కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అదనపు సమాచారం

అదనపు సమాచారం

 1 సూత్రాలు

దేవుని నియమాలు సూత్రాల మీద ఆధారపడి ఉంటాయి. సూత్రాలు అంటే బైబిల్లోని ప్రాథమిక సత్యాలు. దేవుని ఇష్టాయిష్టాలు తెలుసుకోవడానికి, మన జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, సరైనది చేయడానికి సూత్రాలు సహాయం చేస్తాయి. ముఖ్యంగా ఏదైనా పరిస్థితికి సంబంధించి బైబిల్లో సూటైన నియమం లేనప్పుడు అవి చాలా ఉపయోగపడతాయి.

1వ అధ్యాయం, 8వ పేరా

 2 లోబడడం

యెహోవాకు లోబడడం లేదా విధేయత చూపించడం అంటే ఆయన ఏం చెప్పినా ఇష్టంగా చేయడం. మనం ప్రేమతోనే తనకు లోబడాలని యెహోవా కోరుకుంటున్నాడు. (1 యోహాను 5:3) మనకు దేవుని మీద ప్రేమ, నమ్మకం ఉంటే అన్ని సందర్భాల్లో ఆయన సలహాలు పాటిస్తాం. కష్టమైనా సరే ఆయనకు లోబడతాం. యెహోవాకు లోబడడం మనకే మంచిది. ఇప్పుడు మనం ఎలా సంతోషంగా జీవించవచ్చో, భవిష్యత్తులో అద్భుతమైన ఆశీర్వాదాలు ఎలా పొందవచ్చో ఆయన చెప్తున్నాడు.—యెషయా 48:17.

1వ అధ్యాయం, 10వ పేరా

 3 స్వేచ్ఛా చిత్తం

యెహోవా అందరికీ స్వేచ్ఛా చిత్తాన్ని, అంటే నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఆయన మనల్ని రోబోల్లా సృష్టించలేదు. (ద్వితీయోపదేశకాండం 30:19; యెహోషువ 24:15) మన స్వేచ్ఛను ఉపయోగించి మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ జాగ్రత్తగా లేకపోతే తెలివితక్కువ నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది. స్వేచ్ఛా చిత్తాన్ని ఉపయోగించి యెహోవాకు విశ్వసనీయంగా ఉండాలని వ్యక్తిగతంగా నిర్ణయించుకుందాం, ఆయన్ని నిజంగా ప్రేమిస్తున్నామని చూపిద్దాం.

1వ అధ్యాయం, 12వ పేరా

 4 నైతిక ప్రమాణాలు

మనం ఎలా ప్రవర్తించాలో, ఎలా నడుచుకోవాలో తెలియజేయడానికి యెహోవా ఇచ్చిన నిర్దేశాలే నైతిక ప్రమాణాలు. ఆ ప్రమాణాలు ఏంటో, అవి మనకెలా మేలు చేస్తాయో బైబిలు నుండి తెలుసుకోవచ్చు. (సామెతలు 6:16-19; 1 కొరింథీయులు 6:9-11) దేవుని దృష్టిలో ఏది తప్పో, ఏది ఒప్పో తెలుసుకోవడానికి అవి సహాయం చేస్తాయి. అంతేకాదు ప్రేమ చూపించడం, మంచి నిర్ణయాలు తీసుకోవడం, ఇతరులతో దయగా ఉండడం ఎలాగో నేర్పిస్తాయి. లోక ప్రమాణాలు అంతకంతకు దిగజారినా యెహోవా ప్రమాణాలు మాత్రం అస్సలు మారవు. (ద్వితీయోపదేశకాండం 32:4-6; మలాకీ 3:6) వాటిని పాటించడం ద్వారా మన శరీరానికి, మనసుకు హాని కలగకుండా కాపాడుకోవచ్చు.

1వ అధ్యాయం, 17వ పేరా

 5 మనస్సాక్షి

మనస్సాక్షి అంటే తప్పొప్పుల్ని గుర్తించే సామర్థ్యం. అది మనలో న్యాయమూర్తిలా పనిచేస్తుంది. యెహోవా అందరికీ మనస్సాక్షి ఇచ్చాడు. (రోమీయులు 2:14, 15) అది సరిగ్గా పని చేయాలంటే యెహోవా నైతిక ప్రమాణాలతో దానికి శిక్షణ ఇవ్వాలి. అలా శిక్షణ ఇచ్చిన మనస్సాక్షి వల్ల దేవుణ్ణి సంతోషపెట్టే నిర్ణయాలు తీసుకోగలుగుతాం. (1 పేతురు 3:16) మనం ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకోబోతుంటే మనస్సాక్షి మనల్ని హెచ్చరిస్తుంది, లేదా ఏదైనా తప్పు చేస్తే మనల్ని బాధపెడుతుంది. మన మనస్సాక్షి బలహీనపడే అవకాశం ఉంది, కానీ యెహోవా సహాయంతో దాన్ని తిరిగి బలపర్చుకోవచ్చు. మంచి మనస్సాక్షి వల్ల మనశ్శాంతి, ఆత్మగౌరవం ఉంటాయి.

2వ అధ్యాయం, 3వ పేరా

 6 దైవ భయం

దైవ భయం అంటే దేవుని మీద ఉన్న ప్రేమ, గౌరవం వల్ల ఆయన్ని బాధపెట్టే పనేదీ చేయకూడదని కోరుకోవడం. దైవ భయం వల్ల మనం మంచి చేస్తాం, చెడుకు దూరంగా ఉంటాం. (కీర్తన 111:10) అంతేకాదు యెహోవా చెప్పే ప్రతీది శ్రద్ధగా వింటాం. ఆయన మీద ప్రగాఢమైన గౌరవంతో ఆయనకు ఇచ్చిన ప్రతీ మాట నిలబెట్టుకుంటాం. దైవ భయం మన ఆలోచనలపై, ప్రవర్తనపై, రోజూ తీసుకునే నిర్ణయాలపై ప్రభావం చూపిస్తుంది.

2వ అధ్యాయం, 9వ పేరా

 7 పశ్చాత్తాపం

పశ్చాత్తాపపడడం అంటే ఏదైనా తప్పు చేసినందుకు తీవ్రంగా బాధపడడం. దేవుణ్ణి ప్రేమించేవాళ్లు ఆయన ప్రమాణాలకు విరుద్ధమైనది ఏదైనా చేశామని గుర్తించినప్పుడు ఎంతో బాధపడతారు. మనం ఏదైనా తప్పు చేస్తే, యేసుక్రీస్తు విమోచన క్రయధనం ఆధారంగా మనల్ని క్షమించమని యెహోవాను వేడుకోవాలి. (మత్తయి 26:28; 1 యోహాను 2:1, 2) మనం నిజంగా పశ్చాత్తాపపడి, మళ్లీ ఆ తప్పు చేయకుండా ఉంటే యెహోవా మనల్ని క్షమిస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు. గతంలో చేసిన తప్పు గురించి ఇక మనం బాధపడాల్సిన అవసరం లేదు. (కీర్తన 103:10-14; 1 యోహాను 1:9; 3:19-22) మనం చేసిన పొరపాట్ల నుండి పాఠం నేర్చుకోవడానికి, తప్పుడు ఆలోచనా విధానాన్ని సరిచేసుకోవడానికి, యెహోవా ప్రమాణాల ప్రకారం జీవించడానికి కృషి చేయాలి.

2వ అధ్యాయం, 18వ పేరా

 8 బహిష్కరించడం

ఘోరమైన పాపం చేసిన వ్యక్తి పశ్చాత్తాపపడకుండా, యెహోవా ప్రమాణాల్ని లెక్కచేయకుండా ఉంటే అతను ఇక సంఘంలో ఉండడానికి అర్హుడు కాదు. అతన్ని సంఘం నుండి బహిష్కరించాలి. మనం ఇక అతనితో సహవాసం చేయం, మాట్లాడం. (1 కొరింథీయులు 5:11; 2 యోహాను 9-11) బహిష్కరించడం అనే ఏర్పాటు వల్ల యెహోవా పేరుకు, సంఘానికి అపకీర్తి రాకుండా ఉంటుంది. (1 కొరింథీయులు 5:6) అంతేకాదు అలా క్రమశిక్షణ ఇవ్వడం వల్ల ఆ వ్యక్తి పశ్చాత్తాపపడి, యెహోవా దగ్గరికి తిరిగొచ్చే అవకాశం ఉంటుంది.—లూకా 15:17.

3వ అధ్యాయం, 19వ పేరా

 9 నడిపింపు, నిర్దేశం, సలహా

యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడు, మనకు సహాయం చేయాలని కోరుకుంటున్నాడు. అందుకే బైబిలు ద్వారా, తనను ప్రేమించే వ్యక్తుల ద్వారా మనకు నడిపింపును, నిర్దేశాన్ని, సలహాల్ని ఇస్తున్నాడు. అపరిపూర్ణులమైన మనకు అవి చాలా అవసరం. (యిర్మీయా 17:9) యెహోవా ఎవరి ద్వారా మనకు నడిపింపు ఇస్తున్నాడో వాళ్ల పట్ల గౌరవం చూపిస్తూ, వాళ్ల సలహా వినాలి. అలా చేయడం ద్వారా యెహోవా పట్ల గౌరవం, ఆయనకు లోబడాలనే కోరిక ఉన్నాయని చూపిస్తాం.—హెబ్రీయులు 13:7.

4వ అధ్యాయం, 2వ పేరా

 10 గర్వం, వినయం

మనం అపరిపూర్ణులం కాబట్టి స్వార్థం, గర్వం మనలో త్వరగా వస్తాయి. కానీ మనం వినయంగా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు. మనల్ని మనం యెహోవాతో పోల్చుకుని, ఆయన ముందు మనం ఎంత అల్పులమో ఆలోచించినప్పుడు మనం వినయంగా ఉండడం నేర్చుకుంటాం. (యోబు 38:1-4) అంతేకాదు మన గురించి కాకుండా వేరేవాళ్ల గురించి, వాళ్ల అవసరాల గురించి ఎక్కువగా ఆలోచిస్తే వినయంగా ఉంటాం. గర్విష్ఠి ఇతరుల కన్నా తానే గొప్పవాడినని అనుకుంటాడు. వినయస్థుడు తన బలాలు ఏంటో, బలహీనతలు ఏంటో నిజాయితీగా పరిశీలించుకుంటాడు. తన తప్పుల్ని ఒప్పుకోవడానికి, క్షమాపణ అడగడానికి, ఇతరుల సలహాలు-సూచనలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. అంతేకాదు యెహోవాపై ఆధారపడతాడు, ఆయనిచ్చే నిర్దేశాన్ని పాటిస్తాడు.—1 పేతురు 5:5.

4వ అధ్యాయం, 4వ పేరా

 11 అధికారం

అధికారం అంటే ఆజ్ఞలు ఇచ్చే, నిర్ణయాలు తీసుకునే హక్కు. పరలోకంలో అలాగే భూమ్మీద సర్వోన్నత అధికారం యెహోవాకు ఉంది. అన్నీ సృష్టించిన ఆయనే ఈ విశ్వంలో అత్యంత శక్తిమంతుడు. ఆయన ఎప్పుడూ తన అధికారాన్ని ఇతరుల మంచి కోసమే ఉపయోగిస్తాడు. మనల్ని చూసుకునే బాధ్యతను యెహోవా కొంతమంది మనుషులకు అప్పగించాడు. ఉదాహరణకు తల్లిదండ్రులకు, సంఘ పెద్దలకు, ప్రభుత్వాలకు యెహోవా కొంత అధికారం ఇచ్చాడు. మనం వాళ్లకు సహకరించాలని ఆయన కోరుతున్నాడు. (రోమీయులు 13:1-5; 1 తిమోతి 5:17) కానీ మనుషుల నియమాలు దేవుని నియమాలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, మనం దేవునికే లోబడతాం. (అపొస్తలుల కార్యాలు 5:29) యెహోవా ఎవరికైతే అధికారం ఇచ్చాడో వాళ్లకు లోబడడం ద్వారా మనం ఆయన నిర్ణయాల పట్ల గౌరవం చూపిస్తాం.

4వ అధ్యాయం, 7వ పేరా

 12 సంఘ పెద్దలు

సంఘాన్ని చూసుకోవడానికి యెహోవా అనుభవంగల సహోదరుల్ని అంటే పెద్దల్ని నియమించాడు. (ద్వితీయోపదేశకాండం 1:13; అపొస్తలుల కార్యాలు 20:28) యెహోవాతో మన సంబంధాన్ని బలపర్చుకోవడానికి, శాంతిగా అలాగే క్రమపద్ధతిగా ఆయన్ని ఆరాధించడానికి వాళ్లు మనకు సహాయం చేస్తారు. (1 కొరింథీయులు 14:33, 40) లేఖనాల్లో ఉన్న అర్హతల్ని చేరుకున్నవాళ్లే పవిత్రశక్తి ద్వారా పెద్దలుగా నియమించబడతారు. (1 తిమోతి 3:1-7; తీతు 1:5-9; 1 పేతురు 5:2, 3) మనం దేవుని సంస్థను నమ్ముతాం, దానికి మద్దతిస్తాం కాబట్టి సంఘ పెద్దలకు సంతోషంగా సహకరిస్తాం.—కీర్తన 138:6; హెబ్రీయులు 13:17.

4వ అధ్యాయం, 8వ పేరా

 13 కుటుంబ శిరస్సు

పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యతను యెహోవా తల్లిదండ్రులకు ఇచ్చాడు. అయితే భర్త కుటుంబ శిరస్సు అని బైబిలు చెప్తుంది. తండ్రి లేని కుటుంబాల్లో తల్లే శిరస్సు అవుతుంది. కుటుంబ శిరస్సు కుటుంబ సభ్యులకు కావల్సిన ఆహారం, ఇల్లు, బట్టలు వంటి అవసరాలు తీర్చాలి. అన్నిటికన్నా ముఖ్యంగా యెహోవాను ఆరాధించే విషయంలో అతను కుటుంబాన్ని ముందుండి నడిపించాలి. అంటే వాళ్లు క్రమంగా కూటాలకు వెళ్లేలా, పరిచర్యలో పాల్గొనేలా, కలిసి బైబిల్ని అధ్యయనం చేసేలా అతను చూసుకోవాలి. కుటుంబంలో నిర్ణయాలు తీసుకోవాల్సింది కూడా శిరస్సే. అతను కఠినంగా, దురుసుగా కాకుండా యేసులా దయగా ఉంటాడు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు కుటుంబంలో ప్రేమ నెలకొంటుంది, కుటుంబ సభ్యులందరూ సురక్షితంగా ఉన్నట్లు భావిస్తారు, యెహోవాకు మరింత దగ్గరౌతారు.

4వ అధ్యాయం, 12వ పేరా

 14 పరిపాలక సభ

పరిపాలక సభ అంటే తన ప్రజల పనిని నిర్దేశించడానికి దేవుడు ఉపయోగించుకుంటున్న కొంతమంది అభిషిక్త సహోదరుల గుంపు. మొదటి శతాబ్దంలో ఆరాధన విషయంలో, ప్రకటనా పని విషయంలో తొలి క్రైస్తవుల్ని నిర్దేశించడానికి యెహోవా పరిపాలక సభను ఉపయోగించుకున్నాడు. (అపొస్తలుల కార్యాలు 15:2) నేడు, పరిపాలక సభలోని సహోదరులు దేవుని ప్రజల్ని నిర్దేశించడంలో, నడిపించడంలో, కాపాడడంలో నాయకత్వం వహిస్తున్నారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాళ్లు దేవుని వాక్యంలోని నిర్దేశాల మీద, పవిత్రశక్తి మీద ఆధారపడతారు. ఆ అభిషిక్త సహోదరుల గుంపును ఉద్దేశించే యేసు “నమ్మకమైన, బుద్ధిగల దాసుడు” అన్నాడు.—మత్తయి 24:45-47.

4వ అధ్యాయం, 15వ పేరా

 15 తల మీద ముసుగు

సంఘంలో సాధారణంగా ఒక సహోదరుడు చేయాల్సిన పనిని కొన్నిసార్లు సహోదరి చేయాల్సి రావచ్చు. ఆమె ఆ పని చేసేటప్పుడు తల మీద ముసుగు వేసుకోవడం ద్వారా యెహోవా ఏర్పాటు పట్ల గౌరవం చూపిస్తుంది. ఉదాహరణకు, ఒక సహోదరి తన భర్త ఉన్నప్పుడు లేదా బాప్తిస్మం తీసుకున్న ఒక సహోదరుడు ఉన్నప్పుడు బైబిలు అధ్యయనం నిర్వహిస్తుంటే, తల మీద ముసుగు వేసుకుంటుంది.—1 కొరింథీయులు 11:11-15.

4వ అధ్యాయం, 17వ పేరా

 16 తటస్థత

మనం తటస్థంగా ఉంటాం, కాబట్టి రాజకీయాల్లో ఎవరి వైపూ ఉండం. (యోహాను 17:16) యెహోవా ప్రజలు దేవుని రాజ్యానికే మద్దతిస్తారు. యేసులాగే మనం ఈ లోక వ్యవహారాల్లో తటస్థంగా ఉంటాం.

“ప్రభుత్వాలకు, అధికారాలకు లోబడమని” యెహోవా ఆజ్ఞాపించాడు. (తీతు 3:1, 2; రోమీయులు 13:1-7) అయితే హత్య చేయకూడదు అని కూడా దేవుడు ఆజ్ఞాపించాడు. కాబట్టి యుద్ధంలో పాల్గొనడానికి ఒక క్రైస్తవుడి మనస్సాక్షి ఒప్పుకోదు. అయితే మిలిటరీ సేవకు బదులు ఏదైనా పౌర సేవ చేసే అవకాశం ఉంటే, అందుకు తన మనస్సాక్షి ఒప్పుకుంటుందో లేదో అతను చూసుకోవాలి.

యెహోవా సృష్టికర్త కాబట్టి మనం ఆయన్ని మాత్రమే ఆరాధిస్తాం. మనం జాతీయ చిహ్నాల్ని గౌరవిస్తాం కానీ జెండా వందనం చేయం, జాతీయ గీతం పాడం. (యెషయా 43:11; దానియేలు 3:1-30; 1 కొరింథీయులు 10:14) యెహోవా ప్రజలమైన మనం ఏ రాజకీయ పార్టీకి లేదా అభ్యర్థికి ఓటు వేయకూడదని కూడా వ్యక్తిగతంగా నిర్ణయించుకుంటాం. ఎందుకంటే, దేవుని ప్రభుత్వానికే మద్దతివ్వాలని మనం నిర్ణయం తీసుకున్నాం.—మత్తయి 22:21; యోహాను 15:19; 18:36.

5వ అధ్యాయం, 2వ పేరా

 17 లోక స్ఫూర్తి

ఈ లోకం సాతాను ఆలోచనా విధానాన్ని ప్రోత్సహిస్తోంది. యెహోవాను ప్రేమించని, అనుకరించని, ఆయన ప్రమాణాల్ని పాటించని ప్రజల్లో అది స్పష్టంగా కనిపిస్తుంది. (1 యోహాను 5:19) అలాంటి ఆలోచనా విధానాన్ని, దానివల్ల చేసే పనుల్ని బైబిలు లోక స్ఫూర్తి లేదా లోక వైఖరి అని చెప్తుంది. (ఎఫెసీయులు 2:2) దాని ప్రభావం తమ మీద పడకుండా యెహోవా ప్రజలు జాగ్రత్తగా ఉంటారు. (ఎఫెసీయులు 6:10-18) అంతేకాదు వాళ్లు యెహోవా మార్గాల్ని ప్రేమిస్తారు, ఆయనలా ఆలోచించడానికి కృషి చేస్తారు.

5వ అధ్యాయం, 7వ పేరా

 18 మతభ్రష్టత్వం

మతభ్రష్టత్వం అంటే బైబిలు సత్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం. మతభ్రష్టులు యెహోవా మీద, దేవుని రాజ్యానికి రాజైన యేసు మీద ఎదురుతిరుగుతారు. ఇతరుల్ని కూడా అలా చేయమని చెప్తారు. (రోమీయులు 1:25) యెహోవాను ఆరాధించేవాళ్ల మనసులో సందేహాల్ని నాటడానికి ప్రయత్నిస్తారు. తొలి క్రైస్తవ సంఘంలో కొంతమంది మతభ్రష్టులుగా మారారు, మన కాలంలో కూడా కొంతమంది అలా మారారు. (2 థెస్సలొనీకయులు 2:3) యెహోవాకు విశ్వసనీయంగా ఉండేవాళ్లు మతభ్రష్టులతో ఎలాంటి సంబంధం కలిగివుండరు. కుతూహలంతో గానీ, వేరేవాళ్ల ఒత్తిడి వల్ల గానీ మనం మతభ్రష్టుల ఆలోచనల్ని చదవం, వినం. బదులుగా యెహోవాకు విశ్వసనీయంగా ఉంటాం, ఆయన్ని మాత్రమే ఆరాధిస్తాం.

5వ అధ్యాయం, 9వ పేరా

 19 ప్రాయశ్చిత్తం

మోషే ధర్మశాస్త్రం ప్రకారం, ఇశ్రాయేలీయులు పాప క్షమాపణ పొందడం కోసం ధాన్యాన్ని, నూనెను, జంతువుల్ని యెహోవాకు ప్రాయశ్చిత్త బలులుగా అర్పించాలి. వాళ్లు ఒక జనాంగంగా, వ్యక్తిగతంగా చేసిన పాపాల్ని క్షమించడానికి యెహోవా సిద్ధంగా ఉన్నాడని ఆ ఏర్పాటు గుర్తుచేసేది. మనందరి పాపాల కోసం యేసు తన ప్రాణాన్ని అర్పించాడు, కాబట్టి నేడు మనం ప్రాయశ్చిత్త బలులు అర్పించాల్సిన అవసరం లేదు. “అన్నికాలాలకు సరిపోయేలా” యేసు ఒక్కసారే పరిపూర్ణమైన బలిని అర్పించాడు.—హెబ్రీయులు 10:1, 4, 10.

7వ అధ్యాయం, 6వ పేరా

 20 జంతువుల ప్రాణం పట్ల గౌరవం

మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఇశ్రాయేలీయులు జంతువుల్ని ఆహారంగా తినవచ్చు. జంతువుల్ని బలులుగా అర్పించమని కూడా ధర్మశాస్త్రం చెప్పింది. (లేవీయకాండం 1:5, 6) అయితే తన ప్రజలు జంతువులతో క్రూరంగా ప్రవర్తించడాన్ని యెహోవా ఎన్నడూ అనుమతించలేదు. (సామెతలు 12:10) నిజానికి ధర్మశాస్త్రంలోని నియమాలు, క్రూరంగా హింసించబడకుండా జంతువుల్ని కాపాడాయి. తమ జంతువుల్ని జాగ్రత్తగా చూసుకోవాలని ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించింది.—ద్వితీయోపదేశకాండం 22:6, 7.

7వ అధ్యాయం, 6వ పేరా

 21 రక్తంలోని సూక్ష్మ భాగాలు, వైద్య విధానాలు

రక్తంలోని సూక్ష్మ భాగాలు. రక్తంలో నాలుగు ప్రధాన భాగాలు ఉంటాయి. అవి: ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్‌లెట్స్‌, ప్లాస్మా. ఈ నాలుగు ప్రధాన భాగాల్ని చిన్నచిన్న భాగాలుగా విడదీస్తే వాటిని సూక్ష్మ భాగాలు అంటారు. *

క్రైస్తవులు రక్తాన్నీ, అందులోని నాలుగు ప్రధాన భాగాల్లో దేన్నీ ఎక్కించుకోరు. మరి సూక్ష్మ భాగాల సంగతేంటి? ఆ విషయం గురించి బైబిలు ఏమీ చెప్పట్లేదు. కాబట్టి ప్రతీ క్రైస్తవుడు తన బైబిలు శిక్షిత మనస్సాక్షి ప్రకారం సొంతగా నిర్ణయించుకోవాలి.

కొంతమంది క్రైస్తవులు సూక్ష్మ భాగాల్లో దేన్నీ తీసుకోరు. దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో, జంతువుల నుండి తీసిన రక్తాన్ని “నేలమీద పారబోయాలి” అని ఉంది కదా అని వాళ్లు అనవచ్చు.—ద్వితీయోపదేశకాండం 12:22-24.

ఇంకొంతమంది క్రైస్తవులు మరోలా నిర్ణయించుకోవచ్చు. తమ మనస్సాక్షిని బట్టి వాళ్లు కొన్ని సూక్ష్మ భాగాల్ని తీసుకోవచ్చు. రక్తంలో నుండి తీసిన సూక్ష్మ భాగాలు ఇక ఆ జీవి ప్రాణంతో సమానం కాదని వాళ్లు అనవచ్చు.

సూక్ష్మ భాగాల విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ ప్రశ్నల గురించి ఆలోచించండి:

  • సూక్ష్మ భాగాల్లో దేన్నీ తీసుకోకూడదని నిర్ణయించుకుంటే, రోగాలతో పోరాడే లేదా రక్తం గడ్డకట్టడానికి సహాయం చేసే కొన్ని మందుల్ని కూడా నేను తీసుకోకూడదని నాకు తెలుసా?

  • నేను కొన్ని సూక్ష్మ భాగాల్ని ఎందుకు తీసుకోనో లేదా ఎందుకు తీసుకుంటానో డాక్టరుకు ఎలా వివరిస్తాను?

వైద్య విధానాలు. క్రైస్తవులమైన మనం రక్త దానం చేయం. అలాగే ఆపరేషన్‌ సమయంలో ఎక్కించుకోవడం కోసం మన సొంత రక్తాన్ని ముందే తీసి నిల్వ చేసుకోం. అయితే రోగి సొంత రక్తాన్ని ఉపయోగించి చేసే వేరే వైద్య విధానాలు ఉన్నాయి. ఆపరేషన్‌ జరుగుతున్నప్పుడు, రక్త పరీక్షలు చేయించుకుంటున్నప్పుడు, లేదా చికిత్స తీసుకుంటున్నప్పుడు తన రక్తాన్ని ఎలా ఉపయోగించాలో ప్రతీ క్రైస్తవుడు వ్యక్తిగతంగా నిర్ణయించుకోవాలి. రోగి సొంత రక్తాన్ని ఉపయోగించి చేసే అలాంటి వైద్య విధానాల్లో, రక్తం కొంత సమయం వరకు రోగి శరీరం నుండి పూర్తిగా వేరై పోవచ్చు.—మరింత సమాచారం కోసం కావలికోట, అక్టోబరు 15, 2000, 30-31 పేజీలు చూడండి.

అలాంటి ఒక వైద్య విధానం, హిమోడైల్యూషన్‌. ఈ పద్ధతిలో, ఆపరేషన్‌ మొదలవ్వడానికి కాస్త ముందు రోగిలో నుండి కొంత రక్తాన్ని తీసి, అతనికి ఒక ద్రవాన్ని (వాల్యూమ్‌ ఎక్స్‌పాండర్‌) ఎక్కిస్తారు. ఆ ద్రవం అతని శరీరంలోని రక్తాన్ని పల్చగా చేస్తుంది. తర్వాత, ఆపరేషన్‌ సమయంలో గానీ ఆపరేషన్‌ అయిన కాసేపటికి గానీ ఆ రక్తాన్ని అతనికి తిరిగి ఎక్కిస్తారు.

మరో వైద్య విధానం, సెల్‌ సాల్వేజ్‌. ఈ పద్ధతిలో, ఆపరేషన్‌ జరుగుతున్నప్పుడు రోగి శరీరం నుండి బయటికి వచ్చిన రక్తాన్ని సేకరించి, శుభ్రం చేసి, ఆపరేషన్‌ సమయంలో గానీ ఆపరేషన్‌ అయిన కాసేపటికి గానీ దాన్ని తిరిగి రోగికి ఎక్కిస్తారు.

ఈ వైద్య విధానాల్ని ఒక్కో డాక్టరు ఒక్కోలా చేయవచ్చు. కాబట్టి ప్రతీ క్రైస్తవుడు ఆపరేషన్‌లో, రక్త పరీక్షలో, లేదా ప్రస్తుత చికిత్సలో తన రక్తాన్ని ఎలా ఉపయోగిస్తారో ముందే వివరంగా తెలుసుకోవాలి.

మీ సొంత రక్తాన్ని ఉపయోగించి చేసే వైద్య విధానాల విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు, ఈ ప్రశ్నల గురించి ఆలోచించండి:

  • నా శరీరం నుండి కొంత రక్తాన్ని బయటికి మళ్లిస్తున్నప్పుడు ఆ ప్రవాహాన్ని కొద్దిసేపు ఆపేస్తే, ఆ రక్తం ఇంకా నాలో భాగమేనని, దాన్ని ‘నేలమీద పారబోయాల్సిన’ అవసరం లేదని నా మనస్సాక్షికి అనిపిస్తుందా?—ద్వితీయోపదేశకాండం 12:23, 24.

  • ఏదైనా వైద్య విధానంలో, నాలో నుండి కొంత రక్తాన్ని బయటికి తీసి, దానికి మార్పులు చేసి, తిరిగి నా శరీరంలోకి ఎక్కిస్తే (లేదా నా గాయం మీద పూస్తే) నా బైబిలు శిక్షిత మనస్సాక్షి నొచ్చుకుంటుందా?

  • నా సొంత రక్తాన్ని ఉపయోగించి చేసే వైద్య విధానాలన్నిటినీ వద్దంటున్నాను అంటే రక్త పరీక్షలు, హిమోడయాలిసిస్‌ లేదా హార్ట్‌-లంగ్‌ బైపాస్‌ మెషీన్‌ వంటివి కూడా వద్దంటున్నట్లేనని నాకు తెలుసా? హిమోడయాలిసిస్‌లో రోగి రక్తాన్ని ఒక మెషీన్‌లోకి మళ్లిస్తారు. అది రోగి రక్తాన్ని వడపోసి, శుభ్రం చేసి తిరిగి రోగి శరీరంలోకి పంపిస్తుంది. హార్ట్‌-లంగ్‌ బైపాస్‌ మెషీన్‌ను ఆపరేషన్‌ సమయంలో ఉపయోగిస్తారు. అది గుండె, ఊపిరితిత్తులు చేయాల్సిన పనిని చేస్తుంది.

సూక్ష్మ భాగాల గురించి, మన సొంత రక్తాన్ని ఉపయోగించి చేసే వైద్య విధానాల గురించి నిర్ణయాలు తీసుకునే ముందు నిర్దేశం కోసం యెహోవాకు ప్రార్థించాలి, పరిశోధన చేయాలి. (యాకోబు 1:5, 6) తర్వాత మన బైబిలు శిక్షిత మనస్సాక్షిని ఉపయోగించి నిర్ణయం తీసుకోవాలి. ‘నా స్థానంలో ఉంటే మీరేం చేస్తారు’ అని మనం వేరేవాళ్లను అడగకూడదు, వేరేవాళ్లు కూడా వాళ్ల అభిప్రాయాన్ని మనమీద రుద్దకూడదు.—రోమీయులు 14:12; గలతీయులు 6:5.

7వ అధ్యాయం, 11వ పేరా

 22 నైతిక పవిత్రత

నైతిక పవిత్రత అంటే దేవుని దృష్టిలో మన ఆలోచనలు, మాటలు, పనులు పవిత్రంగా ఉండేలా చూసుకోవడం. అన్ని రకాల అపవిత్రతకు, లైంగిక పాపాలకు దూరంగా ఉండమని యెహోవా మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. (సామెతలు 1:10; 3:1) తప్పు చేయాలనే శోధన రాకముందే, మనం యెహోవా పవిత్ర ప్రమాణాల ప్రకారం జీవించాలని నిర్ణయించుకోవాలి. మన మనసును పవిత్రంగా ఉంచుకోవడానికి సహాయం చేయమని యెహోవాకు ఎప్పుడూ ప్రార్థించాలి, అనైతిక శోధనల్లో పడిపోకూడదని నిశ్చయించుకోవాలి.—1 కొరింథీయులు 6:9, 10, 18; ఎఫెసీయులు 5:5.

8వ అధ్యాయం, 11వ పేరా

 23 లెక్కలేనితనం, అపవిత్రత

లెక్కలేనితనం అంటే దేవుని ప్రమాణాల్ని ఘోరంగా ఉల్లంఘిస్తూ, సిగ్గులేకుండా మాట్లాడడం లేదా ప్రవర్తించడం. అలా ప్రవర్తించే వ్యక్తి తనకు దేవుని నియమాల పట్ల గౌరవం లేదని చూపిస్తాడు. అతను సంఘంలో ఉండడానికి అర్హుడో కాదో న్యాయనిర్ణయ కమిటీ నిర్ణయిస్తుంది. అపవిత్రతలో చాలా రకాల పాపాలు ఉన్నాయి. సంఘంలో ఎవరైనా అపవిత్రతకు పాల్పడితే, పరిస్థితి తీవ్రతను బట్టి న్యాయనిర్ణయ కమిటీ ఏర్పాటు చేయాల్సి రావచ్చు.గలతీయులు 5:19-21; ఎఫెసీయులు 4:19; మరింత సమాచారం కోసం 2006 కావలికోట, జూలై 15 సంచికలోని “పాఠకుల ప్రశ్నలు” చూడండి.

9వ అధ్యాయం, 7వ పేరా; 12వ అధ్యాయం, 10వ పేరా

 24 హస్తప్రయోగం

సెక్స్‌ అనేది భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించుకోవడానికి యెహోవా చేసిన పవిత్రమైన ఏర్పాటు. కానీ ఒక వ్యక్తి హస్తప్రయోగం చేసినప్పుడు ఆ ఏర్పాటును అపవిత్రం చేసినట్టు అవుతుంది. హస్తప్రయోగం అంటే లైంగిక ఆనందం పొందేలా మర్మాంగాలను ఉద్రేకపర్చుకోవడం. ఆ అలవాటు వల్ల యెహోవాతో ఉన్న సంబంధం పాడవ్వవచ్చు, నీచమైన కోరికలు కలగవచ్చు, సెక్స్‌ విషయంలో తప్పుడు అభిప్రాయం కలగవచ్చు. (కొలొస్సయులు 3:5) ఒకవేళ మీకు ఈ అలవాటు ఉంటే దాన్ని మానుకోవడానికి చేసే ప్రయత్నాల్ని ఆపకండి. (కీర్తన 86:5; 1 యోహాను 3:20) యెహోవాకు నిజాయితీగా ప్రార్థిస్తూ సహాయం చేయమని అడగండి. అపవిత్ర ఆలోచనల్ని కలిగించే అశ్లీల చిత్రాలకు దూరంగా ఉండండి. మీ క్రైస్తవ తల్లిదండ్రులతో గానీ, యెహోవా నియమాల్ని గౌరవించే పరిణతిగల స్నేహితునితో గానీ మీ సమస్య గురించి మాట్లాడండి. (సామెతలు 1:8, 9; 1 థెస్సలొనీకయులు 5:14; తీతు 2:3-5) నైతికంగా పవిత్రంగా ఉండడానికి మీరు చేస్తున్న ప్రయత్నాల్ని యెహోవా గమనిస్తాడని, విలువైనవిగా ఎంచుతాడని గుర్తుంచుకోండి.—కీర్తన 51:17; యెషయా 1:18.

9వ అధ్యాయం, 9వ పేరా

 25 ఎక్కువమందిని పెళ్లి చేసుకోవడం

ఒక్క పురుషుడు ఒక్క స్త్రీనే పెళ్లి చేసుకోవాలనేది యెహోవా ఏర్పాటు. అయితే ప్రాచీన ఇశ్రాయేలులో పురుషులు ఒకరి కంటే ఎక్కువమందిని పెళ్లి చేసుకోవడాన్ని దేవుడు అనుమతించాడు. నేడు తన ప్రజల మధ్య యెహోవా దాన్ని అనుమతించట్లేదు. ఒక భర్తకు ఒకే భార్య ఉండాలి, ఒక భార్యకు ఒకే భర్త ఉండాలి.—మత్తయి 19:9; 1 తిమోతి 3:2.

10వ అధ్యాయం, 12వ పేరా

 26 విడాకులు, వేరుగా ఉండడం

భార్యాభర్తలు బ్రతికున్నంత కాలం కలిసి ఉండాలనేది యెహోవా ఉద్దేశం. (ఆదికాండం 2:24; మలాకీ 2:15, 16; మత్తయి 19:3-6; 1 కొరింథీయులు 7:39) వివాహజత వ్యభిచారం చేసినప్పుడు మాత్రమే విడాకులు తీసుకోవచ్చని ఆయన చెప్తున్నాడు. అలాంటి పరిస్థితిలో విడాకులు తీసుకోవాలో వద్దో నిర్ణయించుకునే హక్కు, తప్పు చేయని భర్తకు లేదా భార్యకు ఉంటుంది.—మత్తయి 19:9.

కొన్ని సందర్భాల్లో, కొంతమంది క్రైస్తవులు తమ వివాహ జత వ్యభిచారం చేయకపోయినా, వేరే కారణాల్ని బట్టి విడిపోయి వేరుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. (1 కొరింథీయులు 7:11) ఈ పరిస్థితుల్లో క్రైస్తవులు వేరుగా ఉండాలని నిర్ణయించుకోవచ్చు:

  • కావాలనే పట్టించుకోకపోవడం: భర్త కుటుంబ అవసరాల్ని పూర్తిగా పట్టించుకోకపోవడం వల్ల భార్యాపిల్లల పరిస్థితి దయనీయంగా ఉండవచ్చు.—1 తిమోతి 5:8.

  • తీవ్రంగా హింసించడం: ఆరోగ్యం, ప్రాణం ప్రమాదంలో పడేంతగా భర్త లేదా భార్య హింసిస్తుండవచ్చు.—గలతీయులు 5:19-21.

  • యెహోవాతో ఉన్న సంబంధం ప్రమాదంలో పడడం: భర్త లేదా భార్య వల్ల యెహోవాను సేవించడం ఏమాత్రం కుదరకపోవచ్చు.—అపొస్తలుల కార్యాలు 5:29.

11వ అధ్యాయం, 19వ పేరా

 27 మెచ్చుకోవడం, ప్రోత్సహించడం

ప్రతీ ఒక్కరికి ఇతరులు తమను మెచ్చుకోవాలనే, ప్రోత్సహించాలనే కోరిక ఉంటుంది. (సామెతలు 12:25; 16:24) ప్రేమగా, దయగా మాట్లాడడం ద్వారా మనం ఒకరినొకరం బలపర్చుకోవచ్చు, ఓదార్చుకోవచ్చు. అలా మాట్లాడడం వల్ల మన సహోదర సహోదరీలు పెద్దపెద్ద కష్టాల్ని కూడా సహించగలుగుతారు, యెహోవా సేవలో కొనసాగగలుగుతారు. (సామెతలు 12:18; ఫిలిప్పీయులు 2:1-4) ఒక వ్యక్తి తీవ్రమైన నిరుత్సాహంలో ఉన్నప్పుడు మనం అతను చెప్పేది శ్రద్ధగా వినాలి, అతని భావాల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడు వాళ్లతో ఎలా మాట్లాడాలో లేదా వాళ్లకు ఎలా సహాయం చేయాలో మనకు తెలుస్తుంది. (యాకోబు 1:19) సహోదర సహోదరీల్ని బాగా తెలుసుకోవాలనే లక్ష్యం పెట్టుకోండి, వాళ్లకు నిజంగా ఏం కావాలో అర్థం చేసుకోండి. అప్పుడు వాళ్లు ఓదార్పుకు, ప్రోత్సాహానికి మూలమైన యెహోవా వైపు తిరిగి నిజమైన ఊరట పొందగలుగుతారు.—2 కొరింథీయులు 1:3, 4; 1 థెస్సలొనీకయులు 5:11.

12వ అధ్యాయం, 16వ పేరా

 28 పెళ్లి

పెళ్లి ఇలానే చేసుకోవాలి అనే నియమాలేవీ బైబిల్లో లేవు. సంప్రదాయాలు, చట్టాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటాయి. (ఆదికాండం 24:67; మత్తయి 1:24; 25:10; లూకా 14:8) పెళ్లిలో అత్యంత ప్రాముఖ్యమైన విషయం, పెళ్లికొడుకు-పెళ్లికూతురు యెహోవా ముందు చేసే ప్రమాణం. తమ కుటుంబ సభ్యుల, స్నేహితుల సమక్షంలో పెళ్లి ప్రమాణాలు చెప్పుకోవాలని, అలాగే ఒక పెద్ద తమ పెళ్లి ప్రసంగం ఇవ్వాలని చాలామంది దంపతులు నిర్ణయించుకుంటారు. పెళ్లి తర్వాత రిసెప్షన్‌ పెట్టుకోవాలా వద్దా, పెట్టుకుంటే దాన్ని ఎలా చేసుకోవాలి అనేది దంపతుల ఇష్టం. (లూకా 14:28; యోహాను 2:1-11) పెళ్లి ఏర్పాట్ల విషయంలో దంపతులు ఏ నిర్ణయం తీసుకున్నా, ఆ ఏర్పాట్లన్నీ యెహోవాకు మహిమ తెచ్చేలా ఉండాలి. (ఆదికాండం 2:18-24; మత్తయి 19:5, 6) మంచి నిర్ణయాలు తీసుకోవడానికి బైబిలు సూత్రాలు వాళ్లకు సహాయం చేస్తాయి. (1 యోహాను 2:16, 17) ఒకవేళ రిసెప్షన్‌లో మద్యం అందించాలని దంపతులు నిర్ణయించుకుంటే, సరైన పర్యవేక్షణ ఉండేలా చూసుకోవాలి. (సామెతలు 20:1; ఎఫెసీయులు 5:18) రిసెప్షన్‌లో సంగీతం లేదా వినోదం ఏర్పాటు చేయాలనుకుంటే అవి యెహోవాకు మహిమ తెచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పెళ్లికొడుకు, పెళ్లికూతురు కేవలం తమ పెళ్లిరోజు మీద కాదుగానీ దేవునితో తమకున్న సంబంధం మీద, వాళ్లిద్దరి మధ్య ఉన్న సంబంధం మీద మనసుపెట్టాలి.—సామెతలు 18:22; మరిన్ని సలహాల కోసం కావలికోట, అక్టోబరు 15, 2006, 18-31 పేజీలు చూడండి.

13వ అధ్యాయం, 18వ పేరా

 29 తెలివైన నిర్ణయాలు తీసుకోవడం

దేవుని వాక్యంలోని సూత్రాల ఆధారంగా మంచి నిర్ణయాలు తీసుకోవాలని మనం కోరుకుంటాం. ఉదాహరణకు, సాక్షికాని భర్త లేదా భార్య తన వివాహజతను, ఒక పండుగ రోజున బంధువులతో భోజనం చేయడానికి రమ్మనవచ్చు. అలాంటి పరిస్థితి ఎదురైతే మీరేం చేస్తారు? వెళ్లడానికి మీ మనస్సాక్షి ఒప్పుకుంటే మీరు వెళ్లవచ్చు. అయితే అక్కడ అన్యమత ఆచారాలు పాటిస్తే, మీరు వాటిలో పాల్గొనరని మీ భర్త లేదా భార్యకు ముందే వివరించవచ్చు. అలాగే మీరు ఆ భోజనానికి వెళ్లడం వల్ల వేరేవాళ్లు అభ్యంతరపడతారేమో కూడా ఆలోచించాలి.—1 కొరింథీయులు 8:9; 10:23, 24.

ఒకవేళ మీ యజమాని పండుగ సమయంలో మీకు బోనస్‌ ఇస్తానని చెప్పవచ్చు. మీరు దాన్ని తీసుకోకూడదా? అలాగని ఏం లేదు. కొంతవరకు, యజమాని ఏ కారణంతో దాన్ని ఇస్తున్నాడనే దాన్ని బట్టి మీరు తీసుకోవాలో వద్దో నిర్ణయించుకోవచ్చు. యజమాని దాన్ని పండుగలో భాగంగా ఇస్తున్నాడా? లేక మీ కష్టానికి ప్రతిఫలంగా ఇస్తున్నాడా? ఇలాంటి విషయాల గురించి ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవచ్చు.

పండుగ సమయంలో ఎవరైనా మీకు బహుమతి ఇస్తూ ఇలా అనవచ్చు: “మీరు ఈ పండుగ జరుపుకోరని నాకు తెలుసు. కానీ నా సంతోషం కోసం మీరిది తీసుకోండి.” ఆ వ్యక్తి కేవలం మీ మీద ప్రేమతో ఆ బహుమతి ఇస్తున్నాడా? లేక మీ విశ్వాసాన్ని పరీక్షించడానికి, మీరు ఆ పండుగలో పాల్గొనేలా చేయడానికి ఇస్తున్నాడా? దీని గురించి ఆలోచించిన తర్వాత, మీరు ఆ బహుమతి తీసుకోవాలో లేదో నిర్ణయించుకోవచ్చు. నిర్ణయం తీసుకునే ప్రతీసారి మంచి మనస్సాక్షి కలిగివుండాలని, యెహోవాకు నమ్మకంగా ఉండాలని మనం కోరుకుంటాం.—అపొస్తలుల కార్యాలు 23:1.

13వ అధ్యాయం, 22వ పేరా

 30 వ్యాపారం, చట్టపరమైన విషయాలు

చాలావరకు, అభిప్రాయ భేదాల్ని వెంటనే శాంతియుతంగా పరిష్కరించుకుంటే అవి పెద్దపెద్ద సమస్యలుగా మారకుండా ఉంటాయి. (మత్తయి 5:23-26) క్రైస్తవులందరూ ముఖ్యంగా యెహోవాకు మహిమ తీసుకురావడం గురించి, సంఘం ఐక్యంగా ఉండడం గురించి ఆలోచించాలి.—యోహాను 13:34, 35; 1 కొరింథీయులు 13:4, 5.

వ్యాపారంలో క్రైస్తవుల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే, కోర్టు వరకు వెళ్లకుండానే సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. క్రైస్తవులు సమస్య పరిష్కారం కోసం కోర్టుకు వెళ్లడం గురించి అపొస్తలుడైన పౌలు 1 కొరింథీయులు 6:1-8 లో హెచ్చరించాడు. మన సహోదరుణ్ణి కోర్టుకు లాగడం వల్ల యెహోవాకు, సంఘానికి చెడ్డపేరు రావచ్చు. లేనిపోనివి కల్పించి చెప్పడం, మోసం చేయడం వంటివి జరిగినప్పుడు సమస్యను పరిష్కరించుకోవడానికి క్రైస్తవులు మూడు చర్యలు తీసుకోవాలని మత్తయి 18:15-17 చెప్తుంది. (1) ముందు సమస్యను వాళ్లిద్దరే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. (2) అయినా సమస్య పరిష్కారం కాకపోతే, సంఘంలోని పరిణతిగల ఒకరిద్దరి సహాయం అడగవచ్చు. (3) అప్పటికీ పరిష్కారం కాకపోతే, పెద్దల సభ సహాయం తీసుకోవచ్చు. పరిస్థితి అక్కడిదాకా వస్తే, సంఘ పెద్దలు బైబిలు సూత్రాల్ని ఉపయోగించి వాళ్లు రాజీపడేలా సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే వాళ్లలో ఎవరైనా బైబిలు ప్రమాణాల్ని పాటించడానికి ఇష్టపడకపోతే, సంఘ పెద్దలు న్యాయపరమైన చర్య తీసుకోవాల్సి రావచ్చు.

అయితే కొన్ని విషయాల్లో కోర్టుకు వెళ్లడం చట్టపరంగా తప్పనిసరి అవ్వవచ్చు. ఉదాహరణకు విడాకులు, పిల్లల సంరక్షణ, మనోవర్తి (విడాకులు తీసుకున్నప్పుడు జీవనాధారం కోసం వివాహజతకు ఇచ్చే డబ్బు లేదా ఆస్తి), ఇన్సూరెన్స్‌ పరిహారం, బ్యాంకు దివాలా తీయడం వల్ల జరిగిన నష్టం, వీలునామాలు వంటివి. ఒక క్రైస్తవుడు అలాంటి విషయాల్లో సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి కోర్టుకు వెళ్లడం, పౌలు ఇచ్చిన సలహాను మీరినట్టు అవ్వదు.

మానభంగం, పిల్లలపై అత్యాచారం, దాడులు, పెద్దపెద్ద దొంగతనాలు, హత్య వంటి నేరాల గురించి ఒక క్రైస్తవుడు ప్రభుత్వ అధికారులకు తెలియజేయడం, పౌలు ఇచ్చిన సలహాను మీరినట్టు అవ్వదు.

14వ అధ్యాయం, 14వ పేరా

 31 సాతాను పన్నాగాలు

ఏదెను తోటలో హవ్వతో మాట్లాడినప్పటి నుండి ఇప్పటివరకు సాతాను మనుషుల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. (ఆదికాండం 3:1-6; ప్రకటన 12:9) మన ఆలోచనా విధానాన్ని పక్కదారి పట్టిస్తే మనం తప్పు చేస్తాం అని అతనికి తెలుసు. (2 కొరింథీయులు 4:4; యాకోబు 1:14, 15) అతను రాజకీయాలు, మతం, వాణిజ్యం, వినోదం, విద్య ఇంకా చాలావాటిని ఉపయోగించి తన ఆలోచనా విధానం సరైనదే అన్నట్లు చూపిస్తూ దాన్ని ప్రోత్సహిస్తున్నాడు.—యోహాను 14:30; 1 యోహాను 5:19.

ప్రజల్ని మోసం చేయడానికి కొంచెం సమయమే మిగిలివుందని సాతానుకు తెలుసు. కాబట్టి వీలైనంత ఎక్కువమందిని తప్పుదారి పట్టించడానికి అతను చేయగలిగినదంతా చేస్తున్నాడు. ముఖ్యంగా యెహోవా సేవకుల్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నాడు. (ప్రకటన 12:12) జాగ్రత్తగా లేకపోతే, అపవాది మెల్లమెల్లగా మన ఆలోచనా విధానాన్ని పాడుచేయవచ్చు. (1 కొరింథీయులు 10:12) ఉదాహరణకు, వివాహం శాశ్వత బంధంగా ఉండాలన్నది యెహోవా ఉద్దేశం. (మత్తయి 19:5, 6, 9) కానీ చాలామంది వివాహాన్ని, ఎప్పుడంటే అప్పుడు తెంచేసుకునే తాత్కాలిక బంధంలా చూస్తున్నారు. చాలా సినిమాలు, టీవీ కార్యక్రమాలు కూడా దాన్నే ప్రోత్సహిస్తున్నాయి. కానీ ఆ ప్రభావం మనపై పడకుండా చూసుకోవాలి.

స్వతంత్ర వైఖరిని ప్రోత్సహించడం ద్వారా కూడా సాతాను మనల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. (2 తిమోతి 3:4) మనం జాగ్రత్తగా లేకపోతే, యెహోవా ఎవరికైతే అధికారాన్ని అప్పగించాడో వాళ్లపట్ల గౌరవం కోల్పోవచ్చు. ఉదాహరణకు, ఒక సహోదరుడు సంఘ పెద్దల నిర్దేశానికి ఎదురుతిరగడం మొదలుపెట్టవచ్చు. (హెబ్రీయులు 12:5) లేదా ఒక సహోదరి యెహోవా చేసిన శిరస్సత్వ ఏర్పాటును ప్రశ్నించడం మొదలుపెట్టవచ్చు.—1 కొరింథీయులు 11:3.

మన ఆలోచనా విధానాన్ని పాడుచేసే అవకాశం అపవాదికి ఇవ్వకూడదని మనం నిశ్చయించుకోవాలి. బదులుగా యెహోవా ఆలోచనా విధానాన్ని అనుకరిస్తూ, ‘పైనున్న వాటిమీదే మనసుపెట్టాలి.’—కొలొస్సయులు 3:2; 2 కొరింథీయులు 2:11.

16వ అధ్యాయం, 9వ పేరా

 32 వైద్య చికిత్స

ఆరోగ్యంగా ఉండాలని, జబ్బు చేసినప్పుడు మంచి చికిత్స తీసుకోవాలని మనందరం కోరుకుంటాం. (యెషయా 38:21; మార్కు 5:25, 26; లూకా 10:34) నేడు ఎన్నో వైద్య విధానాలు, చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. ఎలాంటి చికిత్సను తీసుకోవాలో నిర్ణయించుకునేటప్పుడు, బైబిలు సూత్రాల్ని పాటించడం ప్రాముఖ్యం. రోగాల్ని శాశ్వతంగా తీసేయగలిగేది దేవుని రాజ్యం మాత్రమే అని మనం గుర్తుంచుకుంటాం. మన ఆరోగ్యం గురించి అతిగా ఆలోచిస్తూ యెహోవా ఆరాధనను పక్కన పెట్టాలని మనం కోరుకోం.—యెషయా 33:24; 1 తిమోతి 4:16.

మంత్రతంత్రాలతో సంబంధం ఉన్నట్లు అనిపించే ఎలాంటి వైద్య చికిత్సకైనా మనం దూరంగా ఉండాలి. (ద్వితీయోపదేశకాండం 18:10-12; యెషయా 1:13) ఏదైనా చికిత్సను లేదా వైద్యాన్ని అంగీకరించే ముందు, దాని మూలం ఏంటో, అది ఎలాంటి ఆలోచనా విధానాన్ని ప్రోత్సహిస్తుందో తెలుసుకోవాలి. (సామెతలు 14:15) మంత్రతంత్రాల్లో పాల్గొనేలా సాతాను మనల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తాడని మర్చిపోకూడదు. ఏదైనా చికిత్సకు మంత్రతంత్రాలతో సంబంధం ఉందని అనుమానం వచ్చినా, దానికి దూరంగా ఉండడం మంచిది.—1 పేతురు 5:8.

16వ అధ్యాయం, 18వ పేరా

^ కొంతమంది డాక్టర్లు రక్తంలోని నాలుగు ప్రధాన భాగాల్ని కూడా సూక్ష్మ భాగాలుగానే చూడవచ్చు. కాబట్టి రక్తాన్ని అలాగే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్‌లెట్స్‌, ప్లాస్మా అనే నాలుగు ప్రధాన భాగాల్ని ఎక్కించుకోరనే మీ వ్యక్తిగత నిర్ణయాన్ని వాళ్లకు వివరించాల్సి రావచ్చు.