే బైరాగుల్లా జీవించాలని దానర్థం కాదు. బదులుగా, కంటిని “తేటగా” ఉంచుకుంటూ ‘ఆధ్యాత్మిక అవసరాన్ని గుర్తిస్తే,’ అంటే ఆధ్యాత్మిక విషయాలకే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తే సంతోషంగా ఉంటారని యేసు బోధించాడు. (మత్తయి 5:3, NW; 6:22, 23) కాబట్టి మీరిలా ప్రశ్నించుకోండి: ‘యేసు చెప్పింది నేను నిజంగా నమ్ముతున్నానా లేక “అబద్ధమునకు జనకు[డైన]” సాతాను చెప్పింది నమ్ముతున్నానా? (యోహాను 8:44) నా మాటలు, లక్ష్యాలు, ప్రాధాన్యతలు, జీవన విధానం ఏమి చూపిస్తున్నాయి?’—లూకా 6:45; 21:34-36; 2 యోహాను 6.

17. ఆధ్యాత్మిక విషయాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చేవారికి కలిగే కొన్ని ప్రయోజనాలేమిటో చెప్పండి.

17 “జ్ఞానము జ్ఞానమని దాని క్రియలనుబట్టి తీర్పుపొందును” అని యేసు చెప్పాడు. (మత్తయి 11:19) ఆధ్యాత్మిక విషయాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చేవారికి కలిగే కొన్ని ప్రయోజనాలేమిటో చూడండి. రాజ్య సేవలో వారు నిజమైన సేదదీర్పు పొందుతారు. (మత్తయి 11:29, 30) ఏ విషయంలోనూ అతిగా ఆందోళన చెందరు కాబట్టి వారి మనసు ప్రశాంతంగా ఉంటుంది. (1 తిమోతి 6:9, 10 చదవండి.) ఉన్నంతలో సంతృప్తిగా ఉంటారు కాబట్టి వారు కుటుంబంతో, క్రైస్తవ సహోదరులతో ఎక్కువ సమయం గడపగలుగుతారు. హాయిగా, కంటినిండా నిద్రపోగలుగుతారు. (ప్రసంగి 5:12) వాళ్ళు ఇతరులకు చేతనైనంత సహాయం చేస్తూ ఇవ్వడంలోవున్న ఆనందాన్ని పొందుతారు. (అపొస్తలుల కార్యములు 20:35) గొప్ప ‘నిరీక్షణ గలిగి’ మనశ్శాంతితో, సంతృప్తితో జీవిస్తారు. (రోమీయులు 15:13; మత్తయి 6:31, 32) ఇవి నిజంగా వెలకట్టలేని ఆశీర్వాదాలు!

“సర్వాంగకవచమును” ధరించుకోండి

18. మన శత్రువును, అతని కుతంత్రాలను, మనం చేసే ‘పోరాటాన్ని’ బైబిలు ఎలా వర్ణిస్తుంది?

18 క్రైస్తవులకు సంతోషంతోపాటు నిత్యజీవం కూడా దక్కకుండా చేయాలని ప్రయత్నించే సాతాను కుతంత్రాల నుండి దేవుని ప్రేమలో నిలిచి ఉండేవాళ్ళకు సంరక్షణ లభిస్తుంది. (1 పేతురు 5:8) “మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోకనాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము” అని పౌలు చెప్పాడు. (ఎఫెసీయులు 6:12) “పోరాడుచున్నాము” అని అనువదించబడిన గ్రీకు పదానికి రక్షణస్థావరంలో దాక్కొని దూరం నుండి పోరాడడం కాదుగానీ ముఖాముఖిగా పోరాడుతున్నామని అర్థం. అంతేకాక “ప్రధానులు,” “అధికారులు,” “లోకనాథులు” అనే పదాలను బట్టి చూస్తే దురాత్మలు, పథకం ప్రకారం పకడ్బందీగా, ఉద్దేశపూర్వకంగా పోరాడుతున్నాయని అర్థమవుతుంది.

19. క్రైస్తవులకు దేవుడిచ్చు సర్వాంగకవచాన్ని వర్ణించండి.

19 మనకు బలహీనతలున్నా విజయం సాధించవచ్చు. ఎలా? “దేవుడిచ్చు సర్వాంగకవచమును” ధరించుకుంటే అది సాధ్యమే. (ఎఫెసీయులు 6:13) ఆ సర్వాంగకవచాన్ని ఎఫెసీయులు 6:14-18 వచనాలు ఇలా వర్ణిస్తున్నాయి: “మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సను జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నియుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి; దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును [లేక నిరీక్షణను], దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.”

20. సైనికులకు మనకు ఉన్న తేడా ఏమిటి?

20 దేవుడు ఇచ్చిన ఆ సర్వాంగకవచాన్ని ధరించుకున్నంత కాలం మనం సురక్షితంగా ఉంటాం. సైనికులు ఎప్పుడూ యుద్ధం చేస్తూనేవుండరు. కానీ క్రైస్తవులమైన మనం, సాతాను లోకాన్ని దేవుడు నాశనం చేసి, దుష్టాత్మలన్నింటినీ అగాధంలో బంధించేంతవరకు జీవన్మరణ పోరాటం చేస్తూనే ఉండాలి. (ప్రకటన 12:17; 20:1-3) మీరొకవేళ బలహీనతలతో, తప్పుడు కోరికలతో పోరాడుతూవుంటే నిరాశ చెందకండి. ఎందుకంటే యెహోవాపట్ల విశ్వసనీయంగా ఉండాలంటే మనందరం మనసును “నలగగొట్టి” అయినా సరే పోరాడాల్సివుంటుంది. (1 కొరింథీయులు 9:27) నిజానికి అసలు పోరాడకుండా ఉంటేనే ప్రమాదం!

21. ఏమి చేస్తేనే మనం ఆధ్యాత్మిక యుద్ధంలో విజయం సాధించవచ్చు?

21 అంతేగాక ఈ పోరాటాన్ని మన సొంత శక్తితో జయించలేము. అందుకే “ఆత్మవలన ప్రతి సమయమునందును” యెహోవాకు ప్రార్థించాలని పౌలు మనకు గుర్తుచేశాడు. అలాగే బైబిలు చదవడం ద్వారా యెహోవా చెబుతున్నది వినాలి. అంతేకాదు, మనం ఒంటరిగా పోరాడడం లేదు కాబట్టి ఎల్లప్పుడూ తోటి ‘యోధులతో’ సహవసిస్తూ, వాళ్ల ద్వారా కూడా యెహోవా చెబుతున్నది వినాలి. (ఫిలేమోను 2; హెబ్రీయులు 10:24, 25) ఈ విషయాలన్నింటిలో విశ్వసనీయంగా ఉన్నవాళ్ళు విజయం సాధిస్తారు, తమ విశ్వాసాన్ని ప్రశ్నించేవారికి సరైన సమాధానం ఇవ్వగలుగుతారు.

మీ విశ్వాసాన్ని సమర్థించుకోవడానికి సిద్ధంగా ఉండండి

22, 23. (ఎ) మన విశ్వాసాన్ని సమర్థించుకోవడానికి మనం ఎల్లప్పుడూ ఎందుకు సిద్ధంగా ఉండాలి? మనమేమని ప్రశ్నించుకోవాలి? (బి) తర్వాతి అధ్యాయంలో మనం ఏ అంశాన్ని పరిశీలిస్తాం?

22 “మీరు లోకసంబంధులు కారు . . . అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది” అని యేసు చెప్పాడు. (యోహాను 15:19) కాబట్టి క్రైస్తవులు తమ విశ్వాసాన్ని ప్రశ్నించేవారికి గౌరవంతో, సాత్వికంతో సమాధానమివ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. (1 పేతురు 3:15 చదవండి.) మీరిలా ప్రశ్నించుకోండి: ‘యెహోవాసాక్షులు కొన్నిసార్లు ఎందుకు భిన్నంగా ఉంటారో అర్థం చేసుకున్నానా? అలాంటి పరిస్థితుల్లో బైబిలు, నమ్మకమైన దాసుడు చెప్పేదే సరైనదని నేను నమ్ముతున్నానా? (మత్తయి 24:45; యోహాను 17:17) యెహోవా దృష్టిలో సరైనది చేయాల్సివచ్చినప్పుడు, లోకానికి భిన్నంగా ఉండడానికి సిద్ధంగా ఉండడమే కాక అలా భిన్నంగా ఉన్నందుకు గర్విస్తున్నానా?’—కీర్తన 34:2; మత్తయి 10:32, 33.

23 లోక సంబంధులుగా ఉండకూడదన్న మన కోరిక చాలావరకు మనకు తెలియకుండానే పరీక్షించబడుతుంది. ఉదాహరణకు మనం ముందు చూసినట్లుగా అపవాది ఈ లోక వినోదకార్యకలాపాల ద్వారా యెహోవా సేవకుల్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాడు. మనకు సేదదీర్పునిస్తూ, మన మనస్సాక్షిని నిర్మలంగా ఉంచే మంచి వినోదాన్ని మనమెలా ఎంపిక చేసుకోవచ్చు? ఈ అంశాన్ని మనం తర్వాతి అధ్యాయంలో పరిశీలిద్దాం.

a సా.శ. 33 పెంతెకొస్తు దినం మొదలుకొని క్రీస్తు, భూమిపైనున్న తన అభిషిక్త అనుచరుల సంఘంపై పరిపాలిస్తున్నాడు. (కొలొస్సయులు 1:13) యేసుక్రీస్తు 1914లో ‘లోకరాజ్యముపై’ రాజుగా నియమించబడ్డాడు. కాబట్టి, అభిషిక్త క్రైస్తవులు ఇప్పుడు కూడా మెస్సీయ రాజ్యానికి రాయబారులుగా ఉన్నారు.—ప్రకటన 11:15.

b యెహోవాసాక్షులు ప్రచురించిన కావలికోట ఏప్రిల్‌ 1, 2004, 9-13 పేజీలు, సెప్టెంబరు 15, 2008, 20-24 పేజీలు చూడండి.

c అనుబంధంలోని 243-246 పేజీలు చూడండి.