కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

4వ అధ్యాయం

అధికారాన్ని ఎందుకు గౌరవించాలి?

అధికారాన్ని ఎందుకు గౌరవించాలి?

“అన్నిరకాల ప్రజల్ని ఘనపర్చండి; ప్రపంచవ్యాప్త సహోదర బృందాన్ని ప్రేమించండి; దేవునికి భయపడుతూ ఉండండి; రాజును ఘనపర్చండి.”—1 పేతురు 2:17.

1, 2. (ఎ) మనం ఎవరి నిర్దేశం పాటించాలి? (బి) ఈ అధ్యాయంలో ఏ ప్రశ్నలు పరిశీలిస్తాం?

 చిన్నప్పుడు మీ అమ్మానాన్నలు మీకు ఇష్టంలేని పని చేయమనడం మీకు గుర్తుండేవుంటుంది. అమ్మానాన్నల మీద ప్రేమ ఉన్నా, వాళ్లకు లోబడాలని తెలిసినా, బహుశా కొన్నిసార్లు లోబడడం మీకు కష్టం అయ్యుండవచ్చు.

2 యెహోవా మన ప్రేమగల తండ్రి. ఆయన మనల్ని పట్టించుకుంటాడు, మనం ఆనందంగా జీవించడానికి కావల్సినవన్నీ ఇస్తాడు. సంతోషంగా జీవించడానికి కావల్సిన నిర్దేశాన్ని కూడా ఆయన ఇస్తాడు. ఆయన కొన్నిసార్లు వేరేవాళ్లను ఉపయోగించి మనకు నిర్దేశం ఇస్తాడు. మనం తన అధికారాన్ని గౌరవించాలని యెహోవా కోరుకుంటున్నాడు. (సామెతలు 24:21) అయితే నిర్దేశాన్ని అంగీకరించడం కొన్నిసార్లు ఎందుకు కష్టంగా అనిపిస్తుంది? మనం నిర్దేశాన్ని పాటించాలని యెహోవా ఎందుకు కోరుకుంటున్నాడు? ఆయన అధికారాన్ని గౌరవిస్తున్నామని ఎలా చూపించవచ్చు?—“నడిపింపు, నిర్దేశం, సలహా” చూడండి.

ఎందుకు కష్టంగా అనిపిస్తుంది?

3, 4. మనుషులకు అపరిపూర్ణత ఎలా వచ్చింది? వేరేవాళ్ల నిర్దేశాన్ని అంగీకరించడం ఎందుకు కష్టంగా అనిపించవచ్చు?

3 సాధారణంగా, అధికారానికి ఎదురుతిరిగే స్వభావం మనుషులందరిలో ఉంటుంది. మొదటి మనుషులైన ఆదాముహవ్వలు పాపం చేసినప్పటి నుండి ఆ స్వభావం కనిపిస్తూ ఉంది. దేవుడు ఆదాముహవ్వల్ని పరిపూర్ణులుగా సృష్టించాడు. అయినా వాళ్లు దేవుని అధికారానికి ఎదురుతిరిగారు. అప్పటినుండి, మనుషులందరికీ అపరిపూర్ణత వారసత్వంగా వచ్చింది. యెహోవా నిర్దేశాన్ని, ఇతరుల నిర్దేశాన్ని అంగీకరించడం కష్టమవ్వడానికి ఒక కారణం, మన అపరిపూర్ణత. మరో కారణం ఏంటంటే, యెహోవా మనకు నిర్దేశాన్ని ఇవ్వడానికి ఉపయోగించుకుంటున్న మనుషులు కూడా అపరిపూర్ణులే.—ఆదికాండం 2:15-17; 3:1-7; కీర్తన 51:5; రోమీయులు 5:12.

4 అపరిపూర్ణత వల్ల మనం గర్వం చూపించే అవకాశం ఉంది. గర్వం వల్ల నిర్దేశాన్ని అంగీకరించడం కష్టమౌతుంది. ఉదాహరణకు, ప్రాచీన కాలంలో తన ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని నడిపించడానికి యెహోవా మోషేను ఎంచుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా యెహోవాను ఆరాధించిన కోరహు అనే వ్యక్తి గర్విష్ఠిగా మారి, మోషే పట్ల చాలా అగౌరవంగా ప్రవర్తించాడు. మోషే మాత్రం దేవుని ప్రజల్ని నడిపించే స్థానంలో ఉన్నా గర్వం చూపించలేదు. నిజానికి, ఆ కాలంలో జీవించిన వాళ్లందరిలో మోషే అత్యంత వినయస్థుడు. అయితే, కోరహు మోషే నిర్దేశాన్ని అంగీకరించలేదు. అతను చాలామందిని తనవైపుకు తిప్పుకుని, మోషేకు ఎదురుతిరిగాడు. కోరహుకు, తిరుగుబాటు చేసిన ఇతరులకు ఏమైంది? వాళ్లు నాశనమయ్యారు. (సంఖ్యాకాండం 12:3; 16:1-3, 31-35) గర్వం ప్రమాదకరమని బైబిల్లోని ఎన్నో ఉదాహరణలు చూపిస్తున్నాయి.—2 దినవృత్తాంతాలు 26:16-21; “గర్వం, వినయం” చూడండి.

5. కొంతమంది అధికారాన్ని ఎలా తప్పుగా ఉపయోగించారు?

5 “అధికారం మనిషిని పాడుచేస్తుంది” అనే మాట మీరు వినే ఉంటారు. చరిత్ర అంతటిలో చాలామంది తమ అధికారాన్ని తప్పుగా ఉపయోగించారు. (ప్రసంగి 8:9 చదవండి.) ఉదాహరణకు యెహోవా సౌలును ఇశ్రాయేలుకు రాజుగా ఎంచుకునే సమయానికి అతను మంచివాడు, వినయస్థుడు. కానీ తర్వాత అతని హృదయంలో గర్వం, అసూయ పెరిగిపోయాయి. దానివల్ల సౌలు తన అధికారాన్ని తప్పుగా ఉపయోగించి అమాయకుడైన దావీదును హింసించాడు. (1 సమూయేలు 9:20, 21; 10:20-22; 18:7-11) తర్వాత దావీదు కూడా రాజయ్యాడు. అతను ఇశ్రాయేలును పరిపాలించిన మంచి రాజుల్లో ఒకడు. అయితే, కొంతకాలానికి దావీదు కూడా అధికారాన్ని తప్పుగా ఉపయోగించాడు. అతను ఊరియా భార్య అయిన బత్షెబతో వ్యభిచారం చేశాడు. పైగా ఊరియాను యుద్ధంలో చనిపోయేలా చేసి, తన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించాడు.—2 సమూయేలు 11:1-17.

మనం యెహోవా అధికారాన్ని ఎందుకు గౌరవించాలి?

6, 7. (ఎ) మనం యెహోవాను ప్రేమిస్తాం కాబట్టి ఏం చేస్తాం? (బి) కష్టమైన పరిస్థితుల్లో కూడా యెహోవాకు లోబడడానికి యేసు ఆదర్శం మనకెలా సహాయం చేస్తుంది?

6 మనం యెహోవాను ప్రేమిస్తాం కాబట్టే ఆయన ఇచ్చే నిర్దేశాన్ని గౌరవిస్తాం. వేరే ఎవ్వరికన్నా, దేనికన్నా యెహోవానే ఎక్కువగా ప్రేమిస్తాం, అందుకే ఆయన్ని సంతోషపెట్టాలనుకుంటాం. (సామెతలు 27:11; మార్కు 12:29, 30 చదవండి.) అయితే మనుషులు యెహోవా అధికారాన్ని ప్రశ్నించాలని సాతాను కోరుకుంటున్నాడు. ఆదాముహవ్వల కాలం నుండీ సాతాను కోరిక అదే. మనం ఏం చేయాలో చెప్పే హక్కు యెహోవాకు లేదని మనం అనుకోవాలన్నది అతని కోరిక. కానీ యెహోవాకు ఆ హక్కు ఉందని మనకు తెలుసు. మనం ఈ మాటల్ని ఒప్పుకుంటాం: “యెహోవా మా దేవా, నువ్వు అన్నిటినీ సృష్టించావు; . . . కాబట్టి మహిమ, ఘనత, శక్తి పొందడానికి నువ్వు అర్హుడవు.”—ప్రకటన 4:11.

7 అమ్మానాన్నలకు లోబడాలని చిన్నప్పటి నుండే మీకు తెలుసు. కానీ కొన్నిసార్లు వాళ్లకు లోబడడం మీకు కష్టంగా అనిపించి ఉంటుంది. యెహోవా సేవకులమైన మనకు కూడా కొన్నిసార్లు ఆయనకు లోబడడం కష్టంగా అనిపించవచ్చు. కానీ మనం యెహోవాను ప్రేమిస్తాం, గౌరవిస్తాం కాబట్టి ఆయనకు లోబడడానికి చేయగలిగినదంతా చేస్తాం. ఈ విషయంలో యేసు మంచి ఆదర్శం ఉంచాడు. కష్టమైన పరిస్థితుల్లో కూడా ఆయన యెహోవాకు లోబడ్డాడు. అందుకే తండ్రితో ఇలా అనగలిగాడు: “నా ఇష్టప్రకారం కాదు, నీ ఇష్టప్రకారమే జరగాలి.”—లూకా 22:42; “అధికారం” చూడండి.

8. యెహోవా మనకు ఏయే విధాలుగా నిర్దేశం ఇస్తున్నాడు? (“ సలహా వినండి” అనే బాక్సు చూడండి.)

8 నేడు యెహోవా మనకు వేర్వేరు విధాలుగా నిర్దేశం ఇస్తున్నాడు. ఆయన మనకు బైబిలు ద్వారా, సంఘ పెద్దల ద్వారా నిర్దేశం ఇస్తున్నాడు. వాళ్లను గౌరవిస్తే, మనం యెహోవా అధికారాన్ని గౌరవించినట్టే. వాళ్ల సహాయాన్ని కాదంటే, ఒకవిధంగా యెహోవాను కాదన్నట్టే. ఇశ్రాయేలీయులు మోషేను వ్యతిరేకించినప్పుడు, యెహోవా దాన్ని చాలా పెద్ద తప్పుగా భావించాడు. వాళ్లు తనను వ్యతిరేకించినట్లు యెహోవాకు అనిపించింది.—సంఖ్యాకాండం 14:26, 27; “సంఘ పెద్దలు” చూడండి.

9. ప్రేమ ఉంటే నిర్దేశాన్ని పాటిస్తామని ఎలా చెప్పవచ్చు?

9 అధికారాన్ని గౌరవిస్తే, మన సహోదర సహోదరీల మీద కూడా ప్రేమ చూపించినట్లే. ఈ ఉదాహరణ పరిశీలించండి. ఏదైనా ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు, విపత్తు సహాయక బృందం ఒక జట్టుగా పనిచేస్తుంది. వాళ్లు వీలైనంత ఎక్కువమందిని కాపాడాలంటే, ఆ బృందాన్ని నడిపించే ఒక నాయకుడు ఉండాలి, అందులోని ప్రతీ ఒక్కరు అతని నిర్దేశాన్ని పాటించాలి. అయితే వాళ్లలో ఒకరు నిర్దేశాన్ని పాటించకుండా తనకు నచ్చినట్టు చేస్తే ఏమౌతుంది? అతని ఉద్దేశం మంచిదే అయినా, అతను నిర్దేశాన్ని పాటించకపోవడం వల్ల మిగతావాళ్లు సమస్యల్లో చిక్కుకుని, తీవ్రంగా గాయపడే అవకాశం ఉంది. అలా చేస్తే ప్రేమ చూపించినట్లు అవ్వదు. అదేవిధంగా మనం యెహోవా నిర్దేశాన్ని, ఆయన ఎవరికైతే అధికారం ఇచ్చాడో వాళ్ల నిర్దేశాన్ని పాటించకపోతే వేరేవాళ్లు ఇబ్బందుల్లో పడవచ్చు. కాబట్టి మనం యెహోవాకు లోబడడం ద్వారా సహోదరుల మీద ప్రేమ, ఆయన ఏర్పాటు పట్ల గౌరవం చూపిస్తాం.—1 కొరింథీయులు 12:14, 25, 26.

10, 11. ఇప్పుడు మనం ఏం పరిశీలిస్తాం?

10 యెహోవా మనకు ఏది చెప్పినా అది మన మంచికే. మనం కుటుంబంలో, సంఘంలో, సమాజంలో అధికారాన్ని గౌరవించినప్పుడు అందరూ ప్రయోజనం పొందుతారు.—ద్వితీయోపదేశకాండం 5:16; రోమీయులు 13:4; ఎఫెసీయులు 6:2, 3; హెబ్రీయులు 13:17.

11 యెహోవా ఎందుకు ఇతరుల్ని గౌరవించమని చెప్తున్నాడో అర్థం చేసుకుంటే, వాళ్లను గౌరవించడం మనకు తేలికౌతుంది. మనం మూడు రంగాల్లో అధికారాన్ని ఎలా గౌరవించవచ్చో ఇప్పుడు వివరంగా పరిశీలిద్దాం.

కుటుంబంలో అధికారాన్ని గౌరవించండి

12. భర్త యెహోవా అధికారాన్ని గౌరవిస్తున్నానని ఎలా చూపించవచ్చు?

12 యెహోవా కుటుంబాన్ని ఏర్పాటు చేసి, అందులో ప్రతీ ఒక్కరికి ఒక్కో బాధ్యత ఇచ్చాడు. కుటుంబంలో ప్రతీ ఒక్కరు తమ బాధ్యతను సరిగ్గా చేస్తే అన్నీ చక్కగా జరుగుతాయి, అందరూ ప్రయోజనం పొందుతారు. (1 కొరింథీయులు 14:33) యెహోవా భర్తను కుటుంబ శిరస్సుగా నియమించాడు. అతను భార్యాపిల్లల బాగోగులు చూసుకుంటూ, వాళ్లకు ప్రేమగా నిర్దేశం ఇవ్వాలని యెహోవా కోరుకుంటున్నాడు. కాబట్టి వాళ్లను చూసుకునే విషయంలో భర్త యెహోవాకు లెక్క అప్పజెప్పాలి. క్రైస్తవ భర్త దయగా, ప్రేమగా ఉంటాడు, సంఘాన్ని యేసు ఎలా చూసుకున్నాడో అలా తన కుటుంబాన్ని చూసుకుంటాడు. ఇవన్నీ చేయడం ద్వారా భర్త యెహోవాను గౌరవిస్తున్నానని చూపిస్తాడు.—ఎఫెసీయులు 5:23; “కుటుంబ శిరస్సు” చూడండి.

ఒక క్రైస్తవ తండ్రి క్రీస్తును అనుకరిస్తూ తన కుటుంబ బాగోగులు చూసుకుంటున్నాడు

 

13. అధికారాన్ని గౌరవిస్తున్నానని భార్య ఎలా చూపించవచ్చు?

13 క్రైస్తవ భార్యకు కూడా కుటుంబంలో ప్రాముఖ్యమైన, గౌరవప్రదమైన బాధ్యత ఉంది. మంచి కుటుంబ పెద్దగా ఉండడానికి కష్టపడి పనిచేస్తున్న భర్తకు ఆమె మద్దతిస్తుంది. భర్తతో కలిసి పిల్లలకు శిక్షణ ఇచ్చే బాధ్యత కూడా ఆమెకు ఉంది. ఆమె తన సొంత ఆదర్శం ద్వారా, ఇంకా వేరే విధాలుగా పిల్లలకు ఇతరుల్ని గౌరవించడం నేర్పిస్తుంది. (సామెతలు 1:8) భర్తను గౌరవిస్తూ, అతను తీసుకునే నిర్ణయాలకు సహకరిస్తుంది. ఏదైనా నిర్ణయం ఆమెకు నచ్చకపోతే దయగా, గౌరవంగా తన భావాల్ని తెలియజేస్తుంది. అయితే, భర్త సత్యంలో లేనప్పుడు ఒక క్రైస్తవ భార్యకు వేరే సవాళ్లు ఎదురవ్వవచ్చు. అయినా భర్త మీద ప్రేమ, గౌరవం చూపిస్తూ ఉంటే ఏదోక రోజు అతను కూడా యెహోవాను తెలుసుకుని, ఆయన్ని ఆరాధించాలని కోరుకోవచ్చు.—1 పేతురు 3:1 చదవండి.

14. అధికారాన్ని గౌరవిస్తున్నామని పిల్లలు ఎలా చూపించవచ్చు?

14 పిల్లలు యెహోవాకు చాలా విలువైనవాళ్లు. పెద్దవాళ్ల కన్నా పిల్లలకు సంరక్షణ, నిర్దేశం చాలా అవసరం. పిల్లలు అమ్మానాన్నలకు లోబడడం ద్వారా వాళ్లను సంతోషపెడతారు. అంతకన్నా ముఖ్యంగా యెహోవా పట్ల గౌరవం చూపిస్తారు, ఆయన్ని సంతోషపెడతారు. (సామెతలు 10:1) చాలామంది పిల్లలు తల్లి లేదా తండ్రి మాత్రమే ఉన్న కుటుంబాల్లో పెరుగుతున్నారు. ఆ పరిస్థితి అటు పిల్లలకు, ఇటు పెంచేవాళ్లకు ఇద్దరికీ కష్టంగానే ఉంటుంది. అయినా పిల్లలు తల్లికి లేదా తండ్రికి లోబడుతూ మద్దతిస్తే, ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఏదేమైనా కుటుంబాలన్నీ అపరిపూర్ణమైనవే. కానీ కుటుంబంలో అందరూ యెహోవా నిర్దేశాన్ని పాటిస్తే ప్రతీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. అప్పుడు, కుటుంబాలన్నిటినీ ఏర్పాటు చేసిన యెహోవాకు ఘనత వస్తుంది.—ఎఫెసీయులు 3:14, 15.

సంఘంలో అధికారాన్ని గౌరవించండి

15. సంఘంలో అధికారాన్ని గౌరవిస్తున్నామని మనమెలా చూపించవచ్చు?

15 యెహోవా క్రైస్తవ సంఘం ద్వారా మనకు నిర్దేశం ఇస్తాడు. ఆయన సంఘం మీద పూర్తి అధికారాన్ని యేసుకు ఇచ్చాడు. (కొలొస్సయులు 1:18) యేసు కూడా, భూమ్మీదున్న దేవుని ప్రజల్ని చూసుకునే బాధ్యతను ‘నమ్మకమైన, బుద్ధిగల దాసునికి’ ఇచ్చాడు. (మత్తయి 24:45-47) నేడున్న పరిపాలక సభే ఆ “దాసుడు.” మన విశ్వాసాన్ని బలంగా ఉంచుకోవడానికి కావల్సిన నిర్దేశాన్ని పరిపాలక సభ తగిన సమయంలో అందిస్తుంది. పెద్దలు, సంఘ పరిచారకులు, ప్రాంతీయ పర్యవేక్షకులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలకు మద్దతిస్తారు, పరిపాలక సభ నిర్దేశాన్ని పాటిస్తారు. మనల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఈ సహోదరులందరికీ ఉంది. ఈ బాధ్యత విషయంలో వాళ్లు యెహోవాకు లెక్క అప్పజెప్పాలి. కాబట్టి ఆ సహోదరుల్ని గౌరవిస్తే మనం యెహోవాను గౌరవించినట్టే.—1 థెస్సలొనీకయులు 5:12; హెబ్రీయులు 13:17 చదవండి;పరిపాలక సభ” చూడండి.

16. పెద్దలు, సంఘ పరిచారకులు పవిత్రశక్తి ద్వారా నియమించబడతారని ఎందుకు చెప్పవచ్చు?

16 సంఘం విశ్వాసంలో బలంగా ఉండేలా, ఐక్యంగా ఉండేలా పెద్దలు అలాగే సంఘ పరిచారకులు సహాయం చేస్తారు. అయితే వాళ్లు కూడా మనలాగే అపరిపూర్ణులు. కానీ వాళ్లు పవిత్రశక్తి ద్వారా నియమించబడతారు. అలాగని ఎందుకు చెప్పవచ్చు? ఆ సహోదరులు బైబిల్లోని అర్హతల్ని చేరుకోవాలి. (1 తిమోతి 3:1-7, 12; తీతు 1:5-9) బైబిలు రచయితలు పవిత్రశక్తి ప్రేరణతో ఈ అర్హతల్ని రాశారు. అంతేకాదు ఎవర్ని పెద్దలుగా లేదా సంఘ పరిచారకులుగా నియమించాలో చర్చించుకునేటప్పుడు పెద్దలు పవిత్రశక్తి సహాయం కోసం ప్రార్థిస్తారు. అవును, యేసు అలాగే యెహోవా నిర్దేశం కింద సంఘాలు పనిచేస్తాయి. (అపొస్తలుల కార్యాలు 20:28) మనకు మద్దతివ్వడానికి, మనల్ని చూసుకోవడానికి నియమించబడిన ఈ సహోదరులు దేవుడు ఇచ్చిన వరాలు.—ఎఫెసీయులు 4:8.

17. కొన్నిసార్లు ఒక సహోదరి ఏం చేయాల్సి రావచ్చు?

17 కొన్నిసార్లు సంఘంలో ఒకానొక నియామకాన్ని చేయడానికి పెద్దలు గానీ, సంఘ పరిచారకులు గానీ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు సాధారణంగా బాప్తిస్మం తీసుకున్న సహోదరులు సహాయం చేయవచ్చు. అయితే వాళ్లు కూడా లేకపోతే, వాళ్లు చేయాల్సిన పనిని ఒక సహోదరి చేయాల్సి రావచ్చు. అలాంటప్పుడు, ఆమె తల మీద ముసుగు వేసుకుంటుంది. (1 కొరింథీయులు 11:3-10) ఆ విధంగా ఆమె కుటుంబంలో, సంఘంలో యెహోవా చేసిన శిరస్సత్వ ఏర్పాటు పట్ల గౌరవం చూపిస్తుంది.—“తల మీద ముసుగు” చూడండి.

ప్రభుత్వ అధికారుల్ని గౌరవించండి

18, 19. (ఎ) రోమీయులు 13:1-7⁠లో ఏ నిర్దేశం ఉంది? (బి) ప్రభుత్వం పట్ల మనం ఎలా గౌరవం చూపిస్తాం?

18 యెహోవా ప్రభుత్వ అధికారులకు కొంత అధికారం ఇచ్చాడు, మనం వాళ్లను గౌరవించాలి. వాళ్లు దేశంలో, సమాజంలో శాంతిభద్రతలు కాపాడుతూ ప్రజలకు అవసరమైన సేవలు అందిస్తారు. రోమీయులు 13:1-7 వచనాల్లో ఉన్న నిర్దేశానికి క్రైస్తవులు లోబడతారు. (చదవండి.) మనం ‘పై అధికారాల్ని’ గౌరవిస్తాం, మనం నివసిస్తున్న దేశంలో లేదా సమాజంలో ఉన్న చట్టాలకు లోబడతాం. ఆ చట్టాలు బహుశా కుటుంబానికి, వ్యాపారానికి, ఆస్తిపాస్తులకు సంబంధించినవి కావచ్చు. ఉదాహరణకు, మనం పన్నులు కడతాం, ప్రభుత్వ అధికారులు అడిగే వాటికి సరైన వివరాలు ఇస్తాం. అయితే దేవుని నియమాలకు వ్యతిరేకమైనది ఏదైనా చేయమని ప్రభుత్వం చెప్తే, అప్పుడేంటి? అపొస్తలుడైన పేతురు ఇలా అన్నాడు: “మేము లోబడాల్సిన పరిపాలకుడు దేవుడే కానీ మనుషులు కాదు.”—అపొస్తలుల కార్యాలు 5:28, 29.

19 పోలీసుల్ని, జడ్జీల్ని, ఇతర ప్రభుత్వ అధికారుల్ని మనం ఎప్పుడూ గౌరవించాలి. యౌవన క్రైస్తవులు టీచర్లను, స్కూల్లో పనిచేస్తున్న ఇతరుల్ని గౌరవిస్తారు. పని స్థలంలో మన తోటి ఉద్యోగులు యజమానిని గౌరవించినా, గౌరవించకపోయినా మనం మాత్రం గౌరవిస్తాం. అలా అపొస్తలుడైన పౌలును అనుకరిస్తాం. కష్టమైన పరిస్థితుల్లో కూడా పౌలు అధికారుల్ని గౌరవించాడు. (అపొస్తలుల కార్యాలు 26:2, 25) ఇతరులు మనతో ఎలా ప్రవర్తించినా మనం వాళ్లను గౌరవిస్తూనే ఉంటాం.—రోమీయులు 12:17, 18 చదవండి; 1 పేతురు 3:15.

20, 21. మనం ఇతరుల్ని గౌరవించడం వల్ల ఎలాంటి మంచి ఫలితాలు రావచ్చు?

20 ఈ రోజుల్లో ఇతరుల్ని గౌరవించడం రానురాను తగ్గిపోతోంది. కానీ యెహోవా ప్రజలమైన మనం ప్రతీ ఒక్కర్ని గౌరవించాలని కోరుకుంటాం. అపొస్తలుడైన పేతురు ఇచ్చిన ఈ నిర్దేశాన్ని మనం పాటిస్తాం: “అన్నిరకాల ప్రజల్ని ఘనపర్చండి.” (1 పేతురు 2:17) మనం గౌరవం చూపించినప్పుడు ఎదుటివాళ్లు దాన్ని గమనిస్తారు. యేసు ఇలా చెప్పాడు: “మీ వెలుగును మనుషుల ముందు ప్రకాశించనివ్వండి, అప్పుడు వాళ్లు మీ మంచిపనులు చూసి . . . మీ తండ్రిని మహిమపరుస్తారు.”—మత్తయి 5:16.

21 కుటుంబంలో, సంఘంలో, జీవితంలోని ఇతర రంగాల్లో అధికారాన్ని గౌరవించినప్పుడు మన మంచి ఆదర్శం చూసి ఇతరులు యెహోవా గురించి తెలుసుకోవాలని కోరుకోవచ్చు. ఇతరుల్ని గౌరవించడం ద్వారా మనం యెహోవా పట్ల గౌరవం చూపిస్తాం, ఆయన్ని సంతోషపెడతాం, ఆయనపై ప్రేమ చూపిస్తాం.