కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

10వ అధ్యాయం

వివాహం—దేవుని ప్రేమపూర్వక ఏర్పాటు

వివాహం—దేవుని ప్రేమపూర్వక ఏర్పాటు

“మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు.” —ప్రసంగి 4:12.

1, 2. (ఎ) కొత్తగా పెళ్లి చేసుకునేవాళ్ల గురించి మనకు కొన్నిసార్లు ఏమనిపిస్తుంది, ఎందుకు? (బి) ఈ అధ్యాయంలో మనం ఏ ప్రశ్నలను చర్చిస్తాం?

 పెళ్లిళ్లకు వెళ్లడం మీకు ఇష్టమేనా? చాలామందికి ఇష్టం. ఎందుకంటే అక్కడంతా సందడిగా, సరదాగా ఉంటుంది. వధూవరులు చక్కగా ముస్తాబవుతారు, వారి ముఖాల్లో పెళ్లికళ ఉట్టిపడుతుంది. వారెంతో సంతోషంగా కనిపిస్తారు, వాళ్లకు బంగారు భవిష్యత్తు ఉంటుందని అందరూ అనుకుంటారు.

2 కానీ, ఈ కాలంలో పెళ్లి గురించి ప్రజలు ఆలోచించే తీరు పూర్తిగా మారిపోయిందంటే మీరు ఒప్పుకోరా? కొత్త దంపతులు సంతోషంగా ఉండాలని మనం కోరుకున్నా ఒక్కోసారి వాళ్లను చూస్తే ‘వీళ్లిద్దరూ ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉంటారా?’ అన్న ప్రశ్న మనసులోకి రావచ్చు. భార్యాభర్తలు యెహోవా ఉపదేశాన్ని అంగీకరించి, పాటిస్తే వాళ్లు నిజంగానే సంతోషంగా ఉంటారు. (సామెతలు 3:5, 6 చదవండి.) దేవుని ప్రేమలో నిలిచివుండాలంటే వారలా చేయాలి. ఇప్పుడు మనం ఈ నాలుగు ప్రశ్నలకు బైబిలు జవాబులేంటో చూద్దాం: పెళ్లి చేసుకోవడానికి తగిన కారణాలు ఏమిటి? పెళ్లి చేసుకోవాలనుకుంటే, ఎలాంటి వ్యక్తిని చేసుకోవాలి? వివాహ జీవితానికి మీరెలా సిద్ధపడవచ్చు? భార్యాభర్తలు జీవితాంతం అన్యోన్యంగా ఎలా ఉండవచ్చు? a

పెళ్లి చేసుకోవడానికి తగిన కారణాలు ఏమిటి?

3. చిన్నచిన్న కారణాలనుబట్టి పెళ్లి చేసుకోవడం ఎందుకు మంచిది కాదు?

3 జీవితంలో సంతోషం, సంతృప్తి ఉండాలంటే పెళ్లి చేసుకోవాల్సిందే అని చాలామంది అనుకుంటారు. కానీ, అది నిజం కాదు. అవివాహిత జీవితం గడిపిన యేసు, పెళ్లి చేసుకోకుండా ఉండడం ఒక అనుగ్రహం లేదా ఆశీర్వాదం అని చెబుతూ సాధ్యమైతే ఇతరులు కూడా అలా ఉండవచ్చని చెప్పాడు. (మత్తయి 19:10-12) అపొస్తలుడైన పౌలు కూడా పెళ్లి చేసుకోకుండా ఉండడంలోని ప్రయోజనాల గురించి మాట్లాడాడు. (1 కొరింథీయులు 7:32-38) అయితే యేసుగాని, పౌలుగాని పెళ్లి చేసుకోకుండా ఉండిపొమ్మని చెప్పలేదు. నిజానికి, ‘వివాహాన్ని నిషేధించడం’ “దయ్యముల బోధ” అని పౌలు చెప్పాడు. (1 తిమోతి 4:1-3) ఒంటరిగా ఉంటే నిరాటంకంగా యెహోవాను సేవించవచ్చు. కాబట్టి, ఎవరో ఒత్తిడి చేశారని లేదా అలాంటి వేరే చిన్నచిన్న కారణాలనుబట్టి పెళ్లి చేసుకోవడం మంచిది కాదు.

4. వివాహం కుటుంబ జీవితానికి మంచి పునాది అని ఎందుకు చెప్పవచ్చు?

4 అయితే, పెళ్లి చేసుకోవడానికి తగిన కారణాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. వివాహం అనేది దేవుడు ప్రేమతో చేసిన ఒక ఏర్పాటు. (ఆదికాండము 2:18 చదవండి.) కాబట్టి, పెళ్లి చేసుకుంటే మేలు జరుగుతుంది, కొంతమేర సంతోషంగా కూడా ఉంటాం. ఉదాహరణకు, కుటుంబ జీవితానికి వివాహం మంచి పునాది. ఎందుకంటే పిల్లల్ని సరిగ్గా పెంచాలంటే ఇంట్లో మంచి వాతావరణం ఉండాలి, అంతేకాదు వాళ్ళకు తల్లిదండ్రుల ప్రేమ, క్రమశిక్షణ, నడిపింపు కూడా అవసరం. (కీర్తన 127:3; ఎఫెసీయులు 6:1-4) కానీ, పిల్లలను కని పెంచాలనే ఉద్దేశంతోనే పెళ్లి చేసుకోకూడదు.

5, 6. (ఎ) ప్రసంగి 4:9-12 చెప్తున్నట్లుగా మంచి స్నేహితులుంటే వచ్చే ప్రయోజనాలేంటి? (బి) వివాహబంధాన్ని మూడుపేటల తాడుతో ఎందుకు పోల్చవచ్చు?

5 ఈ అధ్యాయం ప్రారంభంలో ఇచ్చిన లేఖనాన్ని, దాని ముందు వచనాల్ని పరిశీలించండి: “ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచిఫలము కలుగును గనుక ఒంటిగాడై యుండుటకంటె ఇద్దరు కూడి యుండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తనతోడివానిని లేవనెత్తును; అయితే ఒంటరిగాడు పడిపోయినయెడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. ఇద్దరు కలిసి పండుకొనినయెడల వారికి వెట్ట కలుగును; ఒంటరిగానికి వెట్ట ఏలాగు పుట్టును? ఒంటరియగు నొకనిమీద మరియొకడు పడినయెడల ఇద్దరు కూడి వాని నెదిరింపగలరు, మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు గదా?”—ప్రసంగి 4:9-12.

6 పై వచనాలు ముఖ్యంగా స్నేహానికున్న విలువను గూర్చి మాట్లాడుతున్నాయి. భార్యాభర్తలు మంచి స్నేహితులే కదా! కాబట్టి లేఖనం చెప్తున్నట్లు వాళ్ళు ఒకరినొకరు ఆదుకుంటారు, చేదోడువాదోడుగా ఉంటారు, సుఖదుఃఖాలు పంచుకుంటారు. వారి వివాహబంధం పటిష్టంగా ఉండాలంటే వారు తమ జీవితంలో దేవునికి స్థానం ఇవ్వాలి. రెండుపేటల తాడైతే సులభంగా తెగిపోవచ్చని ఆ వచనం సూచిస్తుంది. కానీ మూడు పేటల తాడును తెంపడం కష్టం. భార్యాభర్తలు యెహోవాను సంతోషపెట్టడానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తే వారి వివాహబంధం మూడు పేటల తాడులా పటిష్టంగా ఉంటుంది.

7, 8. (ఎ) లైంగిక కోరికలు ఎక్కువగా ఉండే అవివాహిత క్రైస్తవులకు పౌలు ఏ సలహా ఇచ్చాడు? (బి) పెళ్లి గురించి బైబిలు ముందే ఏ విషయాన్ని స్పష్టంగా చెప్పింది?

7 లైంగిక కోరికలు తీర్చుకునేందుకు సరైన మార్గం పెళ్లి చేసుకోవడమే. అందుకే, భార్యాభర్తల లైంగిక సంబంధం వారికి నిజమైన ఆనందాన్నిస్తుంది. (సామెతలు 5:18) శరీర కోరికలు ఎక్కువగా ఉండే ‘ఈడు మించిన’ తర్వాత కూడా ఒక వ్యక్తికి అలాంటి భావాలే కలుగుతుండవచ్చు. వాటిని అదుపు చేసుకోకపోతే, ఆ వ్యక్తి చెడు ప్రవర్తనకు పాల్పడవచ్చు. అందుకే పౌలు దేవుని ప్రేరణతో అవివాహితులకు ఈ మాటలు రాశాడు: “మనస్సు నిలుపలేనియెడల పెండ్లిచేసికొనవచ్చును; కామతప్తులగుట కంటె పెండ్లిచేసికొనుట మేలు.”—1 కొరింథీయులు 7:9, 36; యాకోబు 1:15.

8 ఒక వ్యక్తి ఏ కారణాలనుబట్టి పెళ్లి చేసుకోవాలనుకున్నా దానిలో ఉండే సాధకబాధకాల గురించి ఆలోచించాలి. పెళ్లి చేసుకునేవారికి “శరీరసంబంధమైన శ్రమలు” కలుగుతాయని పౌలు చెప్పాడు. (1 కొరింథీయులు 7:28) పెళ్లికాని వాళ్లకంటే పెళ్లైన వాళ్లకు ఎక్కువ సమస్యలుంటాయి. మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే, మీ వైవాహిక జీవితం తక్కువ సమస్యలతో సాఫీగా సంతోషంగా సాగాలంటే ఏమి చేయాలి? దానికి ఒక మార్గం ఏమిటంటే, కాబోయే భర్త లేక భార్య ఎలా ఉండాలో జాగ్రత్తగా ఆలోచించి చేసుకోవాలి.

ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి?

9, 10. (ఎ) అవిశ్వాసులతో జోడుగా ఉండే విషయంలో పౌలు ఏమని హెచ్చరించాడు? (బి) అవిశ్వాసిని పెళ్లి చేసుకోకూడదనే దేవుని సలహాను పట్టించుకోకపోతే ఏమి జరుగుతుంది?

9 ఒక వ్యక్తిని పెళ్లి చేసుకునే ముందు గుర్తుంచుకోవాల్సిన ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని దేవుడు పౌలుచేత రాయించాడు: “మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి.” (2 కొరింథీయులు 6:14) రెండు వేర్వేరు పశువుల్ని ఒక కాడికి కడితే ఆ రెండిటికీ కష్టమవుతుంది. అలాగే ఒక విశ్వాసి, అవిశ్వాసిని పెళ్లి చేసుకుంటే వాళ్లకు తప్పకుండా సమస్యలొస్తాయి. ఒకరు యెహోవా ప్రేమలో నిలిచివుండాలని కోరుకుంటే మరొకరు ఆ విషయాన్ని అంతగా పట్టించుకోకపోవచ్చు. అప్పుడు ప్రాధాన్యతల విషయంలో మనస్పర్థలు ఏర్పడి సమస్యలు వస్తాయి. అందుకే, తోటి విశ్వాసులనే పెళ్లి చేసుకోవాలని పౌలు క్రైస్తవులను ప్రోత్సహించాడు.—1 కొరింథీయులు 7:39.

10 కొంతమంది క్రైస్తవులు, ఒంటరితనాన్ని భరించడంకంటే ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవడమే మంచిదనుకుని, బైబిలు సలహాను పట్టించుకోకుండా యెహోవాను సేవించనివారిని పెళ్లి చేసుకుంటారు. కానీ అది దుఃఖానికే దారితీస్తుంది. ఒక క్రైస్తవురాలు అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే జీవితంలో తనకు ప్రాముఖ్యమైన విషయాల గురించి భర్తతో మాట్లాడలేదు. ముందుకన్నా ఎక్కువ ఒంటరిదవుతుంది. అయితే సంతోషకరమైన విషయం ఏమిటంటే, వేలాదిమంది క్రైస్తవులు ఈ విషయంలో దేవుని ఉపదేశాన్ని నమ్మి, దాన్ని పాటిస్తున్నారు. (కీర్తన 32:8 చదవండి.) వారికి పెళ్లి చేసుకోవాలన్న కోరిక ఉన్నా యెహోవాను ఆరాధించేవారినే పెళ్లి చేసుకోవడానికి ఎంతకాలమైనా వేచివుంటారు.

11. ఎవరిని పెళ్లి చేసుకోవాలో నిర్ణయించుకోవడానికి మీకేది సహాయం చేస్తుంది? ( 130వ పేజీలో ఉన్న బాక్సు చూడండి.)

11 యెహోవా సేవకుల్లో ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు అనుకోకుండా, మీ వ్యక్తిత్వానికి తగినవారిని, మీరు ప్రేమించినంతగా యెహోవాను ప్రేమించేవారిని, మీకున్నలాంటి లక్ష్యాలు ఉన్నవారిని చూసి చేసుకోండి. ఈ విషయంలో నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు ఎంతో సమాచారం అందించాడు. బైబిలు ఆధారంగా ఇవ్వబడిన ఆ సమాచారాన్ని ప్రార్థనాపూర్వకంగా చదివి, ఆలోచించిన తర్వాతే ఈ ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకోండి. bకీర్తన 119:105 చదవండి.

12. చాలా దేశాల్లో పెళ్లిళ్లు ఎలా జరుగుతాయి? ఈ విషయంలో బైబిల్లో ఎవరి మాదిరి ఉంది?

12 చాలా దేశాల్లో తల్లిదండ్రులే పిల్లలకు పెళ్లిళ్లు కుదురుస్తారు. అంత ప్రాముఖ్యమైన విషయంలో నిర్ణయం తీసుకునేంత జ్ఞానం, అనుభవం వాళ్లకే ఉంటాయని అందరూ అనుకుంటారు. పూర్వకాలంలోలాగే చాలా సందర్భాల్లో పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటే జీవితం సాఫీగానే ఉంటుంది. తల్లిదండ్రులకు అబ్రాహాము ఒక మాదిరిగా ఉన్నాడు. ఆయన ఇస్సాకు కోసం భార్యను వెదికి తీసుకురావడానికి తన సేవకుణ్ణి పంపాడు. డబ్బుకు, హోదాకు ప్రాముఖ్యతనివ్వకుండా ఆయన, కొంచెం కష్టమైనా యెహోవా ఆరాధకుల్లోనుండే ఇస్సాకు కోసం భార్యను తేవాలనుకున్నాడు. cఆదికాండము 24:3, 67.

 

సంతోషకరమైన వివాహ జీవితానికి మీరెలా సిద్ధపడవచ్చు?

13-15. (ఎ) పెళ్ళిచేసుకోవాలనుకునే అబ్బాయికి సామెతలు 24:27⁠లోని సూత్రం ఎలా సహాయం చేయవచ్చు? (బి) పెళ్ళికి సిద్ధపడడానికి ఒక అమ్మాయి ఏమి చేయవచ్చు?

13 మీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటే, ‘పెళ్లితో వచ్చే బాధ్యతల్ని మోయడానికి నేను సిద్ధంగా ఉన్నానా’ అని ప్రశ్నించుకోండి. ప్రేమ, సెక్స్‌, సహచర్యం లేదా పిల్లల్ని కని పెంచడం వంటి విషయాల్లో అవగాహన ఉందనుకుంటే సరిపోదు. కానీ, పెళ్లి చేసుకునేముందు స్త్రీపురుషులిద్దరూ కొన్ని ప్రాముఖ్యమైన విషయాల గురించి ఆలోచించాలి.

14 పెళ్లి చేసుకోవాలనుకునే అబ్బాయి ఈ బైబిలు సూత్రం గురించి జాగ్రత్తగా ఆలోచించాలి: “బయట నీ పని చక్క పెట్టుకొనుము ముందుగా పొలములో దాని సిద్ధపరచుము తరువాత ఇల్లు కట్టుకొనవచ్చును.” (సామెతలు 24:27) ఆ మాటల అర్థమేమిటి? ఆ రోజుల్లో, ఒక వ్యక్తి పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు, ‘నా భార్యను, పుట్టబోయే పిల్లల్ని పోషించే సామర్థ్యం నాకుందా?’ అని ఆలోచించాలి. ఆయన పనిచేసి పొలాన్ని సాగుచేయాలి. నేడు కూడా అదే సూత్రం వర్తిస్తుంది. పెళ్లి చేసుకోవాలనుకునే అబ్బాయికి బాధ్యతలు నిర్వహించేంత సామర్థ్యం ఉండాలి. శక్తి ఉన్నంత వరకు పనిచేయగలగాలి. ఎందుకంటే కుటుంబ సభ్యుల భౌతిక, భావోద్వేగ, ఆధ్యాత్మిక అవసరాలు తీర్చని వ్యక్తి అవిశ్వాసికన్నా చెడ్డవాడని బైబిలు చెప్తోంది.—1 తిమోతి 5:8 చదవండి.

15 అమ్మాయి కూడా పెళ్ళితో వచ్చే బరువైన బాధ్యతలను నిర్వర్తించడానికి సిద్ధంగా ఉండాలి. భార్య ఇంటి పనులు చేస్తూ తన భర్తకు చేదోడువాదోడుగా ఉండేందుకు అవసరమైన కొన్ని నైపుణ్యాలు, లక్షణాల గురించి బైబిలు చెబుతోంది. (సామెతలు 31:10-31) బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధపడకుండానే తొందరపడి పెళ్ళిచేసుకొనే స్త్రీపురుషులు అవతలివ్యక్తి ప్రయోజనం గురించి ఆలోచించని స్వార్థపరులు. అన్నింటికంటే ముఖ్యంగా పెళ్ళి చేసుకోవాలనుకునేవారు తమ వివాహ జీవితంలో బైబిలు సూత్రాలను పాటించడానికి సిద్ధంగా ఉండాలి.

16, 17. పెళ్లి చేసుకోవాలనుకునేవారు ఏ లేఖన సూత్రాల గురించి బాగా ఆలోచించాలి?

16 పెళ్ళికి సిద్ధపడేముందు, భార్యాభర్తలు ఎలా ఉండాలని దేవుడు చెబుతున్నాడో తెలుసుకోవాలి. క్రైస్తవ కుటుంబానికి పెద్దగా ఉండడమంటే ఏమిటో ఆ అబ్బాయి తెలుసుకోవాలి. ఆయనకు ఆ అధికారం ఉన్నంతమాత్రాన క్రూరంగా ప్రవర్తించకూడదు. బదులుగా ఆయన తన అధికారాన్ని యేసు ఉపయోగించినట్లే ప్రేమపూర్వకంగా ఉపయోగించాలి. (ఎఫెసీయులు 5:23) అలాగే క్రైస్తవ స్త్రీ కూడా భార్యగా గౌరవప్రదమైన తన బాధ్యతను ఎలా నిర్వహించాలో అర్థం చేసుకోవాలి. ఆమె తన భర్తకు ‘లోబడివుండడానికి’ సిద్ధంగా ఉందా? (ఎఫెసీయులు 5:22) ఇప్పటికే ఆమె యెహోవా, యేసుక్రీస్తుల అధికారం కిందవుంది. (1 కొరింథీయులు 11:3) కాబట్టి ఇప్పుడు ఆమె వాళ్ళకే కాక మరో వ్యక్తికి కూడా లోబడివుండాలి. ఒక అపరిపూర్ణ మానవుని అధికారానికి లోబడి ఆయనకు సహకారిగా ఉండడానికి ఆమె సిద్ధంగా ఉందా? ఒకవేళ లేదని ఆమెకు అనిపిస్తే పెళ్లి చేసుకోకపోవడమే మంచిది.

17 తన భార్య లేదా భర్తకు ప్రత్యేకంగావుండే అవసరాల గురించి ఇద్దరూ ఆలోచించాలి. (ఫిలిప్పీయులు 2:4 చదవండి.) పౌలు ఇలా రాశాడు: “మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తననువలె తన భార్యను ప్రేమింపవలెను, భార్యయైతే తన భర్తయందు భయము [‘ప్రగాఢ గౌరవం,’ NW] కలిగియుండునట్లు చూచుకొనవలెను.” తన భార్య తనను గౌరవించాలని భర్త కోరుకుంటాడు, అలాగే భార్య కూడా తన భర్త తనను ప్రేమించాలని కోరుకుంటుందని పౌలు దేవుని ప్రేరణతో అర్థం చేసుకున్నాడు.—ఎఫెసీయులు 5:21-33.

జ్ఞానవంతులైన అబ్బాయి, అమ్మాయి కోర్ట్‌షిప్‌ సమయంలో ఒంటరిగా ఉండరు

18. కోర్ట్‌షిప్‌ సమయంలో ఆశానిగ్రహం ఎందుకు చూపించాలి?

18 కొన్ని సందర్భాల్లో ఇద్దరు వ్యక్తులు, పెళ్లి చేసుకోవాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి కొంత సమయం గడుపుతారు. దాన్నే కోర్ట్‌షిప్‌ అంటారు. అందులో తప్పులేదు. కానీ అది సరదా కోసం గడిపే సమయం కాదు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి అంటే ఒకరికొకరు సరిపోతారో లేదో తెలుసుకోవడానికి గడిపే సమయం. వారిద్దరి మధ్య శారీరకంగా దగ్గరవ్వాలనే ఆకర్షణ బలంగా ఉండొచ్చు. అది సహజమే. అందుకే కోర్ట్‌షిప్‌ సమయంలో, వాళ్లు కోరికల్ని అదుపు చేసుకోవాలి. వారికి నిజమైన ప్రేమ ఉంటే, అవతలి వ్యక్తికి దేవునితో ఉన్న సంబంధాన్ని పాడుచేసే పనేదీ చేయరు. (1 థెస్సలొనీకయులు 4:6) మీరు కోర్ట్‌షిప్‌ చేస్తుంటే ఆశానిగ్రహాన్ని చూపించండి. మీరు పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా ఈ లక్షణం ఉంటే జీవితాంతం ప్రయోజనం పొందుతారు.

భార్యాభర్తలు జీవితాంతం అన్యోన్యంగా ఎలా ఉండవచ్చు?

19, 20. పెళ్లి విషయంలో క్రైస్తవుల ఆలోచనకు, లోకస్థుల ఆలోచనకు తేడా ఏమిటి? ఉదాహరణతో చెప్పండి.

19 భార్యాభర్తలు జీవితాంతం అన్యోన్యంగా ఉండాలంటే, ఒకరికొకరు కట్టుబడి ఉండడం అంటే ఏమిటో వారికి తెలిసుండాలి. నవలల్లో, సినిమాల్లో పెళ్లితో కథ సుఖాంతమైనట్లు చూపిస్తారు. కానీ నిజ జీవితంలో పెళ్లి అనేది దేవుడు ఏర్పాటు చేసిన ఒక శాశ్వత బంధానికి ఆరంభం మాత్రమే. (ఆదికాండము 2:24) విచారకరంగా, లోకంలో చాలామంది అలా ఆలోచించరు. కొన్ని ప్రాంతాల్లో, పెళ్లంటే రెండు జీవితాలను ముడివేయడం అని అంటారు. కానీ, ముడివేయడం అన్న పదం వాళ్ల ఆలోచనా విధానాన్ని బయటపెడుతుందని గ్రహించరు. అదెలా? ఎలాగంటే, దేన్నైనా ముడివేస్తే కొంతసేపు అది గట్టిగా ఉంటుంది. కానీ ముడి వేయవచ్చు, దాన్ని విప్పవచ్చు అన్న విషయం మనం మరచిపోకూడదు.

20 భార్యాభర్తలు ఎప్పుడైనా విడిపోవచ్చని నేడు చాలామంది అనుకుంటారు. మంచిదనిపిస్తే తొందరపడి పెళ్లి చేసుకుంటారు, సమస్యలొస్తే విడిపోతారు. వివాహ బంధాన్ని బైబిలు తాడుతో పోలుస్తోందని గుర్తుంచుకోండి. ఉదాహరణకు, ఓడల్లో ఉపయోగించడానికి నేసే తాళ్లు ఎంత బలంగా ఉంటాయంటే పెద్ద తుఫాను వచ్చినా అవి విడిపోకుండా పదిలంగా ఉంటాయి. అలాగే, వివాహ బంధం జీవితాంతం పదిలంగా ఉండాలని దేవుడు ఉద్దేశించాడు. అందుకే “దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచకూడదు” అని యేసు చెప్పాడు. (మత్తయి 19:6) మీరు పెళ్లి చేసుకుంటే, మీరూ అలాగే ఆలోచించాలి. మరైతే అలా ఒకరికొకరు కట్టుబడివుండడం కష్టమా? కాదు.

21. భార్యాభర్తలు వేటిపై దృష్టి నిలపాలి? అది చేయడానికి వాళ్లకు ఏది సహాయం చేస్తుంది?

21 భార్యాభర్తలకు ఒకరిపట్ల ఒకరికి సదభిప్రాయం ఉండాలి. తన భార్య లేదా భర్తలోని మంచి లక్షణాలపై, చేసే మంచి పనులపై దృష్టి నిలిపితే ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారు. అయితే ఒక అపరిపూర్ణ వ్యక్తిలో మంచినే చూడడం సాధ్యమౌతుందా? అలా అనుకుంటే యెహోవాకు కూడా మనలోవున్న మంచిని చూడడం సాధ్యం కాదు. కానీ, ఆయన మనలో మంచినే చూస్తాడని మనకు ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే, కీర్తనకర్త ఇలా అన్నాడు: “యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచినయెడల ప్రభువా, ఎవడు నిలువగలడు?” (కీర్తన 130:3) యెహోవాలాగే, భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు క్షమించుకుంటూ మంచి లక్షణాలపైనే దృష్టి నిలపాలి.—కొలొస్సయులు 3:13 చదవండి.

22, 23. నేటి భార్యాభర్తలకు అబ్రాహాము శారాలు ఎలా చక్కని మాదిరిగా ఉన్నారు?

22 కాలం గడుస్తున్నకొద్దీ భార్యాభర్తల బంధం మరింత పటిష్టమై వాళ్లకు సంతోషాన్ని తెస్తుంది. బైబిలు అబ్రాహాము శారాల గురించి చెప్పేటప్పటికి వాళ్లు ముసలివాళ్లు. వాళ్లకు కూడా కష్టాలు, సవాళ్లు ఎదురయ్యాయి. ఒక్కసారి ఆలోచించండి, శారాకు దాదాపు 60 ఏళ్లు ఉన్నప్పుడు, వర్ధిల్లుతున్న ఊరు పట్టణంలోని సౌకర్యవంతమైన ఇంటిని విడిచివచ్చి ఆ తర్వాత జీవితమంతా గుడారాల్లో నివసించాల్సి వచ్చింది. అయినా, ఆమె తన భర్త అధికారానికి లోబడింది. అబ్రాహాముకు నిజమైన సహకారిగా ఉంటూ ఆయన నిర్ణయాలకు గౌరవపూర్వకంగా మద్దతునిచ్చింది. ఆమె పైకి మాత్రమే అలా చేయలేదు కానీ, తన మనసులో కూడా అబ్రాహామును తన యజమానిగా భావించింది. (ఆదికాండము 18:12; 1 పేతురు 3:6) మనస్ఫూర్తిగా అబ్రాహాముకు గౌరవం చూపించింది.

23 అలాగని, అబ్రాహాము శారాలకు ఎల్లప్పుడూ ఏకాభిప్రాయం ఉండేదని కాదు. ఒకసారి శారా ఇచ్చిన సలహా అబ్రాహాముకు ఎంతో “దుఃఖము” కలిగించింది. అయినా యెహోవా నిర్దేశం మేరకు అబ్రాహాము, శారా చెప్పింది వినడంతో వాళ్ల కుటుంబం ఆశీర్వదించబడింది. (ఆదికాండము 21:9-13) ఎంతోకాలం క్రితం పెళ్లి అయిన వారితోసహా నేడు భార్యాభర్తలందరూ ఈ దైవభక్తిగల జంట నుండి ఎంతో నేర్చుకోవచ్చు.

24. ఎలాంటి దంపతులు యెహోవాకు ఘనత తెస్తారు? ఎందుకు?

24 అన్యోన్య దంపతుల్లో భార్య తన భర్తపట్ల ప్రగాఢ గౌరవం చూపిస్తుంది, భర్త తన భార్యను ప్రేమించి గౌరవిస్తాడు, వాళ్లిద్దరూ ప్రతీ విషయంలో యెహోవాకు ఇష్టమైనది చేయడానికే ప్రాముఖ్యతనిస్తారు. క్రైస్తవ సంఘాల్లో అలాంటి దంపతులు వేలాదిమంది ఉన్నారు. ఒకవేళ మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే, ఎలాంటి వ్యక్తిని చేసుకోవాలో జాగ్రత్తగా ఆలోచించండి, వివాహ జీవితానికి చక్కగా సిద్ధపడండి, యెహోవాకు ఘనత తెచ్చేలా మీ వివాహ జీవితంలో ప్రేమ, సమాధానం ఉండేటట్లు చూసుకోండి. అలా చేస్తే మీరు దేవుని ప్రేమలో నిలిచివుండగలుగుతారు.

a ఈ అధ్యాయంలోని విషయాలు స్త్రీపురుషులిద్దరికీ వర్తిస్తాయి.

b యెహోవాసాక్షులు ప్రచురించిన కుటుంబ సంతోషానికిగల రహస్యము పుస్తకంలోని 2వ అధ్యాయం చూడండి.

c పూర్వం దేవుని సేవకుల్లో కొందరు ఒకరికన్నా ఎక్కువమందిని పెళ్లి చేసుకున్నారు. వాళ్ల విషయంలోనూ, సహజ ఇశ్రాయేలీయుల విషయంలోనూ యెహోవా బహుభార్యత్వాన్ని అనుమతించాడు. ఆయన దాన్ని ప్రారంభించలేదు కానీ, దాని విషయంలో కొన్ని నియమాలిచ్చి తన ఉద్దేశం ఏమిటో తెలియజేశాడు. అయితే, ఇప్పుడు యెహోవా దాన్ని అనుమతించడం లేదని క్రైస్తవులు గుర్తుంచుకోవాలి.—మత్తయి 19:9; 1 తిమోతి 3:2.