11వ అధ్యాయం
‘వివాహాన్ని ఘనమైనదిగా’ ఉంచుకోండి
“నీ యౌవనకాలపు భార్యయందు సంతోషింపుము.” —సామెతలు 5:18.
1, 2. మనం ఏ ప్రశ్నకు జవాబు చూడబోతున్నాం? ఎందుకు?
మీకు పెళ్ళైందా? అయ్యుంటే, మీ దాంపత్య జీవితం సంతోషంగానే ఉందా లేదా మీమధ్య తీవ్రమైన సమస్యలు ఉన్నాయా? మీ మధ్య దూరం అంతకంతకూ పెరుగుతోందా? ఎలాంటి ఆనందం లేకుండా ఏదో తప్పదులే అన్నట్లుగా నెట్టుకొస్తున్నారా? అలాగైతే, పెళ్లి చేసుకున్నప్పుడు ఉన్నంత సంతోషం ఇప్పుడు కరువైనందుకు మీకు బాధగా ఉండవచ్చు. మీరు క్రైస్తవులైతే, మీరు ప్రేమించే యెహోవా దేవునికి ఘనత తీసుకువచ్చేలా మీ కుటుంబం ఉండాలని కోరుకుంటారు. కాబట్టి మీ కుటుంబంలో ఉన్న ఈ పరిస్థితిని బట్టి మీకు ఎంతో బాధ కలుగుతుండవచ్చు. అలాగని పరిస్థితి చేయిదాటి పోయిందని అనుకోకండి.
2 ఇప్పుడు క్రైస్తవ సంఘంలో ఎంతో అన్యోన్యంగా ఉన్న కొంతమంది దంపతులు ఒకప్పుడు సమస్యలతో సతమతమయ్యారు. అయితే వారు, సమస్యలను పరిష్కరించుకొని మళ్ళీ సంతోషంగా ఉండడమెలాగో తెలుసుకున్నారు. మీరు కూడా మీ కుటుంబ జీవితాన్ని సంతోషభరితం చేసుకోవచ్చు. ఎలా?
దేవునికి, మీ జతకు దగ్గరవ్వండి
3, 4. భార్యాభర్తలు దేవునికి దగ్గరవడానికి ప్రయత్నిస్తే వాళ్లెలా ఒకరికొకరు దగ్గరవుతారు? ఉపమానంతో వివరించండి.
3 మీరు దేవునికి దగ్గరవడానికి ప్రయత్నిస్తే మీరిద్దరూ ఒకరికొకరు దగ్గరవుతారు. ఎందుకలా చెప్పవచ్చు? ఈ ఉపమానం చూడండి: మీరిద్దరూ ఒక కొండకు ఇరువైపులా నిలబడి ఉన్నారనుకోండి. ఇప్పుడు దానిపైకి ఎక్కాలి. మొదట్లో మీ ఇద్దరి మధ్య ఎంతో దూరం ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ పైకి ఎక్కుతూ వెళ్తుండగా మీ మధ్య దూరం తరుగుతూ ఉంటుంది. ఈ ఉపమానంలో ఉన్న పాఠం ఏమిటి?
4 యెహోవాను మనస్ఫూర్తిగా సేవించడానికి మీరు చేసే ప్రయత్నం కొండ ఎక్కడానికి చేసే ప్రయత్నంలాంటిదే. మీకు యెహోవాపట్ల ప్రేమ ఉంది కాబట్టి మీరిప్పటికే కొండ ఎక్కే ప్రయత్నంలో ఉన్నారు అంటే యెహోవాను మనస్ఫూర్తిగా సేవించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే విబేధాల వల్ల మీరిద్దరూ వేర్వేరు వైపుల నుండి ఎక్కుతున్నారు. మీరలా ఎక్కుతూ వెళ్తే ఏమౌతుంది? మొదట్లో మీమధ్య దూరం ఎక్కువే ఉన్నా, కొండ ఎక్కడానికి అంటే దేవునికి దగ్గరవడానికి మీరెంత ప్రయత్నిస్తే మీ భార్య/భర్తకు అంత దగ్గరవుతారు. నిజం చెప్పాలంటే మీరు దేవునికి దగ్గరైతేనే ఒకరికొకరు దగ్గరవగలుగుతారు. కానీ అదెలా సాధ్యం?
బైబిల్లోని విషయాలను పాటిస్తే జీవితాంతం అన్యోన్యంగా ఉండగలుగుతారు
5. (ఎ) యెహోవాకు, మీ భార్య/భర్తకు దగ్గరవడానికి ఒక మార్గం ఏమిటి? (బి) యెహోవా భార్యాభర్తల బంధాన్ని ఎలా ఎంచుతాడు?
5 దేవునికి దగ్గరవడం ఎలా సాధ్యమో చూద్దాం. ఒక ప్రాముఖ్యమైన మార్గం ఏమిటంటే, మీరిద్దరూ దేవుని వాక్యంలో వివాహం గురించి ఇవ్వబడిన ఉపదేశాన్ని నేర్చుకుని పాటించాలి. (కీర్తన 25:4; యెషయా 48:17, 18) అపొస్తలుడైన పౌలు చెప్పిన ఒక సలహా చూడండి: ‘వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండాలి.’ (హెబ్రీయులు 13:4) అంటే అర్థమేమిటి? “ఘనమైనది” అనే పదానికి అమూల్యమైన, విలువైన అనే అర్థాలున్నాయి. యెహోవా దేవుడు కూడా భార్యాభర్తల బంధాన్ని విలువైనదిగా ఎంచుతాడు.
యెహోవాపట్ల ప్రేమతో చేయండి
6. హెబ్రీయులు 13:1-5 వచనాల్లోని పౌలు మాటలనుబట్టి ఏ విషయం అర్థమౌతుంది? దాన్ని గుర్తుంచుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?
6 యెహోవా సేవకులుగా ఇప్పటికే మీ ఇద్దరికీ వివాహ బంధం అమూల్యమైనదని, పవిత్రమైనదని తెలుసు. యెహోవాయే మొట్టమొదటి వివాహాన్ని జరిపించాడు. (మత్తయి 19:4-6 చదవండి.) మీ మధ్య ఇప్పుడు సమస్యలు ఉండొచ్చు. అయితే, వాటిని దాటి మీరు ఒకరితో ఒకరు ప్రేమగా, గౌరవంగా మసలుకొనే పరిస్థితి నెలకొనాలంటే వివాహ ఏర్పాటు ఘనమైనదని తెలిసుంటే సరిపోదు. హెబ్రీయులు 13:1-5 వచనాలను చూస్తే, పౌలు వివాహంతోపాటు ఇంకా ఇతర విషయాల గురించి ఉద్బోధించాడు. అంటే వాటిని ఖచ్చితంగా చేయాలని చెప్పాడని అర్థమౌతుంది. మరి వివాహం గురించి ఏమి చెప్పాడు? అది ‘ఘనమైనది’ అని కాదుగానీ అది ‘ఘనమైనదిగా ఉండాలి’ అని చెప్పాడు. అంటే దాన్ని ఘనమైనదిగా చేయాలని చెప్పాడు. దానికి మీరు మీ వంతు కృషి చేయాలని గుర్తుంచుకుంటే, మీ భార్య/భర్త పట్ల మీకు ముందున్న ప్రేమ మళ్లీ చిగురించడానికి అది సహాయం చేస్తుంది. ఎందుకలా చెప్పవచ్చు?
7. (ఎ) బైబిల్లో ఇవ్వబడిన ఏ ఆజ్ఞలకు మనం లోబడతాం? ఎందుకు? (బి) దానివల్ల ఎలాంటి మంచి ఫలితాలొస్తాయి?
7 శిష్యులను చేయమని, ఆరాధన కోసం అందరూ సమకూడాలని బైబిల్లో ఇవ్వబడిన ఆజ్ఞలకు మీరు లోబడరా? లోబడతారు. (మత్తయి 28:19; హెబ్రీయులు 10:24, 25) అవి చేయడం కొంచెం కష్టంగావున్నా, సమస్యలొచ్చినా మీరు చేస్తారు. మీరు ప్రకటించే రాజ్య సందేశాన్ని ప్రజలు వినకపోయినా ప్రకటిస్తారు. పని నుండి అలసిపోయి వచ్చి కష్టంగా ఉన్నా క్రైస్తవ కూటాలకు వెళ్తారు. మీరు మనస్ఫూర్తిగా యెహోవాపట్ల ప్రేమతో ఆయన ఆజ్ఞలకు లోబడుతున్నారు కాబట్టి మిమ్మల్ని ఎవ్వరూ, చివరికి సాతాను కూడా ఆపలేడు. (1 యోహాను 5:3) ప్రకటనా పనిలో పాల్గొంటూ, కూటాలకు హాజరవడం వల్ల ఎలాంటి మంచి ఫలితాలొస్తాయి? మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది, దేవుణ్ణి సంతోషపెడుతున్నామన్న సంతృప్తి, సంతోషం ఉంటాయి. ఆ సంతోషం మీలో ఉత్సాహాన్ని నింపుతుంది. (నెహెమ్యా 8:10) ఇంతకీ ఇందులో మనకు ఏ పాఠం ఉంది?
8, 9. (ఎ) మనం ఎందుకు మన వివాహాన్ని ఘనమైనదిగా ఉంచుకోవాలనుకుంటాం? (బి) దానికోసం కృషి చేయడంవల్ల ఎలాంటి ఫలితాలొస్తాయి? (సి) ఏ రెండు విషయాల గురించి మనం పరిశీలించబోతున్నాం?
8 ప్రకటనా పనిచేయడం, కూటాలకు వెళ్లడం కొంచెం కష్టమైనా యెహోవాపట్ల ప్రేమతోనే మీరు ఆ ఆజ్ఞలకు లోబడుతున్నారు. అదే ప్రేమవుంటే, కష్టమైనా ‘వివాహాన్ని ఘనమైనదిగా’ ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. (హెబ్రీయులు 13:4; కీర్తన 18:29; ప్రసంగి 5:4) ఆ ఆజ్ఞలకు లోబడినందుకు దేవుడు ఎలాగైతే మిమ్మల్ని మెండుగా ఆశీర్వదిస్తాడో, అలాగే మీ వివాహాన్ని ఘనమైనదిగా ఉంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలను చూసి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.—1 థెస్సలొనీకయులు 1:3; హెబ్రీయులు 6:10.
9 మరి మీరెలా మీ వివాహాన్ని ఘనమైనదిగా ఉంచుకోవచ్చు? మొదటిగా, మీ మధ్య ఉన్న బంధం తెగిపోయే పనులేవీ చేయకండి. రెండవదిగా, సమస్యల్ని పరిష్కరించుకొని మళ్లీ సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి.
వివాహ బంధం దెబ్బతినేలా మాట్లాడకండి, ప్రవర్తించకండి
10, 11. (ఎ) ఎలాంటి ప్రవర్తన వివాహ ఏర్పాటును అగౌరవపరుస్తుంది? (బి) మీ వివాహజతను ఏమని అడగాలి?
10 కొంతకాలం క్రితం ఒక క్రైస్తవ భార్య ఇలా చెప్పింది: “నా భర్త నన్ను కించపర్చేలా మాట్లాడతాడు. ‘నువ్వు ఎందుకూ పనికిరావు’ అని ఆయన అనే తూటాల్లాంటి మాటలు నా మనసును ఎంతో గాయపర్చాయి. ఆ గాయాలు పైకి కనిపించేవి కావు. ఆ మాటలను భరించడానికి సహాయం చేయమని నేను యెహోవాకు ప్రార్థిస్తాను.” ఈ భార్య చెబుతున్న దాన్నిబట్టి గాయపర్చేలా మాట్లాడడం ఎంత తీవ్రమైనదో మనం ఆలోచించాలి.
11 క్రైస్తవ భార్యాభర్తలు నొప్పించేలా మాట్లాడి మనసును గాయపర్చడం ఎంత విచారకరం! అలా మాట్లాడే భార్యాభర్తలు తమ వివాహాన్ని ఘనమైనదిగా ఉంచుకోలేరు. మీ ఇంట్లో కూడా అలాంటి సమస్యే ఉందా? అది తెలుసుకోవాలంటే మీ భార్య/భర్తను, “నేనెప్పుడైనా బాధకలిగించేలా మాట్లాడానా?” అని అడిగి చూడండి. నాకు కొన్నిసార్లు బాధకలిగింది అని వాళ్ళు చెప్తే మార్పులు చేసుకోవడానికి సుముఖంగా ఉండండి.—గలతీయులు 5:15; ఎఫెసీయులు 4:31 చదవండి.
12. ఒకరి ఆరాధన దేవుని దృష్టిలో ఎలా వ్యర్థం అవుతుంది?
12 మీ మాటలవల్ల యెహోవాతో మీకున్న సంబంధం పాడవుతుందని గుర్తుంచుకోండి. “ఎవడైనను నోటికి కళ్లెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తిగలవాడనని అనుకొనిన యెడల వాని భక్తి వ్యర్థమే” అని బైబిలు చెబుతోంది. (యాకోబు 1:26) దేవుడు మీ ఆరాధనను అంగీకరించాలంటే మీరు మాట్లాడే తీరు సరిగా ఉండాలి. దేవుని సేవ చేస్తున్నంతవరకు మనం ఇంట్లో ఎలా ఉన్నా ఫర్వాలేదు అనుకోవడం బైబిలు ప్రకారం సరికాదు. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ఇదేమీ చిన్న విషయం కాదు. (1 పేతురు 3:7 చదవండి.) మీకు ఎంతో సామర్థ్యం ఉన్నా, దేవుని సేవ చేయాలన్న ఉత్సాహం ఉన్నా మీ భార్య/భర్తను తూటాల్లాంటి మాటలతో గాయపరిస్తే మీరు వివాహ ఏర్పాటును అగౌరవపర్చినట్లు అవుతుంది, మీరు చేసే ఆరాధన దేవుని దృష్టిలో వ్యర్థమే.
13. దంపతులు ఒకరినొకరు ఎలా బాధపెట్టుకొనే అవకాశం ఉంది?
13 పరోక్షంగానైనా దంపతులు ఒకరినొకరు బాధపెట్టుకోకూడదు. రెండు ఉదాహరణలు చూడండి: సంఘంలోని ఒక ఒంటరి తల్లి, వివాహిత క్రైస్తవునికి పదేపదే ఫోను చేసి సలహాలు అడుగుతుంది, వాళ్ళిద్దరూ గంటల తరబడి మాట్లాడుకుంటారు. రెండోది, అవివాహిత సహోదరుడు పెళ్ళైన సహోదరితో కలిసి ప్రతీ వారం క్షేత్రసేవలో చాలా ఎక్కువ సమయం గడుపుతాడు. ఈ రెండు ఉదాహరణల్లో పెళ్ళైన వాళ్ళకు ఎలాంటి చెడు ఉద్దేశాలు ఉండకపోవచ్చు. కానీ అలా చేస్తే వాళ్ళ భార్య/భర్త ఏమనుకుంటారు? అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న ఒక భార్య ఇలా అంది: “నా భర్త సంఘంలోని మరో స్త్రీకి అంత సమయం ఇవ్వడం చూసి నాకెంతో బాధ కలుగుతుంది. నేనెందుకు పనికిరాని దాన్నని అనిపిస్తుంది.”
14. (ఎ) ఆదికాండము 2:24 ప్రకారం భార్యాభర్తలిద్దరికీ ఏ బాధ్యత ఉంది? (బి) మనం ఏ ప్రశ్న వేసుకోవాలి?
14 అలాంటి పరిస్థితిలోవున్న ఎవరైనా ఆమెలాగే బాధపడతారు. ఎందుకంటే, వాళ్ళ భాగస్వాములు దేవుడిచ్చిన ఈ ప్రాథమిక ఉపదేశాన్ని పట్టించుకోవడంలేదు: “పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును.” (ఆదికాండము 2:24) పెళ్ళి చేసుకున్నవాళ్ళకు తమ తల్లిదండ్రుల పైన గౌరవం ఉన్నా వాళ్ళు ముఖ్యంగా తమ జత గురించి ఆలోచించి వారికి ప్రాముఖ్యతనివ్వడమే దేవుని ఏర్పాటు. అలాగే క్రైస్తవులకు తోటి విశ్వాసులపట్ల ఎంత ప్రేమవున్నా, వాళ్ళ జీవితంలో తమ జతకు ప్రాముఖ్యతనివ్వడమే వాళ్ళ కర్తవ్యం. వివాహిత క్రైస్తవులు తోటి విశ్వాసులతో ముఖ్యంగా పరాయి స్త్రీ/పురుషునితో ఎక్కువ సమయం గడుపుతున్నా లేదా వారిపట్ల అతిగా శ్రద్ధ చూపుతున్నా చేజేతులా తమ వివాహ బంధాన్ని పాడుచేసుకుంటారు. మీ కుటుంబంలో ఈ సమస్య ఉందా? అలాగైతే మీరు ఈ ప్రశ్న వేసుకోండి: ‘నా భార్య/భర్తతో నేను గడపాల్సినంత సమయం గడుపుతున్నానా? తనపట్ల తగినంత శ్రద్ధ, ప్రేమ చూపిస్తున్నానా?’
15. వివాహిత క్రైస్తవులు పరాయి వ్యక్తిపై అతిగా శ్రద్ధ చూపిస్తే ఏ ప్రమాదం ఉందని మత్తయి 5:28 చెబుతోంది?
15 పరాయి వ్యక్తిపై అతిగా శ్రద్ధ చూపించే వివాహిత క్రైస్తవులు తీవ్రమైన సమస్యలు కొనితెచ్చుకుంటారు. విచారకరమైన విషయం ఏమిటంటే, కొంతమంది వివాహిత క్రైస్తవులు పరాయివాళ్లతో ఎక్కువ సమయం గడిపి వారితో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నారు. (మత్తయి 5:28) దాంతో వాళ్లు వివాహాన్ని అగౌరవపరిచే అనైతిక ప్రవర్తనకు పాల్పడ్డారు. ఈ విషయమై అపొస్తలుడైన పౌలు ఏమి చెబుతున్నాడో చూద్దాం.
వివాహ ‘పానుపు నిష్కల్మషమైనదిగా ఉండాలి’
16. వివాహం విషయంలో పౌలు ఏమని ఆజ్ఞాపించాడు?
16 ‘వివాహం అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండాలి’ అని చెప్పిన తర్వాత పౌలు ఇలా హెచ్చరించాడు: ‘పానుపు నిష్కల్మషమైనదిగా ఉండాలి. వేశ్యాసంగులకు, వ్యభిచారులకు దేవుడు తీర్పు తీరుస్తాడు.’ (హెబ్రీయులు 13:4) ఇక్కడ పౌలు లైంగిక సంబంధాల గురించి మాట్లాడుతూ “పానుపు” అనే పదాన్ని ఉపయోగించాడు. కేవలం భార్యాభర్తల మధ్య ఉన్న లైంగిక సంబంధాలే ‘నిష్కల్మషమైనవి’ లేదా నైతికంగా పవిత్రమైనవి. కాబట్టి క్రైస్తవులు, “నీ యౌవనకాలపు భార్యయందు సంతోషింపుము” అనే ప్రేరేపిత మాటల్లోని సూత్రాన్ని పాటించాలి.—సామెతలు 5:18.
17. (ఎ) వ్యభిచారం విషయంలో లోకస్థుల అభిప్రాయాన్ని క్రైస్తవులు ఎందుకు పట్టించుకోరు? (బి) యోబు మాదిరిని మనం ఎలా అనుకరించవచ్చు?
17 పరాయి వ్యక్తితో లైంగిక సంబంధాలు పెట్టుకునేవాళ్లు దేవుని నైతిక ప్రమాణాలను ఏమాత్రం గౌరవించడం లేదు. నేడు లోకంలో చాలామంది, వ్యభిచారం చేస్తే తప్పేంటి అనుకుంటారు. ఎవ్వరు ఏమనుకున్నా, క్రైస్తవుల అభిప్రాయం మాత్రం మారదు. ఎందుకంటే చివరికి, ‘వేశ్యాసంగులకు, వ్యభిచారులకు’ మనుషులు కాదుగానీ ‘దేవుడే తీర్పు తీరుస్తాడు’ అని వారికి తెలుసు. (హెబ్రీయులు 10:31; 12:28, 29) కాబట్టి, నిజ క్రైస్తవులు ఈ విషయంలో దేవుని నియమాలకే కట్టుబడి ఉంటారు. (రోమీయులు 12:9 చదవండి.) “నేను నా కన్నులతో నిబంధన చేసికొంటిని” అని పూర్వికుడైన యోబు చెప్పిన మాటల్ని గుర్తుచేసుకోండి. (యోబు 31:1) వ్యభిచారానికి నడిపే దేనికైనా దూరంగా ఉండాలనే ఉద్దేశంతో, నిజ క్రైస్తవులు పరాయి వ్యక్తివైపు మోహంతో చూడకుండా తమను నిగ్రహించుకుంటారు.—అనుబంధంలోని 251-253 పేజీలు చూడండి.
18. (ఎ) వ్యభిచారాన్ని యెహోవా ఎలా దృష్టిస్తాడు? (బి) వ్యభిచారం, ఒక రకంగా విగ్రహారాధన లాంటిదే అని ఎందుకు చెప్పవచ్చు?
18 వ్యభిచారాన్ని యెహోవా ఎలా దృష్టిస్తాడు? మోషే ధర్మశాస్త్రంలో మనకు జవాబు కనిపిస్తుంది. ప్రాచీన ఇశ్రాయేలులో విగ్రహారాధనగానీ, వ్యభిచారంగానీ చేస్తే వారికి మరణ శిక్ష విధించబడేది. (లేవీయకాండము 20:2, 10) వ్యభిచారం కూడా ఒక రకంగా విగ్రహారాధన లాంటిదే. ఎలా? ఒక ఇశ్రాయేలీయుడు విగ్రహారాధన చేస్తే యెహోవాకు తాను ఇచ్చిన మాట నిలుపుకోనట్లే. అలాగే, ఒక ఇశ్రాయేలీయుడు వ్యభిచారం చేస్తే పెళ్ళిలో తన భార్యకు ఇచ్చిన మాటను నిలుపుకోనట్లే. కాబట్టి ఆ ఇద్దరూ నమ్మకద్రోహులే. (నిర్గమకాండము 19:5, 6; ద్వితీయోపదేశకాండము 5:9; మలాకీ 2:14 చదవండి.) నమ్మకమైన యెహోవా దేవుని దృష్టిలో ఆ ఇద్దరూ దోషులే.—కీర్తన 33:4.
19. వ్యభిచారానికి ఒడిగట్టకూడదనే ఒకరి నిర్ణయం ఎలా బలపడుతుంది? ఎందుకు?
19 క్రైస్తవులు మోషే ధర్మశాస్త్రం కింద లేకపోయినా ప్రాచీన ఇశ్రాయేలులో వ్యభిచారం ఘోరమైన పాపంగా పరిగణించబడేదని గుర్తుచేసుకుంటే అలాంటి పాపానికి ఒడిగట్టకూడదనే వారి నిర్ణయం బలపడుతుంది. ఎందుకు? దీని గురించి ఆలోచించండి: మీరు ఒక విగ్రహం ముందు మోకాళ్ళూని దానికి మొక్కుతారా? ‘అస్సలు మొక్కను’ అని మీరంటారు. ఒకవేళ ఎవరైనా పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తామంటే ఒప్పుకుంటారా? ‘చచ్చినా ఒప్పుకోను’ అని అంటారు. ఎందుకంటే, యెహోవాను విడిచి విగ్రహానికి మొక్కాలన్న ఆలోచనే క్రైస్తవులకు రాదు, వారికది అసహ్యం. అలాగే ఏ కారణంవల్లనైనా సరే యెహోవాను, తమ జతను విడిచిపెట్టి వ్యభిచారం చేయాలన్న ఆలోచనకే క్రైస్తవులు తావివ్వకూడదు, దాన్ని అసహ్యించుకోవాలి. (కీర్తన 51:1, 4; కొలొస్సయులు 3:5) సాతానును సంతోషపెట్టి, యెహోవాను, పవిత్రమైన వివాహ ఏర్పాటును అవమానపర్చే పనేదీ మనం చేయాలనుకోం.
మీ కుటుంబ జీవితాన్ని ఎలా సంతోషభరితం చేసుకోవచ్చు?
20. కొంతమంది దంపతుల విషయంలో ఏమి జరిగింది? ఉదాహరణతో వివరించండి.
20 వివాహ ఏర్పాటును అవమానపర్చేలా ప్రవర్తించకుండా ఉండడంతో పాటు ఒకప్పుడు మీ జత పట్ల మీకున్న ప్రేమ తిరిగి కలగాలంటే మీరు ఏమి చేయాలి? దానికి సమాధానం తెలుసుకోవడానికి, మీ వివాహ బంధాన్ని ఒక ఇంటితో పోల్చండి. దయతో కూడిన మీ మాటలు, మీ భార్య/భర్తమీద ప్రేమతో చేసే పనులు, లేదా అలాంటివి ఏవైనా మీ ఇంటిని అలంకరించడానికి పెట్టుకున్న వస్తువుల్లాంటివి. మీరిద్దరూ అన్యోన్యంగా ఉంటే మీ కుటుంబం చక్కని వస్తువులతో అలంకరించబడిన ఇల్లులా ఉంటుంది. మీ మధ్య దూరం ఏర్పడితే సంతోషం కరువై మీ కుటుంబం ఏ అలంకరణా లేని ఇల్లులా బోసిపోయినట్లు ఉంటుంది. వివాహాన్ని ‘ఘనమైనదిగా’ ఉంచుకోవాలనే దేవుని ఆజ్ఞకు మీరు లోబడాలనుకుంటారు కాబట్టి మీ కుటుంబ పరిస్థితిని బాగుచేసుకోవడానికి ప్రయత్నిస్తారు. విలువైన వస్తువేదైనా పాడవుతుంటే చూస్తూ ఉండిపోం కదా! అలాగే విలువైన వివాహ బంధాన్ని బాగుచేసుకోవడానికి మీరు ప్రయత్నించాలి. ఎలా? దానికి బైబిలు ఇలా జవాబిస్తోంది: “జ్ఞానమువలన ఇల్లు కట్టబడును వివేచనవలన అది స్థిరపరచబడును. తెలివిచేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును.” (సామెతలు 24:3, 4) ఆ మాటలు వివాహ బంధానికి ఎలా వర్తిస్తాయో చూద్దాం.
21. మొదట్లో మీ మధ్యవున్న ప్రేమానురాగాలు తిరిగి కలగాలంటే మీరేమి చేయాలి? ( 149వ పేజీలోని బాక్సు కూడా చూడండి.)
21 నిజమైన ప్రేమ, దైవభక్తి, దృఢ విశ్వాసం వంటి లక్షణాలు ‘విలువైన సంపదలు.’ (సామెతలు 15:16, 17; 1 పేతురు 1:7) అవి ఉంటే మీమధ్య అనుబంధం బలపడుతుంది. పైన చెప్పిన సామెతలోని గదులు దేనివలన విలువైన సంపదలతో నింపబడతాయో గమనించారా? ‘జ్ఞానంవలన’ నింపబడతాయి. బైబిలుకు ఒక వ్యక్తిని మార్చే శక్తి ఉంది. దానిలోని విషయాలను పాటిస్తే, ఒకప్పుడు మీ జత పట్ల మీకున్న ప్రేమ తిరిగి కలుగుతుంది. (రోమీయులు 12:2; ఫిలిప్పీయులు 1:9) కాబట్టి, మీరిద్దరూ కలిసి వైవాహిక జీవితం గురించి దినవచనంలో, కావలికోట లేదా తేజరిల్లు! పత్రికల్లోవున్న బైబిలు సంబంధిత సమాచారాన్ని చదివిన ప్రతీసారి మీరు మీ ఇంట్లో అలంకరించుకోవడానికి ఒక మంచి వస్తువు కోసం చూస్తున్నట్లు ఉంటుంది. యెహోవాపట్ల ప్రేమతో మీరు చదివినవాటిని పాటించినప్పుడు మీరు ఆ మంచి వస్తువును తెచ్చి ‘గదులను’ అలంకరించుకుంటారు. అలా, ఒకప్పుడు మీ మధ్యవున్న ప్రేమానురాగాలు తిరిగి కలుగుతాయి.
22. వివాహ బంధాన్ని బలపర్చుకోవడానికి మీరు కృషి చేస్తే ఎలాంటి సంతృప్తి మీకుంటుంది?
22 బోసిపోయిన మీ ఇంట్లో మళ్లీ ఒక్కో వస్తువును అమర్చుతూ అలంకరించుకోవాలంటే సమయం, కృషి అవసరం. అయితే, మీరు మీ వంతు కృషి చేస్తే బైబిల్లోవున్న ఈ ఆజ్ఞను పాటిస్తున్నామన్న సంతృప్తి మీకుంటుంది: “ఘనతవిషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి.” (రోమీయులు 12:10; కీర్తన 147:11) అన్నిటికంటే ముఖ్యంగా మీ వివాహాన్ని ఘనమైనదిగా ఉంచుకోవడానికి మీరు కృషి చేస్తే దేవుని ప్రేమలో నిలిచివుండగలుగుతారు.